కమ్మర్‌పల్లి(బాల్కొండ) : బుల్లితెర వినోదం ఇకపై పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కానుంది. కేబుల్ ప్రసారాల ద్వారా ఇప్పటి వరకు ఛానళ్లు అన్ని ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకు వచ్చేవి. కాని టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విధించిన కొత్త నిబంధనలతో కేబుల్ టీవీ వినియోగదారులకు బిల్లు వాచిపోనుంది. ఛానళ్ల ధరలు పెరిగి బుల్లితెర వినోదానికి సామాన్యులు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
వినియోగదారుడికి భారం..
ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంతో టీవీ వినియోగదారుడికి అధిక భారం పడే అవకాశం ఉంది. వినియోగదారుడు తమకిష్టమైన ఛానళ్లను ఎంపిక చేసుకొని వీక్షించవచ్చని చెబుతున్నప్పటికీ, అదీ ఛానళ్ల ప్యాకేజీలతో ఇపుడున్న నెలసరి బిల్లుకు దాదాపు రెండు మూడింతలు పెరగనుంది. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు ప్రీ పెయిడ్ కనెక్షన్ పద్ధతిలో ముందే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ఆపరేటర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.150 నుంచి రూ.250కు దాదాపు 300 ఛానళ్లు(ఉచిత, పే ఛానళ్లు) చూపిస్తున్నారు. ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం ఇకపై ఉచితంగా ప్రసారం అవుతున్న(సుమారు 100) ఛానళ్లకు మత్రమే కేబుల్ టీవీ సంస్థలకు రూ.130+18 శాతం జీఎస్టీ కలిపి రూ.153.40 చెల్లించాల్సి ఉంటుంది.
మిగతా ఛానళ్ల ప్రసారానికి ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం చార్జీలు చెల్లించి రీచార్జి చేసుకుంటేనే వీక్షించే అవకాశం ఉంటుంది. తమకు నచ్చిన ఇష్టమైన ఛానళ్లను ఎంపిక చేసుకొని చూడవచవ్చని ట్రాయ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నా, ఛానళ్ల ప్యాకేజీలతో వినియోగదారులకు భారం అధికమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రధానంగా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు జీ టీవీ, మా టీవీ, జెమినీ టీవీ, ఈ టీవీ తదితర తెలుగు ఛానళ్లు వీక్షించాలంటే రూ.5 నుంచి రూ.19 వరకు చార్జీలు ఉన్నాయి. అయితే ఈ ఛానళ్లు తమ లింక్‌డ్ ఛానళ్లతో కలిపి ప్యాకేజ్‌గా అందిస్తున్నాయి. వీటికి రూ.104+18 శాతం జీఎస్టీ కలిపి రూ.122.72 చెల్లించాలి. బేసిక్ ఛానళ్ల బిల్లు రూ.153.40, పే ఛానళ్ల ధర రూ.122.72 కలిపి రూ.276.12 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ద్వారా సుమారు 300 చానళ్లు ప్రసారం అవుతుండగా, రూ.150 నుంచి రూ.250 వరకు కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు. బేసిక్ ఛానళ్లలో 26 దూరదర్శన్ ఛానళ్లు, అన్ని భాషల న్యూస్ ఛానళ్లు ఉన్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనలతో 100 ఉచిత ఛానళ్లతోపాటు తెలుగు ఛానళ్లు, ఇంగ్లీష్, హిందీ, స్పోర్ట్స్ ఛానళ్లు వీక్షించాలంటే వినియోగదారుడికి ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే మూడింతల భారం పడనుంది. ఈ నేపథ్యంలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు బుల్లితెర వినోదానికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఛానళ్ల ప్యాకేజీల ధరలు..
స్టార్ మా ఛానల్ ప్యాకేజ్: మా మూవీస్, మా గోల్డ్, మా మ్యూజిక్, స్టార్‌స్పోర్ట్స్, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఉంది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.39గా నిర్ణయించారు.
జెమిని ఛానెల్ ప్యాకేజ్: జెమిని మూవీస్, జెమిని కామెడీ, జెమిని మ్యూజిక్, ఖుషీ, జెమిని లైఫ్, జెమిని న్యూస్ ఉన్నాయి. వీటికి నెలసరి బిల్లు రూ.30గా ఉంది.
జీ టీవీ ప్యాకేజ్: జీ తెలుగు, జీ సినిమాలు ఉండగా, వీటికి రూ. 20గా ఉంది.
ఈ టీవీ ప్యాకేజ్: ఈ టీవీ సినిమా, ఈ టీవీ ప్లస్, అభిరుచి, ఈ టీవీ తెలంగాణ, ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వీటి ధర రూ. 24 ఉంది.
ఇతర భాష ఛానళ్లు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మళయాలం, కన్నడ, మరాఠి తదితర భాషల ఛానళ్ల ధరలు రూ. 5 నుంచి 19 వరకు ఉన్నాయి.
చానళ్ల ఎంపికకు పెరిగిన గడువు జనవరి 31
టీవీ ప్రేక్షకులు తాము కోరుకున్న, ఇష్టమైన చానళ్ల ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ట్రాయ్ డిసెంబర్ 29 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. కానీ ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లు ఈనెల 27న హైదరాబాద్‌లో ధర్నా కార్యక్రమం చేపట్టడంతో ట్రాయ్ దిగివచ్చి సబ్‌స్క్రయిబర్స్‌కు అవగాహన కల్పించడానికి మరో నెల రోజుల పాటు గడువు పొడిగించింది. జనవరి 31 వరకు గడువు పొడిగించగా, ఎంఎస్‌వోకుగాని, కేబుల్ ఆపరేటర్‌కు సర్వీస్ ప్రొవైడర్లు సిగ్నల్ నిలిపివేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment