ఎన్నికలయ్యేదాకా.. అందరికీ అన్నీ
టీడీపీ ఎన్నికల స్టంట్
అడిగిన వారందరికీ రేషన్ కార్డు, గ్యాస్ ఇస్తామనే ప్రయత్నం
సీఎం, మంత్రి దిశానిర్దేశంతో అధికారులు, టీడీపీ పక్కా ప్లాన్
ఒకటో తారీఖు నుంచి హామీలతో ప్రజల్లోకి..
నగరపాలికకు త్వరలో మోగనున్న ఎన్నికల నగారా.. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ ఎత్తులు. అయినా జనం నమ్మరేమోనన్న అనుమానం. ఏది ఏమైనా కోడ్ కూసే దాకా పదో పాతికో పింఛన్లు, రేషన్‌కార్డులు.. దీపం కనెక్షన్లు ఇచ్చి తమ ఇంటి దీపం వెలిగించుకోవాలన్న ఆరాటం. అందుకే నేటి నుంచి జనచైతన్యం పేరుతో జనంలోకి. మరి ప్రజలు వారిని ఆదరిస్తారో.. తిరస్కరిస్తారో వేచి చూడాల్సిందే.
తిరుపతి తుడా: జిల్లాలో ఎక్కడా లేని వింత ప్రచారం తిరుపతిలో కనిపిస్తోంది. నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో అందరికీ అన్నీ ఇస్తామనే ప్రచారానికి టీడీపీ నేతలు మరోసారి స్కెచ్ వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు 160 హామీలు ఇచ్చిన టీడీపీ ఇందులో ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. తిరుపతిలో ఎన్నికలు వస్తాయనే సంకేతాలు ఉండటంతో ముందస్తు ఆలోచనలతో హామీల మాయ కుట్రకు తెర లేపారు. ప్రజలను నమ్మే పరిస్థితి లేనందున కొన్నైనా ఇచ్చి ప్రజల్లో చెప్పినవి ఇస్తారనే నమ్మకాన్ని కలిగించేలా పన్నాగం పన్నుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 25 శాతం మందికి పెన్షన్లు, 40 శాతం మందికి రేషన్ కార్డులను తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అన్నీ ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికీ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి, నాలుగైదు సార్లు మంత్రి నారాయణ తిరుపతికి సంబంధించిన అధికారులు, పార్టీ నాయకులతో మంతనాలు జరిపి అందరికీ అన్నీ ఇస్తామనే హామీని నమ్మించే ప్రయత్నం చేయాలనే దిశా నిర్ధేశాన్ని చేశారు. అప్పటి నుంచి ఓ పక్క అధికారులు మరో పక్క తమ్ముళ్లు అవ్విస్తాం... ఇవ్విస్తాం అంటూ హామీలతో పాటు పనిలో పనిగా బేరసారాలకు దిగుతున్నారు.
నవంబర్ ఒకటో తేదీ నుంచి జనచైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. గతంలో ఇచ్చిన హామీలు, జన్మభూమి సభల్లో వచ్చిన దరఖాస్తుల విషయం తేలకుండానే పేరు మార్పు చేసి జనచైతన్యయాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఎన్నికల వరకేనని, ఇచ్చిన వాటిపై ఎన్నికల తరువాత వాత తప్పదని కొంత మంది అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.
తప్పని పరిస్థితి
కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టం లేకపోయినా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో వెళ్లక తప్పని పరిస్థితి. ఈనేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్నందున వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు అస్త్ర శస్త్రాలతో అధికార పార్టీ సిద్ధమయ్యేలా కినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వృద్ధులు, వితంతవులు, వికలాంగుల పెన్షన్లపై కొరడా జులిపించారు. కార్పొరేషన్ పరిధిలోనే 7,200 వేల పెన్షన్‌లు, 28వేల రేషన్ కార్డులను అడ్డంగా తొలగించారు.
అరుుతే ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్నందున పెన్షన్, రేషన్ కార్డుల హామీకి సిద్ధమవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అన్నీ ఇస్తామనే నమ్మకాన్ని కలిగించనున్నారు. ఎన్నికల తరువాత వాటి కథ తేల్చవచ్చు ఇప్పటికి అడిగినవన్నీ ఇచ్చేయండనే ఆదేశాలు అందుకున్నారు. ఈ మేరకు అధికారులకూ అలాంటి ఆదేశాలు అందాయి. ఎన్నికల కోడ్ వరకు ఇస్తామని చెప్పి కొన్నింటిని పంపిణీ చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని తప్పించుకునే ప్రయత్నానికి దిగుతున్నారు.