సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు.
తెలుగు ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేద పండితులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని సీఎం వైఎస్ జగన్ తపన పడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment