కేటీఆర్ కొడంగల్‌లో రోడ్‌షో
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు.
కేసీఆర్ సీఎం కావడం ఖాయం
సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్‌ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్‌ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు
టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్‌ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్‌ను ఏనాడూ పట్టించుకోని రేవంత్‌రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్‌రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment