ఉత్తమ్‌కు మంచి యోగం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే జనవరి 26వ తేదీ నుంచి టీపీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి యోగం బాగా ఉందని చిలుకూరి శ్రీనివాసమూర్తి తమ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు ప్రకారం వృషభరాశి అని పటిష్ట నాయకత్వం తో పార్టీని ముందుకు తీసుకెళతారని అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు యోగం 50, 50 శాతంగా ఉందని చెప్పారు. మంత్రులు పరిపాలనా సామర్థ్యం ప్రదర్శించలేరని, రాష్ట్రంలో రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయని పేర్కొన్నారు.
బుధవారం ఇక్కడ గాంధీభవన్ లో జరిగిన హేవళంబి ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. తెలంగాణ అభివృద్ధిపథంలో ప్రయాణిస్తుందని, చెరువుల నిండుగా వర్షాలు పడతాయని, పాడి పంటలు పుష్కలంగా ఉంటాయని, నిత్యా వసరాల ధరలు తగ్గుతాయని అన్నారు. 2019 మార్చి లోపు చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధవాతావరణం నెలకొంటుందని, ప్రధాని మోదీకి ఏలిన నాటి శని వల్ల చెడ్డపేరు వస్తుందని చెప్పారు.
చలన చిత్ర, నాటకరంగంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని, మహిళలపై అత్యాచారాలు పెరుగుతాయన్నారు. అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని దేవుడిని ప్రార్థించానని ఉత్తమ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, దానం నాగేందర్, డి.శ్రీధర్‌బాబు, డాక్టర్ మల్లు రవి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.