సెంటు భూమి లేదు! కేసీఆర్‌ అఫిడవిట్‌లో ఇంకా ఏముందంటే.. | Telangana polls: CM KCR files nomination from Gajwel Kamareddy | Sakshi
Sakshi News home page

సెంటు భూమి లేదు! కేసీఆర్‌ అఫిడవిట్‌లో ఇంకా ఏముందంటే..

Published Thu, Nov 9 2023 2:30 PM | Last Updated on Thu, Nov 9 2023 4:38 PM

Telangana polls: CM KCR files nomination from Gajwel Kamareddy - Sakshi

సాక్షి, సిద్ధిపేట/కామారెడ్డి: భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ నామినేషన్లు వేశారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నాం కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేశారు. 

తొలుత.. గజ్వేల్‌లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు కేసీఆర్‌. ఆపై విశ్రాంతి తీసుకుని హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ తొలుత బీఆర్‌ఎస్‌ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆపై కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. 

ఇక నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ. 2లక్షల 96వేల క్యాష్‌ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. 

కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ పేర్లపై బ్యాంక్‌లలో డిపాజిట్లు అయిన నగదు రూ. 17కోట్లకు పైగా ఉంది. కేసీఆర్ పేరు మీద మొత్తం తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్, శోభమ్మకు మూడు అకౌంట్స్ ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్‌ అయ్యాయి. 2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ కలిపి రూ.5.63 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడది మరో 11.16 కోట్లకు పెరిగింది. 

కేసీఆర్‌ సతీమణి శోభ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.6.29 కోట్లకు చేరింది. బంగారు ఆభరణాలు 2.8 కేజీలు(రూ. 17లక్షలు విలువచేసే) ఉన్నట్లు తాజా అఫిడవిట్‌లో వెల్లడి. గత పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని అఫిడేవిట్‌లో చూపించారు కేసీఆర్. 

స్థిర ఆస్తుల రూపంలో రూ. 17.83 కోట్లు, చరాస్తుల రూపంలో రూ.9.67 కోట్లు ఉన్నాయి కేసీఆర్‌కు. ఆయన భార్య శోభ పేరు మీద రూ.7.78 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. కేసీఆర్‌ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు.. కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉంది. సొంతంగా కారు, బైక్‌ లేదు కేసీఆర్‌కు.బదులుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయి. వీటి విలువ రూ.1.16 కోట్లుగా పేర్కొన్నారు. 

తనది రైతు కుటుంబం అని, వ్యవసాయం తన వృత్తి అని చెప్పుకునే కేసీఆర్‌..  తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్‌లో ప్రస్తావించడం కొసమెరుపు. కేసీఆర్‌, ఆయన సతీమని శోభమ్మ పేర్ల మీద ప్రత్యేకంగా ఎలాంటి భూములు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement