ప్రగతి భవన్‌లో బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి పంచాగ పఠనం వింటున్న సీఎం కేసీఆర్. చిత్రంలో పోచారం, కె.కేశవరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల, జగదీశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జన్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని శృంగేరీ ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి తెలిపారు. ‘రాహులో రవి అంతర్దశ ఫిబ్రవరి 27తో ముగిసింది. అనుకూలం కాని సమయం ముగిసిపోయింది. ఇక గుహ నుంచి బయటకు వచ్చుడే తర్వాయి అన్నట్టుగా ఉంటుంది. జాతక బలం గతేడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంది.
శని గోచారం వల్ల ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా వారికి ఏమాత్రం సందివ్వకుండా వారినే ఆక్రమించేలా ముందుకు సాగుతారు. దేశం మొత్తం కూడా దృష్టి సారించదగ్గ సాహసోపేత నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటారు. విశ్వరూపమే చూపిస్తారు..’అని చెప్పారు. ఈ ఏడాది కరోనా భయం ఉండదని, శుభకృత్ నామ సంవత్సరంలో మానవాళి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. శుభకృత్ నామ ఉగాది సందర్భంగా శనివారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వపరంగా నిర్వహించిన వేడుకల్లో బాచంపల్లి పంచాంగాన్ని పఠించి వివరించారు.
అద్భుత పాలన చూస్తాం
‘తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మందీ మార్బలం, వాగ్ధాటి ఉన్నవారిదే ఇక హవా. జాతక రీత్యా పంటలతో పాటు తెలంగాణలో అద్భుత పాలనను మనం ఈ సంవత్సరం చూస్తాం. దేశం దృష్టి తెలంగాణపై పడేలా రాష్ట్రం పురోగమిస్తుంది. చక్కటి పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజింపజేస్తారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ రూపంలో మూడో కన్ను ఉంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూనే ఉంటారు. పార్టీలు మారే వారికి గడ్డుకాలం..’అని చెప్పారు.
మంచి వానలు, పంటలతో రైతు రాజ్యం
‘మంచి వానలు, మంచి పంటలతో రైతు రాజ్యం వెల్లివిరుస్తుంది. కర్షక ప్రజాస్వామ్యం కోరుకుంటున్నందున, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణలో రైతులే రాజులు కానున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు వానలకు ఇబ్బంది లేనట్టే ఈ యేడు కూడా మంచి వానలు కురుస్తాయి. వరి, గోధుమలు, వేరుశనగలు, ధనియాలు, జొన్న, రబీ పంటలు అద్భుతంగా పండుతాయి. మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, ఇతర పప్పు ధాన్యాలు లాంటి పంటలకు కొంత ఇబ్బంది తప్పదు. శ్రావణ, భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..’అని బాచంపల్లి తెలిపారు.
మహిళకు దేశంలో అత్యున్నత పదవి
‘విద్యారంగంలో సంస్కరణలు, కొత్త విధివిధానాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేరబోతున్నాయి. దీన్ని ఉద్యోగనామ సంవత్సరంగా భావించొచ్చు. దేశంలో అత్యున్నత పదవి మహిళకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరుడి ప్రభ వెలగబోనుంది. ప్రజలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే ఉత్సవాలతో సంవత్సరం గడుస్తుంది. ఆన్‌లైన్ క్లాసులుండవు, బడి గంటలే వినిపిస్తాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు, మాస్కుల అవసరం ఉండదు. ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చు..’అని చెప్పారు.
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.
‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంత పెరుగుతాయి. రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఏప్రిల్, మేలలో ముఖ్యనేతలకు భద్రతాపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మత ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్‌తో దౌత్యపరమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుండగా, మిగతా ప్రాంతాల్లో అనుకూలంగా ఉండదు. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ మీదే ఉంటుంది..’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment