
విశ్వనాథ సత్యనారాయణ గారు ‘వేయిపడగలు’ అని నవల రాస్తే పివి నరసింహారావుగారు దానిని ‘సహస్రఫణ్’ పేరిట హిందీలోకి అనువదించారు. 999 పడగలు చితికిపోయినా వివాహం అన్న ఒక్క పడగ నిలబడి ఉంటే భారతదేశంలో మన సంస్కృతి నిలబడుతుందన్నారు. నా కూతురును ధర్మమునందు, కామమునందు, అర్థమునందు అతిక్రమించకూడదని వరుడికి చెబుతారు. కామాన్ని ధర్మపత్నితో ముడివేస్తారు. అందుకే ఈ దేశంలో పత్నిని ధర్మపత్ని అని పిలుస్తారు తప్ప కామపత్ని అని పిలవరు. అంటే ఈ దేశంలో వివాహం చేసినప్పుడు ఆడపిల్లకు ఎంత సమున్నత స్థానమిచ్చారో, ఎంత కీర్తి కట్టబెట్టారో, ఆమెయందు పురుషుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలని మనకు తెలియచేశారో అర్థమవుతుంది.
నేను విశాఖపట్టణం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు...నా పెళ్ళి నిశ్చయమయిన రోజులు. నామిత్రుడొకరు నాతో మాట్లాడుతూ భార్యంటే... ఈశ్వరుడిచ్చిన జీవితకాల స్నేహితురాలు.. అన్నారు. ఎంత గొప్పమాట.. నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే –ఆమెను స్నేహభావంతో చూడాలి తప్ప ... తాను చెప్పినట్లు విని తదనుగుణంగా నడుచుకుతీరాల్సిన దాసి అన్న భావనతో చూడొద్దని నాకు హెచ్చరిక అది. జీవితాంతం కలిసి ఉండడానికి పరమేశ్వరుడిచ్చిన గొప్ప స్నేహితురాలు భార్యంటే. ఆమె పురుషుడికి శాంతి స్థానం. ఆమెకు చేసిన ప్రమాణాన్ని పురుషుడు ఉల్లంఘించడు. ఒకరు చూసారా, చూడలేదా...అని కాదు, తాను చేసిన ప్రమాణానికి తాను కట్టుబడడం తన శీల వైభవం.
అందుకే మహానుభావుడైన రామచంద్రమూర్తి దక్షిణ నాయకత్వంలో పుట్టినా ఏకపత్నీ వ్రతాన్ని పాటించి మనుష్యుడైన వాడు ఎలా బతకాలో నేర్పాడు. అలాగే మనకు ఆడపిల్లను కన్యాదానం చేసేటప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. ‘ఇదం న మమ’ ...‘‘ఇకపైన ఇది నాది కాదు’’ అని అనరు. ..‘‘ప్రతిపాదయామి’’ అంటారు. ‘‘ఈమెను నీకు ధర్మపత్నిగా ఇస్తున్నా’ అని చెప్పి వరుడికి అప్పగిస్తే..‘‘ఓం స్వస్తి’’ అని ఆంటూ ఆయన పుచ్చుకుంటారు. అంటే పుట్టింటి వారికి ఆమె మీద అధికారం ఉన్నది. కన్నతల్లిదండ్రులు, పెంచి పెద్దచేసిన వారు ఆడపిల్లనిచ్చి పెళ్ళి చేసినంతమాత్రాన ఆమెను మీ ఇంటికి పంపననే అధికారం అసలు భర్తకు ఎక్కడినుంచి వస్తుంది? అలా అన్నవాడు భర్త ఎలా అవుతాడు? అలా అనడానికి అత్తమామలు ఎవరు? తల్లిదండ్రులు ఎప్పుడు కావాలన్నా ఆ పిల్లను ఇంటికి తెచ్చుకోవచ్చు.
‘‘అమ్మా! నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. 104 డిగ్రీల జ్వరం వచ్చిందమ్మా. కన్నుమూసినా తెరిచినా కనబడుతున్నావు. ఒక్కసారి రా తల్లీ!’’ అని అడిగే అధికారం తండ్రికున్నది. ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి కానీ, పంపను అనడానికి కానీ, ఆమె మీద ఇక సర్వాధికారాలు నావే...అనడానికి కానీ అధికారాలు ఎవరికీ లేవు. కడుపున పుట్టిన బిడ్డ మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఎటువంటిదో, అది ఎంత ప్రశ్నింపరానిదో, ఎంత ప్రేమతో ప్రవర్తించాలో జీవితాంత హెచ్చరికగా వివాహక్రతువులో వాడిన మంత్రాలు పరిశీలిస్తే ప్రేమకు, హదయంలో లాలిత్యానికి, ఆ హదయ సౌకుమార్యానికి ఎంత పట్టాభిషేకం చేసారో అర్థమవుతుంది. ఇంత గొప్ప మనసుతో ఈ వివాహ క్రతువును నిర్ణయించిన రుషులకు రుణపడి ఉన్నాం.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment