Chaganti Koteswara Rao
-
తిరుమలలో చాగంటికి అవమానం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు (chaganti koteswara rao) అవమానం జరిగింది. తిరుమలకు ఏడాదికి ఒకసారి వచ్చే ఆయనపై టీటీడీ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా దర్శన సమయంలో వయసు రీత్యా బయోమెట్రిక్ నుంచి ఆయన వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ చాగంటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గురువారం సాయంత్రం ఆరు గంటలకు తిరుపతి (Tirupati) మహతిలో ఆయన ప్రవచనం చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాలను టీటీడీ రద్దు చేసింది. ఎక్కడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.19న ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంతిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డీ టోకెన్లపై గురువారం సాయంత్రం టీటీడీ (TTD) పరిపాలన భవనంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. 19వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున ఈ టోకెన్లపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ చందోలుతో ఈవో సమీక్షించారు. వైకుంఠ ద్వార దర్శనం చివరిరోజు ఈ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 20వ తేదీన దర్శనానికి 19న ఈ టోకెన్లు జారీ చేయరు. వారు సర్వదర్శనం క్యూలోనే దర్శనం చేసుకోవాలి. 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయరు. 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఈ కారణంగా జనవరి 19న బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా శ్రీవారి కల్యాణాలుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో జరిగే శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చదవండి: మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులుఈ నెల 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను తగినంతగా సమకూర్చుకోవాలని చెప్పారు.మహా కుంభమేళాలో నృత్య నీరాజనంప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో తిరుపతి కళాకారులు అద్భుత నృత్య కళా ప్రదర్శనలతో నీరాజనాలు అర్పించారు. మహా కుంభమేళా వద్ద శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం స్వామివారి ఊంజల్ సేవ అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఉమాముద్దుబాల ఆధ్వర్యంలో కళాకారులు శాస్త్రీయ నృత్యాభినయాలతో భక్తులను విశేషంగా ఆకట్టున్నారు. కళాకారులు శరత్చంద్ర, శివప్రసాద్, ఉషాశ్రీ, వీణ శర్మ, హేమలతలు పుష్పాంజలితో ఆరంభించి.. శ్రీమన్నారాయణ, శివతాండవం, భో.. శంభో.. ఇట్టి ముద్దులాడే బాలుడు, వినాయక కౌతం, దశావతారం, అష్టపది, ముద్దుగారే యశోద.. వంటి కీర్తనలకు చక్కటి హావభావాలు, అభినయంతో నృత్యం చేసి అందరిలోనూ భక్తిపారవశాన్ని నింపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయడం తమ పూర్వ జన్మ సుకృతమని శరత్చంద్ర బృందం ఆనందం వ్యక్తంచేసింది. -
చాగంటి కోటేశ్వరరావు నియామకం సరికాదు
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘ఫ్యూడల్ విధానాలను ప్రచారం చేసే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలనే నేర్పుంచేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచన చేయండి..’ అని సీఎం చంద్రబాబుకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన వర్చువల్‌గా సభ నిర్వహించారు. 72 మంది విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగ విలువలు ప్రచారం చేయాలి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదిగా ఉండే విలువలు ఆధునిక జీవితానికి అవసరం. మన భవిష్యత్ తరాన్ని పురాణయుగంలోకి మళ్లించడం మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో ప్రభుత్వం గుర్తించాలి. సంకుచిత కుల, మత, ప్రాంతీయ దృక్పథాలకతీతంగా భావితరం ఎదిగినప్పుడే మనం గొప్పగా చెప్పుకొంటున్న లక్ష్యాల్ని చేరుకోగలం. దీనికి తగినట్టుగా మన విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు పౌరాణిక నీతులు ఎంతవరకు పనికొస్తాయో ఆలోచించాలి..’ అని లేఖలో పేర్కొన్నారు. చదవండి: ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్సంతకాలు చేసినవారిలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా, అఖిల భారత లాయర్ల సంఘం అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు గడ్డం కోటేశ్వరరావు, ప్రజాశక్తి సంపాదకుడు శర్మ, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకుడు బుడ్డిగ జమిందార్, మ్యూజిక్ అకాడమీ అవార్డు గ్రహీత ద్వారం దుర్గాప్రసాదరావు, విద్యావేత్తలు ప్రొఫెసర్ అంజయ్య, రమేష్ పట్నాయక్ తదితరులు ఉన్నారు. చదవండి: రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలొద్దు.. ఏపీ హైకోర్టు -
ఏది ధర్మం? ఏది అధర్మం?
పంచ మహాయజ్ఞాలలో మొదటిది అధ్యాపనం అంటే ఒకరికి చెప్పడం. మరొకరికి చె΄్పాలంటే ముందు మనం చదవాలిగదా! దేనికోసం... కర్తవ్యమ్. అదేమిటో ముందు మనం తెలుసుకోవాలి. అంటే కర్తవ్యమే ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. నిరంతరం మారి΄ోతుంటుంది. ఎప్పుడు ఏ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పవలసివస్తే... చెప్పేవారు.. ఎవరి మనోభావాలనుబట్టి వారు చెవుతుంటారు. నాకేది ఇష్టమో నేనదే ధర్మమని చెబుతా. ఇంకొకాయన ఆయనకు నచ్చినది ధర్మమని చెబుతాడు. అప్పుడు నిజానికి ఏది ధర్మం?ధర్మం చెప్పడానికి ఒక ప్రమాణం ఉండాలి. అది ఏది అంటే ... యోగమే. యోగం ఎవరు ? భగవంతుడే. నాకూ నా ఊపిరికీ తేడా లేదు. నేను ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతకాలం ‘నేను’ ఉన్నాను–అంటారు. నా ఊపిరే నా వాక్కుగా మారుతున్నది. అలాగే భగవంతుని ఊపిరి వాక్కుగా మారితే అదే వేదం. అందుకే భగవంతుడికీ, వేదానికీ వ్యత్యాసం ఉండదు. వేదం ఎంత సనాతనమో భగవంతుడంత సనాతనం. భగవంతుడిని ఎవరూ సృష్టించలేదు. ఆయనే అన్నీ సృష్టించాడు. వేదం కూడా అంతే.. అ΄ûరుషేయం. దానిని ఎవరూ రాయలేదు. అందుకే వేదం, ఈశ్వరుడూ ఒకే స్వభావంతో ఉంటారు. కారణం – నిజానికి అవి రెండు కాదు కాబట్టి. అటువంటి వేదం ధర్మం చెప్పడానికి మొదటి ప్రమాణం.నేను వేదం చదువుకోలేదని ఎవరయినా అంటే!!! వేదాంతర్గతమైన ఆచార సంబంధ నియమాలను రుషులు క్రోడీకరించి ఇచ్చారు. గౌతముడిస్తే అది గౌతమ స్మృతి అయింది. అత్రి ఇస్తే అత్రి స్మృతి, యాజ్ఞవల్క్యుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి.. అలా ఈ స్మృతి గ్రంథాలు ప్రమాణం. ఆవువెంట దూడ ఎలా వెడుతుందో శ్రుతి వెంట స్మృతి అలా వెడుతుంది..అంటాడు కాళిదాసు. కాబట్టి శ్రుతి తరువాత స్మృతి ప్రమాణం.స్మృతిగ్రంథాలు కూడా తెలియవని అంటే...!!! పురాణం ప్రమాణం. పురాణం జరిగి΄ోయిన చరిత్ర కాదు. కల్పింపబడిన కథ కూడా కాదు. జాగ్రత్తగా పరిశీలించండి... కల్పనయితే అందులో రచయిత వేరు, కథావస్తువు వేరుగా ఉంటుంది. అందువల్ల ఇది కల్పన కాదు. పురాణాలను ఇతిహాసములు–అంటారు. ఇతిహాసం... అంటే ‘‘ఇది ఇట్లే జరిగినది. అందులో అనుమానం లేదు’’... అని.రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం. ఆయనది పాత్రకాదు. అందులో ఒక వ్యక్తి. అలాగే భారతంలో, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం. అంతేకానీ వ్యాసుడు వేరు, భారత భాగవతాదులు వేరు కావు. అది వాళ్ళ కాలంలో యధార్థంగా జరిగిన విషయాలను వాళ్ళు రచించి మనకిచ్చారు. అవి జీవుడి ప్రస్థానాన్ని పూర్తిగా చెబుతాయి. అందుకే పురాణాలు చదివితే ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందువల్ల పురాణం ప్రమాణం.నాల్గవది. శిష్టాచారం. యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరోజనః / స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే’’ అంటాడు గీతాచార్యుడు. శ్రేష్టులయినవారు, శాస్త్రమెరిగినవారు... లోకంలో ఎలా ప్రవర్తిస్తారో దాన్ని మిగిలినవారంతా అలా అనుకరిస్తారు’’ అని. ధర్మం చెప్పడానికి, అనుసరించడానికి ఈ నాలుగు మార్గాలు ్రపామాణికం. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: పంచ మహాయజ్ఞం
పంచమహా యజ్ఞం అని ఐదు యజ్ఞాలు నిరంతరం జరిగే ప్రదేశం గహస్థాశ్రమం. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినవారు ఈ ఐదింటిమీద శ్రద్ధపెట్టి ఉండాలి. అందుకే దీనిని యజ్ఞం అని వదిలేయకుండా మహాయజ్ఞం అని అన్నారు. సాధారణంగా యజ్ఞం అంటే అగ్నిముఖంగా హవిస్సును ఇవ్వడం ఉంటుంది. స్వాహాకారంతో అగ్నిహోత్రుడిని పిలిచి ఇచ్చిన హవిష్యాన్నం దేవతలకు అందచేయడానికి ..అని యజమాని సంకల్పం చేస్తాడు. కానీ అగ్ని ఆరాధనం పంచ యజ్ఞాలలో అంతర్భాగం అయినప్పటికీ ... మిగిలిన నాలుగింటినీ కూడా యజ్ఞాలనే పిలిచారు. వీటినే మహాయజ్ఞాలని అన్నారు. అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది. దీనికి ప్రత్యేకంగా హోమశాలకానీ, ప్రత్యేకంగా మంత్రభాగం కానీ అవసరం లేకుండా ప్రతివారు కూడా శ్రద్ధతో అనుసరించాల్సిన విషయాలు ఈ ఐదింటిలో అంతర్లీనంగా ఉంటాయి. ‘‘నేను ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు దీనిని ధన్యం చేసుకుని తరించడానికి ఈ ఐదు ఆలంబనాలు. వీటిని ఊతంగా చేసుకుని తరించాలి’’ అని గృహస్థు భావిస్తాడు. అందుకే ఇవి గృహస్థాశ్రమంలోనే నడుస్తాయి.వీటిలో మొదటిది – అధ్యాపనం బ్రహ్మయజ్ఞః–అంటారు. అధ్యాపనం అంటే బోధ చేయడం. బోధ చేయడాన్నే బ్రహ్మ విద్య.. అంటారు. బోధ దేనికి! మనిషి తరించడానికి ఇది మార్గాన్ని చెబుతుంది. సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే.. అది ఏది పట్టుకోవాలో చెబుతుంది, ఏది పట్టుకోకూడదో చెబుతుంది. పట్టుకోకూడదన్నంత మాత్రం చేత అదంత సులభసాధ్యం కాదు కాబట్టి పట్టుకోకుండా ఉండడానికి ఎటువంటి మనస్తత్వాన్ని సాధించుకోవాలో ఇది బోధ చేస్తుంది. అది మన రుషుల ప్రత్యేకత.మనకు సంవత్సరం ఆరంభంలో అంటే సంవత్సరాదినాడు చేదుపచ్చడి తినిపిస్తారు. సంవత్సరం పూర్తి ఎప్పుడు.. అంటే చాంద్రమానంలో కాదు, ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య కాదు, సౌరమానంలో వచ్చే భోగి పండగను ప్రమాణం చేస్తారు. భీష్మ ఏకాదశి, కష్ణాష్టమి, మహాశివరాత్రి, శ్రీరామనవమిల లాగా తిథులతో కూడుకుని రాదు. భోగికి తిథి ఉండదు. దక్షిణాయనానికి చిట్టచివర వచ్చేది.. భోగిపండగ అవుతుంది. దక్షిణాయనం ఉ΄ాసనా కాలం. ఉపాసన కష్టంగా ఉంటుంది. పరిశ్రమ చేయడానికి, ఉపాసన చేయడానికి సిద్ధపడితే అది చేదు తినడం.. కష్టపడాలి కాబట్టి ఉగాది పచ్చడిని ప్రారంభంలో తినిపిస్తారు. కష్టపడడం దేనికి! తరించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఈశ్వరుడు పెట్టుబడిగా ఇచ్చిన శరీరాన్ని సాధన ద్వారా సిద్ధపరచాల్సి ఉంటుంది.ఎవరు కష్టపడ్డారో, ఎవరు ఉగాదినాడు చేదు పచ్చడి తిన్నారో, వారు భోగినాడు పొంగల్.. మధుర పదార్థం తింటారు. అంటే భోగం అనుభవించే అర్హత పొందుతారు. ఏ ఉపాసన చేయకుండా, ఏ శాస్త్రాన్నీ పాటించకుండా, ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని ధన్యం చేసుకోకుండా భాగ్యం కావాలంటే సాధ్యం కాదు. ఇవన్నీ బోధించి గహస్థాశ్రమ ప్రవేశం చేయించి, అక్కడ విధివిధానాలు సక్రమంగా నిర్వర్తించేటట్లు బోధించడమే ..అధ్యాపన యజ్ఞం. అంటే ఒకరికి చెప్పడం.. అదెప్పుడు సాధ్యం. ముందుగా మన చదివి ఉంటేనే కదా.. దేనికోసం చదవాలి....అంటే ఇది మన కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది. -
పూజ ఎందుకు చేయాలి !
గృహస్థాశ్రమ వైశిష్ట్యంకొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ...’’ ..వెళ్ళవలసిందే. తప్పదు... వాడుంటే చాలు.. తనూభవుడు... ఒక ఊరట. ‘‘ఆత్మావై పుత్రనామాసి...’’ (ఓ పుత్రా! నేనే నువ్వు) ఈశ్వరుడు ఎంత ఊరట కల్పించాడో చూడండి!!! మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది...అంటే వివాహం వల్ల. ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం... ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తడవవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం.తరువాత.. వైరాగ్య సుఖం... అదెట్లా రావాలి! రామకృష్ణ పరమహంస– ‘బొట్టుబొట్టుగా రాదు, వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది’..అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్ళీ మునుపటి జీవితంలోకి రాడు.. ‘‘యోగరతో వాభోగరతోవా/సం^గరతో వా సంగవిహీనః /యస్య బ్రహ్మని రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ...’’.. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం. ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం– కృతజ్ఞత కలిగి ఉండడం.‘‘బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా / నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః’’అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధ కాండలో. ఎవరికయినా నిష్కృతి ఉందేమో కానీ, పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు.ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం... అందుకే..ఏష ధర్మః సనాతనః(ఇదీ మన సనాతన ధర్మం) అంటారు రామాయణంలో. బద్దెన గారు కూడా..‘‘ఉపకారికినుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’.. అన్నారు కదా! అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి... అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి. ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చీరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం.హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడితో.. ‘అనుదిన సంతోషణములు/జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్/తనయుల సంభాషణములు/ జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‘ అంటాడు. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ ఐదు ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పెళ్ళి.. ఎందుకోసం?
గృహప్రవేశం చేయాలి. అప్పుడు యజుర్వేదం అంతా మనకు వచ్చా, రాదా అన్న దానితో సంబంధం లేదు. గృహప్రవేశ సందర్భంలో రాముడేం చేసాడో ఆ ఘట్టం చదువుకుంటే చాలు... ఓహ్, గృహప్రవేశం ఇలా చేయాలన్న మాట.. అన్నది తెలుస్తుంది. తండ్రిగారికి తద్దినం పెట్టాల్సి వస్తే రాముడేం చేశాడో చదువుకుంటే సరిపోతుంది. అది పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టాలని అర్థమవుతుంది. అందుకే వేదం రామాయణంగా ప్రవర్తించింది. చంద్రవంశాన్ని అంతటినీ వ్యాసుడు రచించాడు. సూర్యవంశాన్ని అంతటినీ కూడా వాల్మీకి వర్ణించాడు. సూర్యుడు, చంద్రుడు పగలూ రాత్రి ప్రకాశిస్తారు. ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక రోజు పూర్తవుతుంది. వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందించారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్ఠాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసామాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం చేసారు.వివాహం ఎంత గొప్పది! వివాహం అంటేనే విశిష్టమైనది–అని. దానిని మనకు సం్ర పాప్తింప చేయడానికి జరిపే సంస్కారమే వివాహం. అది ఏదో సరదాకోసం కాదురా నాయనా, వివాహం చేసుకుంటా నంటున్నావు కదా, ముందు దానిగురించి, దానిలోని ధర్మసూక్ష్మాలను గురించి తెలుసుకో. వివాహం అంటే విశిష్టమైనదానిని ΄పోందుట. మరి ఆ విశిష్టమైనదేది? అదే మోక్షం. దీనిని ΄÷ందడానికి యోగ్యమైనది ధర్మానుష్ఠానం. అది సక్రమంగా జరగకుండా దానికి అడ్డుపడుతున్నవి ఏవి? అర్థకామాలు రాగద్వేషాలయి ΄ాపపుణ్యాలకు, పునర్జన్మలకు కారణమవుతాయి. అలాకాకుండా దానిని ధర్మబద్ధం చేసి పాశాలు విడిపోవడానికి సంసార ప్రవేశం జరగాలి. అటువంటి గృహస్థాశ్రమంలోకి నీవు ప్రవేశిస్తున్నావు. అలా ప్రవేశించి రాముడేం చేసాడో తెలుసా? సీతారామకళ్యాణ ఘట్టం చూడు. అక్కడ సీతమ్మ ఏం చేసింది ? అసలు పెద్దవాళ్ళనే వాళ్ళు పెళ్ళికూతురిని, పెళ్లికొడుకుని కూర్చోబెట్టి ఏం మాట్లాడారో పరిశీలించు. పెద్దరికం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే సంసారంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి, కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతో రుషులు దేశకాలాలతో సంబంధం లేకుండా సర్వకాలాల్లో సర్వజనులకు ఉపయోగపడే విధంగా వాటిని అందించారు. అటువంటి రుషుల రుణం మనకు జన్మతః ఉంది.మీరు ఎంతో చదువుకున్నారు... సరే. మంచిదే. నేను చదువును తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ చదువుతో ΄ాటుగా నిత్యజీవితంలో మనిషి మనిషిగా ఉండడానికి కావలసిన మానవత్వాన్ని నిలబెట్టడం చాలా అవసరం. అలా అది నిలబడాలంటే... రామాయణం, భారతం తదితర గ్రంథాలను బాగా పరిశీలించాలి. అవి నిత్యపారాయణకు యోగ్యత ఉన్న గ్రంథాలు. వాటిని కనీసం రోజుకో అధ్యాయం చొప్పున అయినా చదువుకుంటూ ఉండాలి. ఇంటిపట్టున పెద్దవాళ్ళు పిల్లలతో వాటిగురించి తరచూ మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల ధార్మిక జీవనం అలవడడమేగాక, మనుషుల్లో మానవత్వం మిగులుతుంది. అది లేనప్పుడు మీరు సమకూర్చుకున్న జ్ఞానం, ప్రతిభా΄ాటవాలు సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చు. -
కన్నతల్లే త్రిమూర్తి స్వరూపం
అనంతపురం/కల్చరల్: బిడ్డల జీవితాలను సంపూర్ణంగా తీర్చిదిద్దే తల్లే సృష్టి లయకారిణిగా విరాజిల్లే త్రిమూర్తి స్వరూపమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ‘ధర్మ వర్థ ని’ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సాగిన ప్రవచనామృత కార్యక్రమం ఆదివారం రాత్రి అంతే ఘనంగా ముగిసింది. ‘మాతృ చతుష్టయం’ అంశఽంపై ఆదివారం ఆయన ప్రవచించారు. మాతృమూర్తిని సాక్షాత్తూ జగన్మాతగా అభివర్ణిస్తూ పురాణేతిహాస ఘట్టాలను ఉటంకిస్తూ చేసిన ప్రసంగం అమితంగా ఆకట్టుకుంది. భగవంతుడు తాను అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అటువంటి తల్లిని పూజించిన ప్రతి బిడ్డా ఉత్తమంగా జీవిస్తాడని అన్నారు. భగవన్మాసరణ సమస్త పాపాలు తొలగిస్తుందని, అంతటి పుణ్యకార్యానికి కన్నతల్లి బాసటగా నిలుస్తుందన్నారు. సృష్టిలో అన్ని రుణాలు తీరే మార్గాన్ని శాస్త్రాలు సూచించినా, తల్లి రుణం తీర్చే మార్గాన్ని చూపలేదన్నారు. కేవలం తల్లిని పూజించడం ద్వారా మాత్రమే ఆమె రుణం తీరుతుందన్నారు. ఈ సందర్భంగా మాతృవందనం కార్యక్రమాన్ని ఆలోచణాత్మకంగా నిర్వహించారు. జేఎన్టీయూ అనంతపురం వీసీ డాక్టర్ జింకా రంగజనార్ధన, రిజిస్ట్రార్ సి. శశిధర్, ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డి, ధర్మవర్ధిని ట్రస్టు అనంతపురం ఇన్చార్జి సుధీర్ పాల్గొన్నారు. -
చాగంటి తో విభేదాల పై గరికపాటి మాటల్లో
-
శారదా నవరాత్రి మరియు సరస్వతి పూజ..!
-
నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో...తెలుసా ?
-
దీపావళి - ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
-
ధన త్రయోదశి రోజున పూజ ఏ విధంగా చేయాలి ?
-
మన శరీరానికి విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత ఏంటి..?
-
సైన్స్ ఆగిపోయిన సమయాన ..
ఆపిల్ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త. ‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు. ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే ఇన్వెన్షన్. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్ మాటల్లో తెలుస్తున్నది. మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు. మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు. మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా. -
కంటికి కనబడని ఆభరణం
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే. ‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం. శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి. ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జనం కోసం...
అంబేద్కర్‌గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. దేశంలో పీడితవర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పరిశ్రమించినవాడు. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుష్టించి, అనుసరించి, పరిపాలన చేసుకోగలుగుతున్నాం అంటే దానికి ఆయన ప్రధాన కారకులు. రాజ్యాంగ నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. ఆయన చెప్పిన ఒక మంచి మాట – ’నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తావు’ అని! సర్వసాధారణంగా ఏ వ్యక్తి అయినా మొట్టమొదట తన గురించే ఆలోచిస్తాడు. ‘నాకోసం నేను బతకాలి. నేను బాగుండాలి, నా భార్యాబిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి’ అని ఆశిస్తాడు. కేవలం నాకోసం నేను జీవించాలనుకోవడం తప్పుకాకపోవచ్చు. పరిధి పెరిగి తనకన్నా సమాజం గొప్పదనీ, తన ఇంటికన్నా దేశం గొప్పదనీ ఆలోచించాలి. అందరికోసం జీవించినవారు ధర్మాత్ములు. అటువంటి వారు కొన్ని కోట్లమందికి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పొంది ఉంటారు. అటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఎందరో ప్రభవించారు. స్వాతంత్య్ర సమర సమయంలో తమ ప్రాణాలను గడ్డిపోచకింద భావించి జీవితాంతం జైలుజీవితం అనుభవించినవారున్నారు. ఏకాంతవాసం చేసినవారు, ప్రవాస జీవితం గడిపిన వారు, ద్వీపాంతర జీవితం గడిపినవారు, లాఠీదెబ్బలు తిన్నవారు, తుపాకీ గుళ్ళకు ఒరిగిపోయినవారు, అంగవైకల్యం పొందినవారు, కుటుంబాలు పోగొట్టుకున్నవారు, ఆర్థికంగా చితికినవారు, .. ఇటువంటి మహాత్ములు ఎందరో... ఎవరికోసం అదంతా... ఈ దేశంకోసం.. ఈ దేశ ప్రజల కోసం.. ఈ ఉదాత్త భావన ఆనాడు దేశ ప్రజలందరిలో ఎంతగా పొంగిపొర్లుతూ ఉండేదంటే... వినోబా భావే భూదానోద్యమం ప్రచారానికి దేశమంతటా తిరుగుతూ తమ తమ ప్రాంతాలకు వస్తే... చిన్నకమతాల దగ్గరనుండీ వందల, వేల ఎకరాల భూమిని నీళ్ళలా దానం చేసేసారు.. దాదాపు 42 లక్షల ఎకరాల భూమి పంచిపెట్టడానికిగాను ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గ్రామం ఆయనకు దానమిచ్చేసారు. సంపద ఉంటే సంపద దానం లేకుంటే దేశంకోసం శ్రమదానం చేసారు. ఇదీ నలుగురికోసం బతకడం అంటే... అంబేద్కర్ చెప్పినది ఇదే...ఇలాంటి త్యాగబుద్ధి ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేశంమంటే నేను, నా కుటుంబం అనే కాదు, దేశమున్నది నాకోసం, నా కుటుంబం కోసం మాత్రమే కాదు...పరిధి దాటాలి, కుటుంబం పరిధి, ఊరు పరిధి... ఈ దేశం మనది అన్న భావన, మన దేశం బాగుపడడం కోసం మనం ఏ చేద్దామనే భావన ప్రతి ఒక్కరిలో రగులుతూ ఉండాలి. ఒకరిన చూసి మరొకరు స్ఫూర్తి పొందాలి... అప్పడు మనం మహాత్మాగాంధీలను, అంబేద్కర్లను... రోజూ చూస్తూనే ఉండవచ్చు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నీలోని నువ్వు చెప్పేది విను...చాలు
ధర్మం చెప్పడానికి లోకంలో ఉన్న ఐదు ప్రమాణాలలో ఒకటి అంతరాత్మ ప్రబోధం. అది మనిషికి ఎప్పుడూ లోపల ఉండే ధర్మాన్ని చెబుతుంటుంది. చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు... లోపలినుంచి ఒక సణుగుడు వినిపిస్తుంటుంది. ‘‘ఎందుకు చేస్తున్నావు... నలుగురి లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు. తప్పుచేసి మచ్చ తెచ్చుకోకు, నామాట విను... దానికి దూరంగా ఉండు..’’అని లోపలి నుంచి ఘోషిస్తుంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా ఒక్క అంతరాత్మ మాత్రమే ఒక ప్రశ్నతో మిమ్మల్ని నిలదీస్తుంటుంది. ‘ఇది చేయవచ్చా ?.. అని! అలా నిలదీస్తున్నందుకు దాని గొంతు పిసికేయకూడదు. అదేం చెబుతుందో ఓపికగా విని ఆలోచించినవారిని ‘‘శ్రద్ధ కలిగిన వారు’’ అంటారు. అలా ఎందుకడుగుతుంది అంటే... అప్పటికే ఆయన.. శారీరక, మానసిక సుఖాలకోసం దిగజారిపోయాడు. అయినా అది మాత్రం హెచ్చరిస్తూనే ఉంటుంది. దాని మాట విన్నవాడు మహాత్ముడవుతాడు. శరీరంలో శక్తి, ఇంద్రియాలకు పటుత్వం, మనసులో విజృంభణ ఉందని సుఖాన్ని పొందడం మంచిది కాదు. ఎవరూ కూడా మొదటినుంచే నూరు శాతం నిలకడగా ఉండలేరు. అది అంత తేలికేం కాదు కూడా. కానీ లోపలిమనిషి చెబుతున్నవాటిని శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే.. క్రమేణా ఆచరణలో కూడా అలవాటవుతుంది. అదే ధర్మంగా నడుచుకోవడం అంటే. మహాత్మాగాంధీ మొదటిసారి లండన్ బయల్దేరుతున్నప్పుడు... మద్యం, మాంసం, మగువలకు వశపడే అవకాశాలు అక్కడ ఎక్కువని వినడం వల్ల తల్లి అనుమతి నిరాకరించింది. వారి కుటుంబ శ్రేయోభిలాషి అయిన ఒక స్వామీజీ జోక్యం చేసుకొని ..‘‘ఏ కారణం చేత కూడా ఈ మూడింటికీ వశపడను’’ అని తల్లికి ప్రమాణం చేయించి పంపారు. తల్లి భయాలే నిజమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక స్త్రీతో ఆయనకు హద్దులు దాటిన సంబంధం ఏర్పడుతున్న క్షణాల్లో ఉన్నట్టుండి అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది. ఆయన వెంటనే వెళ్ళిపోయి.. తరువాత ఆ స్త్రీకి నిజాయితీగా ఒక ఉత్తరం రాస్తూ... తనకు పెళ్ళయిందనీ, ఒక కుమారుడు కూడా ఉన్నాడనీ, ముందుగా ఈ విషయాలు చెప్పకపోవడం తప్పేనని, తనను క్షమించాలని కోరాడు. అదీ అంతరాత్మ ప్రబోధం అంటే. అదీ లోపలున్న మనిషి మాటను నువ్వు వినడం అంటే.. ఇటువంటిదే మరో సంఘటన జరిగినా.. మనసు మాట విని దానికి దూరంగా జరిగాడు... వీటిని నెమరేసుకుంటూ ఆయన ఇలా రాసుకున్నారు... ‘‘భక్తి అనేది మనిషిలో ఉన్న విశృంఖలత్వాన్ని తుడిచేస్తుంటుంది. ఇంటిని ఏ కారణం తో శుభ్రపరుచు కుంటుంటామో... మనసును కూడా భగవద్భక్తి అనే చీపురుపట్టి లోపలి మాలిన్యాలను శుభ్రపరుచుకుంటుండాలి. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు అంతరాత్మ మాట విని ధర్మమార్గంలోనే నడుస్తుంటుంది. సుఖాలకోసం పక్క చూపులు చూడదు.’’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మనసే దేవాలయం
మన ఊరు: ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత సంపాదించినా.. సొంత ఊళ్లో లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. కనీసం పండగలు, పబ్బాలకైనా అక్కడ కాలు మోపకపోతే జీవతమే వృథా అనిపిస్తుంది. మన గుడి: ఊరు అన్నాక గుడి ఉంటుంది.. బాల్యం అన్నాక ఆ గుడిలో తిరిగే ఉంటాం. కులమతాలకు అతీతంగా ఆడిపాడుతూ కలిసి తిరిగే చోటు కావడంతో ప్రతి ఒక్కరి జీవితం ఈ గుడితో ముడిపడి ఉంటుంది. మన బాధ్యత: ఓ సినిమాలో చెప్పినట్లు తిరిగివ్వకపోతే లావై పోతాం. ఇది అక్షరాలా నిజం. పుట్టిన ఊరును మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే. ఇక తిరగాడిన గుడి కూడా అంతే. దేవాలయాన్ని శుభ్రం చేస్తే మనసును కడిగేసినట్లే. ‘‘అక్కా ఆ పొరక ఇలా అందుకో.. అన్నా ఆ చెట్టు కొమ్మలు కత్తరిద్దాం.. తమ్ముడూ గుడి గోపురం నీళ్లతో కడుగుదాం.. చెల్లీ నవగ్రహాలను శుభ్రం చేద్దాం.. వదినా ఆ చెత్తంతా పోగు చేద్దాం.. సార్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దాం.. అమ్మా బండలను నేను తుడుస్తా.. పిల్లలూ ఆ మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త. ఏంటండీ బరువు ఎక్కువగా ఉందా, ఉండండి నేనూ ఓ చేయి వేస్తా.’’ ఏంటీ ఇదంతా ప్రతి ఇంట్లో కనిపించే సందడే కదా అనుకుంటున్నారా? కాదు.. ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఆ దైవమే కుటుంబాన్ని ఏర్పరిచింది. ఆప్యాయతను పంచుకునేలా చేసింది.. దూరమవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తోంది. ఇదీ జగమంత కుటుంబం. – సాక్షి, కర్నూలు డెస్క్ 12మే 2022 ఏకాదశి రోజున.. గుంటూరులో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా పని చేస్తున్న శివకుమార్‌రెడ్డి స్వస్థలం నంద్యాల. సెలవు రోజుల్లో దేవాలయాలను శుభ్రం చేస్తే మంచి జరుగుతుందనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను అందిపుచ్చుకుని ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించారు. ఆ మేరకు మిత్రులు, పరిచయం ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చి కొందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అలా పట్టణంలోని నందీశ్వరాలయాన్ని చేసేందుకు నిర్ణయించగా, మొదట 150 మందికి తెలియజేయగా 50 మంది సుముఖత వ్యక్తం చేశారు. అయితే ముందురోజు రాత్రి వర్షం కారణంగా 13 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ముందుగా నిర్ణయించుకున్నట్లు ఉదయం 5 గంటలకు ఆలయానికి చేరుకొని అనుకున్న కార్యాన్ని నాలుగు గంలల్లో పూర్తి చేశారు. కమిటీ నిర్ణయం మేరకు.. ఏ ప్రాంతానికి వెళ్లాలి, ఏ గుడిని ఎంపిక చేసుకోవాలనే విషయమై కమిటీ సభ్యులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సంబంధిత గుడి అధికారులకు సమాచారం అందించి అనుమతి పొందుతారు. అనంతరం ఈ విషయమై వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. గుడిని శుభ్రం చేసేందుకు అవసరమైన సామగ్రిని సొంత డబ్బుతోనే కొనుగోలు చేస్తున్నారు. నెలలో రెండు గుడులు చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్తీక మాసానికి ముందు నవ నందుల ఆలయాన్ని ఒకేరోజు 900 మందితో కలిసి సేవ చేశారు. ఇప్పటి వరకు 32 గుడులను శుభ్రం చేయగా.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించడంతో పాటు దైవనామ స్మరణతో భక్తిభావం పెంపొందిస్తుండటం విశేషం. దేవుడిచ్చిన బంధాలు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. బూతద్దం పెట్టి వెతికినా అన్నదమ్ములు కలిసుంటున్న కుటుంబాలు ఎక్కడో కానీ కనిపించవు. ఈ పరిస్థితుల్లో బంధువులు దూరమవుతుండగా, బంధుత్వాలు శుభకార్యాలకే పరిమితం అవుతున్నాయి. అలాంటిది మన ఊరు, మన గుడి, మన బాధ్యతలో భాగంగా సేవకులంతా ఓ కుటుంబంగా మారిపోతున్నారు. పిలుపులో ఆప్యాయత కనిపిస్తోంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం చూస్తున్నాం. ఈ బంధం ఇక్కడితో ఆగిపోకుండా తిరిగి ఊరికి చేరుకున్న తర్వాత కూడా ఆయా కుటుంబాలు తరచూ కలసిమెలసి ఉండటం చూస్తే కార్యక్రమం ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతోంది. సహపంక్తి భోజనం ఒక ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటే.. ఎవరు ఏ సమయానికి భోజనం చేస్తారో తెలియని పరిస్థితి. ఇంతకు ముందు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తింటే తప్ప సంప్తి కలిగేది కాదు. కాలంతో పోటీ పడే రోజులు కావడంతో ఎవరి పనుల్లో వాళ్లు బిజీ కావడంతో కలసి భోజనం చేయడమనే మాటే లేకుండా పోతోంది. అలాంటిది ఈ కార్యక్రమం సభ్యులందరినీ ఓ కుటుంబంగా మార్చేస్తుంది. కార్యక్రమం మధ్యలో అందరూ ఎంచక్కా విస్తరాకులు వేసుకొని ఒక్క చోట కూర్చొని భోజనం చేయడం ఆలయానికి వచ్చే భక్తులను సైతం ఆలోచింపజేస్తోంది. గోమాత గోళ్లు కత్తిరిస్తూ.. ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ దేవాలయాలకే పరిమితం కాలేదు. గోవులకు గోర్లు పెరిగి నడవటానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన సభ్యులు వాటి సేవకు నడుంబిగించారు. ఇలాంటి గోవులను గుర్తించి హాఫ్ ట్రిమ్మింగ్, గిట్టలు సరిసేసే కార్యక్రమాన్ని కూడా తరచుగా చేపడుతున్నారు. ఇప్పటి వరకు 15 ఆవుల కన్నీటిని తుడిచి నడక సజావుగా సాగేందుకు దోహదపడ్డారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తిరుమల, తిరుపతి.. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మంత్రాలయంలోనూ గోవుల గోళ్లు కత్తిరించేందుకు మానవతామూర్తులు ముందుకు రావడం విశేషం. ఆర్యోగం కూడా.. గుడి శుభ్రం చేయడం ద్వారా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని సేవకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో తెలియకుండానే ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ బృందంలోని ఓ సభ్యుడు ప్రతి రోజూ ఉదయాన్నే 6వేల నుంచి 7వేల అడుగుల నడక కొనసాగిస్తారు. అయితే ఈ కార్యక్రమం వల్ల దినచర్య కాస్త మారినా, కార్యక్రమం నిర్వహణలో భాగంగా 10వేలకు పైగా అడుగులు పడటం చూస్తే ఆరోగ్యానికి ఏ స్థాయిలో సహకరించిందో అర్థమవుతుంది. ఇంటి వద్ద కనీసం నడిచేందుకు కూడా ఆరోగ్యం సహకరించని వృద్ధులు సైతం గుడిని శుభ్రం చేసేందుకు శక్తినంతటినీ కూడగట్టుకొని ఉత్సాహంగా కలియతిరగడం విశేషం. మానసిక ప్రశాంతత మా చిన్ననాటి స్నేహితుల కలయికకు గుర్తుగా నంద్యాలలోని ఓ పార్కును 2015లో స్వచ్ఛ భారత్ పార్కుగా తీర్చిదిద్దాం. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో 2015లో రూపుదిద్దుకున్న ఈ పార్కు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ అవార్డును కైవసం చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి. ఆ తర్వాత స్నేహితులంతా కలిసి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. తాజాగా ఆలయాలను శుభ్రపరిచే బృహత్ కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నాం. ఇది మానసిక ప్రశాంతతో పాటు మానవతా విలువలను నేర్పుతోంది. – శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, గుంటూరు -
చాగంటిని సత్కరించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లికి వెళ్లిన చాగంటి, సీఎం జగన్‌తో భేటీ అయ్యి.. అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ఇటీవలె నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ల భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది. ఈ సందర్భంగా చాగంటిని సత్కరించి.. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు సీఎం జగన్. చాగంటితోపాటు శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. గోశాల అద్భుతం సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం.. సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు చాగంటి, వరప్రసాద్ రెడ్డి. అనంతరం గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి ప్రశంసలు గుప్పించారు. -
టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి అలిపిరి : టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయా సమావేశాల్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని, ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. -
చాగంటి గురువాణి: పిలవకపోయినా వచ్చి తలకెక్కుతుంది..
‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు. ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం. వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పాపమైనా, పుణ్యమైనా దక్కేది వాళ్లకే!.. పది మంది క్షేమాన్ని కోరగలిగినపుడే
అది మంచి పని కానీయండి, చెడ్డపని కానీయండి. మంచి పని చేస్తే కీర్తి వస్తుంది. మనిషి వృద్ధిలోకి వస్తాడు. చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుంది, పాడయిపోతాడు. అయితే ఒక పని జరిగింది అన్నప్పుడు ఆ పని వెనుక నలుగురు ఉంటారంటుంది శాస్త్రం. ఎవరా నలుగురు! చేసేవారు, చేయించేవారు, ప్రేరేపించేవారు, ఆమోదించేవారు. జరిగిన పనికి వచ్చిన ఫలితాన్ని.. వాటి వలన వచ్చే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు సమానంగా పంచుకుంటారు. ఒక్కోసారి చెడ్డపని జరగకుండా ఆపే ప్రయత్నం కూడా మంచిపనే. మంచి పని జరగకుండా చూడడం తప్పు. చెడ్డ పని జరగకుండా చూడడం ఒప్పు. శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. పదిమంది క్షేమాన్ని కోరగలిగిన గుణం ఉండాలి. భవిష్యత్తులో ఆపదలు రాకుండా ఉండాలన్న దీర్ఘదృష్టిని పొంది ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప చెడ్డపనిని ఆపడం సాధ్యం కాదు. మొదట చేసాడు కనుక. తరువాత లోభాన్ని గెలిచాడు కనుక కర్త గొప్పవాడయ్యాడు. నాకేం అవసరం, నేనెందుకు చేయాలి? అన్న భావనలను దాటడం గొప్ప లక్షణం. అంతమంది చెయ్యకుండా కూర్చున్నారు కదా...నేనే ఎందుకు చేయాలి... అని ఎవరికి వారు అనుకొన్నప్పుడు లోకంలో అందరికీ పనికొచ్చే పనులు ఎలా జరుగుతాయి !!! పదిమందికి పనికొచ్చే ఒక నీటి సౌకర్యం, ఒక బాట సౌకర్యం కల్పించాలి... అన్న సంకల్పం రావడమే గొప్ప. అది నెరవేరాలంటే దానికి ఖర్చు పెట్టాలి. అది అర్ధ రూపాయి కావచ్చు, ఆరుకోట్ల రూపాయలు కావచ్చు. నేనెందుకు చేయాలి అన్న భావన వదిలి ఆ పని చేయడానికి సిద్ధమయ్యాడు అంటే లోభాన్ని గెలిచినట్లే. అందుకని ఆ పని తాలూకు ఫలితంలో నాలుగోవంతు ఆయనకు లభిస్తుంది. తరువాత– చేయించేవాడు. ఆ పనిని ఎవరు చేయగలరో గుర్తించి తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి తాను కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించాడు. ఆ పని జరిగితే కీర్తి నాకు కాకుండా చేసిన వాడికి దక్కుతుందనే అసూయ కొద్దీ చేయకుండా తప్పుకుంటే చేసేవాడికి బలం ఉండదు. అలాకాక తాను కూడా ధైర్యంగా ముందుకడుగు వేసాడు కాబట్టి అసూయను గెలిచాడు. సంకుచితమైన ధోరణిని వదిలి... చేస్తున్న వాడి హితాన్ని, అందరి హితాన్ని కోరాడు కనుక ఆయనకూ నాలుగో వంతు ఫలితం. మూడవవారు– ప్రేరేపించిన వారు. కర్త తటపటాయిస్తూ కాలాన్ని వృథా చేయకుండా, త్వరగా మొదలుపెట్టు అంటూ, దాని అవసరాన్ని గుర్తు చేస్తూ వెంటబడి ప్రేరేపించబట్టి ఆ పని సకాలంలో పూర్తయింది కాబట్టి వీరికి కూడా నాలుగో వంతు ఫలితం దక్కుతుంది. ఆమోదించిన వాడు – యుక్తాయుక్త విచక్షణతో, శాస్త్రీయ దృక్పథంతో ఈ పనిమంచిదే, చెడ్డది మాత్రం కాదు, మంచే జరుగుతుంది, చేయవచ్చు అని అంగీకారం తెలిపితే చేసేవాడికి ఇక ఆ పనిలో మరే సందేహం ఉండదు, కనుక ఆమోదించినవాడికి కూడా నాలుగో వంతు లభిస్తుంది. ఇది తెలిస్తే ఏ పని అయినా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.. నేనేం చేయగలనండీ అని అడుగులు వెనక్కి పడవు. మంచి పనికి ఈ నలుగురు గట్టిగా ఇలా నిలబడాలి, అప్పుడే సమైక్యతతో ఏదయినా సాధించగలం. -
అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!!
Chaganti Koteswara Rao: కమలములు నీటబాసిన/కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్/ తమ తమ నెలవులు దప్పిన/ తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ...అన్నాడు బద్దెన సుమతీ శతకంలో. నీళ్ళల్లో ఉన్న తామర మొగ్గ విచ్చుకోవడానికి కారణమయిన సూర్యనారాయణుడు, అదే తామరతూడును నీళ్ళల్లో నుంచి తీసి ఒడ్డున పెడితే ...ఆయన వాడివేడి కిరణాలు సోకి అది వాడిపోతుంది, కమలాప్తుడు అంటే నీళ్ళల్లో ఉన్న కమలానికి బంధువు, నీళ్ళనుంచి బయటికి వచ్చిన పిదప శత్రువయిపోయాడు. విభీషణుడు రావణునికి సోదరుడు. కానీ ఎప్పుడూ ధర్మంవైపే నిలబడతాడు. అన్నగారు అధర్మానికి పాల్పడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. అలా చెప్పే వారు మన శ్రేయోభిలాషులని గుర్తించకపోతే చాలా ప్రమాదకరం. హనుమ రాయబారం తరువాత రావణాసురుడు కోపంతో హనుమ కంఠాన్ని నరికేయమన్నాడు. ఆయన్ని సంహరించబోతున్నారు. విభీషణుడు జోక్యం చేసుకొన్నాడు. ‘అన్నయ్యా! నీకు తెలియని ధర్మం లేదు కదా... అతను దూత. ఎవరో చెప్పి పంపినవి ఆయన చెబుతున్నాడు. అవి దూత అభిప్రాయాలు కావు కదా. దూత పరిధి దాటాడనిపిస్తే స్వల్పంగా శిక్షించవచ్చు. అంతేకానీ సంహరిస్తానంటే ఎలా..? పైగా నీవితన్ని సంహరిస్తే నీ అభిప్రాయాలు అవతలివారికి ఎలా చేరవేయగలవు? కాబట్టి వద్దు.. అన్నాడు. రావణుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అటువంటి ధర్మాత్ముడు పక్కన ఉన్నంతకాలం ... ఉపద్రవాలు ప్రాణాంతకం కాకుండా ఉన్నాయి. కానీ తరువాత జరిగిన పరిణామాలవల్ల విభీషణుడు రాముడి పక్కన చేరిపోయాడు. ఇంద్రజిత్తు రాముడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బ్రహ్మగారు ఒకానొకప్పుడు ఆయనకు వరం ఇస్తూ...‘‘నికుంభిలా (దట్టమైన అడవిలో ఉన్న ఒక దేవాలయం. అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరం) కు వెళ్ళి హోమం చెయ్యి. దానిలోంచి వచ్చిన రథం మీద కూర్చొని యుద్ధానికి బయల్దేరితే... నువ్వు మేఘాలలో ఉండి దుర్నిరీక్షవుడవుతావు. నిన్ను యుద్ధంలో గెలవడం ఎవరికీ సాధ్యం కాదు.’’ అని వరమిస్తూనే...‘‘నువ్వు నికుంభిలా చేరకపోయినా, చేరి హోమాన్ని పూర్తి చేయలేక పోయినా, నువ్వు ఆయుధాన్ని ధరించి ఉండగా నీపై యుద్ధానికి వచ్చినవాడే నీ ప్రాణాలను హరిస్తాడని గుర్తించు’’ అని హెచ్చరించాడు. ఈ రహస్యం విభీషణుడికి తెలుసు. ఇప్పుడాయన రాముడి పక్షంలో ఉన్నాడు. అదంతా రాముడికి తెలిపి... ఇపుడు ఇంద్రజిత్తు నికుంభిలా చేరుకున్నాడు... అని కూడా చెప్పి రాముడి ఆజ్ఞతో లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళాడు. ఇంద్రజిత్తు హోమాన్ని మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వచ్చాడు. ఆ తరువాత లక్ష్మణుడి చేతిలో చచ్చాడు. అంటే విభీషణుడు స్థానం తప్పిన కారణంగా లంకకు, రావణాసురుడికి చేటు వచ్చింది. అందుకే బద్దెన చెప్పింది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కస్థానంలో మిత్రుడిగా ఉన్నవాడు, స్థానం తప్పితే శత్రువయిపోతాడు. మన పక్కన ఉన్నవారిలో మన శ్రేయస్సు కోరి కొన్ని కఠినమైన సలహాలు ఇచ్చినా, వాటిని పరిశీలించి ఓర్పుతో, విచక్షణతో మసలుకొన్నప్పుడు అవాంఛిత ప్రమాదాలు మాత్రం ఎదురుకాకుండా ఉంటాయన్నదే బద్దెన ఇస్తున్న సలహా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట..: ఏది నిజమైన సంపద? -
Sachin Tendulkar: పొగరుబోతు తనం ఉంటే నశించిపోతారు.. కానీ సచిన్ అలా కాదు!
భారతీయ క్రికెట్ రంగంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచిన్ తెందూల్కర్‌ను పిలిచి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు...‘‘నువ్వు క్రికెట్ ఆడవచ్చు. జీవితంలో క్రికెట్ అంతర్భాగం. కానీ క్రికెట్లో జీవితం అంతర్భాగం కాదు. నువ్వు క్రికెట్ మహా అయితే ఎన్నాళ్ళు ఆడతావు? ఒంట్లో ఓపికున్నంత వరకేగా! అంటే మహా అయితే ఓ 10–15 ఏళ్ళు.. ఇంకా ఓపికుంటే మరో 5 ఏళ్లు. కానీ నీది నూరేళ్ళ జీవితం. దానిలో 20 ఏళ్ళు పోతే మిగిలే నీ జీవితం 80 ఏళ్ళు. నువ్వాడుతున్న క్రికెట్ వల్ల నీకు పేరుప్రతిష్ఠలు కానీ, నీ వంటి పుత్రుడిని కన్నందుకు నాకు గౌరవమర్యాదలు కానీ, నీ వంటి ఉత్తమమైన పౌరుడిని పొందినందుకు ఈ దేశానికి కానీ కీర్తి రావాలంటే వినయంతో ప్రవర్తించడం నేర్చుకో ’’ అని ఉద్బోధించాడు. తరువాతికాలంలో ఈ మాటలు సచిన్ ను ఎలా ప్రభావితం చేసాయో చెప్పడానికి ఒక ఉదాహరణ... ముంబయిలో సచిన్ ఒక వీథిలో ఇల్లుకట్టుకోవాలనుకున్నాడు. అది తెలిసి ఆ వీథిలో వాళ్ళు సంతోషంతో పొంగిపోయారు. సచిన్ ఇక ఇక్కడే ఉంటాడు. బయటికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చూడవచ్చు. మేం ఉండేది సచిన్ పక్కఇంట్లోనే, ఎదురింట్లోనే...ఇలా చెప్పుకోవచ్చంటూ మురిసిపోతున్నారు. ఆ వీథిలో అటువైపు, ఇటువైపున్న ఇళ్ల యజమానుల పేర్లతో సచిన్ ఒక ఉత్తరం రాసాడు. దానిలో ఏముందో తెలుసా... ‘‘నేను సచిన్ తెందూల్కర్. నేను మీ వీథిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. ఇంటి నిర్మాణానికి ఏడాదో ఏడాదిన్నరో పట్టొచ్చు. నిర్మాణం జరిగేటప్పడు దుమ్మూధూళీ, పెద్ద శబ్దాలు, ఇతరత్రా మీ ప్రశాంత జీవనానికి భంగం కలిగించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో నావల్ల మీకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి మన్నించండి. నన్ను మీలో ఒకడిగా మీ వీథిలో ఉండడానికి అనుమతిస్తూ మీ సహకారాన్ని కోరుకుంటున్నా...’’ అని రాసి ప్రతి యజమానికీ స్వయంగా చేతికిచ్చాడు. వినయం అంటే అదీ... కీర్తిప్రతిష్ఠల పరంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అంతటి వినయం చూపడం అతడి వ్యక్తిత్వాన్ని, దాని సమున్నతినీ సూచిస్తుంది. ఈ సంఘటన స్వయంగా సచిన్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. చరిత్రలో ఎవరు అలా ఉన్నారో వారు కీర్తిమంతులయ్యారు. పెద్దల అనుగ్రహం పొందారు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శాశ్వతకీర్తిని మూటగట్టుకున్నారు. ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నా ఈ వినయం లేకుండా పొగరుబోతు తనం ఉంటే నశించిపోతారు. ఆదర్శపురుషుడిగా నిలిచిన శ్రీరామచంద్రమూర్తినే చూడండి. భీష్మాచార్యులు, ధర్మరాజు....వీళ్లందరూ అసమాన వీరులే, అఖండ ప్రజ్ఞావంతులే, కానీ వారి బలాన్ని చూసి ఏనాడూ విర్రవీగలేదు. కనీసం ఎక్కడా గొప్పకోసం కూడా చెప్పుకోలేదు. ఆ జన్మాంతం వినయ విధేయతలతోనే జీవించారు. మరోరకంగా చెప్పాలంటే వారి విజయాలకు, వారి కీర్తిప్రతిష్ఠలకు ప్రధాన కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే. వాళ్ళు పాటించిన ఈ నియమం ప్రజల హదయాల్లో వారికి శాశ్వత స్థానం దక్కేటట్లు చేసింది. ఇంతే ప్రతిభాపాటవాలు ఉన్న మరికొందరు వారి బలాన్ని చూసి గర్వాతిశయంతో ప్రవర్తించి అగాథాల్లో పడిపోయారు. ప్రజల ఈసడింపులకు గురయ్యారు. చరిత్రహీనులయ్యారు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది? -
శతక నీతి – సుమతి..: వారి వెంట ఉంటే చాలు!
సత్పురుషులు అంటే కచ్చితంగా ఇలానే ఉంటారు అని చెప్పలేం. మంచి గుణాలతో మాత్రం ఉంటారు. రామ్ చరిత్ మానస్ లో తులసీదాస్ గారు సత్పురుషులను మూడు వర్గాలుగా విభజించారు. గులాబీ చెట్టు మంచి పూలు పూస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. మంచి వాసనలు ఉంటాయి. కానీ ఆ చెట్టుకు కాయలుండవు. పండ్లుండవు. ఒకరకం సత్పురుషులు ఈ గులాబీ చెట్టులాంటివారు. మంచి మాటలు చెబుతూ సమాజాన్ని నడిపిస్తుంటారు. వారు ఎవరికీ అపకారం చేయరు. ఎవరినీ పాడు చేయరు. కానీ వాళ్ళు మంచి పనులు అదే పనిగా చేస్తున్నారా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే. మామిడి చెట్టు ఉంటుంది. పూత పూస్తుంది, కాయా కాస్తుంది. పండ్లూ వస్తాయి. రెండో రకం సత్పురుషులు ఇలాటి వారు. మంచి మాటలు చెబుతారు. మంచి పనులూ చేస్తుంటారు. రెండూ ఉంటాయి తప్ప మంచి మాటలు చెప్పి పనులు చెయ్యకుండా కూర్చునే రకం కాదు. తమతో ఉన్న వాళ్ళను తమ వెంట తిప్పుకుంటూ అందరితో మంచి పనులు చేయిస్తుంటారు. పనస చెట్టు ఉంది. మామిడి కాయ లేదా పండయితే ఒకరికే సరిపోతుంది. పనసపండును పదిమందికి పంచవచ్చు. ఈ రకం వారు మంచి మాటలు అదే పనిగా చెప్పరు. కానీ మంచి పనులు మాత్రం ఆపకుండా చేసుకుంటూ పోతుంటారు. ఇదీ తులసీదాసుగారి వర్గీకరణ. ఇటువంటి సత్పురుషులతో కలిసి మెలిసి తిరుగుతుంటే మనం కూడా పూజార్హత పొందుతాం. వారితో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచిపనులు చేస్తూ పోతుంటాం. వారి త్యాగశీలత, నిస్వార్థంగా పనిచేసే తత్త్వం, అంకిత భావం, సమాజం పట్ల ప్రేమానురాగాలవంటి గుణాలను వారు చెబుతూ ఆచరించి చూపుతుంటే ... వాటి ప్రభావం మన మీద కూడా గాఢంగా పడుతుంది. క్రమేణా జీవితం దానికి అలవాటు పడి మనలో ఉన్న దుర్గుణాలు వాటతంట అవే మాయమయిపోతుంటాయి. సత్పురుషులతో సహవాస గొప్పదనాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమ హంస ఒక ఉదాహరణ చూపుతుంటారు. ఒక ఏనుగు దారివెంట నడిచి వెడుతుంటూంది. కొబ్బరి చెట్టు కనపడితే కొబ్బరి కాయలను తొండంతో తుంపి నోట్లో వేసుకుంటుంది. అరటి చెట్టు కనబడితే ఆకులను పట్టి లాగేస్తుంది, చింపేస్తుంది. అంతవరకు దాని మీద కూర్చున్న మావటి పట్టించుకోడు. అక్కడ అరటి గెలలను తొండంతో పట్టుకుని లాగేయపోతుండగా... అంకుశం గుచ్చే ప్రయత్నం చేస్తాడు.. వెంటనే అది తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. సత్పురుషులు మావటిలాంటి వారు. మనం పనికిమాలిన పనులు చేస్తున్నా, అనవసర మాటలు మాట్లాడుతున్నా... మృదువుగానే మనల్ని మందలిస్తారు. మనల్ని చక్కదిద్దుతారు. నిజానికి వారు ప్రత్యేకించి మనల్ని పట్టించుకోనక్కరలేదు. వాళ్ళ సాహచర్యంలో అటువంటి పనులు చేయడానికి, అధిక ప్రసంగాలకు ఆస్కారముండదు. ధూళికణమయినా గాలితో కలిస్తే పైకెగిరినట్టు సత్పురుషుల సాంగత్యం మనల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వారి సాంగత్యం లేకపోయినా నష్టమేదీ నేరుగా అనుభవంలోకి రాదు కానీ దుర్జనులతో కలిస్తే మాత్రం హాని జరిగితీరుతుందని చెప్పడానికే బద్దెనగారు –‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శతక నీతి..కలిసుంటే కలదు సుఖం
దూరకుమీ బంధుజనుల.. అంటే బంధువులను దూషిస్తూ వారిని దూరం చేసుకోవద్దంటున్నారు బద్దెన. రామాయణంలో వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. ఇద్దరూ బతికున్నంతకాలం దెబ్బలాడుకున్నారు. ఆఖరికి వాలి చచ్చిపోయాడు. సుగ్రీవుడు ఏడ్చాడు. ఏం ఉపయోగం? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అన్నదమ్ములు. విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడూ చెప్పాడు... అయినా రావణాసురుడు వినలేదు. రావణుడు, కుంభకర్ణుడూ ఇద్దరూ మరణించారు. విభీషణుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత ఏడిస్తే మాత్రం ఆ అన్నదమ్ములు తిరిగొస్తారా !!! ఎందరో చెప్పారు... స్వయంగా ధర్మరాజు చెప్పాడు, చిట్టచివరకు శ్రీ కృష్ణరాయబారం సమయంలో భీముడు కూడా చెప్పాడు. ‘‘మనం ఐదుగురం. ఆ దుర్యోధనాదులు నూరుగురు. అందరం అన్నదమ్ములం. పెదతండ్రి, పినతండ్రి పిల్లలం. మేం దెబ్బలాడుకోవడమేమిటి? మా మధ్య యుద్ధాలేమిటి? మాకు సాయం చేయడానికి దేశంలో రాజులందరూ రెండు పక్షాలుగా విడిపోవడమేమిటి? 18 అక్షౌ హిణులతో మారణ హోమం ఏమిటి ? ఎందుకీ అన్నదమ్ముల కలహాలు...వద్దు... అందరం కలిసుందాం’’ అన్నాడు.. ధర్మరాజు,అర్జునుడు, నకులుడు, సహదేవుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, అప్పుడక్కడికి వచ్చిన వ్యాసుడు, మైత్రేయుడు చెప్పారు. ఇంతమంది రుషులు, పెద్దలు, మంత్రులు, తండ్రి... ఎందరు చెప్పినా దుర్యోధనుడు వినలేదు. తమ్ముళ్ళమీద, అన్నగారు ధర్మరాజు మీద యుద్ధమే చేస్తానన్నాడు. చిట్టచివరకు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతే చనిపోబోయేముందు రాబందులు, గద్దలు పైన ఎగురుతుంటే... అప్పుడు ఏడ్చాడు. మహానుభావుడు, మా పినతండ్రి విదురుడు చెప్పిన మాట వినలేదు. అలా విని ఆ ఐదుగురితో సఖ్యంగా ఉంటే ఈవేళ అఖండ సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఎంత గొప్పగా ఉండేవాళ్ళమో... మేం 105 మందిమి కలిసి ఉంటే... మాకు కీడు తలపెట్టడానికి మా వైపు కన్నెత్తి చూడగల వారెవరయినా ఉండేవారా? అది లేకపోగా నా తమ్ముళ్ళను నేనే చంపుకున్నా...పెద్దలు భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణానికి నేనే కారణమయ్యా. ఆఖరుకు బంధువులతో గొడవలు పెట్టుకుని ఏం సాధించాను ?...అంటూ చిట్టచివరన ఏడ్చాడు... ఏం లాభం.. ఆఖరికి మరణించాడు. అయినవారు అందరూ మరణించారని మిగిలిన ఐదుగురు కూడా ఏడ్చారు. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. నా కూతురుగా రమ్మని కోరుతూ దక్షప్రజాపతి తపస్సు చేస్తే ఆయనకు కూతురయి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. మామా అల్లుళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్లు. అక్కర్లేని గొడవలకు వెడితే... నిండు సభలో శివుడిని అవమానించాడు. అల్లుడిని ఇంత అమర్యాద చేసిన వాడివి ఇంక నీకు గౌరవం ఉండమంటే ఎక్కడుంటుంది.. ఇక నీ కూతురుగా ఉండలేను అంటూ దాక్షాయణి యోగాగ్నిలో దూకేసింది. శంకరుడికి కోపమొచ్చింది. దక్ష ప్రజాపతికి తలకాయ పోయింది. గొర్రె తలకాయతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. శివపార్వతుల శక్తేమిటో తెలుసుకోలేక కేవలం అల్లుడన్న చిన్నచూపుతో అంతటి ఉపద్రవాన్ని కొనితెచ్చుకున్నాడు. కాబట్టి బంధువులు దెబ్బలాడుకోకూడదు. ఎప్పుడూ ప్రేమానురాగాలతో ఉండాలి. ఒకరిమీద ఒకరు అదేపనిగా దోషాలు, లోపాలు ఎంచే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం ఎన్నటికీ మంచి పద్ధతి కాదు. రామాయణం చదవండి, భాగవతం చదవండి, భారతం చదవండి.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు నిరూపితమయిన సత్యం ఇది. మేం 105 మందిమి కలిసి ఉంటే... మాకు కీడు తలపెట్టడానికి మా వైపు కన్నెత్తి చూడగల వారెవరయినా ఉండేవారా? అది లేకపోగా నా తమ్ముళ్ళను నేనే చంపుకున్నా.. పెద్దలు భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణానికి నేనే కారణమయ్యా. ఆఖరుకు బంధువులతో గొడవలు పెట్టుకున ఏం సాధించాను? -
చెవులు జాగ్రత్త..!
‘‘వినదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చూద్దాం. భగవంతుడు మనకు రెండు చెవులు, ఒక నోరు ఇచ్చాడు. నిజానికి మనం అనేక విషయాలను తెలుసుకోవడం చెవుల ద్వారానే సాధ్యం. ‘భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః..’’ అంటుంది వేదం. అంటే –మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎల్లవేళలా అవి శుభప్రదములైన వాటినే వినుగాక...’’ అని. ఎంతమంది చెప్పిన మంచి మాటలు వింటే అంత గొప్ప శీలవైభవం ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు ఏవి మంచిమాటలో ఏవి హానికరమో మనకు ముందుగా తెలియదు కదా..అందుకే ఎవరు ఏది చెప్పినా వినగలగడం వాటిలో మంచిని స్వీకరించగలగడం అనేది ఒక గొప్ప కళ. ఈ నేర్పరితనం మనకు రావాలంటే... మహాత్ములయిన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. అటువంటి వారు చెప్పే మాటలతో ... ఒక గ్రంథాలయంలో కూర్చుని చదివితే లభించే సమాచారం కన్నా ఎక్కువగా దొరుకుతుంది.. అదికూడా వివేకం, విచక్షణా జ్ఞానంతో కలిసి లభిస్తుంది. అందుకే రామాయణంలో ... రావణుడితో మారీచుడు మాట్లాడుతూ... ‘‘సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః ’ అప్రియతస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ’’..అంటాడు. లోకంలో మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ..‘‘బాగుంది. మంచిపని చేస్తున్నావు. నీకిష్టమయింది నీవు చేయకపోతే ఎవరు చేస్తారు, నీ సంతోషం కన్నా గొప్పదేముంటుంది !..’’ అంటూ మనల్ని తప్పుత్రోవలో ప్రోత్సహించేవారు చాలా మంది కనబడతారు. కారణం? ‘‘ఇప్పుడు వీడికి మంచి చెప్పినా వింటాడాం ఏం!’’ అనుకుంటారు. అంతే తప్ప ‘ఇది తప్పు. నీవిలా చేయవద్దు’ అని చెప్పేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు. నిజంగా మన అభివృద్ధిని కోరుకునేవారు, మనమంటే ప్రేమాభిమానాలు ఉన్న... తాతలు, తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, మేనమామ, మేనత్తలవంటివారు... మన మనసు కష్టపడుతుందని తెలిసినా, మనకు ఏది మంచో ఏ మాటలు ఆచరణలో పెడితే మనం వద్ధిలోకి వస్తామో... అటువంటివి నిర్మొహమాటంగా మనకు చెపుతారు. సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్లకుప్పలోనే కదా! అన్ని రాళ్లు పరిశీలనగా వెతుకుతుంటే సాలగ్రామం దొరుకుతుంది. అలాగే అక్కరలేని మాటలు, మన మనసును ఆకట్టుకోవడానికి మనకు హానికరమని తెలిసి కూడా ప్రీతితో అదే పనిగా పొగుడుతూ మాట్లాడే మాటలు.. అప్పటికి మన మనసుకు ఆహ్లాదం కలిగించినా వాటిని గుర్తెరిగి మసలుకోవాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ‘చేతులకు నూనె రాసుకొని పనస తొనలు తీసేవాడికి దాని పాలజిగురు అంటదు. అంతే. జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అసలు ప్రయత్నం మానకూడదు.. వినాలి ఎవరు ఏది చెప్పినా వినాలి. వాటిలో మనకు ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేవాటిని వదిలేయాలి. అదే మారీచుడు చెప్పింది... హితం కోరి చెప్పేవాడి మాట మనసుకు కఠినంగా తగిలినా...స్వీకరించాలి. మంచి చెప్పేవాడు దొరకనే దొరకడు. అటువంటివాడు దొరికినా ఓపికగా వినేవాడు దొరకడు. మంచి చెప్పేవాడు, శ్రద్ధగా హితోక్తులు వినేవాడు ఒకేచోట సర్వసాధారణంగా దొరకరు. దొరికితే అది తీర్థం. అది క్షేత్రం. కారణం– ఫలితం వారిద్దరికే కాదు దేశకాలాలతో సంబంధం లేకుండా అందరికీ అన్వయం అవుతుంది. సూక్తి సుధ ► జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకూడదు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ► నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. ► ఎప్పుడూ పొందనిది కావాలంటే ఎప్పుడూ చేయని కృషి చేయాలి. ► భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు భయపడేవారు ఏమి సాధించలేరు. ► సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మనిషిని నమ్ముతున్నావా... ఓ కథ చెబుతా విను!
‘‘...అపకారికి నుపకారము నెపమెన్నక...’’.. చేయడం అంటే ఎలాగో... లంకాపట్టణంలో రావణవధ తరువాత సీతమ్మ... స్వామి హనుమకు వివరిస్తూ... ‘‘జంతువులపాటి మంచితనం అయినా మనుషులకు ఉండాలి కదా! దీనికి నీకు ఒక కథ చెబుతా విను...’’ అంది. ‘‘ఒకానొకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక వేటగాడు తీవ్రగా గాలిస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ పెద్దపులి ఎదురయింది.. ఆకలిమీద ఉన్నట్లుంది. అది మీద పడేలోగా ప్రాణభయంతో పరుగు లంఘించుకున్నాడు. అది తరుముకొస్తున్నది. దారిలో ఓ పెద్ద చెట్టొకటి కనిపిస్తే... గబగబా ఎక్కేసాడు... దానికి అందకుండా ఉండాలని అన్ని కొమ్మలు దాటుకుంటూ పైకి ఎక్కుతూ పోతున్నాడు. వెనక తరుముకుంటూ వచ్చిన పులి చెట్టుకింద తిష్టవేసింది. ఎప్పటికయినా దిగకపోతాడా... అని కింద కాపుకాసింది. మరో రెండు కొమ్మలు దాటితే చిటారు కొమ్మ ను అందుకోవచ్చని రొప్పుతూ పోతున్న వేటగాడికి పైకొమ్మను పట్టుకునేంతలో అక్కడ గుబుర్లలో ఒక భల్లూకం (ఎలుగుబంటి) కూర్చుని ఉంది. కింద చూస్తే పులి చూపు అతని మీదే ఉంది. ముందు చూస్తే వేటగాడికి సమీపంలో భల్లూకం. చావు ఖాయం అనుకుని గుండె దిటవు చేసుకున్నాడు. ఊపిరి బిగపట్టుకుని చావుకోసం చూస్తున్నాడు. ఈలోగా పెద్దపులి ఎలుగుబంటితో...‘‘ వీడు వేటగాడు. నన్ను చూసి పారిపోతూ ఈ చెట్టెక్కాడు. నేను వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాడు. అందుకని వీడిని నమ్మకు. వాడిని కిందకు తోసెయ్. తినేస్తా. నిన్ను వదిలిపెట్టేస్తా....’’ అంది. దానికి ఎలుగుబంటి...‘‘ఈ మనిషి తెలిసో తెలియకో నేనున్న చెట్టుమీదికి వచ్చాడు. అంటే... నా ఇంటికొచ్చిన అతిథితో సమానం. వాడిని నేను కాపాడాలి. వాడిని కిందకు తోసేసి నీకు ఆహారంగా అందించలేను’’ అని చెప్పేసింది. ‘‘నీవు మనిషివి నమ్మావు కదా...అది నీకే తెలిసొస్తుందిలే..’’ అని పెద్దపులి చెప్పింది. కానీ కదలకుండా అక్కడే కూర్చుంది. ఈలోగా వేటగాడికి అలసటవచ్చి నిద్రపోయాడు. అది కూడా అతనిని ఏమీ చేయలేదు. కాసేపటికి నిద్ర లేచాడు.. ఈలోగా భల్లూకానికి నిద్ర వచ్చి.. నిద్రపోతున్నది. పెద్దపులి వేటగాడితో ...‘‘ఆ భల్లూకం నిద్ర లేస్తుంది. ఆకలితో ఉంటుంది. నేను చంపేస్తానని దిగదు. నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నిన్ను తినేస్తుంది. దాన్ని కిందకు తోసెయ్. నేను తినేస్తా.. నా ఆకలి తీరిపోతుంది కాబట్టి నేను నీ జోలికి రాను...’’ అంటుండగానే వేటగాడు క్షణం ఆలస్యం చేయకుండా భల్లూకాన్ని కిందకు తోసేసాడు. అదృష్టంకొద్దీ అది కిందకు పడేసమయంలో తేరుకుని మధ్యలో ఒక కొమ్మ అందితే దాన్ని పట్టుకుని పైకి ఎక్కేసింది. వెంటనే పెద్దపులి అంది..‘‘నేను ముందే చెప్పా. వాడిని నమ్మొద్దు అని... ఇప్పటికయినా తెలుసుకున్నావు కదా.. వెంటనే తోసెయ్ వాడిని..’’ అన్నది. ‘‘వాడు నాకు అపకారం చేసి ఉండొచ్చు. వాడు నా అతిథి. వాడికి అపకారం చేయను. కిందకు తోయను..’’ అన్నది భల్లూకం. చేసేదిలేక పెద్దపులి వెళ్లిపోయింది. ఎలుగుబంటి కూడా అతనిని వదిలేసింది. వేటగాడు కిందకు దిగి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు....’’ ...‘‘చూసావా హనుమా ! అడవిలో ఉండే జంతువులపాలిటి వివేకం కూడా మనం చూపకపోతే ఎలా...అందువల్ల ఆ రాక్షస స్త్రీలను చంపవద్దు. వారి జోలికి పోకు...’’ అంది... అది బద్దెనగారు సుమతీ శతకం ద్వారా మనకు చెప్పిన శీల వైభవం. -
దయాగుణమే మానవత్వం
భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు ఓ మాటంటారు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటగట్టుకొని పోవం జాలిరే? భూమిపై బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!’’...ఈ భూమిని కోట్లమంది రాజులు పాలించారు, వీరిలో ఎంతమంది మనకు జ్ఞాపకం ఉన్నారు ? ఉండరు. ఎవడు సాటివారి ఆపదలను తీర్చడానికి ముందుకు వచ్చాడో, కష్టాల్లో ఉన్నవారిని గురించి ఆలోచించాడో వాడు చిరస్థాయిగా మిగిలిపోతాడు. వాడి కీర్తి మిగిలి పోతుంది. వాడు చూపిన దయ వాడికి చుట్టమై వాడిని వాడి పిల్లల్న్లి, పిల్లల పిల్లల్ని కూడా కాపాడుతూ పోతుంటుంది. రంతిదేవోఖ్యానం అని ఒక ఉపాఖ్యానం...తినడానికి ఏమీ లేక 47 రోజులు రంతిదేవుడు పస్తులున్నాడు. 48వ రోజున కాస్త అన్నం, పాయసం, నెయ్యి, కాసిని మంచినీళ్ళు దొరికాయి. వాటిని తినబోతుండగా ... డొక్కలు ఎండిపోయిన కొందరు వచ్చి చేయి చాపితే ఆహార పదార్థాలన్నీ వారికిచ్చేసాడు. నీళ్ళుతాగి ఉపశమనం పొందుదామని అనుకుంటూ నీళ్ళ చెంబెత్తుకుని తాగబోతున్న క్షణంలో... ‘కళ్ళు తిరుగుతున్నాయ్, నిలవలేక పోతున్నా, గొంతెండుకుపోతున్నది’ అన్న ఆర్తనాదం వినిపించింది. ‘నీళ్ళు కూడా తాగనివ్వరా..’’ అని ఆయన విసుక్కోలేదు. ...‘‘అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రావన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మేలున్నదె? నాకు దిక్కు పురుషోత్తము? డొక్క?డె చుమ్ము పుల్కసా!’’ అంటూ వెళ్ళి ఉన్న ఆ కొన్ని నీళ్ళు దాహార్తికిచ్చేసాడు. మనిషి హృదయం రాయిలా ఉందనుకోండి. చిక్కిన లేడిపిల్లతో పులి ఎలా చెలగాటమాడుతుందో అలా కష్టంలో ఉన్నవాళ్ళని చూసి కరగకపోగా దానికి హాస్యం ఆడడం అలవాటవుతుంది. వాడు కష్టంలో ఉన్నాడుగా.. ఎదురుతిరిగి ఏమీ అనలేడుగా... అందుకని వాళ్ళని పరిహాసాలాడడం, చిన్నబుచ్చుకునేటట్లు చేయడం... ఇది మంచి లక్షణం కాదు.. ముఖ్యంగా పిల్లలు ఇటువంటి లక్షణాలను అలవర్చుకోకూడదు. మనిషి మనిషిగా బతకడానికి మూడు విషయాలు నేర్చుకోమంటారు.. 1. ఇతరులు సంతోషపడుతుంటే చూసి మనం కూడా సంతోషించాలి.. వాడు సంతోషపడడం చూసి నువ్వు ఏడ్వడం మొదలుపెడితే... పాడయిపోయేది నువ్వే. 2. వాడు కష్టంలో ఉన్నట్లు తెలిసింది.. అది నీ కష్టమనే అనుకొని గబగబా వెళ్ళి వాడికి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం నేర్చుకో. 3. నీ వల్ల మరొకరు కన్నీళ్ళు పెట్టుకునే ఘడియ నీ జీవితంలో ఎప్పుడూ రాకుండా చూడు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకడం అంటే అది. దయాగుణం ఉంటే మనసు రాయిలా ఉండదు వెన్నలా కరుగుతుంది. అలాకాక ఉపకారం చేయాల్సిన సమయం లో అది చేయకపోగా చులకనగా చూడడం, నిందలు వేయడం అన్న ధోరణి ఉందంటే... పశువుల్లో లెక్కవేస్తారు తప్ప మనిషిగా లెక్కగట్టరు. ‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టం అవుతుందని చెప్పింది ఇందుకే. అది సర్వవేళలా నిన్ను కాపాడే చుట్టమవుతుంది. వార్తల్లో చూస్తుంటాం... ప్రమాదవశాత్తూ ఎవడో రోడ్డుమీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే... వెళ్ళి వారి ప్రాణరక్షణకు ప్రయత్నించకుండా... సెల్ఫోన్లో చిత్రిస్తున్న వారి గురించి చదువుతుంటే... అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నదని తెలుసుకుంటుంటే... బాధనిపిస్తుంది... పిల్లల్లో ఈ సంస్కారం ఉండడం సభ్యసమాజానికి మంచిది కాదు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అదీ మనకు దగ్గరి చుట్టమే...
‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టంబౌ... అన్నారు. దయ చుట్టమెలా అవుతుంది? మనలో దయ అనే గుణం ఉంటే... అది చుట్టంతో సమానంగా, అంతకంటే ఎక్కువగా, ఆపద్బంధువులా కాపాడుతూనే ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. పొలం పక్కన పెద్ద సేద్యపు బావి ఉంది. చెరువులు, దొరువుల్లాగానే కొన్ని ప్రాంతాల్లో పెద్ద సేద్యపు బావులకింద సాగుపనులు నడుస్తుంటాయి. ఉన్నట్లుండి బావిలో దభేల్మని పెద్ద చప్పుడయింది. ఎవరో పడిపోయినట్లున్నారు... రక్షించండి, రక్షించండి.. అని అరుస్తున్నారు. చేతిలో పని వదిలేసి ఆ రైతు ఒక్క ఉదుటున వెళ్ళి చూస్తే... ఎవరో పిల్లవాడు మెల్లిమెల్లిగా నీటిలోకి మునిగిపోతున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా నూతిలోకి దూకి ఆ పిల్లవాణ్ణి పైకి తెచ్చి, సపర్యలు చేసి లోపలికి మింగిన నీళ్ళన్నీ కక్కించాడు. కొద్దిగా తేరుకున్న తరువాత తనింటికి తీసుకెళ్ళాడు. ఆ రైతుకూ ఓ కొడుకున్నాడు. ఇంట్లో ఈ అబ్బాయిని అప్పగించి వాడు కోలుకోవడానికి ఆ రాత్రికి తనవద్దనే ఉంచుకున్నాడు. తెల్లవారింది. ఆ పిల్లవాడి వివరాలు తెలుసుకుని వాడింటికి తీసుకెళ్ళి అప్పగిద్దామని అనుకుంటుండగానే... ఇంటి ముందు పెద్ద పడవంత కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఓ ధనవంతుడు ఆదుర్దాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు.‘‘అయ్యా! మీరు కాపాడిన అబ్బాయి నా కుమారుడే. నిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆ నూతిలో పడిపోయాడట. అది తెలియక నిన్నటినుంచీ వెతికిస్తున్నా. ఇప్పుడే తెలిసింది. నూతిలో మీరు దూకి రక్షించారట కదా. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. ఐశ్వర్యానికి కొదువలేదు. కానీ వాడికి ఏమయినా అయితే నేను తట్టుకోలేను. వాడినే కాదు, మమ్మల్ని కూడా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేం.. అయినా కృతజ్ఞత గా...’’ అంటూ డబ్బున్న ఓ ఇనప్పెట్టెను రైతు ముందుంచాడు. దానికి రైతు ‘‘ఆపదలో ఉన్న వారిని కాపాడడం, దయతో వ్యవహరించడం నా సహజ లక్షణం. నా కొడుకు ప్రమాదంలో ఉంటే కాపాడుకోనా... క్షమించండి. నా బాధ్యతకొద్దీ కాపాడినదానికి నేను డబ్బు తీసుకోను... సంతోషంగా మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి’’ అని అంటూండగానే రైతు కొడుకు లోపలినుంచి వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరని ధనవంతుడు అడిగాడు. ‘‘అయ్యా, నా కుమారుడేనండీ, కొంతవరకు చదువుకొన్నాడు.. ఇక ఆ పై చదివించే శక్తి లేక చేతికింద పెట్టుకుని పొలం పనులకు తీసుకెడుతున్నా..’’ అని పరిచయం చేసాడు. ‘‘మీరు నా కొడుకును బతికించారు. డబ్బిస్తే వద్దంటున్నారు... కానీ మీరు చేసిన సాయానికి మా తృప్తికోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ వాడిని నాతోపంపండి. మా అబ్బాయిలాగే చూసుకుంటూనే చదివిస్తా. ఈ ఉపకారం చేయండి’’ అనడంతో రైతు దానికి అంగీకరించి తన కొడుకును కూడా వారి వెంట పంపాడు. ఆ ధనవంతుడి కొడుకే పెద్దయిన తరువాత బ్రిటన్ ప్రధానిగా చేసిన విన్స్టన్ చర్చిల్. ఆయనకొకసారి ప్రాణాంతక జ్వరం వచ్చింది. ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. అప్పడు ఒక్క ఇంజక్షన్ తో ఆయన కోలుకున్నాడు. ఆ ఇంజక్షన్ పెన్సిలిన్. దానిని కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరో కాదు.. ఆ రైతు కొడుకే. అదీ దయ చుట్టం కావడమంటే... -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రాక్షస అవతారానికి... క్షణం చాలు
‘‘తనకోపమె తన శత్రువు/తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ/తన సంతోషమె స్వర్గము/తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!’’ ..దీనిలో బద్దెనగారు మనకు పనికివచ్చే కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. జీవితంలో నీవు పట్టుకోవలసినవి ఏవి, వదిలిపెట్టవలసినవి ఏవి... ఈ పట్టూవిడుపులు చేతకాకపోతే జీవితం ప్రశాంతంగా సాగదని చెబుతున్నారు. ఎవరయినా మనమీద శత్రు భావన పెట్టుకుంటే మనల్ని ఎప్పుడూ పాడుచేయాలని చూస్తుంటారు. అది మనకు అర్థమయిన నాడు మనం వారికి దూరంగా జరుగుతాం. వారిపట్ల శత్రుభావన లేకుండా స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తాం. కానీ లోపల ఒక శత్రువు ఉన్నాడు. అవకాశం కోసం చూస్తుంటాడు. ఆ శత్రువే కోపం. నాకు శత్రువే లేడు... అన్నవాడికి కూడా లోపల ఈ శత్రువు మాత్రం ఉంటాడు. కోపం ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చేటప్పడు అనుమతి తీసుకొని రాదు. వచ్చిన తరువాత ఎంతటి ప్రమాదాన్నయినా అది తీసుకురాగలదు. అలా కోపమనే శత్రువు మన పతనానికి హేతువవుతుంది. శ్రీరామాయణంలో స్వామి హనుమ కోపం గురించి ఇలా అంటాడు...‘‘కత్థః పాపం న కుర్యాత్ కః కత్థో హన్యాత్ గురూరపి’ కత్థ పరుషయా వాచా నరః సాథూనధిక్షిపేత్’’ కోపానికి వశపడిపోతే ఈ పాపం చేస్తాడు, ఇది చెయ్యడు అని చెప్పడం సాధ్యం కాదు. గురూరపి.. గురువు అంటే.. పెద్దవారు, గౌరవనీయులని కూడా చూడడు. ముందూవెనకా ఆలోచించకుండా చంపేయగలడు. అది ఒక ఉన్మాదం. అది మనిషిని స్థిరంగా నిలబడనీయదు. తప్పుచేసి కారాగారానికి వెడుతుంటారు. వారందరూ చెడ్డవారు అని చెప్పలేం. వాళ్లు తమ కోపాన్ని అదుపు చేసుకోలేక చెయ్యకూడని పని చేస్తారు. ఆ తరువాత సంవత్సరాల తరబడి కుటుంబ జీవనానికి దూరమవుతారు. విడుదలయి వచ్చిన తరువాత ఎంత పశ్చాత్తాప పడినా వారు తమ నెత్తిన ఎప్పుడూ ఆ అపకీర్తిని మోయక తప్పదు. కోపం రాగానే ముందు మనిషికి తన మాట మీద అదుపు తప్పిపోతుంది. ఇది మాట్లాడవచ్చు, ఇది కూడదన్న విచక్షణ ఉండదు. పెద్దలని, మహాత్ములని తెలిసి కూడా వారిని అధిక్షేపిస్తాడు, అవమానిస్తాడు, చులకన చేసి మాట్లాడతాడు. అప్పటివరకు మనిషిగా బతుకుతున్నవాడిని, ఎంతోమంచివాడుగా పేరు తెచ్చుకున్నవాడిని కూడా... ఒక్క క్షణకాలంలో రాక్షసుడిగా మార్చేయగలదు ఆ కోపం. పిల్లలకు ఆ వయసులో మంచీ చెడూ ఆలోచించే విచక్షణ తక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోగల పరిణతి ఉండదు. పెద్దలు ప్రయత్నపూర్వకంగా పిల్లలకు ఆ నియంత్రణను అలవాటు చేయాలి. అభిప్రాయ భేదాలను తొలగించుకునే వివేకం వారికి నూరిపోయాలి. ఇంట్లో పెద్దలు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే, పిల్లల లేత మనసు మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళుకూడా ఇటువంటి పోకడలనే అనుసరిస్తుంటారు. అవి సరిచేసుకోక పోతే స్నేహితులకు దూరమవుతుంటారు. అటువంటి వారిని చూసి తోటి పిల్లలు కూడా భయపడతారు, దగ్గరకు రానీయరు. పెద్దలు, గురువులు కూడా అటువంటి పిల్లలను దూరంగా ఉంచుతారు. అది మరిన్ని అవాంఛనీయమైన పరిణామాలకు దారితీస్తుంది. అలాంటప్పుడు వారిని ఓపికగా కూర్చోబెట్టుకొని చెబితే వింటారు, తప్పు సరిదిద్దుకుంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అమ్మా! అన్నం పెట్టమ్మా...
‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగుని నోరున్...’’అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఇటువంటి రచనలు చేసేటప్పుడు మన పూర్వకవులు అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏది మనం మరిచిపోకూడదో, నాలుగు కాలాలపాటు గుర్తుంచుకుని జీవితానికి అన్వయం చేసుకోవాలో అటువంటి వాటిని ఛందోబద్ధం చేసి పద్యాలు, శ్లోకాలుగా అందించారు. అంటే వాటిని ఒకసారి చదివితే అవి జ్ఞాపకం ఉండిపోతాయి. భవిష్యత్తులో కష్టాలు ఎదురయినప్పుడు లేదా సందర్భవశాత్తూ గుర్తుకు రావడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. సుమతీ శతకంలోని పద్యాలు కూడా శ్రద్ధపెట్టి చదివితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులు చదువుకునే వయసులో ఏది చదివినా కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలి. అలాగే లోకంలో అమ్మంటే అమ్మే. అమ్మ అన్నం పెట్టేటప్పుడు కడుపు నిండడం కోసం మాత్రమే పెట్టదు. ఆర్తితో, సంతోషంతో పెడుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావాలని, ఆరోగ్యంగా బతకాలని పెడుతుంది. వాళ్లు సరిగా తినకపోతే, తన వంటలో లోపం ఉందేమోనని బాధపడుతుంది తప్ప మరోలా ఆలోచించదు. తనకోసం అన్నం వండుకోదు, మనకోసం వండుతుంది. అందరికీ పెట్టి చివరగా తను తింటుంది. తనకు సరిపడా మిగలకపోతే ఆకలిని ఓర్చుకుంటుంది తప్ప నాకు మిగల్చకుండా అంతా వాళ్ళే తినేసారని బాధపడదు. ‘మాతా సమున్నాస్తి శరీరపోషణమ్’– అమ్మ పోషించినట్టుగా ఈ శరీరాన్ని పోషించగలిగిన వారుండరు ఈ లోకంలో. అమ్మ భగవంతునితో సమానం... అంటే తప్పు. భగవంతుడే అమ్మ అయినది, పరదేవతే అమ్మగా ఉన్నది. మాతృదేవోభవ..ఆ పరదేవతే అమ్మ రూపంలో తిరుగుతోంది. నమశ్శంకరాయచ, మయస్క రాయచ, నమశ్శివాయచ, శివతరాయచ.. అంటుంది వేదం. శంకరుడు అంటే ఎక్కడో ఉండడు. తండ్రి రూపంలో ఉంటాడు. అలాగే అమ్మ కూడా పరదేవతయై బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటుంది. తన కడుపు మాడ్చుకుని కూడా పిల్లల వృద్ధికోసం త్యాగం చేయగలిగిన జీవి ఈ లోకంలో అమ్మ ఒక్కతే. తండ్రి ఎంతటి ఐశ్వర్యవంతుడయినా, బిడ్డపుట్టగానే ఆకలేసి ఏడిస్తే ఏమీ చేయలేని నిస్సహాయత. కానీ నెత్తుటిని పాలగా మార్చి పట్టగలిగినది అమ్మ ఒక్కతే. అందుకే జీవితంలో గొప్ప అదృష్టం–అమ్మను పొంది ఉండడంగా భావిస్తారు. అపార కీర్తిప్రతిష్టలు ఆర్జించిన మహామహుల జీవితాలు పరిశీలిస్తే...అమ్మ వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి తొలినాళ్ళల్లో పడిన కష్టాలు తెలుస్తాయి. మా అమ్మ పచ్చడి తాను తిని ఇడ్లీలు నాకు పెట్టి...రెక్కలు ముక్కలు చేసుకునేది..అని ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్నారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి అమ్మ సూర్యకాంతమ్మ గారు బిడ్డ ప్రసవానికి ముందు వరకు ఎవరు వారించినా వినకుండా కడుపులో ఉన్న తన బిడ్డకు సంగీతం నేర్పే అవకాశం తరువాత తనకు వస్తుందో రాదోనని వీణ వాయించారట. ప్రసవానంతరం పదోరోజు ఆమె కన్ను మూసారు. ‘‘నన్ను కనడం కోసమే వచ్చింది ఒక అమ్మ, నన్ను పెంచడం కోసమే వచ్చింది మా పెద్దమ్మ. ఇద్దరు అమ్మల చేతిలో పెరిగి పెద్దవాణ్ణయి ఇవ్వాళ ఈ స్థితిలో ఉన్నాను..’’ అని ఆయన గుర్తు చేసుకునేవారు. అటువంటి అమృతమూర్తి అయిన అమ్మను నోరారా ‘అమ్మా!’ అని పిలిచి ‘అన్నం పెట్టు’ అని అడగకపోతే ఎలా? -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇష్టపడితే కష్టం ఉండదు..
సుమతీ శతకంలో మకుటంగా ఉంచిన ‘‘సుమతీ! ’’ అంటే... మంచి మనసున్న వాడా! మంచి మేధ కలిగిన వాడా! మంచి మతి కలిగిన వాడా! అని అర్థం. ఒక వ్యక్తికి ఏదయినా ఒకటి తెలియకపోవడం తప్పుకాదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. అందరం శంకర భగవత్పాదులం కాదు. పుట్టుకతో అందరికీ అన్ని విషయాలూ తెలియవు. కానీ తెలియనిది తెలుసుకోకపోవడం, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మాత్రం తప్పే. నాకు తెలిసినది మాత్రమే నిజం, నాకు తెలుసుకోవలసిన అవసరం లేదనడం ధిక్కారం...అది ముమ్మాటికీ తప్పు. నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను–అని ఎవరు వినయంతో చెవిపెట్టి మంచి మాటలు వింటారో వారందరూ సుమతులే. విద్యార్థుల మనసు తెల్లకాగితంలా ఉంటుంది. దాని మీద ఏది రాస్తే దాని ముద్ర పడుతుంది. పిల్లలకు అందవలసిన విషయం అందితే వాళ్ళు జీవితంలో వృద్ధి లోకి వస్తారు. ఉత్తమ పౌరులవుతారు. అటువంటి పిల్లలు కుటుంబంలో ఆధారపడతగిన వ్యక్తులవుతారు. ఆ వీథిలో ఉన్నవారు, ఆ ఊరి వారు, ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఉన్న వారు కూడా వారిని చూసి గర్వపడే, సంతోషపడే స్థితిని పొందుతారు. అలా పొందేటట్లు బతకగలిగిన స్థితికి చేరుకోవడానికి సుమతీ శతకం పద్యాలు గొప్ప సోపానాలు. ఇవి పిల్లలను ఉద్దేశించి చెప్పినవే అయినా, వారికే కాక, అందరికీ అన్నికాలాల్లో ఉపయుక్తం అవుతాయి. వాటిలో ఒక పద్యం చూద్దాం... ‘‘ఇమ్ముగ చదువని నోరును/అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్/తమ్ముల పిలువని నోరును/కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ!’’ –‘ఇమ్ముగ చదువని నోరును...’ అంటే.. చదివేది ఇష్టంగా చదవాలి.. ఇష్టం అంటే? నీకు ఆకలేసింది. ఉదయం ఫలహారం తిన్నావు.. మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది.. మరి ఉదయం తిన్నదేమయింది! ఏదీ చూపించమంటే ఇక కనిపించదు. అది రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ వంటి సప్త ధాతువుల్లోకి కలిసిపోయింది. అలా కలిసి అది నువ్వయి పోయింది. అంటే నేను తిన్న ఫలహారం నాలో కలిసిపోయింది, నేనుగా మారిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తింటాం. అదీ అంతే. నీళ్ళు తాగుతాం. అదీ అంతే. అలాగే చదివిన చదువు కూడా మనకన్నా వేరుగా ఉండకూడదు. అది కూడా నీలోకి వెళ్ళిపోయి ‘నువ్వు’గా మారిపోవాలి. అంటే నీకు దాని అవసరం ఎప్పుడొస్తే అప్పుడు అది నీకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం వస్తూ ఉండాలి అంటే మీరు చదివిని దానిని లోపల మననం చేసుకుంటూ ఉండాలి. ఇదంతా జరగాలి అంటే... చదివే చదువు ఇష్టంగా, ప్రీతిగా చదవాలి. ఇష్టంగా స్వీకరించింది ఏదయినా మన ప్రయత్నం లేకుండానే అది మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అవసరమయినప్పుడు అది వెంటనే మనకు గుర్తొస్తుంటుంది. మీకు నాన్నంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం. మీరు ఎక్కడున్నా వారిని మనసులో అనుకున్న వెంటనే మీకు వారెలా గుర్తుకొస్తుంటారో, ఇష్టంగా చదివినది కూడా అంతే. ఆవుపాలు పితికేటప్పుడు ఆ పాలధార సన్నగా ఉన్నా నేరుగా పాత్రలోకి చేరేటట్లు ఎలా ఏకాగ్రతతో పితుకుతామో, అలా చదివే విషయాలు, గురువుల ద్వారా వినే విషయాలు కూడా నేరుగా మనసులోకి చేరాలి. అలా జరగాలంటే... చదివే వాటిని కష్టంతోనో, చదవాల్సి వచ్చిందన్న బాధతోనో కాకుండా బాగా ఇష్టపడి చదవాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మనకు తెలియకుండానే... మన మనసుల్ని దోచేస్తారు
నృత్యం చేసేవారు ఒక ధ్యానముద్రలో ఉంటారు. ధ్యానంలో కదిలిపోతే ఏకాగ్రత పోతుంది. సన్నివేశాలనుబట్టి వారు ఆయా పాత్రలలో ఒదిగిపోతారు. అలా కాకపోతే సభ రంజకత్వాన్ని పొందదు. కారణ జన్మురాలు, నటరాజు అనుగ్రహం పొందిన వ్యక్తి శోభానాయుడుగారు. పద్మావతీ కళ్యాణం–నృత్య రూపకంలో శ్రీమహావిష్ణువుతో పాచికలాడే సన్నివేశం. ఇలా పాచికలు వేసినట్లు, పందెం పడినట్లు, వేంకటేశ్వరుడు గెలిచినట్లు, ఈవిడకు కోపం వచ్చి అలిగినట్లు, బుంగమూతి తిప్పినట్లు, మెటికలు విరిచినట్లు, గెలిచావులే పెద్ద..అని అలిగి పాచికలను తోసేసినట్లు...అప్పుడావిడ ముమ్మూర్తులా పద్మావతే...ఎక్కడా శోభానాయుడు గారు కనబడరు. అలా పాత్రలోకి ఒదిగిపోతారు. బ్రహ్మజ్ఞాని సాయిబాబాలాగా నర్తిస్తారావిడ. చిన్నపిల్లలతో గోళీలాడే సన్నివేశాన్ని నృత్య భంగిమల్లో ఆమె చూపుతుంటే...ఒక బ్రహ్మజ్ఞానిని చూస్తున్న అనుభూతి పొందుతాం. బాలరాముడి దగ్గర్నుంచీ రామాయణాన్ని ప్రదర్శిస్తారు. అది ఆవిడకు నటరాజు అనుగ్రహం కాకపోతే మరేమిటి...మనకు ఒక కృష్ణుడు కనపడతాడు, ఒక పద్మావతి కనబడుతుంది, ఒక సాయిబాబా...అలా ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలే మన ముందు నిలబడతాయి. నృత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే... వాద్యం, ఆట, ఆంగికం, లాస్యం..ఇవన్నీ కలిసి మన మనసుల్ని మన ప్రమేయం లేకుండానే లాక్కుంటాయి, భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరిస్తాయి. నటరాజ రామకృష్ణ గారి పేరిణి శివతాండవమే చూడండి. ఓరుగల్లులోని రామప్ప గుడికి చెందిన పేరిణి శివతాండవం ప్రక్రియ మీద విశేషమైన పరిశోధన చేసి మరుగున పడిన ఆ కళారూపాన్ని మనకు సజీవంగా అందించారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళే సందర్భంలో వారిలో స్ఫూర్తి నింపడానికి... మృదంగాలు మోగిస్తూ ఆ తాండవం చేస్తుంటే... మంచాన ఉన్నవాడు కూడా లేచి కత్తిపట్టుకుని యుద్ధానికి బయల్దేరేటంత ఆవేశాన్ని, ఉద్రేకాన్ని నింపేదట. దానికి ఆయన జీవం పోసారు. ఒక మహాశివరాత్రినాడు ఆయన ప్రదర్శనను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదివేలమంది వస్తారనుకుని దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసారు. చివరకు ఇసకేస్తే రాలనంతగా జనం వచ్చి చుట్టూ రోడ్లన్నీ నిండి రాకపోకలు స్తంభించి పోతే.... విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకుల కోరిక మేరకు ఆయన దానిని ఆపకుండా తెల్లవారే దాకా కొనసాగించాల్సి వచ్చింది. నాలుగు చీరలు కట్టి, అవతలివైపు టేబుల్ ఫ్యాన్లు పెట్టి..అవి గాలికి ఊగుతుంటే..వెనుక సముద్ర ఘోష శబ్దాన్ని వినిపిస్తూ ‘ఆంధ్రజాలరి’ నృత్యరూపకం ప్రదర్శిస్తుంటే...ప్రేక్షకులకు సంపత్ కుమార్ కళాకారుల బృందం ఎక్కడా కనిపించదు. నడిసముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఒక జాలరి తన జీవికకోసం పడుతున్న పాట్లను చూస్తూ గుండెలు బరువెక్కుతాయి. చిదంబర క్షేత్రం లో పరమ శివుడు, కాళికాదేవి పోటీపడి నృత్యం చేస్తుంటారు. అయ్యవారు ఎన్ని విన్యాసాలు చేసినా అమ్మ అవలీలగా చేసి పైచేయిగా ఉండడంతో శివుడు... నృత్యం చేస్తూ చేస్తూ వచ్చి అక్కడ ఉన్న కుంకుమ భరిణలో కాలి బొటనవేలు ముంచి దానితో అమ్మవారి నుదుటున బొట్టు పెడతాడు. అమ్మ సిగ్గుతో ఆ పని చేయలేక నిలబడిపోతుంది.. అలా చిదంబరంలో నటరాజ పదవి శివుడికి దక్కిందని చూపే సన్నివేశం చూపరులను గగుర్పొడుస్తుంది. కారణం వారు కళ్ళప్పగించి చూసింది ఆదిదంపతుల నాట్యాన్నే కానీ, కళాకారుల ప్రదర్శనను కాదు. అదీ భారతీయ కళల వైభవం. వీరంతా జాతి రత్నాలు, ప్రాతఃస్మరణీయులు. మన యువతరం వాళ్ళగురించి తెలుసుకోవాలి. వారి మార్గాన్ని అనుసరించాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా కొనసాగడానికి కావలసిన సాధన, క్రమశిక్షణతో చేయాలి. లేకపోతే కొన్నాళ్ళకు అవి పుస్తకాలకే పరిమితమయిపోతాయి. అటువంటి ప్రదర్శనలను ఇచ్చేవారుండరు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య -
Chaganti Koteswara Rao: కళ్ల ఎదుటే కైలాసం
ఒక హరిప్రసాద్ చౌరాసియా, ఒక బిస్మిల్లా ఖాన్... మహానుభావులు ఎంతమంది ఎన్నిరకాల వాద్యాలతో, తమ తమ గాత్రాలతో భారత దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచమంతటా ఎగరేశారు. మహాతల్లి, ప్రాతఃస్మరణీయురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మహాస్వామివారు రాసిన కీర్తనను ఐక్యరాజ్యసమితిలో పాడితే సభ్యులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. ఇప్పటీకీ ఆమె పాట వినబడితే అలా నిశ్చేష్టులై నిలబడి పోతాం. సంగీతాన్ని ఉపాసన చేసిన మహానుభావులు నేదునూరి కృష్ణమూర్తి, బాల మురళీకృష్ణ, పినాకపాణి.. ఎంతమంది ఈ దేశ వైభవాన్ని చాటినవారు. భారతీయ సాంస్కృతిక వైభవం.. అంటే ఒక్కొక్క కళతో ఈశ్వరుడిని ఆరాధించి, ఈశ్వరుడిని పొంది, ఈశ్వరుడిని మన అందరికి కూడా అందించి ఈశ్వరునిలో లయమయ్యారు. నృత్యాన్నే తీసుకోండి. భారతీయ నృత్యం రాజోపచారాల్లోకి చేరింది. నృత్యమంటే ఏదో అర్థంపర్థం లేని పాదాల కదలిక కాదు. ఆంగికం, లాస్యం అని రెండు ఉంటాయి. ఆంగికం అంటే శరీరావయవాలు కదలడం. లాస్యమంటే ముఖంలో భావాలను ప్రకటించడం. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారు! కేళీవిలాసంలో. అంటే... ప్రపంచమంతా కూడా లాస్య తాండవ సమన్వయంగా ఉంటుంది. ఒక్కొక్కటి చెబుతున్నప్పుడు ముఖం లో ఒక్కొక్క భావన వస్తుంది. చూసేవారుకూడా సంతోషంతో ఆ భావనను ప్రకటిస్తుంటారు. అప్పుడది లాస్యం. అమ్మవారి రూపం. లాస్యప్రియ, లయకరి.. అని లలితా సహస్రంలో స్తుతిస్తాం. తాండవం శివస్వరూపం. తాండవం, లాస్యం రెండూ నాలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడున్నట్లే.. అంటే ఇదే కైలాసం. అది మరెక్కడో ఉండదు. మన కళ్ళెదుటే ఉంటుంది. అటువంటి అద్భుత నృత్యం మనదేశంలో పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం. దీనిని రాజోపచారంగా ఎందుకు తీసుకు వస్తారంటే... తిరగడానికి అలవాటుపడిన మనసును పూజలో నిగ్రహించి ఒక్కో ఉపచారం చేస్తున్నప్పుడు దానిని అక్కడ నిలపాలి. యజ్ఞోపవీతం సమర్పయామి.. అన్నప్పుడు ఏదో నోటితో అని వదిలేయడం కాదు.. ఎదురుగా రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆయనకు యజ్ఞోపవీతం వేయాలి అంటే ఆయన ఉత్తరీయం అడ్డొస్తున్నది. దానిని తొలగించినప్పుడు స్వామి వారి విశాల వక్షస్థలం, ఆయన బాహువులు చూసి... మనసులో దర్శనం చేస్తూ తన్మయత్వంతో పొంగిపోతాం. ఏకాగ్రతతో అలా పూజచేస్తున్నప్పుడు అలా నిలబడిన మనసు కొంతసేపటికి డస్సిపోతుంది. దానికి మధ్యలో విరామం కావాలి. ఇప్పుడు బ్రేక్ అంటున్నారు కదూ... అది ఇప్పటిది కాదు. మనవాళ్ళు ఎప్పుడో నేర్పినటువంటిది. పూజలో కొనసాగుతూండాలి, మనసుకు కొద్దిగా విరామం ఇస్తూండాలి, భగవంతుడిని మాత్రం వదలకుండా కాసేపు రంజకత్వం పొందడానికి ఇచ్చిన అవకాశమే రాజోపచారంలో.. నృత్యం దర్శయామి అనడం. అప్పుడు నృత్యం చేయడానికి ఒకావిడ వస్తుంది... కస్తూరీ తిలకం ... అంటూ అక్కడ నెమలీకను చూపిస్తారు. ఇక్కడ నృత్యం చేస్తున్నామె కనపడడం లేదు. కృష్ణుడు కనిపిస్తున్నాడు.. ఆయనని చూస్తూ మనసు సంతోషాన్ని పొందుతుంది. కానీ భగవద్దర్శనాన్ని మాత్రం వదిలిపెట్టదు. అందుకని రాజోపయోగంలోకి తీసుకున్నారు. అదీ భారతీయ నృత్య ప్రయోజనం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి
మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణభక్తుడు. ఒడిశా రాష్ట్రంలోని కెంధు బిల్వా అనే ప్రదేశంలో భోజదేవుడు, రమాదేవి అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణ జన్ముడు. భార్య పద్మావతీ దేవి. 8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి. ఆయన పాట పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తన చేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట. భక్తులందరూ ఆయన పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధ చూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అని ప్రస్తుతించారు. ఒకసారి జయదేవుడు అష్టపదుల రచన చేస్తున్నాడు. ఒక సన్నివేశంలో–‘‘ ప్రియే చారుశీలే! స్మరగరళ ఖండనం మమతిరతి మండనం దేహిపదపల్లవ ఉదారం...’’ అని రాశాడు. అంటే ‘ఓ రాధా! నీ పైన ఉండే విశేషమైన అనురాగంతో మన్మథ బాణాలు నామీద పడి మదనతాపం అనే విషం నా తలకెక్కిపోతున్నది. వేడి తగ్గటం లేదు. ఒక్కసారి పల్లవమైన చల్లని నీ పాదాన్ని తీసి నా తలమీద పెట్టవూ...’ అని కృష్ణుడు అన్నట్లుగా రాసాడు. రాసిన తరువాత ఆయనకు – ‘ఎంత రాధమీద ప్రేమ ఉంటే మాత్రం...రాధా! నీ మీద నాకున్న మోహం చేత మదనతాపం కలిగి వేడెక్కిన నా తల మీద నీ పాదం పెట్టు..’ అంటాడా భగవానుడు.. అనడు. అందువల్ల నేనిలా రాయకూడదు. మరోలా రాయాలి.. అని ఆ చరణాలు కొట్టేసి.. ఘంటం పక్కనపెట్టి– ‘‘పద్మావతీ! స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తా..’ అని చెప్పి అభ్యంజనానికి బయల్దేరాడు. అభ్యంజనం...అంటే ఒంటినిండా నూనె రాసుకుని వెళ్ళి స్నానం చేయడం. ఇలా గడప దాటాడో లేదో మళ్ళీ జయదేవుడు వెనక్కి వచ్చాడు...‘‘అదేమిటి మళ్ళీ వచ్చారు?’ అని పద్మావతీ దేవి అడిగితే ..‘‘అష్టపది పూర్తిచేయడానికి మంచి ఆలోచన వచ్చింది. ..’ అంటూ పూర్తి చేసి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత నదీస్నానం ముగించుకుని జయదేవుడొచ్చాడు. తాను రాసిన పుస్తకం మీద నూనెబొట్లు పడి ఉన్నాయి. ‘‘పద్మావతీ, ఇదేమిటి.. నేను కొట్టి వేసిన చరణాలు మళ్ళీ రాసి ఉన్నాయి. ఎవరు రాసారు?’’ అని అడిగాడు. దానికామె ‘మీరేగా.. మంచి ఆలోచన స్ఫురించిందని ఇది ఉంటేనే బాగుంటుందని అంటూ అప్పుడే వెనక్కి వచ్చి రాసి వెళ్ళారుగా..’’ అంది. ‘‘పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. వచ్చింది నేను కాదు. ఆ పరమాత్మ. స్వయంగా ఒంటికి నూనె పూసుకుని నా రూపంలో వచ్చి నేను కొట్టేసిన చరణాలు మళ్ళీ రాసిపోయాడు. ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నీవు పొందావు’’ అన్నాడు. అందుకే వీటిని ‘దర్శన అష్టపది’ అంటారు. ఇప్పటికీ భక్తులు ఈ అష్టపదులను ఇంట్లో వింటూ ఉంటారు. అవి అలా వింటూ ఉంటే స్వామి ప్రసన్నుడౌతాడని వారి నమ్మకం. -
‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి
లలితా సహస్ర నామ స్తోత్రంలో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తారు. కావ్యాలను ఆలాపన చేసేవాళ్ళను చూసి అమ్మ సంతోషిస్తుంది. అందుకే మనకు కావ్యాలను చదవడం కోసం కాకుండా వీణమీద పలికించమని, నోటితో పాడమని ఇచ్చారు. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి లవకుశులకు –వీణమీద పలికిస్తూ, పాడండి–అని ఇవ్వడంతో వారు అయోధ్యకు వెళ్ళి అలాగే పాడారు. అంటే శ్రీరామాయణం నిజానికి పాటగా పాడుకోవలసినది. శ్లోకాలు అంత గొప్పగా రచించారు. అందుకే ఆలాపన చేసే వాళ్ళు ఆ తల్లికి అంత దగ్గరగా కూర్చుంటారు. వాళ్ళు తమ ఉపాసనా శక్తిని, ఆ సంతోషానికి, వాళ్ళు అనుభవిస్తున్న తాదాద్య్మతకి అమ్మవారు దిగొచ్చేస్తుంది కూడా. ఆ విషయం బాలమురళీగారే చెప్పుకున్నారు కూడా.. బాల మురళీ కృష్ణ గారు ఒక మహానగరంలో సముద్రపు ఒడ్డున కచ్చేరీ చేస్తున్నారు. ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆయన కళ్యాణి రాగం పాడుతున్నారు. ఆయనకు ఆ రాగమం టే మహాప్రీతి. గంటకుపైగా తనను తాను మర్చిపోయి ఆ రాగాన్ని ఆలపిస్తుండగా... ఇంతలో మహాసౌందర్యవతి ఐన ఒక పిల్ల కొప్పునిండా పూలు పెట్టుకుని జనంలోంచి నడిచి వస్తుంటే అందరూ దారి వదిలారు. ఆ పిల్ల నేరుగా వచ్చి వేదిక మీద బాలమురళీగారి పక్కన కూర్చుంది. ఆయన చూసారు. ఏ కళ్యాణి రాగాన్ని ఉపాసన చేసానో, ఆ రాగమే సాకారమై నడిచి వచ్చి నా పక్కన కూర్చుంది–అని సంతోషంతో అప్పటికప్పుడు ఆశువుగా కళ్యాణి రాగంలో పరమాద్భుతమైన ఒక కీర్తన చేసారు. ‘ఎంత సొగసైన దానివమ్మా! నేను ఈ రాగాన్ని ఆలాపన చేసి చేసి భావుకత్వంతో ఆకసానికి ఎగిరిపోయా. అక్కడ పాడుతున్నా... అంతకుముందు చంద్రుడికి కళలు పెరగడం, తరగడం ఉండేవి కావు. నా ఆలాపనకు అమృతాన్ని శరీరంగా కలిగిన చంద్రుడు కరిగిపోయి, ముద్దయిపోయి, నవనీతం అయిపోయాడు. అప్పటినుంచి చంద్రుడికి కళలు తరగడం, పెరగడం మొదలయ్యాయి... అంతకుముందు నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఊగుతుండేవి కావు. నేను అంబరవీథికి గిరి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసినప్పుడు చుక్కలు ఊగడం మొదలయ్యాయి. నేను మళ్ళీ తిరిగి వచ్చి వేదిక మీద కూర్చున్న తరువాత కళ్యాణి ప్రీతి పొంది అంతర్ధానమయింది. కళ్యాణి రాగాన్ని పాడుతున్నప్పుడు ఆ రాగమే పరవశించి అరమోడ్పు కన్నులతో కూర్చుని ఉంటే...బ్రహ్మగారు .. నేను ఇటువంటి మూర్తిని సృజించలేకపోయానని సిగ్గుపడ్డాడు...’’ అంటూ చక్కటి భావుకతతో ఒక కీర్తనను ఆయన సజించి ఆలపించారు. ఇదీ భారతీయ సంగీతం గొప్పదనం. కొంతమంది మహాపురుషులకు ఆ రాగాలు రాగిణులై దర్శనమిచ్చాయి. భారతీయ సంస్కృతికి పునాది అయిన ఇటువంటి కళలలో ఎంత భగవత్ తత్త్వాన్ని ఉపాసన చేసారో, అసలు ఆ పాట పాడుతూ పాడుతూ ఎక్కడికో వెళ్ళిపోయి ఎంత గొప్ప గొప్ప స్థితులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: పవిత్రతా స్వరూపిణి సీత కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి -
కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి
‘సంధ్యారంభవిజృంభితమ్’ .. అని శంకరాచార్యులవారు అంటారు శివానందలహరిలో. సంధ్యా కాలం లో శివుడు నాట్యం చేస్తాడు–అంటాడు. సంధ్య.. అంటే? చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు..ఆ మధ్య కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది. అది ప్రాతః సంధ్య. మధ్యాహ్నం నడినెత్తి మీదికి వస్తాడు.. అది మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం.. చీకటి వస్తుంటుంది. పగలు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది... అది సాయం సంధ్య. ఒక అవస్థలోంచి మరొకదానిలోకి మారుతున్న మధ్య కాలానికి సంధ్య అనిపేరు. దోషమ్ అంటే చీకటి. ప్రదోషమ్.. చీకటికి ముందు వెలుతురు అస్తమిస్తున్న కాలం. ఈ రెంటికీ మధ్య ఉంది కాబట్టి ప్రదోషమ్–సంధ్యాకాలం. సంధ్యాకాలంలో నిశ్శబ్దం ఉంటుంది. సంధ్య మారుతుంటే కాలం నడుస్తుంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం, మాసాలు, రుతువులు.. నడుస్తాయి. అవి నడిస్తే సుఖం, దుఃఖం అనుభవంలోకి వస్తుంటాయి. సంధ్యలలో కాలం మారిపోతుండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యాకాలం ఉంటే తప్ప విజృంభణం అన్నది ఉండదు. అంటే అసలు శివుడు ఎక్కడ ఉంటాడు? ఊపిరికీ, ఊపిరికీ మధ్యలో... నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడూ ఆ తరువాత నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మనసు లో ఆలోచించి లోపలికి తీసుకున్న ఊపిరిని మళ్ళీ వాక్యంగా మార్చి ఆవిష్కారం చేస్తుంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజంభిస్తుంటాడు. మాటలు మాట్లాడేటప్పుడయితే...‘సంధ్యారంభ విజృంభితమ్’ అంటాం. మరి సంగీతంలో అయితే...!!! శృతి, స్వరం శబ్దంగా పైకొచ్చి వెనక్కి వెడతాయి. రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి, లోపల అణిగి పోతాయి. ఇక్కడినుంచే ‘ఝుమ్’ అన్న నాదం వస్తుంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినబడుతుంటుంది. మనలోంచే వస్తుంటుంది. నాదోపాసన చేసే విద్వాంసుడు పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్లిపోయి శృతినీ, స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెడతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్తకాలం ఆగిపోతాడు. ఆగి నాదోపాసన చేస్తాడు. అలా నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన. అదే ఈశ్వరోపాసన. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి వారు.. ప్రదోష కాలంలో చంద్ర మౌళీశ్వరునికి అభిషేకం చేసి చిట్టచివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని తీగలు మీటుతూ నాదోపాసన చేస్తుండేవారు. నాదోపాసనం సంగీత విద్య. దానితో భగవంతుడిని చేరుకుంటారు. అంతగొప్ప స్థితి భారతీయ సంగీతానికి ఉన్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది. ఎక్కడ సంగీతాన్ని పరమ సంతోషంతో ఆలపించే అలవాటు ఉంటుందో అక్కడ రెండు లక్షణాలు పొటమరిస్తుంటాయి. ఒకటి–భక్తితో అద్భుతమైన దర్శనం కలిగి భావాలుగా ప్రకటితమవుతుంటాయి. అంటే వాగ్గేయకార స్థితి ఏర్పడుతుంది. రెండు–తాను ఆ పాట పాడుతున్నప్పుడు దానితో రమించిపోయి–వెనక్కి వెళ్ళి నాదంతో ఒకటయిపోయి నిలబడిపోతాడు. అందుకే ఆ భావుకత ఏర్పడినప్పుడు ఆయన ఎంత స్థాయికి వెడతారంటే– బ్రహ్మ సృష్టిని తాను అనుకున్నట్లు ఎలా చేస్తాడో, కవి కూడా అలాగే తాను అనుకున్నట్లు కావ్య నిర్మాణం చేస్తాడు. భావుకు డయిన సంగీత కర్త, ఉపాసకుడు, విద్వాంసుడు అలా ఉపాసన చేస్తూ గానం చేసేటప్పుడు పరదేవత ఆనందానికి కారణమవుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం లో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తాం. అందుకే మనకు కావ్యాలను శ్లోకాలుగా చదువుకోమని ఇవ్వలేదు.. తన్మయత్వంతో ఆలపించమని ఇచ్చారు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు? ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు -
ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు
‘‘సద్యోజాతాది పంచవక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్తస్వర విద్యాలోలమ్...’’ అన్నారు త్యాగరాజ స్వామి. జ–అంటే పుట్టినది–అని. సద్యోజాతాది పంచవక్త్రజ...పరమ శివుడికి ఐదు ముఖాలు–సద్యోజాతం, అఘోరం, సత్పురుషం, వామదేవం... పైన ఉండే ముఖం–ఈశానం. ఇది మోక్షకారకం. ఈ సప్తస్వరాలు పరమశివుడి ఐదు ముఖాల్లోంచి వచ్చాయి. వేదం కూడా భగవంతుని ముఖం లోంచే వచ్చింది కాబట్టే దాన్ని అపౌరుషేయం అంటారు. అంటే ఎవ్వరి చేత రాయబడినది కాదు–అని. శృతి–గురువుగారి దగ్గరి నుంచి స్వరంతో మంత్రాన్ని విని శిష్యడు వేదాన్ని నేర్చుకుంటాడు. అంతే తప్ప మంత్రాలు పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు. వేదాలు ఎలా భగవంతుని ముఖం నుండి వచ్చాయో, అలాగే ఏ సంగీతం ఏడు స్వరాల మీద ఆధారపడిందో అది పరమశివుని ఐదు ముఖాలు... సద్యోజాతాది పంచవక్త్రజ... సద్యోజాతం మొదలయిన ఐదు ముఖాలనుండి పుట్టింది. స్వరాలు ఏడయినప్పుడు మరి మిగిలిన రెండు స్వరాల సంగతేమిటి? ఏయే స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి, రాని రెండు ఏవి ? అసలు స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి అంటే దానర్థం వాటికన్నా ముందే పరమ శివుడు ఉన్నాడనేగా. అంటే మిగిలిన రెండు స్వరాలు పరమశివుని ముఖం నుండి రాలేదా ..? సప్తస్వరాలు–షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. వీటినే స–రి–గ–మ–ప–ద–ని అని అంటాం. ఇందులో షడ్జమం–నెమలి కూత లోంచి, రిషభం–ఎద్దు రంకె లోంచి, గాంధారం– మేక అరుపు లోంచి, మధ్యమం–క్రౌంచ పక్షి చేసే శబ్దం లోంచి, పంచమం–కోయిల కూత లోంచి, దైవతం–గుర్రం సకిలింపులోంచి, నిషాదం–ఏనుగు ఘీంకారంలోంచి వచ్చాయి. స–రి–గ–మ–ప–ద–ని అనే ఏడు స్వరాలకూ ఆరోహణ, అవరోహణ ఉంటాయి. భగవంతుడి నుండి విడిపోతే అవరోహణ. మళ్ళీ పైకిపోతే ఆరోహణ... అంటే ఈశ్వరుడిలో ఐక్యం కావడం... అదీ సంగీతం ద్వారా. సప్త స్వరాల్లో రెండు– షడ్జమం, పంచమం..ఈ రెండూ శివుడి పంచముఖాల్లోంచి రాలేదు. అంటే శివుడు ఎప్పటినుంచి ఉన్నాడో అప్పటినుంచి ఉన్నాయి. అందుకే వాటిని ప్రకృతి స్వరాలని అంటారు. ఇవి అనాది–అవి ఎప్పటినుంచి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. మిగిలిన ఐదు వికృతి స్వరాలు. అవి శివుని ముఖాల్లోంచి వచ్చాయి. ‘‘సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వరసప్తస్వర విద్యాలోలం విదలితకాలం విమలహృదయ త్యాగరాజపాలం’’...కాలుడిని.. యముడిని కూడా చంపినవాడు, కాలాతీతుడయిన శివుడున్నాడే... ఆయన విమలమైన మనసు ఉన్న త్యాగరాజును పరిపాలించే ‘నాదతను మనిశం శంకరం నమామి మే మనసా శిరసా’... ఆ శివుడికి నమస్కరిస్తున్నాను. బాలమురళీకృష్ణ గారు ఒకసారి ఫ్రాన్సులో కచేరీ చేస్తుండగా.. ఒకతను ఫ్రెంచిభాషలో ఒక గీతాన్ని రాసి పాడమన్నారు. దానిని చదివి ఆకళింపు చేసుకుని, భారతీయ సంగీతంలోని సప్త స్వరాలలోకి, రాగంలోకి, తాళంలోకి తీసుకొచ్చి ఆయన అత్యద్భుతంగా ఆలపించారు. ఆ దేశస్థులు నివ్వెరపోయారు. గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతంలోకి ఇమడని ఇతర సంగీతం లేదు. మన సంగీతం ఇతర సంగీతాలలోకి ఇమడదు. అదీ మన సంస్కృతి గొప్పదనం. మనం దానికి వారసులంగా గర్విస్తూ వాగ్గేయకారులకి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం !!! -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఎంతబాగా ఆలపించావురా సామగానం!
‘‘ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి ర్బ్రహ్మణోధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్’’... శివుడే నటరాజు. అన్ని కళలూ ఆయన నుండే వచ్చాయి. అంత వేగంగా నృత్యం చేస్తున్నంత మాత్రాన ఆయన రజోగుణ తమోగుణాలకు వశపడతాడనుకోవలసిన అవసరం లేదు. ‘సదాశివోమ్’... ఎల్లప్పుడూ శివుడే. పరమ ప్రశాంతంగా, కళ్యాణమూర్తిగా, భద్రమూర్తిగా, శ్రేయోమూర్తిగా ఉంటాడు. అలా ఉండగలగడం..రాశీభూతమైన సామవేద సారం శివుడే. సామగానం ఆలపించడం అంటే మరేమీ కాదు, పరమశివుడిని ఉపాసన చేయడమే. యాజ్ఞవాల్క్య మహర్షి వీణమీద అనేక రహస్యాలు చెప్పాడు. అందులో ఒకటి.. ఎవరయినా వీణ వాయించేటప్పుడు గురుముఖతః నేర్చుకుని స్వరం తప్పకుండా వీణవాయిస్తూ కళ్ళు మూసుకుని తనలోతాను పరవశించ గలిగితే... ఇక వాడికి ఇతరమైన ఏ ఉపాసనలు అక్కర్లేదు. వాడు పరమేశ్వరుడిని చేరిపోతాడు–అని మహర్షి చెప్పారు. అంత గొప్పది. అందుకే అసలు ఆ వీణ చేత్తో పట్టుకున్నంత మాత్రాన శాంతిని పొందుతాం. ఆ శాంతమే శివుడు. అందుకని ..‘‘నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’’ అనీ,... ‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అంటే వారమ్ వారమ్ అంటే వారానికోసారి అని కాదు... మళ్ళీ మళ్ళీ అని.. పరమసంతోషాన్ని పొంది..ఆ శాంతి స్థానమే శివుడిగా వచ్చిందని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నేను నమస్కరిస్తున్నాను...అన్నాడు త్యాగరాజు. ఆ శివుడికి తనువంతా నాదమే. శివుడిలోంచి సంగీతం వచ్చింది. అది మనోరంజకత్వం కోసం వచ్చింది కాదు. ‘‘సద్యోజాతాది పంచ వక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్త–స్వర విద్యా లోలమ్...’’ లోలమ్ అంటే దానిమీద విపరీతమైన వ్యామోహం...అని. అది వినేటప్పటికి ప్రసన్నుడయిపోతాడు. ఒకప్పుడు...కాశీపట్టణాన్ని గజాసురుడు పాడుచేస్తుంటే పరమశివుడు వాడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతోంది... వీడితో సమయం పాడుచేసుకోవడం ఎందుకని పరమ శివుడు ఏనుగురూపంలో వచ్చాడు. వాడిని త్రిశూలానికి గుచ్చి పైకెత్తి పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. మరి ఆయన శాంతమూర్తికదూ! ప్రశాంతంగా కూర్చున్నాడు. పైనున్న ఏనుగు దాని బరువుకు అదే త్రిశూలానికి దిగబడిపోతోంది.ప్రాణాలు పోతున్నాయని తెలుసుకున్న గజాసురుడు సామగానం చేసాడు. వెంటనే పరమశివుడు ప్రసన్నుడయి తలెత్తి చూసాడు. ‘ఎంతబాగా ఆలపించావురా సామగానం !’ అంటూ సంతోషపడి చూసాడు. దానికి గజాసురుడు ..‘‘ శంకరా ! నాదొక కోరిక. దీనికి రక్తం ఎప్పుడూ ఇంకకూడదు. మాంసం ఎండకూడదు. ఈ తోలు ఎండి గట్టిపడకూడదు. దుర్గంధభూయిష్టం కాకూడదు. దీన్ని నీవు ఎప్పుడూ కట్టుకుని కాశీ పట్టణంలో తిరుగుతూ ఉండాలి. నా శరీరం వదిలేసాక తోలువలిచి నీవు కట్టుకోవాలి. ’’ అని ప్రాథేయపడగా ఆయన ‘తథాస్తు’ అన్నాడు. అందుకని ఏనుగు తోలు కట్టుకుని ‘కృత్తివాసీశ్వరుడు’ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిసాడు. ఇప్పటికీ అక్కడ శివలింగం ఏనుగు పష్ఠభాగం ఆకారంలో కనబడుతూ ఉంటుంది. త్యాగరాజుగారు... సామగాన సారంగా నిలబడి, నాదమును తనువుగా పొందిన శివుడిని వారమ్ వారమ్ .. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను... అన్నాడు. భారతీయ సంగీతం అంతా స–రి–గ–మ–ప–ద–ని..అనే ఏడు స్వరాల నుంచి వచ్చింది. మన సంగీత వైభవానికి ఈ సప్త స్వరాలే ప్రాణం పోస్తున్నాయి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సామవేద సారమిదీ..
భారతీయ సంస్కృతీ వైభవంలో భాగంగా... నాదమే శంకరుడి శరీరం.. అంటూ త్యాగరాజు తన కీర్తన ద్వారా ప్రతిపాదించిన సంగీత తత్త్వాన్ని ప్రస్తావించుకుంటూ ‘మోదకర..’ అంటే అది సంతోషం ఇవ్వగలిగినదని ఆయన చెప్పిన విషయాలను తెలుసుకుంటున్నాం. మోదము అంటే హర్షము. సంతోషం ఇవ్వగలిగినది శాంతి. శాంతి అంటే ...ఎంత అనుభవించినా..రుచి తీరదు. ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించడమే కాదు... అసలు నిజంగా పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితికన్నాకూడా సుఖమయమైన స్థితి మరొకటి ఉండదు. ఆ స్థితికి చేరుకుంటే... మనసు కదలకుండా ఉండిపోతుంది. (చదవండి: సంసార జీవితంతో వేగలేను) నీళ్ళ కొలనులో రాయి వేస్తే... కెరటాలు వస్తాయి.. ధ్యానంలో కూడా అలా కదిలిన మనసును స్థిరం గా నిలబెట్టడానికి షోడశోపచారాలతో మళ్ళీ పరమేశ్వరుడి వద్దకు తీసుకెళ్ళినప్పుడు.. పరమ సంతోషం అక్కడే ఉద్బుదం అవుతుంది. సంçస్కృతి–అంటే తడి కలిగి ఉండడం... ఆర్ద్రత. ఒక విత్తనానికి తడి తగిలితే అంకురం వస్తుంది... అలాగే ఇది. కళకు, సంస్కృతి కి ఉండే గొప్పతనం ఏమిటంటే– అది అవతలివారిలో మంచి అధ్యవసానంతో కూడుకున్న బుద్ధిని నింపుతుంది. శాంతాన్ని నింపుతుంది. ఆ శాంతాన్ని ఇవ్వగలిగిన వేదం–సామవేదం. సామ–ఆమ.. అంటే శాంతి అనే అర్థం. సామగానం చేస్తే వెంటనే శాంతి కలుగుతుంది. సామగానం దీర్ఘంగా ఊపిరిపట్టి చేయాలి. అంత స్వరంతో అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఊపిరి బిగపట్టడం కష్టమవుతుంది. ఫలితంగా స్వరభంగమవుతుంటుంది కూడా.(చదవండి: అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది) ఇతర వేదాలను చదివేటప్పుడు స్వరభంగం దోషం. అనుమతించరు. కానీ సామవేదం చదివేటప్పుడు కించిత్ స్వరభంగం జరిగినా... పట్టించుకోకూడదు. అందుకే ‘‘వేదానం సామవేదోస్మి’’ అంటాడు కృష్ణ భగవానుడు. అంటే వేదాలలో నేను సామవేదాన్ని–అని. సామము పాడితే శాంతి కలుగుతుంది. సామదానం జరిగితే ప్రశాంతత దొరుకుతుంది. సంగీతం సామవేదంలోంచి వచ్చింది. సంగీతం తక్షణ ఫలితం ఏమిటి? అవతలివాడు ప్రశాంత పడతాడు. అంటే... అస్థిమితంగా ఉండేవారు శాంతిపొందుతారు. సంగీతం గురించి మాట్లాడుతూ–‘సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయమ్ ఏకమాపాత మధురం అన్యదాలోచనామతమ్‘. సంగీతసాహిత్యాలు– సరస్వతీ దేవి రెండు పాలిండ్లు. సంగీతమనే స్తనంలోంచి వచ్చిన పాలు అవతలివాడి ప్రజ్ఞాపాటవాలతో సంబంధం లేకుండా సంతోషాన్నిస్తాయి. అదే సాహిత్యమయితే కొంత శక్తి ఉంటే తప్ప అర్థం చేసుకుని ఆనందాన్ని పొందలేరు. ‘‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః’’. ఎప్పుడూ అస్థిమితంతో, కోపంతో ఊగిపోయే పాము కూడా సామగానం వినపడితే పడగ అలాగే పెట్టి ఆగిపోతుంది. కదలదు. ఎప్పుడూ అస్థిరంగా కదిలిపోతూ, ఏడుస్తూ, అటూ ఇటూ తిరుగుతూ, అల్లరి చేసే పిల్లలు కూడా సామగానం వినపడితే అలా నిలబడిపోయి సంతోషాన్ని పొందుతారు. బుద్దిలేని జీవులు కూడా అటువంటి సంగీతానికి ప్రసన్నత్వాన్ని పొందుతాయి. కారణం– అది సామవేదంలోంచి రావడం. అది శాంతి కారణం. శాంతి కారకం కావడానికి సంగీతం తప్ప–అదివిని మనసులో అశాంతి కలగడానికి సంగీతం సాధన కాదు. అటువంటి ‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అన్నారు త్యాగరాజస్వామి. నిగమాలు అంటే వేదాలు. వాటిలో ఉత్తమమైనది సామవేదం. దాని సారమే పరమశివుడు. అందుకే ఆయన నటరాజుగా నిలబడ్డాడు. అన్ని కళలు ఆయననుండే వచ్చాయి. అలా రాశీభూతమైన సామవేద సారము శివుడే. ఇది భారతీయ సంగీతానికున్న గొప్పతనం. ఇదీ భారతీయ సంస్కృతికి పునాది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘నేను ఉన్నాను’...అనడానికి గుర్తు అది
మంగళ సూత్ర ధారణ చేస్తూ వరుడు ‘‘మాంగల్య తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశ్శతమ్’’. ఈ మాట మరెవరితోనూ అనడు. కానీ ఆ ఆడపిల్లతో అంటాడు. ‘‘నేను నీ మెడలో కడుతున్న ఈ మంగళ సూత్రం – నేనున్నాను అనడానికి గుర్తు. ఇది నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేనున్నానని గుర్తు. నేను ఈ ఊళ్ళో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కనపడకపోవచ్చు. ఆయన ఉన్నాడా... అన్న అనుమానం లేదు. ఆమె మెడలోని మంగళ సూత్రం ఆయన ఉన్నాడనడానికి సంకేతం. మంగళ సూత్రం కంఠం లోనే ఎందుకు కట్టాలి ...అంటే పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వానికి అది తగులుతుంటే ఆ మంగళ సూత్రానికి ఎప్పుడూ ఏ ఆపదా రాదని నమ్మకం. ఈ కంఠం పైన ఉన్న జ్ఞానేంద్రియాలకు, బుద్ధిస్థానానికీ, కింద ఉన్న కర్మేంద్రియాల సంఘాతానికీ మధ్యలో ఉన్న కవాటం అది. నేను మాట్లాడుతున్నప్పుడు నా కాలిపై దోమ కుడుతున్నదనుకోండి. నాకు బాధ పుడుతున్నదని కాలు బుద్ధి స్థానానికి మొరపెట్టుకుంటుంది. ‘మాట్లాడడానికి అవసరమైన బుద్ధి ప్రచోదనం చేస్తున్నాను... ఇప్పడు కుదరదు’’ అని బుద్ధి అనదు. ఒక పక్క వాక్య నిర్మాణానికి అవసరమయిన విషయాన్ని ఇస్తూనే పక్కనే ఉన్న రెండవ కాలిని ‘‘నువ్వు వెళ్ళి దోమను తరుము, దోమ కుట్టిన చోట ఉపశమనం కలుగచేయి’’ అని ఆజ్ఞాపిస్తుంది. కింద ఉన్న శరీర సంఘాతం గురించి పైన బుద్ధి స్థానంలో ఉన్న తల పట్టించుకుంటుంది. వాటి సహకారానికి గుర్తు కంఠం. అంతే కాదు, కంఠంలోంచి అన్నం కడుపులోకి చేరుకుంటుంది. అది శక్తిగా మారి శరీరావయవాలన్నీ బలం పొందుతాయి. అలా భార్యాభర్తలు కలసి ఉండాలి. అవి ఎలా కలిసి ఉన్నాయో మనం కూడా అలా కలిసి ఉండెదము గాక... అందుకు మంగళ సూత్రం కంఠంలో కడతారు. తరువాత తలంబ్రాలు. ఇది ఒకరిమీద ఒకరు పోసుకుంటూ హాస్యం కోసం చేసే వేడుక కాదు. బియ్యం మీద పాలచుక్కలు వేసి తీసుకొస్తారు. నడుము విరగని బియ్యం(అ–క్షతలు) ఎలా ఉంటుందో అలా మేము కూడా కలిసి ఉండెదము గాక. పూర్ణత్వాన్ని, మంగళప్రదత్వాన్ని పొందెదము గాక. అందుకే ‘‘ప్రజామే కామస్సమృద్యతామ్ (మాకు ధార్మికమైన సంతానం పుష్కలంగా కలుగుగాక), పశవో మే కామస్సమృధ్యతామ్ (పాడిపంటలు మాకు పుష్కలంగా కలుగు గాక), యజ్ఞో మే కామస్సమధ్యతామ్ (మాకు యజ్ఞాలు చేసే ఆలోచన సమృద్ధిగా కలుగు గాక), శ్రియో మే కామస్సమృధ్యతామ్ (మాకు ఐశ్వర్యానికి వైక్లబ్యం కలుగకుండుగాక).. అని దేవతలను కోరుతూ ఈ తలంబ్రాలు పోసుకుంటారు. అవి పోసుకున్న వేళ దేవతలు కటాక్షిస్తారు. సభంతా ప్రశాంతంగా వారిని తలంబ్రాలు పోసుకోనివ్వాలి. అది వాళ్ళ జీవితం. వాళ్ళు వృద్ధిలోకి రావలసిన వాళ్ళు. మూడుసార్లు అయిపోయిన తరువాత వేడుక కోసం పోసుకోవడానికి శాస్త్రం కూడా అంగీకరించింది. అప్పుడు సంతోషం కొద్దీ మనం ప్రోత్సాహ పరిచినా, ఉత్సాహ పరిచినా ఏదో వేడుక చేసినా అందులో దోషం రాదు. కానీ వాళ్ల జీవితానికి అభ్యున్నతి కోసం జరుగుతున్న మంత్ర భాగాన్ని జరగనివ్వాలి. శాస్త్రీయమైన కర్మ జరుగుతుండగా దాన్ని ఆక్షేపించే రీతిలో ప్రవర్తించడం సభామర్యాద కాదు. రాక్షస గణాలు చేసే అల్లరి అనిపించుకుంటుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇకపైన ఇది నాది కాదు
విశ్వనాథ సత్యనారాయణ గారు ‘వేయిపడగలు’ అని నవల రాస్తే పివి నరసింహారావుగారు దానిని ‘సహస్రఫణ్’ పేరిట హిందీలోకి అనువదించారు. 999 పడగలు చితికిపోయినా వివాహం అన్న ఒక్క పడగ నిలబడి ఉంటే భారతదేశంలో మన సంస్కృతి నిలబడుతుందన్నారు. నా కూతురును ధర్మమునందు, కామమునందు, అర్థమునందు అతిక్రమించకూడదని వరుడికి చెబుతారు. కామాన్ని ధర్మపత్నితో ముడివేస్తారు. అందుకే ఈ దేశంలో పత్నిని ధర్మపత్ని అని పిలుస్తారు తప్ప కామపత్ని అని పిలవరు. అంటే ఈ దేశంలో వివాహం చేసినప్పుడు ఆడపిల్లకు ఎంత సమున్నత స్థానమిచ్చారో, ఎంత కీర్తి కట్టబెట్టారో, ఆమెయందు పురుషుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలని మనకు తెలియచేశారో అర్థమవుతుంది. నేను విశాఖపట్టణం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు...నా పెళ్ళి నిశ్చయమయిన రోజులు. నామిత్రుడొకరు నాతో మాట్లాడుతూ భార్యంటే... ఈశ్వరుడిచ్చిన జీవితకాల స్నేహితురాలు.. అన్నారు. ఎంత గొప్పమాట.. నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే –ఆమెను స్నేహభావంతో చూడాలి తప్ప ... తాను చెప్పినట్లు విని తదనుగుణంగా నడుచుకుతీరాల్సిన దాసి అన్న భావనతో చూడొద్దని నాకు హెచ్చరిక అది. జీవితాంతం కలిసి ఉండడానికి పరమేశ్వరుడిచ్చిన గొప్ప స్నేహితురాలు భార్యంటే. ఆమె పురుషుడికి శాంతి స్థానం. ఆమెకు చేసిన ప్రమాణాన్ని పురుషుడు ఉల్లంఘించడు. ఒకరు చూసారా, చూడలేదా...అని కాదు, తాను చేసిన ప్రమాణానికి తాను కట్టుబడడం తన శీల వైభవం. అందుకే మహానుభావుడైన రామచంద్రమూర్తి దక్షిణ నాయకత్వంలో పుట్టినా ఏకపత్నీ వ్రతాన్ని పాటించి మనుష్యుడైన వాడు ఎలా బతకాలో నేర్పాడు. అలాగే మనకు ఆడపిల్లను కన్యాదానం చేసేటప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. ‘ఇదం న మమ’ ...‘‘ఇకపైన ఇది నాది కాదు’’ అని అనరు. ..‘‘ప్రతిపాదయామి’’ అంటారు. ‘‘ఈమెను నీకు ధర్మపత్నిగా ఇస్తున్నా’ అని చెప్పి వరుడికి అప్పగిస్తే..‘‘ఓం స్వస్తి’’ అని ఆంటూ ఆయన పుచ్చుకుంటారు. అంటే పుట్టింటి వారికి ఆమె మీద అధికారం ఉన్నది. కన్నతల్లిదండ్రులు, పెంచి పెద్దచేసిన వారు ఆడపిల్లనిచ్చి పెళ్ళి చేసినంతమాత్రాన ఆమెను మీ ఇంటికి పంపననే అధికారం అసలు భర్తకు ఎక్కడినుంచి వస్తుంది? అలా అన్నవాడు భర్త ఎలా అవుతాడు? అలా అనడానికి అత్తమామలు ఎవరు? తల్లిదండ్రులు ఎప్పుడు కావాలన్నా ఆ పిల్లను ఇంటికి తెచ్చుకోవచ్చు. ‘‘అమ్మా! నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. 104 డిగ్రీల జ్వరం వచ్చిందమ్మా. కన్నుమూసినా తెరిచినా కనబడుతున్నావు. ఒక్కసారి రా తల్లీ!’’ అని అడిగే అధికారం తండ్రికున్నది. ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి కానీ, పంపను అనడానికి కానీ, ఆమె మీద ఇక సర్వాధికారాలు నావే...అనడానికి కానీ అధికారాలు ఎవరికీ లేవు. కడుపున పుట్టిన బిడ్డ మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఎటువంటిదో, అది ఎంత ప్రశ్నింపరానిదో, ఎంత ప్రేమతో ప్రవర్తించాలో జీవితాంత హెచ్చరికగా వివాహక్రతువులో వాడిన మంత్రాలు పరిశీలిస్తే ప్రేమకు, హదయంలో లాలిత్యానికి, ఆ హదయ సౌకుమార్యానికి ఎంత పట్టాభిషేకం చేసారో అర్థమవుతుంది. ఇంత గొప్ప మనసుతో ఈ వివాహ క్రతువును నిర్ణయించిన రుషులకు రుణపడి ఉన్నాం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పెళ్ళి ఛాందసమా, సదాచారమా!!
జీలకర్ర, బెల్లం పెట్టింది సుముహూర్తం కాదు, వధూవరులు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం. దేశాచారాన్నిబట్టి ఒక్కోచోట పాణిగ్రహణం, మరికొన్ని చోట్ల మంగళ సూత్రధారణ సుముహూర్తానికి చేస్తారు. సాధారణంగా తెలుగునాట ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుని ‘అఘోర చక్షుః’ అన్న మంత్రం చెప్పిన స్థితి... ఆ కాలం సుముహూర్తం. మరి జీలకర్ర, బెల్లం పెట్టుకోవడం ఎందుకు? జీలకర్ర మంగళ ద్రవ్యం. బెల్లం నిలవదోషం లేని పదార్థం. ఈ రెంటినీ కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్ పుడుతుంది. వధువు వరుడు ఆ బ్రహ్మస్థానంలోజీలకర్ర బెల్లం ఉంచితే – ఒకరికోసం ఒకరు త్యాగం చేసి ఇద్దరూ ఒకే రకమైన మనఃస్థితిని పొంది–‘‘పోన్లే! ఏదో చెబుతోంది. అంతగా నేను పట్టుదల చూపాల్సిన అవసరమేముంది?’’ అని ఆయన త్యాగబుద్ధితో ప్రవర్తించడం, ‘‘పోన్లే, నాకిష్టమున్నా లేకున్నా మీరు చెబుతున్నారుగా.. చిన్న విషయానికింత పట్టుదల ఎందుకు.. అలాగే చేద్దాం’’ అని ఆమె అనుకుంటే వారి దాంపత్యం ఒక బండికి రెండు చక్రాలవుతుంది. అలా ఇద్దరి మనసులు ఏకీకృతమవడానికి జీలకర్ర, బెల్లం ఒకరి తలమీద ఒకరికి పెట్టిస్తారు. అంటే...వివాహ క్రతువు ఛాందసత్వంతో చేసేది కాదు. ఇద్దరూ కలిసి బతకాలని, ఇద్దరి మనసులూ ఏకీకృతం కావాలని శారీరకంగా ఒకరినుంచి మరొకరు దూరంగా ఉన్నా, వాళ్ళమనసులు వేరు కాకూడదని, ఇద్దరి మనసులలో భార్య మనసులో భర్త, భర్త మనసులో భార్య ఉండాలని, అంత ప్రేమైకమూర్తులయి జీవించాలని ఇటువంటి సదాచారాన్ని ప్రవేశపెట్టారు. సుందరకాండలో...శిశుపా వృక్షంనుంచి సీతమ్మను చూసి స్వామి హనుమ. ‘‘సీతమ్మ మనసు సీతమ్మ దగ్గరుండి, రాముడి మనసు రాముడి దగ్గరుంటే వీరద్దరూ బతికి ఉండేవారు కాదు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది.’ అని అంటారు. ఇది దాంపత్యానికి ప్రతీక. తన మనసు తన దగ్గరే ఉంటే అది కోతి, గాడి తప్పుతుంది. అలా కాక తన మనసు ఆమె దగ్గర ఉండాలి, ఆమె మనసు తన దగ్గర ఉండాలి. ఇద్దరూ బాహ్యంగా రెండుగా ఉన్నా, వాళ్ళు మాత్రం మానసికంగా ఒకటై బతకాలి. అందుకే అటువంటి ప్రీతి వారిలో అంకురించాలని అంత శాస్త్రీయమైన క్రతువు చేస్తారు తప్ప ఛాందసత్వం కానీ, లేకపోతే ఏదో తంతుగా ఆ పని చేయాలనీ కాదు. రుషిప్రోక్తమైన సనాతన ధర్మంలో వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే పిల్లనిచ్చేటప్పుడు మామ గారు అల్లుడి చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు. ‘ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య’ అని ప్రమాణం చేస్తే పిల్లనిస్తానంటాడు. అంటే ధర్మంలో, అర్థంలో, కామంలో ఈమెను అతిక్రమించను.. అని ప్రమాణం చేయమంటాడు. వరుడు ‘నాతి చరామి’ అంటాడు. అంటే ‘సమస్త దేవతల సాక్షిగా నేను ఈమెను అతిక్రమించను’ అంటాడు. పెళ్ళి చేసుకోవడం... పదిరోజులయ్యేటప్పటికి ఏదో అర్ధం లేని చిన్న కారణానికి విడాకులు ఇచ్చేసుకోవడం తమ ఇచ్ఛ వచ్చినట్లు జీవించడంవంటి ధోరణులు ఈ దేశంలో రాలేదంటే...ఈ దేశం యొక్క సంస్కృతికి ఆయువుపట్టు ఎక్కడుందీ అంటే – నిస్సందేహంగా మన వివాహ వ్యవస్థలోనే. అందుకే ఇతర దేశాలు మన సంస్కృతికి నమస్కారం చేస్తాయి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సుముహూర్తంలో వీడియో చూపులా!!
వివాహం చేసేటప్పుడు ‘సుముహూర్తము’ అని ఒకటుంటుంది. అంతకు ముందు వరకు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పక్కపక్కన కూర్చోరు. ఆ సమయంలో ఇద్దరూ అభిముఖంగా కూర్చుంటారు. మధ్యలో తెరపడతారు. వధూవరులిద్దరూ ప్రత్యక్షంగా ఆ సుముహూర్తంలో తెరదించంగానే ఒకరికళ్ళలోకి ఒకరు చూసుకోవాలి. ఎందుకలా!!! జ్యోతిషం వేదానికి ఉపాంగం. వేదానికి నేత్రస్థానంలో ఉంటుంది. అది ఒక శాస్త్రం. దానిని ఆధారం చేసుకుని రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని చెప్పిన మహాపండితులు ఎందరో ఉన్నారు. అలాగే ప్రతి వ్యవస్థలో ఉన్నట్లే శాస్త్ర పరిజ్ఞానం సరిగా లేనివాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఒక వైద్యుడు తప్పు చేస్తే రోగం వికటించి ఒక వ్యక్తి మరణించి ఉండవచ్చు. అంతమాత్రం చేత లోకంలో అసలు జబ్బులు నయం చేసే వైద్యుడే లేడని, వైద్యశాస్త్రమే లేదని, వైద్యశాలలకు వెళ్ళవద్దని అంటామా? అలాగే జ్యోతిశ్శాస్త్రంలో ఎవరో ఒక సిద్ధాంతి పొరపాటు పడి ఉండవచ్చు. అంతమాత్రం చేత అది శాస్త్రం కాదని నిర్ధారించడానికి మనమెవరం ? ఆ శాస్త్రంలో సరైన ప్రవేశాన్ని పొంది గురుముఖతః నేర్చుకుని గ్రహాలను వీక్షించి భవిష్యత్తులో జరగబోయే సందర్భాలు చెప్పగలిగిన ప్రజ్ఞ పొందుతాడని శాస్త్ర వచనం. వరాహమిహిరులవంటి వారు ఎందరో జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యాన్ని దాని సమర్థతను నిరూపించారు. ఇప్పటికీ పంచాంగ రచన చేస్తే గ్రహణ కాలాన్ని... పట్టువిడుపులను ఘడియలు, విఘడియలతో సహా లెక్కగట్టి చెప్పడాన్ని చూస్తూనే ఉన్నాం కదా. సూర్యోదయ, సూర్యాస్తమయాలను కూడా లెక్కగడుతున్నారు కదా పంచాంగ కర్తలు. అంత కచ్చితంగా సిద్ధాంతులు లెక్కగట్టి పంచాంగాలు ఇవ్వగలుగుతున్నప్పుడు ‘సుముహూర్తం’ విషయంలో భిన్నాభిప్రాయం ఎందుకుండాలి? ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఫలవంతం కావాలని, సంతోషంగా కలిసి గడపాలని సుముహూర్తం నిర్ణయించి ఒకరి కన్నులలోకి మరొకరిని ఆ సమయంలో చూసుకోమంటారు. అలా చూసుకోకపోవడం పిల్లల తప్పు కాదు. వాళ్ళను అలా చూసుకోవాలని చెబుతూ ప్రోత్సహించాల్సింది పెద్దలమయిన మనం. అంతేతప్ప పక్కన వీడియో ఉంది.. చూడండని చెప్పడమేమిటి? అప్పుడు జరిగే మంత్ర భాగానికి అర్థం ఏమిటంటే... ‘‘నేను ఈమె కన్నులలోకి చూసిన ముహూర్తము సుముహూర్తమగుగాక. దీనివల్ల నేను పిల్లాపాపలతో, యజ్ఞయాగాది క్రతువులతో అభివృద్ధిని పొందెదను గాక.’ అని. అవసరమయితే ఆ సుముహూర్తం అయిన తరువాత ఇద్దరూ తల పక్కకు తిప్పడం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు. జీలకర్ర, బెల్లం పెట్టింది సుముహూర్తం కాదు, వధూవరులు ఒకరి కన్నులలోకి మరొకరు చూసుకున్నది సుముహూర్తం. వాళ్ళ జీవితాలు ప్రధానం, వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం ప్రధానం. వాళ్ళని అలా చూసుకోనివ్వాలి. కానీ అలా శాస్త్రం చెప్పిన ప్రయోజనాన్ని విడిచిపెట్టి... తెర దించిన సుముహూర్తంలో వీడియోల్లోకి కళ్ళుపెట్టి చూడమనడం శాస్త్రాన్ని అవమానించడమే అవుతుంది!!! -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సంస్కారాలలో ఏది అత్యంత ప్రధానం..?
మనుష్య జీవనానికి సంబంధించి సనాతన ధర్మం చెప్పిన సంస్కారాలలో అత్యంత ప్రధానమైనది– వివాహం. జన్మించిన ప్రతి వ్యక్తి కూడ తాను గృహస్థాశ్రమంలో ప్రవేశించడం కోసం పొందవలసిన సంస్కారం ఇది. దార్శనికులయిన రుషులు ఒక ప్రత్యేక ప్రయోజనం అపేక్షించి దీనిని వివాహం అని పిలిచారు. వి–అంటే విశిష్టమైన. వాహము–అంటే పొందుట. లోకంలో ఏది విశిష్టంగా ఉన్నదో...అంటే భగవంతుడిని పొందడానికి ఏ ఆశ్రమ ప్రవేశం చేయాలో దాని పేరే వివాహం. (చదవండి: సంస్కారాలను బోధించే కల్పసూత్రాలు) అప్పటివరకు పురుషుడు బ్రహ్మచారి. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించే క్రతువే వివాహం. మరొక ముఖ్యమైన విషయం. సనాతన ధర్మ సంబంధ వాఙ్మయంలో వివాహం అనే మాటకు పక్కన విడాకులు అన్న మాట ఎక్కడా కనిపించదు. రామాయణాన్నికానీ, భారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ పరిశీలించండి. ఎక్కడ కూడా ‘‘నేను నా భార్యకు విడాకులిచ్చాను’’ అని కానీ, ‘‘నేను నా భర్తకు విడాకులు ఇచ్చాను’’అని కానీ కనపడదు. ఒకసారి ఇద్దరూ కలిసి దంపతులుగా ఆ గృహస్థాశ్రమం లోకి ప్రవేశిస్తే– ఇక ఆ జీవితంలో ఇద్దరూ కలిసి అలా ఉండడమే. ఒకవేళ భార్య ఏదయినా పొరపాటు చేస్తే, భర్త ఆమెను దాని నుంచి ఉద్ధరించి మరలా తన పక్కన ఆ స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు తప్ప ఈ దోషం చేసినదని చెప్పి విడాకులివ్వడం ఉండదు. ఇదే మనకు రామాయణం బాలకాండలో అహల్య వృత్తాంతం నిరూపిస్తుంది. జీవితాంతం కూడా పురుషుడు, స్త్రీ కలిసి ఉండడం, ధార్మికమైన సంతానాన్ని పొందడం, కామాన్ని ధర్మంతో ముడిపెట్టడం, తద్వారా భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన ప్రయత్నం చేయడం అనేది వివాహం.. అనే వ్యవస్థ ద్వారా సాధింపబడుతుంది. (చదవండి: వేదవాఙ్మయం: ధర్మాలు అంటే ఏంటి..?) ఇందులో మూడు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. మొదటిది ధార్మికమైన సంతానాన్ని పొందడం. పురుషుడు సముద్రం లాటి వాడు. సముద్రం హద్దులు అతిక్రమించకుండా చెలియలికట్ట అనేది ఉంటుంది. అది వేదం యొక్క తాత్పర్యాన్ని ప్రతిపాదిస్తుంది. అలాగే పురుషుడు ఎంత శక్తిమంతుడయినా తాను మాత్రం తన తేజస్సును వేరొక చోట నిక్షేపించడానికి వీలు లేదు. అది కేవలం తన ధర్మపత్నియందు మాత్రమే నిక్షేపించి తనకు ప్రతిబింబమైన సంతానాన్ని పొందుతాడు. అందుకే ‘ఆత్మా వై పుత్రనామాసి’ అన్నారు. పురుషుని ఆత్మయే ఈ లోకంలో పుత్ర రూపంలో తిరుగుతుంటుంది....అంది వేదం. అలా ధార్మికమైన సంతానాన్ని పొందాలి. జన్మతః ప్రతి వ్యక్తి కూడా మూడు రుణాలతో ఉంటాడు. పితృ రుణం, రుషి రుణం, దేవ రుణం. పితృ రుణం అంటే తనకు తన తండ్రి ఎలా శరీరాన్ని ఇచ్చాడో, జన్మను ఇచ్చాడో అలా తాను కూడా సంతానానికి జన్మనివ్వాలి. అలా చేస్తే పిత రుణంనుంచి విముక్తి పొందుతాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే దేవరుణం నుంచి, రుషులు ఇచ్చిన వాఙ్మయాన్ని చదువుకుంటే రుషి రుణంనుంచి విముక్తుడవుతాడు. కాబట్టి పితృరుణం నుంచి విముక్తి పొందాలంటే సంతానాన్ని పొందాలి. అదీ ధార్మికంగా పొందాలి. మనిషి వ్యక్తిగత జీవనంతోపాటూ, సామాజిక జీవనం కూడా గాడితప్పకుండా ఒక క్రమ పద్దతిలో నడవడానికి మన పెద్దలు ఎంతో పకడ్బందీగా రూపొందించిన వ్యవస్థ మన వివాహ వ్యవస్థ. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రాముని సేవించడమంటే ధర్మాన్ని పాటించడమే
-
ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే చేయాలి
కాలం భగవంతుని స్వరూపం. ఈ సష్టిలో అత్యంత బలమైనది కాలమే. కాలానికి సమస్త జీవరాశీ వశపడవలసిందే. కాలానికి లొంగకుండా బతకగలిగినది ఈ సష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీ రామాయణంలో కాలం గురించి చెబుతూ...‘‘కాలోహి దురతి క్రమః’’ అంటారు మహర్షి. అంటే ..కాలాన్ని దాటడం, తనకు వశం చేసుకోవడం, దాన్ని కదలకుండా చేయగలగడం...లోకంలోఎవరికీ సాధ్య పడదు–అని. సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలానికి వశపడవలసిందే. కాలంలో పుడతారు, కాలంలో పెరుగుతారు, కాలంలోనే శరీరాన్ని విడిచి పెడతారు. అందరూ కాలానికి వశపడి ఉంటారు. కానీ ఎవడు భగవంతుడిచ్చిన జీవితం అనబడే ఈ శరీరంతో ఉండగలిగిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచి పెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడిగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందికి ప్రేరణగా అలా నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది – కాలం విలువను గుర్తించడం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలం విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. ఆ జీవితం ఏ విధంగా కూడా ఉపయోగకరం కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికిగానీ, మరొకరిని ఉద్ధరించడానికిగానీ పనికిరాడు. కాలం విలువ తెలిసి ఉండాలి. అందుకే రుషులు కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేసారు. సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేసారు. దాన్ని ఉత్తరాయనం, దక్షిణాయనంగా విడదీసారు. దక్షిణాయనం అంతా భగవంతుడిని ఉపాసన చేయవలసిన కాలంగా నిర్ణయించారు. మళ్ళీ దాన్ని నెలగా, దాన్ని శుక్ల, కష్ణ పక్షాలుగా, పక్షంలో ఒక రోజును తిథిగా దాన్ని పగలు, రాత్రిగా విభజించారు. ఎన్ని విభాగాలుగా చేసినా దాని ప్రయోజనం – ఆ కాలాన్ని, దాని వైభవాన్ని ఎన్ని రకాలుగా మనిషి గుర్తించగలడో గుర్తించి, దాని చేత మనిషి సమున్నతమైన స్థానాన్ని పొందగలుగుతాడు. కాలంలో ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని అప్పడు చేసినవాడు తాను ఆశించిన స్థితిని పొందుతాడు. శ్రీ రామాయణంలో ఒక మాటంటారు...సత్పురుషులయిన వాళ్ళు కోపానికి వశులుకారు–అని. కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు. ఎవర్ని చూస్తే కోపం వస్తుంది? కేవలం ఒక పనిని గొప్పగా చేయడం కాదు. ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పనిని అప్పుడు చేసినవాడు ధన్యుడు. అలా కాకుండా ఒక పనిని చేయవలసినప్పుడు కాకుండా వేరొక సమయంలో చేసిన వాడు, ఆలస్యం చేసిన వాడు, సమయానికి చేయనివాడెవడో వాడిని చూస్తే సత్పురుషులకు కోపం వస్తుంది. అంటే కాల విభాగం లో ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చేయవలసి ఉంటుంది. సాక్షాత్ భగవంతుడు అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చినా.. ఆయనను నిద్ర లేపాల్సి వస్తే ఆ కాలము నందు అతను చేయాల్సిన పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది...‘‘కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్...’’ అని. -
తరువాత ఏడ్చి ఉపయోగమేమిటి!
55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో. అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్దిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా... నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ? రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే... విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు...‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడీ? అన్నయ్యా! చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? చంపించేసాను.’’ అని తలచుకుని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ‘‘నా అన్న వాలి. ఎదుటివారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను... అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి’’ అని వేదనా భరితుడయినాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళదికాదు. అలా బతకగలిగారంటే.. వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి... బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. ‘‘మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు... అంటే మీ నాన్న దశరథ మహారాజుగారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది.. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?’’ అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా! అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు.. అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్తకన్నా నాకేం కావాలి ?’’ అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు పదిమంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చాగంటి కోటేశ్వరరావుకు జీవన సాఫల్య పురస్కారం
-
లక్ష తేళ్ళు కుడుతున్న ఆ బాధలో..
‘నా చేయి పట్టుకున్నందుకు, నా మెడలో మంగళ సూత్రం కట్టినందుకు ఆయనకు నేను ఇచ్చుకోదగిన మహత్తర బహుమానం, భరోసా ఏమిటి?’ అంటే... ఆమె తన భర్తకి కొడుకుని కని ఇవ్వడమేనట. ఎందుకలా...!!! తాను వృద్ధాప్యాన్ని పొందితే, ఆ కొడుకు తన భుజం మీద చెయ్యివేసుకుని ఆసరాగా నడిపించుకుంటూ ఆ సభలో తనను తీసుకు వెడుతుంటే....అక్కడ తనకే పౌర సన్మానం జరిగినంతగా తండ్రి సంతోషపడిపోతాడట. తన కొడుకు పెద్దవాడవుతుంటే చూస్తూ సంతోషపడిపోతాడట. అన్నిటికన్నా విశేషం... ఆయన అన్నిటికన్నా గొప్పవాడు. ఆయనకు సత్కారం చేయదలిచి ఏదిచ్చినా తక్కువే.. అంత గొప్పవాడు. అసలు ఆయనకు కోరిక ఉంటే కదా..సంతోషిస్తాడనడానికి. మరటువంటి ఆయనను సంతోషపెట్టడమెలా, ఆయనకు సత్కారం ఎలా ? అది లోకంలో ఒక్కటే ఉంది. అది ఆయన కొడుకు చేతిలో ఓడిపోవడమే. ‘పుత్రాదిచ్చేత్ పరాజయం...’ ఒక మహా విద్వాంసుడున్నాడు. ఆయన సభలో వచ్చి మాట్లాడుతుంటే ఆయనను కాదని నిలబడగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. శాస్త్రంలో అంత నిష్ఠ గలిగిన వాడు. గండపెండేరాలో, స్వర్ణ కంకణాలో, దుశ్శాలువలో, పంచెలచాపులో, సన్మాన పత్రాలో, బిరుదులో... ఇవేవీ ఆయనను సంతృప్తిపరచలేవు. ఆయన వాటి స్థాయిని ఎప్పుడో దాటేసాడు. మరి ఆయనను సంతృప్తి పరచగలిగిన సత్కారం ఏది ? ఆయన కడుపున పుట్టిన కొడుకు కూడా విద్వాంసుడై ఒకనాడు తండ్రి ప్రతిపాదించిన సిద్ధాంతం వంక చూసి‘నాన్నగారూ, ఏమీ అనుకోకండి మీరు ప్రతిపాదించిన సిద్ధాంతంలో కించిత్ దోషం కనబడుతున్నది... అలాకాక ఇలా చెబితే దానికి పూర్ణత్వం వస్తుంది కదా...’ అన్నప్పుడు ఆ తండ్రి ఆనందబాష్పాలు రాలుస్తాడట. ‘అబ్బ! నన్ను ఓడించే సామర్ధ్యం గల కొడుకు పుట్టాడు. నేను ఓడిపోయాను’ అని సంతోషిస్తాడట. అటువంటి సత్కారం పొందాలంటే అటువంటి కొడుకు పుట్టాలి. సుబ్రహణ్యస్వామి ప్రణవానికి అర్థం చెప్పగా విని ‘వీడి చేత నేను సత్కారం పొందాను. వీడు నాకన్నా బాగా చెప్పాడు’ అని శంకరుడంతటి వాడు కొడుకు మాటలు విని, కొడుకు ప్రాజ్ఞత చూసి పొంగిపోయాడు. మరీ ముఖ్యంగా ప్రాణోత్క్రమణవేళలో లక్షతేళ్లు కుట్టిన బాధ కలుగుతుందట. కొడుకు తొడమీద తల పెట్టుకుని ఆ కొడుకు చెయ్యిపట్టుకుని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు అంత బాధనుంచి కూడా ఉపశమనం పొందుతాడట. కొడుకు ఒళ్ళో శరీరం వదలడం కాశీ పట్టణంలో శరీరం వదలడంతో సమానం అంటారు. ‘ఆత్మావైపుత్రనామాసి..’ అంటుంది శాస్త్రం. తన ఆత్మ బయట మరో రూపాన్ని పొంది తిరిగితే అదే కొడుకు. అలా ఇచ్చింది ఎవరు? తన భర్తకు అటువంటి అపురూప కానుకను ఇచ్చినందుకు వృద్ధాప్యంలో తన భర్తకు ఆసరా అవకాశం కల్పించినందుకు ఆ పిచ్చితల్లి పొంగిపోతుంది. ఆఖరున తండ్రి శరీరానికి ఆనంద హోమం చేసి గయా శ్రాద్ధం పెట్టి ఉన్నత గతులు కల్పించే పుత్రుడిని కని ఇచ్చింది. అటువంటి స్త్రీ కారణంగా పురుషుడు అభ్యున్నతిని పొందుతున్నాడు. శాస్త్రంలో పురుషునికన్నా స్త్రీ వైశిష్ట్యమే గొప్పది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పిలవకపోయినా వాళ్ల ఇళ్లకు వెళ్లాలి
కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమే కాదు. కామము అంటే కోర్కె. కామం ధర్మంతో ముడిపడింది. అందువల్ల ధర్మపత్ని అయింది. ఆమె వల్ల గొప్ప అర్థం వచ్చింది. సుఖాలకు సాధనాలని ‘అర్థము’ అంటారు. అంటే ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతురిని కన్యాదానం చేసాడు. పది తరాలు ముందు, పది తరాల వెనుక, తనది కూడా అయిన ఒక తరం కలిపి... మొత్తం 21 తరాలు తరించాయి. లోకంలో ఏ దానం చేసినా దాని మీద యాజమాన్య హక్కు దాతకు ఉండదు. తానిచ్చానన్న భావన ఆ తరువాత రాకూడదు. కానీ ఆడపిల్లను కన్యాదానం చేసేటప్పుడు ఇది వేరుగా ఉంటుంది. ఆడపిల్లమీద ధార్మిక హక్కు, ఆ కుటుంబంలో సభ్యత్వం.. పుట్టింటిలో ఆడపిల్లకు ఎప్పుడూ ఉంటాయి. ‘‘నాకు చూడాలని ఉందయ్యా, నా కుమార్తెను ఓ పది రోజులు తీసికెడతాను’’ అని అడిగే హక్కు కన్నతండ్రికి ఉన్నది. ‘వద్దు’ అనే అధికారం భర్తకు కానీ, అత్తమామలకు కానీ, మరెవ్వరికి కానీ లేదు. తండ్రికీ, తల్లికీ, తోబుట్టువులకూ ఆ అధికారం ఉంటుంది. ఇంకా చెప్పవలసి వస్తే... కూతురి పుట్టింట మంగళప్రదమైన ఒక కార్యక్రమం జరుగుతున్నది. అల్లుడిగారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఆహ్వానిస్తారు తప్ప పిలుపు లేకపోయినా సరే... కూతురు, అల్లుడు వెళ్ళవలసిందే. ఈ మాట నేను చెప్పడం లేదు, శాస్త్రం చెబుతున్నది. దక్షయజ్ఞం విషయంలో పార్వతీ దేవి శివుడితో అంటుంది...‘‘శంకరా ! నీకు తెలియని విషయమా! మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలకా...పిలవక పోయినా ఆడపిల్ల, అల్లుడు వెళ్ళాలి కదా! నీకు తెలియని ధర్మమా!!!’’ అంటూ కొన్ని సూక్ష్మాలు గుర్తు చేస్తుంది. కొందరి ఇళ్ళకు పిలవకపోయినా వెళ్ళాలి. జనకుడు(తండ్రి), జన నాయకుడు(రాజు), గురువు, మనసెరిగిన స్నేహితుడు. రాజుగారి ఇంట్లో శుభ కార్యం జరిగితే పిలుపు అక్కర్లేదు. వెళ్ళాలి. గురువుగారి ఇంట ఉత్సవం జరుగుతున్నది. పిలవకపోయినా వెళ్ళాలి. మంచి స్నేహితుడు, మనసెరిగిన వాడు... వారి ఇంట జరిగే శుభ కార్యానికి వెళ్ళాలి. పిలుపుతో పని లేదు... అని వివరిస్తూ ఈ విషయాలు నీకు తెలియనివి కాదు కదా శంకరా’’ అంటుంది. ఆడపిల్లను కన్యాదానం చేసినా ఆమె ఉత్తమమైన నడవడి చేత ఆమెను కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు. రెండు వంశాలు తరిస్తున్నాయి. అటువంటి వైభవం నిజానికి పురుషుడికి కట్టబెట్టలేదు. ఇంత పుణ్యాన్ని మూటకట్టిపెట్టి ఇవ్వగలిగినది, ఆప్యాయతకు రాశీభూతమైనది ఆడపిల్ల మాత్రమే. ఆమెను వివాహం చేసుకుని ఆమెయందు తన కామాన్ని ధర్మంతో ముడివేసి వర్తింపచేసాడు కనుక అర్ధాన్ని పొందుతున్నాడు. అంటే సమస్త సుఖాలకు కావలసిన సాధనాలను పొందుతున్నాడు. కూతురు పుట్టింది కన్యాదానం చేసాడు, 21 తరాలు తరించాయి. అలా తరించడానికి కారణం కేవలం ఆడపిల్ల పుట్టినందువల్లేనా ? ఆ ఆడపిల్ల ధర్మపత్ని అయి కొడుకుని కని ఇచ్చింది. అప్పుడు మనసుకు ఒక భరోసా. ఆ భరోసా మూడు రకాలుగా ఉంటుందంటున్నది శాస్త్రం.బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అవకాశాలున్నాయి... అందుకోండి!!!
మహాత్మాగాంధీ ఒకసారి ఆగ్రా కోటకు వెళ్ళారు. లోపలకు వెడుతుంటే ఆయనకు గోడమీద ఒక శిలా ఫలకం కనబడింది. దానిపైన ‘‘ ఈ భూమి మీద ఇది స్వర్గధామం’’ అని రాసి ఉంది. ఆయన వెంటనే పక్కనున్న వారితో ..‘‘ఈ శిలా ఫలకం ఉండవలసింది ఈ ఆగ్రా కోట ముందు కాదు. భారత దేశంలోకి విదేశీయులు ప్రవేశించే ప్రతిచోటా ఇది కనపడాలి’’ అన్నారు. అలా స్వర్గధామంలా ఉండాలంటే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశానికి స్వాతంత్య్రం రావడమంటే కేవలం మనల్ని మనం పాలన చేసుకోవడమే కాదు, పరిశుభ్రంగా కూడా ఉండాలని. దానికోసం ఆయన ఎంత తాపత్రయ పడ్డారో.. వృద్ధాప్యంలో గాంధీగారు పర్యటనలో ఉండగా మరుగుదొడ్డికి వెళ్ళాల్సి వచ్చింది. సహాయకుడు కూడా వెంట వెళ్ళి మరుగుదొడ్డి ఎక్కడో ఉందో చూపి బయట నిలబడ్డాడు. గాంధీగారు 10...15...20 నిమిషాలయినా రాకపోయేసరికి అనుమానం వచ్చింది. ఆరోగ్యం వికటించిందేమోనని ఆందోళన పడుతుండగా ఒళ్ళంతా చెమటలు కక్కుతూ గాంధీగారు బయటకు వచ్చారు. ఏమయిందని సహాయకుడు ఆదుర్దాగా అడిగితే..‘‘నాకన్నా ముందు ఒక సోదరుడు మలవిసర్జనకు వెళ్ళారు. బహుశః అతిసారతో బాధపడుతున్నాడో ఏమో... గోడలు, నేలమీద అంతా మలం చిందింది. అదంతా శుభ్రంచేసి నేను నా పని పూర్తిచేసుకుని వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యం అయింది. పద పోదాం’’ అన్నారు. ‘‘అయ్యో! ఎంత పనిచేసారు, మీరెందుకు శుభ్రం చేయడం. మాకు చెబితే మేం చేసేవాళ్ళం కదా..’’ అని సహాయకుడు అంటే...‘‘నేను చెప్పి మీరు చేయడం కాదు. నిన్నటిరోజున మరుగు దొడ్డి బాగా లేకపోతే గాంధీ బాగు చేసాడు అని అందరికీ తెలిసిన తరువాత మరుగు దొడ్డి ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉంటుంది’’ అని చెప్పారు.అందుకే ‘‘స్వచ్ఛమైన భూగోళం కొరకు, స్వచ్ఛమైన శక్తి కొరకు సర్వదా ప్రయత్నిస్తాను’’ అని అబ్దుల్ కలాం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. గాంధీగారి దగ్గరకు యువతీ యువకులంతా వెళ్ళి తామందరం కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్దంగా ఉన్నామని అంటే...‘‘ఇది మీరు చదువుకోవలసిన వయసు. మీకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరు రాజకీయాల వైపు చూడకండి. మీరందరూ కూడా స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడి, మీతో ఉన్న స్నేహితులను కొందరిని తీసుకుని ఖాళీ సమయాల్లో పార్కులు, వీథులు, వైద్యశాలలు, దేవాలయాలు శుభ్రం చేయండి. అలా అందరికీ మార్గదర్శకం కండి. ఈ దేశ పరిశుభ్రత కోసం పాటుపడండి’’ అని వారికి దిశానిర్దేశం చేసారు.అమ్మ అన్నం వండి అక్కడ పెట్టగలదే కానీ మీ కడుపులోకి పంపి ఆకలి తీర్చలేదు కదా. మీ తల్లిదండ్రులు మీకోసం చదువుకోవడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ధనాన్ని వెచ్చించి పెద్దపెద్ద పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా వేలకోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను చదివించడానికి దాతలు ఎంతో ఉదారంగా ముందుకొస్తున్నారు. ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోండి. ఎక్కడా సమయాన్ని వృథా చేసుకోకుండా చదువుకుని వృద్ధిలోకి రండి. అలాగే సామాజిక సేవతో సామాజిక చైతన్యాన్ని పెంచుకోండి. మంచి నడవడిక అలవర్చుకోండి. ఉత్తమ పౌరులుగా ఎదగండి. మీ చదువు, మీ చైతన్యం చూసి స్ఫూర్తిపొంది మరోపది మంది మీ అడుగుజాడల్లో నడవడానికి అవకాశం ఉంటుంది. -
కాలాన్ని చేజార్చుకోకండి!
విద్యార్థులుగా మీరున్న ఈ వయసు బాగా పటుత్వంతో కూడుకున్నది. ఇప్పుడు మీరు బాగా చదవగలరు. మీరు శ్రద్ధతో వినగలుగుతున్నారు. చక్కగా విషయాలను ఆకళింపు చేసుకోగలుగుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎక్కువసేపు కూర్చోగలరు. అన్నిరకాల వాతావరణాలను తట్టుకునే శక్తి ఉంటుంది. అదే ఒక వయసు దాటిన తరువాత మీకు ఇప్పటి శక్తి ఉండదు. ఇకపైన మనం ఈ పంథాలో ప్రయాణం చేయాలని అనుకోగలుగుతున్నప్పడు మీకు ఆమేరకు అవకాశాలు కూడా ఉంటాయి. మీరు తప్పులు చేసినా వాటిని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిని బంగారు భవిష్యత్తుగా మార్చుకోగలరు. కానీ ఈ అవకాశాలన్నీ దాటిపోయిన తరువాత, తలపండిపోయిన తరువాత, 70 ఏళ్ళు పైబడిన తరువాత ‘ఇది చెయ్యాలి’ అని అనుకుంటే అదంత సులభసాధ్యం కాదు. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. అలా బాధపడాల్సిన అవసరం మీకు రాకుండా ఉండాలంటే కాలం విలువను తెలుసుకోవాలి. దాని గొప్పదనాన్ని గుర్తించాలి. దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలా కావాలంటే ఎప్పడు ఏది చేయాలో అప్పడు అది చేయడం అలవాటు కావాలి. అలవాటు అంటే అలవాటే. దానికి నిరంతరం జాగ్రత్త అవసరం.ఏ సమయంలో ఏది అందుకోవాలో అది అత్యంత శ్రద్ధతో అందుకోవాలి. అంటే – ఆవు పాలు పిండే వ్యక్తి రెండు మోకాళ్ళ మధ్యలో పాల బిందె పెట్టుకుని అవు పొదుగు దగ్గరి సిరములను లాగుతున్నప్పుడు వచ్చే సన్నటి పాలధార నేరుగా బిందెలోనే పడేటట్లు దాని మీద ఎలా దృష్టి పెడతాడో, నేలపాలు కాకుండా ఎలా చూసుకుంటాడో అలా సమయాన్ని విద్యార్థులు ఒడిసి పట్టుకోవాలి.ఒకప్పుడు అంటే తొలి దశలో సచిన్ టెండూల్కర్ తన ఆటమీద ఎంత శ్రద్ధ పెట్టేవాడంటే, ఏ ఒక్క క్షణాన్ని కూడా వృథా చేసేవాడు కాదు. శిక్షణకు వెళ్ళడానికి తెల్ల దుస్తులు తప్పనిసరి. అది అతని దగ్గర ఒకే జత ఉండేది. ఎక్కడో బస్సెక్కి ఎక్కడికో వెళ్ళాలి. పొద్దున్నంతా ఆటలో శిక్షణ తీసుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ముందుగా తన తెల్ల దుస్తులు ఉతికి ఆరేసుకునేవాడు. సాయంకాలానికి అవి వేసుకుని మళ్ళీ ఆటలో సాధనకు బయల్దేరి వెళ్లేవాడు. అతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. సమయాన్ని వృథా చేసుకోకుండా అంత కఠోర సాధన చేసాడు కాబట్టే భారతరత్న కాగలిగాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవారిని మాత్రం కాలం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. అబ్దుల్ కలాంగారు ఆఖరి క్షణాల్లో కూడా కళాశాలలో వేదిక ఎక్కి పిల్లలతో మాట్లాడుతూ తనకు స్పృహ తప్పుతోందని తెలిసి, ఆఖరి మాటవరకు కూడా శరీరాన్ని ఊన్చుకుని తరువాత కిందకు జారిపోయాడు.కె.ఎల్.రావుగారని లబ్దప్రతిష్ఠుడైన ఇంజనీరు ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక మంత్రిగారు ఫలానా సమయానికి వస్తానని చెప్పి ఆ తరువాత ఎప్పడో వచ్చాడు. ఆయనకోసం రావుగారు తన పనులన్నీ వాయిదా వేసుకుంటూ చాలాసేపు చూసాడు. తరువాత వచ్చిన మంత్రిగారితో చర్చించి పంపేసారు. అదేమంత్రిగారు తరువాత పనిబడి ‘‘నేను ఫలానా సమయానికి వస్తున్నాను మీతోపనుంది’’ అన్నప్పుడు...‘‘చెప్పిన సమయానికి వస్తే నేను మీతో మాట్లాడగలను. ఆ సమయం దాటితే నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండలేను’’ అని తన కాలం ఒక మంత్రిగారి కాలం కంటే ఎంత విలువయిందో నిర్మొహమాటంగా చెప్పేసాడు. నిన్న తప్పిపోయిన తరగతులు మళ్ళీ రావు. స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న విద్యార్థులుగా మీకు ఏ ఒక్క క్షణం కూడా జారిపోవడానికి వీల్లేదు. -
కురాయ్ ఒన్రుమ్ ఇల్లై గోవిందా...
