సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునే దిశగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయనాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా...కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లను బీజేపీ కైవసం చేసుకోవడం, పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌ను నిలబెట్టుకోవడం జాతీయ రాజకీయాల్లో శుభ పరిణామమని పేర్కొంది.
కేంద్రంలో మోదీ పదేళ్ల పాలనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సానుకూల పవనాలు వీచే అవకాశాలున్నందున, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగరవేసి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల కల్లా తెలంగాణలోనూ అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా ఓటింగ్ శాతం పెరగడంతో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముందు నుంచి పార్టీ ఆశించిన స్థాయిలో కాకపోయినా 8 సీట్లలో గెలిచి 30 లక్షలకు పైగా ఓట్లతో 14 శాతం ఓటింగ్ సాధించడం సానుకూల పరిణామం అనే అభిప్రాయాన్ని ఢిల్లీ నాయకత్వం వ్యక్తం చేసినట్టు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 శాతం ఓటింగ్‌ను గణనీయంగా పెంచుకుని, తొమ్మిది లేదా పది ఎంపీ సీట్లు గెలుచుకునే దిశలో పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని జాతీయనాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలో జరిగిన జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం
లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న కిషన్‌రెడ్డి
ఈ భేటీలో తెలంగాణ నుంచి కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గసభ్యుడు, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి.. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా జరిగిన చర్చా కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని విధాలుగా సమాయత్తమవుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం చర్యలు కొనసాగిస్తున్నామని, అవసరమైన చోట్ల సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయనాయకత్వానికి కిషన్‌రెడ్డి ఓ నివేదిక సమరి్పంచినట్టు పార్టీవర్గాల సమాచారం
బీసీ నినాదం ఫలించకపోవడంపై విశ్లేషణ జరగాలంటూ..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ తీసుకున్న బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జాతీయనాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపినా పార్టీకి ఓట్లు, సీట్ల పరంగా ప్రయోజనం చేకూరకపోవడంపై లోతైన విశ్లేషణ జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ బలంగా ఉందని భావించిన గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తదితర చోట్ల ఊహించని విధంగా బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం వల్లనే 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది.
28న రాష్ట్రానికి అమిత్ షా!
లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రంలోని పార్టీ మండల శాఖ అధ్యక్షులు మొదలు రాష్ట్రస్ధాయి నేతల వరకు హాజరయ్యే కీలక సమావేశానికి ఆయన రానున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏయే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి, ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్‌షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment