‘నా చేయి పట్టుకున్నందుకు, నా మెడలో మంగళ సూత్రం కట్టినందుకు ఆయనకు నేను ఇచ్చుకోదగిన మహత్తర బహుమానం, భరోసా ఏమిటి?’ అంటే... ఆమె తన భర్తకి కొడుకుని కని ఇవ్వడమేనట. ఎందుకలా...!!!
తాను వృద్ధాప్యాన్ని పొందితే, ఆ కొడుకు తన భుజం మీద చెయ్యివేసుకుని ఆసరాగా నడిపించుకుంటూ ఆ సభలో తనను తీసుకు వెడుతుంటే....అక్కడ తనకే పౌర సన్మానం జరిగినంతగా తండ్రి సంతోషపడిపోతాడట. తన కొడుకు పెద్దవాడవుతుంటే చూస్తూ సంతోషపడిపోతాడట. అన్నిటికన్నా విశేషం... ఆయన అన్నిటికన్నా గొప్పవాడు. ఆయనకు సత్కారం చేయదలిచి ఏదిచ్చినా తక్కువే.. అంత గొప్పవాడు. అసలు ఆయనకు కోరిక ఉంటే కదా..సంతోషిస్తాడనడానికి. మరటువంటి ఆయనను సంతోషపెట్టడమెలా, ఆయనకు సత్కారం ఎలా ?
అది లోకంలో ఒక్కటే ఉంది. అది ఆయన కొడుకు చేతిలో ఓడిపోవడమే. ‘పుత్రాదిచ్చేత్ పరాజయం...’
ఒక మహా విద్వాంసుడున్నాడు. ఆయన సభలో వచ్చి మాట్లాడుతుంటే ఆయనను కాదని నిలబడగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. శాస్త్రంలో అంత నిష్ఠ గలిగిన వాడు. గండపెండేరాలో, స్వర్ణ కంకణాలో, దుశ్శాలువలో, పంచెలచాపులో, సన్మాన పత్రాలో, బిరుదులో... ఇవేవీ ఆయనను సంతృప్తిపరచలేవు. ఆయన వాటి స్థాయిని ఎప్పుడో దాటేసాడు. మరి ఆయనను సంతృప్తి పరచగలిగిన సత్కారం ఏది ? ఆయన కడుపున పుట్టిన కొడుకు కూడా విద్వాంసుడై ఒకనాడు తండ్రి ప్రతిపాదించిన సిద్ధాంతం వంక చూసి‘నాన్నగారూ, ఏమీ అనుకోకండి మీరు ప్రతిపాదించిన సిద్ధాంతంలో కించిత్ దోషం కనబడుతున్నది... అలాకాక ఇలా చెబితే దానికి పూర్ణత్వం వస్తుంది కదా...’ అన్నప్పుడు ఆ తండ్రి ఆనందబాష్పాలు రాలుస్తాడట. ‘అబ్బ! నన్ను ఓడించే సామర్ధ్యం గల కొడుకు పుట్టాడు. నేను ఓడిపోయాను’ అని సంతోషిస్తాడట. అటువంటి సత్కారం పొందాలంటే అటువంటి కొడుకు పుట్టాలి. సుబ్రహణ్యస్వామి ప్రణవానికి అర్థం చెప్పగా విని ‘వీడి చేత నేను సత్కారం పొందాను. వీడు నాకన్నా బాగా చెప్పాడు’ అని శంకరుడంతటి వాడు కొడుకు మాటలు విని, కొడుకు ప్రాజ్ఞత చూసి పొంగిపోయాడు.
మరీ ముఖ్యంగా ప్రాణోత్క్రమణవేళలో లక్షతేళ్లు కుట్టిన బాధ కలుగుతుందట. కొడుకు తొడమీద తల పెట్టుకుని ఆ కొడుకు చెయ్యిపట్టుకుని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు అంత బాధనుంచి కూడా ఉపశమనం పొందుతాడట. కొడుకు ఒళ్ళో శరీరం వదలడం కాశీ పట్టణంలో శరీరం వదలడంతో సమానం అంటారు. ‘ఆత్మావైపుత్రనామాసి..’ అంటుంది శాస్త్రం. తన ఆత్మ బయట మరో రూపాన్ని పొంది తిరిగితే అదే కొడుకు. అలా ఇచ్చింది ఎవరు?
తన భర్తకు అటువంటి అపురూప కానుకను ఇచ్చినందుకు వృద్ధాప్యంలో తన భర్తకు ఆసరా అవకాశం కల్పించినందుకు ఆ పిచ్చితల్లి పొంగిపోతుంది. ఆఖరున తండ్రి శరీరానికి ఆనంద హోమం చేసి గయా శ్రాద్ధం పెట్టి ఉన్నత గతులు కల్పించే పుత్రుడిని కని ఇచ్చింది. అటువంటి స్త్రీ కారణంగా పురుషుడు అభ్యున్నతిని పొందుతున్నాడు. శాస్త్రంలో పురుషునికన్నా స్త్రీ వైశిష్ట్యమే గొప్పది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment