Cable channels
-
టీడీపీ సమర్పించు కేబుల్ వార్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ సమర్పించు ‘కేబుల్ వార్’ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. సంపాదనే పరమావధిగా, పార్టీ అండ చూసుకొని నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలపై ఆధిపత్యం కోసం నల్లపాటి, కోడెల వర్గీయులు పోరుకు కాలు దువ్వుతున్న తీరు ఆ పార్టీలో కాక రేపుతోంది. తండ్రి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2016లో కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కేబుల్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అండతో కేబుల్ ప్రసారాలు ప్రారంభించిన నల్లపాటి రాము కూడా విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్సీవీ కేబుల్ వైర్లను కత్తిరించి అగ్గి రాజేశారు. ఈ వ్యవహారంతో నల్లపాటి వర్సెస్ కోడెల వర్గీయులు మరోమారు ఘర్షణకు దిగడంతో ఇరువర్గాలపై కేసుల నమోదు వరకు వ్యవహారం వెళ్లింది.ఎన్‌సీవీపై దాడి చేసి కబ్జా...ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నల్లపాటి రామచంద్రప్రసాద్(రాము) నరసరావుపేట నియోజకవర్గంలో నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) పేరిట ప్రసారాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం వస్తుండటంతో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లో తీసుకునేందుకు కుట్ర పన్నారు. తన అనుచరులతో అప్పుడు వైఎస్సార్ సీపీలో ఉన్న నల్లపాటి రాముపై దాడి చేయడంతోపాటు ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకొన్న శివరాం రాజాగారి కోటలోని తన ఇంటి నుంచి కే–ఛానల్ పేరిట కేబుల్ కార్యకలాపాలు నిర్వహించారు. జీసీటీవీ కార్యాలయాన్నీ ధ్వంసం చేసి ఆ వ్యవస్థను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించినా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు, పరిహారం లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దారుఅగ్రవర్ణ వ్యక్తి ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు...కే–ఛానల్లో భాగస్వామి అయిన విజయవాడకు చెందిన గన్నపనేని నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుతో నల్లపాటి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని నల్లపాటి రామచంద్రప్రసాద్ దీనిపై గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు నా కేబుల్ వ్యవస్థను నాశనం చేస్తూనే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన తనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారట. ఈ కేసు నమోదు వ్యవహారంలో కోడెల శివరాం తెరవెనుక ఉండి చక్రం తిప్పారనే చర్చ పేటలో నడుస్తోంది.మరోసారి పట్టు కోసం పోరు.. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే...తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు కేబుల్ వ్యవహారంలో పోరుకు దిగడం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు సంకటంగా మారింది. ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో చేతులెత్తేశారు. అయితే ఎన్నికల ముందు కేబుల్ వ్యవస్థను అప్పగిస్తానని నల్లపాటి రాముకు ఆయన హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం ఎన్సీవీ కేబుల్ ప్రసారాలను ప్రారంభించారు. కోడెల శివరాం మాత్రం కేబుల్ వ్యవస్థ తనకే కావాలంటూ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ఎవరికి సర్దిచెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 2016లో కేబుల్ అధిపత్యంలో జరిగిన పోరులో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యక్తిగత దాడులు జరిగాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉండి మరోసారి పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లపాటి రాము నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలను రెండు నెలలుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు మద్దతు తెలపడంతో ప్రస్తుతం రాముకు చెందిన ఎన్సీవీ కేబుల్ ప్రసారాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని కోడెల శివరాం భాగస్వామి నరసింహారావు తన సిబ్బందితో ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు అంతరాయం కలిగించారట. గత శుక్రవారం అరండల్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కోడెల వర్గానికి చెందిన కొందరు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీవీ సిబ్బంది అక్కడికి చేరుకొని వైర్ల కత్తిరించిన ముగ్గురు యువకులను పట్టుకుని కార్యాలయానికి తరలించారు. యువకులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని విడిపించారు. -
వైఎస్ జగన్ పర్యటన.. కేబుల్ ప్రసారాలు నిలిపివేత
సాక్షి, కృష్ణా : ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు దొడ్డిదారిని ఎంచుకుంటుంది టీడీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధారణను ఓర్వలేక కేబుల్ ప్రసారాలను నిలిపివేస్తుంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లా తిరువురులో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. నెట్వర్క్ సమస్య ఉందని చెబుతూ సుమారు గంటకు పైగా చానళ్లను ఆపేశారు. కేవలం జగన్ పర్యటన నేపథ్యంలోనే ఈ విధంగా ప్రసారాలు నిలిపివేశారని పలువులు ఆరోపిస్తున్నారు. -
‘కేబుల్ చానళ్ల ఎంపిక’పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ చానళ్ల ఎంపికకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త నిబంధనల అమలుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో, వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న స్థానిక కేబుల్ ఆపరేటర్ల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ట్రాయ్ ఏకపక్షంగా కొత్త నిబంధనలను రూపొందించిందని, అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ స్థానిక కేబుల్ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గురువారం విచారణ జరిపారు. కొత్త నిబంధనల వల్ల నష్టపోయేది తామేనని పిటిషనర్లు వివరిం చారు. ట్రాయ్ కొత్త నిబంధనలను రూపొందించేటప్పుడు తమను సంప్రదించలేదన్నారు. ఈ వాదనలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తోసిపుచ్చారు. వీక్షకుల ప్రయోజనాల మేరకే ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చిందన్నారు. వీక్షకులు తమకు నచ్చిన చానళ్లనే ఎంపిక చేసుకుంటారని, దీని వల్ల వారు తక్కువ మొత్తాన్ని చెల్లిస్తారని తెలిపారు. -
బుల్లితెర వినోదం ఇక భారమే
కమ్మర్పల్లి(బాల్కొండ) : బుల్లితెర వినోదం ఇకపై పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కానుంది. కేబుల్ ప్రసారాల ద్వారా ఇప్పటి వరకు ఛానళ్లు అన్ని ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకు వచ్చేవి. కాని టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విధించిన కొత్త నిబంధనలతో కేబుల్ టీవీ వినియోగదారులకు బిల్లు వాచిపోనుంది. ఛానళ్ల ధరలు పెరిగి బుల్లితెర వినోదానికి సామాన్యులు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. వినియోగదారుడికి భారం.. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంతో టీవీ వినియోగదారుడికి అధిక భారం పడే అవకాశం ఉంది. వినియోగదారుడు తమకిష్టమైన ఛానళ్లను ఎంపిక చేసుకొని వీక్షించవచ్చని చెబుతున్నప్పటికీ, అదీ ఛానళ్ల ప్యాకేజీలతో ఇపుడున్న నెలసరి బిల్లుకు దాదాపు రెండు మూడింతలు పెరగనుంది. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు ప్రీ పెయిడ్ కనెక్షన్ పద్ధతిలో ముందే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ఆపరేటర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.150 నుంచి రూ.250కు దాదాపు 300 ఛానళ్లు(ఉచిత, పే ఛానళ్లు) చూపిస్తున్నారు. ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం ఇకపై ఉచితంగా ప్రసారం అవుతున్న(సుమారు 100) ఛానళ్లకు మత్రమే కేబుల్ టీవీ సంస్థలకు రూ.130+18 శాతం జీఎస్టీ కలిపి రూ.153.40 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఛానళ్ల ప్రసారానికి ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం చార్జీలు చెల్లించి రీచార్జి చేసుకుంటేనే వీక్షించే అవకాశం ఉంటుంది. తమకు నచ్చిన ఇష్టమైన ఛానళ్లను ఎంపిక చేసుకొని చూడవచవ్చని ట్రాయ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నా, ఛానళ్ల ప్యాకేజీలతో వినియోగదారులకు భారం అధికమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రధానంగా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు జీ టీవీ, మా టీవీ, జెమినీ టీవీ, ఈ టీవీ తదితర తెలుగు ఛానళ్లు వీక్షించాలంటే రూ.5 నుంచి రూ.19 వరకు చార్జీలు ఉన్నాయి. అయితే ఈ ఛానళ్లు తమ లింక్డ్ ఛానళ్లతో కలిపి ప్యాకేజ్‌గా అందిస్తున్నాయి. వీటికి రూ.104+18 శాతం జీఎస్టీ కలిపి రూ.122.72 చెల్లించాలి. బేసిక్ ఛానళ్ల బిల్లు రూ.153.40, పే ఛానళ్ల ధర రూ.122.72 కలిపి రూ.276.12 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ద్వారా సుమారు 300 చానళ్లు ప్రసారం అవుతుండగా, రూ.150 నుంచి రూ.250 వరకు కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు. బేసిక్ ఛానళ్లలో 26 దూరదర్శన్ ఛానళ్లు, అన్ని భాషల న్యూస్ ఛానళ్లు ఉన్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనలతో 100 ఉచిత ఛానళ్లతోపాటు తెలుగు ఛానళ్లు, ఇంగ్లీష్, హిందీ, స్పోర్ట్స్ ఛానళ్లు వీక్షించాలంటే వినియోగదారుడికి ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే మూడింతల భారం పడనుంది. ఈ నేపథ్యంలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు బుల్లితెర వినోదానికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఛానళ్ల ప్యాకేజీల ధరలు.. స్టార్ మా ఛానల్ ప్యాకేజ్: మా మూవీస్, మా గోల్డ్, మా మ్యూజిక్, స్టార్‌స్పోర్ట్స్, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఉంది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.39గా నిర్ణయించారు. జెమిని ఛానెల్ ప్యాకేజ్: జెమిని మూవీస్, జెమిని కామెడీ, జెమిని మ్యూజిక్, ఖుషీ, జెమిని లైఫ్, జెమిని న్యూస్ ఉన్నాయి. వీటికి నెలసరి బిల్లు రూ.30గా ఉంది. జీ టీవీ ప్యాకేజ్: జీ తెలుగు, జీ సినిమాలు ఉండగా, వీటికి రూ. 20గా ఉంది. ఈ టీవీ ప్యాకేజ్: ఈ టీవీ సినిమా, ఈ టీవీ ప్లస్, అభిరుచి, ఈ టీవీ తెలంగాణ, ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వీటి ధర రూ. 24 ఉంది. ఇతర భాష ఛానళ్లు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మళయాలం, కన్నడ, మరాఠి తదితర భాషల ఛానళ్ల ధరలు రూ. 5 నుంచి 19 వరకు ఉన్నాయి. చానళ్ల ఎంపికకు పెరిగిన గడువు జనవరి 31 టీవీ ప్రేక్షకులు తాము కోరుకున్న, ఇష్టమైన చానళ్ల ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ట్రాయ్ డిసెంబర్ 29 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. కానీ ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లు ఈనెల 27న హైదరాబాద్‌లో ధర్నా కార్యక్రమం చేపట్టడంతో ట్రాయ్ దిగివచ్చి సబ్స్క్రయిబర్స్కు అవగాహన కల్పించడానికి మరో నెల రోజుల పాటు గడువు పొడిగించింది. జనవరి 31 వరకు గడువు పొడిగించగా, ఎంఎస్వోకుగాని, కేబుల్ ఆపరేటర్‌కు సర్వీస్ ప్రొవైడర్లు సిగ్నల్ నిలిపివేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. -
డిజిటల్ నానో కోప్ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేబుల్ ఆపరేటర్లను ఆర్థిక స్వతంత్రులను చేయడంతోపాటు స్వయం ఉపాధి కల్పించుకునేందుకు తోడ్పాటు అందించే లక్ష్యంతో హిందూజా మీడియా గ్రూపు ఆధ్వర్యంలో ఎన్ఎక్స్టీ డిజిటల్ నానో కోప్ను ఖమ్మంలో ప్రారంభించింది. కేబుల్ ఆపరేటర్లను స్వతంత్ర వ్యాపారిగా తీర్చిదిద్ది.. ఎవరిపై ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యంతోపాటు ఈ డిజిటల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అందించాలనేదే తమ ప్రధాన ధ్యేయమని హిందూజా మీడియా గ్రూపు ఎండీ, సీఈవో అశోక్ మన్సుఖానీ చెప్పారు. తెలంగాణ రీజినల్ హెడ్ శ్రీకుమార్‌తో కలసి ఆయన మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్లో నానోకోప్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు. దేశంలో అతిపెద్ద డిజిటల్ టీవీ కం పెనీ వేదికగా ఉన్న ఎన్ఎక్స్టీ డిజిటల్ రంగంలో ఆపరేటర్లకు మరింత చేరువ కావడం ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రతి ఆపరేటర్ రూ.15 లక్షల ఖర్చు తో 500కు పైగా చానల్స్ వచ్చే లా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆపరేటర్లు రూ. 4.40 లక్షలతో దాదాపు 250 చానల్స్‌ను వీక్షకులకు అందించవచ్చని, నగర ప్రాంత ఆపరేటర్లు హెచ్డీ నాణ్యతగల చానల్స్‌ను అందించగలుగుతారన్నారు. కేబుల్ రంగంలో హిందూజా గ్రూపుకు ఉన్న అనుభవంతో కేబుల్ ఆ పరేటర్లను అనుసంధానం చేసి.. వారి కి వ్యాపార ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లు తమతో అనుసంధానమైతే ఎక్కడి నుంచైనా ప్రసారాలను ఆపరేట్ చేసుకోవచ్చని శ్రీకుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలకు తగినట్టు ప్యాకేజీల రూపకల్పన జరుగుతుందని, ‘మీ నె ట్‌వర్క్.. మీ వ్యాపారం.. మీ లాభాలు’నినాదంతో తమ వ్యాపార ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. -
పాతబస్తీ చానళ్లు.. పక్కా.. లోకల్
ఓల్డ్ సిటీ అనగానే ఇరుకు గల్లీలే గుర్తొస్తాయి. గల్లీలు ఇరుకైనా అక్కడి మనుషుల మనసులు విశాలం. రద్దీని చూసి రంది పడకుండా.. కొంచెం ఇష్టంగా ముందుకు నడిచి చూడండి. ఎక్కడి నుంచో సైగల్ గొంతు చెవుల్లో తేనెలు కురిపిస్తుంది. ఓ ఇంట్లోంచి ‘రిమ్జిమ్ గిరె సావన్’ అంటూ కిషోర్దా స్వరం తొలకరిలా కురుస్తుంది. గల్లీ నుంచి కొంచెం పక్కకు తిరిగితే.. ‘నువు పెద్దపులి నెక్కినావమ్మో.. గండిపేట గండి మైసమ్మ’ అంటూ.. ఓ భక్తిగీతం పరవశులను చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే.. ‘ఆదాబ్..!’ అంటూ హైదరాబాదీ ఉర్దూలో ఓ గొంతు ఆత్మీయంగా పలకరిస్తుంది. ఇది పాతబస్తీలో అడుగు పెడితే సొంతమయ్యే అనుభూతి. ఈ భిన్నత్వమే అక్కడ దాదాపు 100కు పైగా కేబుల్ చానల్స్ విజయవంతంగా నడిచేందుకు దోహదపడుతోంది! దక్షిణ మూసీ ప్రాంతమైన పాతబస్తీలో 120 వరకు కేబుల్ ఆపరేటర్లున్నారు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లుగా ఉన్నవాళ్లు కాస్తా ఇప్పుడు టీవీ చానళ్ల ఓనర్లయ్యారు. ఆశ్చర్యపోకండి. కేబుల్ టీవీ చానళ్ల ఓనర్లు. ఇందులో కొన్ని టీవీలు ఉర్దూ, తెలుగు భాషల్లో న్యూస్ బులెటిన్లను అందిస్తుండగా.. మరికొన్ని సినిమాలు, సినిమా పాటలతో నిరంతరం ప్రజలకు వినోదాన్నిస్తున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందటే... మీరాలంమండి రోడ్డులోని జహరానగర్లో ఆర్ఎంఎస్ చానల్ ఇరవయ్యేళ్ల క్రితం మొదటిసారిగా కేబుల్ టీవీ ప్రసారాలను ప్రారంభించింది. అనంతరం ఓల్డ్‌సిటీ కేబుల్ నెట్వర్క్ (ఓసీఎన్) పేరుతో మరో కేబుల్ టీవీ చానల్ ప్రసారాలు ప్రారంభించింది. తరువాతి కాలంలో చాలా చానళ్లు ప్రారంభమయ్యాయి. వందకు పైగా చానళ్లు.. 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఆప్తక్, సీసీఎన్, ఫిజా, ఎంక్యూ టీవీ, ఎన్ఎన్ఎస్ చానల్, మాస్ టీవీ, టీవీ-21, హైదరాబాద్ చానల్, శాలిమార్ చానల్, కృషి టీవీ, వీఆర్ టీవీ, మై టీవీ, ఎస్ఎం టీవీ, ఎఫ్ఎం టీవీ, నిషా టీవీ, నిషా ప్లస్ టీవీ, నిషా ఇస్లామిక్, వీ టీవీ, ఆర్ఎంఎస్ కేబుల్ టీవీ, మొఘల్ టీవీ, ఎంకే చానల్, జీ టీవీ, ఎస్ టీవీ, ఏషియన్ టీవీలతో పాటు మరికొన్ని స్థానిక కేబుల్ టీవీ చానళ్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయి.ఇవి వందకుపైగా ఉంటాయని అంచనా. ఇందులో 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఉర్దూ టీవీలు రోజూ ఉర్దూలో వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సత్వర స్పందన పాతబస్తీలో ఏ చిన్న సంఘటన జరిగినా ఈ ఉర్దూ కేబుల్ టీవీ చానళ్లు వెంటనే స్పందిస్తున్నాయి. ఒక్కోసారి సంఘటనా స్థలంలో చిత్రీకరించిన సంఘటనలన్నింటినీ ఎడిట్ చేయకుండా యథావిధిగా ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పండుగలకు రేటింగ్... కొత్త సినిమాలతో పాటు అక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి ఈ చానల్స్. హిందువుల ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు బోనాలు, అయ్యప్ప స్వామి పూజలు, వినాయక చవితి ఉత్సవాలు, దసరా, దీపావళి వేడుకలను ప్రత్యక్షంగా అందిస్తుండగా.. ముస్లిం ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు ఉర్సు ఉత్సవాలు, రంజాన్, మిలాద్-ఉన్-నబీ తదితర మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. పండుగలు, ఉత్సవాలప్పుడు లోకల్ చానల్స్ రేటింగ్ హైస్పీడ్‌లో పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆదాయ వనరులు ఎమ్ఎస్ఓలతో సంబంధం లేదు కాబట్టి ఆదాయం నెలవారీ ప్రకటనలే. ప్రతి రోజు స్క్రోలింగ్‌లతో పాటు విజువల్ యాడ్లను ప్రసారం చేస్తున్నాయి. స్థానికులు కచ్చితంగా చూసే ఈకేబుల్ టీవీల్లో యాడ్ ఇస్తే తమ కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారుల నమ్మకం. 24 గంటల పాటు స్క్రోలింగ్ రన్ చేసే ప్రకటనకు నెలకు రూ. 400 నుంచి 600 వరకు, గంటకోసారి ప్రసారం చేసే విజువల్ యాడ్స్‌కు నెలకు 1,500 నుంచి 2,000 వరకు లభిస్తుంది. ఇక భక్తి కార్యక్రమాలు, స్కూల్ యాడ్స్, వ్యాపార ప్రకటనల ప్యాకేజీలను కొనసాగిస్తున్నారు. అంతేనా.. లోకల్‌గా జరిగిన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్‌కి కూడా ఈ చానల్స్‌లో మంచి గిరాకీ. వ్యయం శాటిలైట్ టీవీ చానల్ ప్రారంభించడానికి ఖర్చు 20 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ కేబుల్ చానల్ నిర్వహణకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఒక సిస్టం, ఒక కెమెరా, కెమెరామెన్ చాలు.. చానల్ రన్ చేసేయొచ్చు. చిన్న కేబుల్ టీవీ చానళ్లు కేవలం ఇద్దరు సిబ్బందితో నడుస్తున్నాయి. టీవీ చానల్ గదితో పాటు ఇద్దరి జీతభత్యాలు, నెలసరి ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ ఇద్దరిలో ఒకరు నిర్వాహకులే ఉంటుండటంతో ఒక వేతనం కూడా తగ్గుతోంది. ఇక ఎలాంటి ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు లేకపోవడంతో నెలవారీ ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఆకట్టుకునే కార్యక్రమాలు ఖబర్నామా.. ఫోర్త్ టీవీ చానల్లో ప్రతిరోజూ ప్రసారమయ్యే ఫోర్త్ టీవీ ఖబర్నామా ఉర్దూ న్యూస్‌కి వ్యూయర్స్ ఎక్కువ. రాత్రి 7.30 గంటలకు, 10 గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు, ఉదయం 8 గంటలకు, 11.30 గంటలకు ప్రసారమయ్యే ఈ బులెటిన్లలో వార్తలన్నీ పాతబస్తీకే సంబంధించినవి కావడంతో స్థానికులు వాటిని మిస్ కావడంలేదు . దక్కనీ న్యూస్ హైదరాబాద్ పాతబస్తీ ఉర్దూ యాసలో ప్రసారమయ్యే ద క్కనీ న్యూస్ ఇక్కడి జనాల మోస్ట్ ఫేవరెట్ బులెటిన్. పరాయి భాషలో కాకుండా పక్కింటివాళ్లు విషయం చెప్పినట్టు ‘ఆదాబ్...’! అంటూ వార్తలను చేరవేయడం ఈ న్యూస్ ప్రత్యేకత. ప్రభుత్వ సహకారం కావాలి స్థానిక ప్రేక్షకులకు వినోదంతో పాటు ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, వార్తలను అందజేస్తున్న కేబుల్ టీవీ చానళ్లను ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించాలి. స్థానిక ఉత్సవాల సమయంలో సమాచార పౌర, సంబంధాల శాఖ ప్రభుత్వ ప్రకటనలను జారీ చేస్తే బాగుంటుంది. - మీర్ మెహదీ అలీ బాక్రీ సెన్సేషనల్ న్యూస్ సిండికేట్ (ఎస్ఎన్ఎస్) - పిల్లి రాంచందర్