
మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ భవిష్యత్తులో మంచి జరగాలనే ఆకాంక్ష ఉంటుంది. కాని భవిష్యత్తు అనేది అనిశ్చితితో నిండి ఉంటుందన్న ఎరుక కూడా ఉంటుంది. అయితే ఒక ఆశ కావాలి కదా. ఆ ఆశను ఆధ్యాత్మిక రూపంలో గ్రహాలను ఊతంగా చేసుకుని సనాతనంగా వచ్చిన గ్రహ విజ్ఞానం ఆధారంగా నిలబెట్టేదే పంచాంగ దర్శనం. మంచిని వాగ్దానం చేస్తూ చెడును హెచ్చరిస్తూ సాగే పంచాంగంలో అనూహ్యమైనది ఏదీ కనిపించకపోయినా దానిని వినడం, చదవడం, పరికించడం ఆనవాయితీ. అయితే ఈసారి ‘సామాజిక పంచాంగం’ను వినిపించాలనుకుంది ‘సాక్షి’. ఆరు కీలక రంగాలు దేశంలో, స్థానికంగా ఎలా ఉంటాయో తెలియచేశారు పండితులు. అవధరించండి.
ప్రకృతికి ప్రణామం
మనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన....అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది‘ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.
ఉగాది సంప్రదాయాలు
ఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథం పేర్కొంటోంది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తాము పండించబోయే పంటకి ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ శ్రద్ధాభక్తులతో అడిగి తెలుసుకుంటారు.
ఉగాది పూజ
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈరోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అలాగే అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినడం వల్ల ఏడాదంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేలా చేస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది.
ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏమిటి?
నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అని పేరు. అంటే విశ్వ శ్రేయస్సు, విశ్వ సంపద అని అర్థం. ఇది అష్టవసువులలో ఒక వసువు పేరు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా... సంపద్వంతంగా ఉంటుందని ఆశిద్దాం...
కొత్తదనం... పచ్చదనం
ఉగాది అనగానే ఏదో తెలియని కొత్తదనం సుతిమెత్తగా మనసును తాకినట్టు అనిపిస్తుంది. పచ్చదనం మనసునిండా పరుచుకుంటుంది. మామిడిపళ్లు, మల్లెమొగ్గలు, తాటిముంజలు, పుచ్చకాయలు, కోయిల గానాలు మదిలో మెదులుతాయి. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నట్టుగా చెట్లు చిగిర్చి పూలు పూసే వసంత రుతువు ఇది. మనసును ఉల్లాసపరిచే కాలం ఇది. అందుకే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఉగాదిని, వసంత రుతువును విడిచిపెట్టలేదెప్పుడూ! ఉగాది కవి సమ్మేళనాలు, ఉగాది కథలు, కవితల పోటీలు, ఉగాది కార్టూన్లు కాగితం నిండా కళ్లు చేసుకుని తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి.
ఆర్థికంగా ముందుకు...
విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవడం చేత, రసాధిపతి శుక్రుడు అవడం చేత, నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుంది. తెలుగురాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ దేశాల్లో యుద్ధ భయం, యుద్ధ వాతావరణాలు ఉండి ఆర్థికపరంగా పశ్చిమ దేశాలకు అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాధిపతి రవి అవడం చేత పంటలకి క్రిమి కీటకాదుల వల్ల ముప్పు ఉంటుంది. రైతులకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు. ధనవంతులు అధిక ధనవంతులు అవుతారు. పెద్ద వ్యాపారస్తులు లాభాలు బాగా ఆర్జిస్తారు. చిన్న వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్థికంగా భారతదేశానికి శుభ ఫలితాలనూ, తూర్పు ప్రాంతాలకు, తూర్పు దేశాలకు అనగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అభివృద్ధిని సూచిస్తోంది.
ఆరోగ్యం ఫరవాలేదు...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో ఐదుగురు పాపులు, నలుగురు శుభులు ఉండడం చేత రాజు రవి, మంత్రి చంద్రుడు అవటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు. కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారి తీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే 6వ తేదీ వరకూ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కూటమి కావడం వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు. ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు.
– చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త
అనుబంధాలు జాగ్రత్త
ఈ ఏడాది పాలకుల మధ్య గాని కుటుంబ, వ్యక్తిగత అనుబంధాలుగానీ అంత బాగుంటాయని చెప్పలేం. అందువల్ల బంధుమిత్రుల ఇళ్లకు అతి ముఖ్యమైన పని మీద వెళ్లినా, ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా పని చూసుకుని రావడం మంచిది. అనుబంధాలు, మానవ సంబంధాలు బాగుండాలంటే తరచు మాట్లాడుకుంటూ ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా అంత బాగుండని బంధువుల మీద తెలిసీ తెలియక భారం వెయ్యకుండా వారికి మీ వల్ల చేతనైన సాయం చేయడం మంచిది. అనవసరమైన, చెయ్యలేని, చేతకాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక మాటలు పడి మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే బదులు చెయ్యగలదానిని మాత్రమే చెప్పడం, చెయ్యలేని వాటిని సున్నితంగా ముందే మా వల్ల కాదని చెప్పడం వల్ల స్నేహసంబంధాలు దెబ్బ తినకుండా ఉంటాయి. బంధువులు, మిత్రుల మధ్య అనుబంధాలు బాగుండాలంటే వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం మేలు.
– డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక వేత్త
ఆనందానికి లోటు లేదు
ఈ విశ్వావసు నామవత్సరంలో పేరులోనే విశ్వశాంతి గోచరిస్తోంది. క్రోధాలు, మోసాలు, ద్వేషాలు తొలగిపోయి ప్రజలంతా ఒక్కమాటగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వచ్చి ఆనందంలో తేలుతారు, సాహిత్య, సాంస్కృతిక పర్యాటక రంగాలలోని వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రజలంతా చేయీ చేయీ కలుపుకొని మాటా మాటా కలుపుకొని మనసులలోని శంకలు మాపుకొని ఒక్కతాటి మీద నడుస్తూ ఆనందంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం తక్కువ ఎక్కువలనూ పేదాగొ΄్పా తారతమ్యాలను విడనాడి, దేశంలోని అన్ని రంగాలలో సమన్వయం ఏర్పడి అందరూ కలసి కట్టుగా ప్రతి నిత్యం ఆనందంతో మునిగి తేలుతూ అంబరాలనంటేలా సంబరాలను జరుపుకుంటూ జీవిద్దాం.
– తాడిగడప సోదరులు: తాడిగడప సుబ్బారావు, తాడిగడప బాల మురళి భద్రిరాజు,శ్రీ వాగ్దేవి జ్యోతిష విద్యాలయం,పెద్దాపురం
అభివృద్ధికరంగా ఉంటుంది
శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం గ్రహాలలో అత్యధిక శాతం శుభులు ఉండడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సస్యవృద్ధి, పశుసంపదకు క్షేమం, ఆయురారోగ్యం కలుగుతుంది. రాజ్యాధిపతి అనుకూలుడుగా ఉండడంవల్ల దేశాధినేతలకు పాలకులకు శుభం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అతివృషి,్ట మరికొన్ని రాష్ట్రాలలో అనుకూల వృష్టి ఉండవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి. రసవస్తువుల ధరలు కొంత హెచ్చి తగ్గుతాయి. నీరస వస్తువులు ధరలు తగ్గి స్వల్పంగా హెచ్చుతాయి. పరిపాలకులు సంయమనంతో ఉంటారు. చేతివృత్తుల వారికి ఈ సంవత్సరం చేతి నిండా పని దొరుకుతుంది. దేశ రక్షణ బాధ్యతను వహించే సైనికులకు ఈ సంవత్సరం పరీక్షా సమయం అయినప్పటికీ విజయం సాధిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాలపై పాలకులు ్రపాధాన్యతను చూపుతారు. యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి
– ఓరుగంటి నాగరాజశర్మ, పుష్పగిరి పీఠ మహాసంస్థాన సిద్ధాంతి, జ్యోతిష విద్వాంసులు
ఆధ్యాత్మికం మిశ్రమం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి చేయూత, పండితులకు కొంత వరకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. గురుడు వర్ష జగ లగ్నంలో కేంద్ర గతులవడం వల్ల ధార్మిక ఆరాధనల్లో విస్తృతి పెరుగుతుంది. ముఖ్య దేవాలయాల్లో కొన్ని సంస్కరణల వల్ల హైందవ జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మతపరమైన విషయాల్లో స్వీయ మత ఎరుక పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షష్ఠగ్రహ కూటమి వల్ల బంద్‌లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల సమాజంలో కొంత భయం ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలుగవచ్చు. అలాగే మత్తు మందులు మారక ద్రవ్యాల వల్ల చెడుమార్గం పట్టే వారికి సంఖ్య పెరిగి వారికి ఆధ్యాత్మిక కట్టడి అవసరం అవుతుంది సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ధనవంతుల ఆర్థికసాయం లభించగలదు.
– చింతా గోపీశర్మ, సిద్ధాంతి
– డి.వి.ఆర్. భాస్కర్