
ఉగాది తార
‘‘ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి... మన తెలుగు సంవత్సరాదిని ఇంకా ఘనంగా జరుపుకోవాలి కదా. మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించే విషయంలో అస్సలు తగ్గకూడదు’’ అంటున్నారు అనన్య నాగళ్ల. తెలుగు తెరపై కథానాయికగా దూసుకెళుతున్న ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యారు. సంప్రదాయబద్ధంగా తయారై, ఉగాది పండగ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.
→ ఉగాది విశిష్టత అంటే మన తెలుగు సంవత్సరాది... మన సంప్రదాయం, మన సంస్కృతిని బాగా చూపించే పండగ. ఇంగ్లిష్ న్యూ ఇయర్‌ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన తెలుగు సంవత్సరాదిని అంతకంటే ఘనంగా జరుపుకోవడం నాకు ఇష్టం. పైగా తెలుగువారికి తొలి పండగ కాబట్టి బాగా జరుపుకోవాలనుకుంటాను.
→ ఉగాది పండగ అనగానే నాకు రాశి ఫలాలు గుర్తొస్తాయి. ఉదయం లేవగానే రాశి ఫలాలు చూసుకోవడం, ఈ ఏడాది మన ఆదాయం, వ్యయం, రాజ పూజ్యం చూసుకోవడం అనేది సరదాగా అనిపిస్తుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీలా అయి΄ోయింది. ఉదయాన్నే లేచి అందంగా తయారవడం, ఉగాది పచ్చడి చేసుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం, గుడికి వెళ్లడం... ఇలానే నేను పండగ జరుపుకుంటాను. నాకు ఉగాది పండగ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఏడాదీ బాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్నిసార్లు కుదురుతుంది.. మరికొన్నిసార్లు కుదరదు. ఈ ఏడాది మాత్రం మంచిగా ముస్తాబై గుడికి వెళ్లాలని, ఇంటి వద్ద పిండి వంటలు చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాను.
→ ఉగాది పచ్చడి ఎప్పుడూ తయారు చేయలేదు. కానీ, ప్రతి ఏడాది తింటాను. ప్రత్యేకించి వేర్వేరు ఆలయాల్లో వేర్వేరు రుచుల్లో ఉగాది పచ్చడి ఉంటుంది. వీలైనన్ని టేస్ట్ చేస్తాను. ఇంట్లో మా అమ్మ ఉగాది పచ్చడి చేస్తుంటే సాయం చేశాను కానీ, నేనెప్పుడూ చేయలేదు. అయితే ఆ పచ్చడి రుచి అంటే నాకు చాలా ఇష్టం.
→ ఉగాది పచ్చడి అంటేనే అందరూ చెబుతున్నట్లు ఆరు రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఇలా అన్నమాట. నాకు ప్రత్యేకించి వగరుతో కూడిన రుచి అంటే ఇష్టం. ఎందుకంటే... బయట మనం వగరుతో కూడిన ఫుడ్‌ని ఎక్కువగా టేస్ట్ చేయలేం. అలాగే వగరు అనేది వైవిధ్యమైన ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది... అందుకే నాకు ఇష్టం.
→ నా బాల్యంలో జరుపుకున్న ఉగాది అంటే చాలా ఇష్టం. మా ఇంటి ముందు గుడి ఉండేది... అందరం పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ గుడికి వెళ్లేవాళ్లం. చిన్నప్పుడు కాబట్టి కొత్త బట్టలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇక రకరకాల పిండి వంటలు ఉంటాయి కదా... చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించేది.
ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్