సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రుణమాఫీకి ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. రోజుకో కొత్త నిర్ణయాన్ని ప్రకటించి లబ్ధిదారుల జాబితాను వడబోయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో లక్షన్నర మంది రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఈ జాబితాలను వడపోసేందుకు జన్మభూమి కమిటీల ముందుకు తీసుకువెళ్లాలన్న నిర్ణయం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పొందే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతోపాటు వారికి సకాలంలో అందకుండా చేయడం కోసం రోజుకో ప్రక్రియతో ప్రభుత్వం ముందుకు వస్తోంది.
కొత్తగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రెండూ ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తరువాత ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని పేర్కొంది. దీంతో ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇందులో ఎక్కువగా రేషన్ కార్డు ఉండి, ఆధార్ లేనివారు. ఆధార్ ఉండీ రేషన్ కార్డు లేనివారు ఉన్నారు. పేరులో, ఆధార్ కార్డులో ఒక్క అక్షరం తప్పుంటేచాలు తిరస్కరించిన వాటిలోకి చేర్చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో లక్షన్నర వరకూ ఖాతాలు రుణమాఫీకి అర్హత లేదని తేల్చారు.
జిల్లాలో ఆధార్ కార్డును జతచేయకపోవడంతో 15631 ఖాతాలను తొలగించారు. ఇవి మినహాయిస్తే రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 7,00,295కి చేరింది.
ఆ తర్వాత ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డు లింకుతో ఈ సంఖ్య ఐదున్నర లక్షలకు పడిపోయింది..
రేషన్ కార్డు రైతుల వద్ద ఉన్నా పౌరసరఫరాలశాఖ తమ రికార్డుల నుంచి తొలగించడంతో చాలా మందికి రుణమాఫీ జాబితాలో పేరు లేకుండా పోయింది. రుణమాఫీ కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని చెప్పడంతో తాజాగా ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా సేకరిస్తోంది.
బ్యాంకర్లు తమ వద్ద అప్పు తీసుకున్న రైతుల సమాచారం ఇవ్వగా, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నెంబర్లు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో ప్రభుత్వం ఎలాంటి మెలిక పెడుతుందోనన్న భయం రైతుల్లో వ్యక్తమవువుతోంది.
తిరస్కరణకు గురైన జాబితాలు కూడా బ్యాంకులకు అందలేదు. ముందు రెవెన్యూ విభాగం పరిశీలిస్తుంది.
తాజాగా జాబితాలను వీఆర్‌ఓలకు ఇచ్చి పరిశీలింపజేయిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీలోగా లబ్ధిదారుల వడపోత కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది.
రుణమాఫీకి ప్రభుత్వం కొర్రీలు
Published Wed, Nov 12 2014 2:19 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement