వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు.
బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు.
వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు.
అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం.
Comments
Please login to add a commentAdd a comment