ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి! | Sakshi Special Story UGADI About Telugu New Year Plavanama | Sakshi
Sakshi News home page

శుభప్లవమ్: ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!‌

Published Tue, Apr 13 2021 5:00 AM | Last Updated on Tue, Apr 13 2021 12:15 PM

Sakshi Special Story UGADI About Telugu New Year Plavanama

ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం.

అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు.
 
ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది.

ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం.

ఉగాది పంచాంగ శ్రవణం
రోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది.

 పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు.

ఎలా జరుపుకోవాలి?
తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.

తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి.

నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి.
అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి
శతాయుర్‌ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం
అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి.

కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.

దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే !
నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !!
నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!!
అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది.

ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి.

బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ  ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే!

ప్లవ అంటే...
ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలకూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ఆ పేర్లు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాన్ని అన్యాపదేశంగా చెబుతుంటాయి. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టే కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలలో చీకటిని నింపిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది.

నేడు మనం అడుగు పెడుతున్న సంవత్సరం ప్లవ. అంటే తెప్ప లేదా చిన్న నావ అని అర్థం. అలాగే దాటించే సాధనమనీ, తేలికగా ఉండేదనీ, నీటి వనరులు సమృద్ధిగా లభించేదనీ... రకరకాల అర్థాలున్నాయి. మనం మాత్రం ఈ సంవత్సరం నీటివనరులు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలనీ, కష్టాల నుంచి తేలికగా అందరినీ ఒడ్డుకు చేర్చాలనీ అర్థాలు తీసుకుందాం. అందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం గడిచిపోవాలని కోరుకుందాం.

పండగ వేళ...
తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం..
ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు..
ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది...
ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే..
ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి..
గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్‌ఈడి బల్బులతో అలంకరిస్తే సరి.

సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది.

ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్‌ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు.

ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు.

పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement