వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కిషన్‌రెడ్డి | Union Minister Kishan Reddy Chaired The Meeting Of South Central Railway Officials | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కిషన్‌రెడ్డి

Published Thu, Oct 24 2024 3:04 PM | Last Updated on Thu, Oct 24 2024 4:23 PM

Union Minister Kishan Reddy Chaired The Meeting Of South Central Railway Officials

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్‌ రెడ్డి, కావ్య, రఘునందన్‌, డీకే అరుణ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చించారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్‌ పాసులు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ  లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని.. 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకొస్తాం. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు వేగవంతగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. రూ. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రైల్వే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసి, చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద సర్వీసును పొడిగిస్తున్నాం. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే పనుల కోసం సుమారు 6 వేల కోట్లు బడ్జెట్  మంజూరు అయింది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement