
ఉగాదికి సంబంధించిన వేడుకలూ, సంప్రదాయాలూ ఉన్నాయి కానీ, ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు. కారణం – ఉగాది (Ugadi) దైవానికి సంబంధించిన పండగ కాదు, కాలానికి సంబంధించిన పండగ! మనిషికున్న వనరులలో అన్నిటికంటె విలువైనది కాలం. అందులో క్షణం ఖర్చయిపోయిందంటే, దాన్ని తిరిగి సంపాదించుకొనే అవకాశం ఎవరికీ లేదు! మనిషి ఆయుర్దాయాన్ని పన్నెండు నెలల పొడుగు ఉన్న ముక్కలుగా విభజిస్తే, ఒక్కొక్క భాగం ఆరంభానికి, ఒక్కొక్క ఉగాది మైలురాయి. ‘నిన్నటితో నీ జీవితంలో మరో ఏడు వెళ్ళి పోయింది. అది ఇక తిరిగిరాదు. ఇవ్వాళ ఇంకొక భాగం ఆరంభం. గతం గతః కనుక, రాబోయే ఏడాదిలోనైనా ధర్మార్థ కామ మోక్షాల సాధనకు సమయాన్ని సరిగా కేటాయించుకొని, సద్వినియోగం చేసు కొమ్మని కాలం చేస్తున్న హెచ్చరికగా ఉగాదిని స్వీకరించవచ్చు.
కాలం (Time) చిత్రమైంది. అందులో ప్రతిక్షణమూ మన కళ్ళముందే క్రమం తప్పకుండా టిక్‌టిక్‌మని జరిగిపోతూ ఉంటుంది. కానీ విలువయిన కాలం, విలువలేని భోగలాలసతలో వేగంగా మన చేయి జారిపోయిందని, మనకు బోధపడే నాటికి, సాధారణంగా మనం ముది వయసులో ఉంటాం. ‘లాలసులగు మానవులను/ కాలము వంచించు, దురవగాహము! సుమతీ!’ అన్నారు కదా పోతన గారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని గుర్తు చేసే పర్వదినంగా ఉగాదిని చూడవచ్చు.
కాలంలో మరో విచిత్రం కూడా ఉంది. ‘కాలం మారిపోతున్నది, రోజురోజుకూ భ్రష్టమై, నాశనమై పోతున్నది!’ అని లోకులం తరచుగా వాపోతూ ఉంటాం. కానీ అది సబబు లేని మాట. కాలం సృష్ట్యాది నుంచి, ఒకే క్రమంలో ఒకే వేగంతో దాని దోవన అది పోతూ ఉన్నది. దానికి మార్పెక్కడ? మారేది లోకం, కాలం కాదు. కాలం మారిపోతున్నదనటం ‘... తల/ తిరుగు మానిసి ఇల యెల్ల తిరుగుననుటె!’ (పానుగంటి).
శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘మారేదీ, మారిందీ, మారగలిగిందీ, మారవలసిందీ కాలం కాదు, దేశం. దేశం (Country అంటే మనుషులు. అంటే మేమే! జరిగిపోయిన చెడుగు, అధర్మం, పతనం, భ్రష్టత్వాలు జరిగిపోయాయి. కనీసం రాబోయే కాలంలోనన్నా మేమంతా ‘మంచి’ దిశగా మారేలా చేయి స్వామీ! ఇప్పటి అంధకారం నుంచి మమ్మల్ని వెలుగుదిశగా నడిపించు. ‘తమసో మా జ్యోతిర్గమయ!’ అని చిత్తశుద్ధితో లోకులందరూ సర్వేశ్వరుడిని ప్రార్థించదగిన సుదినం ఉగాది.
– ఎం. మారుతి శాస్త్రి