కాకినాడ: కో ఆప్షన్ ఎన్నిక టీడీపీలో చిచ్చు రేపుతోంది. ఐదు పదవుల కోసం పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కమ్మ సామాజికవర్గానికి, ముస్లిం మైనార్టీ వర్గానికి కో–ఆప్షన్ ఇచ్చే సభ్యత్వం అంశంపైనే వివాదం నడుస్తోంది. కమ్మ వర్గానికి కో–ఆప్షన్ ఇవ్వాలని ఇప్పటికే హైకమాండ్ నిర్ణ యం తీసుకోగా, ఇందుకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ససేమిరా అన్నారు. మరోపక్క మైనార్టీ కోటాలో ఓ ముస్లిం మహిళకు పదవి ఇవ్వాలన్న నిర్ణయంపై టీడీపీలోని ముస్లింలు ఎదురు తిరిగారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు మొత్తం ఐదు పదవులను తనకు నచ్చినవారికే ఇచ్చేందుకు వనమాడి చేస్తున్న ప్రయత్నాలపై రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఈ వ్యవహారం టీడీపీ పెద్దలకు శిరోభారంగా మారింది.
కమ్మవర్గానికి మొండిచెయ్యి?
కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడంపై అప్పట్లో ఆ వర్గానికి చెందిన నేతలు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. దీంతో మంత్రులు, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు జోక్యం చేసుకుని కో–ఆప్షన్ పదవి ఇస్తామంటూ అప్పట్లో కమ్మ వర్గాన్ని సముదాయించారు. ఆ మేరకు మాజీ కార్పొరేటర్ ముళ్ళపూడి రాంబాబు కో–ఆప్షన్ పదవి కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆయన ఎంపికపై సానుకూలంగా లేని కొండబాబు.. ప్రత్యామ్నాయంగా అదే సామాజికవర్గానికి చెందిన పుచ్చకాయల మహాలక్ష్మిని తెరపైకి తెచ్చారు. చివరి క్షణంలో ఆమె దరఖాస్తు సాంకేతికంగా చెల్లదని తేలింది. దీంతో ఇప్పుడు ముళ్ళపూడి రాంబాబుకు పదవి ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. అయితే తన మాటే నెగ్గాలన్న పట్టుదలతో కొండబాబు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేశారని పార్టీ నేతల సమాచారం. మాజీ కార్పొరేటర్లు యాళ్ళ రామకృష్ణ, శీకోటి అప్పలకొండ, మాజీ కౌన్సిలర్ గుండవరపు శాంతకుమారికి కో–ఆప్షన్ ఇచ్చేందుకు దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. మాజీ కౌన్సిలర్లు గుత్తుల రమణ, చింతపల్లి చంద్రశేఖర్, జీవీఎస్ శర్మ, కింతాడ వెంకట్రావు, కడారి భవాని, రాయుడు కనకదుర్గారత్నం కూడా పదవిని ఆశిస్తున్నా వారికి అవకాశాలు అంతంతమాత్రమేనని అంటున్నారు. ఇటీవలి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కో–ఆప్షన్ అవకాశం లేదంటూ పార్టీ నేతలు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.
మైనార్టీ వర్గాల్లో జగడం
మైనార్టీ కోటాలో ఇద్దరికి కో–ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ఓ ముస్లిం మైనార్టీ మహిళకు పదవి ఇచ్చేందుకు కొండబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఆమె భర్తకు జిల్లా పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్ష పదవితోపాటు ఓ నామినేటెడ్ పదవి కూడా ఉన్నందున ఆమెకు ఎలా ఇస్తారంటూ మైనార్టీ నేతలు కొండబాబుతో బాహాటంగానే వాగ్వాదానికి దిగారని అంటున్నారు. పురుషుల కోటాలో పార్టీలో పని చేసిన ముస్లిం మైనార్టీకి అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టు పడుతున్నారు.
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల భేటీ
కో–ఆప్షన్ ఎన్నికతోపాటు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి మేయర్ సుంకర పావని చాంబర్‌లో ఆదివారం సమావేశమయ్యారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో కో–ఆప్షన్ అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. సమావేశం వివరాలను మాత్రం నేతలు వెల్లడించలేదు.
రెబల్ వైపే మొగ్గు
ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్రంగా బరిలో దిగిన మాజీ కార్పొరేటర్ శీకోటి అప్పలకొండ వైపు ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నారన్న సమాచారం పార్టీ నేతలకు మింగుడు పడడంలేదు. రెబల్‌కు అవకాశం కల్పించి హైకమాండ్ సిఫారసు చేసిన ముళ్ళపూడి రాంబాబు పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు సీనియర్ నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా కో–ఆప్షన్ అభ్యర్థిత్వాలను సోమవారం ఉదయం హైకమాండ్ ద్వారా ప్రకటించే అవకాశం ఉందని, చివరి క్షణంలో కొండబాబు నిర్ణయాన్ని కాదని ముళ్ళపూడి రాంబాబు పేరు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. మొత్తంమీద కో–ఆప్షన్ వ్యవహారం టీడీపీలో కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment