Khammam District News
-
హామీలు అమలు చేయకుంటే ఉద్యమం
ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లిలో ఇటీవల నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో 15 తీర్మానాలను ఆమోదించినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొదించినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, గ్రానైట్ పరిశ్రమల్లో సంక్షోభం, రైతుభరోసా తదితర అంశాలపై ఉద్యమాలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే, రుణమాఫీకి సంబంధించి ఈనెల 23న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఆదివారం ఖమ్మంతో అని మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, కళ్యాణ వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, మాదినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ● రఘునాథపాలెం: మండలంలోని కోటపాడులో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు భూపతిరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని శనివారం పరామర్శించాక ఆయన మాట్లాడారు. సీపీఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్‌రెడ్డి, నాయకులు బషీరుద్దీన్, తుడుం ప్రవీణ్, మెరుగు సత్యనారాయణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల ర్యాలీ
ఖమ్మంసహకారనగర్: సమస్యల పరిష్కారం కోసం కొన్నిరోజులుగా సమ్మె చేస్నుత్న సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాని కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్‌పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ టీ తాగేలోగా తమ సమస్యలను పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరారు. ఈక్రమంలో టీ కప్పుతో కూడిన ప్లకార్డులతో వారు ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగులకు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ మద్దతు తెలపగా వీరస్వామి, అనిల్, సాంబశివరావు, ఇస్మాయిల్, విజయనిర్మల, విజయలక్ష్మి, రాణి, కృష్ణప్రసాద్, సురేష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమిత్‌షా వ్యాఖ్యల వెనుక మతోన్మాద కుట్ర’
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల అంబేద్కర్ చేసిన వాఖ్యల వెనుక మతోన్మాద కుట్ర దాగి ఉందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈమేరకు సీపీఐ ఆధ్వర్యాన శనివారం ఖమ్మం ఖమ్మం బైపాస్‌రోడ్డులో అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశాక ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఏనాడు గౌరవించని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు జమిలీ పేరిట నియంత పాలనవైపు అడుగులేస్తున్నారని విమర్శించారు. కాగా, అంబేద్కర్‌పై వ్యాఖ్యల విషయంలో అమిత్‌షాను సమర్ధిస్తున్న ప్రధాని మోడీని కూడా రాజ్యాంగ ద్రోహిగానే పరిగణించవలసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండి సురేష్, జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, శింగు నర్సింహారావు, పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సీఎం కప్ క్రీడాపోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు అన్ని క్రీడాంశాల్లో కలిపి 3,602 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా అంశాల్లో 610 మంది విజయం సాధించి బహుమతులు అందుకున్నారు. కాగా, పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. చివరిరోజైన శనివారం బాలికల ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, ఖో–ఖో, బాక్సింగ్, పోటీలు జరిగాయి. బాలికల ఖో–ఖో పోటీల్లో ఎర్రుపాలెం, మధిర జట్లు, బాస్కెట్‌బాల్‌లో సర్థార్ పటేల్స్టేడియం, పీవీఆర్ క్లబ్ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే, యోగా బాలుర విభాగంలో లక్ష్మీప్రణీత్, రంజిత్‌కుమార్, బి.నవదీప్, బాలికల విభాగంలో బి.తమరాస, సీహెచ్.శ్రీవల్లి, బి.అక్షర వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. మెయిట్ లిఫ్టింగ్‌లో కె.అభి, పి.పూర్ణసాయిరాం, జి.శరణ్యయంద్ర, జి.నిఖిల్‌దీప్, అనూష్, సీహెచ్.రాకేష్, బి.పల్లవి, ఏ.తనుశ్రీ, యశస్విని, ఎస్.సాత్వి, నిక్షిత, నాగశ్రీ, బాక్సింగ్ బాలికల విభాగంలో టి.హర్షిత, సీహెచ్.సంజన, బాలురలో ఎం.వెంకటశ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. ఈ మేరకు విజేతలకు డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి కె.నర్సింహామూర్తి బహుమతులు అందజేయగా కోచ్‌లు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, ఆదర్శ్‌కుమార్, మూసా కలీం, పరిపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.అన్ని అంశాల్లో కలిపి 3,602 మంది క్రీడాకారుల హాజరు -
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం
ముదిగొండ: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూనే పౌష్టికాహారం అందేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రికార్డులు, వంటి గది, స్టోర్‌రూంలో పరిశీలించాక విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టిన డీఈఓ ఆతర్వాత ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజ నాన్ని అందేలా చూడాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె నేపథ్యాన బోధనకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ రమణయ్య పాల్గొన్నారు.సదరమ్ క్యాంపుల షెడ్యూల్ విడుదల ఖమ్మంవైద్యవిభాగం: వివిధ నియోజవర్గాల దివ్యాంగుల కోసం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే సదరమ్ క్యాంపుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. వైరా నియోజకవర్గ దివ్యాంగులకు ఈనెల 23న, సత్తుపల్లి నియోజకవర్గ వారి కోసం ఈనెల 27న, మధిర నియోజకవర్గ దివ్యాంగులకు జనవరి 2న, ఖమ్మం నియోజకవర్గంలోని దివ్యాంగులకు జనవరి 9, పాలేరు నియోజకవర్గ దివ్యాంగుల కోసం జనవరి 17న క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్న రశీదు, ఆధార్‌కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు మెడికల్ రిపోర్టులు వెంట తీసుకురావాలని సూచించారు. మంచుకొండ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సస్పెండ్ ఖమ్మంవైద్యవిభాగం: రఘునాథపాలెం మండలం మంచుకొండ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం డీఎంహెచ్ఓ కళావతిబాయి ఉత్తర్వులు జారీ చేశారు. గత మంగళవారం పీహెచ్సీలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తనిఖీ చేశారు. ఆయన మధ్యాహ్నం 3గంటలకు వెళ్లగా 15 మంది ఉద్యోగులకు గాను ముగ్గురే ఉన్నారు. ఇద్దరు డాక్టర్లు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి పని చేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లాలని సూచించారు. ఆపై డీఎంహెచ్ఓను విచారణకు ఆదేశించగా ఆమె మెడికల్ ఆఫీసర్ శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా గురుకులంలో నాక్ బృందం కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను నాక్ బృందం సభ్యులు పరిశీలించారు. బృందం చైర్మన్ డాక్టర్ నరేష్ కేశ్వాలా నేతృత్వాన డాక్టర్ సి.తిలకం, డాక్టర్ భరత్ ఖండార్తో పాటు ట్రైబల్ వెల్పేర్ ఓఎస్డీ సతీష్ గౌడ్ తదితరులు రెండు రోజుల పాటు కళాశాలలో అన్ని అంశాలను పరిశీలించి నివేదికలు రూపొందించారు. బోధన, ఫలితాలు, విద్యార్థినుల ఆరోగ్యం, వసతిగృహం నిర్వహణ, భోజన సదుపాయంపై వివరాలు ఆరా తీయడమే కాక బాలికల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థినుల అభిప్రాయాలు సేకరించారు. ఈమేరకు నివేదిక ఉన్నతాధికారులను అందిస్తామని తెలిపారు. గురకులాల ఆర్సీఓ కె.నాగార్జునరావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్యతో పాటు అధ్యాపకులు ప్రజ్ఞ, ఐశ్వర్యరాణి, ఏఓ కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల నియామకంపై కేఎంసీలో విచారణ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ విధానంలో జరిగిన కార్మికుల నియామకాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు గతంలో విచారణ చేయగా.. వారికి వచ్చిన అనుమానాల మేరకు మరోమారు పరిశీలించాలని మున్సిపల్ శాఖ వరంగల్ ఆర్జేడీని ఆదేశించారు. దీంతో ప్రస్తుత కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా, గతంలో విధులు నిర్వర్తించిన సంపత్‌కుమార్ కలిసిశనివారం కేఎంసీలో విచారణ చేపట్టారు. గతంలో కేఎంసీలో అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వర్తించిన మల్లీశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, మల్లయ్య, బాబు, రమేష్, లాల్య పాల్గొనగా పూర్తి వివరాలు నమోదు చేశారు. -
దక్కన్ ఒడిలో సింగరేణి సిరులు
రామభక్తులతో వెలుగులోకి.. భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్లే భక్తులకు తొలిసారిగా ఇల్లెందు సమీపంలోని సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు కనిపించింది. ఆ తర్వాత బ్రిటీష్ అధికారి విలియమ్స్ ఇక్కడ పరిశోధనలు చేసి నేలబొగ్గు ఉన్నట్టు 1870లో కనుగొన్నారు. దీంతో బ్రిటీషర్లు, అప్పటి నైజాం సర్కార్ సంయుక్తంగా దక్కన్ పేరుతో ఇల్లెందు ప్రధాన కేంద్రంగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు. అనంతరం గోదావరి లోయలో బొగ్గు నిక్షేపాలు వెదుకుతూ బెల్లంపల్లి, కొత్తగూడెంలో కోల్ మైనింగ్ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ సంస్థను నైజాం సర్కార్ నుంచి భారత ప్రభుత్వానికి బదలాయించారు. ప్రస్తుతం సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం ఉండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతంగా ఉంది. ఇల్లెందు సమీపంలో మొదలైన సింగరేణి ప్రస్థానం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు, బొగ్గుతో పాటు ఇతర రంగాలకూ విస్తరించింది. ఉపాధి వనరు.. సింగరేణి సంస్థ రాకముందు నైజాం జమానాలో జమీందార్ల వెట్టి చాకిరీ కింద ఉత్తర తెలంగాణ సమాజం నలిగిపోయేది. సింగరేణి వచ్చాక ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా మెరుగైన వేతనాలు, పని ప్రదేశాల్లో సౌకర్యాలు వచ్చాయి. దీంతో ఒకప్పుడు తెలంగాణ యువతకు ఉపాధి అంటే దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి అనేంతగా ప్రాచుర్యం పొందింది. 90వ దశకం ఆరంభంలో సంస్థ వ్యాప్తంగా ఏకంగా 1.20 లక్షల మంది కార్మికులు పని చేసేవారు. తగ్గిన కార్మికులు.. 1998 తర్వాత సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణ పెరగడంతో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో సింగరేణి సంస్థ విస్తరించి ఉంది. దీని పరిధిలో 22 భూగర్భగనులు (యూజీ), 18 ఉపరితల గనుల (ఓసీ) నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 28 వేల మంది యూజీల్లో, 11 వేల మంది ఓపెన్‌కాస్ట్ గనులు, ఇతర డిపార్ట్మెంట్లు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. థర్మల్ విద్యుత్‌కే సింహభాగం.. సింగరేణి సంస్థ ప్రతి ఏడాది ఉత్పత్తి చేసే బొగ్గులో 80 శాతం థర్మల్ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తోంది. మిగతా 20 శాతం బొగ్గును సిమెంట్, స్పాంజ్ ఐరన్, పేపర్, సిరామిక్స్, ఆగ్రో, ఫార్మా తదితర పరిశ్రమలకు అందిస్తోంది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన సుమారు రెండు వేలకు పైగా పరిశ్రమలు సింగరేణి నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. విస్తరణ బాటలో.. వందేళ్ల క్రితం బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి ప్రస్థానం ఇప్పుడు నలు దిశలా విస్తరిస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సంస్థ ప్రారంభించింది. ఇప్పుడు జైపూర్ ప్లాంట్ విస్తరణతో పాటు రామగుండంలో రెండో ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు సోలార్ పవర్, విండ్ పవర్, బ్యాటరీ స్టోరేజ్డ్ పవర్, పంప్డ్ స్టోరేజీ హైడల్ పవర్, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ తదితర ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఓఎన్జీసీ సహకారంతో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రోటోటైప్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఒడిశాలో బొగ్గు ఉత్పత్తి, రాజస్థాన్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. సంక్షేమంలో భేష్.. కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం ప్రతీ ఏడాది ఒక్కో కార్మికుడి కుటుంబంపై సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు సుమారు 150 కార్పొరేట్ ఆస్పత్రుల్లో సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేసి వైద్య సౌకర్యం అందిస్తోంది. కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలు నడిపిస్తోంది. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతోంది. రూపాయి కూడా ప్రీమియం చెల్లించకుండా కార్మికులకు రూ.కోటి, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది.భద్రతకు ప్రాధాన్యం ప్రమాదకరమైన ప్రదేశాల్లో పని చేస్తూ కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే కార్మిక రక్షణకు సింగరేణి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా తేలిక పాటి క్యాప్ల్యాంప్లు, అన్ని గనుల్లో ఎమర్జెన్సీ ఆప్సరేటర్లు అందుబాటులో ఉంచాం. వివిధ రకాల విష వాయువుల ఉనికి కనుగొనే ఆధునిక పరికరాలు సమకూర్చాం. ఆస్ట్రేలియాకు చెందిన సింటార్స్ అనే ప్రముఖ సంస్థ ద్వారా రక్షణపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం. రూ.5 కోట్లతో సిమ్యూలేటర్ల ద్వారా భారీ యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం. – సత్యనారాయణరావు, డెరెక్టర్ (ఈఅండ్ఎం) -
అటవీ అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు
ఖమ్మంవన్‌టౌన్: అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం అటవీ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ వాచర్ల విస్తరణపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, నిఘా యంత్రాల సాయంతో రానున్న ఎండాకాలంలో మంటలు చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక అటవీశాఖ పరిధిలో భూముల నోటిఫికేషన్ల పురోగతిపై ఆరా తీసిన కలెక్టర్ అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దుల గుర్తింపుపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఆడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీపీఓ ఆశాలత, ఆర్డీఓ నర్సింహారావు, ఎఫ్ఆర్ఓలు పి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
సర్వేలో వేగం పెంచాలి..
బోనకల్/చింతకాని: ఇందిరమ్మ ఇళ ్లకోసం అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే త్వరగా పూర్తయ్యేలా వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. బోనకల్, చింతకాని మండలాల్లోని పలు గ్రామాల్లో సర్వేను శనివారం పరిశీలించిన ఆమె సిబ్బందికి సూచనలు చేశారు. అయితే, యాప్‌లో వివరాలు నమోదు చేసే క్రమాన సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు చెప్పగా ఎక్కువ దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో అదనంగా లాగిన్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీఓలు శాస్త్రి, ఫిరోజ్ కౌసర్, పంచా యతీ కార్యదర్శులు వినోద్‌కుమార్, రాము, చిరంజీవి పాల్గొన్నారు. -
లెక్కల చిక్కుముడులు విప్పేలా..
నిద్ర లేచించి మొదలు నిద్రపోయే వరకు గణితం కీలకపాత్ర పోషిస్తుంది. అలాంటి గణితంపై చాలా మందికి బెరుకు ఉంటోంది. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేలా తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యాన పరీక్షలు నిర్వహిస్తుండడమే కాక బోధనపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక పలువురు టీచర్లు సైతం సులువుగా లెక్కలు అర్థమయ్యేలా ఉపకరణాలు రూపొందిస్తున్నారు. దీంతో విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. నేడు శ్రీనివాస రామానుజన్ జయంతి, జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు.8లో -
అర్హులైన పేదలందరికీ గృహాలు
● రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికల్లూరు/కల్లూరురూరల్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మోడల్ గృహ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. ఏళ్లుగా పేదలు కంటున్న కలలను తమ ప్రభుత్వం సాకారం చేయనుందని చెప్పారు. ప్రజాపాలన సభల్లో ఇళ్ల కోసం అందిన దరఖాస్తులపై సర్వే జరుగుతోందని, మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి తొలివిడతలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కులమతాలు, పార్టీలకతీతంగా పేదలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామన్నారు. దశలవారీగా రూ.5లక్షల నగదును మంజూరు చేస్తామని చెప్పారు. కాగా, కల్లూరులో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుతో పాటు ఆర్డీఓ కార్యాలయానికి భవనం నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సత్తుపల్లిని జిల్లాగా మార్చండి ఎన్నికలకు ముందు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లిని జిల్లాగా మార్చాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంత్రి పొంగులేటిని కోరారు. అంతేకాక కల్లూరును మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించారు. అనంతరం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడారు. ఆర్డీఓ రాజేందర్, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్లు భాగం నీరజాదేవి, ఆనంద్‌బాబు, నాయకులు మట్టా దయానంద్, పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, బుక్కా కృష్ణవేణి, చెన్నారావు, ఏనుగు సత్యంబాబు, లక్కినేని కృష్ణ, యూకూబ్ అలీ పాల్గొన్నారు. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి రాఘవరెడ్డి తొమ్మిదో వర్ధంతిని ఆయన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో నిర్వహించారు. మంత్రి, ఆయన సోదరుడు ప్రసాద్రెడ్డిపాటు కుటుంబీకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీగా కల్లూరు!కల్లూరు మేజర్ గ్రామపంచాయితీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కానుంది. ఈమేరకు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కల్లూ రు గ్రామపంచాయతీ 1964లో ఏర్పడగా ఆతర్వాత మేజర్ పంచాయతీగా అప్‌గ్రేడ్ అయి 30ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ హోదా కలిగిన కల్లూరు పంచాయతీ పరిధిలో 23,300 జనాభా, 13వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. -
● పోటీకి వెళ్తే బహుమతే...
మధిర: మధిర మండలం మహదేవపురం జెడ్పీహెచ్ఎస్ ఎస్సెస్సీ విద్యార్థిని ఒరుగు సంధ్యారాణి గణిత టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ చాటుతోంది. రాయపట్నం గ్రామానికి చెందిన ఆమె గణిత ఉపాధ్యాయుడు పోలే సుధాకర్ సహకారంతో పోటీలకు హాజరవుతోంది. ఇటీవల తెలంగాణ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల, జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అలాగే, చెకుముకి టాలెంట్ టెస్ట్‌లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించి మండల స్థాయిలో మొదటి బహుమతి, జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి గణిత పోటీలల్లో సంధ్యారాణిపాల్గొననుంది. -
19 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
రూ.3.80 లక్షల నగదు స్వాధీనం సత్తుపల్లి: అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి 19 మందిని అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల జూదరులను సమీకరించి సత్తుపల్లి మండలం చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో పేకాట శిబిరం ఏర్పాటుచేశారనే సమాచారంతో శనివారం రాత్రి సత్తుపల్లి పట్టణ సీఐ టి.కిరణ్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులను చూసి కొందరు పారిపోగా 19 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.3.80 లక్షలు నగదు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మేకపిల్లను కాపాడబోయి యువకుడు మృతి తిరుమలాయపాలెం: బావిలో పడిన మేకపిల్లను కాపాడే యత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని కొక్కిరేణిలో శనివారం ఆ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గద్దల ఉపేందర్ కుమారుడు నాగచైతన్య(17) మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం మేకలు కాస్తుండగా మందలోని ఓ మేకపిల్ల ప్రమాదవశాత్తు బావిలో పడింది. దీంతో దాన్ని బయటకు తీసే క్రమాన నాగచైతన్య బావిలో జారి పడి మృతి చెందాడు. ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఉపేందర్ – రేణుక దంపతులకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు నాగచైతన్య మృతితో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం చేరుకోనున్న ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆతర్వాత సాయంత్రం 4గంటలకు 57వ డివిజన్ రమణగుట్టలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మెరుగైన వైద్యసేవలు అందించండి సత్తుపల్లిటౌన్: ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో శనివారం తనిఖీ చేసిన ఆమె వార్డుల్లో పరిశీలించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కాగా, వంద పడకలతో నిర్మిస్తున్న నూతన భవనం ఎప్పటిలోగా పూర్తవుతాయని ఆరాతీయగా పది రోజుల్లో అప్పగిస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైద్యులు సురేష్ నారాయణ్, ప్రేమలత, వసుమతీదేవి, జయలక్ష్మి, ఉద్యోగులు రామలక్ష్మి, రాధాకృష్ణకుమారి, హైమావతి, దుర్గ, శారద పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి సత్తుపల్లి: జూనియర్ న్యాయవాదులు నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా వృత్తిలో రాణించొచ్చని ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్లూరి ఆడమ్స్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ న్యాయవాదుల వద్ద జూనియర్లు వృత్తి మెళకువలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏజీపీ గొర్ల రామచంద్రారెడ్డితో పాటు న్యాయవాదులు పిన్నం జానకీరామారావు, కంచర్ల వెంకటేశ్వరరావు, షేక్ బుజ్జీ సాహెబ్, సోమిశెట్టి శ్రీధర్, రమేష్, శిరీష, అరుణ, ప్రసాద్‌రెడ్డి, వంకదారు రామకృష్ణ పాల్గొన్నారు. కనకగిరి గుట్టలను సందర్శించిన డీఎఫ్ఓచండ్రుగొండ: చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులో విస్తరించి ఉన్న కనకగిరి గుట్టలను ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ శనివారం సందర్శించారు. గుట్టల పైభాగం వరకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. అలాగే, గుట్టల పైభాగంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు, హస్తాల వీరన్నస్వామి ఆలయం నుంచి పులిగుండాల వరకు రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. డీఎఫ్ఓ వెంట తల్లాడ రేంజర్ ఉమ, డిప్యూటీ రేంజర్ సురేష్, బీట్ ఆఫీసర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా ఆహారోత్సవం ఖమ్మం అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో శనివారం తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో వారినే ఆహారం సిద్ధం చేసుకుని రావాలని అధికారులు సూచించారు. తద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి అవగాహన పెరుగుతుందనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టగా తల్లిదండ్రులు ఉత్సాహంగా హాజరయ్యారని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్ తెలిపారు. ఖమ్మం ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉపాధ్యాయుల కృషికి తల్లిదండ్రులు కూడా షమకరించాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం మంజుల, ఉపాధ్యాయులు హరిప్రసాద్, స్నేహ, శాంతి తదితరులుపాల్గొన్నారు. మృత్యువుతో పోరాడి ఓడిన వార్డు ఆఫీసర్ సత్తుపల్లిటౌన్: పురుగుల మందు తాగిన వ్యక్తికి 21రోజులుగా చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన తోట గణేష్(24) సత్తుపల్లి మున్సిపాలిటలో ఒకటో వార్డు ఆఫీసర్‌గా 2022 ఆగస్టు నుంచి పని చేస్తున్నారు. గత నెల 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆయన పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స చేయిస్తుండగా హైదరాబాద్ ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. గణేష్ తండ్రి పదేళ్ల క్రితం మృతి చెందగా కారుణ్య నియామకంలో ఆయనకు ఉద్యోగం లభించింది. గతేడాది తల్లి సైతం గుండెపోటుతో మృతి చెందింది. ప్రస్తుతం గణేష్‌కు సోదరి మాత్రమే ఉండగా, ఆయన మతిపై సత్తుపల్లి మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు. -
అపార్ట్మెంట్లోని ప్లాట్‌లో భారీ చోరీ
● 40 తులాల బంగారంతో పాటు వెండి, నగదు మాయం ● సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ఖమ్మంక్రైం: ఖమ్మం ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్‌లో భారీ చోరీ జరిగింది. ఘటనకు సంబంధించి టూటౌన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి ఉద్యోగి లకావత్ రాందాస్ ఆర్టీఓ ఆఫీస్ సమీపాన ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. వీరి ఇంట్లో వివాహం ఉండగా ఆ పనులపై శుక్రవారం అంతా ఊరు వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం వచ్చేసరికి ప్లాట్ తాళం తీసి ఉండడంతో పాటు లోపల బీరువా పగలగొట్టి ఉంది. దీంతో పరిశీలించగా పెళ్లి కోసం సమకూర్చుకున్నవే కాక బంధువులు ఆభరణాలు కలిపి 40 తులాలకు పైగా బంగారం, అరకేజీ వెండి, రూ.లక్ష నగదు కలిపి రూ.12లక్షల సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈమేరకు అందిన సమాచారం టూటౌన్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించగా, సీసీ టీవీ పుటేజీ కూడా లభించడంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, చోరీకి ఒకే వ్యక్తి రాగా ప్లాట్‌లో 40 నిమిషాల పాటు ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. కాగా, అపార్ట్‌మెంట్‌కు వాచ్మెన్ ఉన్నప్పటికీ సదరు నిందితుడు అర్ధరాత్రి దాటాక దర్జాగా 4వ అంతస్తులోని ప్లాట్‌లోకి ప్రవేశించి చోరీ చేయడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల ఇంట్లో... ఖమ్మం ముస్తఫానగర్‌లో శనివారం చోరీ జరిగింది. ముస్తఫానగర్‌కు చెందిన ఆర్టీసీ కంట్రోలర్ శ్రీనివాసరావుతో పాటు ప్రభుత్వ ఉద్యోగే అయిన ఆయన భార్య విధి నిర్వహణ నిమిత్తం ఈనెల 18న వెళ్లారు. తిరిగి శనివారం వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువాలో దాచిన రూ.1.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు తేలగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. ముత్యాలమ్మ తల్లి ఆలయంలో.. పెనుబల్లి: పెనుబల్లిలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఆలయంలోని హుండీ పగులగొట్టి రెండు నెలలుగా భక్తులు వేసిన కానుకలు ఎత్తుకెళ్లారు. అంతేకాక గ్రామంలోని పలుచోట్ల షాపుల తాళాలు పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. -
కలుపు మందు ప్రభావంతో ఎండిన మిర్చి తోట
కొణిజర్ల: మొక్కజొన్నలో కలుపు నివారణకు రైతులు మందు పిచికారీ చేయగా పక్కనే ఉన్న మిర్చి తోటపై పడడంతో ఎండిపోయింది. కొణిజర్లకు చెందిన రైతు చింతల వెంకటేశ్వర్లు కౌలుకు తీసుకుని ఎకరంలో మిర్చి సాగుచేశాడు. ప్రస్తుతం మిర్చి కాత దశలో ఉండగా, పక్క పొలాల రైతులు మొక్కజొన్నలో కలుపు నివారణకు మందు పిచికారీ చేశారు. అది కాస్తా మిర్చి తోటపై పడటంతో దాదాపు పది గుంటల పరిధిలో మొక్కలు మాడిపోయాయి. ఇప్పటివరకు రూ.3.10లక్షల వరకు పెట్టుబడి పెట్టిన తాను నష్ట పోయినందున న్యాయం చేయాలని కోరుతూ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
లెక్కల చిక్కుముడులు విప్పేలా..
గణితఫోరం ఆధ్వర్యాన పోటీలు, ఉపాధ్యాయులకు శిక్షణ ● ఏటా మండల స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పోటీలు ● విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా నిర్వహణ ● నేడు శ్రీనివాస రామానుజన్ జయంతి, జాతీయ గణిత దినోత్సవంఖమ్మంసహకారనగర్: అందరి దైనందిన జీవితంలో గణితంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. నిద్ర లేచించి మొదలు రాత్రి వరకు అన్ని అంశాలు గణితంతో ముడిపడి ఉంటాయి. కానీ పాఠశాల స్థాయిలో కొందరు విద్యార్థులు భయంతో గణితంలో వెనుకబడుతుంటారు. ఈనేపథ్యాన వారిలో భయాన్ని పోగొట్టి సులభ సూత్రాల ద్వారా బోధించేందుకు ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తూనే.. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఏటా తెలంగాణ మ్యాథ్స్ ఫోరం(టీఎంఎఫ్) ఆధ్వర్యాన మండలం మొదలు రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. 2016లో మొదలైన ఈ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయికి ఎంపికై సత్తా చాటుతున్నారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యాన జిల్లాలో టీఎంఎఫ్ కార్యకలాపాలపై కథనం. విద్యార్థులు పట్టు సాధించేలా.. ఇంగ్లిష్‌తోపాటు గణితానికి నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణితంపై పట్టు అవసరం. బ్యాంక్ ఉద్యోగాలు, సీఏ, ఆర్ఆర్బీ తదితర పోటీ పరీక్షల్లో గణితంలో అత్యధిక మార్కులు సాధిచడమే కీలకం. దీంతో హైస్కూల్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచేలా టీఎంఎఫ్ కృషిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఏటా పరీక్షలు నిర్వహిస్తుండడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవగాహన పెంచేలా కృషి చేస్తోంది. నవంబర్ నుంచి ప్రారంభమై.. ఈ ఏడాది నవంబర్ 24న మండల స్థాయిలో పోటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అక్కడ విజయం సాధించిన విద్యార్థులకు ఈనెల 11న జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయి పరీక్ష ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. జిల్లా నుంచి ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. గణిత నమూనాల విభాగంలో.. టీఎంఎఫ్ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రదర్శనలో ఖమ్మంలోని న్యూఇరా విద్యాసంస్థకు చెందిన వివాన్ స్కూల్ విద్యార్థిని ఎస్.రక్షిత తన మిత్రబృందంతో కలిసి ఎగ్జిబిట్ ప్రదర్శించింది. గణితం సులభంగా నేర్చుకునే నమూనా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. నాకు గణితం అంటే ఇష్టం... ఖమ్మంవన్‌టౌన్: నాకు మ్యాఽథ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మిగతా సబ్జెక్టులతో పోలిస్తే మ్యాథ్స్ సులభంగా అర్థం చేసుకుని చేస్తుంటాను. మా అమ్మ గణితం టీచర్ కావడంతో లెక్కలు సులువుగా చేసేలా తర్ఫీదు ఇస్తోంది. తద్వారా సబ్జెక్టుపై రోజురోజుకు ఇష్టం పెరిగింది. ఇటీవల జరిగిన ఇంటరేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో మా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించా. – కలువకొలను ప్రశంస సాహితీ, 6వ తరగతి, ఖమ్మంసులువుగా బోధించేలా శిక్షణ టీఎంఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా, మండలంలో ఉన్న గణిత ఉపాధ్యాయులకు మెళకువలను నేర్పుతారు. తద్వారా విద్యార్థులకు సులువుగా బోధించడంపై ఉపాధ్యాయులకు అవగాహన పెరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతిభ కనపరచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందిస్తున్నాం. – కొత్తూరు చంద్రశేఖరరావు, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడుపాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు.. గణిత పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రశ్నలతోనే టీఎంఎఫ్ ఆధ్వర్యాన పరీక్ష నిర్వహిస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా కృషి చేస్తున్నాం. అలాగే, జిల్లా సైన్స్‌ఫేర్‌లో మ్యాథమెటికల్ మోడలింగ్ అంశాన్ని ప్రవేశపెట్టాం. నమూనాల ద్వారా గణితాన్ని సులభంగా బోధించే పద్ధతులను ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం. – మువ్వా ప్రసాద్, టీఎంఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు -
● సులువుగా పరిష్కరించేలా...
ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో విద్యార్థులకు గణిత భావనలు సులభంగా అర్థమయ్యేలా, వారిలో ఆసక్తి పెంచేలా అవసరమైన పరికరాలను విద్యార్థులతోనే చేయించారు. త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు సున్నా డిగ్రీల నుండి 360 డిగ్రీలు, 360 పైన ఉన్న డిగ్రీల విలువలను ఒకే బోర్డు ద్వారా లాగరిథం టేబుల్ లేకుండా చూపడం, వస్తువుల ఎత్తులను సరూప త్రిభుజాల నియమం ద్వారా కనుగొనడం, గోనియో మీటర్ సాయంతో కనుగొనడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఎగ్జిబిట్లను ఏన్కూరు మండలం బురదరాఘవాపురం జెడ్పీఎస్ఎస్ విద్యార్థిని కమ్మగంటి మహిమ ప్రదర్శించగా రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. -
వృద్ధురాలిపై దాడి చేసి..
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో శుక్రవారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసిన దుండుగులు ఆమె మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం... పిండిప్రోలుకు చెందిన ఆరెంపుల వెంకటమ్మ భర్త గురవయ్య మృతిచెందగా కుమారులిద్దరు ఖమ్మంలో ఉంటున్నారు. ప్రతీ శనివారం జరిగే వారాంతపు సంతలో పశువులు, మేకల తాళ్లు అమ్ముకుంటూ ఆమె జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రించగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఆమె ముఖంపై రాయితో దాడి చేసి మెడలో ఉన్న తులంన్నర బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
● ఇటిక్యాల.. కిటుకులతో బోధన
నేలకొండపల్లి: గణితం అంటే చాలామంది విద్యార్థులకు భయం ఉంటుంది. కానీ సమస్యలను పరిష్కరించే సూత్రాలపై పట్టుసాధిస్తే అన్ని సబ్జెక్టులతో పోలిస్తే సులువుగా మారే గణితంతో అత్యధిక మార్కులు సాధించే అవకాశముంటుంది. ఈమేరకు విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచేలా బోధిస్తున్నారు నేలకొండపల్లి మండలంలోని కట్టుకాచారం పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఇటిక్యాల సురేష్. వినూత్న విధానాలు, సులువైన పద్ధతుల్లో పరిష్కారం అవగాహన కల్పిస్తున్న ఆయన పలు అవార్డులు సాధించారు. గణిత టాలెంట్ టెస్ట్‌లు, మేళాలు, క్విజ్ పోటీలు ఎక్కడ జరిగినా విద్యార్థులు పాల్గొనేలా తర్ఫీదు ఇస్తున్నారు. సులువైన విధానాల్లో లెక్కలు చేసే విధానంపై వివరిస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. ఏ పాఠశాలలో పనిచేసినా సురేష్ ప్రత్యేక పరికరాలు రూపొందించి మరీ బోధిస్తుండడంతో విద్యార్థులు సబ్జెక్టు పరీక్షలోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు. కాగా, 20ఏళ్లుగా గణితం రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న ఆయన స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. 2003లో గణితం టీఎల్ఎం మేళాకు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సంఖ్యా వినోదం, సమాన భాఽగాలు, భాగాహార ప్రక్రియ, త్రిభుజ ధర్మాలు, నేపియర్ స్టిప్స్తో గుణకార భావనలు, జియోబోర్డు ద్వారా జ్యామితీయ చిత్రాలు తదితర టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) ఆయన అవార్డులు తెచ్చిపెట్టాయి. అంతేకాక 1999లో మైసూర్ యూనివర్సిటీ నుంచి అవార్డు అందుకున్న సురేష్ అటు విద్యార్థులు, ఇటు అధికారుల మన్ననలు అందుకుంటున్నారు. -
భూగర్భగనుల్లో నష్టాల పరంపర
● నివారణపై సింగరేణి అధికారుల దృష్టి ● యంత్రాల పనిగంటలు పెంచడంపై ఆదేశాలు ● అందరూ 8గంటల పాటు పనిచేస్తేనే లక్ష్య సాధన సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం మేరకు జరుగుతున్నా భూగర్భ గనుల్లో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్ల తరబడి భూగర్భగనుల్లో ఆశించిన మేరకు ఉత్పత్తి నమోదు కాక నష్టాలు ఎదురవుతుండగా యాజమాన్యం నష్టనివారణ చర్యలపై దృష్టి సారించింది. ప్రతీ టన్ను బొగ్గు ఉత్పత్తికి అంతా కలిపి రూ.9వేల వరకు వ్యయం అవుతుండగా, మార్కెట్లో రూ.3,500కు మించి రావడం లేదు. ఫలితంగా దాదాపు రూ.5,500 మేర ప్రతీ టన్నుకు నష్టం వాటిల్లుతోంది. సింగరేణి వ్యాప్తంగా 22 భూగర్భగనుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గడిచిన ఐదేళ్లలో భూగర్భ గనుల ద్వారా 3,55.65 లక్షల టన్నుల ఉత్పత్తి చేయగా, రూ.14,198 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఉత్పత్తి పెరిగితేనే తగ్గనున్న నష్టాలు 2024–25 ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు భూగర్బగనుల్లో 4,83,500 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3,76,471 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి(78 శాతం) నమోదైంది. ఈ లెక్కల ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 28.14 టన్నులు సాధిస్తే, టన్నుకు రూ.8,820 వ్యయమవుతుందని అంచనా. ఈ బొగ్గును రూ.4,892 చొప్పున అమ్మగలిగినా టన్నుకు రూ.3,928 నష్టం వస్తుంది. మొత్తంగా సంస్థకు రూ.1,105 కోట్ల నష్టం ఎదురయ్యే అవకాశముంది. దీన్ని సరిదిద్దేలా కంపెనీ నిర్దేశించిన లక్ష్యం మేరకు 4,83,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగలిగితే టన్ను వ్యయం రూ.7,770కు తగ్గి, నష్టం కూడా టన్నుకు రూ.2,916, మొత్తంగా రూ.985 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు. ఎస్డీఎల్ పనిగంటలు పెంచితే.. సింగరేణిలోని 22 భూగర్భగనుల్లో 16 గనుల్లోనే ఎస్డీఎల్ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఇవి రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే రోజుకు ఒక్కో యంత్రం 142 టన్నుల ఉత్పత్తి చేయగలుగుతాయి. కానీ ప్రస్తుతం ఆరు గంటలే పనిచేస్తుండడంతో ఉత్పత్తి ఆశించిన మేర సాగడం లేదు. ఈనేపథ్యాన యంత్రాలతో మరో రెండు గంటలు పనిచేయిస్తే రోజుకు 142 టన్నుల ఉత్పత్తి నమోదవుతుంది. అలాగే, ఉద్యోగులు, సిబ్బంది సైతం ఎనిమిది గంటల పాటు పనిచేస్తేనే నష్టనివారణ సాధ్యమవుతుందని చెబుతున్నారు.స్థితిగతులను వివరించేందుకు సమావేశాలు.. ఉత్పత్తి వ్యయం తగ్గించడం, బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రస్తుత స్థితిగతులను వివరించేందుకు మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు నిర్వహించాం. సంస్థ ఉద్యోగలంతా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించాం. గత అక్టోబర్‌లో నిర్వహించిన సహపంక్తి భోజనాల ద్వారా కార్మికుల్లో కొంత మార్పు కనిపించింది. మళ్లీ ఇప్పుడు మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాల ద్వారా ఇంకొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. – శాలేంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎంగత ఐదేళ్లలో భూగర్భగనుల్లో ఉత్పత్తి, నష్టాల వివరాలు ఏడాది భూగర్భ గనుల్లో ఉత్పత్తి ఉత్పత్తి వ్యయం అమ్మకం ధర నష్టం మొత్తం నష్టం (లక్షల టన్నుల్లో) (టన్నుకు రూ.ల్లో) (టన్నుకు రూ.ల్లో) (టన్నుకు రూ.ల్లో) (రూ.కోట్లలో) 2019–20 86.65 5,413 3,135 2,325 1,979 2020–21 45.15 9,155 2,935 6,220 2,736 2021–22 64.51 8,210 3,300 4,910 3,145 2022–23 71.99 7,451 4,088 3,363 2,421 2023–24 59.31 9,368 4,628 4,740 2,812 2024–25 28.14 8,820 4,842 3,928 1,105 -
నేడు అండర్–17 బాలికల క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి అండర్–17 బాలికల క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శులు కె.నర్సింహామూర్తి, వి.నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణపత్రాలతో పాటు ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. 2008 తర్వాత జన్మించిన వారు ఎస్సెస్సీ మెమో, స్టడీ సర్టిఫికెట్లతో ఆదివారం ఉదయం 9గంటలకల్లా రిపోర్టు చేయాలని తెలిపారు. సొంతింటి పథకంపై ప్రకటన చేయాలి సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి డే వేడుకల్లో పాల్గొననున్న సీఎండీ బలరామ్ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల స్వంతింటి పథకంపై ప్రకటన చేయాలని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ కోరారు. కొత్తగూడెంలో శనివారం జరిగిన యూనియన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలో సుమారు 40వేల కార్మికులు పనిచేస్తుండగా, 60 వేల క్వార్టర్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో చాలావరకు ఎవరి ఆధీనంలో ఉన్నాయన్న వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారని చెప్పారు. ఇకనైనా శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను సీనియారిటీ ప్రకారం నివాసముంటున్న వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మికులకు 240 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.30 లక్షలు ఇచ్చే విషయమై సింగరేణి డే వేడుకల్లో ప్రకటన చేయాలని కోరారు. కాగా, ఉత్తమ కార్మికుల ఎంపికలో కష్టపడిన వారికి కాకుండా గుర్తింపు సంఘం చెప్పిన కార్మికుల పేర్లు ప్రకటించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఆంజనేయులు, ఆసిఫ్, తిప్పారపు సారయ్య, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోటి పనులు చకచకా..
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 31 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఉత్తర ద్వారంతో పాటు ప్రధాన ఆలయం వెలుపల పంచరంగుల వేసే పనులు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని భద్రుని గుడి, ఇతర ఉపాలయాలకు సైతం రంగులు వేస్తున్నారు. తెప్పోత్సవం నిర్వహించే హంస వాహనాన్ని సిద్ధం చేయాల్సి ఉండగా, ఇతర పనులను సైతం త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 10వ తేదీ తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం టికెట్లను అధికారులు ఆన్లైన్లో ఉంచగా, విక్రయాలు వేగంగా సాగుతున్నాయి. రూ.2వేల విలువైన వీఐపీ టికెట్లు 650 ఆన్లైన్లు అందుబాటులో ఉండగా శనివారం నాటికి 157 అమ్ముడయ్యాయి. రూ.1000 టికెట్లు 200కు 105, బీ సెక్టార్‌కు సంబంధించి రూ.500 విలువైన టికెట్లు 425కు 105, సీ సెక్టార్లో 140కి 38, డీ సెక్టార్లో 100కు 7, ఈ సెక్టార్లో రూ.250 విలువైన టికెట్లు 325కు గాను 31 టికెట్లు విక్రయాలు జరిగాయి.ఆన్లైన్లో వేగంగా టికెట్ల విక్రయం -
పాఠశాలలకు నిలిచిన బియ్యం సరఫరా
నేలకొండపల్లి: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ఉద్యోగుల సమ్మెతో పాఠశాలల్లో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాక మండల విద్యా వనరుల కేంద్రాలు తెరిచేవారు కరువయ్యారు. ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో దాదాపు 632 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియయ్యాన్ని మండల లెవల్ స్టాక్ పాయింట్ నుంచి తీసుకొస్తారు. ఈక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసే సీఆర్పీ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వీరంతా సమ్మెలో ఉండడంతో పాఠశాలలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని మూడు మండలాల్లో మాత్రమే ఎంఈఓలకు వేలిముద్ర అవకాశం ఉండగా ఆ మూడు మండలాల్లోని పాఠశాలలకు బియ్యం చేరింది. మరోపక్క సీఆర్పీల సమ్మెతో మండల విద్యావనరుల కేంద్రాలు తెరిచే వారు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీరోజు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వివరాలను డీఈఓ కార్యాలయానికి చేరవేయడంలోనూ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అలాగే, కేజీబీవీల్లో బోధన కుంటుపడుతోందని ఇప్పటికే విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.సీఆర్పీల సమ్మె ప్రభావమే కారణం -
మొక్కజొన్నకు కత్తెర ‘కాటు’
ఇల్లెందురూరల్: యాసంగిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు అత్యధికంగా మొక్కజొన్న పంట సాగు చేస్తారు. ఈమేరకు దుక్కి సిద్ధం చేసి విత్తనాలు కూడా విత్తారు. అవి మొలకలుగా ఎదుగుతుండగా వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ కత్తెర పురుగు మొదలైంది. కత్తెర పురుగులు ఆకులను తినేయడంతోపాటు మొక్క కాండాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఈ పరిణామం మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. అంతేకాక ఆకులు మాడిపోతుండడం గమనార్హం. కాగా, పురుగు ఉధృతి ప్రారంభదశలోనే ఉన్నందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఇల్లెందు వ్యవసాయశాఖ అధికారి సతీష్ సూచించారు. మార్కెట్లో ఈ పురుగు నివారణ మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కత్తెర పురుగు సూర్యరశ్మి ఉన్నంతసేపు ఆకు కాండంలోనే తలదాచుకుని, రాత్రివేళ బయటకు వచ్చి ఆకులను తింటుందని పేర్కొన్నారు. ఈనేపథ్యాన వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఉదయం లేదా సాయంత్రం క్రిమిసంహారక మందులు ప్రయోగిస్తే ఫలితముంటుందని తెలిపారు.మొలక దశలోనే ఆశిస్తున్న పురుగు -
లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తికి ప్రణాళిక
టేకులపల్లి: ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల సమయమే ఉన్నందున లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేసేలా ప్రణాళికాయుతంగా పనిచేయాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు, ప్లానింగ్) జి.వెంకటేశ్వరరెడ్డి సూచించారు. టేకులపల్లి మండలం కోయగూడెంలోని ఓపెన్‌కాస్ట్‌లో అధికారులతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాలను పరిశీలించి రోజువారి ఉత్పత్తి, రవాణా, ఓబీ వెలికితీతపై ఏరియా జీఎం వీసం కృష్ణయ్యతో సమీక్షించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేస్తూనే రవాణాపై దృష్టి సారించాలని సూచించారు. రక్షణ సూత్రాలు పాటించడంతో పాటు యంత్రాల పనిగంటలని పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమం అధికారులు బొల్లం వెంకటేశ్వర్లు, గోవిందరావు, సౌరభ సుమన్, గంగాధర్‌రావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.