తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు (chaganti koteswara rao) అవమానం జరిగింది. తిరుమలకు ఏడాదికి ఒకసారి వచ్చే ఆయనపై టీటీడీ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా దర్శన సమయంలో వయసు రీత్యా బయోమెట్రిక్ నుంచి ఆయన వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ చాగంటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే గురువారం సాయంత్రం ఆరు గంటలకు తిరుపతి (Tirupati) మహతిలో ఆయన ప్రవచనం చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాలను టీటీడీ రద్దు చేసింది. ఎక్కడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
19న ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై గురువారం సాయంత్రం టీటీడీ (TTD) పరిపాలన భవనంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. 19వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున ఈ టోకెన్లపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ చందోలుతో ఈవో సమీక్షించారు.
వైకుంఠ ద్వార దర్శనం చివరిరోజు ఈ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 20వ తేదీన దర్శనానికి 19న ఈ టోకెన్లు జారీ చేయరు. వారు సర్వదర్శనం క్యూలోనే దర్శనం చేసుకోవాలి. 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయరు. 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఈ కారణంగా జనవరి 19న బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.
ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా శ్రీవారి కల్యాణాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో జరిగే శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
చదవండి: మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులు
ఈ నెల 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను తగినంతగా సమకూర్చుకోవాలని చెప్పారు.
మహా కుంభమేళాలో నృత్య నీరాజనం
ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో తిరుపతి కళాకారులు అద్భుత నృత్య కళా ప్రదర్శనలతో నీరాజనాలు అర్పించారు. మహా కుంభమేళా వద్ద శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం స్వామివారి ఊంజల్ సేవ అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఉమాముద్దుబాల ఆధ్వర్యంలో కళాకారులు శాస్త్రీయ నృత్యాభినయాలతో భక్తులను విశేషంగా ఆకట్టున్నారు.
కళాకారులు శరత్‌చంద్ర, శివప్రసాద్, ఉషాశ్రీ, వీణ శర్మ, హేమలతలు పుష్పాంజలితో ఆరంభించి.. శ్రీమన్నారాయణ, శివతాండవం, భో.. శంభో.. ఇట్టి ముద్దులాడే బాలుడు, వినాయక కౌతం, దశావతారం, అష్టపది, ముద్దుగారే యశోద.. వంటి కీర్తనలకు చక్కటి హావభావాలు, అభినయంతో నృత్యం చేసి అందరిలోనూ భక్తిపారవశాన్ని నింపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయడం తమ పూర్వ జన్మ సుకృతమని శరత్‌చంద్ర బృందం ఆనందం వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment