శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో పంచాంగాన్ని ఆసక్తిగా చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
విద్య, విద్యుత్తు, విద్వత్తు, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం.. ఇలా చదివితే చాంతాడంత లిస్టు అయ్యేన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా.. తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు కలిసిరావటం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది.
ప్రజల అండ, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలగటం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. మనకు జాతి, కులం, మతం భేదం లేదు. తెలంగాణ జాతి అంతా ఒకటే. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. మన బంగారు తెలంగాణ స్వప్నం నిజం కావాలి. – సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం సాధించనంత అద్భుత ఫలితాలు ఎన్నిం టినో తెలంగాణ సాధించి చూపిందని సీఎం కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కరెంటు కష్టాలు, తాగునీరు, సాగునీటి వసతి.. తదితరాలపై ఎన్నో సందేహాలు, అనుమానాలు రేకెత్తించారన్నారు. వాటన్నింటినీ అధిగమించి తెలంగాణ దేశంలోనే వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లాంటి రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉండి అభివృద్ధి దిశలో పరుగుపెడుతోందన్నారు. కుల, మత, వర్గ భేదాలకతీతంగా, అన్ని వర్గాల సహకారంతో తెలం గాణ గొప్పగా రాణిస్తోందని, ఎలాంటి పథకంలోనైనా యావత్తు దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన స్థితికి చేరిందని చెప్పారు.
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి పంచాంగాన్ని పఠించారు. అనంతరం సీఎం యావత్తు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగానికి ఉపక్రమించగానే ‘లాంగ్‌లివ్ కేసీఆర్’ అంటూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
సమైక్య రాష్ట్రాన్ని మించి ఆదాయం
‘పంచాంగ పఠనం సందర్భంలో పౌరాణికులు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఇక మాస్కుల్లేవు, ఆర్టీపీసీఆర్ లేదు, పీసీఆర్ లేదు.. వాటి గొడవే లేదంటూ శుభం పలికారు. చాలా సంతోషం. సర్వజనులకు శుభకృత్ నామ సంవత్సరంలో సుఖ శాంతి ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. అపోహలు, అనుమానాలు, అసహాయతలు, నిస్సహాయతలు, ఔతుందా కాదా అన్న సందిగ్ధం, చర్చోప చర్చల మధ్య 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందున్నాం. గత ఏడాది రాష్ట్రం రూ.1,77,630 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టుగా రిజర్వు బ్యాంకు తేల్చిందని అధికారులు చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని మనం ఎప్పుడో దాటిపోయామని, అంతకుమించిన ఆదాయాన్ని సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావడం వల్లే ఈ విధంగా ఎంతో సంపద సృష్టించాం.
ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి పరిశీలించినా ఎకరం రూ.25 లక్షలు, రూ.30 లక్షల లోపు లేదు. మరి ఈ సంపద ఎలా సృష్టించగలిగాం. ఇది ఒక్క అధికారుల ఘనతే కాదు, అనేక అంశాలు కలిసి రావటంతోనే ఇది సాధ్యమైంది..’అని కేసీఆర్ చెప్పారు.
దళిత బంధుతో అద్భుతాలు
‘దళితుల జీవితాలు మార్చేందుకు తెచ్చిన దళిత బంధు అద్భుతాలు ఆవిష్కరించబోతోంది. దళిత జాతి వజ్రాలు అద్భుత ఫలితాలు సాధించబోతున్నారు. దేశానికే కొత్త మార్గనిర్దేశం ఇచ్చే దిశగా తెలంగాణ నిలవబోతోందని శుభకృత్ సంవత్సరం తొలిరోజు నేను సంకల్పిస్తున్నాను. ఎన్నికల కోసం, రాజకీయ స్టంట్ల కోసం కాకుండా ఈ విషయంలో ఎవరూ చేయని సాహసాన్ని మనస్ఫూర్తిగా చేశాను. దళితుల సంక్షేమం విషయంలో ఇప్పుడు యావత్తు దేశం తెలంగాణ నుంచే నేర్చుకునే పరిస్థితి కల్పించాం. ఇదొక్కటే కాదు.. ఏ పథకం అయినా దేశం మొత్తం తెలంగాణ నుంచే నేర్చుకునేలా చేశాం..’అని అన్నారు.
అన్ని వర్గాల సమున్నతికి కృషి
‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్ ఏనాడూ రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. తాజా బడ్జెట్‌ను మనం రూ.రెండున్నర లక్షల కోట్లుగా పెట్టుకున్నాం. 95 శాతం ఉద్యోగాలు మనకే వచ్చేలా కొత్త విధానాన్ని ఇటీవలే ఆవిష్కరించుకున్నాం. వివక్ష లేకుండా అన్ని వర్గాల సమున్నతి కోసం యత్నిస్తున్నాం. అద్భుత, అపురూప, ఆర్థిక సౌష్టవంతో, సంస్కారంతో, సర్వమత సామరస్యంతో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది.
దీనికి ఎక్కడా అపశృతి రాకుండా ఇంకా గొప్పగా, ఉజ్వలంగా దేశానికే అన్నంపెట్టే విధంగా ముందుకు సాగాలని, తెలంగాణ రైతుల కష్టం ఫలించాలని, అద్భుతంగా పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మన సామూహిక స్వప్నం బంగారు తెలంగాణ నిజం కావాలని కోరుకుంటున్నా..’అని సీఎం చెప్పారు.
బ్రాహ్మణులకు సత్కారాలు, వసతులు
‘బ్రాహ్మణులు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారి స్థాయికి తగ్గట్టు సత్కారాలు, వసతులు తెలంగాణలో పొందుతున్నారని కాలర్ ఎగరేసి చెప్పగలను. బంజారాహిల్స్‌లో కట్టిన బ్రాహ్మణ సదనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ దేనికీ తీసిపోదు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దాం. సర్వజనుల సంక్షేమం కోసం పరితప్పిస్తున్న మనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి అభ్యుదయం మనందరి అభిమతం అయ్యేలా ఆశీర్వదించాలని దేవదేవుడిని కోరుకుంటున్నా..’అని కేసీఆర్ తెలిపారు.
పంచాంగం ఆవిష్కరణ
కాగా కృష్ణమాచార్య రూపొందించిన పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. వారిని ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment