వసంతమాసంలో వచ్చే ఉగాది మన తెలుగువాళ్ల కొత్త సంవత్సరం. ఆకులే కాదు, ఆశలూ చిగురించే కాలంలో వచ్చే పండుగ ఇది. వసంతానికీ కవిత్వానికీ అనాదిగా అవినాభావ బంధం ఉంది. ఉగాది అంటే ఆరు రుచుల ఉగాది పచ్చడిని ఆరగించడం; పంచాంగ శ్రవణం మాత్రమే కాదు, ఊరూరా కవిసమ్మేళనాల కోలాహలం కూడా! తెలుగు నేల మీదనే కాదు, తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉగాది పండుగ రోజున కవిసమ్మేళనాలు తప్పనిసరిగా జరుగుతాయి.
ప్రాచీన కావ్యాలలో రుతువర్ణన తప్పనిసరి అంశం. కవులు ఆరు రుతువులనూ వర్ణించినా, వాటిలో వసంత వర్ణనకే అమిత ప్రాధాన్యమిచ్చారు. ‘ఋతూనాం కుసుమాకరః’– అంటే, ‘రుతువు లలో వసంతాన్ని నేనే’ అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పుకొన్నాడు మరి! అలాంటప్పుడు భాగవతోత్తములైన ప్రాచీన కవివరేణ్యులు వసంత వర్ణనకు రవంత అమిత ప్రాధాన్య మివ్వడంలో వింతేముంటుంది?
‘కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసగం మా/ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచును ముదమ్మొనర వాచా/లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచు విన్చెననిశమ్ము సుమనోభా/రమ్ముల నశోక నికర మ్ములను చంపక చయమ్ములును కింశుక వనమ్ములున్ నొప్పెన్’ అంటూ ‘ఆంధ్ర మహాభారతము’ ఆదిపర్వంలో నన్నయ పుష్పవిలసిత వసంత శోభను వర్ణించాడు.
‘కీర ముహ సచ్ఛేహిం/ రేహఇ వసుహా పలాస కుసుమేహిం/ బుద్ధస్స చలణ వందణ/ పడి విహిం వ భిక్ఖు సంఘేహిం’ – అంటే, ‘భూమి మీద తిరుగాడే రామచిలుకల ముక్కుల్లాంటి మోదుగ పూలు బుద్ధుని పాదాలను తాకి ప్రణ మిల్లే బౌద్ధభిక్షువుల సంఘమా?’ అని హాలుడు తన ‘గాథా సప్తశతి’లో అబ్బురపడ్డాడు.
రుతువర్ణనలో అష్టదిగ్గజాలను తలదన్నే కవిదిగ్గజం ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు. ఆయన తన ‘ఆముక్త మాల్యద’లో చేసిన వసంత వర్ణనలో మీన మేషాలను లెక్కించాడు. ‘కినిసి వలఱేడు దండెత్త గేతు వగుట/ మీన మిల దోచుటుచితంబ మేష మేమి/పని యనగ నేల? విరహాఖ్యపాంథ యువతి/ దాహమున కగ్గి రాగ దత్తడియు రాదె?’ అని చమత్కరించాడు.
ఇందులోని చమ త్కారమేమిటంటే, కోపంతో మన్మథుడు దండెత్తగా చేప కనిపించడం సమంజసమే! ఎందుకంటే, మన్మథుడు మీనకేతనుడు. అలాంటప్పుడు అక్కడ మేకకు పనేమిటంటారా? విరహతాపంతో యువతులు దహించుకు పోతున్నప్పుడు అగ్ని వాహనమైన మేషం అక్కడ ఉండటమూ సమంజ సమే కదా! సౌరమానంలో మీన, మేష మాసాలు వసంత రుతువు. వసంతాగమనాన్ని ఇంత నర్మగర్భంగా వర్ణించడం రాయలవారికే చెల్లింది!
‘క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దారసోపగుం/భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస/న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె; ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా’ అని చేమకూర వేంకటకవి వాపోయాడు. వసంతుడు వచ్చి, చెట్లను చిగురింపజేసి, వాటిని ఫలపుష్పభరితం చేసి, ప్రకృతిని పులకింపజేశాడట.
అప్పుడు వసంతుడు చేసిన ఘనకార్యాన్ని పైనుంచి చూస్తున్న చంద్రుడు మెచ్చకపోగా, కినుక బూనాడు. వసంతుడిని మించి తన ఘనత చాటుకోవడానికి సుకుమారమైన వెన్నెల కురిపించి, రాళ్లను కరిగించేశాడట. అలాగే, ఎంత బాగా రాసినా సమకాలికులు మెచ్చరట! చేమకూర కవికే కాదు, ఈ బాధ ఇప్పటి కవులనూ పీడిస్తూనే ఉంది.
‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు’ అని కృష్ణశాస్త్రి వగచినంత మాత్రాన తెలుగు కవులకు ఉగాదులు లేకుండా పోలేదు. ఉగాది కవి సమ్మేళనాలు నేటికీ అట్టహాసంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగని ఉగాది కవి సమ్మేళనాలు ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్నాయనడానికి ఆధారాలేవీ లేవు.
మహా అయితే ఒకటి రెండు శతాబ్దాలుగా మొదలై ఉంటాయేమో! ప్రాచీన సాహిత్యంలో వసంత వర్ణన తప్ప ఉగాది వర్ణన ఎక్కడా కనిపించదు. ఒకప్పుడు కొన్ని పత్రికలు ఉగాది ప్రత్యేక సంచికలు విడుదల చేసేవి. ఆ కాలమంతా గత వసంత వైభవం.
కాల చక్రభ్రమణంలో రుతువులు వస్తుంటాయి, పోతుంటాయి. ఉగాదుల రాకతో లోకమంతా పచ్చగా మారిపోతుందనుకుంటే, అది భ్రమ మాత్రమే! ‘నీతి పథమునందు, నిత్య జీవితమందు/ మాటనిరుకునందు మార్పులేక/ కొత్తబట్ట గట్టు కొన్నంత నూత్నవ/ర్షంబు మహము సార్థకంబుగాదు’ అని జాషువా ఏనాడో నిష్ఠుర సత్యాన్ని పలికారు.
‘ఉగాది పాటకు ఒకటే పల్లవి/ బాధ బాధ బాధ అది/ జగాన మెసలే జనాల జీవిత/ గాథ గాథ గాథ’ అని నిర్మొహమాటంగా తేల్చేశాడు శ్రీశ్రీ. అంతేనా? ‘ఉగాది వచ్చింది/ అయినా/ శుభాది వచ్చిందీ?’ అని నిలదీశాడు కూడా!
ఏటా ఉగాది వస్తూనే ఉంటుంది. ఉగాది వేడుకలూ యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి. సామాన్యుల జీవితాల్లో పెనుమార్పులేవీ రాకపోయినా; రాజకీయ పంచాంగ శ్రవణాలొక వైపు, బహిరంగ వేదికల మీద అధికారిక, అనధికారిక కండువాల కవి సమ్మేళనాలింకొక వైపు కోలాహలంగా కొనసాగుతూనే ఉంటాయి.
ఒకే వేదిక మీదకు చేరిన కవుల్లో కొందరు ఉగాదిని రారమ్మని ఆహ్వానిస్తుంటారు. ఇంకొందరు రావద్దని బతిమాలుకుంటారు. ఉగాది పచ్చడిలోని చేదును మర పిస్తూ, ఈ తప్పనిసరి తతంగాలు జనాలకు ఉచిత వినోదాన్ని ఉదారంగా పంచిపెడుతూనే ఉంటాయి. పండగపూట ఆ మాత్రం వినోదమైనా లేకపోతే, బతుకులు మరీ చేదెక్కిపోవూ!
శుభాది కావాల్సిన ఉగాది
Published Mon, Mar 20 2023 12:21 AM | Last Updated on Mon, Mar 20 2023 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment