Ugadi Festival 2024: పండుగ వస్తోంది.. ఈ స్పెషల్‌ ఫుడ్స్‌తో గడపండిలా.. | Ugadi Festival: Special Dishes Preparation Methods | Sakshi
Sakshi News home page

Ugadi Festival 2024: పండుగ వస్తోంది.. ఈ స్పెషల్‌ ఫుడ్స్‌తో గడపండిలా..

Published Fri, Apr 5 2024 8:34 AM | Last Updated on Mon, Apr 8 2024 10:13 AM

Ugadi Festival: Special Dishes Preparation Methods - Sakshi

ఉగాది వస్తోంది.. క్రోధి నామంతో కొత్త ఏడాదిని తెస్తోంది. కొత్తబెల్లంతో ఉగాది పచ్చడి ఎలాగూ కలుపుకుంటాం. పండుగ రోజు పచ్చడి తర్వాత ఇంకా ఏమేమి తిందాం. కొబ్బరి పాల గారెలు.. మజ్జిగ వడలు చేసుకుందాం. మరికొంత సులువుగా ఓట్స్‌ స్మూతీ కూడా చేసుకుందాం.

ఓట్స్‌ స్వీట్‌ స్మూతీ..
కావలసినవి: ప్లెయిన్‌ సఫోలా ఓట్స్‌ – అరకప్పు; అరటిపండు – 1; బాదం పాలు – అరకప్పు; నీరు›– అర కప్పు; చక్కెర – పావు కప్పు.

తయారీ..

  • ఓట్స్‌ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఒక పాత్రలో బాదం పాలు, నీరు, అరటి పండు గుజ్జు, చక్కెర, ఓట్స్‌ పొడి వేసి బీటర్‌తో కలిపితే స్మూతీ రెడీ.
  • గ్లాసులో పోసుకుని తాగడానికి వీల్లేనంత చిక్కగా ఉంటే మరికొంత నీటిని చేర్చుకోవచ్చు.
  • స్మూతీని చల్లగా తాగాలనుకుంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి లేదా స్మూతీ కోసం వాడే నీటిని ముందుగా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరుచుకోవాలి.
  • బాదం పాలు రెడీమేడ్‌వి తీసుకోవచ్చు లేదా బాదం పప్పులు– నీటిని కలిపి మిక్సీ వేసి పాలను తయారు చేసుకోవాలి.
  • ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
     

పాల గారెలు..
కావలసినవి: మినప్పప్పు – పావు కేజీ; నూనె – వడలు వేయించడానికి తగినంత; కొబ్బరిపాలు – లీటరు; యాలకుల పొడి– అర టీ స్పూన్‌; ఉప్పు– చిటికెడు; బాదం పప్పు – 10 (నానబెట్టి పొట్టు తీసి తరగాలి); జీడిపప్పు – 20; కిస్‌మిస్‌– టేబుల్‌ స్పూన్‌; పిస్తా– టేబుల్‌ స్పూన్‌; నెయ్యి– టేబుల్‌ స్పూన్‌; బెల్లం లేదా చక్కెర – అర కేజీ.

తయారీ..

  • మినప్పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల సేపు మంచినీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని బీటర్‌ లేదా స్పూన్‌తో రెండు నిమిషాల పాటు చిలకాలి.
  • స్టవ్‌ మీద అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టి కొబ్బరి పాలు పోసి మరిగించాలి.
  • వేడెక్కుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలుపుతూ మరిగించాలి.
  • చిక్కబడేటప్పుడు యాలకుల పొడి వేసి మరో నిమిషం పాటు మరిగించి దించేయాలి.
  • ఇప్పుడు స్టవ్‌ మీద చిన్న బాణలి పెట్టి నెయ్యి వేడి చేసి అందులో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి కొబ్బరి పాలు బెల్లం మిశ్రమంలో కలపాలి.
  • బాణలిలో నూనె వేడి చేసి అందులో మినపపిండిని పాలిథిన్‌ పేపర్‌ మీద వేసి వత్తి (నిమ్మకాయంత గోళీలుగా కూడా వేసుకోవచ్చు) నూనెలో వేయాలి.
  • రెండువైపులా కాలనిచ్చి తీసి టిష్యూపేపర్‌ మీద వేయాలి.
  • అదనంగా ఉన్న నూనెను పేపర్‌ పీల్చుకున్న వెంటనే (వేడిగా ఉండగానే) వడలను ఒక వెడల్పు పాత్రలో పరిచినట్లు అమర్చి కొబ్బరిపాల మిశ్రమాన్ని పోయాలి.
  • వడలు ఐదు నిమిషాల్లో కొబ్బరి పాలను పీల్చుకుంటాయి.
  • వడలు పీల్చుకున్న తర్వాత కూడా పాలు ఇంకా మిగులుగా ఉండాలి.
  • సర్వ్‌ చేసేటప్పుడు కప్పులో ఒక వడ ఒక గరిటె కొబ్బరి పాలు వేసి ఇవ్వాలి.

ఉగాది పచ్చడి..
కావలసినవి: మామిడి పిందె – ఒకటి; వేప పువ్వు – టేబుల్‌ స్పూన్‌; బెల్లం పొడి– టేబుల్‌ స్పూన్‌; చింతకాయ – ఒకటి (లేకపోతే కొత్త చింతపండు చిన్న గోళీ అంత); ఉప్పు – చిటికెడు; పచ్చిమిర్చి – ఒకటి (తరగాలి).

తయారీ..

  • వేప పువ్వును తొడిమలు, ఈనెలూ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
  • చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి.
  • మామిడికాయను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా సన్నగా తరగాలి.
  • ఒక పాత్రలో బెల్లం పొడి, చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలిపితే ఉగాది పచ్చడి రెడీ.

గమనిక: ఇష్టమైతే చెరుకు ముక్కలు, రుచి కోసం అరటిపండు గుజ్జు కలుపుకోవచ్చు. 

మజ్జిగ వడ..
కావలసినవి: అటుకులు – కప్పు; రవ్వ – పావు కప్పు; మజ్జిగ– అర కప్పు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); అల్లం తరుగు – టేబుల్‌ స్పూన్‌; నువ్వులు – టీ స్పూన్‌; కరివేపాకు – రెండు రెమ్మలు (తరగాలి); కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌; జీలకర్ర – అర టీ స్పూన్‌; బియ్యప్పిండి లేదా ఓట్స్‌ – టేబుల్‌ స్పూన్‌; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు; కొబ్బరి తురుము – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; పచ్చి శనగపప్పు– టేబుల్‌ స్పూన్‌;  నూనె– వేయించడానికి తగినంత.

తయారీ..

  • అటుకులను వెడల్పు పాత్రలో వేసి నీటిని పోసి కడిగి వేరొక పాత్రలోకి తీసుకోవాలి.
  • అటుకులను నీటి నుంచి వేరు చేయడానికి నీటిని వంపకూడదు.
  • నీటిలో తేలుతున్న అటుకులను చేత్తో తీసి మరొక పాత్రలో వేసుకోవాలి.
  • ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఇసుక ఉంటే నీటి అడుగుకు వెళ్లిపోతుంది. అటుకులు శుభ్రంగా ఉంటాయి.
  • పచ్చి శనగపప్పు కడిగి అటుకుల్లో వేయాలి.
  • అందులో రవ్వ, ఉప్పు, మజ్జిగ వేసి కలిపి ఇరవై నిమిషాల సేపు నాననివ్వాలి.
  • ఇప్పుడు నానిన అటుకుల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి తురుము, నువ్వులు, బియ్యప్పిండి వేసి కలిపి పది నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని వడకు సరిపోయేటట్లు ఉందా లేదా అని సరి చూసుకోవాలి.
  • మరీ జారుడుగా ఉంటే మరికొంత బియ్యప్పిండి కలుపుకుని పిండి అంతటినీ పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసి పక్కన పెట్టాలి.
  • బాణలిలో నూనె వేడి చేసి అటుకుల గోళీని వత్తి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీయాలి.
  • ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. వేడి వేడి వడల్లోకి పుదీనా చట్నీ రుచిగా ఉంటుంది.

ఇవి చదవండి: వేసవి తాపాన్ని తగ్గించడంలో మేటి ఈ పప్పు! ఎన్ని ప్రయోజనాలంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement