panchanga sravanam
-
కేసీఆర్‌కు రాజయోగమే
సాక్షి, హైదరాబాద్: ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జన్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని శృంగేరీ ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి తెలిపారు. ‘రాహులో రవి అంతర్దశ ఫిబ్రవరి 27తో ముగిసింది. అనుకూలం కాని సమయం ముగిసిపోయింది. ఇక గుహ నుంచి బయటకు వచ్చుడే తర్వాయి అన్నట్టుగా ఉంటుంది. జాతక బలం గతేడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంది. శని గోచారం వల్ల ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా వారికి ఏమాత్రం సందివ్వకుండా వారినే ఆక్రమించేలా ముందుకు సాగుతారు. దేశం మొత్తం కూడా దృష్టి సారించదగ్గ సాహసోపేత నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటారు. విశ్వరూపమే చూపిస్తారు..’అని చెప్పారు. ఈ ఏడాది కరోనా భయం ఉండదని, శుభకృత్ నామ సంవత్సరంలో మానవాళి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. శుభకృత్ నామ ఉగాది సందర్భంగా శనివారం ప్రగతి భవన్లో ప్రభుత్వపరంగా నిర్వహించిన వేడుకల్లో బాచంపల్లి పంచాంగాన్ని పఠించి వివరించారు. అద్భుత పాలన చూస్తాం ‘తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మందీ మార్బలం, వాగ్ధాటి ఉన్నవారిదే ఇక హవా. జాతక రీత్యా పంటలతో పాటు తెలంగాణలో అద్భుత పాలనను మనం ఈ సంవత్సరం చూస్తాం. దేశం దృష్టి తెలంగాణపై పడేలా రాష్ట్రం పురోగమిస్తుంది. చక్కటి పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజింపజేస్తారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ రూపంలో మూడో కన్ను ఉంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూనే ఉంటారు. పార్టీలు మారే వారికి గడ్డుకాలం..’అని చెప్పారు. మంచి వానలు, పంటలతో రైతు రాజ్యం ‘మంచి వానలు, మంచి పంటలతో రైతు రాజ్యం వెల్లివిరుస్తుంది. కర్షక ప్రజాస్వామ్యం కోరుకుంటున్నందున, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణలో రైతులే రాజులు కానున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు వానలకు ఇబ్బంది లేనట్టే ఈ యేడు కూడా మంచి వానలు కురుస్తాయి. వరి, గోధుమలు, వేరుశనగలు, ధనియాలు, జొన్న, రబీ పంటలు అద్భుతంగా పండుతాయి. మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, ఇతర పప్పు ధాన్యాలు లాంటి పంటలకు కొంత ఇబ్బంది తప్పదు. శ్రావణ, భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..’అని బాచంపల్లి తెలిపారు. మహిళకు దేశంలో అత్యున్నత పదవి ‘విద్యారంగంలో సంస్కరణలు, కొత్త విధివిధానాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేరబోతున్నాయి. దీన్ని ఉద్యోగనామ సంవత్సరంగా భావించొచ్చు. దేశంలో అత్యున్నత పదవి మహిళకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరుడి ప్రభ వెలగబోనుంది. ప్రజలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే ఉత్సవాలతో సంవత్సరం గడుస్తుంది. ఆన్లైన్ క్లాసులుండవు, బడి గంటలే వినిపిస్తాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు, మాస్కుల అవసరం ఉండదు. ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చు..’అని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంత పెరుగుతాయి. రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఏప్రిల్, మేలలో ముఖ్యనేతలకు భద్రతాపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మత ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్‌తో దౌత్యపరమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుండగా, మిగతా ప్రాంతాల్లో అనుకూలంగా ఉండదు. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ మీదే ఉంటుంది..’అని వివరించారు. -
పిల్లలతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్ట్
-
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
సకల శుభారంభం
చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పర్వదినం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. కాలగమన సౌ«ధానికి తొలి వాకిలి. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించుకుంటుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే నిన్నటి వరకు ఉన్న ప్లవనామ సంవత్సరం నుంచి నేటితో శుభకృతు నామ సంవత్సర ఉగాదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతతోపాటు ఈ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం... చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు – ఇలా అంతా ఫలవంతంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంతఋతువు నుంచి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. ఎలా జరుపుకోవాలి? ఉగాది పండుగ జరుపుకునే విధానాన్ని అత్యంత ప్రామాణిక గ్రంథమైన ‘ధర్మసింధు’’పంచవిధుల సమన్వితం’గా సూచిస్తోంది. అవి 1. తైలాభ్యంగనం, 2. నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), ç5. పంచాంగ శ్రవణం... తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే తల మొదలుకొని ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి తలస్నానం చేయడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను నివసిస్తారని, అందుకే నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన వారికి లక్ష్మి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం దీపధూపాది పూజాదికాలు చేసిన తర్వాత మామిడి ఆకులతో, పూలతోరణాలతో అలంకరించిన పూజామందిరంలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి. ఉగాడి పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ సేవించాలి. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంతో ఉంటుందని చెబుతారు. పురాణ కాలం నుంచి... చారిత్రకాల వరకు... ► అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్సా్యవతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. ► బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించింది ఉగాదినాడే. ► ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. ► వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చింది ఈనాడే. ► వసు చక్రవర్తి తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్త్యం. ► చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. అదేవిధంగా మరో శకకారుడైన శాలివాహన శకం కూడా ఉగాదిరోజునే ఆరంభమైంది. వీరిద్దరినీ ఉగాదిరోజున స్మరించుకోవడం ఆచారం. ► చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది. పంచాంగ శ్రవణం ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి గంగాస్నాన ఫలితం లభిస్తుందని పురాణోక్తి. ఏమిటీ పంచాంగం? మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాలలో తాము జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. పంచాంగంలో ఏముంటుంది? నిత్య వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ... శుభకార్యాలు, పూజాపురస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి ‘పంచాంగం’ చూడటమే ఆచారం. ఇది మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ‘పంచాంగం’ అంటే... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం. పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు, బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కర ణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం. ‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము . ఇప్పుడంటే పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కానీ ఇంతకుమునుపు ఇలా దొరికేవి కాదు. తాళపత్రాల మీద రాసినవి మాత్రమే... అదీ కొందరు పండితులవద్ద మాత్రమే ఉండేవి కాబట్టి వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పం చాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏయే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది మన దేశమంతటికీ శుభాలను చేకూరుస్తుందనీ, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదనీ ఆకాంక్షిద్దాం. – డి.వి.ఆర్. -
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ ఫోటోలు
-
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. తెలుగు ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేద పండితులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని సీఎం వైఎస్ జగన్ తపన పడుతున్నారని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!
ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం. అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఉగాది పంచాంగ శ్రవణం రోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ఎలా జరుపుకోవాలి? తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి. నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి. అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి. కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే ! నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !! నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది. ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి. బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే! ప్లవ అంటే... ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలకూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ఆ పేర్లు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాన్ని అన్యాపదేశంగా చెబుతుంటాయి. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టే కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలలో చీకటిని నింపిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. నేడు మనం అడుగు పెడుతున్న సంవత్సరం ప్లవ. అంటే తెప్ప లేదా చిన్న నావ అని అర్థం. అలాగే దాటించే సాధనమనీ, తేలికగా ఉండేదనీ, నీటి వనరులు సమృద్ధిగా లభించేదనీ... రకరకాల అర్థాలున్నాయి. మనం మాత్రం ఈ సంవత్సరం నీటివనరులు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలనీ, కష్టాల నుంచి తేలికగా అందరినీ ఒడ్డుకు చేర్చాలనీ అర్థాలు తీసుకుందాం. అందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం గడిచిపోవాలని కోరుకుందాం. పండగ వేళ... తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు.. ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది... ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే.. ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి.. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్ఈడి బల్బులతో అలంకరిస్తే సరి. సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది. ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు. ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు. పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది. – డి.వి.ఆర్. భాస్కర్ -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
-
‘వైఎస్ జగన్‌కు అధికార యోగం ఖాయం’
సాక్షి, గుంటూరు : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ అన్నారు. వికారి నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు, పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రహబలం బాగుందని, విశేష ప్రజాదరణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం, అధికారం పార్టీల మధ్య పోరు ఉన్నప్పటికీ ప్రతిపక్షానికే అధికార యోగం సిద్ధిస్తుందని చెప్పారు. వైస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు. ఆయన చెప్పిన పంచాంగంలోని ముఖ్యాంశాలు.. వర్షాలు సకాలంలో బాగా కురుస్తాయి. రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఆహార వ్యవహారాలు, వ్యవసాయం, వ్యాపారాలు సమృద్ధిగా ఉంటాయి. మూతపడ్డ చెరకు ఫ్యాక్టరీలు తెరుచుకునే అవకాశం ఉంది వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది దేశంలో శాంతి భద్రతలు పదిలంగా ఉంటాయి సిమెంట్, ఐరన్ ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ చాలా బాగుంటాయి. గాయనీగాయలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారు. వైఎస్ జగన్ సమర్ధవంతమైన పాలన సాగించగలుగుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
18న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి, పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదిస్తారు. అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయిస్తారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపిస్తారు. ఈ ఉగాది ఆస్థానం నేపథ్యంలో 18వ తేదీ నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. 14న అన్నమయ్య 515వ వర్ధంతి ఉత్సవం.. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 515వ వర్ధంతి మహోత్సవాన్ని ఈనెల 14వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఇక్కడి నారాయణగిరి ఉద్యానవనంలో ఉత్సవమూర్తులు వేంచేపు చేసి, సాయంత్రం 6.00 గంటల నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టిగానం నిర్వహించనున్నారు. -
ఉత్తమ్‌కు మంచి యోగం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే జనవరి 26వ తేదీ నుంచి టీపీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి యోగం బాగా ఉందని చిలుకూరి శ్రీనివాసమూర్తి తమ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు ప్రకారం వృషభరాశి అని పటిష్ట నాయకత్వం తో పార్టీని ముందుకు తీసుకెళతారని అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు యోగం 50, 50 శాతంగా ఉందని చెప్పారు. మంత్రులు పరిపాలనా సామర్థ్యం ప్రదర్శించలేరని, రాష్ట్రంలో రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయని పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్ లో జరిగిన హేవళంబి ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. తెలంగాణ అభివృద్ధిపథంలో ప్రయాణిస్తుందని, చెరువుల నిండుగా వర్షాలు పడతాయని, పాడి పంటలు పుష్కలంగా ఉంటాయని, నిత్యా వసరాల ధరలు తగ్గుతాయని అన్నారు. 2019 మార్చి లోపు చైనా, పాకిస్తాన్లతో యుద్ధవాతావరణం నెలకొంటుందని, ప్రధాని మోదీకి ఏలిన నాటి శని వల్ల చెడ్డపేరు వస్తుందని చెప్పారు. చలన చిత్ర, నాటకరంగంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని, మహిళలపై అత్యాచారాలు పెరుగుతాయన్నారు. అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని దేవుడిని ప్రార్థించానని ఉత్తమ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, దానం నాగేందర్, డి.శ్రీధర్‌బాబు, డాక్టర్ మల్లు రవి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాదర్‌లింగ స్వామి దర్గాలో ఉగాది వేడుకలు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి దర్గాలో బుధవారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా.. గ్రామంలో ఉన్న బ్రహ్మణులు ముందుగా దర్గాలో వెళ్లి ప్రత్యేక పూజలు చేసి ఆతరువాత పంచాంగం శ్రవణం చేస్తారు. ఈ సంప్రదాయం 350 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 8గంటలకు గ్రామ పూరోహితులు కిష్టచారి..దర్గాలో పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేయగా.. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహె బ్పీర్ హుసేని చిష్తీ, భక్తులు, కౌతాళం హిందూ, ముస్లిం సోదరులు శ్రద్ధగా విన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ఎర్ర ధాన్యాన్నికి మంచి ధర ఉంటుందని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. మకర, కర్కాటక, సింహ, తుల, వృషభ, కుంభ రాశుల వారికి బాగుంటుందని తెలిపారు. గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నజీర్హమ్మద్, ఖాదర్‌లింగ స్వామి శిష్యులు పాల్గొన్నారు.