సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘ఫ్యూడల్ విధానాలను ప్రచారం చేసే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలనే నేర్పుంచేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచన చేయండి..’ అని సీఎం చంద్రబాబుకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన వర్చువల్‌గా సభ నిర్వహించారు. 72 మంది విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు.
సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగ విలువలు ప్రచారం చేయాలి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదిగా ఉండే విలువలు ఆధునిక జీవితానికి అవసరం. మన భవిష్యత్ తరాన్ని పురాణయుగంలోకి మళ్లించడం మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో ప్రభుత్వం గుర్తించాలి. సంకుచిత కుల, మత, ప్రాంతీయ దృక్పథాలకతీతంగా భావితరం ఎదిగినప్పుడే మనం గొప్పగా చెప్పుకొంటున్న లక్ష్యాల్ని చేరుకోగలం. దీనికి తగినట్టుగా మన విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు పౌరాణిక నీతులు ఎంతవరకు పనికొస్తాయో ఆలోచించాలి..’ అని లేఖలో పేర్కొన్నారు.
చదవండి: ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్
సంతకాలు చేసినవారిలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా, అఖిల భారత లాయర్ల సంఘం అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు గడ్డం కోటేశ్వరరావు, ప్రజాశక్తి సంపాదకుడు శర్మ, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకుడు బుడ్డిగ జమిందార్, మ్యూజిక్ అకాడమీ అవార్డు గ్రహీత ద్వారం దుర్గాప్రసాదరావు, విద్యావేత్తలు ప్రొఫెసర్ అంజయ్య, రమేష్ పట్నాయక్ తదితరులు ఉన్నారు.
చదవండి: రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలొద్దు.. ఏపీ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment