కాకినాడ సిటీ / మండపేట :ప్రజా సంక్షేమమే లక్ష్యమంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తోంది. పింఛన్ల పెంపు భారాన్ని తగ్గించుకునేందుకు కుటిల ప్యూహాన్ని అమలు చేసి, వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ముందు దక్కిన కాస్త లబ్ధిని కూడా దూరం చేసింది. రైతులందరి రుణాలు రద్దు చేస్తామని ఊరించి, ఇపుడు అర్హుల జాబితాలో భారీ కోత విధించింది. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి పెట్టి తెల్ల రేషన్‌కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 15 లోగా ృధార్ సీడింగ్ కాని కార్డులు తొలగించాలని ఆదేశించింది.
జిల్లాలోని 64 మండలాల్లో 15,09,298 రేషన్ కార్డులుండగా వీటి ద్వారా లబ్ధి పొందే సభ్యులు (యూనిట్లు) 48,94,461 మంది. ఇప్పటికే వివిధ కారణాలతో మొత్తం యూనిట్లలో 6,03,981 మందిని కార్డుల నుంచి తొలగించి రేషన్ నిలిపి వేశారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానంలో భాగంగా మిగిలిన యూనిట్లలో 37,95,103 మంది ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐడీ)తో సీడింగ్ పూర్తి చేశారు. యూఐడీ నంబరు లేని 4,89,837 మందికి ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటీఫికేషన్ నంబర్ (ఈఐడీ)తో సీడింగ్ చేసి యథావిధిగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అసలు సీడింగ్ కాని(యూఐడీ, ఈఐడీ) లేని వారు 5,540 మంది ఉన్నారు.
సీడింగ్ కాకుంటే వచ్చే నెల నుంచి రేషన్ కట్
జనవరి నుంచి పేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకుల్లో భారీగా కోత విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఈఐడీ నంబరుతో రేషన్ అందుకుంటున్న వారు యూఐడీ నంబర్లతో సీడింగ్ చేయించుకోవాలంటూ తాజాగా ఆదేశించింది. అందుకు ఈనెల 15 వరకు మాత్రమే గడువిచ్చింది. లేకుంటే జనవరి నుంచి వీరికి రేషన్ కోత పడనుంది. ఈఐడీ నంబర్లు ఉన్న వారిలో మూడొంతుల మంది యూఐడీ నంబరు వచ్చినా అనేక కారణాలతో రేషన్‌కార్డుతో అనుసంధానం చేయించుకోలేకపోయారు. సాంకేతిక కారణాల దృష్ట్యా యూఐడీ నంబరు రాని వారు కూడా ఎందరో ఉన్నారు. పది రోజుల వ్యవధిలో వీరందరూ యూఐడీ నంబరుతో ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సి ఉంది. స్వల్ప వ్యవధిలో ఇదెలా సాృద్యమని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఈ ప్రక్రియ పూర్తి కాకుంటే రేషన్ కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా యూఐడీ నంబర్ సేకరణ బాధ్యతను డీలర్లకు అప్పగించారు. ఇది తమకు తలకు మించిన భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల కంచంపై ప్రభుత్వ కుతంత్రం
Published Fri, Dec 5 2014 12:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement