telugu new year
-
అందమైన తెలుగుదనం– అనన్య నాగళ్ల
‘‘ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి... మన తెలుగు సంవత్సరాదిని ఇంకా ఘనంగా జరుపుకోవాలి కదా. మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించే విషయంలో అస్సలు తగ్గకూడదు’’ అంటున్నారు అనన్య నాగళ్ల. తెలుగు తెరపై కథానాయికగా దూసుకెళుతున్న ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యారు. సంప్రదాయబద్ధంగా తయారై, ఉగాది పండగ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. → ఉగాది విశిష్టత అంటే మన తెలుగు సంవత్సరాది... మన సంప్రదాయం, మన సంస్కృతిని బాగా చూపించే పండగ. ఇంగ్లిష్ న్యూ ఇయర్‌ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన తెలుగు సంవత్సరాదిని అంతకంటే ఘనంగా జరుపుకోవడం నాకు ఇష్టం. పైగా తెలుగువారికి తొలి పండగ కాబట్టి బాగా జరుపుకోవాలనుకుంటాను.→ ఉగాది పండగ అనగానే నాకు రాశి ఫలాలు గుర్తొస్తాయి. ఉదయం లేవగానే రాశి ఫలాలు చూసుకోవడం, ఈ ఏడాది మన ఆదాయం, వ్యయం, రాజ పూజ్యం చూసుకోవడం అనేది సరదాగా అనిపిస్తుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీలా అయి΄ోయింది. ఉదయాన్నే లేచి అందంగా తయారవడం, ఉగాది పచ్చడి చేసుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం, గుడికి వెళ్లడం... ఇలానే నేను పండగ జరుపుకుంటాను. నాకు ఉగాది పండగ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఏడాదీ బాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్నిసార్లు కుదురుతుంది.. మరికొన్నిసార్లు కుదరదు. ఈ ఏడాది మాత్రం మంచిగా ముస్తాబై గుడికి వెళ్లాలని, ఇంటి వద్ద పిండి వంటలు చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాను. → ఉగాది పచ్చడి ఎప్పుడూ తయారు చేయలేదు. కానీ, ప్రతి ఏడాది తింటాను. ప్రత్యేకించి వేర్వేరు ఆలయాల్లో వేర్వేరు రుచుల్లో ఉగాది పచ్చడి ఉంటుంది. వీలైనన్ని టేస్ట్ చేస్తాను. ఇంట్లో మా అమ్మ ఉగాది పచ్చడి చేస్తుంటే సాయం చేశాను కానీ, నేనెప్పుడూ చేయలేదు. అయితే ఆ పచ్చడి రుచి అంటే నాకు చాలా ఇష్టం. → ఉగాది పచ్చడి అంటేనే అందరూ చెబుతున్నట్లు ఆరు రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఇలా అన్నమాట. నాకు ప్రత్యేకించి వగరుతో కూడిన రుచి అంటే ఇష్టం. ఎందుకంటే... బయట మనం వగరుతో కూడిన ఫుడ్‌ని ఎక్కువగా టేస్ట్ చేయలేం. అలాగే వగరు అనేది వైవిధ్యమైన ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది... అందుకే నాకు ఇష్టం. → నా బాల్యంలో జరుపుకున్న ఉగాది అంటే చాలా ఇష్టం. మా ఇంటి ముందు గుడి ఉండేది... అందరం పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ గుడికి వెళ్లేవాళ్లం. చిన్నప్పుడు కాబట్టి కొత్త బట్టలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇక రకరకాల పిండి వంటలు ఉంటాయి కదా... చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించేది.ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ భవిష్యత్తులో మంచి జరగాలనే ఆకాంక్ష ఉంటుంది. కాని భవిష్యత్తు అనేది అనిశ్చితితో నిండి ఉంటుందన్న ఎరుక కూడా ఉంటుంది. అయితే ఒక ఆశ కావాలి కదా. ఆ ఆశను ఆధ్యాత్మిక రూపంలో గ్రహాలను ఊతంగా చేసుకుని సనాతనంగా వచ్చిన గ్రహ విజ్ఞానం ఆధారంగా నిలబెట్టేదే పంచాంగ దర్శనం. మంచిని వాగ్దానం చేస్తూ చెడును హెచ్చరిస్తూ సాగే పంచాంగంలో అనూహ్యమైనది ఏదీ కనిపించకపోయినా దానిని వినడం, చదవడం, పరికించడం ఆనవాయితీ. అయితే ఈసారి ‘సామాజిక పంచాంగం’ను వినిపించాలనుకుంది ‘సాక్షి’. ఆరు కీలక రంగాలు దేశంలో, స్థానికంగా ఎలా ఉంటాయో తెలియచేశారు పండితులు. అవధరించండి.ప్రకృతికి ప్రణామంమనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన....అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది‘ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.ఉగాది సంప్రదాయాలుఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథం పేర్కొంటోంది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తాము పండించబోయే పంటకి ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ శ్రద్ధాభక్తులతో అడిగి తెలుసుకుంటారు.ఉగాది పూజఅన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈరోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అలాగే అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినడం వల్ల ఏడాదంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేలా చేస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అని పేరు. అంటే విశ్వ శ్రేయస్సు, విశ్వ సంపద అని అర్థం. ఇది అష్టవసువులలో ఒక వసువు పేరు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా... సంపద్వంతంగా ఉంటుందని ఆశిద్దాం...కొత్తదనం... పచ్చదనంఉగాది అనగానే ఏదో తెలియని కొత్తదనం సుతిమెత్తగా మనసును తాకినట్టు అనిపిస్తుంది. పచ్చదనం మనసునిండా పరుచుకుంటుంది. మామిడిపళ్లు, మల్లెమొగ్గలు, తాటిముంజలు, పుచ్చకాయలు, కోయిల గానాలు మదిలో మెదులుతాయి. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నట్టుగా చెట్లు చిగిర్చి పూలు పూసే వసంత రుతువు ఇది. మనసును ఉల్లాసపరిచే కాలం ఇది. అందుకే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఉగాదిని, వసంత రుతువును విడిచిపెట్టలేదెప్పుడూ! ఉగాది కవి సమ్మేళనాలు, ఉగాది కథలు, కవితల పోటీలు, ఉగాది కార్టూన్లు కాగితం నిండా కళ్లు చేసుకుని తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి.ఆర్థికంగా ముందుకు...విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవడం చేత, రసాధిపతి శుక్రుడు అవడం చేత, నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుంది. తెలుగురాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ దేశాల్లో యుద్ధ భయం, యుద్ధ వాతావరణాలు ఉండి ఆర్థికపరంగా పశ్చిమ దేశాలకు అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాధిపతి రవి అవడం చేత పంటలకి క్రిమి కీటకాదుల వల్ల ముప్పు ఉంటుంది. రైతులకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు. ధనవంతులు అధిక ధనవంతులు అవుతారు. పెద్ద వ్యాపారస్తులు లాభాలు బాగా ఆర్జిస్తారు. చిన్న వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్థికంగా భారతదేశానికి శుభ ఫలితాలనూ, తూర్పు ప్రాంతాలకు, తూర్పు దేశాలకు అనగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అభివృద్ధిని సూచిస్తోంది.ఆరోగ్యం ఫరవాలేదు...శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో ఐదుగురు పాపులు, నలుగురు శుభులు ఉండడం చేత రాజు రవి, మంత్రి చంద్రుడు అవటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు. కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారి తీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే 6వ తేదీ వరకూ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కూటమి కావడం వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు. ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్తఅనుబంధాలు జాగ్రత్తఈ ఏడాది పాలకుల మధ్య గాని కుటుంబ, వ్యక్తిగత అనుబంధాలుగానీ అంత బాగుంటాయని చెప్పలేం. అందువల్ల బంధుమిత్రుల ఇళ్లకు అతి ముఖ్యమైన పని మీద వెళ్లినా, ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా పని చూసుకుని రావడం మంచిది. అనుబంధాలు, మానవ సంబంధాలు బాగుండాలంటే తరచు మాట్లాడుకుంటూ ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా అంత బాగుండని బంధువుల మీద తెలిసీ తెలియక భారం వెయ్యకుండా వారికి మీ వల్ల చేతనైన సాయం చేయడం మంచిది. అనవసరమైన, చెయ్యలేని, చేతకాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక మాటలు పడి మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే బదులు చెయ్యగలదానిని మాత్రమే చెప్పడం, చెయ్యలేని వాటిని సున్నితంగా ముందే మా వల్ల కాదని చెప్పడం వల్ల స్నేహసంబంధాలు దెబ్బ తినకుండా ఉంటాయి. బంధువులు, మిత్రుల మధ్య అనుబంధాలు బాగుండాలంటే వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం మేలు. – డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక వేత్తఆనందానికి లోటు లేదుఈ విశ్వావసు నామవత్సరంలో పేరులోనే విశ్వశాంతి గోచరిస్తోంది. క్రోధాలు, మోసాలు, ద్వేషాలు తొలగిపోయి ప్రజలంతా ఒక్కమాటగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వచ్చి ఆనందంలో తేలుతారు, సాహిత్య, సాంస్కృతిక పర్యాటక రంగాలలోని వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రజలంతా చేయీ చేయీ కలుపుకొని మాటా మాటా కలుపుకొని మనసులలోని శంకలు మాపుకొని ఒక్కతాటి మీద నడుస్తూ ఆనందంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం తక్కువ ఎక్కువలనూ పేదాగొ΄్పా తారతమ్యాలను విడనాడి, దేశంలోని అన్ని రంగాలలో సమన్వయం ఏర్పడి అందరూ కలసి కట్టుగా ప్రతి నిత్యం ఆనందంతో మునిగి తేలుతూ అంబరాలనంటేలా సంబరాలను జరుపుకుంటూ జీవిద్దాం. – తాడిగడప సోదరులు: తాడిగడప సుబ్బారావు, తాడిగడప బాల మురళి భద్రిరాజు,శ్రీ వాగ్దేవి జ్యోతిష విద్యాలయం,పెద్దాపురంఅభివృద్ధికరంగా ఉంటుందిశ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం గ్రహాలలో అత్యధిక శాతం శుభులు ఉండడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సస్యవృద్ధి, పశుసంపదకు క్షేమం, ఆయురారోగ్యం కలుగుతుంది. రాజ్యాధిపతి అనుకూలుడుగా ఉండడంవల్ల దేశాధినేతలకు పాలకులకు శుభం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అతివృషి,్ట మరికొన్ని రాష్ట్రాలలో అనుకూల వృష్టి ఉండవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి. రసవస్తువుల ధరలు కొంత హెచ్చి తగ్గుతాయి. నీరస వస్తువులు ధరలు తగ్గి స్వల్పంగా హెచ్చుతాయి. పరిపాలకులు సంయమనంతో ఉంటారు. చేతివృత్తుల వారికి ఈ సంవత్సరం చేతి నిండా పని దొరుకుతుంది. దేశ రక్షణ బాధ్యతను వహించే సైనికులకు ఈ సంవత్సరం పరీక్షా సమయం అయినప్పటికీ విజయం సాధిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాలపై పాలకులు ్రపాధాన్యతను చూపుతారు. యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి– ఓరుగంటి నాగరాజశర్మ, పుష్పగిరి పీఠ మహాసంస్థాన సిద్ధాంతి, జ్యోతిష విద్వాంసులుఆధ్యాత్మికం మిశ్రమంశ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి చేయూత, పండితులకు కొంత వరకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. గురుడు వర్ష జగ లగ్నంలో కేంద్ర గతులవడం వల్ల ధార్మిక ఆరాధనల్లో విస్తృతి పెరుగుతుంది. ముఖ్య దేవాలయాల్లో కొన్ని సంస్కరణల వల్ల హైందవ జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మతపరమైన విషయాల్లో స్వీయ మత ఎరుక పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షష్ఠగ్రహ కూటమి వల్ల బంద్‌లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల సమాజంలో కొంత భయం ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలుగవచ్చు. అలాగే మత్తు మందులు మారక ద్రవ్యాల వల్ల చెడుమార్గం పట్టే వారికి సంఖ్య పెరిగి వారికి ఆధ్యాత్మిక కట్టడి అవసరం అవుతుంది సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ధనవంతుల ఆర్థికసాయం లభించగలదు. – చింతా గోపీశర్మ, సిద్ధాంతి – డి.వి.ఆర్. భాస్కర్ -
Ugadi 2023 Wishes: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Ugadi 2023 Wishes in Telugu: తెలుగువారి పండుగ ఉగాది వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్ర పరివారానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు! ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గతించిన కాలాన్ని మర్చిపోవాలి కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తీపి-చేదు కలిసినదే జీవితం కష్టం-సుఖం తెలిసినదే జీవితం ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మామిడి పువ్వు పూతకొచ్చింది కోయిల గొంతుకు కూత కొచ్చింది వేప కొమ్మకు పూవు పూసింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆనందంగా.. ఆరోగ్యంగా గడుపుదాం.. కొత్త సంవత్సరం శుభం కలగాలని కోరుకుందాం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. బాధలేమి లేకుండా… మీ ఇంట్లో అందరు ఆనందంగా ఉండాలని కోరుతూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి.. కోకిల మీ అతిథిగా రావాలి.. కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి… హ్యాపీ ఉగాది. షడ్రుచుల సమ్మేళన జీవితం.. కష్ట,సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.. తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు . మధుర మైన ప్రతిక్షణం నిలుస్తుది జీవితం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చీకటిని తరిమే ఉషోదయం మాదిరిగా చిగురాకులకు ఊయలలో నవరాగాల కోయిలలా అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన కోయిల రాగాలు అందమైన ముగ్గులు కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలుఉగాది పండుగ సంబురాలు ఎన్నో.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. -
శుభాది కావాల్సిన ఉగాది
వసంతమాసంలో వచ్చే ఉగాది మన తెలుగువాళ్ల కొత్త సంవత్సరం. ఆకులే కాదు, ఆశలూ చిగురించే కాలంలో వచ్చే పండుగ ఇది. వసంతానికీ కవిత్వానికీ అనాదిగా అవినాభావ బంధం ఉంది. ఉగాది అంటే ఆరు రుచుల ఉగాది పచ్చడిని ఆరగించడం; పంచాంగ శ్రవణం మాత్రమే కాదు, ఊరూరా కవిసమ్మేళనాల కోలాహలం కూడా! తెలుగు నేల మీదనే కాదు, తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉగాది పండుగ రోజున కవిసమ్మేళనాలు తప్పనిసరిగా జరుగుతాయి. ప్రాచీన కావ్యాలలో రుతువర్ణన తప్పనిసరి అంశం. కవులు ఆరు రుతువులనూ వర్ణించినా, వాటిలో వసంత వర్ణనకే అమిత ప్రాధాన్యమిచ్చారు. ‘ఋతూనాం కుసుమాకరః’– అంటే, ‘రుతువు లలో వసంతాన్ని నేనే’ అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పుకొన్నాడు మరి! అలాంటప్పుడు భాగవతోత్తములైన ప్రాచీన కవివరేణ్యులు వసంత వర్ణనకు రవంత అమిత ప్రాధాన్య మివ్వడంలో వింతేముంటుంది? ‘కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసగం మా/ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచును ముదమ్మొనర వాచా/లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచు విన్చెననిశమ్ము సుమనోభా/రమ్ముల నశోక నికర మ్ములను చంపక చయమ్ములును కింశుక వనమ్ములున్ నొప్పెన్’ అంటూ ‘ఆంధ్ర మహాభారతము’ ఆదిపర్వంలో నన్నయ పుష్పవిలసిత వసంత శోభను వర్ణించాడు. ‘కీర ముహ సచ్ఛేహిం/ రేహఇ వసుహా పలాస కుసుమేహిం/ బుద్ధస్స చలణ వందణ/ పడి విహిం వ భిక్ఖు సంఘేహిం’ – అంటే, ‘భూమి మీద తిరుగాడే రామచిలుకల ముక్కుల్లాంటి మోదుగ పూలు బుద్ధుని పాదాలను తాకి ప్రణ మిల్లే బౌద్ధభిక్షువుల సంఘమా?’ అని హాలుడు తన ‘గాథా సప్తశతి’లో అబ్బురపడ్డాడు. రుతువర్ణనలో అష్టదిగ్గజాలను తలదన్నే కవిదిగ్గజం ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు. ఆయన తన ‘ఆముక్త మాల్యద’లో చేసిన వసంత వర్ణనలో మీన మేషాలను లెక్కించాడు. ‘కినిసి వలఱేడు దండెత్త గేతు వగుట/ మీన మిల దోచుటుచితంబ మేష మేమి/పని యనగ నేల? విరహాఖ్యపాంథ యువతి/ దాహమున కగ్గి రాగ దత్తడియు రాదె?’ అని చమత్కరించాడు. ఇందులోని చమ త్కారమేమిటంటే, కోపంతో మన్మథుడు దండెత్తగా చేప కనిపించడం సమంజసమే! ఎందుకంటే, మన్మథుడు మీనకేతనుడు. అలాంటప్పుడు అక్కడ మేకకు పనేమిటంటారా? విరహతాపంతో యువతులు దహించుకు పోతున్నప్పుడు అగ్ని వాహనమైన మేషం అక్కడ ఉండటమూ సమంజ సమే కదా! సౌరమానంలో మీన, మేష మాసాలు వసంత రుతువు. వసంతాగమనాన్ని ఇంత నర్మగర్భంగా వర్ణించడం రాయలవారికే చెల్లింది! ‘క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దారసోపగుం/భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస/న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె; ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా’ అని చేమకూర వేంకటకవి వాపోయాడు. వసంతుడు వచ్చి, చెట్లను చిగురింపజేసి, వాటిని ఫలపుష్పభరితం చేసి, ప్రకృతిని పులకింపజేశాడట. అప్పుడు వసంతుడు చేసిన ఘనకార్యాన్ని పైనుంచి చూస్తున్న చంద్రుడు మెచ్చకపోగా, కినుక బూనాడు. వసంతుడిని మించి తన ఘనత చాటుకోవడానికి సుకుమారమైన వెన్నెల కురిపించి, రాళ్లను కరిగించేశాడట. అలాగే, ఎంత బాగా రాసినా సమకాలికులు మెచ్చరట! చేమకూర కవికే కాదు, ఈ బాధ ఇప్పటి కవులనూ పీడిస్తూనే ఉంది. ‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు’ అని కృష్ణశాస్త్రి వగచినంత మాత్రాన తెలుగు కవులకు ఉగాదులు లేకుండా పోలేదు. ఉగాది కవి సమ్మేళనాలు నేటికీ అట్టహాసంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగని ఉగాది కవి సమ్మేళనాలు ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్నాయనడానికి ఆధారాలేవీ లేవు. మహా అయితే ఒకటి రెండు శతాబ్దాలుగా మొదలై ఉంటాయేమో! ప్రాచీన సాహిత్యంలో వసంత వర్ణన తప్ప ఉగాది వర్ణన ఎక్కడా కనిపించదు. ఒకప్పుడు కొన్ని పత్రికలు ఉగాది ప్రత్యేక సంచికలు విడుదల చేసేవి. ఆ కాలమంతా గత వసంత వైభవం. కాల చక్రభ్రమణంలో రుతువులు వస్తుంటాయి, పోతుంటాయి. ఉగాదుల రాకతో లోకమంతా పచ్చగా మారిపోతుందనుకుంటే, అది భ్రమ మాత్రమే! ‘నీతి పథమునందు, నిత్య జీవితమందు/ మాటనిరుకునందు మార్పులేక/ కొత్తబట్ట గట్టు కొన్నంత నూత్నవ/ర్షంబు మహము సార్థకంబుగాదు’ అని జాషువా ఏనాడో నిష్ఠుర సత్యాన్ని పలికారు. ‘ఉగాది పాటకు ఒకటే పల్లవి/ బాధ బాధ బాధ అది/ జగాన మెసలే జనాల జీవిత/ గాథ గాథ గాథ’ అని నిర్మొహమాటంగా తేల్చేశాడు శ్రీశ్రీ. అంతేనా? ‘ఉగాది వచ్చింది/ అయినా/ శుభాది వచ్చిందీ?’ అని నిలదీశాడు కూడా! ఏటా ఉగాది వస్తూనే ఉంటుంది. ఉగాది వేడుకలూ యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి. సామాన్యుల జీవితాల్లో పెనుమార్పులేవీ రాకపోయినా; రాజకీయ పంచాంగ శ్రవణాలొక వైపు, బహిరంగ వేదికల మీద అధికారిక, అనధికారిక కండువాల కవి సమ్మేళనాలింకొక వైపు కోలాహలంగా కొనసాగుతూనే ఉంటాయి. ఒకే వేదిక మీదకు చేరిన కవుల్లో కొందరు ఉగాదిని రారమ్మని ఆహ్వానిస్తుంటారు. ఇంకొందరు రావద్దని బతిమాలుకుంటారు. ఉగాది పచ్చడిలోని చేదును మర పిస్తూ, ఈ తప్పనిసరి తతంగాలు జనాలకు ఉచిత వినోదాన్ని ఉదారంగా పంచిపెడుతూనే ఉంటాయి. పండగపూట ఆ మాత్రం వినోదమైనా లేకపోతే, బతుకులు మరీ చేదెక్కిపోవూ! -
ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!
ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం. అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఉగాది పంచాంగ శ్రవణం రోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ఎలా జరుపుకోవాలి? తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి. నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి. అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి. కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే ! నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !! నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది. ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి. బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే! ప్లవ అంటే... ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలకూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ఆ పేర్లు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాన్ని అన్యాపదేశంగా చెబుతుంటాయి. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టే కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలలో చీకటిని నింపిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. నేడు మనం అడుగు పెడుతున్న సంవత్సరం ప్లవ. అంటే తెప్ప లేదా చిన్న నావ అని అర్థం. అలాగే దాటించే సాధనమనీ, తేలికగా ఉండేదనీ, నీటి వనరులు సమృద్ధిగా లభించేదనీ... రకరకాల అర్థాలున్నాయి. మనం మాత్రం ఈ సంవత్సరం నీటివనరులు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలనీ, కష్టాల నుంచి తేలికగా అందరినీ ఒడ్డుకు చేర్చాలనీ అర్థాలు తీసుకుందాం. అందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం గడిచిపోవాలని కోరుకుందాం. పండగ వేళ... తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు.. ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది... ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే.. ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి.. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్ఈడి బల్బులతో అలంకరిస్తే సరి. సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది. ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు. ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు. పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది. – డి.వి.ఆర్. భాస్కర్ -
Ugadi 2021: స్వస్థతనొసగవమ్మా ఓ ఉగాదీ...
చిన్ని పాపాయి నవ్వుల్ని ఇంటికి తోరణంగా కట్టనీ. బుజ్జిగాడి అల్లరిని బంతిపూల మాలగా చుట్టనీ. అమ్మమ్మ, నానమ్మలు నిశ్చింతగా మెలగనీ. అమ్మ సంతోషంగా పాయసం వండనీ. నాన్న సురక్షితంగా పనులకు వెళ్లిరానీ. చంద్రుడు అందంగా కనిపించనీ. సూర్యుని ప్రతాపం వేసవి అని మాత్రమే తెలపనీ. పాత రొష్టులన్నీ తొలగిపోనీ. కోత సమయాలన్నీ చెదిరిపోనీ. ధన ధాన్యాలు తర్వాత. మణి మాణిక్యాలు అటు పిమ్మట. మొదలు స్వస్థత నొసగవమ్మా ఓ ఉగాది. మా అరిటాకుల్లో ఆయుష్షునీ, ఆనందాన్ని వడ్డించమ్మా మా ఉగాది. ప్లవ నామ ఉగాదికి పండగ విన్నపాలు ఇవి. సంవత్సరం గడిచిపోయింది తల్లీ. వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. శీతవేళలు కోత పెడుతూనే ఉన్నాయి. మనసారా నవ్వి చాలా కాలమయ్యిందమ్మా. మనిషిని హత్తుకొని యుగాలు దాటిందమ్మా. వాకిట్లో పూలకుండీలు కూడా బెంగ పెట్టుకున్నాయి. పెరటిలో అరటి చెట్లు ఆకులను ముడుచుకున్నాయి. ఏ ఇల్లూ వచ్చేపోయే ఇల్లుగా లేదు. ఏ వాకిలీ నిర్భయంగా గడిని తీయడం లేదు. కాసింత గాలి కావాలి తల్లీ. కాసింత వెలుగు కావాలి. మామాలుగా జీవితం గడిచే మహద్భాగ్యం కావాలి తల్లీ. శ్రీ ప్లవ నామ సంవత్సరమా... స్వస్థతనొసగమ్మా... శాంతిని పంచమ్మా. హుండీలు పగులగొట్టేశాం. పోపుల డబ్బా చిల్లర చివరకొచ్చింది. అకౌంట్లో సొమ్ము గీకీ గీకీ బేలెన్స్ జీరోకు చేరింది. ఉప్పుకు డబ్బు కావాలి. పప్పుకు డబ్బు కావాలి. పొయ్యిలో పిల్లిని తోలడానికి చేతికి సత్తువ కావాలి. పిల్లలకు మిఠాయిలు తెచ్చి ఎంత కాలమో. నాలుగు పండ్లు కొనాలన్నా ఎంత పిరిమో. ప్రతి ఇంటి జరుగుబాటును కాపు కాయి తల్లీ. ప్రతి ఇంట్లో అంట్లు పడే వేళను గతి తప్పనీకు తల్లీ. ప్లవ నామ సంవత్సరమా... ఆకలి ని బెత్తం దెబ్బలు కొట్టి తెలుగు ప్రాంతాల నుంచి తరిమికొట్టు. తెలుగువారి చేతి వేళ్లు ప్రతి పూటా నోట్లోకెళ్లే వరం ప్రసాదించు. సేవ చేసే వైద్యులకు సేవ చేసే శక్తినివ్వు. కాపు కాచే వ్యవస్థకు కాపు కాచే స్థయిర్యాన్ని ఇవ్వు. చెడు గాలులు, విష గాలుల బారిన అమాయకులు, నిరుపేదలు, నిస్సహాయులు, స్త్రీలు, పిల్లలు పడితే వారికి క్షణాలలో సాయం అందేలా చూడు. ఆశబోతు జలగలు, అత్యాశ పాములు, అబద్ధాల తేళ్లు వాళ్లను కుట్టకుండా చూడు. మెడలో పుస్తెలు, శరీరంలో అవయవాలు తప్ప వారి దగ్గర ఏ ఆస్తులూ ఉండవు. వారిని వారికి మిగిలేలా చూడు. వారి ఇళ్లల్లో ఏ కన్నూ చెమర్చకుండా చూడు. ఏ గొంతూ గద్గదం కాకుండా కాచుకో. ముంగిట్లో సన్నజాజుల మొక్క వేసుకుని, మూడుపూట్లా పచ్చడి నూరుకుని జీవితాంతం బతికేయగలరు వారు. ఆ పెన్నిధిని కూడా దగా చేసి దోచుకోకు. ఏ ఇంటి సంఖ్యా తక్కువ చేయకుండా చూడు. ఓ ప్లవ నామ ఉగాదీ... ఈసారి నీ వెంట ఏ మృత్యుభటుడూ రాకుండా ఉండనీ. వచ్చినా అతని వద్ద ఉండే సకల చిరునామాలు తప్పుగా ప్రింటయ్యి ఎల్లకాలమూ తికమకపడనీ. అతని గూగుల్ మేప్ పూర్తిగా మిస్‌గైడ్ చేయనీ. పిల్లలు చదువుకోనీ. యుక్త వయసు ఉన్నవారికి పెళ్లిళ్లు జరగనీ. ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగనీ. పగిలిన గోడ నుంచి ఒక మొలక మొలవనీ. బోసిపోయిన వీధులు తిరిగి కళకళలాడనీ. రహదారులు ప్రజల రాకపోకలతో అజీర్తి పడనీ. కూలి జీవులకు దిలాసా కలగనీ. మేలు చేసే బుద్ధి ప్రతి మనసుకూ కలగనీ. కాలానికి మంచికాలం తెచ్చే శక్తి ఉంటుంది. ప్లవ నామ పర్వదినమా... నీ గేలానికి సకల శుభాలన్నీ వచ్చి చిక్కుకోనీ. అవమానాలు పూజ్యం చేయి. సన్మానాలు భోజ్యం చేయి. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పొందనీ. ప్రతి ఒక్కరినీ మర్యాదగా బతకనీ. కుళ్లు, కపటాలను లంకె బిందెలుగా దాచి చూసుకున్నవారు వాటిని తెరిచి చూసినప్పుడు నిండా మండ్రగప్పలు కనపడనీ. సాయం, ఔదార్యాలను చేసంచిలో నింపుకున్నవారి పైకప్పు నుంచి మణిమాణిక్యాలు నట్టింట కురవనీ. ప్లవ నామ సంవత్సరమా... ప్రతి ఒక్కరూ పదుగురి బతుకు కోరనీ. పదుగురూ ప్రతి ఒక్కరి కోసం పాటు పడనీ. ఓ ఉగాది మాతా... ఎవరైనా బాగుపడితే చూసి ఓర్చుకునే శక్తిని ఇవ్వు లేనివాడికి. ఎవరైనా నవ్వుతుంటే నవ్వే హృదయం ఇవ్వు లేనివాడికి. ఎవరైనా అందలం ఎక్కితే లాగాలనుకునేవాడి చేతులను పూచిక పుల్లలుగా మార్చెయ్. ఎవరికైనా కీడు చేయాలనుకునేవాడి మాడును రిపేర్ చేయి. అమ్మా కొత్త సంవత్సరమా... మా రొటీన్‌ని మాకు ప్రసాదించు చాలు. మా ఆరోగ్యాలను మాతోపాటు కాపాడు చాలు. మేము చేసుకునే ఉగాది పచ్చడికి వేక్సిన్ కంటే ఎక్కువ ప్రతాపాన్ని ఇవ్వు. చేదు వగరు ఉప్పు కారాలను సాలిడ్‌గా అనుభవించింది చాలు. ఈ సంవత్సరం తీపిమయమే చేయి అంతా. నీకు దండాలు. నీకు దస్కాలు. ముల్లు తిప్పి ఎల్లరులకు మేలు చేద్దువు రా. స్వస్థత నిండిన అంబరాన్ని పరువు. రా నువ్వు. మా ఆశలను నిలబెట్టుతూ. – సాక్షి ఫ్యామిలీ -
ప్రజలు నూరు శాతం సంతోషంగా ఉండాలి: చంద్రబాబు
ఉగాది పండుగ తెలుగువారి జీవితాల్లో ఉషస్సులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి ఆయన హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. తెలుగువారి మూల పురుషుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుగా చరిత్రకారులు చెబుతారని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలంతా నూరుశాతం సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంచాంగాల్లో శాస్త్రవేత్తలు పొందుపరిచిన వైజ్ఞానిక సూచనలను అనుసరించాలని చంద్రబాబు రైతులను కోరారు. జీవితం కూడా వసంత రుతువు లాంటిదేనని, చైతన్యంతో ఉండాలని సందేశమిచ్చే పండుగ ఉగాది అని ఆయన అన్నారు. -
సినిమా పచ్చడి