Cable TV
-
అధిక డేటా.. మరింత వేగం
సాక్షి, అమరావతి: మరింత వేగంగా అధిక డేటాను అందించే విధంగా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) బేసిక్ ప్లాన్‌లో మార్పులను చేసింది. ఇప్పటివరకు ప్రతి నెలా 100 జీబీగా ఉన్న డేటా వినియోగ సామర్థ్యాన్ని 150 జీబీకి పెంచడంతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని 15 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడలో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటితో పాటు సోనీ గ్రూపునకు చెందిన స్పోర్ట్స్ చానల్స్, సీఎన్‌బీసీ, జీ గ్రూపునకు చెందిన మొత్తం 10 చానల్స్‌ను అదనంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేబుల్ టీవీతో పాటు ఉచితంగా టెలీఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న బేసిక్ ప్లాన్ చార్జీని రూ.300 నుంచి రూ.350కి సవరించినట్లు తెలిపారు. రూ.449, రూ.599 ప్లాన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీఎస్ఎఫ్ఎల్ 9.2 లక్షల కనెక్షన్లను కలిగి ఉందని, వీటికి అదనంగా మరో 10 లక్షల కనెక్షన్లు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలలో సెట్‌టాప్ బాక్స్‌ల మరమ్మతుల కోసం సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాల కారణంగా నష్టాల్లోకి జారుకున్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ పేరుతో జరిపిన కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. -
బుల్లితెర వినోదం ఇక భారమే
కమ్మర్పల్లి(బాల్కొండ) : బుల్లితెర వినోదం ఇకపై పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కానుంది. కేబుల్ ప్రసారాల ద్వారా ఇప్పటి వరకు ఛానళ్లు అన్ని ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకు వచ్చేవి. కాని టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విధించిన కొత్త నిబంధనలతో కేబుల్ టీవీ వినియోగదారులకు బిల్లు వాచిపోనుంది. ఛానళ్ల ధరలు పెరిగి బుల్లితెర వినోదానికి సామాన్యులు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. వినియోగదారుడికి భారం.. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంతో టీవీ వినియోగదారుడికి అధిక భారం పడే అవకాశం ఉంది. వినియోగదారుడు తమకిష్టమైన ఛానళ్లను ఎంపిక చేసుకొని వీక్షించవచ్చని చెబుతున్నప్పటికీ, అదీ ఛానళ్ల ప్యాకేజీలతో ఇపుడున్న నెలసరి బిల్లుకు దాదాపు రెండు మూడింతలు పెరగనుంది. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు ప్రీ పెయిడ్ కనెక్షన్ పద్ధతిలో ముందే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ఆపరేటర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.150 నుంచి రూ.250కు దాదాపు 300 ఛానళ్లు(ఉచిత, పే ఛానళ్లు) చూపిస్తున్నారు. ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం ఇకపై ఉచితంగా ప్రసారం అవుతున్న(సుమారు 100) ఛానళ్లకు మత్రమే కేబుల్ టీవీ సంస్థలకు రూ.130+18 శాతం జీఎస్టీ కలిపి రూ.153.40 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఛానళ్ల ప్రసారానికి ట్రాయ్ నిర్దేశించిన ప్రకారం చార్జీలు చెల్లించి రీచార్జి చేసుకుంటేనే వీక్షించే అవకాశం ఉంటుంది. తమకు నచ్చిన ఇష్టమైన ఛానళ్లను ఎంపిక చేసుకొని చూడవచవ్చని ట్రాయ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నా, ఛానళ్ల ప్యాకేజీలతో వినియోగదారులకు భారం అధికమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రధానంగా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు జీ టీవీ, మా టీవీ, జెమినీ టీవీ, ఈ టీవీ తదితర తెలుగు ఛానళ్లు వీక్షించాలంటే రూ.5 నుంచి రూ.19 వరకు చార్జీలు ఉన్నాయి. అయితే ఈ ఛానళ్లు తమ లింక్డ్ ఛానళ్లతో కలిపి ప్యాకేజ్‌గా అందిస్తున్నాయి. వీటికి రూ.104+18 శాతం జీఎస్టీ కలిపి రూ.122.72 చెల్లించాలి. బేసిక్ ఛానళ్ల బిల్లు రూ.153.40, పే ఛానళ్ల ధర రూ.122.72 కలిపి రూ.276.12 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ద్వారా సుమారు 300 చానళ్లు ప్రసారం అవుతుండగా, రూ.150 నుంచి రూ.250 వరకు కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు. బేసిక్ ఛానళ్లలో 26 దూరదర్శన్ ఛానళ్లు, అన్ని భాషల న్యూస్ ఛానళ్లు ఉన్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనలతో 100 ఉచిత ఛానళ్లతోపాటు తెలుగు ఛానళ్లు, ఇంగ్లీష్, హిందీ, స్పోర్ట్స్ ఛానళ్లు వీక్షించాలంటే వినియోగదారుడికి ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే మూడింతల భారం పడనుంది. ఈ నేపథ్యంలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు బుల్లితెర వినోదానికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఛానళ్ల ప్యాకేజీల ధరలు.. స్టార్ మా ఛానల్ ప్యాకేజ్: మా మూవీస్, మా గోల్డ్, మా మ్యూజిక్, స్టార్‌స్పోర్ట్స్, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఉంది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.39గా నిర్ణయించారు. జెమిని ఛానెల్ ప్యాకేజ్: జెమిని మూవీస్, జెమిని కామెడీ, జెమిని మ్యూజిక్, ఖుషీ, జెమిని లైఫ్, జెమిని న్యూస్ ఉన్నాయి. వీటికి నెలసరి బిల్లు రూ.30గా ఉంది. జీ టీవీ ప్యాకేజ్: జీ తెలుగు, జీ సినిమాలు ఉండగా, వీటికి రూ. 20గా ఉంది. ఈ టీవీ ప్యాకేజ్: ఈ టీవీ సినిమా, ఈ టీవీ ప్లస్, అభిరుచి, ఈ టీవీ తెలంగాణ, ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వీటి ధర రూ. 24 ఉంది. ఇతర భాష ఛానళ్లు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మళయాలం, కన్నడ, మరాఠి తదితర భాషల ఛానళ్ల ధరలు రూ. 5 నుంచి 19 వరకు ఉన్నాయి. చానళ్ల ఎంపికకు పెరిగిన గడువు జనవరి 31 టీవీ ప్రేక్షకులు తాము కోరుకున్న, ఇష్టమైన చానళ్ల ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ట్రాయ్ డిసెంబర్ 29 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. కానీ ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లు ఈనెల 27న హైదరాబాద్‌లో ధర్నా కార్యక్రమం చేపట్టడంతో ట్రాయ్ దిగివచ్చి సబ్స్క్రయిబర్స్కు అవగాహన కల్పించడానికి మరో నెల రోజుల పాటు గడువు పొడిగించింది. జనవరి 31 వరకు గడువు పొడిగించగా, ఎంఎస్వోకుగాని, కేబుల్ ఆపరేటర్‌కు సర్వీస్ ప్రొవైడర్లు సిగ్నల్ నిలిపివేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. -
ఇక సామాన్యుడు టీవీ చూడలేడా..
దైనందిన జీవితంలో టీవీ ఒక భాగంగా.. విడదీయలేని బంధంగా మారింది. ఉదయం నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు ఇంట్లో టీవీ నడుస్తూనే ఉంటుంది. టీవీలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆస్పత్రులు, దుకాణాలు, చివరకు టీ షాపుల్లో కూడా టీవీ పెడుతున్నారు యజమానులు. మారుతున్న లైఫ్ స్టైల్‌కు తోడుగా కొత్త కొత్త చానళ్లు పుట్టుకోస్తున్నాయి. ఒక్కో వయస్సు వారు ఒక్కో తీరు చానల్‌కు అలవాటు పడిపోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈనెల 29 నుంచి టారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారి బిల్లు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అల్లిపురం(విశాఖ దక్షిణం): బుల్లితెర(టీవీ) ప్రేక్షకులకు కొత్త సంవత్సరం నుంచి వినోదం మరింత భారం కానుంది. కేబుల్ టీవీతో పాటు డీటీహెచ్‌ల ద్వారా ప్రసారం అవుతున్న ప్రసారాలను వీక్షించే వినియోగదారులు ఇక అదనపు భారం మోయకతప్పదు. కేబుల్ ప్రసారాలపై టెలికామ్ రెగ్యూలెటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారీఫ్‌ను ప్రకటించింది. కొత్త ఎమ్మార్పీ ప్రకారం టెలివిజన్ ప్రేక్షకులు ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న బిల్లుల కన్నా ఎక్కువగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడనుంది. దీంతో విశాఖ నగర పరిధిలో సుమారు 5 లక్షలు, రూరల్ పరిధిలో దాదాపు 4 లక్షల మంది మొత్తం 9 లక్షల మంది వినియోగదారులపై భారం పడనుంది. కొత్త విధానంతో బాదుడు ఇప్పటి వరకు అన్ని చానళ్లు ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకే వచ్చేవి. ట్రాయ్ కొత్త నింబంధనలతో ఇక చానళ్ల ధరలు కొండెక్కనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలనెలా చెల్లిస్తున్న రూ.150 నుంచి రూ.200 దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. డీటీహెచ్ ధరలు కూడా అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్‌కు ప్రీపెయిడ్ పద్ధతిలో ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రసారమవుతున్న చానళ్లకు మాత్రమే కేబుల్ టీవీ సంస్థలకు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా చానళ్లు చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం విధానం ప్రకారం వచ్చే చానళ్లన్నీ ఈనెల 29తో నిలిచిపోనున్నాయి. 30 నుంచి ఫ్రీ టూ ఎయిర్ చానళ్లు మాత్రమే వస్తాయి. కేబుల్ టీవీ ప్రసారం చేస్తున్న చానళ్లలో ఉచితంగా వార్తా చానళ్లు, వినోదభరితమైన చానళ్లు, కొన్ని స్పోర్ట్స్ చానళ్లు వీక్షించవచ్చు. ప్రస్తుతం నెలకు రూ.200 నుంచి రూ.250 వరకు చార్జీలు తీసుకుంటున్న తరుణంలో..మారిన టారిఫ్ ప్రకారం రూ.130తో పాటు జీఎస్టీ 18శాతం చెల్లిస్తే ఫ్రీ ఎయిర్ చానళ్లు వస్తాయి. మిగతా చానళ్ల ప్రసారానికి ట్రాయ్ నిర్ధేశింంచిన నింబంధనల ప్రకారం చార్టీలు చెల్లించి రీచార్జ్ చేసుకుంటేనే వీక్షించే అవకాశం ఉంటుంది. నిరసన బాటలో కేబుల్ ఆపరేటర్లు కొత్త టారిఫ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, దీనిని మరికొద్ది రోజులు వాయిదా వేయాలని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేస్తూ ఈ నెల 29న నిరసనకు సిద్ధమవుతున్నారు. ప్రజల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఒకేసారి భారం వేయకుండా, ప్రస్తుతం వస్తున్న చానళ్లను వెంటనే నిలిపివేయకుండా కొద్ది రోజులు ప్రసారం చేయడానికి కేబుల్ ఆపరేటర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. చానళ్ల వారీగా రుసుములు స్టార్ మా చానెల్ ప్యాకేజీ : మా మూవీస్, మా గోల్డ్, మా మ్యూజిక్, స్టార్‌స్పోర్ట్స్, మరో ఎంటర్టైన్మెంట్ చానల్(నెల ఖర్చు): రూ.39 జెమిని చానెల్ ప్యాకేజీ : జెమిని మూవీస్, జెమిని కామెడీ, జెమిని మ్యూజిక్, ఖుషి టీవీ, జెమిని లైఫ్, జెమిని న్యూస్ : రూ.30 జీ తెలుగు ప్యాకేజీ : జీ తెలుగు, జీ సినిమా : రూ.20 కేవలం మా టీవీ, జెమిని, జీ తెలుగు, ఈ టీవీ చానళ్లను చూడాలంటే ఒక్కో చానల్ ప్రసారానికి రూ.19 ఈ విధంగా స్టార్ మా, సోనీ, స్పోర్ట్సు చానళ్లకు ప్యాకేజీలు నిర్ణయించారు. వాటికి 18 శాతం జీఎస్టీ అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఆ పైన ప్రతి చానల్‌కు ఒక రేటు పెట్టి దానిపై కూడా జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా జీఎస్టీ భారం ప్రతి చానల్‌కు కట్టడం వల్ల ఎక్కువ శాతం జీఎస్టీ కట్టాల్సిందే. చానళ్ల వారీగా వసూలు దారుణం ప్రజలు వినోదం, ప్రశాంతత కోసం టీవీ చూస్తుంటారు. దీనిని కూడా కేంద్రం ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. ప్రజలకు టీవీ వినోదాన్ని దూరం చేస్తున్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనలతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. చానళ్లకు రేటు, ప్యాకేజీలకు డబ్బులు చెల్లించే పరిస్థితులు చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన ధరలు సడలించాలి.– మద్దాల వెంకటవరలక్ష్మి,గృహిణి, పాత వెంకోజిపాలెం -
నిలిచిపోయిన కేబుల్ టీవీ, ఇంటర్నట్ సేవలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర ప్రాంతాల్లో కేబుల్ టీవీ, ఇంటర్నట్ సేవలు నిలిచిపోయాయి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయవాడ వద్ద కేబుల్ వైర్లు తెగిపోయినందువల్లే కేబుల్ ప్రసారాలు నిలిచిపోయినట్లు కేబుల్ సిబ్బంది చెబుతున్నారు. అయితే జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన నిజానిజాలు తెలియకుండా కేబుల్ ప్రసారాలు నిలిపివేయించినట్లు వైఎస్సార్ సీపీ అభిమానులు, ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. -
కేబుల్ టీవీ ప్రసారాలపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ ప్రసారాల రంగంలోకి అడుగుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులు మాత్రమే పిటిషనర్ తన వాదనకు మద్దతుగా చూపారని, ఇతర బలమైన ఆధారాలు చూపలేదని తెలిపింది. ట్రాయ్ చేసినవన్నీ సిఫార్సులేనని, వాటిని అమలు చేయాలని చట్టంలో ఎక్కడా లేదని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ట్రాయ్ సిఫారసులను ఆమోదించి చట్టం చేసి ఉంటే వాటిని అమలు చేయమని ఆదేశించేందుకు ఆస్కారం ఉండేదని తెలిపింది. ప్రభుత్వమే కేబుల్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తే టీవీ ప్రసారాలు ఏకపక్షంగా ఉంటాయని, విపక్షాల గొంతు నొక్కే ప్రమాదం ఉందంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. -
స్పీకర్ కోడెల తనయుడిపై కేసు నమోదు
గుంటూరు : నర్సరావుపేటలో కేబుల్ వైర్ల కత్తిరింపు వ్యవహారంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నరసరావుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు గతంలో దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. అప్పట్లోనే కోడెల తనయుడు శివరామ్‌పై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో శివరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముదిరిన కేబుల్ వార్
- శిల్పా, ఏవీ సంస్థల ప్రతినిధులు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు - ఒకరిపై ఒకరు ఆరోపణలు – ఉప ఎన్నికల నేపథ్యంలో వివాదం తీవ్రతరం నంద్యాల: ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో కేబుల్ వార్ ముదిరింది. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గానికి(ఏవీ) చెందిన డిజిటల్ టీవీ, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన శిల్పా డిజిటల్ టీవీల మధ్య వివాదం తీవ్రమైంది. ఈ రెండు సంస్థలు పోలీసు, ఏపీ ట్రాన్స్‌కో, కోర్టులకే పరిమితమైన వివాదం ఉప ఎన్నికల నేపథ్యంలో తీవ్రమైంది. ఇరువర్గాల ప్రతినిధులు బుధవారం వేర్వేరుగా విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేసి ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు హక్కును దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి దక్కింది. ఆయన సంస్థ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పట్టణంలో కేబుల్ వైర్లను వేయడం మొదలు పెట్టింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫైబర్ నెట్వర్క్ మినహా విద్యుత్ స్తంభాలపై ఇతర సంస్థల కేబుల్ వైర్లు ఉండకూడదు. వీటిని తొలగించాలని ప్రభుత్వం విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాని దీని వల్ల తాము ఉపాధిని కోల్పోతామని ఏపీ ఎంఎస్ఓలు హైకోర్టును ఆశ్రయించగా, యథాస్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ శివారులోని సుగాలిమెట్ట, పొన్నాపురం ప్రాంతాల్లో శిల్పా కేబుల్ నెట్‌వర్క్‌కు చెందిన వైర్లను లక్ష్మికాంతరెడ్డి, ప్రతాపరెడ్డి కత్తిరించారని ఎంఎస్ఓ బాలనరసింహుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో ఏవీ, డీఎస్పీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏవీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శిల్పా, భూమా వర్గాలకు చెందిన కేబుల్ టీవీ ప్రతినిధులు వేర్వేరు మీడియా సమావేశాల్లో ఆరోపణలకు దిగారు. కేబుల్ చట్టం ప్రకారమే.. కేబుల్ చట్టం ప్రకారమే విస్తరణను, ప్రసారాలను చేపట్టామని శిల్పా కేబుల్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీశ్వరరెడ్డి తెలిపారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ యాక్ట్ 995లోని 4బీ ప్రకారం కేబుల్ ఆపరేటర్లకు ఉన్న విస్తరణకు సంబంధించిన మార్గదర్శక సూచనల ప్రకారమే ముందుకెళ్తున్నామన్నారు. కాని దీనిపై వివరణ ఇవ్వాలని రెండు వారాల గడువును ఏపీడీసీఎల్ జనరల్ మేనేజర్ అభ్యంతరం తెలిపారని చెప్పారు. దీనిపై ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో జనవరి 19న హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. కోర్టు కేబుల్ టెలివిజన్ చట్టం 4బీ ప్రకారం తాము కేబుల్ విస్తరణను చేపట్టామని, న్యాయపరమైన హక్కులు ఉన్నాయన్నారు. విస్తరణకు అనుమతి లేదు.. శిల్పా కేబుల్ టీవీ సంస్థ విస్తరణకు అనుమతి లేదని డిజిటల్ టీవీ మేనేజర్ జయచంద్రారెడ్డి, న్యాయవాది రాజేశ్వరరెడ్డి తెలిపారు. హైకోర్టు జారీ చేసిన స్టేటస్కో ఉత్తర్వుల ప్రకారం ఎవరూ ఎలాంటి విస్తరణ పనులను చేపట్టరాదన్నారు. కానీ శిల్పా టీవీ సంస్థ విస్తరణ చేపట్టడం చట్ట వ్యతిరేకమని, వెంటనే ట్రాన్స్‌కో, పోలీసు అధికారులు అడ్డుకోవాలని కోరారు. కేబుల్ వార్ ముదిరితే ముప్పే.. ఉప ఎన్నికల దృష్ట్యా కేబుల్ వార్ ముదిరితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ రెండు సంస్థలు, పోలీస్, ట్రాన్స్‌కో అధికారులకే పరిమితమైన ఈ వివాదానికి రాజకీయ రంగు పడటంతో సమస్య జఠిలమయ్యేలా ఉంది. ఉప ఎన్నికల్లో కేబుల్ వార్ ఎలాంటి వివాదాలు సృష్టించకుండా జిల్లా ఎస్పీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్ విజయమోహన్ జోక్యం చేసుకొని చట్టం పరిధిలో సమస్యను పరిష్కరించాల్సి ఉంది. -
డిజిటలైజేషన్ గడువు పెంపుకు బాబు లేఖ
అమరావతి : కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు రేపటితో ముగియనుంది. గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించాలని లేఖలో చంద్రబాబు నాయుడు కోరారు. డిసెంబర్ 31 నాటికి ఏపీ ఫైబర్ ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ ప్రసారాలను ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనలో ఉంది. -
ఇన్వర్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా
ఢిల్లీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు కున్వర్ సచ్దేవ్. చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. ఏదో ఒకరోజు తాను పెద్ద వ్యాపారవేత్తను అవుతానని కలలు కనేవాడు. అలా అని ఆ కలల ప్రపంచంలోనే ఉండిపోలేదు. ఒక్కొక్క అడుగు వేస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చిన్నప్పుడు అన్నతో పాటు స్టేషనరి షాపులో పెన్నులు అమ్మాడు. కాలేజీ రోజుల్లో ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ నిర్వహించేవాడు. ఢిల్లీ యూనివర్శిటీలో లా చదివిన సచ్దేవ్ ఒక కేబుల్ కమ్యూనికేషన్ కంపెనీ సేల్స్ విభాగంలో పనిచేశారు. కొద్దికాలం తరువాత ఉద్యోగం మానేసి ఢిల్లీలో సొంతంగా కేబుల్ టీవీ ఎక్విప్మెంట్ తయారీ వ్యాపారంలోకి దిగారు. ‘సు–కమ్’ పవర్ సిస్టం పేరుతో డైరెక్షనల్ కప్లర్స్, మాడ్యులేటర్స్, కేబుల్ ఎక్విప్మెంట్ తయారీ ప్రారంభించారు. కొన్ని విజయాల కోసం దారి వెదుక్కుంటూ వెళ్లాలి. కొన్ని విజయాలు అదృష్టం కొద్దీ మన దారి దగ్గరికే వస్తాయి. ‘ఇన్వర్టర్ దిగ్గజం’ కున్వర్ సచ్దేవ్ ‘ఇన్వర్టర్ వ్యాపారం’లోకి రావడం అనుకోకుండా జరిగింది. సచ్దేవ్ ఇంట్లోని ఇన్వర్టర్ తరచుగా బ్రేక్ డౌన్ అవుతూ ఉండేది. ఇన్వర్టర్ ఉన్న మాటేగానీ ఎప్పుడూ సమస్యే. ఒకసారి ఇంట్లోని ఇన్వర్టర్కు సమస్య వచ్చినప్పుడు బయటి నుంచి ఎలక్ట్రిషియన్‌ను పిలిపించడం కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు సచ్దేవ్.తన పరిశీలనలో తెలిసింది ఏమిటంటే నాణ్యత లేని పీసీబి బోర్డ్‌లు ఉపయోగిస్తున్నారని. మార్కెట్లో ఎటు చూసినా నాణ్యత లేని ఇన్వర్టర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలోనే సచ్‌దేవ్‌కు ఒక ఆలోచన వచ్చింది. ‘విశ్వసనీయమైన ఒక ఇన్వర్టర్కు రూపకల్పన చేస్తే ఎలా ఉంటుంది?’ ‘విశ్వసనీయతే విజయానికి తిరుగులేని సూత్రం’ అనే విషయం పుస్తకాలు బాగా చదివే సచ్‌దేవ్‌కు తెలుసు.టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి సరికొత్త ఇన్వర్టర్ రూపకల్పన గురించి ఆలోచించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. అయితే..ఆ సమయంలో ప్రతికూలతలు, పరిమితుల గురించి ఆలోచించ లేదు సచ్దేవ్. ఎన్నో దేశాల ఇన్వర్టర్ల గురించి ఆరా తీశారు. తన సిబ్బందితో కొన్ని ప్రయోగాలు చేయించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ‘నాణ్యమైన ఇన్వర్టర్’కు రూపకల్పన చేయించి ‘సు–కమ్’ పవర్ పేరుతో ఇన్వర్టర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే సు–కమ్ ఇన్వర్టర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. మార్కెట్ స్ట్రాటెజీతో మరింత దూసుకు వెళ్లింది సు–కమ్. ప్రపంచంలోనే ప్లాస్టిక్ బాడీ ఇన్వర్టర్లు తయారుచేసిన కంపెనీగా ‘సు–కమ్’ తన ప్రత్యేకత చాటుకుంది. చిన్న స్థాయిలో ప్రారంభమైన సు–కమ్...కొద్ది సంవత్సరాల్లోనే ‘పవర్ సొల్యూషన్స్ ప్రొవైడర్’గా తన సత్తాను చాటి 70 దేశాలకు విస్తరించింది. ఒకప్పుడు పదివేల రూపాయలతో మొదలైన కున్వర్ సచ్దేవ్ వ్యాపారం ఇప్పుడు వేయి కోట్ల టర్నోవర్ దాటింది. ఇప్పుడు సు–కమ్ మేజర్ ప్రొడక్ట్స్... హోమ్ ఇన్వర్టర్స్, హోమ్ యుపిఎస్, బ్యాటరీస్, బ్యాటరీ ఛార్జర్స్, బ్యాటరీ ఈక్వలైజర్స్...వీటితో పాటు సోలర్ ఛార్జ్ కంట్రోలర్, సోలార్ గ్రిడ్–టై ఇన్వర్టర్స్... మొదలైనవి. ‘‘మీకు టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా...ఈ విజయాలు ఎలా సాధ్యమయ్యాయి’’ అనే ప్రశ్నకు సచ్దేవ్ ఇలా ఆసక్తికరమైన సమాధానం ఇస్తారు... ‘‘టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల హద్దులు తెలియవు. మూస సూత్రాలు తెలియవు. ఇలాంటి సమయంలో ఇమాజినేషన్‌ను నమ్ముకుంటాం. అది క్రియేటివిటీగా మారుతుంది. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. చెప్పొచ్చేదేమిటంటే... టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల... ఇలా మాత్రమే వెళ్లాలి, అలా మాత్రమే వెళ్లాలి అనే ఆలోచన రాదు. మనలోని సృజనాత్మకత ప్రకారం వెళతాం. కొన్నిసార్లు అది చెడ్డ ఫలితాలు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. నాకు రెండో ఫలితం అందింది. మనం ఏ రంగం ఎంచుకున్నాం, ఎంత అవగాహన ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ రంగంపై మనకు ఎంత ఆసక్తి ఉంది, ఏ మేరకు అధ్యయనం చేస్తున్నాం. ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం’’కున్వర్ సచ్దేవ్ అనుభవాలు... నేటి యువతకు గెలుపు పాఠాలుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు తేదీ పెంపు
న్యూఢిల్లీ: దేశంలో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబర్ 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ కిందకు వచ్చే వారి ఇంకా డిజిటల్లోకి మారకపోతే వారికి జనవరి 31వరకు గడువిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీకానుంది. -
ట్రాయ్ సంచలన ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేబుల్ బ్రాడకాస్టర్స్ వసూలు చేసే కేబుల్ టారిఫ్ పై ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సంచలన నిర్ణయం తీసుకుంది. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో డిజిటలైజేషన్ కేబుల్ ధరలపై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలపై పరిమితిని విధించాలని ప్రతిపాదించింది. అధిక మొత్తాలను వసూలు చేయకుండా వంద చానళ్లను ప్రసారం చేసే సెట్ టాప్ బాక్స్ కు నెలకు రూ. 130 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. ఈ నిబంధన కింద కచ్చితంగా 100 చానళ్లను కస్టమర్లకు అందించాల్సిందేనని తెలిపింది. దీని ప్రకారం ప్రతి ప్రసార లేదా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో పే, ఫ్రీ ఛానల్స్ వివరాలను స్పష్టంగా ప్రకటించాలని కోరింది. ఇంకా ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు. డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ (బ్రాడ్‌కాస్టింగ్ మరియు కేబుల్ సేవలు) (ఎనిమిదవ) (అడ్రస్బుల్ సిస్టమ్స్) టారిఫ్ ఆర్డర్, 2016 ను రిలీజ్ చేసిన ట్రాయ్ దీనిపై లిఖిత పూర్వక అభిప్రాయాలను అక్టోబర్ 24, 2016 లోపు తెలియజేయాలని కోరింది. మరోవైపు ట్రాయ్ ప్రతిపాదనలపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెలికాం రెగ్యులేటరీ సరైన నిర్ణయం తీసుకుందని, కానీ పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని పెట్టుబడి బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ పేర్కొంది. కేటగిరీలను స్పష్టంగా నిర్వచించిన లేదని తెలిపింది. డిజిటైజేషన్ ఇప్పటికీ పూర్తి కాకలేదని, ఎవరెవరు ఎంతెంత చెల్లిస్తున్నారనేది క్లారిటీ లేదని పేర్కొంది. అలాగే ఈ కొత్త ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పిండానికి సమయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అలాగే ఈ ప్రతిపాదన నచ్చని బ్రాడ్ కాస్టర్స్ కోర్టు కెళ్లి స్టే తెచ్చుకుంటారని అభిప్రాయపడింది. ధర పరిమితి విధించడం సహేతుకమైనదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ట్రాయ్ ప్రతిపాదిత టారిఫ్ ముఖ్య లక్ష్యం వినియోగదారుల ఆసక్తిని రక్షించుకోవడమేనని పేర్కొంది. -
టెలివిజన్ల మూగనోము
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో పూర్తి స్థాయి డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా అనలాగ్ పద్దతిలో కొనసాగుతున్న ప్రసారాలను నిలిపివేయడంతో సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి. దీంతో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్దతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు కోసం నాలుగు విడతలుగా గడువు విధించింది. ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో కేబుల్ టీవీలకు అనలాగ్, డిజిటల్ పద్ధతిలో ప్రసారాలకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. తాజాగా పూర్తి స్థాయి డిజిటలైజేషన్ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్ఎస్ఓ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్ టీవీలకు అనలాగ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి. పూర్తి కాని డిజిటలైజేషన్... కాగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని కేబుల్ టీవీలకు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఫలితంగా సుమారు 20 శాతం కేబుల్ టీవీలు మూగబోయాయి. నగరంలో దాదాపు 2వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉండగా వాటి పరిధిలో ∙25 లక్షల టీవీ కనెక్షన్లకు పైగా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎమ్సీహెచ్) లెక్కల ప్రకారం కేబుల్ కనెక్షన్ల సంఖ్యలో సగానికి పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారికంగా 10 లక్షలు మాత్రమే నమోదై ఉన్నట్లు సమాచార ప్రసార శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. నగరంలోని మొత్తం టీవీ కనెక్షన్లలో 80 శాతం వరకు డీటీహెచ్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు అంచనా. కేబుల్ ప్రసారాలు అందిస్తున్న సిటీ కేబుల్, హత్వే, డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ తదితర సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు సమాచారం. దీనిబట్టి మరో 20 శాతం వరకు కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌లు లేనట్లు తెలుస్తోంది. ప్రతి కేబుల్ ఆపరేటర్ పరిధిలో సుమారు 200 కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్స్‌లు లేకపోవడంతో టీవీలు మూగబోయాయి. -
సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలకు ప్రసారాలు బంద్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పూర్తిస్థాయి డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అనలాగ్ పద్ధతిలో కొనసాగుతున్న ప్రసారాలు నిలిచిపోయాయి. ఫలితంగా గత రెండు మూడు రోజుల నుంచి సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం నాలుగు విడతలుగా గడువు కూడా విధించింది. ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో కేబుల్ టీవీలకు రెండు రకాల అనలాగ్, డిజిటల్ పద్ధతుల్లో ప్రసారాలకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. తాజాగా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్ఎస్ఓ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్ టీవీలకు అనలాగ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి. పూర్తికాని డిజిటలైజేషన్... నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని కేబుల్ టీవీలకు డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఫలితంగా సుమారు 20 శాతం కేబుల్ టీవీలు మూగబోయాయి. మొత్తం మీద 25 లక్షల టీవీ కనెక్షన్లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) లెక్కల ప్రకారం కేబుల్ కనెక్షన్ల సంఖ్యలో సగానికి పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారికంగా 10 లక్షలు మాత్రమే నమోదై ఉన్నట్లు సమాచార ప్రసార శాఖ గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని మొత్తం టీవీ కనెక్షన్లల్లో 80 శాతం వరకు డీటీహెచ్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు అంచనా. కేబుల్ ప్రసారాలు అందిస్తున్న సిటీ కేబుల్,హత్వే,డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ తదితర సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి మరో 20 శాతం వరకు కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌లు లేనట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్రసారాలతో అవి కాస్తా మూగబోయాయి. -
బుల్లితెర కష్టాలు
సాక్షి, హన్మకొండ: కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. జులై 31 అర్ధరాత్రి నుంచి అనలాగ్ ప్రసారాలు నిలిపేస్తామని కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జులై 31 నుంచి సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోని వారికి కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ బుల్లితెరపై సీరియళ్లు, సినిమాలు స్పోర్ట్స్ సందడి చేయాలంటే డిజిటల్ ప్రసారాలు అందించే సెట్‌టాప్ బాక్సు అమర్చుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2016 జులై 31 నుంచి అనలాగ్ పద్ధతిలో ఉన్న కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి. కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబం«ధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియ సాధ్యం కాలేదు. ఫలితంగా కేంద్రం 2016 జులై 31 వరకు గడువు పొడిగించింది. అరకొర ప్రకటనలే జారీ.. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్ల (ఎంఎస్ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. దీంతో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ ఏళ్లతరబడి మందకొడిగానే సాగుతోంది. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్ కనెక్షన్లు సెట్‌టాప్ బాక్సులు అమర్చుకున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్ బాక్సులు అమర్చినట్లు సమాచారం. ఇక ఈ వారం రోజుల్లో మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్ కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్ బాక్సులకు తీవ్రమైన డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్లో సెట్‌టాప్ బాక్సులు లభించడం కష్టమే. దీంతో మరోసారి గడువు పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
మరోసారి డెడ్‌లైన్
ఈ నెల 31 నుంచి అనలాగ్ ప్రసారాలు బంద్ డిజిటలైజేషన్ చేయాలంటూ ఆదేశాలు 30శాతం మించని సెట్‌టాప్ బాక్సులు ఈసారి ఉపేక్షించబోమన్న ప్రభుత్వం సాక్షి, హన్మకొండ: కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. కేబుల్ ప్రసారాలను అనలాగ్ పద్ధతి నుంచి డిజిటల్లోకి మర్చాలంటూ ప్రభుత్వం ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగ్గట్లు ప్రజల్లో అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్లను (ఎంఎస్ఓ) సిద్ధం చేయకపోవడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. తాజాగా ఈ నెల 31లోగా కేబుల్ టీవీ ప్రసారాలన్నీ డిజిటలైజ్ చేస్తూ సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ముఫై శాతమే కేబుల్ టీవీ డిజిటలైజేషన్ పరిధిలోకి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాలు వస్తున్నాయి. వీటి పరిధిలో 1.62 లక్షల కేబుల్ టీవీ కనక్షన్లు ఉన్నాయి. గత ఆర్నెళ్ల కాలంగా సెట్ టాప్ బాక్సులను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. గడువు పొడిగించినా సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 30 శాతం కనెక్షన్లలకు సెట్ టాప్ బాక్సులు అమర్చి డిజిటలైజ్ చేశారు. రాబోయే ఏడు రోజుల వ్యవధిలో దాదాపు లక్ష కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం ఇబ్బందికరమైన వ్యవహరంగా మారనుంది. మూగనోమే.. కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు ఈ నెల 31 ఆఖరి గడువును కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా యంత్రాంగం చెబుతుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. 31వ తేదీ అర్థరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కేబుల ప్రసారాలు ఆగిపోయిన పక్షంలో సెట్ టాప్ బాక్సులకు గిరాకీ పెరిగిపోతుంది. అయితే డిమాండ్‌కు తగ్గ రీతిలో ఎంఎస్ఓల దగ్గర సెట్‌టాప్ బాక్సులు లేవు. ఏడునెలలుగా.. కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలను డిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను 2015 డిసెంబరు 22న జారీ చేసింది. 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలని హెచ్చరించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల్ని ఒకేసారి డిజిటిలైజ్ చేయాల్సి వచ్చింది. దీంతో సెట్‌టాప్ బాక్సులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్‌కు తగ్గ బాక్సులు లేని ఫలితంగా నిర్దేశించిన గడువులోగా కేబుల్ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో కేంద్రం మరో ఆర్నెళ్ల గడువు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసింది. పట్టణం కేబుల్ టీవీ కనెక్షన్లు జనగామ 9,364 నర్సంపేట 5,100 భూపాలపల్లి 8,959 మహబూబాబాద్ 7,516 పరకాల 3,093 గ్రేటర్ వరంగల్ 1,27,968 –––––––––––––––––––––– -
2 గంటల పాటు టీవీ ప్రసారాలు బంద్
హైదరాబాద్ : సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రాడ్కాస్టర్లు, ఎంఎస్ఓల బలవంతపు ఫీజు వసూళ్ల ఒత్తిడి తట్టుకోలేక బీరంగూడ కేబుల్ ఆపరేటర్ రమేశ్ ఆత్మహత్య చేసుకున్నందుకు నిరసనగా ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. -
కాపు ఐక్యగర్జనకు కరెంట్ కట్
సెల్ సిగ్నళ్లు, కేబుల్ ప్రసారాల నిలిపివేత పిఠాపురం/తొండంగి: తుని వద్ద ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన బహిరంగసభకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. బహిరంగ సభ ప్రారంభం నుంచి సభ జరిగే ప్రాంతంతో పాటు సమీప గ్రామాలకూ విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనికి తోడు ‘జామర్లు’ ఏర్పాటు చేసినట్టుగా అన్ని కంపెనీల సెల్ సిగ్నళ్లూ పనిచేయలేదు. టీవీ చానళ్లు, కేబుల్ టీవీ ప్రసారాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సభకు అడ్డంకులు కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి అవాంతరాలు సృష్టించారని సభకు వచ్చిన కాపు నాయకులు మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరా, సెల్ సిగ్నల్స్ లేకపోవడం, ప్రసార మాధ్యమాలు పనిచేయకపోవడంతో సభకు వచ్చిన వారితో పాటు సమీప గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారు. ప్రశాంతంగా ప్రారంభమై.. తుని రూరల్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ ఉదయం ప్రశాంతంగానే ప్రారంభమైంది. ముద్రగడ పిలుపు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తంగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వివిధ జిల్లాలకు చెందిన కాపులు సభాప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారు. అప్పటినుంచి చూస్తే.. 10.10 గంటలకు ముద్రగడ పద్మనాభం తన మనవరాలు భాగ్యశ్రీతో కలసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 10.45 గంటలకు జామర్ల ఏర్పాటుతో సభా ప్రాంగణంలో సెల్ సిగ్నల్స్ స్తంభించి పోయాయి. 12.45 గంటల సమయంలో వేదిక, ప్రెస్ గ్యాలరీలు కూడా సభికులతో నిండిపోయాయి. 1.30 గంటలకు వేదికపై నాయకులు ఆశీనులయ్యారు. 1.45 గంటలకు అభిమానుల హర్షధ్వానాల మధ్య ముద్రగడ వేదికనెక్కి అందరికీ అభివాదం చేశారు. 2.37 గంటల నుంచి 2.54 గంటల వరకు ముద్రగడ ప్రసంగించారు. అనంతరం వేదికనుంచి దిగిన ముద్రగడ హైవేపై ధర్నాకు దిగారు. అభిమానులు అనుసరించగా అక్కడ ప్రసంగం చేశారు. 3.00 గంటలకు ఆందోళనకారులు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. 3.15 గంటల సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. వేగం తగ్గించిన డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంలోనే డ్రైవర్లకు, కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలును నిలిపివేసిన డ్రైవర్లు రైలు వదిలి పరుగులు తీశారు. ప్రయాణికులు తమ తమ లగేజీలతో రైలు దిగిపోయారు. 4.40 గంటల సమయంలో కొందరు రత్నాచల్‌కు నిప్పు అంటించారు. అడ్డుకోబోరుున నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. 5.00 గంటలకు హైవేపై టైర్లకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. -
వ్యక్తి దారుణ హత్య
చలిమంట కాసుకుంటున్న వ్యక్తి పై ప్రత్యర్థి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుష్పూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంకజ్‌పటేల్(26), కేబుల్ టీవీ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అదే గ్రామంలో కేబుల్ నిర్వహిస్తున్న రాజన్న అనే వ్యక్తితో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంకజ్‌పటేల్ ఆదివారం రాత్రి ఇంటి ముందు చలిమంట కాసుకుంటున్న సమయంలో రాజన్న కత్తితో అతని పై దాడి చేసి హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు
-
సెట్‌టాప్ బాక్సుల గడువు పొడిగింపు
హైదరాబాద్: కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు రెండు నెలల గడువు పొడిగిస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. సెట్‌టాప్ బాక్స్ కోసం (టీవీ డిజిటలైజేషన్‌కు) గతంలో ప్రకటించిన గడువు ఈ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ గడువు మరింత పొడిగించాలంటూ తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 85 శాతం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సెట్ అప్ బాక్స్ సరఫరా చేయలేదని తమ పిటిషన్లో వారు పేర్కొన్నారు. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. సెట్‌టాప్ బాక్స్ అమర్చుకోవడానికి రెండు నెలల గడువు పొడిగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. -
సెట్‌టాప్ బాక్స్ తప్పదు
లేకుంటే టీవీ బంద్! అనలాగ్ కేబుల్ ప్రసారాల నిలిపివేత ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి కేవలం డిజిటల్ ప్రసారాలే ఈ నెల 31 అర్ధరాత్రి నుంచే కొత్త మార్పులు తొలుత మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో అమలు వినియోగదారులు లక్షల్లో... సెట్‌టాప్ బాక్సులు వేలల్లో కొత్త సంవత్సరంలో టీవీ వీక్షకులకు తప్పని ఇబ్బందులు ప్రతీరోజు సీరియళ్లు, సినిమాలు, స్పోర్ట్స్, న్యూస్, వంటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వినోదం, విజ్ఞానం అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలు ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. అనలాగ్ టీవీ ప్రసారాలకు బదులు డిజిటల్ ప్రసారాలు రానున్నాయి. ఇందుకు తగ్గట్లుగా సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోని పక్షంలో టీవీలన్నీ మూగనోము పట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, డిమాండ్‌కు తగినట్టుగా సెట్‌టాప్ బాక్సులు లేకపోవడంతో కేబుల్ టీవీ వినియోగదారుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే బుల్లితెర వీక్షకులకు ఇబ్బందులు ఎదురుకానున్నారుు. హన్మకొండ కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తొలి దశలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలు, మలి దశలో హైదరాబాద్ వంటి నగరాల్లో కేబుల్ ప్రసారాలను డిజిటల్‌మయం చేశారు. మూడోదశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలనుడిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను డిసెంబరు 22న జారీ చేసింది. దీంతో మన జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. వీటి స్థానం లో డిజిటల్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. కేబుల్ టీవీ ప్రసారాలు పొందాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా సెట్‌టాప్ బాక్సును అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు తప్పవా కేబుల్ టీవీ డిజిటలైజేషన్ కోసం ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో దాదాపు రెండు లక్షల కేబుల్ టీ వీ కనెక్షన్లు ఉన్నాయి. 200 మంది వరకు కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు మాత్రమే సెట్‌టాప్ బాక్సులు సిద్ధంగా ఉంచుకున్నారు. వీరి దగ్గర కూడా తమ పరిధిలో ఉన్న కనెక్షన్లకు తగ్గట్లుగా బాక్సులు లేవు. దీంతో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. గత నెలరోజులుగా కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు అవగాహన కలిగిస్తున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. ఇప్పటి వరకు పదిశాతం లోపు కనెక్షన్లకే సెట్‌టాప్ బాక్సులు ఉన్నాయి. సెట్‌టాప్ బాక్సుల ధరలు ఇలా.. ప్రస్తుతం మార్కెట్లో స్టాండర్డ్ డెఫినేషన్, హై డెఫినేషన్ మోడళ్లలో సెట్‌టాప్ బాక్సులు లభిస్తున్నాయి. సెట్‌టాప్ బాక్సుల ఖరీదు ఎస్డీ మోడల్ రూ.1000 నుంచి రూ.1500 మధ్యన ఉంది. హెడ్డీ మోడల్ రూ.1700 నుంచి రూ.1900 ధరలో మార్కెట్లో లభ్యమవుతున్నా యి. నాణ్యత, ఫీచర్ల విషయానికి వస్తే ఎస్డీతో పోల్చితే హెడీ సెట్‌బాక్స్ బాక్సుతో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా సెట్‌టాప్ బాక్సులను కేబుల్ ఆపరేటర్లే వినియోగదారులకు అందిస్తున్నారు. -
ధర్మవరంలో ‘కేబుల్’వార్
రెండు ఛానళ్ల నిర్వాహకుల మధ్య ఘర్షణ వాతావరణం పోలీసులు ఓ వర్గం వారికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు అడకత్తెరలో పోకచెక్కలా ఆపరేటర్లు ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘కేబుల్’ టీవీ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి సద్దుమణిగేలా చూడాల్సిన పోలీసులు ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం కేబుల్ టీవీల వివాదాన్ని ఎస్పీ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందునుంచే ధర్మవరం పట్టణంలో ఓ కేబుల్ టీవీ నడుస్తోంది. అయితే ఎన్నికల అనంతరం స్థానికంగా మరో వర్గం కూడా కేబుల్ వ్యవస్థను ప్రారంభించేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో వారు ప్రస్తుతం నడుస్తున్న ఛానల్ కేబుల్ వైర్లను తొలగించి.. తమ వైర్లు ఏర్పాటు చేయడం ద్వారా కొత్తగా కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంతో రెండు ఛానళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ఆపరేటర్లను గూండాలతో బెదిరిస్తున్నారంటూ ఓ ఛానల్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కొత్త ఛానల్ వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే పోలీసులు కనెక్షన్లు తొలగిస్తున్నవారిపై కాకుండా తమపైనే కేసులు నమోదు చేశారని పాత ఛానల్ నిర్వాహకులు తెలిపారు. తాజాగా పాత ఛానల్లో పనిచేస్తే చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తనను బెదిరించినట్టు టెక్నీషియన్ కాటమయ్య వాపోయాడు. శనివారం మధ్యాహ్నం దాదాపు 20 మంది వ్యక్తులు తన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను తీవ్రస్థాయిలో దుర్భాషలాడటమేకాక.. తనకు ఫోన్ చేసి చంపుతామని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు ఆరోపించాడు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని చెప్పాడు. రెండు కేబుల్ నెట్‌వర్క్‌ల మధ్య యుద్ధం ఆపరేటర్లకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటిదాకా కేబుల్ నిర్వహిస్తూ జీవనం వెల్లదీస్తున్న తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని వాపోతున్నారు. కేబుల్ ప్రసారాలు అడ్డుకుని తమ కడుపు కొట్టొద్దని వేడుకుంటున్నా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ వివాదంతో వినియోగదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరంలో కేబుల్ టీవీల వివాదాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం ఎస్పీ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. కొందరు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ కేబుల్ ఆపరేటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎస్పీ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో విచారణ చేయించి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరుగుతోంది కేబుల్ టీవీల వివాదంపై పట్టణ డీఎస్పీ వేణుగోపాల్‌ను వివరణ కోరగా ‘పట్టణంలో జరుగుతున్న ‘కేబుల్’ సంబంధిత సంఘటనలపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఫిర్యాదులను విచారించి దోషులపై చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..’ అని చెప్పారు. - డీఎస్సీ వేణుగోపాల్ -
కేబుల్ టీవీ ఆపరేటర్ ఆత్మహత్య
బళ్లారి (తోరణగల్లు) : నగరంలోని నేతాజీనగర్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ (40) గురువారం ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతాజీనగర్‌కు చెందిన గుత్తి నవీన్ (40) కువెంపునగర్లో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు స్థోమతకు మించి అప్పులు చేయడంతో రుణదాతలు అప్పులు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని విమ్స్‌కు తరలించారు. కాగా మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
‘లెక్క’కు కసరత్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సమగ్ర సర్వే గడువు సమీపిస్తుండడంతో ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాను బ్లాకులుగా విభజించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ఒక్కో గణాంక సేకర్త (ఎన్యూమరేటర్)కు 25 గృహాల చొప్పున కేటాయిస్తూ ఎన్యూమరేషన్ బ్లాకులు తయారు చేస్తున్నారు. ఇప్పటికే వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు బ్లాకుల వారీగా జాబితాను ప్రాథమికంగా సిద్ధం చేసినట్లు సమాచారం. 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ సర్వేకు 40వేలకు పైగా సిబ్బంది అవసరమవుతారని లెక్కలు వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 40వేలకు పైనే ఉన్నారు. అయితే ఎన్యూమరేటర్లతో పాటు సూపర్వైజర్లు, జోనల్ ఆఫీసర్లు, మండల, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు కూడా అవసరముండటంతో మొత్తం ఎంత మంది అవసరమవుతారనే కోణంలో కూడా లెక్కలు వేస్తున్నారు. స్పష్టత లేని కుటుంబాల సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.69లక్షల కుటుంబాలున్నట్లు అంచనా. అయితే రెవెన్యూ విభాగం లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్య 9.91లక్షలు. మొత్తంగా 9.85లక్షల కుటుంబాలుంటాయని జిల్లా యంత్రాంగం అంచనాకు వచ్చింది. 2011 జనాభా లెక్కల తర్వాత జిల్లాలో మరో 1.16లక్షల గృహాలు నిర్మించామని గృహ నిర్మాణ సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఎన్ని కుటుంబాలుంటాయనే అంశంపై స్పష్టతకు రావాల్సి ఉందని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడించారు. విస్తృత ప్రచారంపై దృష్టి సర్వే సందర్భంగా ఇళ్లలో భౌతికంగా ఉండే వారి వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా నుంచి లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో సర్వే ఆవశ్యకత, సర్వే సందర్భంగా పాటించాల్సిన నిబంధనలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో ప్రతిరోజూ దండోరా వేయించడంతో పాటు పోస్టర్ల, కేబుల్ టీవీ ద్వారా విస్తత ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రియదర్శిని ‘సాక్షి’కి వెల్లడించారు. సర్వే సందర్భంగా వచ్చే ఎన్యూమరేటర్లకు చూపించేందుకు తగిన ఆధారాలు గృహ యజమానులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, విద్యుత్ బిల్లులు, పాసుపుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాల వంటి వాటిని నివాస ద్రువీకరణకు ఆధారాలుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లను సకాలంలో ఎంపిక చేసిన ప్రాంతానికి చేర్చేలా ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా అద్దెకు తీసుకుంటున్నారు. మరోవైపు సేకరించిన సమాచారాన్ని సకాలంలో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 1398 కంప్యూటర్లను సిద్ధం చేసినా 740 మంది కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సుమారు 550 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను డాటా ఎంట్రీ ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా సేకరించిన డేటా బేస్ తమ వద్ద సిద్ధంగా ఉన్నందున సర్వే ఏర్పాట్ల కసరత్తును 16 లేదా 17 తేదీలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ ప్రియదర్శిని వెల్లడించారు. -
పాతబస్తీ చానళ్లు.. పక్కా.. లోకల్
ఓల్డ్ సిటీ అనగానే ఇరుకు గల్లీలే గుర్తొస్తాయి. గల్లీలు ఇరుకైనా అక్కడి మనుషుల మనసులు విశాలం. రద్దీని చూసి రంది పడకుండా.. కొంచెం ఇష్టంగా ముందుకు నడిచి చూడండి. ఎక్కడి నుంచో సైగల్ గొంతు చెవుల్లో తేనెలు కురిపిస్తుంది. ఓ ఇంట్లోంచి ‘రిమ్జిమ్ గిరె సావన్’ అంటూ కిషోర్దా స్వరం తొలకరిలా కురుస్తుంది. గల్లీ నుంచి కొంచెం పక్కకు తిరిగితే.. ‘నువు పెద్దపులి నెక్కినావమ్మో.. గండిపేట గండి మైసమ్మ’ అంటూ.. ఓ భక్తిగీతం పరవశులను చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే.. ‘ఆదాబ్..!’ అంటూ హైదరాబాదీ ఉర్దూలో ఓ గొంతు ఆత్మీయంగా పలకరిస్తుంది. ఇది పాతబస్తీలో అడుగు పెడితే సొంతమయ్యే అనుభూతి. ఈ భిన్నత్వమే అక్కడ దాదాపు 100కు పైగా కేబుల్ చానల్స్ విజయవంతంగా నడిచేందుకు దోహదపడుతోంది! దక్షిణ మూసీ ప్రాంతమైన పాతబస్తీలో 120 వరకు కేబుల్ ఆపరేటర్లున్నారు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లుగా ఉన్నవాళ్లు కాస్తా ఇప్పుడు టీవీ చానళ్ల ఓనర్లయ్యారు. ఆశ్చర్యపోకండి. కేబుల్ టీవీ చానళ్ల ఓనర్లు. ఇందులో కొన్ని టీవీలు ఉర్దూ, తెలుగు భాషల్లో న్యూస్ బులెటిన్లను అందిస్తుండగా.. మరికొన్ని సినిమాలు, సినిమా పాటలతో నిరంతరం ప్రజలకు వినోదాన్నిస్తున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందటే... మీరాలంమండి రోడ్డులోని జహరానగర్లో ఆర్ఎంఎస్ చానల్ ఇరవయ్యేళ్ల క్రితం మొదటిసారిగా కేబుల్ టీవీ ప్రసారాలను ప్రారంభించింది. అనంతరం ఓల్డ్‌సిటీ కేబుల్ నెట్వర్క్ (ఓసీఎన్) పేరుతో మరో కేబుల్ టీవీ చానల్ ప్రసారాలు ప్రారంభించింది. తరువాతి కాలంలో చాలా చానళ్లు ప్రారంభమయ్యాయి. వందకు పైగా చానళ్లు.. 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఆప్తక్, సీసీఎన్, ఫిజా, ఎంక్యూ టీవీ, ఎన్ఎన్ఎస్ చానల్, మాస్ టీవీ, టీవీ-21, హైదరాబాద్ చానల్, శాలిమార్ చానల్, కృషి టీవీ, వీఆర్ టీవీ, మై టీవీ, ఎస్ఎం టీవీ, ఎఫ్ఎం టీవీ, నిషా టీవీ, నిషా ప్లస్ టీవీ, నిషా ఇస్లామిక్, వీ టీవీ, ఆర్ఎంఎస్ కేబుల్ టీవీ, మొఘల్ టీవీ, ఎంకే చానల్, జీ టీవీ, ఎస్ టీవీ, ఏషియన్ టీవీలతో పాటు మరికొన్ని స్థానిక కేబుల్ టీవీ చానళ్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయి.ఇవి వందకుపైగా ఉంటాయని అంచనా. ఇందులో 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఉర్దూ టీవీలు రోజూ ఉర్దూలో వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సత్వర స్పందన పాతబస్తీలో ఏ చిన్న సంఘటన జరిగినా ఈ ఉర్దూ కేబుల్ టీవీ చానళ్లు వెంటనే స్పందిస్తున్నాయి. ఒక్కోసారి సంఘటనా స్థలంలో చిత్రీకరించిన సంఘటనలన్నింటినీ ఎడిట్ చేయకుండా యథావిధిగా ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పండుగలకు రేటింగ్... కొత్త సినిమాలతో పాటు అక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి ఈ చానల్స్. హిందువుల ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు బోనాలు, అయ్యప్ప స్వామి పూజలు, వినాయక చవితి ఉత్సవాలు, దసరా, దీపావళి వేడుకలను ప్రత్యక్షంగా అందిస్తుండగా.. ముస్లిం ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు ఉర్సు ఉత్సవాలు, రంజాన్, మిలాద్-ఉన్-నబీ తదితర మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. పండుగలు, ఉత్సవాలప్పుడు లోకల్ చానల్స్ రేటింగ్ హైస్పీడ్‌లో పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆదాయ వనరులు ఎమ్ఎస్ఓలతో సంబంధం లేదు కాబట్టి ఆదాయం నెలవారీ ప్రకటనలే. ప్రతి రోజు స్క్రోలింగ్‌లతో పాటు విజువల్ యాడ్లను ప్రసారం చేస్తున్నాయి. స్థానికులు కచ్చితంగా చూసే ఈకేబుల్ టీవీల్లో యాడ్ ఇస్తే తమ కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారుల నమ్మకం. 24 గంటల పాటు స్క్రోలింగ్ రన్ చేసే ప్రకటనకు నెలకు రూ. 400 నుంచి 600 వరకు, గంటకోసారి ప్రసారం చేసే విజువల్ యాడ్స్‌కు నెలకు 1,500 నుంచి 2,000 వరకు లభిస్తుంది. ఇక భక్తి కార్యక్రమాలు, స్కూల్ యాడ్స్, వ్యాపార ప్రకటనల ప్యాకేజీలను కొనసాగిస్తున్నారు. అంతేనా.. లోకల్‌గా జరిగిన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్‌కి కూడా ఈ చానల్స్‌లో మంచి గిరాకీ. వ్యయం శాటిలైట్ టీవీ చానల్ ప్రారంభించడానికి ఖర్చు 20 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ కేబుల్ చానల్ నిర్వహణకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఒక సిస్టం, ఒక కెమెరా, కెమెరామెన్ చాలు.. చానల్ రన్ చేసేయొచ్చు. చిన్న కేబుల్ టీవీ చానళ్లు కేవలం ఇద్దరు సిబ్బందితో నడుస్తున్నాయి. టీవీ చానల్ గదితో పాటు ఇద్దరి జీతభత్యాలు, నెలసరి ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ ఇద్దరిలో ఒకరు నిర్వాహకులే ఉంటుండటంతో ఒక వేతనం కూడా తగ్గుతోంది. ఇక ఎలాంటి ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు లేకపోవడంతో నెలవారీ ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఆకట్టుకునే కార్యక్రమాలు ఖబర్నామా.. ఫోర్త్ టీవీ చానల్లో ప్రతిరోజూ ప్రసారమయ్యే ఫోర్త్ టీవీ ఖబర్నామా ఉర్దూ న్యూస్‌కి వ్యూయర్స్ ఎక్కువ. రాత్రి 7.30 గంటలకు, 10 గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు, ఉదయం 8 గంటలకు, 11.30 గంటలకు ప్రసారమయ్యే ఈ బులెటిన్లలో వార్తలన్నీ పాతబస్తీకే సంబంధించినవి కావడంతో స్థానికులు వాటిని మిస్ కావడంలేదు . దక్కనీ న్యూస్ హైదరాబాద్ పాతబస్తీ ఉర్దూ యాసలో ప్రసారమయ్యే ద క్కనీ న్యూస్ ఇక్కడి జనాల మోస్ట్ ఫేవరెట్ బులెటిన్. పరాయి భాషలో కాకుండా పక్కింటివాళ్లు విషయం చెప్పినట్టు ‘ఆదాబ్...’! అంటూ వార్తలను చేరవేయడం ఈ న్యూస్ ప్రత్యేకత. ప్రభుత్వ సహకారం కావాలి స్థానిక ప్రేక్షకులకు వినోదంతో పాటు ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, వార్తలను అందజేస్తున్న కేబుల్ టీవీ చానళ్లను ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించాలి. స్థానిక ఉత్సవాల సమయంలో సమాచార పౌర, సంబంధాల శాఖ ప్రభుత్వ ప్రకటనలను జారీ చేస్తే బాగుంటుంది. - మీర్ మెహదీ అలీ బాక్రీ సెన్సేషనల్ న్యూస్ సిండికేట్ (ఎస్ఎన్ఎస్) - పిల్లి రాంచందర్