Kamareddy Assembly Constituency
-
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్‌రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్‌కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
కామారెడ్డి రూపురేఖలు మారుస్తా: కేసీఆర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి గడ్డతో పుట్టుక నుంచే తనకు సంబంధం ఉందని, తన కన్నతల్లి పుట్టింది ఇక్కడి ఊరిలోనేనని.. తన బాల్యం కూడా ఇక్కడ గడిచిందని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజులపాటు ఇక్కడ జలసౌధ ఉద్యమం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. గురువారం కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం.. ఆయన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. కామారెడ్డిని జిల్లా చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అది చేసి చూపించాం. మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. నిజామాబాద్, కామారెడ్డి బీఆర్ఎస్ నేతలతో పాటు ఇక్కడి ఎమ్మెల్యే గంపా గోవర్థన్‌రెడ్డి చాలాసార్లు తనను కోరడంతోనే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారాయన. ‘‘కేసీఆర్ కామారెడ్డి వస్తున్నాడంటే ఒక్కడే రాడు. కేసీఆర్ వెంబడి చాలా వస్తాయి. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కామారెడ్డి పల్లెల రూపు రేఖలు మార్చే బాధ్యత నాది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం. దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది?. మన నెత్తిన సమస్యల్ని పెట్టింది. నెహ్రూనే దళితబంధు పెట్టి ఉంటే.. ఇప్పుడు ఈ స్థితి ఉండేది కాదు కదా. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా? ఒక్కపూట వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ.. ధరణిని తీసేస్తాడట. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు. కానీ, తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ కావాలా? 3 గంటల కరెంట్ కావాలా?(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..). ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వని బీజేపీకి.. ఒక్క ఓటు ఎందుకు వేయాలి? అని అన్నారాయన. అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికులు అందరికీ పెన్షన్ ఇస్తామని ఈ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టింది. తమాషా కోసం ఓటు వేయొద్దు. బాగా ఆలోచించుకుని ఓటు వేయాలి. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాన్ని మరిచిపోవద్దు’’అని కేసీఆర్ కామారెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
సెంటు భూమి లేదు! కేసీఆర్ అఫిడవిట్లో ఇంకా ఏముందంటే..
సాక్షి, సిద్ధిపేట/కామారెడ్డి: భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ నామినేషన్లు వేశారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నాం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత.. గజ్వేల్‌లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఆపై విశ్రాంతి తీసుకుని హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ తొలుత బీఆర్ఎస్ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆపై కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ. 2లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ పేర్లపై బ్యాంక్‌లలో డిపాజిట్లు అయిన నగదు రూ. 17కోట్లకు పైగా ఉంది. కేసీఆర్ పేరు మీద మొత్తం తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్, శోభమ్మకు మూడు అకౌంట్స్ ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్ అయ్యాయి. 2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి రూ.5.63 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడది మరో 11.16 కోట్లకు పెరిగింది. కేసీఆర్ సతీమణి శోభ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.6.29 కోట్లకు చేరింది. బంగారు ఆభరణాలు 2.8 కేజీలు(రూ. 17లక్షలు విలువచేసే) ఉన్నట్లు తాజా అఫిడవిట్లో వెల్లడి. గత పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని అఫిడేవిట్‌లో చూపించారు కేసీఆర్. స్థిర ఆస్తుల రూపంలో రూ. 17.83 కోట్లు, చరాస్తుల రూపంలో రూ.9.67 కోట్లు ఉన్నాయి కేసీఆర్‌కు. ఆయన భార్య శోభ పేరు మీద రూ.7.78 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. కేసీఆర్ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు.. కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉంది. సొంతంగా కారు, బైక్ లేదు కేసీఆర్‌కు.బదులుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయి. వీటి విలువ రూ.1.16 కోట్లుగా పేర్కొన్నారు. తనది రైతు కుటుంబం అని, వ్యవసాయం తన వృత్తి అని చెప్పుకునే కేసీఆర్.. తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్లో ప్రస్తావించడం కొసమెరుపు. కేసీఆర్, ఆయన సతీమని శోభమ్మ పేర్ల మీద ప్రత్యేకంగా ఎలాంటి భూములు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. -
కామారెడ్డి ముఖ్యనేతలకు కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లింది. కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. ఈ నెల 7వ తేదీన ప్రగతిభవన్‌లో కామారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో.. ఈ చర్చల ద్వారా క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే.. నియోజకవర్గ అభివృద్ధిపైనా ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా కామారెడ్డిలో పర్యటించడం.. బహిరంగ సభ, ర్యాలీలు తదితర అంశాలపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పోటీని సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బీజేపీ తరపున ఎంపీ అర్వింద్ బరిలోకి దిగొచ్చనే ప్రచారం నడుస్తోంది. కామారెడ్డి ప్రజల నినాదాలు కామారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు ఇప్పటికే కేసీఆర్‌ను గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. సీఎం కేసీఆర్ వస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని ఆ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నారు.హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన కామారెడ్డి ప్రజలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున కేసీఆర్ ముందు నినాదాలు చేశారు.'కేసీఆర్ జిందాబాద్, జై కేసీఆర్', 'సీఎం కేసీఆర్ రావాలి' 'స్వాగతం కామారెడ్డికి స్వాగతం' 'కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి' 'జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్' వంటి నినాదాలతో ఆ వివాహ ప్రాంగణం దద్దరిల్లింది. -
Kamareddy : కామారెడ్డి చరిత్ర ఘనం.. ఘాటు రాజకీయం
కామారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గం.. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రేసులో ఉంటానని ప్రకటించారు. ఇక్కడి నుంచి 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ కు 68162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63610 ఓట్లు వచ్చాయి. గోవర్దన్ బిసిలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు.గతంలో ఈయన టిడిపిలో ఉండేవారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరసగా గెలుస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. గతంలో.. టీడీపీ పక్షాన రెండుసార్లు, టిఆర్ఎస్ తరపున మూడుసార్లు గెలిచారు. కాగా కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణారెడ్డికి పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్ రెండువేల తొమ్మిదిలో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కామారెడ్డిలో నాలుగుసార్లు రెడ్డి నేతలు,తొమ్మిదిసార్లు బిసిలు, రెండుసార్లు ఎస్.సిలు గెలవగా, మూడుసార్లు ముస్లింలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కామారెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు టిఆర్ఎస్ మూడుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. టి.ఎన్. సదాలక్ష్మి ఇక్కడ ఒకసారి,ఎల్లారెడ్డిలో మరోసారి గెలిచారు. సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, షబ్బీర్ అలీ 1990లో చెన్నారెడ్డి, 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి, 2004 నుంచి ఐదేళ్లపాటు వ్కె.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.తదుపరి ఒకసారి ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా షబ్బీర్ ఉన్నారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999లో టిడిపి తరుఫున గెలిచిన యూసఫ్ అలీ విప్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. గంపా గోవర్దన్ కూడా విప్ అయ్యారు. కామారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..