సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సమగ్ర సర్వే గడువు సమీపిస్తుండడంతో ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాను బ్లాకులుగా విభజించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ఒక్కో గణాంక సేకర్త (ఎన్యూమరేటర్)కు 25 గృహాల చొప్పున కేటాయిస్తూ ఎన్యూమరేషన్ బ్లాకులు తయారు చేస్తున్నారు. ఇప్పటికే వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు బ్లాకుల వారీగా జాబితాను ప్రాథమికంగా సిద్ధం చేసినట్లు సమాచారం. 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ సర్వేకు 40వేలకు పైగా సిబ్బంది అవసరమవుతారని లెక్కలు వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 40వేలకు పైనే ఉన్నారు. అయితే ఎన్యూమరేటర్లతో పాటు సూపర్‌వైజర్లు, జోనల్ ఆఫీసర్లు, మండల, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు కూడా అవసరముండటంతో మొత్తం ఎంత మంది అవసరమవుతారనే కోణంలో కూడా లెక్కలు వేస్తున్నారు.
స్పష్టత లేని కుటుంబాల సంఖ్య
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.69లక్షల కుటుంబాలున్నట్లు అంచనా. అయితే రెవెన్యూ విభాగం లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్య 9.91లక్షలు. మొత్తంగా 9.85లక్షల కుటుంబాలుంటాయని జిల్లా యంత్రాంగం అంచనాకు వచ్చింది. 2011 జనాభా లెక్కల తర్వాత జిల్లాలో మరో 1.16లక్షల గృహాలు నిర్మించామని గృహ నిర్మాణ సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఎన్ని కుటుంబాలుంటాయనే అంశంపై స్పష్టతకు రావాల్సి ఉందని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడించారు.
విస్తృత ప్రచారంపై దృష్టి
సర్వే సందర్భంగా ఇళ్లలో భౌతికంగా ఉండే వారి వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా నుంచి లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో సర్వే ఆవశ్యకత, సర్వే సందర్భంగా పాటించాల్సిన నిబంధనలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో ప్రతిరోజూ దండోరా వేయించడంతో పాటు పోస్టర్ల, కేబుల్ టీవీ ద్వారా విస్తత ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రియదర్శిని ‘సాక్షి’కి వెల్లడించారు. సర్వే సందర్భంగా వచ్చే ఎన్యూమరేటర్లకు చూపించేందుకు తగిన ఆధారాలు గృహ యజమానులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, విద్యుత్ బిల్లులు, పాసుపుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాల వంటి వాటిని నివాస ద్రువీకరణకు ఆధారాలుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లను సకాలంలో ఎంపిక చేసిన ప్రాంతానికి చేర్చేలా ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా అద్దెకు తీసుకుంటున్నారు. మరోవైపు సేకరించిన సమాచారాన్ని సకాలంలో అప్‌లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
1398 కంప్యూటర్లను సిద్ధం చేసినా 740 మంది కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సుమారు 550 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను డాటా ఎంట్రీ ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా సేకరించిన డేటా బేస్ తమ వద్ద సిద్ధంగా ఉన్నందున సర్వే ఏర్పాట్ల కసరత్తును 16 లేదా 17 తేదీలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ ప్రియదర్శిని వెల్లడించారు.
‘లెక్క’కు కసరత్తు
Published Fri, Aug 8 2014 4:40 AM | Last Updated on Tue, Aug 27 2019 5:55 PM
Advertisement
Advertisement