హెలన్ కెల్లర్ పాశ్చాత్య దేశానికి చెందిన వ్యక్తి. పుట్టినప్పుడు భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు. అసలు లేకపోతే వేరు. కొన్నాళ్ళు ఉండిపోతే ఆ బాధ వేరుగా ఉంటుంది. క్రమంగా ఆమెకు చూపు పోయింది. కొన్నాళ్ళకు వినికిడి శక్తి పోయింది. మరి కొన్నాళ్లకు మాట్లాడగలిగిన శక్తికూడా పోయింది. ఏదో కొద్దిగా మాట్లాడేవారు. అంత బాగా అర్థమయ్యేది కాదు. కానీ ఆవిడ గొప్పతనం ఏమిటంటే–ఎదురుగా ఉన్నది ఏదయినా సరే, ఇలా ముట్టుకుని స్పర్శజ్ఞానంతో చెప్పగలిగేవారు. చిరునవ్వు ఎప్పడూ ఆమె ముఖం మీదనించి చెరిగిపోలేదు. ఆమె స్నేహితురాలు ఒకరు ఓ రోజు ఉదయం వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చారు. అలా ప్రకృతిలోకి వెళ్ళివచ్చావు కదా, ఇంతసేపు ఏ అందాలు చూసి వచ్చావు... అని కెల్లర్ అడిగారు. ‘‘ఆ... చూడ్డానికేముంది, రోజూ ఉండేదేగా. కాసేపు అలా నడచి వచ్చా.’’ అని స్నేహితురాలు చెప్పింది. వెంటనే కెల్లర్..‘‘నాకు ఒక్క పువ్వుతొడిమ ముట్టుకుంటే.. ఆ తొడిమను అంత సున్నితంగా చేసిన వాడెవరు? దానిమీద ఆ పువ్వు పెట్టిన వాడెవరు? ఆ బరువుకి తొడిమ వంగిపోకుండా నిలబెట్టినవాడెవరు? అందులోంచి సువాసన వచ్చేట్టు చేసినవాడెవరు?...’’ అని కళ్ళులేని దాన్ని పువ్వు ముట్టుకుంటేనే ఆనందంతో చిరునవ్వు వస్తుందే... కన్నులు, చెవులు, నోరున్నదానివి, ప్రకృతి అందాలు అంతా చూసి చూడ్డానికి ఏముందంటావేం? అంది. అదీ హృదయంలో ఐశ్వర్యం ఉండటం అంటే. ఆవిడ ఒకసారి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి కచేరికి వచ్చారు. ఆమె పాడుతుంటే వినడానికి కెల్లర్‌కు అవకాశం లేదు. కానీ సుబ్బులక్ష్మిగారి కంఠంమీద వేలుపెట్టి, ఆ ధ్వని ప్రకంపనలతో గుర్తించేవారు.. ఆమె ఏం పాడుతున్నారో. సుబ్బులక్ష్మిగారి ఆరోజు పాడుతూ.‘కురాయ్ ఒన్రుమ్ ఇల్లై గోవిందా...’ అని ఓ కీర్తన ఆలపిస్తున్నారు. కురాయ్ అంటే.. నాకు ఏ విధమైన ఫిర్యాదు... ఒన్రుమ్... ఒక్కటి కూడా ఇల్లై.. లేదు అని. ‘‘నువ్వు నాకు ఫలానా విషయంలో కష్టాన్నిచ్చావు. దానివల్ల నేను బాధపడ్డాను..అని చెప్పడానికి గోవిందా... నాకు ఏ ఫిర్యాదూ మిగల్చకుండా చేసావు... నాకు సమస్యలు ఇవ్వలేదు, కష్టాలు ఇవ్వలేదు... నాకు నీపై ఫిర్యాదు చేయడానికి... ఇల్లై గోవిందా... ఏమీ లేకుండా చేసావు గోవిందా...’’ అని ఆమె ఆర్తితో పాడుతున్నారు. నిజానికి సుబ్బులక్ష్మిగారు పడినన్ని కష్టాలు మరొకరు పడి ఉండరు. అన్ని కష్టాలకు ఓర్చుకుని ఆ స్థాయికి వెళ్ళారామె. అటువంటి తల్లి త్రికరణశుద్ధిగా ‘నాకు ఫలానాది ఇవ్వలేదని నా దైవానికి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు’ అని పాడుతుంటే... ఆమె కళ్ళవెంట కన్నీరు ధారలు కడుతున్నది. అక్కడే ఉన్న కెల్లర్ ఎలాగూ వినలేదు కాబట్టి ఆవిడ కంఠంమీద వేలుపెట్టి... కీర్తన ముగియగానే వేలు తీసేసి వలవలా ఏడ్చేసారు. సుబ్బులక్ష్మిగారు సంజ్ఞల ద్వారా అడిగారు... ఎందుకు ఏడుస్తున్నారని. దానికి కెల్లర్.. ‘‘నాకు కూడా ఇదే. భగవంతుడు నాకు ఏ సమస్యా ఇవ్వలేదు. నిజానికి నాకు వరాలిచ్చాడు. కళ్ళు, చెవులు, నోరు లేవు... అందువల్ల నేను జీవితంలో చాలా శ్రమపడి వృద్ధిలోకి వచ్చాను. అన్నీ ఇచ్చి ఉంటే...ఇంత శ్రమపడేదాన్ని కానేమో... విచ్చలవిడిగా వాడుకుని ఎందుకూ కొరగాకుండా ఉండిపోదునేమో... ఎన్ని జన్మలెత్తినా ఓ భగవంతుడా... నన్ను అనుగ్రహించి నాకున్న ఈ లోపాలు అలాగే ఉంచు. అప్పుడు నేను ఇలాగే ఉంటాను’’ అని సంకేతాలతో తెలియచేసారు. జీవితంలో మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పడు వాటిని విజయవంతంగా ఎదుర్కొని మనల్ని మనం నిగ్రహించుకోవడానికి, మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం పొందడానికి ఇటువంటి వారి అనుభవాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విషాన్ని మింగి అమృతాన్ని పంచారు
భగవంతుడిచ్చిన మరో కానుక నవ్వు. మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వడం మనిషి ప్రసన్నంగా ఉన్నాడనడానికి గుర్తు. చిరునవ్వుని మించిన ఆభరణం లేదు. ముఖం మీద చిరునవ్వులేకుండా ఎప్పుడూ చిటపటలాడుతుండేవాడి దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు. కలాంగారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన చూపే ప్రేమ చూడండి. చిరునవ్వు చూడండి. ఆయన విజయాలకు అది కూడా ఒక ప్రధాన కారణం. ఆ నవ్వు తన చుట్టూ ఉన్నవారిలో శాంతాన్ని నింపుతుంది, ఉద్వేగం లేకుండా చేస్తుంది. సంతోషంగా, హాయిగా ఉండేటట్లు చేస్తుంది. అలా పరమేశ్వరుడిచ్చిన అపురూప కానుకలయిన మాట, నవ్వు, బుద్ధి...ఈ మూడింటి ద్వారా నేను సమాజానికి ఏం ఉపకారం చేయగలను, ఎలా ఉద్ధరించగలను..అని ఆలోచిస్తూ ఉండాలి. కటిక పేదరికంలోంచి వచ్చి, తాను పొందిన పేదరికం ఇతరులు పొందకూడదని, తను పడిన బాధలు మరొకరు పడకూడదని తన చుట్టూ ఉన్నవారి ఉద్ధరణకోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులున్నారు. బాబా సాహెబ్ జీవిత చరిత్ర చదివితే రోమాంచితమవుతుంది. గుక్కెడు మంచినీళ్లు తాగడానికి ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలు చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆయన సమాజంలో వివక్షవలన పొందిన అవమానాలు తెలుసుకుంటుంటే చాలా రోతగా అనిపిస్తుంది. ఇలా ఉండొచ్చా ఒక సమాజంలో !!! అనిపిస్తుంది. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమ్ రావు. కానీ చిన్నతనంలో ఆయనను అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడు చేరదీసి పాఠాలు చెప్పి తాను తెచ్చుకున్న భోజనంలో కొంతపెట్టి ఆదుకున్నాడు. బారిష్టర్ చదివిన తరువాత తన వద్ధికి కారణమయిన తన గురువుగారిని తన పేరులో చేర్చుకుని భీమ్ రావు అంబేద్కర్ అయ్యారు. కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఎదిగినా, భారత రాజ్యాంగ నిర్మాణ సభ లోనే అంత గొప్పవ్యక్తి అయినా, రాజ్యాంగ రూపకల్పనలో స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాతగా కొనియాడబడినా... తాను కష్టపడినట్లుగా, సమాజంలో వివక్షకు గురయి బాధపడినట్లుగా మరెవరూ బాధపడకూడదని ఆఖరి ఊపిరివరకూ శ్రమించాడు, ఎన్నో కోట్లమంది సంతోషంగా ఉండడానికి కారణమయ్యాడు. ఏది చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఇతరులకు ఏమివ్వగలనని ఆలోచించమని అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత ప్రమాణం చేయించింది ఇటువంటి దార్శనికుల అడుగుజాడల్లో నడవమని చెప్పడానికే. అటువంటివారు ఎందరో ఉన్నారు. ఉండిచేసిన వారు కారు. చిన్నతనంలో కటిక దరిద్రాన్ని అనుభవించినా, వారు పెద్దయిన తరువాత వారు సంపాదించినది ఒక రూపాయి కూడా మిగుల్చుకోకుండా సమాజపరం చేసారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారు చివరి దశలో ఆస్పత్రిలో ఉండి ఇక ప్రాణం విడిచి పెట్టేస్తారనగా...‘‘నేనెలాగూ ఇక ఇంటికి వెళ్లేది లేదు, ఇక్కడ ప్రాణోత్కమ్రణం అయిపోతుంది’’ అనిపించి... తనకు నిరంతరం సేవలు అందించిన వ్యక్తి పేర తన ఇంటిని రాసిచ్చేశారు. ఆవిడ శరీర త్యాగం చేసేటప్పటికి తనది అని ఆవిడ ఏదీ ఉంచుకోలేదు. ఎన్ని లబ్ధికచేరీలు చేసారో, ఎన్ని లక్షల రూపాయలు సముపార్జించి పెట్టారో ఆఖరున పండుటాకులా అయిపోయిన తరువాత కూడా ‘మా గురువుగారికోసం ఏదో చేయాలి’ అని సంకల్పించి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి స్మారకంగా ఏర్పాటు చేయదలచిన మణిమంటప నిర్మాణానికి లబ్ధి కచేరీల ద్వారా సంపాదించిన దాని నుంచి భూరి విరాళాలు అందేలా చేసారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సందర్భాన్ని బట్టి బుద్ధిని ఉపయోగించాలి
పరమేశ్వరుని సృష్టిలో మనుష్యునకు ఇచ్చిన అపూర్వమైన కానుకలు మూడు. మొదటిది మాట, రెండవది నవ్వు. మూడవది బుద్ధి. ఈ మూడింటిని నిరంతరం వాడుకుంటూ మనిషి ఎదగాలి. ఏదిమంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకోగలిగిన శక్తి ని మనకు బుద్ధి ఇస్తుంది. దీనిని మనం సమర్ధంగా వినియోగించుకోవాలంటే శాస్త్రాన్ని బాగా చదవాలి, పెద్దల మాటలు ఒంట పట్టించుకోవాలి. మహాత్ముల జీవితాలను బాగా పరిశీలించాలి. నాకు తెలిసిందే మంచి, నేను చెప్పినదే మంచి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనిషి జీవితాంతం విద్యార్థిగా తెలుసు కుంటూనే ఉండాలి. ఒకప్పుడు మంచిగా ఉన్నది మరొకప్పుడు చెడు అవుతుంది. చెడుగా ఉన్నది మంచి అవుతుంది. సందర్భాన్ని బట్టి తెలుసుకోలేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలాగే ఎప్పుడు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే విచక్షణ బుద్దిచేత పెరగాలి. అబద్ధం చెప్పడం తప్పు, కానీ అహింస కోసం, ఇతరత్రా ప్రాణాలను రక్షించడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు. శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి దగ్గరకు రాక్షసులు వచ్చి ‘‘ఆ చెట్టుమీద నుంచి ఒక కోతి మీతో కిచకిచలాడుతూ మాట్లాడింది గదా, ఆ కోతి ఎవరు ?’’ అని అడిగారు. ‘పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి. ఇది లంకా పట్టణం. ఇక్కడంతా రాక్షసులుంటారు. వచ్చినవాడెవరో, మాట్లాడిందేమిటో మీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది ?’’ అని సమాధానమిచ్చింది. ఆవిడకు తెలియదా, వచ్చినవాడెవడో...హనుమ మాట్లాడాడు, ఉంగరం కూడా ఇచ్చాడు... తెలుసు. మరి నిజం ఎందుకు చెప్పలేదు? అబద్ధం ఎందుకు చెప్పింది? తన కోసమని కష్టపడి నూరు యోజనాల సముద్రాన్ని దాటి వచ్చిన వ్యక్తి ప్రాణ రక్షణ కోసం అలా అనవలసి వచ్చింది. ఒక్కొక్కసారి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చిన్న అధర్మం చేయాల్సి ఉంటుంది. పెద్ద సత్యాన్ని నిలబెట్టడానికి చిన్న అబద్ధం ఆడాల్సి ఉంటుంది. అది ధర్మ వివక్ష. అవతలి వ్యక్తిని కొట్టడం తప్పు. హింస తప్పు. కానీ దేశ సరిహద్దుల్లో నిలబడిన సైనికుడు ఎప్పుడూ ఆయుధాలు ధరించి ఉంటాడు. హద్దుమీరి సరిహద్దు రేఖ దాటి అవతలివాడు కాలు ఇవతల పెడితే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాడు. అంతే. అది తప్పు కాదు. దేశ సంరక్షణకోసం అలా కాల్చవలసిందే. అయ్యో ! సాటి మనిషిని అలా కాల్చేయడమేమిటి ? అని కూర్చుంటే దేశం ఎక్కడుంటుంది..మనం ఎక్కడుంటాం ??? ఆయన కాల్చాడు కదా అని మీరూ, నేనూ హద్దు మీరకూడదు. అందువల్ల మనం ఉన్న స్థితినిబట్టి ధర్మం మారుతుంది. ‘మన బుద్ధిని ఉపయోగించి మనం ఈ సమాజ హితానికి ఏం చేయగలం’ అని నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండడానికి నా బుద్ధిని నేను ఎలా ఉపయోగించాలని చూడాలి. బయటినుంచి కాకినాడలోకి ప్రవేశించే మార్గంలో ఒక చోట పెద్ద పాఠశాల ప్రాంగణం కనబడుతుంది. దాని ఆవిర్భావానికి కారకుడు సత్యలింగం నాయకర్. ఒకప్పుడు ఆయన రంగూన్ వెళ్ళాలని సంకల్పించి స్టీమర్లో టిక్కెట్ కొనుక్కోవడానికి డబ్బుల్లేక ప్రమాదకరమని తెలిసినా సాహసించి ఒక తెరచాప పడవలో వెళ్ళి, ఏవో చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకుంటూ నెమ్మదిగా వాటిలో ఎదుగుతూ స్థితిమంతుడయ్యాడు. ఇప్పుడు మనకు రు.20 లక్షలు చిన్న మొత్తం. ఆరోజుల్లో అంత డబ్బు ఆయన దానపట్టా రాసేసాడు. దానికి ఇప్పటి విలువ లెక్కగడితే రు.200 కోట్లవుతుంది. సీ్ర్త, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ వివక్ష లేకుండా అందరికీ చదువు అందాలని, కటిక పేద విద్యార్థులకు భోజన సదుపాయం కూడా సమకూర్చాలనీ ఆరాటపడి ఈ విద్యాలయం కట్టించాడు. అదీ బుద్ధిని సంస్కరించుకోవడం అంటే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆ జీవితమే ఒక పుస్తకం
భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన విశేషాలు మూడు. 84 లక్షల జీవరాశుల్లో ఏ ఇతర ప్రాణికీ ఇవ్వనివి ఇవి. మొదటిది – వాక్కు. దీనిని ఒక మనుష్య ప్రాణికే ఇచ్చాడు. మాటల ద్వారా ఎంత కష్టంలో ఉన్నవారినయినా ఓదార్చవచ్చు. చెడుదార్లు మళ్ళుతున్నవారిని మంచిదారిలో పెట్టవచ్చు. అవతలివాడి అజ్ఞానాన్ని పోగొట్టవచ్చు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ గంగాప్రవాహంలో మాట్లాడాలని భర్తృహరి అంటాడు. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషాదోషం, భావదోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే ప్రజ్ఞను సంతరించుకోవాలి. అది అభ్యాసం చేత వస్తుంది. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి శాంతినివ్వాలి. శ్రీరామాయణంలో హనుమ –‘‘సీతమ్మ కొన్ని నెలలుగా రావణుడి పట్టణంలో ఉండి, రాముడికోసం దుఃఖిస్తూ ఉన్నప్పుడు నేను నా మాటల చేత శాంతినిచ్చాను. ఇప్పుడామె ప్రసన్నురాలయి ఉంది’’ అంటాడు. ‘నామాటల చేత నేను సాధించగలిగాను’ అంటాడు. అదే రావణుడయితే –బతుకుదామనుకున్న సీతమ్మను ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేసాడు. అదృష్ట్టవశాత్తూ స్వామి హనుమ ఉన్నాడు కాబట్టి ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించి మళ్ళీ జీవితం మీద పూనిక పొందింది. మాట ఎంత శక్తిమంతమయినదంటే – ‘‘కడుపున్ రంపపుకోత కోయునది గాకుండినన్’’ అంటారు బలిజేపల్లివారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే గాయం బాధకన్నా ఒక అనరానిమాట అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ. రంపంతో కోసిన గాయం కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ అనరానిమాట తొందరపడి అంటే – ఆ అవతలి వ్యక్తి పొందే బాధ ఎప్పటికీ పోదు. అందుకే మాట ఎంత గొప్పదో...మాటని ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. మాట మాట్లాడాలంటే సంస్కారం ఉండాలి. అది చదువుతో వస్తుంది. పెద్దలయిన వారి చరిత్రలు చదవాలి. మీరెంతగా శాస్త్రాన్ని రోజూ చదువుతున్నా కనీసం ఒక పదిపుటలు రోజూ మహాత్ముల జీవితాలు చదివితే ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా తెలుస్తుంది– ‘ఏ మహాత్ముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు’ అని. చదువుకోవడం ఒక ఎత్తు. ఏదయినా ఒక భయంకరమైన సమస్య ఎదురయినప్పుడు దానిని ఎదుర్కోగల సామర్థ్యం, చాకచక్యం, స్థితప్రజ్ఞత మరొక ఎత్తు. అవి రావాలంటే మహాత్ముల జీవితాలను చదవాలి. ఒకప్పడు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన టంగుటూరి ప్రకాశంపంతులు చిన్నతనంలో ట్యూషన్ ఫీజు కట్టడానికి కేవలం రు.3/–లు లేక దానికోసం 25 మైళ్ళు నడుచుకుంటూ వాళ్ళబావగారి దగ్గరకు వెళ్ళి లేదనిపించుకుని తిరిగి అంతే దూరం ఈసురోమని నడుచు కుంటూ వచ్చి తల్లికి విషయం చెప్పి పరీక్ష తప్పిపోతుందని బాధపడ్డాడు. తల్లి వెంటనే తనకున్న ఒక్క పట్టుచీర తాకట్టు పెట్టి ఫీజుకట్టింది. తరువాత కాలంలో ఆయన బారిష్టరు చదివి లక్షల రూపాయలు సంపాదించి దేశ స్వాతంత్య్రంకోసం వాటిని గడ్డిపోచ సమానంగా ఖర్చు పెట్టేసాడు. ‘ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, నేనేమి ఇవ్వగలనని ఆలోచిస్తాను’ అని అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించినప్పడు ఆయన ఉద్దేశం... మహాత్ముల జీవితాలను తెలుసుకుని వారి నుంచి స్ఫూర్తి పొందాలని, ఇచ్చి బాధ పడకుండా ‘భగవంతుడు నాకిచ్చిన దానిలో నేనేమి ఇవ్వగలను’ అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండాలని. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘కాటన్ రుషయేనమః’
కదిలే నీరు కర్మమార్గానికి చిహ్నం. నీరు కదలకుండా ఉంటే దుర్వాసన వస్తుంది. కదిలితేనే నీటికి ప్రయోజనం. అలాగే మనిషి కర్మమార్గంలో నలుగురిని సంతోషపెట్టేటట్లుగా ప్రవరిస్తేనే జన్మకు సార్ధకత. పుస్తకాలు చదివి, పెద్దల మాటలు విని, మనసుని విశాలం చేసుకుని భక్తితో వికసనం పొందాలి అని చెప్పడానికి వికసిస్తున్న పద్మం, భగవంతుడిని చేరుకోవడం లక్ష్యమని చెప్పడానికి హంస. ‘తన్నో హంస ప్రచోదయాత్’ అని కూడా రాసుంటుంది. అలాగే జ్ఞానానికి సంకేతంగా ఉదయిస్తున్న సూర్యుడు. యోగమార్గంలో మనిషి వెళ్ళి తరించాలని చెప్పడానికి చుట్టుకున్న నాగుపాము... ఇదంతా రామకృష్ణ మిషన్ లోగోలో కనిపిస్తుంది. ఇది మొత్తం చెప్పేదేమిటంటే... ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నీ బాధగా భావించి, చేయగలిగిన ఉపకారం చేసిపెట్టాలి. సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మానుంచి నౌకలో వస్తున్నాడు. చీకటిపడింది. విశాలమైన ఆకాశం వంక, మెరుస్తున్న నక్షత్రాలవంక తదేకంగా చూస్తుంటే... అతనిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ‘‘ఏవేవో చిన్న చిన్న పనులు చేసి మనం ప్రపంచానికి చాలా ఉపకారం చేసామనుకుంటాం. కానీ ఆకాశం, నక్షత్రాలు, భూమి, నదులు, జీవులు... అన్ని ఏర్పాట్లతో, ఇంత సృష్టి చేసిన భగవంతుడిని సంతోషపెట్టడానికి నేనేం చేయాలి’’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ మథనంలోంచి ఒక పరిష్కారం దొరికింది. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడమే.. అంటే మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకగలగడమే పరిష్కారం..’’ అనిపించింది. వెంటనే వెళ్ళి తమ మత పవిత్ర గ్రంథం ఒకటి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడినుంచి ఆయన జీవనపథం మారింది. ఒకరోజు విశాఖ సాగరతీరంలో దూరాన అప్పుడే వచ్చిన ఒక పడవను దొంగలు చుట్టుముట్టి, ప్రయాణికులను, సరుకును దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడింది. దగ్గర్లో ఉన్న ఒక దుడ్డు కర్ర చేతపుచ్చుకుని తెగించి వాళ్ళమీదపడ్డాడు. అంతే, దొంగలు పారిపోయారు. మనిషిగా ప్రవర్తించినందుకు ఆ రాత్రి ఆనందంతో పొంగిపోయాడు. ఆ తరువాత ఆయన గోదావరిమీద ఆనకట్టను కట్టడానికి పడిన కష్టం, రైతుల సంక్షేమం కోసం ఆయన పడిన తాపత్రయం అనన్య సామాన్యం. తరువాత కాలంలో ఆయన ఒకసారి గోదావరిమీద పడవలో వెడుతుంటే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనంలో భాగంగా..‘‘కాటన్ రుషయేనమః’ అనడం ఆయనకు వినిపించింది. ఆయనేమంటున్నాడని పక్కన ఉన్నవాళ్ళను అడిగాడు. మీకు నమస్కారం చెప్పుకుంటున్నాడు, అని తెలిపారు. వెంటనే ఆయన నేరుగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ‘కాటన్‌కు ఎందుకు నమస్కరిస్తున్నావ్’’అని అడిగాడు.‘‘లోకక్షేమం కోసం ఎవడు తపిస్తాడో, కష్టపడతాడో వాడే రుషి. లక్షల ఎకరాల సాగుకు కారణమయిన ఆనకట్ట కట్టిన కాటన్ కూడా వాల్మీకిలాగా, వ్యాసుడిలాగా నా దృష్టిలో రుషే. అందుకే ఈ మంత్రం జపించాను’’ అని ఆయన జవాబిచ్చాడు. ఈ దేశ ప్రజల సంస్కారం, కృతజ్ఞతా భావం చూసి కాటన్ విస్తుపోయాడు. తోటి మనిషికి సాయపడాలన్న తపన, కృషి ఉంటే మామూలు మనుషుల్ని కూడా రుషులలో, దేముళ్ళల్లో చేర్చి నెత్తికెత్తుకుంటుంది సమాజం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చిన్ని నా బొజ్జకు... అనుకుంటే ఎలా ?
కుల, జాతి, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరోఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను–అన్నది అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన నాలుగో ప్రతిజ్ఞ. నిజానికి ఈ మాటలు ఎక్కడివంటే...అబ్దుల్‌కలాంగారిని చాలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు నెల్సన్ మండేలా. వీరిద్దరూ అంటే ఆయనకు చాలా గౌరవం. బారిష్టర్ చదువుకోవడానికి విదేశాలకు వెడుతున్నప్పుడు గాంధీగారి తల్లి ఆయనకు చెప్పిన మాటలు ఇవి. ఆమె ఏమన్నారంటే...‘ ‘మనిషిగా పుట్టినందుకు ఒకరికి ఉపకారం చేయాలి. దానికి ముందు – నా కులం వాడా, నా మతం వాడా, నా జాతి వాడేనా, నా భాష వాడేనా వంటివి చూడొద్దు. ఈ తేడా చూపకుండా ఎవరో ఒక్కరి నైనా సరే, వాళ్ళ జీవితాన్ని రక్షించడానికి లేదా వద్ధిలోకి తీసుకురావడానికి నీవు కారణం కావాలి. మనిషికీ , మిగిలిన జీవులకూ తేడా అక్కడే ఉంది’’ అని. ఆకలితో ఉన్న పులికి నిండు గర్భంతో ఉన్న జింక కనబడినా దానిని ఆహారంగానే చూస్తుంది తప్ప ఇతరత్రా ఆలోచించదు. పెద్ద చేప చిన్న చేపలను మింగేస్తుంది. అది వాటి స్వభావం. కానీ మనిషి మాత్రం –‘‘నేనొక్కడినీ బతకడం గొప్పకాదు, నా చుట్టూ ఉన్న ప్రాణులనూ కాపాడవలసిన బాధ్యత నాది’’ అనుకుంటాడు. మండుటెండలోనుంచి వెళ్ళి మనిషి ఒక చెట్టు నీడన సేదతీరతాడు. ‘‘నేను దీని నీడను అనుభవిస్తున్నాను’’ అనుకుని కాసిన్ని నీళ్ళు దానికి పోస్తాడు. ఆ చెట్టే కాదు, ఏ చెట్టయినా దానికి కొద్దిగా నీళ్ళు పోసే ప్రయత్నం చేయగలగాలి. ఏదో ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టగలగాలి. తమిళనాడులో ఒక వ్యక్తిని చూసా. ఆయనకు మామిడితోట ఉంది. చాలా చెట్లున్నాయి. అన్ని చెట్లనుంచి కాయలు కోసుకుంటాడాయన. కానీ ఒక్క చెట్టును మాత్రం కోయకుండా అలా వదిలేస్తాడు. ఎందుకలా అని అడిగితే – మామిడిచెట్టంటూ ఉంటే పళ్ళు తినడానికి రామచిలుకలు వస్తాయి. నా తోటలోని కాయలన్నీ నేనే తినేయడం ఎందుకండీ. ఒక చెట్టును వాటికి వదిలేస్తా. రేపు పొద్దున వచ్చి చూడండి. చెట్టుమీద కాయలను మీరు లెక్కపెట్టగలరేమో కానీ ఆనందంతో రెక్కలు విప్పుకుని వచ్చే చిలుకలను లెక్కపెట్టలేరు. ఆ అందం చూసి అనుభవించే తృప్తి ఎంత ఖర్చుపెట్టినా దొరకదు. ఇన్ని చెట్లకాయలను నేనొక్కడినీ తినలేకపోతే అమ్ముకుంటాను...కానీ ఆ చిలకలు మాత్రం వాటికి ఎంత అవసరమో అంతే తింటాయి. తప్ప తుంచుకెళ్ళవు, కింద పడేయవు. మళ్ళీ రేపొచ్చి తింటాయి.’’ అని చాలా తన్మయత్వంతో చెప్పాడు. అంతేకాదు నూకలు(విరిగిన బియ్యం) తెప్పించి రోజూ కొద్దిగా పొలంలోని మూలల్లో చీమల పుట్టల దగ్గర రోజూ చల్లుతుంటాడు. ‘‘చిన్ని నాబొజ్జకు... అని మాత్రమే అనుకోను. నాతోపాటూ నాలుగు ప్రాణులు తినాలి కదండీ’’ అంటాడు. ‘‘అన్ని ప్రాణులకూ ఆకలి ఒక్కటే. నేను తినకుండా వాటికి పడేయడం లేదు కదా, అటువంటప్పడు కాసిని వాటికి కూడా పెట్టడానికి అభ్యంతరం ఎందుకుండాలి’’అని కూడా అంటాడు. అంటే మనిషి మిగిలిన ప్రాణుల్లా బతకకూడదు. అవి భూతదయతో ఉండే అవకాశం లేదు. కానీ మనిషి తానొక్కడూ బతకడం కాదు,‘‘మరొక ప్రాణి బతకడానికి, మరొకరు వృద్ధిలోకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నానా..??’’ అని తనను తాను నిత్యం ప్రశ్నించుకుంటూ ఉండాలి.’’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జైత్రయాత్ర నీ కుటుంబం నుంచే ప్రారంభించు
కలాంగారు రాష్ట్రపతి పదవిలో ఉండగా, ఆయన అన్నగార్లు, వాళ్ళపిల్లలు, బంధువులు చాలా మంది రాష్ట్రపతిభవన్ చూడడానికి వస్తామని ఉత్తరం రాసారు. బంధువులు కదా, రావద్దని ఎందుకంటారు ! అందర్నీ రమ్మన్నారు. వారు వచ్చారు. భోజన ఫలహారాలు తీసుకుంటూ . రెండూమూడురోజులు అక్కడే గడిపి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళంగానే కలాంగారు తన కార్యాలయ సిబ్బందిని పిలిచి...‘‘మా బంధువులు అక్కడ విడిదిచేసిన ఫలితంగా భోజనాలకు, బసకు, కరెంటుకు ఇతరత్రా వసతులకు ఖర్చెంతయిందో లెక్కగట్టి చెప్పండి’’అని అడిగారు. వాళ్ళు సంకోచిస్తుంటే...‘‘ఈ దేశమంతా నా కుటుంబమే. వాళ్ళు కష్టపడి కట్టిన పన్నులను నా బంధువులకోసం ఖర్చు పెట్టలేను’’ అని చెప్పి వారు ఆ బిల్లు ఎంతో చెప్పంగానే కట్టేసారు. అదీ వ్యక్తిత్వమంటే. ఆయన అలా బతికిచూపించి ఈ దేశ యువతరం ముఖ్యంగా విద్యార్థులు అంతా అలా బతకాలని కలలు కన్నారు. లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలు. 30వేల పాటలకు పైగా పాడారు. ఆవిడ పాడని పాటలేదు, ఆలపించని కీర్తనలు, భజనలు లేవు. కానీ ఆమె ఐశ్వర్యవంతురాలిగా పుట్టలేదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్. ఆమెకు నలుగురు చెల్లెళ్ళు. కుమార్తెలను కూడా తన నాటక కంపెనీలో సభ్యులుగా చేర్పించి నాటకాలు వేయగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ జరిపేవారు. తరువాత కాలంలో ఆమె పాటలుపాడి పేరు, హోదా, డబ్బు బాగా సంపాదించినా తన కుటుంబాన్ని వదలలేదు.అందరినీ వృద్ధిలోకి తెచ్చారు. ఎంతో ధనాన్ని దానధర్మాలకు వెచ్చించారు. ఆదర్శవంతంగా బతికారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఒక వెలుగు వెలిగిన గొప్ప సంగీత విదుషీమణి. ఆవిడ జీవితం అంతే. అది వడ్డించిన విస్తరేమీ కాదు. మీరాబాయి సినిమాలో ఆమె నటించినప్పుడు కనకవర్షం కురిసింది. అదీగాక దేశవిదేశాల్లో సంగీత కచ్చేరీలద్వారా కూడా సంపాదించారు. ఎన్నో సంస్థలకు లక్షల రూపాయలు ఆర్జించిపెట్టారు. ఎన్నో గుళ్ళూ గోపురాల నిర్మాణాలకు, నిర్వహణకు సాయం అందించారు. ఆస్తులుకూడా అమ్మేసుకున్నారు. ఒక దశలో సొంత ఇల్లు కూడా లేకుండా చేసుకున్నారు. ఆమెకూడా కుటుంబంలో ఒక మంచి సభ్యురాలిగానే జీవితం మొదలుపెట్టి, నలుగురికి ఆదర్శంగా గడిపారు. ఆమె సుబ్బులక్ష్మి...ఆమె మాదన్నారు తమిళులు, ఆమె సుబ్బలక్ష్మి..ఆమె మాది అని దక్షిణాది వాళ్ళంటే, ఉత్తరాదివాళ్ళు ఆమెను శుభలక్ష్మి అని పిలుచుకుని సొంతం చేసుకున్నారు. ఆమె శరీరత్యాగం చేసారని తెలిసిన తరువాత మొదటగా పరుగెత్తుకు వెళ్ళిన వ్యక్తి కలాంగారు. ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళి, ఆమె అంత్యక్రియల్లో ముందు నిలబడి కంటనీరు కారుతుండగా ఒక మాటన్నారు...‘‘నాకు ముగ్గురు తల్లులు. ఒకరు జన్మ ఇచ్చిన తల్లి. మరొకరు ఈ దేశమాత. నాకు మూడవ తల్లి సుబ్బలక్ష్మిగారు. నేను ఎవరి కంఠస్వరం వింటే నా కష్టాలన్నింటినీ మర్చిపోతానో, ఆ తల్లిని ఈ వేళ పోగొట్టుకున్నాను.’’ అని ఆవేదన వ్యక్తం చేసారు. మీరు పిల్లలు. ఇటువంటివారిని ఆదర్శంగా పెట్టుకోండి. మీరు ఎంత పెద్దకలలు కన్నా వాటి ఆచరణలో ముందు వీరిలాగా ఒక మంచి కుటుంబ సభ్యునిగా మీ పాత్ర సమర్ధంగా నిర్వహించండి. మిమ్మల్ని చూసి మీ కుటుంబం, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం గర్వపడే విధంగా జీవించండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తిట్లుకాదు, దీవెనలవి
ప్రముఖ తత్త్వశాస్త్ర నిపుణుడు, మాజీ రాష్ట్రపతి కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు చాలా కష్టాల్లోంచి పైకొచ్చారు. తిరుపతిలో ఆయన చదువుకుంటున్న రోజులవి. ఆ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరు రోజు. విద్యార్థిగా ఉన్న దశలో ఒకసారి పుస్తకం చదివితే మొత్తం ఆయనకు గుర్తుండిపోయేది. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏదయినా చూడాలనిపిస్తే ఎన్ని మైళ్లయినా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా ఒకసారి వెళ్ళి తిరిగి వస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న దారిలో ఒక పాడుబడ్డ బావి వద్ద ఒక దొంగ పొంచి ఉండి, ఆయనమీద పడి పట్టుకున్నాడు. ఆయన చెవికున్న బంగారు పోగులకోసం పొదల్లోకి లాక్కెళ్ళి కొట్టడంతో ఆయన అర్భకుడు కావడాన స్పృహతప్పి పడిపోయాడు. చెవులకున్న పోగులు లాగేసుకుని దొంగ వెళ్ళిపోయాడు. స్పృహతప్పిన రాధాకృష్ణన్ గారికి కొద్దిసేపటి తరువాత తెలివి వచ్చి ఒళ్ళంతా దెబ్బలతో ఇంటికి చేరుకున్నాడు. ఫీజు కట్టడానికి అదే ఆఖరి రోజు, అయినా బాగా తెలివిగల పిల్లవాడయిన రాధాకృష్ణన్ ఇంకా రాలేదేమిటని ఆందోళన చెందిన ఆయన ఉపాధ్యాయుడు తానే స్వయంగా దరఖాస్తు నింపి తన సొంత డబ్బుతోనే ఫీజు కట్టేశాడు. పక్కరోజు రాధాకృష్ణన్ వెడితే విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు తాను ఫీజు కట్టేశానని చెప్పి పరీక్ష రాయించాడు. ఆ పరీక్షలో ఆయన అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రానికి ఆచార్యుడిగా ఉండి తరువాత కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉన్నత పదవిలో చేరడానికి సిద్ధపడ్డారు. మైసూరునుంచి కలకత్తాకు వెళ్ళే రోజున సామానంతా వేరుగా స్టేషన్‌కు పంపించేసి, భార్యతో గుర్రపుబగ్గీలో పోవడానికి బయటికి వచ్చారు. ఆయన దగ్గర చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు వందల సంఖ్యలో ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు. ‘‘మాకింత గొప్పగా పాఠాలు చెప్పి తన ఊపిరిని మాకోసం వెచ్చించిన మా గురువుకు కృతజ్ఞతగా ...’’ అంటూ బండికి కట్టిన గుర్రాలను విడిపించి స్వయంగా విద్యార్థులే ఆ బండిని మైసూరు స్టేషన్ వరకు లాగుకుంటూ తీసుకెళ్ళారు. పూలు పరచి వాటిమీదుగా వారిని తీసుకెళ్ళి రైలెక్కించారు. రాధాకృష్ణ్ణన్ గారు కూడా బరువెక్కిన హృదయంతో చేతులూపుతూ వారినుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తికే అత్యంత గౌరవం, గుర్తింపు తెచ్చిన ఆయన జీవితం ఆ వృత్తితో ఎంతగా పెనవేసుకుపోయిందంటే జన్మదినాన్ని ఆత్మీయులు, సన్నిహితుల మధ్య జరుపుకునే సంప్రదాయానికి స్వస్తి చెప్పి దానిని ‘టీచర్స్ డే’ గా జరుపుకోవాలని వాంఛించారు. తననే కాదు అది గురువులందరినీ స్మరించుకోవాలన్న. గౌరవించుకోవాలన్న సందేశాన్ని ఆయన దీని ద్వారా ఇచ్చారు. ఇక అప్పటినుంచీ సెప్టెంబరు 5వ తేదీని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ గా జరుపుకుంటున్నాం. ఇదంతా కలాంగారు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... అమ్మ తిట్టిందనో, నాన్న కోప్పడ్డాడనో, గురువు గారు మందలించారనో వారిపై అక్కసు పెంచుకోకుండా... ఎందుకు ఆగ్రహిస్తున్నారో దాని వెనుక ‘మిమ్మల్ని సంస్కరించాలన్న’ వారి ఆవేదనను అర్థం చేసుకుని మీకుటుంబ గౌరవం పెంచేలా, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్న సమాజం గర్వపడేలా మీ వ్యక్తిత్వాన్ని దిద్దుకోండి’’ అని చెప్పడానికి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నీకిచ్చిన మాటమీదే నిలబడ్డానమ్మా...
‘‘నేను నా కుటుంబంలో, సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచిసభ్యుడిగా ఉంటాను’’ అనేది అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన మూడవ ప్రతిజ్ఞ. ‘‘ఇతను మాకు చాలా విలువైన, గొప్ప సభ్యుడు లేదా సభ్యురాలు’’ అని మొట్టమొదట సంతోషించాల్సింది మన కుటుంబమే. ‘ ఈ పిల్ల లేదా పిల్లవాడు మా కొడుకు’’ అని మొదట తల్లిదండ్రులు పరవశించిపోవాలి. అలా వారు సంతోషించడానికి మీరు అన్నివేళలా మీ పరీక్షల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. ‘‘మా పిల్లలు అబద్ధమాడరు. పవిత్ర హృదయంతో ఉంటారు. ఒక లక్ష్యం పెట్టుకుని, చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు. ఒకరిని పాడుచేసే లక్షణం మా పిల్లలకు ఎప్పుడూ లేదు’’అని తల్లిదండ్రులు గర్వంగా ప్రకటించుకోగలగాలి. పిల్లలు ఆ విశ్వాసాన్ని వారికి కలిగించాలి. రామాయణంలో రామచంద్రమూర్తిని చూసి తల్లి సంతోషించింది. తండ్రి మురిసి పోయాడు. ‘మా అన్నయ్య ఇంత గొప్పవాడు’ అని తమ్ముళ్ళు పొంగిపోయారు.. ‘రాముడు మా రాజు’ అని చెప్పుకుని ప్రజలు ఆనందపడ్డారు. రాముడు గుహుడితో అంత ప్రేమతో ప్రవర్తించబట్టే ‘రాముడు నా స్నేహితుడు’ అని ఆయన సంతోషపడిపోయాడు. విభీషణుడు రాక్షసుడు, సుగ్రీవుడు వానరుడు. అలాగే ఋషులు...పండితులు, విద్వాంసులు, మంత్రులు... ఇలా రాముడు ఎక్కడుంటే అక్కడి వారందరూ సంతోషించారు. కలాం చదువుకుంటున్న రోజుల్లో మద్రాస్‌లోని ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదువుకునే అవకాశం వచ్చింది. ఫీజుకట్టడానికి డబ్బుల్లేవు. ఆయన సోదరి జోహ్రా తన గాజులు, గొలుసులు తాకట్టుపెట్టి డబ్బిచ్చింది. కష్టపడి సంపాదించి తాకట్టు నగలు విడిపిస్తానని ఆమెకు మాటిచ్చాడు. కళాశాలలో ప్రవేశించిన తరువాత తన మాట నిలబెట్టుకోవడానికి చాలాకాలం పడుతుందేమోనని అనుమానించి స్కాలర్ షిప్ కోసమని– ‘చదువు’ అన్న మూడక్షరాలు తప్ప నాలుగో అక్షరంతో సంబంధం లేకుండా చదివాడు. అదొక ఉపాసన. అలా కష్టపడ్డాడు. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అన్న పుస్తకం విద్యార్థులు తప్పక చదవాల్సిన పుస్తకం. దానిలో ఆయన ఇవన్నీ వివరించాడు. ఆయన కష్టపడడాన్ని చూసి ఆచార్యులు సయితం ఆశ్చర్యపోయారట. అంటే.. ఇంత సంస్కారం, ఇంత క్రమశిక్షణ ఎలా సాధ్యం ? మీరు మీ కుటుంబంలో మంచి సభ్యుడయితే మీ చుట్టుపక్కల వాళ్ళని, మీరుంటున్న సమాజాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. కలాం బాల్యంలో ఒకరోజు వాళ్ళ అమ్మ రొట్టెలు చేసిపెడుతుంటే అవి కమ్మగా ఉన్నాయని అన్నీ తినేసారు. వాళ్ళ అన్నయ్య ‘బుద్ధి ఉందా నీకు, అమ్మకు కూడా లేకుండా అన్నీ తినేసావు..’ అని కోప్పడితే అమ్మకు లేకుండా తిన్నానన్న బాధకొద్దీ కలాం కళ్ళవెంట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. అది చూసి జాలిపడిన అమ్మ కలాంను దగ్గరకు తీసుకుని ‘‘నేను తినాల్సినవి నీవు తిన్నావని బెంగపెట్టుకోకు. నీ కన్నతల్లిగా నేనే కాదు, ఈ దేశమాత కూడా గర్వపడేవిధంగా నీవు ఉత్తమ పౌరుడివి కావాలి’’ అంటూ బుజ్జగించింది. ఈ పుస్తకం ఉపోద్ఘాతంలో కలాం – ‘‘నేను ఈ లోకం వదిలిపెట్టిన తరువాత నీవు ఏ లోకంలో ఉన్నా మొదట వచ్చి నీకే నమస్కరించి.. అమ్మా! నీకు మాటిచ్చినట్లే నా ఆఖరిశ్వాస వరకూ బతికాను..అని చెబుతాను’’–అని రాసుకున్నారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కలిసి నడవాలి.. నడిపించాలి
జీవితంలో కొన్ని పనులు మనం ఒక్కరమే చేయగలం. కానీ చాలా పనులు పదిమంది సహాయం లేకుండా చేయలేం. అందుకే అందరితో కలిసిమెలిసి చేయడం, చేయి చేయి పట్టుకుని నడవడం, నడిపించడం చేతకావాలి. నేనే గొప్ప, నేనెవరితోకలవను–అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. అబ్దుల్ కలాం ఈ మాటలు ఒఠ్ఠిగా చెప్పలేదు. తాను స్వయంగా ఆచరించి చూపాడు కాబట్టే ఆయన మాటలంటే మనకంత గురి, మనకంత గౌరవం. విధి నిర్వహణలో ఏదయినా లోపం జరిగితే దానికి ఆయన ఒక్కడే బాధ్యత తీసుకునేవాడు. అదే ఉప్రగహం కక్ష్యలోకి వెళ్ళడం వంటి విజయాలు చవిచూసినప్పుడు ఆ గొప్పతనం తనొక్కడిదే కాదనీ, శాస్త్రవేత్తలందరిదీ అనడమేకాక, పై అధికారులకు, చివరకు ప్రధానమంత్రికి కూడా ఫలానా వారికృషివల్ల ఇది సాధించగలిగామని చెబుతూ వారిని స్వయంగా వెంటపెట్టుకెళ్ళి చూపేవాడు. ఒకరోజు కలాం తన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తిని ‘నువ్వు ఇవ్వాళ రాత్రి 11 గంటల వరకు ఉండి ఈ కార్యాన్ని పూర్తి చేయాలి’ అని పురమాయించారు. ఆ ఉద్యోగి కొంచెం ఇబ్బందిగానే తనకు అప్పగించిన పనిని అంగీకరించి చేసేందుకు వెళ్ళాడు. కలాం వెంటనే అతని సన్నిహిత ఉద్యోగిని మరొకరిని పిలిచి ‘రోజూ బాగా శ్రద్ధగా చేసేవాడు, ఇవ్వాళేమయింది’ అని వాకబు చేసాడు. ‘ఆయన తన భార్యాబిడ్డలను ఇవ్వాళ సాయంత్రం ఏదో ఎగ్జిబిషన్‌కు తీసుకెడతానని చెప్పాడు. పని చేయాల్సి వచ్చినందుకు కాదు, వాళ్ళను నిరాశపరచాల్సి వస్తున్నందుకు బాధపడి ఉంటాడు’’ అని అతను చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలకు తనకు అప్పగించిన పనిముగించుకుని సదరు ఉద్యోగి భార్యాబిడ్డలకు సంజాయిషీ ఎలా చెప్పాలని మథనపడుతూనే ఇంటికి చేరుకుని తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. నిరాశలో ఉంటారనుకున్నవాళ్ళంతా ఆనందంతో తుళ్ళుతూ కనిపించారు. అయోమయం నుంచి తేరుకోకముందే పిల్లలొచ్చి ‘‘నాన్నా, నాన్నా అబ్దుల్ కలాం తాతగారు మనింటికి వచ్చారు. మీనాన్న అత్యవసరమయిన పనిమీద కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తానన్నారటకదా, పదండి, నేను తీసుకెళ్తా అని తన కారెక్కించుకుని మమ్మల్ని తీసుకెళ్ళి అంతా తిప్పి చూపించి మళ్ళీ ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయారు’’ అని చెప్పారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తన చుట్టూ ఉన్నవాళ్ళ పట్ల కలాం అంత ప్రేమభావంతో ఉండేవారు. ఇటువంటి వారిని చూసి మీరు స్ఫూర్తి పొందాలి. కలాం కలలు కన్న విద్యార్థులగా మీరు తయారు కావాలి. చదరంగం ఆడాలి. మీ ఒక్కరి ప్రజ్ఞాపాటవాలు చాలు. ఫుట్‌బాల్ ఆడాలి. మీ టీమ్ అంతా కలిసి ఆడితేనే మీరు గెలుస్తారు. ఒక గోడ కట్టాలి. ఇటుకలు మాత్రం ఉంటే సరిపోదు, సిమెంట్ ఒక్కటి ఉంటే చాలదు. వాటితోపాటూ ఇసుక, నీరు ఉండాలి, అవన్నీ సమపాళ్ళలో కలిసినప్పుడే గట్టిగోడ నిలుస్తుంది. అందుకే మనకన్నా కిందివారిని, మనతోటివారిని, మనకంటే పైవారిని అందరినీ కలుపుకుని, సఖ్యతతో సమన్వయంతో, విశాల హృదయంతో ముందుకడుగేయాలి. మనందరం చేయిచేయి పట్టుకుని ‘‘మేమందరం భారతమాత బిడ్డలం, భారతీయులం, అందరం కలిసి నవభారతాన్ని నిర్మించుకుంటాం’’ అన్న దృఢ దీక్షతో అటువంటి సమగ్రతతో పనిచేసిన నాడు కలాంగారు ఏ లోకంలో ఉన్నా ఆయన పరిపూర్ణ ఆశీస్సులు మీకందరికీ అందుతాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచిని చూస్తుంటేనే మంచివారు అవుతారు
భవిష్యత్తంతా విద్యార్థులదే. దేశ కీర్తి ప్రతిష్ఠలు, అభివృద్ధి మీ చేతిలో ఉన్నాయని గట్టిగా నమ్మిన అబ్దుల్ కలాం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి పలు సూచనలుచేసారు. ఎవరికి వారు తాము చదువుకున్న చదువుతో డబ్బు సంపాదించుకుంటూ, అదే ధ్యేయంగా బతికితే దేశం ఎలా, ఎప్పటికి బాగుపడుతుందనేది ఆయన ఆవేదన. చదువుకోవడం గొప్పకాదు. మీరో గొప్ప ఇంజనీరో, డాక్టరో అవుతారు. మీ చదువుద్వారా ఎంతమందికి మీరు ఉపయోగపడుతున్నారనే దాన్ని బట్టి మీ చదువుయొక్క సార్ధక్యం ఆధారపడి ఉంటుంది. మీరు డాక్టరై ఎంతమందికి ప్రాణభిక్షపెడుతున్నారు, స్వార్థంలేకుండా ఎంతమందికి చికిత్స చేయగలుగుతున్నారు. సమాజ హితానికి ఎంత ప్రయత్నిస్తున్నారన్న స్పృహతో మీరు గొప్పవారవుతారు తప్ప అన్యథా కాదు. నేను ఇంజనీరయినాను కాబట్టి ఎంతమంది ఏమయిపోయినా ఫరవాలేదు, ఏ ఆనకట్ట ఎలా బద్దలయిపోయినా ఫరవాలేదు, నా డబ్బు నాకొస్తుందికదా.. అన్న ఆలోచన మంచిది కాదు. మీ చదువుతో మీరు, మీ కుటుంబం, మీ బంధుమిత్ర పరివారం, మీ సమాజం, మీ దేశం అందరూ బాగుండాలి, అన్నీ బాగుపడాలి. అప్పుడు మీ చదువుకు సార్థకత. అలా జరగాలంటే...పదిమందితో కలిసి మీ ప్రజ్ఞాపాటవాలు పంచుకోవాలి. అలా పంచుకోవాలంటే మున్ముందుగా మీకు ఉండవలసిన ఒకానొక ప్రధాన లక్షణం– అందరిలో మంచిని చూడగలగడం. ప్రతివారిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ గొప్పతనం లేకుండా ఎవరూ ఉండరు. మీ చుట్టూ ఎవరున్నా, ప్రతివారిలో ఉన్న ప్రతిభను వెతకగలగడం మీకు చేతకావాలి. మీ వద్ద ఎవరిపేరయినా ప్రస్తావనకు వచ్చీరాగానే వారిలోని ఉత్తమగుణాలు మీకు వెంటనే స్ఫురణకు రావాలి. అలా కాకుండా ప్రతివాడిలోనూ చెడు మాత్రం చూసే అలవాటున్నప్పుడు వారిని తృణీకరించడం, చులకనచేసి మాట్లాడడం అలవాటవుతుంది. దానివల్ల అవతలివాళ్ళకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందో నాకు తెలియదు కానీ, ఎవరిలోకూడా మంచి చూడడం అలవాటు చేసుకోక, మంచిని అనుకరించడం తెలియక, మంచిమార్గంలో వెళ్ళడం చేతకాక... చివరకు మనమే పతనమయిపోతాం. అలా కాకుండా ఉండాలంటే... ఎక్కడికెడితే అక్కడ ఇమిడి పోవడం చిన్నప్పటినుంచీ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని ప్రోత్సహించాలి. నీటిలో ఇసుక వేస్తే కరగదు. అదే చక్కెరవేస్తే కరిగిపోతుంది, కలిసిపోతుంది. అది మీకు చేతకావాలి. అలా నలుగురిలో కలిసిపోవాలి, కరిగిపోవాలి. మీరు బడికి వెళ్ళారు. అక్కడ తోటి పిల్లలతో హాయిగా కలిసిపోవాలి. కాలేజికి వెళ్ళారు. సహ విద్యార్థులతో, కింది తరగతుల వాళ్ళతో, పైతరగతుల వాళ్ళతో కలిసిపోవాలి. ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ చిన్నా పెద్దా ఉద్యోగులందరితో కలిసిపోవాలి. కుటుంబంలో, బంధువులతో, దేశపౌరులతో.. అలా కలిసిపోతుండాలి. ‘‘నేను ఇంత గొప్పవాడిని’’ అని గిరిగీసుకుని మిగిలిన వాళ్ళకన్నా దూరంగా బతకడం, మిగిలినవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు అని భావించడం మనకు మేలు చేయకపోగా మనల్ని మరింత కిందకు దిగజారుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు మూడు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనతో సమానులను ఆదరబుద్ధితో చూడాలి. మన కంటే కిందివారిని మనమే చొరవతీసుకుని వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి, వారిని ప్రేమించాలి. మనకన్నా పైవారిపట్ల గౌరవ మర్యాదలతో మసులుకోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘నాకోసం’ కాదు, ‘మనకోసం’ అంటే చాలు...
ఆయన ఈ దేశం గురించి ఆలోచించాడు. అసలు ఈ దేశంలో ఇన్ని నేరాలు జరగడానికి, ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవడానికి, చాలామంది ఆకలి దప్పికలతో అలమటించడానికి కారణం– అందరికీ ఉండవలసినంత భూమి లేకపోవడం. అది ఉంటే ఇన్ని నేరాలు జరగవు, ప్రతివాడు కష్టపడి ఆ భూమిని సాగుచేసుకుని ధార్మికంగా, న్యాయంగా బతుకుతాడుగదా...అని అనిపించింది ఆయనకు.అలా భూమి అందరికీ దక్కకుండా ఎవరో కొద్దిమంది ఐశ్వర్యవంతుల చేతిలో ఉండిపోతే అందరూ సంతోషంగా ఉండలేక పోతున్నారు. దీనిని చక్కదిద్దాలంటే కొంతమందివద్ద కాకుండా ముఖ్యంగా పేదలందరికీ భూమి దక్కాలిగదా...అని కూడా ఆయనకు అనిపించింది. మరి అలా జరిగేటట్లు చేయాలంటే ‘‘నాచేతిలో అధికారమయినా ఉండాలి, లేదా కేంద్రమంత్రి పదవో, ప్రధానమంత్రి పదవో ఉండాలి. కనీసంలో కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అయినా ఉండాలి’’ అని మాత్రం ఆయన అనుకోలేదు, అలా కోరుకోలేదు కూడా.... మరెలా !!! ఓం ప్రథమంగా...తెలంగాణ ప్రాంతంలోని పోచంపల్లి అనే ఊరెళ్ళాడు. తన హృదయాన్ని ఓ చిన్న ప్రసంగం రూపంలో అందరిముందు ఆవిష్కరించాడు. ఏదో ఒక పని చేసుకుని బతకలేకపోతే సామాన్యుడు ఎలా దారి తప్పుతాడో, ఎలా నేరాలు చేస్తాడో, అందరికీ భూమి ఉండాల్సిన అవసరం ఏమిటో, కొద్దిమంది చేతిలోనే ఎక్కువ భూమి ఎందుకు ఉండకూడదో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లు వివరించి చెప్పాడు. అది వింటున్నవారిలో ఒక చిన్న కదలిక మొదలయింది. వారిలో ఒక ఐశ్వర్యవంతుడు కూడా ఉన్నాడు. ఆయన దగ్గర కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. ఆయనలో కదలిక మరీ ఎక్కువయి లేచి నిలబడ్డాడు. ‘అయ్యా! నాకున్న భూమిలోనుంచి వంద ఎకరాల భూమిని మీకు దానం చేస్తున్నాను. మీరు వాటిని పేదరైతులకు ఇచ్చేయండి’ అని సవినయంగా విన్నవించుకున్నాడు. ఆ దాత పేరు రామచంద్రా రెడ్డి. అంతే...ఆ ఊరికి వచ్చిన ఆ పెద్ద మనిషి ఆ ఒక్క ముక్కకే పొంగిపోయాడు. వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 14 సంవత్సరాలు భారతదేశమంతటా కాలికి బలపం కట్టుకుని ఊళ్ళన్నీ ... 70వేల కిలోమీటర్ల మేర తిరిగాడు.12 భాషలు నేర్చుకుని ఎక్కడికక్కడ వారి ఊరి భాషలో మాట్లాడాడు...మనం అన్నదమ్ములమని గొంతు చించుకుంటే సరిపోదు..లేని తమ్ముడి గురించి అన్న ఆలోచించాలన్నాడు...ఇలా చాల తక్కువగానే మాట్లాడినా, ఎక్కువగా అర్థమయ్యేట్లు చెప్పాడు...అక్షరాలా 42 లక్షల ఎకరాల భూమిని దానంగా పుచ్చుకున్నాడు... పుచ్చుకున్నదంతా ఎక్కడికక్కడ పేదలందరికీ పంచిపెట్టేసాడు. మీరు నమ్మలేరు...మీరే కాదు ప్రపంచ చరిత్ర అప్పటివరకు ఎరుగని ఈ అద్భుతం ఆ తరువాత కాలంలో ‘భూదానోద్యమం’గా ఖ్యాతికెక్కింది. దాన్ని నడిపినవాడు ఆచార్య వినోబా భావే. మహాత్మాగాంధీ మాటలతో స్ఫూర్తిపొంది ఆయన సన్నిహిత అనుచరుడిగా చాలా కాలం గడిపాడు. మీరు కూడా ఆలోచించండి. సమగ్రతతో... అంటే పవిత్రమైన లక్ష్యంతో ‘నేను చేసే పని అందరికీ పనికొచ్చేదై ఉండాలి. నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ సంతోషించాలి. అలా మసలుకుంటాను’’ అని చెప్పి మీరే పనయినా చేయడం మొదలుపెడితే... ఎవర్నీ పిలవవలసిన అవసరం లేదు, మీ వెనుక ఎన్ని లక్షలమంది నడుస్తారో, ఎన్ని అనితరసాధ్యమయిన కార్యాలు సాధించవచ్చో చూపడానికి ఆచార్య వినోబా భావే ఉద్యమం ఒక మంచి స్ఫూర్తిమంతమైన ఉదాహరణ. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఈ మూడూ ప్రశ్నించుకుని ముందుకు కదలండి
అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన రెండో ప్రతిజ్ఞ – సమగ్రతతో పనిచేసి సమగ్రతతో విజయాన్ని సాధిస్తాను–అని. ఆయన మాట వెనుక గంభీరమైన ఉద్దేశం ఏమిటంటే... నేను ఈ పని చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారా ? నేను ఈ పని చేస్తే వృద్ధిలోకి వస్తానా? నేను ఈ పని చేస్తే నేనొక్కడినే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజం సంతోషిస్తుందా? అని నిష్పక్షపాతంగా మీరు వేసుకునే ప్రశ్నలకు ఔననేదే సమాధానం అయితే మీరు నిరభ్యంతరంగా ముందడుగు వేయాలని మీకు స్పష్టత ఇవ్వడం. మీ సంకల్పం ఎంత పవిత్రమయితే మీ వెంట నడిచే వాళ్ళ సంఖ్య అంత బలంగా ఉంటుంది. దానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఎవరినీ కూడగట్టుకోనక్కరలేదు. స్వార్థంతో ఉన్నవాళ్ళు కూడా దాన్ని వదిలి మీతో కలిసి అడుగులేస్తారు. అన్నివేళలా మీ అధికారబలం చూసో లేక మీ స్థాయి చూసో మీ వెంట రారు, మంచి బుద్ది, మంచిసంకల్పం ఉంటే మీ వెనుక అశేషంగా జనం తరలి వస్తారు. దానికి ఒక ఉదాహరణ... అబ్దుల్ కలాం నిర్వహించినది భారత రాష్ట్రపతి పదవి. తరువాత ఆయన మరేపదవీ అధిష్టించలేదు. దానికి ముందు ఆయన ఒక శాస్త్రవేత్త. జీవిత పర్యంతం ఆయన శాస్త్రవేత్తే. అంతే. ఆయన శరీరం విడిచి పెట్టేసిన రోజున ఆశ్చర్యం.. చిన్నచిన్నపిల్లలు దీపాలు చేతిలో పెట్టుకుని కాగితాలమీద అబ్దుల్ కలాంగురించిన కొన్ని మాటలేవో రాసుకుని, దీనవదనాలతో నడిచి వెళ్ళారు. యావద్భారతం, ప్రపంచం అంతా ఒక మహాపురుషుడు వెళ్ళిపోయాడని చెప్పి ఎంత బాధపడిందో...!! దానికి కారణం... జీవితకాలంలో ఆయన సంకల్పాలు, ఆయన నడవడిక.. పదిమంది మంచికోరి ఆయన పడిన తపన, దేశంలోని విద్యార్థులందరి అభ్యున్నతి కోరి ఆయన పడిన ఆవేదన. అందుకే ఆయన శరీరం విడిచిపెట్టినా కీర్తి శరీరంతో నిలబడ్డాడు. ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన లక్షణం అది.దేనివల్ల మీరు ప్రేరణ పొందుతున్నారన్న విషయంలో మీకు స్పష్టత, ఒక అవగాహన ఉండాలి. అది లేకపోతే చేయకూడని పనివైపుకి, చేయకూడని ఆలోచన వైపుకి మీ మనసు మళ్ళిందనుకోండి. అక్కరలేని వ్యసనాలకు మనిషి అలవాటుపడతాడు. జీవితాలు భ్రష్టత్వం పడతాయి. మీరు చేసే పని ఇతరులను బాధపెట్టేది కాకూడదు. అది జీవితంలో అలవాటయిందా అంతకన్నా మంచిపని మరొకటి ఉండదు. అలాకాక ఇతరులు బాధపడినా, ఏడ్చినా, నాశనమయిపోయినా నా కేమీ సంబంధంలేదు, నేను ఒక్కడినీ సంతోషపడితే చాలు, నా మనసులో కోరిక తీరితే చాలు..అన్న సంకల్పం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. నేనెంత కష్టపడినా ఫరవాలేదు, పదిమంది సంతోషిస్తారు, కష్టపడడం అంటే తప్పుమార్గంలోకాదు, సంకల్పం పవిత్రమై, చాలామందికి మేలు కలుగుతుందంటే తప్పకుండా మీరు కష్టపడి అటువంటి పనిచేయండి. దీపం తాను హరించుకుపోతూ వెలుగును వెదజల్లినట్లుగా మహాత్ములయిన వాళ్ళందరూ వాళ్ళ జీవితకాలంలో పదిమంది సుఖం ఆశించి నానా బాధలు పడినవారే. బతికున్నంతకాలం కేవలం తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా ఆలోచించిన వాడెవడో అటువంటి వాడిని సమాజం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుని ఆయన చెప్పిన మాటలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడిచి వెడుతుంది. ఆయన శరీరంలో ఉన్నాడా లేడా అన్న దానితో సంబంధంలేదు. ఆయన కీర్తి శరీరుడౌతాడు. సమగ్రత అన్నది మనిషికి ప్రాణంతో సమానం. అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చిన్న కష్టానికే అంతగా చలించిపోవడమా!!!
అమ్మ తిట్టింది...ఆత్మహత్య! ఒక్క మార్కు తక్కువొచ్చింది... ఆత్మహత్య!... ప్రతి చిన్నదానికీ ఏదో నిరాశ.. చేతిలోంచి జారిపడిన మట్టిముద్ద నేలపాలవుతుంది. మళ్ళీ లేవదు. అదే బంతి కిందపడితే వెంటనే పైకి లేస్తుంది. విద్యార్థులుగా మీరు నిభాయించుకోగలగాలి. తప్పయితే క్షమించండని అడగాలి. ఒప్పయితే ఒప్పని నిలబడాలి. ఒక్క మార్కు తక్కువొస్తే వచ్చేసారి కాలేజి ఫస్ట్ రా, యూనివర్శిటీ ఫస్ట్ రా...అదీ సాధన. అప్పడు నీవు చరిత్రకెక్కుతావు. ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ...ఒకనాడు తండ్రికి భారం కాకూడదని 20 కి.మీ. నడిచివెళ్ళి చదువుకుంది. ఐఏఎస్‌కి ప్రయత్నించింది. ఐపిఎస్‌కు ఎంపికయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిగా రికార్డుకెక్కింది. ఇందిరాగాంధీ ఆమెకు ఆదర్శ మహిళ. ప్రధానమంత్రిగా శ్రీమతి గాంధీ ఉన్న కాలంలో జరిగిన ఏషియాడ్ క్రీడలప్పుడు ట్రాక్ ఇంచార్జిగా కిరణ్ బేడీని నియమించారు. ఒకరోజు విధుల్లో ఉండగా ట్రాక్ దగ్గర ప్రధానమంత్రి కారు ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా పార్క్ చేసి ఉంది. అది ప్రధానమంత్రి కారు అని చెబుతున్నా పట్టించుకోకుండా క్రేన్‌తో వ్యాన్‌లో పెట్టించి పోలీస్ స్టేషన్‌కు తరలించింది. సామాన్యుడికి ఒక రూలు, ప్రముఖులకు మరో రూలా? ససేమిరా అంగీకరించేది కాదు. నియమోల్లంఘన జరిగితే ఎవరినీ లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినందుకు చరిత్రలో బహుశా ఆమె పొందినన్ని బదిలీలు మరెవరూ పొంది ఉండలేదేమో. అయినా సరే. వెనకడుగు వేయలేదు. ఒకసారి రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాట్లను అత్యుత్తమంగా నిర్వహించినందుకు ఇందిరాగాంధీ ఆమెను ఆహ్వానించి తనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించారు. కక్షసాధింపు బదిలీల్లో భాగంగా ఒకసారి ఆమెను తీహార్ జైలుకు డీజీగా పంపారు. ఒక్క తప్పుచేసి జీవితంలో ఇక్కడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉత్తములుగా బతకాలని ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి ఆమె దానిని అతి కొద్దికాలంలోనే ఆశ్రమంగా మార్చేసారు. అక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఆమె ఒక పుస్తకాన్ని రాసారు. ఆ రోజున ఆమె ఉన్న స్థాయికి ప్రధానమంత్రిని అడిగినా వెళ్ళి ఆవిష్కరించి ఉండేవారు. కానీ పేరు మోసిన నేరస్థుడు, ఖైదీ ఛార్లెస్ శోభారాజ్‌తో ఆవిష్కరింపచేసారు. ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఆవిడకేం ఒక్క రోజులో రాలేదు. జీవితంలో అన్ని కష్టసుఖాలకు ఓర్చి నిలబడింది. ఒక సంకల్పంపెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి. అంతపెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగారు ఒక కచ్చేరీ చేయాలంటే ఆరుగంటలు సాధన చేసి వెళ్ళేవారు. అదీ నిబద్ధత. దాన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. అబ్దుల్ కలాం మంచి దార్శనికుడు. ఫెయిల్ (ఊఅఐఔ) అన్నమాటకు కొత్త నిర్వచనం చెప్పాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ (ఊజీటట్ట అ్ట్ట్ఛఝp్ట ఐn ఔ్ఛ్చటnజీnజ) అంటే నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నం చేసినవాడు.. అని. విఫలమయితే నిరాశపడకూడదు. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లే... మరోసారి ప్రయత్నించు. ‘‘నా దేశ విద్యార్థులు ఆ స్థాయిని అందుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం పువ్వు వికసించినట్లు రేకురేకుగా వికసనం పొందాలి. వాళ్ళు అటువంటి ఆత్మ స్థయిర్యం పొందాలి.’’ అని కలాం కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేయడమే ఆయనకు మీరు అర్పించే నివాళి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ ఓ పాఠమే!
లక్ష్యసాధనకు వశపడడమే మార్గం. జీవితంలో కొంతమందికి వశపడండి. ప్రయత్నపూర్వకంగా తల్లికి వశపడండి, తండ్రికి వశపడండి. ప్రభుత్వచట్టాలకు వశపడండి. గురువుకి వశపడండి. వారిని గౌరవించడం నేర్చుకోండి. ఎవరికి వశపడాలనుకున్నామో వారికి వశపడాలనుకున్నప్పుడు మీరు స్వయంగా వారివెంట ఉండక్కరలేదు. వారి ఫొటో ఒక్కటి మీ జేబులో ఉన్నదనుకోండి. ‘‘మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు.’’ అన్న భావన కలుగుతుంటుంది. మీరు చదువుకునే గదిలో కలాంగారి ఫొటో పెట్టుకుని ‘మీరు చెప్పినట్లే బతుకుతాను’ అని రోజుకు ఒకసారి ఆయన చెప్పిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకున్నారనుకోండి. అలా ఉన్నప్పుడు పుస్తకం చదువుతూ మీరు సెల్‌ఫోన్ మాట్లాడగలరా? నా తపస్సు అంతా నా పుస్తకమే గదా... దానికి భంగం కలిగితే పెద్దాయన ఎంత బాధపడతారన్న భావన ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంటుందిగదా! అసలు గదిలో ఉన్నది ఫొటో ఎందుకవుతుంది? కలాంగారే మా ఇంట్లో ఉన్నారు. నేను ఏం చేస్తున్నదీ ఆయన చూస్తున్నారు. నేను చదివినది ఆయన వింటున్నారు. వివేకానందుడి పుస్తకం చదువుతున్నాను... అంటే వివేకానందుడికి ఎదురుగా కూర్చుని ఆయన మాట్లాడుతుంటే నేను వింటున్నాను’ అన్నభావనలు కలుగుతాయి. అలా చదువుతూ కూడా–‘‘వారుచెప్పినట్లుగాక నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను’ అంటే ఇక ఎందుకు ఆ పుస్తకం చదవడం ..??? ప్రయత్న పూర్వకంగా వశపడడం అలవాటు కాకపోతే అది చివరకు అసహనానికి, చీకాకుకు దారితీస్తుంది. మరొకరు చెప్పింది వినాలనిపించదు. ఈ దేశంలో ఒకప్పడు చట్టసభల్లో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే... మధ్యలో అంతరాయం కలిగించవద్దని స్వపక్షానికి సైగలు చేస్తూ పూర్తిగా ఓపికగా విన్న ప్రధానమంత్రులను చూసాం. ఒఠ్ఠిగా వినడమే కాదు, వారి ప్రసంగాలను మనసారా అభినందించే పరిపక్వత, విశాల హృదయం వారికి ఉండేవి. నెల్సన్ మండేలాను 27 సంవత్సరాలు కారాగారంలో బంధించి భయంకరంగా నానా హింసలు పెట్టారు. దక్షిణాఫ్రికాకు ఆయన స్వాతంత్ర్యం తెచ్చిన తరువాత ఆయన తనను హింసించిన వాళ్ళను కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అది పరిపక్వత. అది మనిషికి ఉండవలసిన సంయమనం. చిన్నతనంలో మండేలా సహచరులతో కలిసి గొర్రెలు కాస్తున్నాడు. వారు ఒకరోజున వంతులవారీగా అక్కడే ఉన్న ఒక గేదెమీద ఎక్కి సరదాగా కాసేపు అలా తిరిగొస్తున్నారు. మండేలా వంతు వచ్చింది. ఆయన గేదెమీదకు ఎక్కగానే ఒక్క ఉదుటున అది గెంతుకుంటూ ఒక ముళ్ళపొదలోకి దూరి ఆయన్ని ఎత్తిపడేసి పారిపోయింది. ముళ్ళు గుచ్చుకుపోయాయి. బయటికి తీసుకు వచ్చి సపర్యలు చేస్తూ...‘బాధగా ఉందా!!’ అని స్నేహితులు అడిగారు. ‘బాధేమీ లేదు. ఒక పాఠం నేర్చుకున్నట్లుంది’ అన్నారు. ఏమిటది అని వారడిగితే – ‘‘ఈ గేదెకు నన్ను ఎక్కించుకోవడం ఇష్టంలేకపోతే ఇక్కడే ఎత్తిపడేయవచ్చు. కానీ ముళ్ళపొదల్లోకి తీసుకెళ్ళి అక్కడ పడేయాల్సిన అవసరం లేదు. ఇష్టంలేని విషయాన్ని ఇష్టం లేదని చెప్పడానికి నేను జీవితంలో ఇంత క్రూరంగా ప్రవర్తించి ఎవరినీ బాధపెట్టకూడదని తెలుసుకున్నా..’’ అని బదులిచ్చారు. మీరు కూడా జీవితంలో ఎదురయిన ప్రతి సంఘటనను ఒక పాఠంగా తీసుకోగల ఓర్పును, పరిపక్వతను పెంపొందించుకోండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సిన్మా అయితే ఓ.కే.... శ్రీహరికోటా....అదేంటి!!!
ఒక సినిమా విడుదలైతే దానిగురించి తెరముందు, తెరవెనుక జరిగిన విషయాలన్నీ సమస్తం చెప్పగలిగిన నేటి యువతరంలో శ్రీహరికోటనుంచి ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాలలో ఏ ఒక్కదాన్ని గురించి అయినా స్పష్టంగా చెప్పగలవారెందరున్నారు? అలాగే సాటిమనిషి బాగోగుల గురించి తాపత్రయపడిన మహానుభావుల జీవితాలు ఎలా సాగాయో తెలుసుకుని వాటినుంచి ఎంతమంది స్ఫూర్తి పొందుతున్నారు? ఇవి నావి కావు... యువతరం గురించి కలాంగారి ఆవేదనాభరిత ప్రశ్నలు అవి. అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాథికి ఔషధం కనుక్కున్న మేడమ్ క్యూరీ పోలండ్‌లో పుట్టింది. చిన్నతనంలో తల్లి చనిపోయింది. తండ్రి ఫిజిక్స్ పాఠాలు చెప్పేవాడు. ఇంగ్లీష్ చదువులకు ఆమెను ప్యారిస్ పంపాడు. డబ్బుపెట్టి మంచి గది తీసుకోలేక ఎముకలు కొరికే చలిలో ఒక చిన్న పూరిపాకలో ఉంటూ చదువుకునేది. డబ్బుచాలక రొట్టె నీళ్ళలో ముంచుకు తినేది. ట్యూషన్లు చెబుతూ, ఇంగ్లీష్‌లో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చింది. ఇంగ్లీష్ ఎం.ఎ చేసి కూడా తండ్రి సూచన మేరకు మళ్ళీ ఫిజిక్స్ మొదలు పెట్టింది. పూరిపాకనే ప్రయోగశాలగా మార్చుకుని అలా చదువు కొనసాగిస్తుండగా ప్రేమ ప్రయత్నంలో మోసపోయి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయింది. తరువాత తాను నిలదొక్కుకుని నిబ్బరంగా ఆలోచించి..‘‘ఒక చిన్న దెబ్బ తగిలితే ఆత్మహత్యా? నాకోసం తపిస్తున్న నా తండ్రి నా తోడబుట్టిన వాళ్ళు... వారిపట్ల నాబాధ్యత ఇదేనా’’ అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ‘‘...కాదు, కాదు... ఎక్కడ కింద పడ్డానో అక్కడే పైకి లేవాలి. నాకు జరిగిన మోసాన్ని ఒక పీడకలగా మర్చిపోవాలి’ అని దృఢంగా నిశ్చయించుకుంది. తన శక్తిని మొత్తాన్నీ ఫిజిక్స్ మీద పెట్టింది. మళ్ళీ వివాహం చేసుకుని గర్భిణీ అయి ఉండి కూడా, భర్తతో కలిసి శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాల పరంపర కొనసాగిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయతగిన మూలకాన్ని కనిపెట్టి యురేనియం అని ధ్వనించేటట్లుగా తన మాతృదేశంపేరుని జోడించి ‘పొలేరియం’ అని పేరుపెట్టి తన దేశభక్తి చాటుకుంది. ఆమెచేసిన కృషికి గుర్తింపు లభించి ‘నోబెల్ బహుమతి’ లభించింది. ఆమెతో కలిసి పనిచేసినందుకు ఆమె భర్తకు, ఆమె గురువుకు మరో రెండు నోబెల్ బహుమతులొచ్చాయి. దానితో బాగా ఐశ్వర్యం కూడా వచ్చింది. ఆ సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే తండ్రి చనిపోయాడు... మరికొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో భర్త కూడా చనిపోయాడు. అప్పటికి ఆమె వయసు 40 దాటలేదు. క్యాన్సర్‌కు ఔషధం కనిపెట్టడానికి రోజుకు 18 గంటలు కష్టపడి ఆరోగ్యాన్ని ఎంతగా త్యాగం చేసేసిందంటే.. ఆమెకే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది.అయినా ఆమె వెరవలేదు. ఆ పరుగు, ఆ పట్టుదల, ఆ కసి ఆగలేదు...ఈ సారి కెమిస్ట్రీలో మరొక ‘నోబెల్’ బహుమతి తెచ్చుకుంది. ఆమె దార్శనికత వలన ఆమె కూతురికి, అల్లుడికి కూడా మరో రెండు నోబెల్ బహుమతులొచ్చాయి. అంటే ఆమె ఒక్కతే ఆరు నోబెల్ బహుమతులకు కారణమయింది. ఆమే తన పరిశోధనలకు పేటెంట్ తీసుకుని ఉంటే తదనంతరకాలంలో ఆమె వంశీకులకు బిల్‌గేట్స్ కన్నా వెయ్యిరెట్ల ఐశ్వర్యం వచ్చి ఉండేది. కానీ ‘‘అది భూమిలోంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది. అది ప్రజలకు అందాలి. ఆ పేటెంట్ తీసుకోవడానికి నేనెవర్ని. నాకు అక్కరలేదు.’’ అని చెప్పేసింది. చివరగా తను కోరుకున్నదేమిటంటే తన సమాధిలో పిడికెడు మట్టి...అదీ తన జన్మభూమినుంచి తెచ్చి చల్లాలని కోరుకుంది.ఎవరి జీవితాలూ వడ్డించిన విస్తళ్ళు కావు. గులాబీ పువ్వు కింద ముళ్ళు చూసి భయపడిన వాడు జీవితంలో అక్కడే ఉంటాడు. ఆ పువ్వు సౌందర్యాన్ని, సౌరభాన్ని చూడాలనుకున్నవాడు ముందుకే అడుగేస్తాడు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రాత్రికి రాత్రి.. రాయి రత్నమై పోతుందా?
అక్కరలేని వస్తువును దగ్గర పెట్టుకోవడం ప్రమాద హేతువు. అంతంత ఖరీదైన సెల్ఫోన్లు, మోటారు సైకిళ్లు, కార్లు మీకెందుకు? మీరు నా చేతికి ఒక దుడ్డు కర్ర ఇచ్చారనుకోండి. నేను దాన్ని తీసుకుని పక్కనబెట్టుకుని ఊరుకోను. కొంతసేపైన తరువాత... ఒకసారి దాన్ని పట్టుకుని తిప్పాలనిపిస్తుంది, దేన్నైనా గుచ్చాలనిపిస్తుంది, ఏదో పురుగు దానిమానాన అదిపోతుంటే దాన్ని కొట్టి, అది గిలాగిలా కొట్టుకొంటుంటే చూడాలనిపిస్తుంది. అంటే హింసా బుద్ధిని ప్రేరేపిస్తుంటుంది. మనిషిని ఆకర్షించి పాడుచేసే వాటిపట్ల నిగ్రహంతో ఉండాలి. అత్యవసర పని మీద, అవసరం మేరకు కారులో వెళ్లడం, వేగంగా చేరుకోవడం అవసరమే. కానీ అవసరమైనప్పుడు వేగాన్ని పెంచగలిగే యాక్సిలరేటర్ కారుకు ఎంత అవసరమో, అత్యవసరంగా ఆపవలసి వచ్చినప్పుడు దానిని ఆపడానికి బ్రేకులు కూడా అంతే అవసరం. యాక్సిలరేటర్, బ్రేకు రెండూ సవ్యంగా పనిచేస్తేనే కారువల్ల, మన ప్రయాణంవల్ల మన ప్రయోజనం నెరవేరుతుంది. కానీ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడం నాకు చేతకాదు అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఆ వేగమే అతని వృద్ధికి ప్రమాద కారణమవుతుంది. అందువల్ల అక్కరలేని వాటి జోలికి వెళ్లకండి. మీ తల్లిదండ్రులు మీ చదువుకోసం, మీ ఫీజులకోసం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి కూడబెట్టిన ధనాన్ని దుర్వినియోగం చేయకుండా నిగ్రహించుకోవడం మీకు తెలిసి ఉండాలి. అబ్దుల్ కలాం... అంతెందుకు మీ యువత ఎక్కువగా అభిమానించే సచిన్ టెండుల్కర్లాంటి వాళ్లను గౌరవించడం మంచిదే. ప్రేమించడం, అభిమానించడం మంచిదే. కానీ వారు అలా గొప్పవాళ్లు కావడానికి ఏం చేసారో తెలుసుకుని ఆ మార్గంలో వెళ్లకపోవడం మాత్రం నేరం. సచిన్ టెండుల్కర్ భారతరత్న రాత్రికి రాత్రి అయిపోలేదు. తనకి బంతి వేసేవాడు లేకపోతే పైన కమ్మీకి తాడేసి బట్టలో బంతిచుట్టి అది ఊగుతూ ఉంటే ఒక్కో దిశలో ఒక్కో రకంగా వస్తున్న బంతిని ఎన్ని రకాలుగా ఆడవచ్చో ఏకాగ్రతతో అభ్యాసం చేశాడు. చుట్టూ 50మంది బౌలర్లను నిలిపి, వాళ్ల గురువు గంటలకొద్దీ బంతులు వేయిస్తుంటే అదే శ్రద్ధతో, అదే నిష్ఠతో రోజులకొద్దీ ఆడేవాడు. కిక్కిరిసిన బస్సుల్లో అందరూ విసుక్కుంటున్నా, తిడుతున్నా సహిస్తూ కిట్ భుజాన మోసుకుంటూ దూరాభారాలు లెక్కచేయకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని ఎప్పటికో చేరుకున్నాడు. ఆటలో నైపుణ్యంతో పాటు జీవితంలో అత్యుత్తమమైన సంస్కారాన్ని కూడా దానితోపాటు అలవర్చుకోబట్టే వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. తను ఇల్లు కట్టుకునే సందర్భంలో ఆ వీధిలో ఇరుగుపొరుగువాళ్లకు జరిగే అసౌకర్యానికి బాధపడుతూ ‘నేను మీలో ఒకడిగా ఉండటానికి మీ వీధికి వచ్చి, నిర్మాణం తాలూకు శబ్దాలు, ఇతరత్రా పనులతో ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. అలాగే మీరు సహృదయంతో అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతల’ంటూ ఇంటింటికీ వెళ్లి ఒక ఉత్తరం ఇచ్చాడు. అత్యున్నత స్థానాలకు చేరుకుని కూడా జీవితపు మూలాలను, మానవత్వపు విలువలను మరవకపోవడం అంటే ఇదే. అటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవడం వేరు. వారి నుండి స్ఫూర్తి పొంది, అదే నిబద్ధతతో జీవితంలో నిలదొక్కుకోవడం వేరు. నిర్ధిష్ట లక్ష్యంతో, దృఢ సంకల్పంతో, కఠోర శ్రమతో ముందుకు అడుగేస్తే,... మీ మాతాపితలే కాదు, మీ మాతృదేశం కూడా మీలాంటి రత్నాలను చూసుకుని మురిసిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గడ్డి పరకలా బతకొద్దు
సర్ ఆర్ధర్ కాటన్ చిన్నతనంలో అన్నయ్యతో కలిసి వీథిలో వెడుతుండగా పెద్ద వర్షంపడి అక్కడక్కడా పెద్ద మడుగులు కట్టింది. ‘ఇంటికి త్వరగా వెడదాం’ అని అన్నయ్య తొందరపెడుతున్నా కాటన్ ఒక పెద్ద మడుగు దగ్గర ఆగి... ఒకపుల్ల తీసుకుని పల్లంవైపున్న చిన్న చిన్న గుంటలలోకి ఆ మడుగు నీటిని మళ్ళించాడు. తమ్ముడి నిశిత దృష్టిని గమనించిన అన్న ఇంటికి తిరిగివచ్చిన తరువాత వారి తండ్రికి కాటన్ చేసిన పనిని ప్రశంసాపూర్వకంగా చెప్పాడు. ఆయన కుమారుడిని నీటిపారుదల శాస్త్రంలో ఇంజనీరును చేసారు. ఆ మహానుభావుడే తరువాత కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరిపై ఒక గొప్ప ఆనకట్ట కట్టి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల్లో బంగారం పండడానికి కారణమయ్యాడు. ఆనకట్ట కట్టడానికి ముందు గోదావరీ పరీవాహక ప్రాంతంలోని అరణ్యమంతా సర్వే చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే కాటన్ తానే గుర్రం ఎక్కి స్వయంగా సర్వేకు పూనుకున్నాడు. మార్గమధ్యంలో దోమలు కరిచి మలేరియా సోకితే ఇంటికి వెళ్ళి కోలుకున్న అనంతరం తిరిగొచ్చి సర్వే కొనసాగించాడు. రాత్రిళ్ళు సమీప గ్రామస్థులందరినీ సమావేశపరచి ‘రూపాయికి బదులు పావలానే తీసుకోండి. శ్రమపడండి. నాలుగేళ్ళు చాలు. ఆనకట్ట వస్తే మీ జీవితాలు బంగారమయిపోతాయి. వెయ్యిరూపాయల పొలం లక్ష రూపాయలు పలుకుతుంది’ అని నచ్చచెప్పి ఆనకట్ట కట్టాడు. ఈవేళ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న వ్యవసాయంవల్ల వస్తున్న కొన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎవరి త్యాగ ఫలితం అంటే వినిపించేది ఒక్క పేరే–సర్ ఆర్ధర్ కాటన్. అందుకే ఈ రెండు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎన్ని కనిపిస్తాయో మీకు గుర్రంమీద కూర్చుని ఉన్న కాటన్ విగ్రహాలు అన్ని కనబడతాయి. అది ఈ జాతి కృతజ్ఞత. అంటే విద్యార్థిగా నువ్వొక లక్ష్యం పెట్టుకో. ఏ లక్ష్యం లేకుండా గడ్డిపరకలా బతకొద్దు. ఇది నామాట కాదు. కలాంగారి ఆవేదన. ‘‘నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు లేదు. అప్పుడు చేసిన మంచి పనులు, అప్పుడు చదివిన చదువే ఆధారంగా జీవితం కొనసాగుతున్నది. అప్పుడు చదువుకుని ఉండకపోతే ఇలా నేను మీ ముందుకు వచ్చే సాహసం చేయగలిగి ఉండేవాడిని కాదు. శక్తి నిరుపయోగం కాకుండా ఉండాలంటే ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యమయినా అలవోకగా సాధించలేం. అందుకే కలాం గారు –‘చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరం అని నాకు అర్థమయింది’ అని అన్నారు. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటేనే ఎక్కువ శ్రమచేసి దానిమీద దృష్టి పెట్టుకోగలుగుతారు. రాముడూ లేస్తాడు ఉదయాన్నే, రావణాసురుడూ లేస్తాడు ఉదయాన్నే. రావణాసురుడు లేచి పరస్త్రీ వ్యామోహంలో వెడితే, రాముడు దైవకార్యం చేయడానికి వెడతాడు. అందుకే అలారం పెట్టుకోని నీవు ఎప్పుడు లేచావన్నది కాదు, లేచి ఏం చేసావన్నదే ముఖ్యం.‘నేనిది అయి తీరుతాను’ అని ఒక లక్ష్యంపెట్టుకోవడం ఒక ఎత్తు. దృష్టి చెదరకుండా దాని వైపుగా మాత్రమే ప్రయాణించడం మరో ఎత్తు. లక్ష్యం దిశగా నీ ప్రయాణం ముందుకు సాగకుండా వెనక్కి లాగేవి రెండు ఉంటాయి. వాటిలో ఒకటి అహిత శత్రువు, అంటే శత్రువు నీకు కనబడడు. కానీ పక్కన చేరి పాడు చేస్తుంటాడు. అంటే ఎంతో స్నేహితుడిలాగా కనబడతాడు. కానీ కుట్రలు చేస్తుంటాడు. నీవది గ్రహించే సరికి పుణ్యకాలం దాటిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!!
అబ్దుల్ కలాంగారు ప్రతిజ్ఞచేయించినట్లుగా లక్ష్యసాధనకు ఏకాగ్రతతో శ్రమించాలి. లక్ష్య్యసాధన లో రెండు భాగాలు – లక్ష్యం నిర్ణయించుకోవడం మొదటిదికాగా, రెండవది దాని సాధనకోసం శ్రమించడం. విద్యార్థులుగా మీరు విజేతల అనుభవాలను పరికించి చూడండి. లక్ష్యం నిర్ణయించుకునే దశ, లక్ష్యసాధన తరువాతి దశ.. గొంగళి పురుగు దశ, సీతాకోకచిలుక దశలా కనిపిస్తాయి. రేపు మీ జీవితంలో కూడా అంతే. గొంగళిపురుగు ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించేలా ఉంటుంది. మీదపడితే దురదపెడుతుంది. దానిని చూడడానికి తాకడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయినా అది ఆకులుతిని తన నోటివెంట వచ్చే ద్రవంతో గూడుకట్టుకుని దానిలో పడుకుని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. తరువాత తాను కట్టుకున్న గూడు బద్దలు కొట్టుకొని బయటకు రావడంకోసం రెక్కలు విప్పడానికి ఉన్నచోటు దానికి సరిపోదు. గూడు గోడలు అడ్డుపడుతుంటాయి. అలా కొట్టుకుంటున్నప్పడు అది అలసిపోదు. ‘నేను బయటకి వచ్చి తీరుతా’ అన్న కృతనిశ్చయంతో శ్రమిస్తుంది. అలా కొట్టుకోగా కొట్టుకోగా గూడుకు చిన్న రంధ్రం పడుతుంది. ఇంకా శ్రమించగా ఆ రంధ్రం నెమ్మదిగా పెద్దదయి తనకు అడ్డుపడిన చిక్కులను తొలగించుకుంటూ గూట్లోంచి బయటపడుతుంది. రివ్వున ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడది.. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించిన పురుగు ఎంతమాత్రం కాదు. అసలు అది ముందు అలా ఉండేదంటే కూడా నమ్మశక్యం కాదు. ఎన్ని రంగులు, ఎన్ని రేఖలు, చిత్రవిచిత్రమైన గీతలు ముగ్గులు పెట్టినట్లుగా చాలా అందంగా కనబడుతుంది. పరమ సంతోషంగా గాలిలో ఎగురుతూ పోతుంటుంది. ఆకులుతిని బతికిన గొంగళిపురుగు మరింత ఆశ్చర్యకరంగా పూలలో మకరందాన్ని తన తొండంతో జుర్రుకునే క్రమంలో పూరేకులమీద వాలినా వాటికి ఏ మాత్రం అపకారం జరగనివ్వదు, పాడు చేయదు. అది గూడు బద్దలు కొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురుపుల్లతోనో అడ్డొచ్చిన గూడును జాగ్రత్తగా తొలగించారనుకోండి. ఆశ్చర్యం.. సీతాకోకచిలుక బయటికొస్తుంది,కానీ ఎగరలేక కిందపడిపోతుంది. అదలా కష్టపడేక్రమం లోనే, దానికాళ్ళకు, దాని రెక్కలకు కావలసిన బలాన్నది సొంతంగా సమకూర్చుకుంటుంది. అదీ మనిషికి ఉండవలసిన సాధనాబలం. ‘భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు. మేధస్సు ఇచ్చాడు. ఇన్ని విద్యాలయాలు ఇచ్చాడు. ఇంత జ్ఞానాన్ని అందించే పుస్తకాలనిచ్చాడు. ఇంతమంది పెద్దలనిచ్చాడు. ఇంత గొప్ప సమాజాన్నిచ్చాడు. ఇన్ని ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనా?’ అని తనను తాను ప్రశ్నించకుంటూ లక్ష్యం దిశగా ఏకోన్ముఖంగా సాగిపోయిన విద్యార్థి సీతాకోకచిలుక లాగా సకలవర్ణశోభితమై తన కాళ్ళతో, తన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తూ వస్తాడు. అందుకే విజయానికి చిహ్నంగా పైకి ఎగురుతున్న సీతాకోకచిలుక బొమ్మను వేస్తారు. గురువుగారి దగ్గర విద్యనేర్చుకోవడం అంటే... శిష్యుడు గురువుగారిని శ్రమపెట్టకుండా ఆయన దగ్గరచేరి విద్యపొందాలి. ఎలా !!! పూవుకు ఏ మాత్రం అపకారం చేయకుండా దాని గుండెల్లోకి చొరబడి సీతాకోకచిలుక మకరందాన్ని జుర్రుకున్నట్లు శిష్యుడు విద్యను సముపార్జించాలి.‘భృంగావళీచ మకరందరసానువిద్ధఝుంకారగీతనినదైఃసహసేవనయ ..... శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతమ్’.... సీతాకోక చిలుకులు ఎగురుతున్నాయి. ఆ సవ్వడి మీకు వినబడడం లేదా, తెల్లవారుతోంది స్వామీ, మీరు లేవండి – అని వేంకటేశ్వరస్వామిని కూడా ప్రేమగా నిద్రలేపడానికి ఒకనాడు ఏవగింపు కలిగించిన ఇప్పటి సీతాకోచిలుక ఒక అద్భుతమైన ఉపమానంగా నిలుస్తున్నది. సాధకుడు దానినుంచి స్ఫూర్తిని పొందాలి. విజేతగా సప్తవర్ణాలతో మెరిసిపోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇష్టంగా కష్టపడితేనే ఏదయినా సాధ్యం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విద్యార్థుల చేత చేయించిన ప్రతిజ్ఞలో మొదటిది ‘‘నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకోసం కష్టపడతాను.’’ విద్యార్థులందరూ జీవితంలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది లేకుండా కొనసాగించిన జీవితానికి దిశ–దశ ఉండవు. నేను ఒక చోటికి వెళ్లాలనుకోవడం, నేనిది సాధించాలనుకోవడం.. అలా ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని జీవితంలో ఏర్పరుచుకోవాలి. అది ఎంత అవసరమో దాని సాధనకోసం అహరహం ప్రయత్నించడం అంతే అవసరం.గాలివాటుకు ఎగిరిపోయే గడ్డిపరకలుంటాయి. అవి గాలి ఏ దిశలో వీస్తే ఆ దిశలో ఎగిరిపోతుంటాయి. తనకంటూ ఒక దిశ లేదు. భగవంతుడిచ్చిన అపురూప జీవితం అలా ఉండకూడదు. ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ‘నేనిది చేస్తాను’ అని అనాలంటే ధైర్యం కావాలి. ధైర్యమంటే చీకటిగదిలోకి వెళ్ళడానికి ఉండే ధైర్యం కాదు. నేనీ పుస్తకాన్ని చదువుతాను... చదవడం అంటే కేవలం చదువుకుంటూ పోవడం కాదు. అన్నం తిన్న తరువాత నేను, అన్నం ఎలా ఒకటయిపోతామో, నేను నీళ్ళు తాగిన తరువాత నేను నీళ్ళు ఎలా ఒకటయిపోతామో అలా పుస్తకం, నేను ఒకటి కాగలగాలి. ఆ తరువాత ఆ పుస్తకంలో ఏముందన్న దానిమీద సాధికారత ఏర్పడుతుంది. మళ్ళీ పుస్తకం తిరగేయాల్సిన అవసరం రాకూడదు. అదీ లక్ష్య సాధనకు శ్రమించడానికి కావలసిన ధైర్యమంటే. లంకాపట్టణానికి వెళ్ళడానికి హనుమతో కొన్నివేల వానరాలు బయల్దేరాయి. సముద్రం వంక చూసిన తరువాత అవి అక్కడే చతికిలపడిపోయాయి. కానీ హనుమ ఒక్కడే–నేను ఈ నూరు యోజనాల సముద్రాన్ని దాటతాను’ అని నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకోవడం ఒక ఎత్తు. అలా చేసుకున్నంత మాత్రాన అది సాధ్యంకాదు. అలా అనుకున్న వ్యక్తి జీవితాన్ని తపస్సుగా స్వీకరించాలి. తపస్సంటే – కళ్ళు మూసుకుని చెట్టుకిందో పుట్టలోనో కూర్చోవడం కాదు. ఇంద్రియాలను, మనసును చాలా కఠినంగా నియంత్రించగలగాలి... అలా కష్టపడాలి. హనుమలాగా కష్టపడడంతోపాటూ దాన్ని సాధించడంలో సంతోషాన్ని పొందాలి. మీ లక్ష్యసాధన సందర్భంగా కష్టపడేటప్పుడు మీకది కష్టమనిపిస్తున్నదంటే మీరది ఎప్పటికీ సాధించలేరు. మీరు దాన్ని ఆస్వాదించగలగాలి. కష్టపడడాన్ని ఆనందించగలగాలి. ఒక పుస్తకం చదువుతున్నారు లేదా ఒక ఉపన్యాసం వింటున్నారు. అది మూడు నాలుగు గంటలు కూడా పట్టవచ్చు. దానికి విసుగు ప్రదర్శించకూడదు. మొదట ఉన్నప్పుడు ఎంత ఆసక్తి ఉందో అంతే ఆసక్తి చివరివరకూ ఉండగలగాలి. అంతేతప్ప యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి చేసామని చేయకూడదు. సంతోషంగా చేసింది మనసులో బాగా నాటుకుంటుంది. లోపలకు వెడుతుంది. మీరు సంతోషంగా, ప్రయత్నపూర్వకంగా చేయనిదానిని మీ మనసు గ్రహించదు. మీరు ఇంటిదగ్గర బయల్దేరి విద్యాలయానికి వెడుతున్నారు. దారిలో ఎన్నో విషయాలు చూస్తారు. చూడడం కంటి ధర్మం. కానీ ఏవి చూసారో అవన్నీ మనసులోకి వెడతాయా ...??? ఏదయినా ఒకటి వెళ్ళిందనుకోండి అది మాత్రం మనసులో నిలబడిపోతుంది. అందువల్ల లక్ష్యసాధనలో శ్రమతోపాటూ ఏకాగ్రత ఉండాలి, లక్ష్యం మీదినుండి దృష్టి చెదరకూడదు. లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తయితే, దానికోసం చెమటోడ్చి విజయాన్ని అందుకోవడం రెండో మెట్టు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బంగారు భవితకు పది సూత్రాలు
విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్‌ను, వారి వ్యక్తిత్వ వికసనాన్ని దృష్టిలోపెట్టుకుని, వేనాడు(కేరళ)లోని జవహర్ నవోదయ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వారిచేత ఒక ప్రతిజ్ఞ చేయించారు. అది ఒక్క సందర్భంలోనే చేయించారు. అది తన జీవితంలో మరచిపోలేని రోజని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ ప్రతిజ్ఞలోని పదిసూత్రాలు ఇవి.... 1 నేను ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకోసం కష్టపడతాను. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరమని గుర్తించాను. 2 చిత్తశుద్ధితో పనిచేసి సమగ్ర విజయం సాధిస్తాను. 3 నేను నా కుటుంబంలో, నా సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి సభ్యుడిగా ఉంటాను. 4 కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను. 5 ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ‘‘నేనేం ఇవ్వగలను’’ అని ఆలోచిస్తాను. 6 సమయ ప్రాముఖ్యతను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. జవసత్వాలతో ఉన్న నా కాలాన్ని వృథా కానివ్వను. దీనినే నేను ఆదర్శంగా భావిస్తాను. 7 స్వచ్ఛమైన భూగ్రహ వాతావరణం కోసం, స్వచ్ఛమైన ఇంధన శక్తికోసం సర్వదా ప్రయత్నిస్తాను. 8 ఈ దేశ యువ ప్రతినిధిగా నా లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధించడానికి సాహసంతో పనిచేస్తాను. ఇతరుల విజయాలను కూడా అదే స్ఫూర్తితో ఆస్వాదిస్తాను. 9 నేను నా విశ్వాసమంత యువకుడిని/యువతిని. సందేహమంత వృద్ధుడను/వృద్ధురాలను. అందువల్ల నా హృదయంలో విశ్వాసమనే దీపాన్ని వెలిగిస్తాను. 10 నా దేశ పతాకం నా హృదయంలో ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. నా దేశానికి కీర్తి, వైభవం తీసుకు వస్తాను. ఆ రోజున తనలోంచి వచ్చిన భావావేశాన్ని పదిసూత్రాలుగా మలచి కలాం అక్కడ విద్యార్థులతో చేయించిన ఈ ప్రతిజ్ఞను కాకినాడలో విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన ఒకశిబిరంలో వారితో అదే స్ఫూర్తితో, నిబద్ధతతో చేయించాం. ఈ ప్రతిజ్ఞా పాఠాన్ని ప్రతి విద్యార్థీ ప్రతిరోజూ ఒకసారి ఇంట్లో కుడిచేయి ముందుకు చాపి నిజాయితీగా ప్రతిజ్ఞలాగా చదువుకోవాలి. విద్యాలయాలు కూడా ఇలా పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తే ... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, వారి ఊరు, ఈ దేశం అన్నీ గర్వపడే పౌరులుగా తయారవుతారు. దీని కారణంగా అబ్దుల్ కలాంగారి ఆశీస్సులు వారందరికీ పరిపూర్ణంగా లభిస్తాయి. నేను కూడా ‘‘మహాత్మా! విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మీరు కన్న కలలు సాకారం కావాలనీ, అలాగే మీరు చెప్పిన విషయాలు వారి మనసులలో బాగా నాటుకుని వారు ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి అవసరమైన శ్రద్ధాసక్తులను వారికి కటాక్షించవలసింది’’ అని కోరుతూ శారదామాతకు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కలాంను చూడాలన్న కల అది
పూర్వ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఎ.పి.జె. అబ్దుల్ కలాం గురించి మన దేశంలో తెలియని విద్యార్థినీ విద్యార్థులుండరు. ఆయనకు పిల్లలన్నా, పిల్లలకు మంచి విషయాలు బోధించాలన్నా ప్రాణం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంటనే మద్రాస్ ఐ.ఐ.టి ప్రాంగణంలోని ఒక అతిథి భవనంలో ఉంటూ దేశంలోని పలు ప్రాంతాల్లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలను పునఃప్రారంభించిన మహానుభావుడు. చివరకు విద్యార్థులతో మాట్లాడుతూ, మాట్లాడుతూ జారిపడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేసాడు. అటువంటి కలాం– రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కేరళ రాష్ట్రంలోని వేనాడులో జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసంగించడానికి వెళ్ళాల్సి ఉంది. ఆయన దానికి తగ్గట్టుగా ప్రణాళికవేసుకుని ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ విమానం రెండు గంటలు ఆలస్యం అయింది. ముందనుకున్న ప్రకారం బెంగళూరులోదిగి కాలికట్ విమానం ఎక్కి, అక్కడినుంచి కారులో వేనాడుకు వెళ్ళాలి. బెంగళూరుకు ఆలస్యంగా చేరుకోవడంతో కాలికట్ విమానం వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగానే సాయంత్రం ఆరు కావచ్చింది. అంటే ఆ సమయానికి ఆయన వేనాడులో వేదికమీద ఉండాలి. వెంటనే ఆయన పాఠశాలవారికి ఫోన్ చేసి ‘‘విమానం ఆలస్యం అయింది. రాలేకపోతున్నా. కనుక మీ కార్యక్రమాన్ని కొనసాగించండి. నా ఆశీస్సులు మీ కెప్పుడూ ఉంటాయి.’’ అని చెప్పారు. అది విన్న నిర్వాహకులు – ‘‘కలాంగారిని దగ్గరగా చూడాలని, ఆయనతో మాట్లాడాలని మా పిల్లలందరికీ కల. ఎంత ఆలస్యమయినా ఫరవాలేదు. మీరు రాగలరా ?’’ అని అడిగారు. దానితో చలించిపోయిన కలాం–‘‘ఇప్పడు నాకు మరో మార్గంలేదు. ఒక్క అరణ్యమార్గంలో ఇక్కడినుండి (బెంగళూరు) కారులో వస్తే తెల్లవారు జామున 2.30–3గంటలకు చేరుకోగలను. అప్పటివరకూ మీ పిల్లలు ఉండగలరా ?’’ అని బదులిచ్చారు. ‘‘పరమ సంతోషంతో కూర్చుంటారు’’ అని నిర్వాహకులు చాలా హుషారుగా సమాధానమిచ్చారు.‘అయితే, వస్తున్నా..’’ అన్నారాయన. ‘‘నాగరకతకు సంబంధించిన చిహ్నంగా ఆ రహదారి తప్ప వేరొకదారి లేదు. అంత భయంకరమైన అరణ్యమార్గంలో చంద్రుడి కాంతి ఒక్కటే తోడుగా నేను ఆరుగంటలకు వేనాడు బయల్దేరాను’’అని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నరకు వేనాడు చేరుకున్నారు. అంతదూరం ప్రయాణం చేసిన బడలికనుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి మందిరానికి వెళ్లకుండా, కనీసం ముఖంకూడా కడుక్కోకుండా పిల్లలు ఎదురుచూస్తుంటారని నేరుగా పాఠశాలకు వెళ్ళారు. తెల్లవారుఝాము మూడవుతున్నది. పిల్లలకళ్ళు మత్తుకు వాలిపోయి, తలలు పక్కకు ఒరిగిపోయి నిద్రముఖాలతో తూగుతూ ఉండాలి. కానీ కలాం గారొస్తున్నారన్న సంతోషంలో పౌర్ణమి చంద్రుడిలా వికసించిన ముఖాలతో వారందరూ ఎదురుచూస్తుంటే, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆనందంలో ఆయన ప్రసంగించినా సంక్షిప్తంగానే ముగించారు. దానికి ముందు ఆయన వారితో పది సూత్రాలతో పొదిగిన ఒక చక్కటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ దేశం వృద్ధిలోకి రావాలని, పిల్లలందరూ కూడా జీవితంలో మూడుపూవులూ ఆరుకాయల చందంగా ఎదగాలన్న ఆకాంక్ష ఆ సూత్రాలవెనుక ఉన్న సూత్రం. (అబ్దుల్ కలాం జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలతో కాకినాడ గోశాలలో విద్యార్థులను ఉద్దేశించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు 2017లో చేసిన వ్యక్తిత్వ వికాస ప్రసంగం సంక్షిప్త పాఠం– ఈ వారం నుంచి). -
రెండో స్థితి
సచ్చిదానంద శివాభినంద నృసింహ భారతి అనే శృంగేరి పీఠాధిపతులు అరణ్యం గుండా వెళుతున్నారు. చీకటి పడటంతో, ఆ అరణ్యంలోనే ఒకచోట గుడారం వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ అక్కడికి వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. అతనితో కొంత సంభాషణ అనంతరం, ‘‘నేను మూడు లక్షణాలు చెబుతాను. వాటిల్లో నువ్వు ఏ లక్షణాలు గలవాడివో నాకు చెప్పు’’ అన్నారు పీఠాధిపతి. ‘‘అడగండి’’ అన్నాడతను. ‘‘నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వారిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపమున్నవాడివా! లేక విషయం తెలుసుకున్నాక విరుచుకుపడే కోపమున్నవాడివా?’’ అని అడిగారు పీఠాధిపతులవారు. ‘‘నేను మొదటి కోవకి చెందినవాణ్ణి స్వామీ! నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను’’ అని చెప్పారు రేంజర్. ‘‘అలాగా... అయితే, నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు. ‘‘ఎందుకిలా చేశావ్’’ అని అడుగు’’ అని సెలవిచ్చారు స్వామివారు. అతను ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికి బాగా చీకటి పడింది. వంటవాడిని ‘‘బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు’’ అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే రెండు పలుచటి గోధుమ రొట్టెలు తీసుకువచ్చి ఒణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు వంటవాడు. ఈయనకి ఎక్కడాలేని కోపం వచ్చింది. ‘నేను రాననుకొని వీడు తినేశాడు’ అనుకుని వెంటనే లేచి అతణ్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది. ఇవాళ రెండోస్థాయికి మారి చూద్దామని. ‘‘ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్’’ అని అడిగాడు. అతనన్నాడు. ‘‘మీ అటెండర్ని పంపించి కదా.. సరుకు తెప్పించుకుంటాం. అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నా కోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి’’ అన్నాడు. ఆ రేంజర్ వలవలా ఏడ్చేశాడు. ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నేను రెండోస్థాయికి వస్తేనే కానీ నాకిన్ని దోషాలు కనబడలేదు! ఇలా నేను ఎంతమందిని కొట్టానో అని విచారించి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన. (చాగంటి కోటేశ్వరరావు ప్రసంగ భాగం) -
ఆకలితో ఉన్న వాడిపై ఆగ్రహం వద్దు
ఆతిథ్య వేళ అంటారు. ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడపదాటి ఇంటి లోపలకు వచ్చిన అతిథిని ముందుగా ‘‘భోజనం చేసారా!’’ అని అడగాలి. ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీ పట్టణం పేరెత్తకుండా మాట్లడటం కుదరదు. కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటలవేళ ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే. అందుకే ఆడవాళ్లు కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వడ్డన సేవ చేయాలని కోరుకుంటారు. అటువంటి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసులవారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. శపించబోయారు. చేతిలోకి నీళ్ళు తీసుకున్నాడు..‘‘ధనము లేకుండెదరుగాక మూడుతరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడుతరములు లేకుండుగాక, పంచజనులకు కాశిపట్టణమందు.’’ అన్నాడు. ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి గడియ తీసుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి. అప్పటికీ లోపలినుంచి శివుడు....‘‘ధూర్తుడు, కాశీని శపిస్తాడట.. కాల్చేస్తా...!!!’ అంటున్నాడు. శివుడి ఆగ్రహానికి కారణం–‘కాశి’ పరమేశ్వరునికి భార్యలాంటిది. వెంటనే పార్వతీ దేవి అన్నది కదా...‘‘ఆగండాగండి. ఆకలిమీదున్న వాడిని కాల్చకూడదు. తప్పు. అతను అతిథి’’ అంటూ గభాల్న తలుపుతీసుకుని వచ్చింది. కోపంతో నీళ్ళుపట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది...‘‘వ్యాసా! ఇలా రా! భిక్షలేదని కాశీ పట్టణంమీద ఇంత కోపించడమా. నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకకపోవడమా? భూమండలంలో ఎక్కడయినా అన్నం దొరకదేమో కానీ కాశీ పట్టణంలో అన్న దొరకకపోవడం అంటూ ఉండదు. ఎందుకంత తొందరపడుతున్నావు? వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చుకుని రా’’–అని వ్యాసుడిని, శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధుర మధురమైన వంటకాలను వడ్డించింది. పాయసం పాత్ర ఎడమచేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని అన్నపూర్ణమ్మ తల్లి ఎవడొస్తాడా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో. ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడయినా ఎవరికి అన్నం పెడతాడు? ఆతిథ్యమంటే ఆతిథ్యమే. వ్యాసుడిని కూర్చోబెట్టి కడుపునిండా అన్నం పెట్టింది. అప్పుడొచ్చాడు పరమశివుడు. ‘‘ఎంత తప్పు చేసావు, కాశీని శపించడమా! వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే గానీ, భోగం కోరేవారు రాకూడదు. కాశీని వదిలి పెట్టి వెళ్ళిపో..’’ అన్నాడు. ఆతిథ్యమంటే అంత తప్పుచేసిన అతిథినికూడా కాశీ పట్టణంనుంచి పంపేముందు మధ్యాహ్నం అన్నం పెట్టి మరీ పంపించింది అన్నపూర్ణ. అదీ ఈ దేశం గొప్పతనం. ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడం గృహస్థు ధర్మం. ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలన్నది మనకు మన పెద్దలు నేర్పారు. సనాతన ధర్మం కేవలం మనం ఎలా బతకాలో నేర్పలేదు. నలుగురికోసం ఎంత ఉత్తమంగా బతికి, ఎంత ఉన్నతంగా ఎదగాలో నేర్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ముందుగా మనం పూర్తిగా జీర్ణించుకుని, మనసా వాచా కర్మణా అనుసరిస్తూ, మన పిల్లలకు ఆదర్శంగా నిలిస్తే– ఈ ధర్మాన్ని వారు మరో పదికాలాలపాటు పరిరక్షించగలుగుతారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తప్పుచేసినా అతిథి అతిథే!
రామాయణం యుద్ధకాండలో...రావణ సంహారం అయింది. శుభవార్త చెప్పడానికి వెళ్ళిన హనుమ సీతమ్మతో..‘‘.....అమ్మా ! ఆనాడు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎంత బాధపెట్టారో గుర్తుందా అమ్మా...అనుజ్ఞ ఇయ్యి. వీరందరినీ పిడికిలిపోట్లతో చంపేస్తానమ్మా..’’అన్నాడు. దానికి ఆమె అందికదా...‘‘నీ ప్రభువు చెప్పింది నీవు చేసావు, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేసారు. వాళ్ళనెందుకు చంపడం? మరొక్కమాట విను.. ‘‘వెనకటికి ఓ వేటగాడు అరణ్యంలోకి వెళ్ళాడు. పెద్దపులి తరిమింది. భయంతో పరుగెత్తుతూ దారిలో ఓ చెట్టు కనిపిస్తే పెద్దపులి ఎక్కలేదుకదా అనుకుని అది ఎక్కేసాడు. తీరా పైకి వెళ్ళి చూసే సరికి అక్కడ ఓ భల్లూకం(ఎలుగుబంటి)ఉంది. దానిని చూసి వణికిపోతుంటే అది అంది కదా..‘‘తెలిసో తెలియకో ప్రాణభయంతో పరుగెత్తుకొచ్చి నేనున్న చెట్టెక్కావు. కాబట్టి నీవు నాకు అతిథివి. నిన్ను కాపాడడం నా కర్తవ్యం. నువ్వలాకూర్చో’’ అంది. వేటగాడు సేదదీరుతుంటే కింద ఉన్న పెద్దపులి –‘‘వాడు మనుష్యుడు. పైగా వేటగాడు. బాణం వేసి కొడతాడు. ఇప్పుడు మనకు చిక్కాడు. మనం ఇద్దరం జంతువులం. వాడిని కిందకు తోసెయ్. నేను తిని వెళ్ళిపోతాను. నీజోలికి రాను’’ అంది. దానికి భల్లూకం బదులిస్తూ–‘‘తెలిసో తెలియకో నేనున్న చెట్టుదగ్గరికి ప్రాణ భయంతో వచ్చాడు కనుక అతను నాకు అతిథి. నేను రక్షణ కల్పిస్తాను తప్ప కిందకు తోసి వేయను’’ అని అంది. కాసేపయిన తరువాత భల్లూకానికి నిద్ర వచ్చింది. నిద్ర పోతోంది. పెద్దపులి అంది కదా – ‘‘అది భల్లూకం. నిద్రలేస్తే దానికి ఆకలివేస్తుంది. అప్పుడిక వెనకాముందూ చూడదు. నిన్ను చంపేస్తుంది. నా మాట విను. దానిని కిందకు తోసెయ్. నేను దానిని తిని వెళ్ళిపోతాను. అదెలాగూ చచ్చిపోతుంది, నేనూ ఉండను కాబట్టి నువ్వు నిశ్చింతగా చెట్టుదిగి వెళ్ళిపో..’’ అంది. మనుష్యుడు భల్లూకాన్ని కిందకు తోసేశాడు. అది కిందకు పడిపోయే సమయంలో అలవాటు ప్రకారం కింద కొమ్మల్లో ఒక కొమ్మను పట్టుకుని మళ్ళీ పైకి ఎగబ్రాకింది. వెళ్ళి మనుషుడి పక్కన కూర్చుంది. పెద్దపులి వెంటనే – ‘‘చూసావా మనుష్యుడి కౄరప్రవృత్తి. నువ్వు నిద్రపోతుంటే నిన్ను తోసేయబోయాడు. అదృష్టం బాగుండబట్టి కొద్దిలో తప్పించుకున్నావు. ఇప్పటికయినా నా మాట విను. మనుష్యుణ్ణి తోసెయ్. నేను నిన్ను వదిలేస్తా. మనుష్యుడిని తినేస్తా.’’ అంది. వేటగాడు వణికిపోతున్నాడు... ఇంతలో భల్లూకం అంది కదా..‘‘వాడు కృతఘ్నుడే కావచ్చు. తప్పే చేయవచ్చు. కానీ నా ఇంటికి వచ్చి ఉన్నంతసేపు నా అతిథి. వాడిని తోసేయలేను.’’ అంది. ‘‘హనుమా! నోరులేని ఒక కౄరజంతువు తన దగ్గరకు వచ్చిన వాడిని, పైగా తప్పు చేసిన వాడిని కాపాడింది. మనుష్య స్త్రీగా ప్రవర్తిస్తున్న దానిని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, ధర్మం తెలిసున్న దాన్ని. నన్ను బాధపెట్టారన్న కారణంతో రాక్షస స్త్రీలను నీకు అప్పచెప్పనా? వాళ్ళు నా అతిథుల్లాంటి వాళ్ళు. కాపాడతా’’ అంది. అతిథి ప్రాముఖ్యతను వెల్లడిస్తూ రామాయణం మనకు అమూల్యమైన చాలా సందేశాల నిచ్చింది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆ పావురంపాటి చేయనా..!
భాగవతంలో రంతిదేవోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. రంతిదేవుడు చక్రవర్తి. మహాదానశీలి. ఎవరు ఎదురుగుండా వచ్చినా విష్ణుస్వరూపాన్నే చూస్తాడు. అందరికీ అన్నీ దానం చేసేశాడు. 48రోజులపాటు అన్నం నీళ్లులేవు. తన కుటుంబంతో అలా ఉండిపోయాడు. ఎవరో మధురమైన అన్నాన్ని, మంచినీళ్ళను తెచ్చిచ్చారు. అవి తీసుకోబోతుండగా... ఓ బ్రాహ్మణుడొచ్చి...‘అయ్యా! ఆకలితో ఉన్నా’.. అంటే అన్నం పెట్టాడు. మరొకడు వచ్చాడు.. నాలుగో వర్ణం.. ఆదరణతో మిగిలిన అన్నమంతా పెట్టేసాడు. రాగద్వేషాలేమీ ఉండవు. ఎవరొచ్చినా ఆయనకు విష్ణువే వచ్చినట్లుంటుంది. ఇక మంచినీళ్ళొక్కటే మిగిలాయి. నోట్లో పోసుకోబోతుండగా... కుక్కల గుంపుతో ఒక ఛండాలుడొచ్చాడు. ‘అయ్యా! ప్రాణాలు నిలబడడం లేదు. కాసిని మంచినీళ్ళివ్వండి’ అని అడిగాడు. ‘‘ఈ నీళ్ళయినా నన్ను తాగనివ్వవా?’’ అని ఆయన అనలేదు. పైగా ‘అన్నా! ఆకలితో ఉన్నట్టున్నావు. నా దగ్గర అన్నం లేదు. కానీ తియ్యటి నీళ్ళున్నాయి. ఆపద వచ్చినప్పుడు తనదగ్గర ఉన్నదానితో ఆకలి తీర్చడం ఎంత గొప్పదన్నా. ఈ నీళ్ళు తాగు’ అని తన దగ్గరున్న ఆ కొద్దినీళ్ళు ఇచ్చేసాడు. త్రిమూర్తులు ప్రత్యక్షమై ‘‘నిన్ను పరీక్షించడానికే ఇదంతా’’ అని ఏదయినా కోరుకొమ్మన్నారు. పెట్టడం తప్ప మరేదీ తెలియని ఆయన నాకిది కావాలని ఏదీ అడగలేదు. కానీ వారు దీవెనలతో ఎంత బలం ఇచ్చారంటే... కేవలం ఆయన పక్కన కూర్చుంటే చాలు, ఎవరికయినా యోగం వచ్చేస్తుంది. అతిథి పూజ చేసి ఆ స్థితికి వెళ్ళిపోయాడు రంతిదేవుడు. తరువాత బ్రహ్మంలో ఐక్యమై పోయాడు. ఇక శ్రీరామాయణం... యుద్ధకాండలో విభీషణుడొచ్చి శరణువేడితే అందరూ వద్దంటున్నా..రాముడు శరణు ఇస్తూ దానికి ముందు ఇలా అన్నాడు...‘‘వాడు శత్రువే కానీ, మిత్రుడే కానీ –రామా ! నేను నీ వాడను– అని నన్ను శరణువేడితే రక్షిస్తా. పురుషులే కానక్కరలేదు, ఎవరయినా....అది నా ప్రతిజ్ఞ. అంటూ...ఇంకా ఇలా చెప్పాడు..’’ ‘‘ఓ చెట్టుమీద ఓపావురాల జంట పిల్లలతో ఉండడాన్ని చూసిన వేటగాడు ముందు పిల్లల్ని నేలకూల్చాడు. పిల్లలకోసం అలమటిస్తూ ఆడపావురం తిరుగుతూంటే దాన్ని కొట్టి పడేసాడు. మగపావురం కళ్లముందే ఆడపావురం రెక్కలు తెంపేసి, ఈకలు తీసి, దాని మాంసాన్ని కాల్చుకు తిన్నాడు. మగపావురం కన్నీరు పెట్టడం తప్ప ఏం చేయలేకపోయింది. కొన్నాళ్ళయిన తరువాత అదే వేటగాడు ఒకరోజు జోరుగా వాన కురుస్తుంటే అరణ్యంలో ఒక్క మృగం కూడా దొరక్క ఆకలితో నకనకలాడుతూ తిరిగి తిరిగి వచ్చి అదే చెట్టుకింద నిస్సత్తువతో చేరగిలబడ్డాడు. అయ్యయ్యో, నా గూడున్న చెట్టుకింద ఆకలితో వచ్చి కూర్చున్నవాడు నాకు అతిథి అవుతాడు. అని ఎండుపుల్లలు తెచ్చి అక్కడ నెగట్లో వేసి చలికి వణుకుతున్న అతనికి సేదదీర్చింది. ఇతని ఆకలి తీర్చగలిగే తిండి నేను తీసుకురాలేను. అందువల్ల నేనే అతనికి ఆహారమవుతానని ఆ అగ్నిహోత్రంలోకి దూకేసింది. తన భార్యను, తన బిడ్డల్ని చంపినవాడు కూడా అతిథిగా వచ్చేటప్పటికి ఒక పక్షి తాను పడిపోయి ఆహారమయి ఈ ఉపకారం చేసింది. మనుష్యుడిగా ఉండి, గృహస్థుడిగా ఉండి నా దగ్గరకొచ్చి నిలబడి రక్షించమని అడిగితే...పావురం పాటి సాయం చేయనక్కరలేదా ...??? కాబట్టి నేను రక్షిస్తా. విభీషణుడిని స్వీకరిస్తున్నా’’ అని పలికిన రామచంద్ర ప్రభువు అతిథిపూజ అంటే ఏమిటో నేర్పాడు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు