టీడీపీ సమర్పించు కేబుల్‌ వార్‌ | tdp leader internal fight in palnadu district | Sakshi
Sakshi News home page

టీడీపీ సమర్పించు కేబుల్‌ వార్‌

Aug 1 2024 2:24 AM | Updated on Aug 1 2024 1:01 PM

టీడీపీ సమర్పించు కేబుల్‌ వార్‌

టీడీపీ సమర్పించు కేబుల్‌ వార్‌

నరసరావుపేటలో ముదిరిన ఆధిపత్య పోరు

రోజుకో మలుపుతో పేటలో రేగుతున్న కాక

రెండు వర్గాలుగా పోటీ పడుతున్న టీడీపీ నేతలు

కోడెల వర్సెస్‌ నల్లపాటిగా సాగుతున్న సమరం

నాడు తండ్రి అండతో కోడెల శివరాం హల్‌చల్‌

నేడు ఎమ్మెల్యే భరోసాతో నల్లపాటి రాము పట్టు

కేబుల్‌ వైర్లను సైతం కత్తిరించిన కోడెల వర్గం

అడ్డుకున్నందుకు నల్లపాటి వర్గంపైనే ఫిర్యాదు

కేసులు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ సమర్పించు ‘కేబుల్‌ వార్‌’ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. సంపాదనే పరమావధిగా, పార్టీ అండ చూసుకొని నియోజకవర్గంలో కేబుల్‌ ప్రసారాలపై ఆధిపత్యం కోసం నల్లపాటి, కోడెల వర్గీయులు పోరుకు కాలు దువ్వుతున్న తీరు ఆ పార్టీలో కాక రేపుతోంది. తండ్రి దివంగత స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2016లో కోడెల శివరాం కేబుల్‌ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కేబుల్‌ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అండతో కేబుల్‌ ప్రసారాలు ప్రారంభించిన నల్లపాటి రాము కూడా విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్‌సీవీ కేబుల్‌ వైర్లను కత్తిరించి అగ్గి రాజేశారు. ఈ వ్యవహారంతో నల్లపాటి వర్సెస్‌ కోడెల వర్గీయులు మరోమారు ఘర్షణకు దిగడంతో ఇరువర్గాలపై కేసుల నమోదు వరకు వ్యవహారం వెళ్లింది.

ఎన్‌సీవీపై దాడి చేసి కబ్జా...
ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నల్లపాటి రామచంద్రప్రసాద్‌(రాము) నరసరావుపేట నియోజకవర్గంలో నల్లపాటి కేబుల్‌ విజన్‌(ఎన్‌సీవీ) పేరిట ప్రసారాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం వస్తుండటంతో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివరాం కేబుల్‌ వ్యవస్థను తన గుప్పెట్లో తీసుకునేందుకు కుట్ర పన్నారు. తన అనుచరులతో అప్పుడు వైఎస్సార్‌ సీపీలో ఉన్న నల్లపాటి రాముపై దాడి చేయడంతోపాటు ఎన్‌సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేబుల్‌ వ్యవస్థను హస్తగతం చేసుకొన్న శివరాం రాజాగారి కోటలోని తన ఇంటి నుంచి కే–ఛానల్‌ పేరిట కేబుల్‌ కార్యకలాపాలు నిర్వహించారు. జీసీటీవీ కార్యాలయాన్నీ ధ్వంసం చేసి ఆ వ్యవస్థను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించినా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు, పరిహారం లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దారు

అగ్రవర్ణ వ్యక్తి ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు...
కే–ఛానల్‌లో భాగస్వామి అయిన విజయవాడకు చెందిన గన్నపనేని నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుతో నల్లపాటి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని నల్లపాటి రామచంద్రప్రసాద్‌ దీనిపై గుంటూరు రేంజ్‌ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు నా కేబుల్‌ వ్యవస్థను నాశనం చేస్తూనే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన తనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారట. ఈ కేసు నమోదు వ్యవహారంలో కోడెల శివరాం తెరవెనుక ఉండి చక్రం తిప్పారనే చర్చ పేటలో నడుస్తోంది.

మరోసారి పట్టు కోసం పోరు.. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే...
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు కేబుల్‌ వ్యవహారంలో పోరుకు దిగడం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు సంకటంగా మారింది. ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో చేతులెత్తేశారు. అయితే ఎన్నికల ముందు కేబుల్‌ వ్యవస్థను అప్పగిస్తానని నల్లపాటి రాముకు ఆయన హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం ఎన్‌సీవీ కేబుల్‌ ప్రసారాలను ప్రారంభించారు. కోడెల శివరాం మాత్రం కేబుల్‌ వ్యవస్థ తనకే కావాలంటూ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ఎవరికి సర్దిచెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 2016లో కేబుల్‌ అధిపత్యంలో జరిగిన పోరులో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యక్తిగత దాడులు జరిగాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉండి మరోసారి పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లపాటి రాము నియోజకవర్గంలో కేబుల్‌ ప్రసారాలను రెండు నెలలుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు మద్దతు తెలపడంతో ప్రస్తుతం రాముకు చెందిన ఎన్‌సీవీ కేబుల్‌ ప్రసారాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని కోడెల శివరాం భాగస్వామి నరసింహారావు తన సిబ్బందితో ఎన్‌సీవీకి చెందిన కేబుల్‌ వైర్లను కత్తిరించి ప్రసారాలకు అంతరాయం కలిగించారట. గత శుక్రవారం అరండల్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్‌సీవీకి చెందిన కేబుల్‌ వైర్లను కోడెల వర్గానికి చెందిన కొందరు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌సీవీ సిబ్బంది అక్కడికి చేరుకొని వైర్ల కత్తిరించిన ముగ్గురు యువకులను పట్టుకుని కార్యాలయానికి తరలించారు. యువకులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని విడిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement