Dvr. Bhaskar
-
దీపావళి రోజున ఇలా చేయండి
నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి.. చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం... రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. నరకుడు చస్తే పండుగ ఎందుకు? నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది. దీపావళి నాడు ఏం చేయాలి? ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. లక్ష్మీపూజ ఇలా చేయాలి... ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఎన్నో కథలు... మరెన్నో కారణాలు.. లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం. – డి.వి.ఆర్.భాస్కర్ -
Diwali Special 2021: గోరంత దీపం జగమంత వెలుగు
దీపావళి అంటే సరదాలు... సంబరాలు. చిటపటలాడే సీమటపాకాయలు... వెలుగులు చిమ్మే విష్ణుచక్రాలు... ముఖంలోకి వెలుగులు తెచ్చే మతాబాలు కొంటెగా కాళ్ల కిందికొచ్చి కితకితలు పెట్టే భూచక్రాలు ఉగాదికి కవి సమ్మేళనాలు... పంచాంగ శ్రవణాలు అయితే దీపావళికి కథలు.... కవితల పోటీలు కొత్తబట్టల మెరుపులు.. మిఠాయిల ఘుమఘుమలు. పిల్లలు పెద్దలుగా... పెద్దలు పిల్లలుగా మారి చేసుకునే వేయి దీపాల వెలుగుల పండగ. ఇవన్నీ పండగలోని విశేషాలు... దీపావళిరోజు పిల్లలకు తలంటు పోసి కొత్తబట్టలు తొడిగి, రకరకాల పిండివంటలతో అన్నం తినిపించి సాయంత్రం పూట దీపాలు వెలిగించి, దగ్గరుండి మరీ వారిచేత కాకరపువ్వొత్తులూ, చిచ్చుబుడ్లూ, మతాబులూ కాల్పించడం పెద్దలందరూ చేసే పనే! అయితే అసలు ఈ పండుగను ఎందుకు చేసుకుంటున్నామో మాత్రం వాళ్లకి చెప్పడం లేదు. ఏ పండుగనైనా, పర్వదినాన్నయినా సరే... ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుని చేసుకోవడం వల్ల ఎన్నో రెట్లు ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! ధన త్రయోదశి లేదా ధన్‌తేరాస్ దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌తేరాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం. పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని బహుళపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అనిపేరు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారం, వెండి, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేసి, ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు అందమైన రంగవల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి, సిరిసంపదలతో తులతూగుతారని నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతుకు తగినట్లు బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు. పురాణాల్లోని ఓ కథ దీని గురించి తెలియజేస్తుంది. హేమ రాజు అనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుట్టాడు. అతడి పదహారవ ఏట మరణం తథ్యమని జ్యోతిషులు పేర్కొంటారు. అయితే సుమంగళి యోగం ఉన్న ఓ రాజకుమారితో అతడికి వివాహం జరిపించడం వల్ల అతడికి ప్రాణగండం తప్పిపోతుందని తెలుసుకున్న రాజు ఏరికోరి ఆ యోగం ఉన్న ఓ రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించాడు. కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్లైన మూడో రోజు తన భర్తను మృత్యువు నుంచి కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి, జాగారం చేసింది. విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి, ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి, భగవంతుని స్మరిస్తూ, తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచింది. ఆ మర్నాడు ఉదయం యమ ధర్మరాజు సర్పరూపంలో ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసకబారిపోవడమే కాదు, లోనికి ప్రవేశించలేకపోయాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్లిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు త్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ‘ధనత్రయోదశి’ని నిర్వహిస్తున్నారు. చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మరో కథ.. పాలకడలిలో శేషతల్పంపై పవళించే మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి. తన నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై ఓ ముని కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి (మహారాష్ట్ర కొల్హాపూర్) చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి.. లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి, అది ‘ధన త్రయోదశి’ అయింది. ఇవాళ ఆది వైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ‘ధన్వంతరి త్రయోదశి’గానూ భావిస్తారు. అందుకే వైద్యులు ధన్వంతరిని ఘనంగా పూజిస్తారు. ధన్వంతరికి ప్రతిరూపంగా మనకు ప్రాణదానం చేసే వైద్యులను సన్మానించడం, సంభావించడం మంచిది. మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. అందుకే ‘త్రివిక్రమ త్రయోదశి’గా పిలవడమూ పరిపాటి. ఈరోజుకు కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అనే ఇతర పేర్లూ ఉన్నాయి. ఈ పర్వదినాన ఏం చేయాలి? బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. నేడు శుచిగా స్నానాదులు ముగించిన తరువాత, ఏమీలేని పేదలకు భోజనమో, వస్త్రమో, రొక్కమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతుందీ పండగ. స్వర్ణపుష్పాలు లేనప్పుడు, బంగారమంటి మనసుతో అర్చించినా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. నరకచతుర్దశి ఆ పేరెందుకు వచ్చింది? ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత. నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి మూలంగా తప్ప మరేవిధంగానూ మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేశాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వంద్వయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేశాడు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూ వారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన చెరలో ఉంచడం ఇతనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయన వెన్నంటే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాలతో అతడిని నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు నరకుడిపై సుదర్శనాన్ని ప్రయోగించడంతో అతడి శిరస్సు నేలరాలి, మరణం సంభవించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా గుర్తింపు పొందుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో, చీకటిని పారదోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే నరక చతుర్దశిగా మారింది. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగన స్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం. చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వాసం. సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ విశ్వాసం. అజ్ఞానాన్ని, అవిద్యను పారదోలే దీపతోరణాలు లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్నిరకాలైన చీకట్లను, అంటే.. అవిద్యను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు, జ్ఞానప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, çపుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకరవస్తువులయందు, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసిని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి్త. పరధనం కోరని వారు, అబద్ధాలాడని వారు, అప్రియంగా మాట్లాడనివారు.. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రులు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళినాడు బాణసంచా కాల్చడం ఆనవాయితీ. టపాసులు కాల్చేముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్త్రాన్ని చుట్టి, దానిని కాలుస్తూ దుబ్బూ దుబ్బూ దీపావళీ మళ్లీ వచ్చే నాగులచవితి.. అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో పేదవారికి దానధర్మాలు చేయడం, సాటివారికి సాయపడే బాధ్యత పురుషులది, బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం బాధ్యత. ఈ పండుగ సంప్రదాయం ఇది... దీపావళి అంటే దివ్వెల వరుస. దీపావళి రోజు సాయంకాలం... నువ్వులనూనె లేదా ఆవునేతిని మట్టి ప్రమిదెలలో నింపి, దీపాలు వెలిగించాలి. అనంతరం దీపతోరణాలతో గృహాన్ని అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు అందరూ మందుగుండు సామగ్రిని కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఈ వేళ తప్పనిసరిగా లక్ష్మీపూజ చేయాలి. దీపావళి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణ, భారత భాగవతాలను చదివితే ఆ కథలు తెలుస్తాయి. రామాయణంలో తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన రావణాసురుడు మాయోపాయంతో సీతను ఎత్తుకు వెళతాడు. ఆ తర్వాత రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని గురించి మనం ముందే తెలుసుకున్నాం కదా... మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అమృతం కోసం దేవ దానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. నాలుగవ కథగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. ఐదవ వృత్తాంతంగా రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. బాణసంచా ఎందుకు కాలుస్తారు? దీపావళినాడు టపాసులు పేల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకాలైన క్రిమికీటకాలు రోగాలను కలిగిస్తాయి. దీపావళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజే స్తాయి. అలాగని మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. బలిపాడ్యమి దీపావళి మరునాటినుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. కార్తీక శుద్ధపాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈరోజు బలిచక్రవర్తిని పూజించి ‘బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సు రారాతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి. భగినీహస్త భోజనం కార్తీక శుక్ల విదియ తిథి రోజున ‘భగినీ హస్త భోజనం’ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి. సూర్యుని బిడ్డలైన యమునా నది, యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, ఆమె పిలవగా పిలవగా యమధర్మరాజు ఓరోజున యమున ఇంటికి సకల పరివార సమేతంగా వచ్చాడు. ఆరోజు కార్తీక శుక్ల విదియ. ఇంటికి వచ్చిన సోదరుని చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించింది. తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా వరం కోరుకోమనగా. యమున ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజు ఆమె కోర్కెని విని ఆనందించి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతి వంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగల్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చాడు. అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది. తరవాత యమునను పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! దేశవిదేశాల్లో దీపావళి ►దీపావళికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. విశాఖదత్తుడు తన ముద్రారాక్షస నాటకంలో దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా వర్ణించాడు. కౌముది అంటే వెన్నెల. కార్తీక మాసాన్ని కౌముదీ మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాస ప్రారంభంలో దీపాల వెలుగులతో నిండి ఉంటుంది కదా! అంతేకాక ఆ మాసమంతా ముత్తైదువులు దీపాలను వెలిగించి చివరగా జీవ నది ద్వారా స్వర్గానికి చేర్చటం వల్ల తమకు మాంగల్యబలంతోపాటు పాడిపంటల సమృద్ధి, సంతానాభివృద్ధి చెందుతాయని హైందవుల ప్రగాఢ విశ్వాసం. ►ఈ దీపావళి రోజునే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడని చారిత్రక కథ. ఈ దీపావళిని స్వర్ణ దీపావళిగా ఋగ్వేదం విశదీకరించింది. భోజమహారాజు దీనిని ‘సుఖరాత్రి’గా అభివర్ణిస్తే, హర్ష చక్రవర్తి దీపావళిని ‘దీపప్రతి పాదోత్సవం’గా వ్యవహరించాడని నైషధ కావ్యం చెబుతోంది. ►సిక్కులు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించి ప్రార్థనలు జరుపుతారు. వారి మతగురువైన గురు హరగోవింద్ సాహిబ్ మొగల్ చక్రవర్తుల చెరనుంచి విడుదలైన రోజు కనుక గొప్ప ఉత్సాహంగా జరుపుకుంటారు. ►ఈ రోజు జైనులు మహావీరుని నిర్వాణదినంగా భావించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అంతేకాక జైన మత గ్రంథాలను పారాయణం చేస్తారని జైన హరివంశం చెబుతోంది. ►మొగల్ చక్రవర్తి అక్బరు ఈ దీపావళి పండుగను ఘనంగా జరిపించినట్లు అబుల్ ఫజల్ రాసిన ‘అక్బర్నామా’ ద్వారా విశదమవుతోంది. ►ఈ పండుగను ‘దివ్వెల పండుగ’గా రెడ్డి రాజుల కాలంలో వ్యవహరించే వారని ‘సింహాసన ద్వాత్రింశక’ ద్వారా తెలుస్తోంది. ►విజయ నగర రాజుల వైభవ కాలంలో అత్యంత వైభవోపేతంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్నట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. అంతేకాక విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో కాంటి’ దీపావళిని విశదపరచాడు. ►ఈ పండుగను ‘యక్షరాత్రి’ గా జరిపినట్లు తెలుస్తోంది. ‘జ్యోతిష రత్నమాలను’ రచించిన ‘శ్రీపతి’ అనే మరాఠీ కవి దీపావళిని దాని ప్రాశస్త్యాన్ని వివరించాడు. ►జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరిసి దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా చాటే ప్రతీతి ఉంది. ►వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుతారు. మానవునిలో దాగి ఉన్న విచారా (చీకటి)న్ని పోగొట్టి ఆనందాన్ని (వెలుగు) వికసింపచేసేది. దీపాలు వెలిగించడం సంతోషానికి సంకేతం. యావద్భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకోవడం విశేషం. ►గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో దీపావళిని రైతులు ‘పశుపూజారి’ దినోత్సవంగా జరుపుకుంటారు. ‘ధన్‌తేరాస్’ పేరున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గోవర్ధనగిరిని నిర్మించి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ‘భారత్ మిలన్’ పేరిట దీపావళి జరుగుతుంది. ►రాజస్థాన్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి నాడు భూతబలి ఇస్తారు. అంటే కుక్కలకు, కాకులకు ఆహారాన్ని పెట్టి పసుపు కుంకుమలతో పూజిస్తారు. ‘అన్నకూట్’ అన్న పేరుతో మధుర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టి ఆదరిస్తారు.‘గోవర్థనగిరి’ వారు నరక చతుర్దశి, దీపావళి రెండు రోజులు జరుపుతారు. ►పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కాళీపూజలు జరుపుతారు. ఈ పూజను ‘జగద్ధాత్రి’ అనిపిలుస్తారు. కేరళలో బలిచక్రవర్తిని జయించిన రోజుగా పరిగణించి దీపావళి పండుగను జరుపుతారు. ఇలా భారతదేశంలోనే కాక దేశవిదేశాల్లో అనాదిగా అన్ని మతాలవారు, అన్ని వర్గాల వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అతిముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. – డి.వి.ఆర్. భాస్కర్ చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
కృష్ణాష్టమి: నేడూ, రేపూ కూడా జరుపుకోవచ్చు
ఆయన రూపం నల్లనిది. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది. దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి నమ్మకంగా నిలిచాడు శ్రీ కృష్ణ భగవానుడు. అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. సచ్చిదానంద రూపం. ఆనంద స్వరూపం. కృష్ణుడి పేరు తలుచుకుంటేనే జవసత్వాలు ఉట్టి పడతాయి. ఆయన చరితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఆయన తత్త్వాన్ని తెలుసుకుందాం. ఆనందతత్వం... ప్రేమతత్వం... స్నేహతత్వం... ప్రకృతితత్వం... నాయకత్వం... ఇవే ఆయన లక్షణాలు. కృష్ణ తత్వం చదివిన వారికి నిజమైన ప్రేమ తత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా స్త్రీలతో పరుషంగా మాట్లాడినట్లు చూడం. ఆయన రాధాదేవి ప్రేమామృతంలో ఓలలాడాడు. గోపికల మదిలో వారి ఇష్టసఖునిగా కొలువుదీరాడు. రుక్మిణి దేవి భక్తి ఆరాధననూ ఆనందించాడు. సత్యభామ గడసరి తనం, శక్తివంతమైన మహిళగా ఆమెపట్ల కూడా అదే సున్నిత్వాన్ని కనబరిచాడు. లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే స్త్రీలు ఎప్పుడు అచలంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వాన్ని ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహా దేవుడు అయినా ఏ ప్రత్యేకత లేకుండా అందరితోటీ అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది. శిఖి పింఛ మౌళి నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు. వేణు సందేశం అలాగే మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, యుద్ధరంగాన కర్తవ్య విమూఢుడై వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...ఆయన మోము మీద చిరునవ్వు చెదరలేదు. అందుకే ఆయన పరమాత్ముడయ్యాడు. ఆ చిరునవ్వుల సమ్మోహన రూపాన్ని మనసులో నిలుపుకుంటే మనమూ ఆనందంగా ఉండగలం. స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే... వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు. అందువల్లే కృష్ణాష్టమి విషయంలో కొద్దిపాటి సందేహం తలెత్తుతుంటుంది. స్మార్తులను, వైష్ణవులను దృష్టిలో పెట్టుకుంటే నేడూ, రేపూ కూడా ఆ పర్వదినాన్ని జరుపుకోవచ్చు. – డి.వి.ఆర్. ఆత్మ ధర్మం మార్పు చెందని గుణానికే ‘ధర్మం’ అని పేరు. అలా ప్రతి ఒక్కదానికీ మార్పుచెందని ధర్మమంటూ ఒకటుంటుంది. అలాగే ఆత్మకుండాల్సిన ధర్మాన్ని శ్రీచైతన్య మహాప్రభు ఇలా వివరించారు: ప్రతి జీవుని ధర్మం సేవించడమే. ఒక తల్లి తన బిడ్డను సేవిస్తుంది. పిల్లాడు తల్లిదండ్రులను సేవిస్తాడు. తండ్రి కుటుంబాన్ని సేవిస్తాడు, లేదా ఒక కార్యాలయంలోని యజమానిని సేవిస్తాడు. ఒక మంత్రి తన శాఖను సేవిస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రధానమంత్రి ఒక దేశాన్ని సేవిస్తూ వుంటారు. అయితే, పై సేవలేవీ శాశ్వతమైనవి కావు. కాని, భగవంతుని సేవ మాత్రం శాశ్వతమైనది. ఎందుకంటే, భగవానుడు ఒక్కడే శాశ్వతుడు గనుక. ఆ భగవానుడిని సేవించడమే నిజమైన ధర్మం. శ్రీ కృష్ణుడిని సేవించడం ఎలా? భగవంతుడైన శ్రీ కృష్ణుడిని సేవించడమే ఆత్మను సంతృప్తిగావించు ధర్మం. అట్టి సేవ లౌకిక స్వలాభాపేక్ష రహితమై వుండాలి. సకల సర్వావస్థల్లోనూ శ్రీ కృష్ణుని సేవించగలగాలి. అటువంటి నిరంతరాయమైన, నిరపేక్షమైన సేవయే ఆత్మను, హృదయాన్ని పరిపూర్ణంగా సంతృప్తిపరచగలదు. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు ప్రబోధించినట్లు... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మహా మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా ప్రతిరోజూ 16 మాలలు జపించగలిగితే శారీరక, హృదయ దౌర్బల్యాలనుంచి విముక్తులమై భగవంతుని సేవలో ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని పొందగలం. శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభు అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్మెంట్, హైదరాబాద్ -
ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!
ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం. అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఉగాది పంచాంగ శ్రవణం రోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ఎలా జరుపుకోవాలి? తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి. నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి. అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి. కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే ! నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !! నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది. ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి. బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే! ప్లవ అంటే... ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలకూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ఆ పేర్లు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాన్ని అన్యాపదేశంగా చెబుతుంటాయి. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టే కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలలో చీకటిని నింపిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. నేడు మనం అడుగు పెడుతున్న సంవత్సరం ప్లవ. అంటే తెప్ప లేదా చిన్న నావ అని అర్థం. అలాగే దాటించే సాధనమనీ, తేలికగా ఉండేదనీ, నీటి వనరులు సమృద్ధిగా లభించేదనీ... రకరకాల అర్థాలున్నాయి. మనం మాత్రం ఈ సంవత్సరం నీటివనరులు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలనీ, కష్టాల నుంచి తేలికగా అందరినీ ఒడ్డుకు చేర్చాలనీ అర్థాలు తీసుకుందాం. అందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం గడిచిపోవాలని కోరుకుందాం. పండగ వేళ... తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు.. ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది... ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే.. ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి.. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్ఈడి బల్బులతో అలంకరిస్తే సరి. సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది. ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు. ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు. పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది. – డి.వి.ఆర్. భాస్కర్ -
పితృదేవతలు తరించే పక్షం మహాలయం
మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా... తన మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి, అతని సంస్కారానికీ, సంçస్కృతికీ కారణం. అందుకనే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తల్చుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనవి మహాలయపక్షం రోజులు. చనిపోయినవారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగా నిర్వహించకపోతే మనిషికి ప్రేతరూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా... పూర్వీకులను తల్చుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనలేం కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్నీ మహాలయ పక్షమని అంటారు. మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షమని కూడా పేరు. ఇప్పటివరకూ మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట. అంతేకాదు! మనకి రక్తసంబంధం లేని గురువులు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు. కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగకపోవచ్చు. అలాంటివారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడవ వచ్చు. మహాలయం పక్షంలోని ఒకో రోజుకీ ఒకో ప్రత్యేకత ఉంది. ఒకో కారణంతో చనిపోయినవారికి ఒకో రోజుని కేటాయించారు. క్రితం ఏడు చనిపోయినవారికీ, భర్త ఉండగానే చనిపోయినవారికీ, పిల్లలకీ, అర్ధంతరంగా చనిపోయినవారికీ... ఇలా ఒకొక్కరికీ ఒక్కో తిథినాడు తర్పణం విడవడం మంచిదని చెబుతారు. ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం వీడవచ్చని చెబుతారు. అందుకే ఆ అమావాస్య రోజుని ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం. దీనినే పితృపక్షం అని కూడా అంటారు. కాలం చేసిన పెద్దవారిని తలుచుకుని వారి పేరిట పితృకర్మలు, దానధర్మాలు చేస్తుంటారు. మహాలయ పక్షం ప్రాశస్త్యం గురించి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఓ సందర్భంలో ఇలా వివరించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ’ అని వేదోక్తి. తల్లిదండ్రులు దైవసమానులు. వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధకర్మలు చేయాలి. అయితే ‘‘మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్న పిండాలు, ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా..? చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా..? పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్లీ జన్మించి ఉంటే, వారి కోసం ఇవన్నీ చేయడం పిచ్చి పని’’ అని కొందరి వాదన. ‘‘పట్టణంలో చదువుకుంటున్న కుమారుడికి డబ్బు పంపించడానికి ఓ మోతుబరి రైతు పోస్టాఫీసుకి వెళ్లాడు. అక్కడి గుమాస్తాకు డబ్బులిచ్చి మనియార్డర్ ద్వారా తన కొడుక్కు పంపాల్సిందిగా కోరాడు. కాసేపటికి ఆ గుమాస్తా ‘మీ అబ్బాయికి డబ్బు పంపించాము.. రెండుమూడు రోజుల్లో అందుతుంద’ని చెప్పాడు. ఆ రైతుకు నమ్మకం కుదరలేదు. తానిచ్చిన పైకం ఇక్కడే ఉండగా.. డబ్బు తన అబ్బాయికి ఎలా అందుతుందో అర్థం కాలేదు. కానీ అతడి అబ్బాయికి డబ్బు చేరింది. పితృదేవతలకు పిండప్రదానం చేయడమూ ఇలాంటిదే. శాస్త్ర ప్రకారం శ్రాద్ధం శ్రద్ధగా నిర్వర్తిస్తే ఆ ఫలం పితృదేవతలకు అందేలా దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టయితే భోజనం గ్రాసం రూపంలో అందుతుంది. వారు ఏ లోకంలో ఉన్నా.. వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫలం అందుతుంది. పరాయి ఊళ్లో ఉన్న వ్యక్తికి డబ్బును చేరవేర్చే మార్గం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు.. మరో లోకంలో ఉన్న పెద్దలకు శ్రాద్ధఫలం దక్కే మార్గం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదా..? ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు నియమం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలు తెలిపేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది. (సెప్టెంబర్ 2, బుధవారం నుంచి 17 వరకు మహాలయపక్షం) – డి.వి.ఆర్. ఇది పితృపక్ష పుణ్యకాలం. పితృదేవతల రుణం తీర్చుకునే క్రమంలో పితృకార్యాలని క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేసే వారికి తిరుగుండదని ధర్మం చెబుతోంది. విష్ణుపురాణంలోని 14వ అధ్యాయంలో, పితృదేవతార్చనను పార్వణ విధానంలో (అంటే బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టి) చేయలేని వారు, హిరణ్యశ్రాద్ధం చేయలేని వారు, పిండ ప్రదానాలు చేయలేనివారు, కనీసం ఎనిమిది నువ్వుగింజలు వేలికి అద్దుకొని నీరు విడిచినా సంతోషిస్తామని పితరులు పితృగీతలో చెప్పారు. గోసేవ చేసి ఒకరోజు ఆవు ఎంత తింటే అంత మేత ఎక్కడ నుంచైనా గడ్డి కోసుకు వచ్చి వేయమని చెప్పారు. మనసుకు సంతోషంగా, ఆర్థిక భారం లేకుండా ఎవరైనా ఒక పేదవాడికి ఒకరోజు భోజనద్రవ్యాలు లేదా ధనం ఇవ్వమని చెబుతోంది. లేకపోతే నల్ల చీమలకు లేదా కాకులకు ఆహారం ఇవ్వాలి. ఇలా ఏదో ఒక మార్గంలో మన విధిని ఆచరించి పితృదేవతల కృపకు పాత్రులవుదాం. -
దేవర్షి నారదుడు
మనందరికీ కూడా నారదుడు దేవర్షి అనీ, బ్రహ్మ మానస పుత్రుడనీ, నిరంతరం నారాయణ నామాన్నే జపిస్తూ, త్రిలోక సంచారం చేస్తూ ఉంటాడని తెలుసు. అయితే నారదుడు ఏ కృషీ లేకుండా దేవర్షి కాలేదు. అందుకు కఠోర తపస్సు చేశాడు. అదేంటో చూద్దాం. దేవర్షి కావడానికి ముందు ఒక దాసికి కొడుకై జన్మించాడు నారదుడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంట పని చేస్తుండేది. ఆ ఇంట సదా మునులు, జ్ఞానులు అతిథిసత్కారాలను పొందుతూండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్ళు అందిస్తూ, సపర్యలు చేస్తూ, వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను, విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూండేవాడు. తమకు ఎప్పుడూ నీరు ఇచ్చేవాడని ఆ మునిగణం ఆ పసివాడికి నారదుడు అని పేరు పెట్టి, ఎంతో ఆప్యాయంగా ‘‘నారదా!’’ అని పిలుస్తూండేవారు. అంతలో అతని తల్లి విధివశాత్తూ పాముకాటుతో మరణించింది. అంతవరకూ అతనికి తండ్రి ఎవరో, ఏమైనాడో తెలియదు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో ఆ పసివాడు దిక్కులేనివాడయ్యాడు. ఇదిలా ఉండగా పులిమీద పుట్రలాగా కొద్ది రోజులకే ఇంటి యజమాని కూడా గతించాడు. దాంతో నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ, ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతణ్ణి దొంగను చూసినట్టు చూసి తరిమేవారు. తండ్రి ఎవరో తెలీని పాపిష్టివాడని హీనంగా తిట్టేవారు. నారదుడు పరమసాధువు అవడం చూసి దుడుకుపిల్లలు రాళ్ళు రువ్వీ, కొట్టీ, ఏడిపించి ఆనందిస్తూండేవారు. ‘‘నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్నింత అన్యాయంగా చూస్తున్నారు? క్రిమి కీటకాలు, అడవులో మృగాలు హాయిగా బతుకుతున్నాయి!’’ అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవి దారి పట్టాడు. అతనికి మునులు, జ్ఞానులు చెప్పుకొనే విషయాలు గుర్తుకొచ్చాయి. ‘‘నేనెందుకు తపస్సు చెయ్యకూడదు! గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి!’’ అని అనుకుంటూ తపస్సు మొదలు పెట్టాడు నారదుడు. ‘‘దిక్కులేనివాడికి ఎవడు దిక్కో, ఈ లోకానికంతకూ ఎవడు తండ్రో ఆయనే నాకు అన్నీ! నన్ను ఆయనేం చేసినా సరే, అంతా ఆ జగత్పిత ఇష్టం!’’ అంటూ కాల స్ఫురణ లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు. ఎన్నో పరీక్షలకు గురైన నారదుడి అచంచలమైన తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతణ్ణి ఆవరించింది. జ్యోతిరూపంలో నారదుడికి సాక్షాత్కరించిన విష్ణువు, ‘‘వత్సా నారదా! నీ దృఢదీక్ష, తపస్సు నన్ను మెప్పించాయి. వీటి ఫలితంగా నీవు బ్రహ్మ మానసపుత్రుడవై జన్మిస్తావు. నీలో నా అంశ వుంటుంది. చిరంజీవిగా త్రికాలవేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను స్మరిస్తూ, నా లీలలను గానం చేస్తూ ఉంటావు. అయితే గతజన్మల కర్మ ప్రారబ్ధం కారణంగా నీకు కలహభోజనుడు అనే పేరు వస్తుంది. అయినా చింతించనక్కరలేదు. నీవు పెట్టే కలహాలన్నీ లోకకల్యాణానికే కారణాలవుతాయి’’ అని వరమిచ్చాడు. అన్నట్లుగానే నారదుడు విష్ణువులో లీనమైపోయి, అనంతరం విష్ణు అంశతో బ్రహ్మకు కుమారుడై, దేవమునిగా పూజలందుకున్నాడు. కష్టాలను చూసి కుంగిపోకూడదు. అవమానాలను, అవహేళనలను అసలే లెక్కచేయకూడదు. ఎన్నో సుత్తి దెబ్బలు తట్టుకున్న తర్వాత కదా, బంగారం ఆభరణంగా భాసించేది. – డి.వి.ఆర్. భాస్కర్ -
అగ్నిలో సీత
రావణ సంహారం జరిగింది. లంకాయుద్ధం ముగిసింది. రాముడి ఆజ్ఞపై లక్ష్మణుడు విభీషణునికి లంకాధిపతిగా పట్టం కట్టాడు. రామచంద్రుని ఆశీస్సులు అందుకున్న అనంతరం విభీషణుడు సీతాదేవిని రాముని సన్నిధికి తీసుకువస్తున్నాడు. ఇంకొన్ని అడుగులలో రాముని చేరుతుందనగా రాముడి కంఠం కంగున మోగింది. ‘‘సీతా! నీ కోరిక మేరకు యుద్ధంలో రావణుని సంహరించాను. అయితే ఇంతకాలం పర పురుషుని నీడలో ఉన్నావు. ఇప్పుడు కూడా నీవు కావాలంటే విభీషణుడి పాలనలో ఉన్న లంకానగరంలో ఉండిపోవచ్చు లేదంటే కిష్కింధాధిపతి అయిన సుగ్రీవుడి సంరక్షణలో ఉండవచ్చు... ఈ ఇరువురూ కాదంటే సొంత మరుదులైన లక్ష్మణ భరత శత్రుఘ్నుల వద్ద కూడా ఉండవచ్చు. అంతేకానీ నేను మాత్రం నిన్ను యథాతధంగా ఏలుకోలేను’’ అన్నాడు. ఈ మాటలు శరాఘాతంలా తగిలాయి సీతమ్మకు. ఒక్కక్షణం కన్నులెత్తి రాముని వైపు తదేకంగా చూసి, తర్వాత లక్ష్మణునితో–‘‘లక్ష్మణా! నేను అపనిందకు గురయ్యాను. ఇక నేను జీవించి ఉండవలసిన అవసరం లేదు. నీవు ఇక్కడ తక్షణం అగ్నిని రగుల్కొల్పు’’ అంది సీత. లక్ష్మణుడు బాధతో అన్నయ్యవైపు చూశాడు. రాముడు మౌనంగా తలదించుకున్నాడు. అన్నయ్య మౌనాన్నే అంగీకారంగా భావించిన లక్ష్మణుడు అక్కడ చితిపేర్పించాడు. మండుతున్న చితిని చూసింది సీత. రాముని చుట్టూ ప్రదక్షిణ చేసింది. అనంతరం జ్వాజ్వల్యమానంగా రగులు తున్న అగ్నితో ‘‘ఓ అగ్నిభట్టారకా! నా హృదయం సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరాముని యందే ఉంటే గనుక నన్ను రక్షించు. నేను దోషరహితురాలనైతే గనుక నన్ను కాపాడు. నా ప్రవర్తనలో తేడా ఉన్నా, మనసులో ఎటువంటి చెడు తలంపులు ఉన్నా నన్ను వెంటనే నీలో ఆహుతి చేసుకో’’ అని పలికి అక్కడున్న వారందరూ హాహాకారాలు చేస్తూండగా అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూడలేనట్టు అందరూ కన్నులు మూసుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాయి. ఉన్నట్టుండి అక్కడ కన్నులు మిరుమిట్లు గొలిపేంత వెలుగు వచ్చింది. చితాగ్ని నుంచి అగ్నిదేవుడు పైకి వచ్చాడు. ఆయన వడిలో పుత్రికలా సీత కూచుని ఉంది. మునుపటికన్నా ఆమె మరింత కాంతిమంతంగా ఉంది. ఆమె సౌందర్యం మరింత పవిత్రంగా ఉంది. అగ్నిదేవుడు సీతను నడిపించుకుంటూ రాముని వద్దకు తీసుకు వచ్చాడు. రామా! ఈమె నిష్కళంకురాలు. నిరపరాధి. పరమ పతివ్రత. ఈమెయందు ఏ దోషమూ లేదు. నీవు ఈమెను నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. ఈమెవల్ల నేను పునీతుడనయ్యాను.’’ అంటూ ఆమెను రామునికి అప్పగించాడు. ‘‘అగ్నిదేవా!’’ ఈమారు రాముని కంఠం గద్గదమైంది. ‘‘నా అర్ధాంగి సీత అమలిన చరిత అనీ, సాధ్వీమణి అనీ నాకు తెలుసు. నా ప్రాణేశ్వరి హృదయం ఆమె ప్రాణనాథుడనైన నాకు తెలియదా! అయితే ఆమె ఇంతకాలం పరాయి రాజ్యంలో మహా కాముకుడైన రావణుని ఏలుబడిలో ఉంది. ఆమెను వెంటనే నేను స్వీకరిస్తే నన్ను లోకం తప్పుగా అనుకోదా? ఆమెను గురించిన ఒక్క నిందనైనా నేను కలలో కూడా సహించలేను. ఆమె పాతివ్రత్యం, పవిత్రత అందరికీ తెలియాలనే నేను ఈ పరీక్ష పెట్టాను. ఇక ఆమెను నా నుండి ఎవరూ వేరుచేయలేరు’’ అంటూ ముందుకు నడిచి ఆమె చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు. రాముడు సీతను అనుమానించాడనేది అపప్రథ మాత్రమే. ఆమె పాతివ్రత్యం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోనే రాముడామెకు అగ్నిపరీక్ష పెట్టాడన్నది యథార్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
సరైన ప్రాయశ్చిత్తం
భృగు మహర్షి పుత్రుడు చ్యవనుడు. తపస్సు చేస్తూ ఆయన ఒక ప్రదేశంలో కూర్చుని శిలలా ఉండిపోయాడు. అలా చాలాకాలం నిశ్చలంగా ఉండడంతో అతనిమీద చీమలు పుట్టలు పెట్టాయి. అతని ఒళ్ళంతా లతలు అల్లుకున్నాయి. అయినా ఆయన తన తపస్సు ఆపలేదు. ఒకసారి శర్యాతి వేటకోసం అక్కడికి వచ్చాడు. తండ్రితోబాటు కుమార్తె సుకన్య కూడా వచ్చింది. అక్కడ ఆమె సఖులతో యథేచ్ఛగా విహరిస్తూ పుట్ట దగ్గరకొచ్చింది. పుట్టలో మెరుస్తున్న కళ్ళను చూసి, మిణుగురు లేమో అనుకుని కుతూహలంతో అక్కడ పడి ఉన్న పుల్లను తీసుకొని పొడిచింది. ఇంతలో చెలులెవరో పిలవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. చ్యవనుడి తపో మహిమ వల్ల శర్యాతి సైన్యానికి మలమూత్ర బంధనం కలిగి సైన్యం అంతా విలవిల్లాడారు. అప్పుడు శర్యాతి తన పరివారాన్ని పిలిచి ‘‘ఈ పరిసరాలలో తపశ్శాలి, వృద్ధుడు, మహాత్ముడు అయన చ్యవన మహర్షి తపోదీక్షలో లీనమై ఉంటాడు. మీలో ఎవరైనా తెలిసీ తెలియక ఆయనకు హాని కలిగించలేదు కదా?’’ అని అడిగాడు. తమకేమీ తెలియదని చెప్పారు సైనికులు. మలమూత్ర అవరోధం వలన బాధపడ్తున్న సైన్యాన్ని, కారణమేమిటో తెలియక చింతిస్తున్న తండ్రిని చూచి సుకన్య తండ్రి దగ్గరకు వెళ్లి ‘‘వనంలో విహరిస్తున్న నేను మెరుస్తున్న ప్రాణి కండ్లను చూసి మిణుగురు పురుగులుగా భావించి దగ్గరకు వెళ్ళి పుల్లతో పొడిచాను నాన్నా! బహుశా ఆయనే మీరు చెబుతున్న మహర్షేమో! వెంటనే వెళ్లి చూద్దాం పదండి నాన్నా!’’అంటూ తండ్రిని చెట్టు వద్దకు తీసుకెళ్లింది. శర్యాతి వెంటనే ఆ పుట్టదగ్గరకు వెళ్ళి ‘నా కుమార్తె అజ్ఞానంతో ఈ అపరాధం చేసింది. ఆమెను క్షమించండి మహర్షీ’’ అన్నాడు.అందుకు చ్యవనుడు ఆగ్రహంతో ‘‘నీ కుమార్తె నా కన్నులు పొడిచి నన్ను అంధుని చేసింది. ఈ వయసులో నన్ను చూసేవారెవరున్నారు. అందువల్ల ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తే మిమ్మల్ని క్షమిస్తాను’’ అన్నాడు. ఆ మాటలకు శర్యాతి నిర్విణ్ణుడై కుమార్తె వంక నిస్సహాయంగా చూశాడు. సుకన్య వెంటనే ‘‘నా మూలంగా ఆ మహానుభావుడికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలంటే నన్ను ఆయనకు ఇచ్చి వివాహం చేయడమే ఉత్తమం’’ అంది. దాంతో శర్యాతి తన కుమార్తెను చ్యవనునికిచ్చి వివాహం చేశాడు. ఋషి శర్యాతిని, అతని సైన్యాన్ని అనుగ్రహించాడు. శర్యాతి సైన్యంతో తన నగరానికి వెళ్లిపోయాడు. సుకన్య తాపసి అయిన భర్తకు భక్తి శ్రద్ధలతో సేవ చేసి మెప్పించింది. ఒకసారి అశ్వనీ దేవతలు ఆమెను పరీక్షించాలని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. ఆమె దేనికీ లొంగలేదు. దాంతో వారు ఆమె పాతివ్రత్యానికి సంభ్రమాశ్చర్యాలకు లోనై, చ్యవన మహర్షి యవ్వనంతో, మంచి రూపంతో ఉండేలా వరాన్ని అనుగ్రహించారు. తెలిసీ తెలియక చేసిన పొరపాటును నిజాయతీగా ఒప్పుకుని, అందుకు ప్రాయశ్చిత్తంగా ముసలి వాడైన, అంధుడైన, నిర్ధనుడైన వ్యక్తిని భర్తగా అంగీకరించి, ఆయనకు నిస్వార్థంగా సేవలు చేసి, మధ్యలో ఎన్ని ప్రలోభాలు ఎదురైనా లొంగక అందుకు ప్రతిఫలంగా భర్తకు పునర్యవ్వనాన్ని, అందమైన రూపాన్ని పొంది, సుఖించగలిగింది. తప్పుని ఒప్పుకుని దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే కలిగే ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది అన్నదే ఇందులోని నీతి. -
స్థితప్రజ్ఞారాముడు
రామ రావణ యుద్ధం ముగిసింది. లోక కంటకుడైన రావణుడు హతం అయినందుకు సంతోషంతో దేవతలందరూ విచ్చేశారు. వారితోపాటు అక్కడికి వచ్చిన దేవేంద్రుడు ‘రామా! మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృథా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో‘ అన్నాడు. రాముడన్నాడు ‘నాకోసమని ఎన్నో వానరాలు, భల్లూకాలు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్నిటికి చేతులు, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, మరికొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనానికి చేరాయి. మీరు నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనానికి వెళ్ళిన వానరాలన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళీ జవసత్వంతో పైకిలేవాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు లభించాలి, సమృద్ధిగా తేనె ఉండాలి, తాగడానికి మంచి నీరు ఉండాలి’ అన్నాడు. ఇంద్రుడు ‘తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను’ అన్నాడు. వెంటనే యుద్ధభూమిలో పడి ఉన్న వారు పునరుత్తేజంతో లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళిన వానరులందరూ సంతోషంతో తిరిగి వచ్చేశారు. అందరూ తమ కుటుంబ సభ్యులను కలుసుకుని వేడుకలు చేసుకున్నారు. మరునాడు ఉదయం రాముడు విభీషణుని పిలిచి ‘నేను ఇక్కడినుంచి తొందరగా అయోధ్య చేరుకోవడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు చేయగలవా?’ అన్నాడు. ‘‘రామచంద్రా! మన దగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు’’ అంటూ విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక అక్కడున్న వాళ్ళందరూ ‘రామా! మిమ్మల్ని విడిచిపెట్టి మేముండలేము, మేము మీతో అయోధ్యకి వస్తాము. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది’ అన్నారు. రాముడు సరే అనేసరికి వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతలో సుగ్రీవుడు ‘రామా! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము’ అన్నాడు. అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి వెంటనే రమ్మన్నాడు. వాళ్ళు మానవకాంతలుగా కామరూపాలని పొంది, పట్టుబట్టలు, ఆభరణాలు ధరించి, పుష్పక విమానానికి ప్రదక్షిణం చే సి, లోపలికి ఎక్కి ‘సీతమ్మ ఎక్కడ?’ అని అడిగారు. ‘ఆవిడే సీతమ్మ’ అని చూపిస్తే వెళ్ళి ఆమెకి నమస్కరించారు. సీతమ్మ వాళ్లను సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది. ‘‘సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి ఆశ్రమం. అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు’’ అని రాముడు వివరిస్తున్నాడు. ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భరద్వాజుడిని సందర్శించి, ఆయన ఆనతి మేరకు అక్కడ విశ్రాంతి తీసుకుని, ఆతిథ్యం స్వీకరించి అక్కడినుంచి వెళ్లేటప్పుడు రాముడు హనుమని పిలిచి ‘హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిబేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు స్నేహితుడు. అతడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా’ అన్నాడు. ఆ తరువాతి కథ అప్రస్తుతం. ఇక్కడ గ్రహించవలసింది రాముడు కనబరచిన స్థితప్రజ్ఞతను, సూక్ష్మగ్రాహిత్వాన్నీ... – డి.వి.ఆర్. భాస్కర్ -
సాగర మథనం...
దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించి, అమృతాన్ని సాధించటానికి తయారయ్యారు. రాక్షసులకూ అమరత్వం సిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది? అయితే అలా కాకుండా చేసే బాధ్యత విష్ణుమూర్తిదే కాబట్టి అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి, క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారందరూ. అంతవరకూ బాగానే ఉంది కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది మామూలు వారికి శక్యం కాని పని కదా... శ్రీ మహావిష్ణువు తానే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. సాగర మథనం ప్రారంభమైంది. క్షీరసాగర మథనం సమయంలో, రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ, తమ భుజబలం అంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మేమేమీ తక్కువేమీ లేదని బలంగా లాగారు. మథనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం విషాన్ని కక్కింది. హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది. ఆ విషాగ్ని కీలలకు రాక్షసులు కొందరు మలమలమాడి మసి అయ్యారు. హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది. అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు హాలాహలాన్ని ఉండలా చేసి దానిని నేరేడుపండులా గుటుక్కున మింగబోయాడు. పార్వతీదేవి అది ఆయన ఉదరంలోకి చేరకుండా పరమేశ్వరుడి గొంతును మెల్లగా అదిమింది. అలా శివపార్వతులు హాలాహలాన్ని గొంతులోనే ఉంచి లోకాల్ని రక్షించారు. శివుడావిధంగా గరళ కంఠుడనిపించుకున్నాడు. శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా చల్లని చంద్రుణ్ణి తలపై ధరించి, చంద్రశేఖరుడయ్యాడు. ప్రస్తుతానికి విషగండం తప్పింది అని ఊపిరి పీల్చుకునేంతలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. మందరపర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం దాల్చి సముద్రంలోకి ఒరిగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ పైకి తెచ్చాడు. మహాకూర్మమై పర్వతం అటూ ఇటూ బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో తొక్కిపెట్టి ఉంచాడు. అదే సమయంలో దేవతలతో కలిసి సముద్ర మథనం చేశాడు. ఇలా బహురూపాలతో విష్ణువు కనిపించాడు. ఇక ఇప్పుడు సాగర మథనం సక్రమంగా సాగింది. క్షీరసాగరం నుంచి చంద్రుడు, లక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతమనే తెల్లటి ఏనుగు, ఉచ్ఛైశ్రవమనే తెల్లటి గుర్రం, సుర అనే మత్తూ, ఉత్తేజమూ కల్గించే పానీయమూ ఇంకా ఎన్నెన్నో ఉద్భవించాయి. సురను దేవతలు స్వీకరించి సురులు అనిపించుకున్నారు. చిట్టచివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆయుర్వేదానికి మూల విరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో, అమృత కలశాన్నీ, అనేక ఓషధులనూ ధరించి, పద్మాసనంపై కూర్చొని, సముద్రం నుంచి వచ్చాడు. లక్ష్మీదేవి శ్రీవత్సకౌస్తుభ మణులతో కూడిన వైజయంతిమాలను వేసి విష్ణువును వరించింది. విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు. ఇలా ఎన్నెన్నో విశేషాలు, దైవసహాయాలు జరిగాక అమృతం సిద్ధించింది. దేవదానవుల లక్ష్యసాధన నెరవేరింది. అందుకే ఏదైనా శ్రమదమాదులతో కూడిన కార్యసాధనకు ‘సాగర మథనం’ అనే మాట పర్యాయపదంగా నిలిచింది. బృహత్తర కార్యక్రమాన్ని ఏదైనా తలపెట్టినప్పుడు దానికి ఆటంకం కలిగించే అనేక విఘ్నాలు సంభవించవచ్చు. అయినా సరే, ఓర్పుగా నేర్పుగా ఆ పనిని, మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అప్పుడే లక్ష్యసాధన జరుగుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
హనుమ వినయ బలం
దౌత్యానికి వచ్చాడు హనుమ రావణుడి వద్దకు. సీతమ్మను విడిచిపెట్టకపోతే మహాపరాక్రమవంతుడైన రాముడి చేతిలో నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. రావణుడు శాస్త్రాలు చదివినవాడే. కానీ ఏ శాస్త్రాన్నయినా తన కోణంలోనే అన్వయించి చెప్పే మూర్ఖుడు కావడంతో హనుమ మాటలు చెవికెక్కలేదు. పైగా నిండు సభలో ‘‘ఒక కోతి నాకు నీతులు చెబుతుందా? చంపి పారేయండి’’ – అని ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతలో విభీషణుడు లేచి – దూతను చంపకూడదు – కావాలంటే గట్టిగా మందలించండి, తప్పదనుకుంటే చిన్నపాటి శిక్ష వేయండి – అని అన్నగారికి చెప్పాడు. ‘‘ఓహో! అలాగా ! అయితే కోతికి తోకే కదా బలం, ప్రాణం? తోకకు నిప్పు పెట్టండి – అని ఆదేశించాడు రావణుడు. దాంతో రాక్షసమూక ఎక్కడెక్కడి పాత బట్టలన్నీ తెచ్చి నూనెలో ముంచి, తోకకు చుట్టి మంట పెట్టారు. ఇది చాలక బండి మీద కట్టి లంక వీధుల్లో ఊరేగించారు. రాత్రి లంకను సరిగా చూడలేదు. పగలు చూస్తే – రాముడికి చెప్పడానికి, ఎలా రావాలో అంచనా వేయడానికి పనికి వస్తుందని – హనుమ వ్యూహాత్మకంగానే భరిస్తున్నాడు. పరిశీలన అయిపోగానే ఒక్కసారిగా కట్లు తెంచుకున్నాడు. మండుతున్న ఆ తోకతో లంకకు నిప్పుపెట్టాడు. సీతమ్మ అగ్ని దేవుడిని ప్రార్థించడం వల్ల, హనుమ తోకకు గంధం పూసినట్లు చల్లగా ఉందికానీ, వేడి లేదు – గాయం కాలేదు. మండుతున్న లంకను దూరంగా చూస్తున్న హనుమకు ఒక్కసారిగా ఒళ్ళు చెమట పట్టింది. అరెరే ! ఆగ్రహంలో ముందు వెనుకలు ఆలోచించకుండా అశోకవనాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశానే, ఇందులో సీతమ్మ కూడా ఆహుతి అయిపోతుందే, ఇప్పుడెలా అనుకుంటుండగా – అశరీర వాణి మాటలు వినిపించాయి– చూసి రమ్మంటే, హనుమ కాల్చి వచ్చాడు. లంకానగరమంతా కాలిపోతోంది. ఒక్క సీతమ్మ కూర్చున్న చోటు తప్ప––అని. హమ్మయ్య అనుకుని హనుమ మండుతున్న తోకను సముద్రంలో ముంచి, చల్లార్చుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. చేతులు జోడించి వినయంగా ‘‘అమ్మా! వచ్చిన పని అయ్యింది – వెళ్ళొస్తా – సెలవివ్వు’’ అన్నాడు. ‘‘నువ్వంటే మహా బలసంపన్నుడివి, వందయోజనాల దూరాన్ని అవలీలగా దాటి వచ్చావు. మిగతావారు ఎలా రాగలరు? ఇక నా గతి ఇంతేనేమో?’’అని నిట్టూర్చింది సీతమ్మ. ఆ మాటలకు ‘‘అమ్మా , సుగ్రీవుడి కొలువులో నేనే చాలా చిన్నవాడిని. ఏదయినా చిన్న పనికి ఏ పనీ చేతగాని మామూలువాడిని పంపుతారు. అలా నన్ను పంపారు. మా రాజు సుగ్రీవుడి దగ్గర ఉన్న సైన్యం అంతా నాకంటే బలసంపన్నులే. వారికి సముద్రాన్ని దాటటం అరటిపండు ఆరగించినంత సులువైన పని. కనుక నువ్వేమీ దిగులు పెట్టుకోకు తల్లీ – నేను అలా వెళ్లడం – రాముడు ఇలా రావడం ఒకేసారి జరుగుతాయి – నన్ను ఆశీర్వదించి పంపు తల్లీ’’అన్నాడు ముకుళించిన హస్తాలు విడివడకుండానే! చూశారా, వినయ విధేయతలంటే అవీ. కొండంత చేసీ, గోరంత చేసినట్లు చెప్పుకున్నాడు హనుమ. మనమూ ఉన్నాం, గోరంత కూడా చేయకుండానే, కొండంత చేశామని గొప్పలు చెప్పుకుంటాం!! హనుమంతుడి వినయమే ఆయనకు బలంగా మారిందని మనం ఇందులోని నీతిని చెప్పుకోవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
రమణీయం... స్మరణీయం
డి.వి.ఆర్. భాస్కర్ భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సంవత్సరాలున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు. అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు. రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువులు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు. ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవంగా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్‌గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు. ‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమందిపై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి! రమణ వాణి మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం. మానవత్వాన్ని వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు. సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం. నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం. భగంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమైనవే ప్రయత్నం, సాధన. మన జీవితంలో అనివార్యమైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణతో మెలగడం అందరికీ అత్యవసరం. జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది. మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది. నీ విశ్వాసమే నీ ఆయుధం.