సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్యనేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లింది. కామారెడ్డి నుంచి బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టిసారించింది.
ఈ నెల 7వ తేదీన ప్రగతిభవన్‌లో కామారెడ్డి బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో.. ఈ చర్చల ద్వారా క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే.. నియోజకవర్గ అభివృద్ధిపైనా ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా కామారెడ్డిలో పర్యటించడం.. బహిరంగ సభ, ర్యాలీలు తదితర అంశాలపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పోటీని సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బీజేపీ తరపున ఎంపీ అర్వింద్ బరిలోకి దిగొచ్చనే ప్రచారం నడుస్తోంది.
కామారెడ్డి ప్రజల నినాదాలు
కామారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు ఇప్పటికే కేసీఆర్‌ను గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. సీఎం కేసీఆర్ వస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని ఆ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నారు.హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన కామారెడ్డి ప్రజలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున కేసీఆర్ ముందు నినాదాలు చేశారు.'కేసీఆర్ జిందాబాద్, జై కేసీఆర్', 'సీఎం కేసీఆర్ రావాలి' 'స్వాగతం కామారెడ్డికి స్వాగతం' 'కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి' 'జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్' వంటి నినాదాలతో ఆ వివాహ ప్రాంగణం దద్దరిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment