సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో.. నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈసీ ఈ వివరాలను మంగళవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించింది. మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు కాగా.. 2,898 నామినేషన్‌లకు ఆమోదం లభించింది. అలాగే 606 తిరస్కరణకు గురయ్యాయి.
ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో రేపటితో(నవంబర్ 15తో) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. మధ్యాహ్నాం 3గంటల లోపు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. దీంతో 2,898 మందిలో ఎంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారు? ఎన్నికల బరిలో చివరకు ఎంత మంది మిగులుతారు? అనేది రేపు సాయంత్రం కల్లా తేలనుంది.
ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత ఆమోదించినవాటి లెక్కల ప్రకారం.. కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వేల్ అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం లభించింది. వీళ్లలో 28 మంది విత్‌డ్రా చేసుకోగా(ఇవాళ సాయంత్రం వరకు).. 86 మంది అభ్యర్థులు మిగిలారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 56(కేసీఆర్ పోటీ చేయబోయే రెండో స్థానం), ఎల్బీ నగర్‌లో 57 మంది అభ్యర్థుల నామినేషన్‌లకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 10వ తేదీతో ముగిసింది. మొదటి రోజు 96 మంది, రెండో రోజు 136, 6వ తేదీన 207, 7వ తేదీన 281 మంది, 8వ తేదీన 618 మంది, 9వ తేదీన 1,133 మంది, ఆఖరి రోజు అధికంగా 2,327 మంది వేశారు. అలా.. ఎన్నికల్లో మొత్తం 4,798 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 2,399 నామినేషన్లు వేయగా అందులో 456 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాళ్లలో 367 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1,821 మంది ఎన్నికలో బరిలో నిలిచారు. అయితే.. ఎన్నికల్లో 1,569 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment