pravachanalu
-
'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు!
తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం: రామకథ యథార్థ తత్త్వాన్ని తెలియచెప్పడమే లక్ష్యంగా తాను రామాయణాన్ని ప్రవచిస్తున్నానని, కాలక్షేపం కోసం కాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో రుషిపీఠం మండల దీక్షగా శ్రీరామ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ సారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించి, రామభక్తులను పులకింపచేస్తున్నారు. జనవరి 23వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ ప్రవచన మహాయజ్ఞం సాగనుంది. సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన గోదావరీ తీరం రామకథా ప్రవచన, స్మరణాలతో మారు మోగుతోంది. ‘రాజ’మహేంద్రి ‘రామ’మహేంద్రిగా మారింది! ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో సామవేదం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరకాండ అవాల్మీకం కాదు.. లోకంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి విరచితం కాదనే మాట గట్టిగానే వినపడుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో ఫలశృతి చెప్పాక, తదనంతరం కథ ఉండదని వీరి వాదన. బాలకాండలో మహర్షి స్వయంగా చెప్పారు, షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్లు....‘తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి’....బాలకాండలో స్పష్టంగా చెప్పారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఉత్తరకాండలోని శ్లోకాలు కలుపుకుంటేనే ఈ సంఖ్య వస్తుంది. పురాణాదులలో అవతార పురుషుల ఆవిర్భావం చెప్పినట్లు, అవతార పరిసమాప్తి కూడా చెప్పడం సంప్రదాయం. రామావతార పరిసమాప్తి ఉత్తరకాండలో చూస్తాం. రామాయణంలోని కొన్ని సందేహాలకు మనకు ఉత్తరకాండలో సమాధానాలు కనపడతాయి–ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడిని చూసిన రావణుడు వచ్చినవాడు నందీశ్వరుడా అని అనుమానపడతాడు. రావణ, నందీశ్వరుల నడుమ జరిగినది మనకు ఉత్తరకాండలోనే గోచరిస్తుంది. ఉత్తరం అనే మాటకు సమాధానం అని అర్థం చెప్పుకోవచ్చు. నేటికీ చెదరని రామాయణ ప్రాధాన్యం! ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు, దాడులు చేసినా రామాయణం ప్రాచుర్యం, ప్రాధాన్యం కోల్పోదు. త్రేతాయుగమైనా, కలియుగమైనా, ఏ యుగమైనా మానవధర్మం శాశ్వతమైనది. రాగద్వేషాలు, మానవ సంబంధాలు మారవు. మన స్వభావాలను తీర్చి దిద్దేది రామాయణం. ఈ భూమిపై చెట్లు, పర్వతాలు, నీరు ఉన్నంత కాలం రామాయణం ప్రచలితం కాక మానదు. ఇది బ్రహ్మవాక్కు. -
గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర..!
-
చాగంటి గురువాణి: పిలవకపోయినా వచ్చి తలకెక్కుతుంది..
‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు. ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం. వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..
లోకంలో ఒక బంధనం ఉన్నది. బంధం అంటే కట్టేయడం. ఒక తాడేసి కాళ్లూచేతులూ కట్టేసామనుకోండి. కదలలేం కదా! కాళ్ళువిరిగిపోయిన వాడో, నడవలేనివాడో ఎలా కూర్చుండిపోతారో అలా బంధనం పడిన వాడు కదలలేక ఒక చోటే ఉండిపోతాడు. కానీ లోకంలో మరో ఆశ్చర్యకర బంధనం కూడా ఉన్నది. ఏమిటది? ఆశానామ మనుష్యాణాం /కాచిదాశ్చర్య శృంఖలా/యయాబద్ధా ప్రధావన్తి/ముక్తాస్తిష్ఠ పంగువత్... అన్నది హితవాక్కు. ఆశ అనే బంధం, దానిచేత కట్టబడినవాడు పరుగులు తీస్తుంటాడు. కట్టినప్పుడు కదలికలు ఆగిపోవాలి కానీ, ఈ బంధం పడినప్పుడు పరుగులు తీస్తుంటాడు. కట్టు విప్పినప్పుడు స్వేచ్ఛగా పరుగెత్తాలి. కానీ ఆశాబంధాన్ని విప్పదీస్తే వాడు హాయిగా కూర్చుండిపోతాడు. పరమ ప్రశాంతంగా నిశ్చల చిత్తంతో ఉండిపోతాడు. ఇదొక విచిత్ర బంధం. ఆశకు అంతేమిటి! ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆరాటపడడం. లోకంలో సర్వం స్వంతమయినా, ఎంత గొప్పగా అన్నీ పొందినా... ఇంకా ఏదో కావాలని మరేదో పొందాలన్న కోరిక స్థిరంగా ఉండనీయదు. అందుకే ఆ పరుగులు. అయితే ఆశ లేకుండా ఉండడం సాధ్యం కాదు. మంచిదీ కాదు. ఒక స్థితిలో మనిషికి ఆశ ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, ఒకరి దగ్గర చేయి చాచకుండా బతకాలి, ధార్మికంగా బతకాలి, ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి... ఈ ఆశలన్నీ మనిషికి ఉండొచ్చు. అయితే ఆశ కలిగినప్పుడు చేయవలసినది. దాని పరిశీలన. దేన్ని పరిశీలించాలి.. అలా ఆశపడిన దానిని సాధించుకోవడానికి మనకున్న సమర్ధతను పరిశీలించకుండా ప్రతిదానికోసం ఆశపడడం, వెంపర్లాడడం, తన సమర్థత సరిపోక నిరాశా నిస్పృహలు పొందుతూ ఉండడం మంచిది కాదు. తన సమర్థతను పరిశీలించుకోవడానికి తనకన్నా యోగ్యుడు మరొకడుండడు. పరిశీలించడం రాకపోతే... మంట దగ్గరకు వెళ్ళి...నెయ్యి ఏదో, నీరేదో తెలుసుకోలేక ఒకదానికి బదులు మరొకటి వేస్తే భగ్గున మండుతుంటుంది. కాబట్టి ఆ విచక్షణ అవసరం. వివేకంతో కూడిన సమర్థత ఎంత ముఖ్యమో ప్రయత్నం కూడా అంతే ముఖ్యం. ఆశ ఉంది, సమర్థత ఉంది.. కానీ ప్రయత్నం లేకపోతే వృథా. తాను ఒక స్థితికి చేరిపోయిన తరువాత తాను ప్రశాంతంగా ఉండాలి. దానిని రాగద్వేషాలు పాడు చేస్తాయి. రాగము అంటే.. కోరిక, అది తీరకపోతే అశాంతి. తీరినా అశాంతే. ఎందుకంటే మళ్ళీమళ్ళీ కావాలని పెట్టే పరుగుల వల్ల. రాగద్వేషాలు లేనివాడిలో కదలికలుండవు, పరుగులుండవు, ఒక వయసులో, ఒక స్థితిలో, వృద్ధాప్యంలో.. అంటే జీవన పరిపూర్ణత్వానికి ఈ రెండోకోణం పరిశీలన అవసరం. ఈ స్థితికి రావాలంటే.. పట్టువిడుపులు తెలియాలి. ఇది తెలిస్తే, అలవాటయితే ఎప్పుడు ఏది పొందాలో అది పొందుతారు. పూవు కావాలనుకుంటే పూవు అవుతారు, పిందె కావాలనుకుంటే పిందెవుతారు. కాయవుతారు, పండవుతారు, బాగా పండిపోయి రంగు మారి చెట్టునుండి వదిలిపెట్టేస్తారు. వారంతటవారుగా విడిపోతారు. కాబట్టి మనందరం ఎప్పుడు పరుగెత్తాలో అప్పుడు పరిగెత్తాలి. దాన్ని విశ్లేషించుకొంటూ, ప్రయత్నించుకొంటూ, సాధించి తృప్తి, భోగం, కీర్తి పొంది ఒకానొక వయసు వచ్చిన తరువాత పరిణతి చేత శాంతిని పొంది ఆశాపాశాలనుండి విముక్తిని పొంది జీవనసాఫల్యాన్ని పొందాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఆ సిద్ధాంతాల అవసరం ఇప్పుడే ఎక్కువ!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగబోవడం... రాష్ట్ర, దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రపంచ మేధావులను, ఆధ్యాత్మికవేత్తలను, పండితులను ఆలోచింపచేస్తుంది. పరంపరాగతమైన భారతీయ తాత్విక చింతన గురించి మరొకసారి విశ్లేషణలు వెల్లివిరుస్తాయి. ఈ మధ్యన జీయర్‌స్వామి రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. రామానుజాచార్యుల బోధనల అవసరం వేయి సంవత్సరాల క్రితం సమాజానికి ఎంత ఉండిందో... ఈ కాలానికి అంతకన్నా ఎక్కువ అవసరమైన పరిస్థితి ఏర్పడ్డది. వారు సశాస్త్రీయంగా బోధించిన సామాజిక సమరసా సిద్ధాంతం అన్ని వర్గాల, మతాలకు చెందిన వారికి శిరోధార్యం. ఆనాడు వారు తీసుకున్న భక్తి గమనము, ఎంతోమంది సాధు సంతులను, ప్రజలను, ముఖ్యంగా రామానంద ద్వారా కబీర్ దాస్‌లాంటి వాళ్లను ప్రభావితం చేసి దేశ సమగ్రతకు, సమైక్యతకు తోడ్పడ్డాయి. ఈ సంప్రదాయానికే చిన జీయర్‌స్వామి కొంత సుగం ధాన్ని, మరికొంత సువర్ణాన్ని పూసి సరళమైన భాషలో, స్పష్టమైన భావాలతో చేసిన ప్రసంగాలతో లక్షలమందిని ఆకర్షించారు. ‘‘నీ తల్లిని ప్రేమించు, ఇతరుల తల్లులను గౌరవించు’’ అన్న చిన్న పదాలు– వర్గాలను, కులాలను, మతాలను కలిపి స్వామీజీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు బాట వేసి వేలమందికి విద్య, ఉపాధి పొందే అవకాశాలను కల్పిస్తున్నాయి. మరొకవైపు స్వామి భక్తి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ, సాంస్కృతిక జీవనంలో ఒక కొత్త దనాన్ని తెచ్చాయి. ఈ మధ్యన నిర్వహించిన ఒక సర్వేలో 27 శాతం భారతీయులు – హిందువులలో అత్యధి కంగా 30 శాతం, సిక్కులలో 23 శాతం, ముస్లింలలో 18 శాతం మంది అంటరానితనాన్ని పాటిస్తున్నారని ఎన్సీఏఈఆర్ నివేదికలో చెప్పారు. వివిధ నివేదికలను పూర్తిగా లెక్కలోకి తీసుకోలేకున్నా... అంటరానితనం ఇంకా ఉన్నదనేది నిర్వివాదం. ఆది శంకరుడు, రామానుజుడు, బసవేశ్వరుడు, వివేకా నందుడు, నారాయణగురు, బ్రహ్మనాయుడు లాంటి వారెం దరో మన మనస్సులలో సుప్రతిష్ఠితులు. వీరందరూ కులాల, మతాల వివక్షలను నిర్ద్వంద్వంగా ఖండించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఒకవైపు రాజ్యాంగం నిర్దేశించినా... పరువు హత్యలు సమాజానికి సవాలుగా మారాయి. ఈ మధ్యన సుప్రీం కోర్టు ఈ కులరక్కసిని అంతమొందించటానికి ఆదేశాలు జారీ చేసి, వాటి అమలుకు కార్యాచరణను రూపొందించింది. రాజస్థాన్ ప్రభుత్వమైతే మరణ శిక్షను విధిస్తూ చట్టం చేసింది. కానీ కొందరు మతాంతర వివాహమే మరణ శాసనమని భావిస్తూ బ్రతుకుతున్నారు, మరికొందరు మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘హిందూ’ అన్నపదం, ఇటు రాజకీయాలలో, చట్టసభలల్లో, సమాజంలో కేంద్ర బిందువుగా మారుతున్నది. హిందూ అన్న పదం సాంస్కృ తిక భావన అని దాదాపు అన్ని వర్గాలు ఆలోచించే శుభ పరిణామాన్ని చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్, సాంస్కృతిక జాతీయవాదానికి అనుగుణంగానే 1956లో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూ సమాజంలో అమానవీయంగా విలయతాండవం చేసిన అస్పృశ్యత వంటి రుగ్మత లకు నిరసనగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మతాలకు మారవలసిందిగా ఎందరో ఆయనను ప్రలోభ పెట్టారు. అయితే ఈ మతాలకు మారడం అంటే భారతదేశ సంస్కృతి నుండి దూరం కావడమే అనే అద్భుత ప్రకటన చేశారు. దీనికి యావత్ భారతదేశం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిందే. వివేకానందుడు 1898 జూన్ 10 నాడు తన మిత్రుడు మహమ్మద్ సర్ఫరాజ్ హుసేన్‌కు రాసిన లేఖను డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఎంతో విశ్లేషణాత్మకమైన ఉత్తరంలో మన మాతృభూమికి హిందూ, ముస్లిం అనే రెండు గొప్ప మతాల కూడలిలో... వేదాంతం బుద్ధి అయితే, ఇస్లాం శరీరం అని రాశారు. దీన్ని అర్థం చేసుకొని హిందువులు, ముస్లిములు ఐక్యంగా ఉండి మళ్ళీ ఈ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును రాబోయే తరాలకు అందించాలని కోరారు. 1995 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పులో హిందూ అన్న పదానికి సంబంధించిన అయోమయాన్ని తొలగించి స్పష్టమైన తీర్పునిచ్చింది. హిందూ, హిందుత్వ, హిందూయిజం అన్న పదాలకు నిర్దిష్టమయిన అర్థాన్ని చెప్పలేమని, అయితే ఆ పదం నుంచి భారతీయ సంస్కృతీ పరంపరను, వారసత్వ సంపదను వేరుచేసి సంకుచిత మతానికి పరిమితం చేయలేమని, అది ప్రజల జీవన విధానమని స్పష్టం చేసింది. హైదరాబాదులో ఒక సమావేశంలో సాంస్కృతిక జీవన విధానాన్ని సమర్థిస్తూ ఆర్చ్ బిషప్ ఎస్. అరుళప్ప ‘జన్మతః నేను భారతీయుడిని. సంస్కృతిపరంగా నేను హిందువును. విశ్వాసం రీత్యా క్రైస్తవుడిని’ అని హర్షధ్వానాల మధ్యన ప్రకటించారు. స్వామి వివేకానందునికి ఇష్టమైన సూక్తి – ‘‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’’. యువత వేగవంతంగా ముందుకు తీసుకుపోవలసిన స్పూర్తిని రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ ఇస్తుందని ఆశిద్దాం. - సీహెచ్ విద్యాసాగర రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
తోడబుట్టినవారే తొలి బంధువులు
కిష్కింధకాండలో తార చేసిన ప్రసంగం చదువుతుంటే, తార మాట్లాడిన మాటలు వింటూంటే... అన్నదమ్ములన్న వాళ్ళు ఎలా బతకాలో, ఎంత ప్రేమగా ఉండాలో తెలుస్తుంది. సుగ్రీవుడొచ్చి పెద్ద అట్టహాసం చేసాడు. వాలి యుద్ధానికి వెళ్ళాడు. ఒంటినిండా దెబ్బలతో నెత్తురు కారుతుండగా సుగ్రీవుడు తిరిగి వెళ్ళిపోయాడు. ‘‘రామా ! నిన్ను నమ్ముకుని వెళ్ళాను. వాలిని సంహరిస్తానన్నావు. నెత్తురోడుతూ వెనక్కొచ్చా. ఎందుకెయ్యలేదు బాణం?’’ అనడిగాడు. మీరిద్దరూ ఒకేలాగా కనిపించారు. పొరపాటు జరుగుతుందని జంకా. గుర్తుకి నీమెడలో తామరమాలతో వెళ్ళు’’ అని గజ పుష్పమాలవేసి పంపాడు. సుగ్రీవుడు మళ్ళీ వెళ్ళి ‘‘అన్నయ్యా! బయటికి రా యుద్దానికి..’’ అని సింహనాదం చేసాడు. వాలి బయటకు వెళ్ళబోతున్నాడు. తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి..‘‘ఒక్కమాట చెబుతాను... సావధానంగా విను’’ అన్నది. ‘‘ఎవరి మీద యుద్ధానికి వెడుతున్నావు. నీ తమ్ముడి మీదనే కదా. ఎవరు నీ తమ్ముడు? ఒక్క తల్లికి, ఒక్క తండ్రికి... ఒక చెట్టుకు పూసిన పూలలాంటి వారు, రెండు కాయల లాంటి వారు మీరిద్దరు. ఎడమ చేయి, కుడిచేయి వేరవ్వచ్చు. కానీ అవి ఒకే దేహానివి. ఇవి రెండూ ఎప్పుడూ కొట్టుకోవు. ఒక చేతికి నొప్పెడితే దాని పని కూడా రెండో చెయ్యి చేస్తుంది. ఒకవేళ నీ తమ్ముడు తప్పుచేసాడే అనుకో. దానికంతగా నెత్తురు కారేటట్లు కొట్టాలా? ఇద్దరూ వీథికెక్కి గదాయుద్ధం చేసుకోవాలా? ఇద్దరూ శక్తిమంతులే కదా. ఒక్కటై నిలబడితే మిమ్మల్ని నిలువరించేవారున్నారా? మీ ఐక్యతను చూసి లోకం ఎంత సంతోషిస్తుంది ?’’ ‘‘ఎందుకయ్యా తమ్ముడితో యుద్ధం చేస్తావు! వానరుడేగా. పైగా తమ్ముడు. తెలిసీ తెలియని వాడు. చిన్నవాడు. తమ్ముడంటే కొడుకులాంటివాడు. తప్పుచేసినట్లు అనిపిస్తే..మందలించు. అయినా వాడే దూరంగా జరిగిపోయాడనుకో. వాడి ఖర్మ. కానీ నీ దగ్గరకొచ్చాడుగా. కొట్టకు. అనునయించు.’’ ‘‘పైగా మరొక్కమాట. నీ చేతిలో చావుదెబ్బలు తిన్నాడా.. అంత నెత్తురు కక్కాడా.. మళ్ళీ వెంటనే వచ్చి సింహనాదం చేస్తున్నాడంటే ఏదో కారణం లేకుండా ఎందుకొచ్చాడు... ఏదో బలం చూసుకోకుండా ఎందుకొచ్చాడు.. నా మాట విను ఏదో ఉంది. నీకు తెలియదు. తొందరపడొద్దు. మీ ఇద్దరి జగడంవల్ల ఆఖరికి ఇద్దరిలో ఒకరే మిగిలిపోతే, మిగిలిన వారు ఎంత ఏడ్చినా రెండవ వారు రారుగా... అలా ఒకర్నొకరు కొట్టుకుని చచ్చిపోకూడదు. తప్పు. తమ్మణ్ణి లాలించు. లోపలికి పిలువు. పిలిచి–‘ఇప్పుడే కొట్టాను. బుద్ధి రాలేదా...మళ్ళీ యుద్దానికి ఎందుకొచ్చావు’ అని అడుగు. నేను వదిననేగా. నాకు బిడ్డడు లాంటివాడే కదా. నచ్చచెప్పడానికి నాకూ అధికారముందిగా... లోకంలో అందరికన్నా బంధువన్నవాడు ఎవరో తెలుసా? తోడబుట్టినవాడే బంధువు. ఎందుకయ్యా తమ్ముడి మెడలు విరిచేస్తానంటావు. లోపలికి పిలువు.. చక్కగా మాట్లాడుకోండి.’’ ‘‘గూఢచారులను పంపి తెలుసుకున్నా. మీ తమ్ముడు రామచంద్రమూర్తితో ఒప్పందం చేసుకున్నాడు. రాముడు అరివీర భయంకరుడు. ఆశ్రయించినవాడిని కాపాడతానని రాముడు కూడా ప్రతిజ్ఞ చేసాడు. తొందరపడి యుద్ధానికి వెళ్ళకు. మీరిద్దరూ పగలు పెంచుకుని ఒకర్ని ఒకరు చంపుకుంటే అక్కరలేని ప్రమాదం వస్తుంది. నాథా! నా మాట విను. తమ్ముడిని పిలువు’’ అంది. తార మాటను తోసిరాజని వెళ్ళిపోయాడు వాలి. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తరువాత ఏడ్చి ఉపయోగమేమిటి!
55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో. అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్దిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా... నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ? రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే... విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు...‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడీ? అన్నయ్యా! చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? చంపించేసాను.’’ అని తలచుకుని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ‘‘నా అన్న వాలి. ఎదుటివారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను... అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి’’ అని వేదనా భరితుడయినాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళదికాదు. అలా బతకగలిగారంటే.. వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి... బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. ‘‘మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు... అంటే మీ నాన్న దశరథ మహారాజుగారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది.. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?’’ అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా! అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు.. అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్తకన్నా నాకేం కావాలి ?’’ అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు పదిమంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మృగాలుగా మారుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ మధ్య మనసుకు చాలా బాధ కలిగించే అంశాలు చూస్తున్నాం. మానవ ప్రవృత్తి మరిచి కొందరు మృగాలుగా మారుతున్నారు. ప్రవచనాలు సద్గుణాలు, భక్తిభావాన్ని పెంపొందిస్తాయి’అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావు భాగవత సప్తాహం ప్రవచనాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘భగవంతుని గురించి చెప్పేవాళ్లు, వినేవాళ్లు చాలా మంది ఉంటారు. భగవంతుని గురించి చదివినా, విన్నా, చెప్పినా పుణ్యం వస్తుందని అందరి విశ్వాసం. మాకు కోరికలు ఉన్నా కొన్ని నెరవేరవు. అందుకే మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని వచ్చా. నేను దైవాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోను. ఎవరికీ భయపడను. పూర్తిగా భక్తి ప్రపత్తితో చేసే పనులు సమాజానికి, లోక కల్యాణానికి ఉపయోగపడతాయి’అని కేసీఆర్ అన్నారు. అన్నపూర్ణ వంటి డొక్కా సీతమ్మ లాంటి ఉదాత్తమైన లక్షణం కొందరికైనా అలవడాలని ఆకాంక్షించారు. కలడు కలడందురు అన్ని దిశల, సిరికింజెప్పడు.. వంటి పద్యాలను చదువుతూ గజేంద్రమోక్షం, ద్రౌపదీ వస్త్రాపహ రణం వంటి ఘట్టాలను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర్రావు మానవ జాతికి దొరికిన మణిపూసగా సీఎం అభివర్ణించారు. -
ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయం
గాంధారికి బహుసంతానవతి అని వరముంది. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మపక్షపాతియై ధర్మం విషయంలో ఎక్కడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగిన స్థితిని పొందింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వచనం చేయమన్నాడు. ఆమె మాత్రం నిర్మొహమాటంగా..‘‘ ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా...’’అంది. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు. అందునా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే....ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది..‘‘అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే... నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక.. కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక’’ అని శపించింది. దానికి కృష్ణుడు నవ్వి ‘‘అమ్మా! ధర్మానికి వంతపాడినందుకు నాకు నువ్విచ్చే కానుకా ఇది..!!!’’ అన్నాడు. ఆ మాటతో ఇంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది. ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడూ కూడా బతకలేదు కదా... ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా.. అని వ్యాకులత చెంది కుంతిబిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ, భీముడనే మాటలు వినలేక ధతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచి పెట్టేసింది. అలాగే కుంతీదేవి. ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు. కాబట్టి కుంతీదేవి అయింది. భారతం చదివితే ఆమెలో ఎన్ని ఉత్థానపతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు... ఆశ్చర్యమేస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు ఒకమాటన్నారు– ‘‘అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి’’ – అన్నారు. -
లక్ష తేళ్ళు కుడుతున్న ఆ బాధలో..
‘నా చేయి పట్టుకున్నందుకు, నా మెడలో మంగళ సూత్రం కట్టినందుకు ఆయనకు నేను ఇచ్చుకోదగిన మహత్తర బహుమానం, భరోసా ఏమిటి?’ అంటే... ఆమె తన భర్తకి కొడుకుని కని ఇవ్వడమేనట. ఎందుకలా...!!! తాను వృద్ధాప్యాన్ని పొందితే, ఆ కొడుకు తన భుజం మీద చెయ్యివేసుకుని ఆసరాగా నడిపించుకుంటూ ఆ సభలో తనను తీసుకు వెడుతుంటే....అక్కడ తనకే పౌర సన్మానం జరిగినంతగా తండ్రి సంతోషపడిపోతాడట. తన కొడుకు పెద్దవాడవుతుంటే చూస్తూ సంతోషపడిపోతాడట. అన్నిటికన్నా విశేషం... ఆయన అన్నిటికన్నా గొప్పవాడు. ఆయనకు సత్కారం చేయదలిచి ఏదిచ్చినా తక్కువే.. అంత గొప్పవాడు. అసలు ఆయనకు కోరిక ఉంటే కదా..సంతోషిస్తాడనడానికి. మరటువంటి ఆయనను సంతోషపెట్టడమెలా, ఆయనకు సత్కారం ఎలా ? అది లోకంలో ఒక్కటే ఉంది. అది ఆయన కొడుకు చేతిలో ఓడిపోవడమే. ‘పుత్రాదిచ్చేత్ పరాజయం...’ ఒక మహా విద్వాంసుడున్నాడు. ఆయన సభలో వచ్చి మాట్లాడుతుంటే ఆయనను కాదని నిలబడగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. శాస్త్రంలో అంత నిష్ఠ గలిగిన వాడు. గండపెండేరాలో, స్వర్ణ కంకణాలో, దుశ్శాలువలో, పంచెలచాపులో, సన్మాన పత్రాలో, బిరుదులో... ఇవేవీ ఆయనను సంతృప్తిపరచలేవు. ఆయన వాటి స్థాయిని ఎప్పుడో దాటేసాడు. మరి ఆయనను సంతృప్తి పరచగలిగిన సత్కారం ఏది ? ఆయన కడుపున పుట్టిన కొడుకు కూడా విద్వాంసుడై ఒకనాడు తండ్రి ప్రతిపాదించిన సిద్ధాంతం వంక చూసి‘నాన్నగారూ, ఏమీ అనుకోకండి మీరు ప్రతిపాదించిన సిద్ధాంతంలో కించిత్ దోషం కనబడుతున్నది... అలాకాక ఇలా చెబితే దానికి పూర్ణత్వం వస్తుంది కదా...’ అన్నప్పుడు ఆ తండ్రి ఆనందబాష్పాలు రాలుస్తాడట. ‘అబ్బ! నన్ను ఓడించే సామర్ధ్యం గల కొడుకు పుట్టాడు. నేను ఓడిపోయాను’ అని సంతోషిస్తాడట. అటువంటి సత్కారం పొందాలంటే అటువంటి కొడుకు పుట్టాలి. సుబ్రహణ్యస్వామి ప్రణవానికి అర్థం చెప్పగా విని ‘వీడి చేత నేను సత్కారం పొందాను. వీడు నాకన్నా బాగా చెప్పాడు’ అని శంకరుడంతటి వాడు కొడుకు మాటలు విని, కొడుకు ప్రాజ్ఞత చూసి పొంగిపోయాడు. మరీ ముఖ్యంగా ప్రాణోత్క్రమణవేళలో లక్షతేళ్లు కుట్టిన బాధ కలుగుతుందట. కొడుకు తొడమీద తల పెట్టుకుని ఆ కొడుకు చెయ్యిపట్టుకుని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు అంత బాధనుంచి కూడా ఉపశమనం పొందుతాడట. కొడుకు ఒళ్ళో శరీరం వదలడం కాశీ పట్టణంలో శరీరం వదలడంతో సమానం అంటారు. ‘ఆత్మావైపుత్రనామాసి..’ అంటుంది శాస్త్రం. తన ఆత్మ బయట మరో రూపాన్ని పొంది తిరిగితే అదే కొడుకు. అలా ఇచ్చింది ఎవరు? తన భర్తకు అటువంటి అపురూప కానుకను ఇచ్చినందుకు వృద్ధాప్యంలో తన భర్తకు ఆసరా అవకాశం కల్పించినందుకు ఆ పిచ్చితల్లి పొంగిపోతుంది. ఆఖరున తండ్రి శరీరానికి ఆనంద హోమం చేసి గయా శ్రాద్ధం పెట్టి ఉన్నత గతులు కల్పించే పుత్రుడిని కని ఇచ్చింది. అటువంటి స్త్రీ కారణంగా పురుషుడు అభ్యున్నతిని పొందుతున్నాడు. శాస్త్రంలో పురుషునికన్నా స్త్రీ వైశిష్ట్యమే గొప్పది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పిలవకపోయినా వాళ్ల ఇళ్లకు వెళ్లాలి
కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమే కాదు. కామము అంటే కోర్కె. కామం ధర్మంతో ముడిపడింది. అందువల్ల ధర్మపత్ని అయింది. ఆమె వల్ల గొప్ప అర్థం వచ్చింది. సుఖాలకు సాధనాలని ‘అర్థము’ అంటారు. అంటే ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతురిని కన్యాదానం చేసాడు. పది తరాలు ముందు, పది తరాల వెనుక, తనది కూడా అయిన ఒక తరం కలిపి... మొత్తం 21 తరాలు తరించాయి. లోకంలో ఏ దానం చేసినా దాని మీద యాజమాన్య హక్కు దాతకు ఉండదు. తానిచ్చానన్న భావన ఆ తరువాత రాకూడదు. కానీ ఆడపిల్లను కన్యాదానం చేసేటప్పుడు ఇది వేరుగా ఉంటుంది. ఆడపిల్లమీద ధార్మిక హక్కు, ఆ కుటుంబంలో సభ్యత్వం.. పుట్టింటిలో ఆడపిల్లకు ఎప్పుడూ ఉంటాయి. ‘‘నాకు చూడాలని ఉందయ్యా, నా కుమార్తెను ఓ పది రోజులు తీసికెడతాను’’ అని అడిగే హక్కు కన్నతండ్రికి ఉన్నది. ‘వద్దు’ అనే అధికారం భర్తకు కానీ, అత్తమామలకు కానీ, మరెవ్వరికి కానీ లేదు. తండ్రికీ, తల్లికీ, తోబుట్టువులకూ ఆ అధికారం ఉంటుంది. ఇంకా చెప్పవలసి వస్తే... కూతురి పుట్టింట మంగళప్రదమైన ఒక కార్యక్రమం జరుగుతున్నది. అల్లుడిగారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఆహ్వానిస్తారు తప్ప పిలుపు లేకపోయినా సరే... కూతురు, అల్లుడు వెళ్ళవలసిందే. ఈ మాట నేను చెప్పడం లేదు, శాస్త్రం చెబుతున్నది. దక్షయజ్ఞం విషయంలో పార్వతీ దేవి శివుడితో అంటుంది...‘‘శంకరా ! నీకు తెలియని విషయమా! మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలకా...పిలవక పోయినా ఆడపిల్ల, అల్లుడు వెళ్ళాలి కదా! నీకు తెలియని ధర్మమా!!!’’ అంటూ కొన్ని సూక్ష్మాలు గుర్తు చేస్తుంది. కొందరి ఇళ్ళకు పిలవకపోయినా వెళ్ళాలి. జనకుడు(తండ్రి), జన నాయకుడు(రాజు), గురువు, మనసెరిగిన స్నేహితుడు. రాజుగారి ఇంట్లో శుభ కార్యం జరిగితే పిలుపు అక్కర్లేదు. వెళ్ళాలి. గురువుగారి ఇంట ఉత్సవం జరుగుతున్నది. పిలవకపోయినా వెళ్ళాలి. మంచి స్నేహితుడు, మనసెరిగిన వాడు... వారి ఇంట జరిగే శుభ కార్యానికి వెళ్ళాలి. పిలుపుతో పని లేదు... అని వివరిస్తూ ఈ విషయాలు నీకు తెలియనివి కాదు కదా శంకరా’’ అంటుంది. ఆడపిల్లను కన్యాదానం చేసినా ఆమె ఉత్తమమైన నడవడి చేత ఆమెను కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు. రెండు వంశాలు తరిస్తున్నాయి. అటువంటి వైభవం నిజానికి పురుషుడికి కట్టబెట్టలేదు. ఇంత పుణ్యాన్ని మూటకట్టిపెట్టి ఇవ్వగలిగినది, ఆప్యాయతకు రాశీభూతమైనది ఆడపిల్ల మాత్రమే. ఆమెను వివాహం చేసుకుని ఆమెయందు తన కామాన్ని ధర్మంతో ముడివేసి వర్తింపచేసాడు కనుక అర్ధాన్ని పొందుతున్నాడు. అంటే సమస్త సుఖాలకు కావలసిన సాధనాలను పొందుతున్నాడు. కూతురు పుట్టింది కన్యాదానం చేసాడు, 21 తరాలు తరించాయి. అలా తరించడానికి కారణం కేవలం ఆడపిల్ల పుట్టినందువల్లేనా ? ఆ ఆడపిల్ల ధర్మపత్ని అయి కొడుకుని కని ఇచ్చింది. అప్పుడు మనసుకు ఒక భరోసా. ఆ భరోసా మూడు రకాలుగా ఉంటుందంటున్నది శాస్త్రం.బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
డప్పు కొట్టి చెబుతా!
ఆడపిల్ల ఇది చేయకూడదు. అది చేయకూడదు. ఇలా ఉండకూడదు.. అలా ఉండకూడదు అనే హద్దులు ఈ నవీన సమాజంలోనూ ఇంకా సమసిపోలేదు. అలాంటిది ఓ ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పనవసరం లేదు. సవాలక్ష కట్టుబాట్లు, అనేకమైన ఆంక్షలు, అయినవాళ్లెవరూ ఆదుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని బతికించుకోవడం కోసం బుర్రకథ కళాకారిణిగా మారిందో అబల. పదకొండేళ్ల వయసులోనే బుర్రకథ ప్రవచనకర్తగా బతుకు పోరాటం మొదలుపెట్టి డప్పు వాయించడం తప్పనిసరి కావడంతో దానినీ నేర్చుకుని నాలుగొందల ప్రదర్శనలిచ్చిన ఆమె తనలాంటి ఎంతోమంది యువతులకు ఆదర్శం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని డప్పు వాయించి మరీ చెబుతా అంటున్న ఈ గౌరి కథ ఆమె మాటల్లోనే... నా పేరు కొట్యాడ గౌరి.. మాది లక్కవరపుకోట మండలం కొట్యాడ తలారి గ్రామం. నాకు 8 ఏళ్ళ వయస్సున్నప్పుడే అనారోగ్య కారణంగా నాన్న చనిపోయారు. అమ్మ, మేము ఇద్దరు అక్కచెల్లెళ్లం, ఒక తమ్ముడు ఉన్నాం. నేను రెండోదాన్ని. అమ్మకు వ్యవసాయపనులు ఏమీ రావు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. అక్క కూలీపనికి వెళ్లితెచ్చిన డబ్బులతోనే అందరం బతకాలి. అక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు నా భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఏడవ తరగతితో చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కాలం గడిపేవాళ్లం. ఆ సమయంలో ఓ పెద్దాయన బుర్రకథ చెప్పమని నన్ను ప్రోత్సహించాడు. ఇంటి పరిస్థితుల కారణంగా అమ్మ కూడా అదే మంచిదనుకుంది. అలా బుర్రకథ బృందంలో ప్రవేశించాను. జట్టేడివలస గ్రామానికి చెందిన కెళ్ల సింహాచలం అనే బుర్రకథ మాష్టారి వద్ద శిష్యరికం చేసి 1998లో వచనకర్తగా మారాను. గ్రామదేవతల పండుగలకు బుర్రకథ చెప్పడానికి వెళ్తుంటాను. అందులో రామాయణం వంటి కథలు చేశాను. డప్పు వాయిస్తూ బుర్రకథ చెబుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పరుస్తూ జీవనాన్ని సాగిస్తున్నాను. బుర్రకథ దళాన్ని తయారు చేసుకుని బాల్యవివాహాలు, పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి వాటిపై ప్రదర్శనలు ఇచ్చాము. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి హయాంలో కూడా నేను ఈ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పర్చాను. బుర్రకథ చెబుతున్నప్పుడు డప్పుకూడా వాయించాల్సి వచ్చేది.దీంతో డప్పు వాయిస్తూ, స్వయంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. ఇరవై ఏళ్లుగా మహారాష్ట్ర, తెలంగాణ, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను. మహిళా కళాకారులంటే అప్పట్లో చాలామందికి చిన్నచూపు ఉండేది. పొట్టకూటి కోసం ప్రవచనం చెప్పుకుంటున్న నన్ను చాలామంది హేళన చేసేవారు. వేధించేవారు. బంధువులైతే సూటిపోటీ మాటలతో శూలాల్లా గుచ్చేవారు. అయితే ‘ఎంత కష్టం వచ్చినా దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు, బంధువుల ఎత్తిపొడుపులు గుర్తుకు వచ్చేవి. అందుకే రోజు రోజుకూ నాలో కసి పెరిగింది. మంచిమార్గంలోనే ఉన్నతస్థాయికి ఎదగాలనుకున్నాను. భర్త ప్రోత్సాహం కూడా నాకు తోడయ్యింది. ఇప్పుడు నాకంటూ ప్రత్యేకంగా ఓ దళం ఉంది. నేను బతుకుతూ నాతోపాటు పదిమందిని బతికిస్తున్నాననే తృప్తి ఉంది. నిజానికి ఇప్పటికీ నా కష్టం పూర్తిగా తీరిపోలేదు. పండుగలు, జాతరలు లేనప్పుడు బుర్రకథ ప్రదర్శనలు ఉండవు. ఉన్నా దానివల్ల వచ్చే ఆదాయం కూడా ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు. అందుకే టిఫిన్ సెంటర్ లాంటిదొకటి పెట్టుకుందామని చూస్తున్నాను. రుణం కూడా మంజూరైంది. కానీ ఎందుకో ఆ సొమ్ము నా చేతికి ఇవ్వడానికి బ్యాంకువాళ్లకి మనసు రావడం లేదు. ఎప్పటికైనా వారి మనసు కరిగితే బుర్రకథ కళాకారిణిగా ఉంటూనే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాలని ఉంది. దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. – కొట్యాడ గౌరి – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
అట్లాంటాలో ముగిసిన షణ్మఖ శర్మ ప్రవచనాలు
అట్లాంటా: నగరంలో ఈ నెల 14వ తేదీ నుంచి హిందూ టెంపుల్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగిన ప్రవచనాల ప్రవాహంలో పాల్గొని భక్త జనం పులకరించారు. ఇందులో భాగంగా శివుని విలాసం-శక్తి వైభవంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్మఖ శర్మ ప్రవచించారు. ఉపనిషత్తుల సారం మొదలు శివపురాణం, శ్రీనాధ హరవిలాసం, పోతన భాగవతం, కాళిదాసు కుమార సంభవాలను సమన్వయపరుస్తూ అద్భుతంగా ఆవిష్కరించారు. మహాశివుడి లీల, లాస్యం, తత్వం, కరుణ, కారుణ్యాలను షణ్ముఖ శర్మ భక్తులకు విశదీకరించారు. రుద్రునిగా, వీర భద్రునిగా, సుందరేశునిగా, కామేశునిగా, పరమేశ్వరునిగా మహాశివుడి లీలను కళ్లకు కట్టినట్లు వివరించారు. షణ్ముఖ శర్మ ప్రవచనాలు భక్తుల సందేహాలను పటాపంచలు చేశాయి. ఈ కార్యక్రమానికి అట్లాంటా నుంచే కాకుండా.. కొలంబస్, అలబామా, చికాగోల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. హిందూ టెంపుల్ ఆచార్యులు పవన్ కుమార్ కిష్టపాటి శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం అట్లాంటా హిందూ దేవాలయ అధ్యక్షులు కొట్టె కుసుమ ఆలయం తరఫున షణ్మఖ శర్మను ఘనంగా సత్కరించారు. ఐదు రోజుల పాటు సాగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఇందుకు సన్‌షైన్ పిడియాట్రిక్స్, శేఖర్ రియల్టర్ రాజేసింగ్, లాజిక్ లూప్స్, స్వప్న రెస్టారెంట్, కృష్ణ విలాస్, రమేష్ వల్లూరి, హనుమాన్ నందపాటి, డా.రవి వర్మ, డా.బీకే మోహన్, సురేష్ సజ్జా, నేమాని సోమయాజులు, ప్రూడెన్షియల్ ఇన్సూరెన్స్, శ్రీనివాస్ మేడూరి, దివాకర్ జమ్మలమడుగు, కృష్ణ కాళకూరి, పార్థ రామరాజు, కొండల్ నల్లజర్ల, శంకర్ బోనాలి, శశి ఉప్పల తదితర దాతలు సాయం చేశారు. కాగా, అమెరికాలో 68 రోజుల పర్యటనలో భాగంగా 15 నగరాల్లో షణ్మఖ శర్మ ప్రవచనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. -
ఏ పేరుతో పిలిచినా అమ్మ ఒక్కరే
ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రాజమహేంద్రవరం కల్చరల్ : పోలేరమ్మ, తలుపులమ్మ, పేరంటాలమ్మ, పెద్దింటమ్మ, గాయత్రి, మహాలక్ష్మి, కామాక్షి, బాలాత్రిపురసుందరి...ఇలా ఏ పేరుతో పిలిచినా అమ్మ ఒక్కరేనని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. నగరంలోని సోమాలమ్మ గుడి వద్ద పుంతరోడ్డులో ‘అమ్మ వైభవం’ అంశంపై శుక్రవారం ఆయన ప్రవచించారు. బయట ఎంత వెతికినా అమ్మ దొరికేది కాదు, ఎందుకంటే అమ్మ ‘అంతర్ముఖ సమారాధ్య’...ఇదే విషయాన్ని వ్యాసభగవానుడు లలితాసహస్ర నామంలో తెలియజేశారని చెప్పారు. అమ్మకు అమ్మ అన్న పిలుపుకన్నా గౌరవప్రదమైన సంబోధన మరొకటి ఉండదన్నారు. వ్యాసభగవానుడు అమ్మ సహస్రనామాలను ‘శ్రీమాతా’ అన్న పిలుపుతో ప్రారంభించారని చెప్పారు. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది, దేవతలు పుణ్యం క్షీణించగానే తిరిగి మర్త్యలోకానికి రావలసినవారేనని చెప్పారు. పరమోత్కృష్టమైన నరజన్మ లభించాక, తన తరువాత ఏడు జన్మలకు సరిపడా ధనార్జనలో జీవితాన్ని వృథా చేసుకునే వారు కొందరైతే, ధర్మమార్గంలో జీవించి, ఉత్తమ లోకాలను అందుకోవాలని ప్రయత్నించేవారు మరికొందరని చాగంటి పేర్కొన్నారు. చైత్ర,వైశాఖ మాసాలను మధుమాసం, మాధవమాసాలంటారని చెప్పారు. చైత్రంలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా, ధర్మమార్గంలో నడవాలని మానవాళికి ఉపదేశించారని తెలిపారు. వైశాఖమాసంలో జన్మించిన ఆదిశంకరులు దేశానికి మార్గనిర్దేశం చేసిన సాక్షాత్తు జగద్గురువులని చెప్పారు. తొలుత ఆలయానికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ కమిటీ ప్రతినిధి, కార్పొరేటర్ గొర్రెల సురేష్, అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి, టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.