కేసీఆర్‌ ఫోకస్‌ అంతా అక్కడేనా? | Telangana Assembly Elections 2023: BRS Full Focus On Khammam | Sakshi
Sakshi News home page

కారు గేరు మారింది! .. కేసీఆర్‌ ఫోకస్‌ అంతా అక్కడేనా?

Sep 8 2023 1:09 PM | Updated on Sep 8 2023 7:04 PM

Telangana Assembly Elections 2023: BRS Full Focus On Khammam - Sakshi

కూడికలు, తీసివేతల తర్వాత ఓ క్లియర్‌ ఫోకస్‌ ద్వారా.. గత అనుభవాల్ని రిపీట్‌ కానివ్వకుండా.. 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. వ్యూహాత్మక రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ బీఆర్‌ఎస్‌. అందుకు కారణాలు దాదాపుగా తెలిసినవే!.  2014, 2018 అసెంబ్లీ..  ఎన్నికల్లో జిల్లాలో ఫలితాలు నిరాశ పరిచిన నేపథ్యం, కీలక నేతలు పార్టీని వీడడం.. తదితరాలు. దీంతో రాబోయే ఎన్నికల కోసం వ్యూహం మార్చారు గులాబీ బాస్. పూర్తి స్థాయిలో ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారాయన. తాజాగా.. తక్కువ గ్యాప్‌లో  వందల కోట్ల నిధుల్ని విడుదల చేయడం గమనార్హం. 

తాజాగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గానికి భారీగా నిధుల కేటాయించింది. ఖమ్మం అభివృద్ది పేరిట ఇవాళ రూ. 100 కోట్లు మంజూరు చేశారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే..  పది రోజుల క్రితమే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 690 కోట్లు ప్రభుత్వం కేటాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో మంత్రి పువ్వాడ.. కేటీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా కృతజ‍్క్షతలు తెలియజేశారు.  మరోవైపు.. 

ఉమ్మడి ఖమ్మంలోని అన్ని నియోజక వర్గాల్లోని అభ్యర్థులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత.  విజయం కోసం శాయశక్తులా కృషి చేయాలని సూచిస్తూ.. మరోవైపు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. కూడికలు,తీసివేతల తర్వాత.. ఖమ్మంపై ఒక స్పష్టమైన క్లారిటీతోనే కారు గేర్‌ మార్చి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

వన్‌ అండ్‌ ఓన్లీ..
టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్ఏస్ ప్రయాణంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫలితాలు నిరాశజనకంగానే సాగాయి. ప్రత్యేకించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది (జలగం వెంకట్రావు). 2018 ఎన్నికల్లో సైతం అదే తరహా ఫలితం వచ్చింది. ఈసారి కూడా ఒక్కటంటే ఒక్క సీటే దక్కింది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. దీంతో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెరుగైన ఫలితం రాబట్టాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం చూస్తోంది. 

మార్పులు.. చేర్పులు 
ఉమ్మడి ఖమ్మంలోని పది నిజయోకవర్గాల్లో.. బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపులో సిట్టింగ్‌లలో ఒక వైరా మాత్రమే మార్చారు. వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో.. మాజీ ఎమ్మేల్యే మదన్‌లాల్కు కేటాయించారు. మధిరలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లింగాల కమల్ రాజ్‌కే అనూహ్యంగా మళ్లీ టికెట్ కేటాయించారు. భద్రాచలంకు సంబంధించి.. పొంగులేటి ప్రధాన అనుచరుడు, ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావుకు కేటాయించారు.

సీరియస్‌గా వర్క్‌ చేయండి
ఖమ్మం రాజకీయాలను అధికార పార్టీ సీరియస్‌గా తీసుకుంది.  పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం, తుమ్మల సైతం రేపోమాపో కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు, మిగతా నేతలతో ఏయే పార్టీలు టచ్‌లో ఉన్నాయి.. ఇలా అన్నింటిని బీఆర్‌ఎస్‌ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బలమైన నేతలు రంగంలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి. వాళ్లకు చెక్‌ పెట్టే విధంగా ప్రత్యేక వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు కేసీఆర్‌.  

ఉమ్మడి ఖమ్మంలో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని.. ఇటీవలే నియమించిన ఇంచార్జిలకు సీఏం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. చేజారిన.. చేజారుతున్న నేతల ఎఫెక్ట్‌..  పార్టీ పై పడకుండా చూసుకోవాలని, గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ కేడర్‌ చేజారకుండా చేయగలిగినంత ప్రయత్నాలు చేయాలని సూచించారు. ముఖ్యంగా జనరల్ స్థానాలు అయిన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ‘‘వాళ్లెవరో మనల్ని మళ్లీ అసెంబ్లీ గేటు దాటనివ్వను అని సవాల్‌ విసిరారు(పొంగులేటిని ఉద్దేశించి..). కాబట్టి.. వాళ్లనే మనం అసెంబ్లీకు వెళ్లకుండా అడ్డుకోవాలి. ఆ సవాల్‌ను దృష్టిలో పెట్టుకుని పని చేయండి’’ అని క్యాడర్‌ను ఆయన అప్రమత్తం చేసినట్లు పార్టీ శ్రేణులు బయటకు చెప్తున్నాయి.

ఖమ్మం విషయంలో కేసీఆర్‌ ఈసారి తన అంచనా ఏమాత్రం తప్పకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఉమ్మడి ఖమ్మంలోని నిజయోజకవర్గాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికల్ని ప్రగతి భవన్‌కు తెప్పించుకుంటున్నారు. ఈ లెక్కన.. బీఆర్ఏస్ ‘టార్గెట్ ఖమ్మం’ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి!

::: పసునూరి మహేందర్, సాక్షి TV ప్రతినిధి, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement