రామ రావణ యుద్ధం ముగిసింది. లోక కంటకుడైన రావణుడు హతం అయినందుకు సంతోషంతో దేవతలందరూ విచ్చేశారు. వారితోపాటు అక్కడికి వచ్చిన దేవేంద్రుడు ‘రామా! మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృథా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో‘ అన్నాడు.
రాముడన్నాడు ‘నాకోసమని ఎన్నో వానరాలు, భల్లూకాలు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్నిటికి చేతులు, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, మరికొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనానికి చేరాయి. మీరు నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనానికి వెళ్ళిన వానరాలన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళీ జవసత్వంతో పైకిలేవాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు లభించాలి, సమృద్ధిగా తేనె ఉండాలి, తాగడానికి మంచి నీరు ఉండాలి’ అన్నాడు.
ఇంద్రుడు ‘తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను’ అన్నాడు.
వెంటనే యుద్ధభూమిలో పడి ఉన్న వారు పునరుత్తేజంతో లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళిన వానరులందరూ సంతోషంతో తిరిగి వచ్చేశారు. అందరూ తమ కుటుంబ సభ్యులను కలుసుకుని వేడుకలు చేసుకున్నారు. మరునాడు ఉదయం రాముడు విభీషణుని పిలిచి ‘నేను ఇక్కడినుంచి తొందరగా అయోధ్య చేరుకోవడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు చేయగలవా?’ అన్నాడు.
‘‘రామచంద్రా! మన దగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు’’ అంటూ విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక అక్కడున్న వాళ్ళందరూ ‘రామా! మిమ్మల్ని విడిచిపెట్టి మేముండలేము, మేము మీతో అయోధ్యకి వస్తాము. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది’ అన్నారు. రాముడు సరే అనేసరికి వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతలో సుగ్రీవుడు ‘రామా! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము’ అన్నాడు.
అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి వెంటనే రమ్మన్నాడు. వాళ్ళు మానవకాంతలుగా కామరూపాలని పొంది, పట్టుబట్టలు, ఆభరణాలు ధరించి, పుష్పక విమానానికి ప్రదక్షిణం చే సి, లోపలికి ఎక్కి ‘సీతమ్మ ఎక్కడ?’ అని అడిగారు.
‘ఆవిడే సీతమ్మ’ అని చూపిస్తే వెళ్ళి ఆమెకి నమస్కరించారు. సీతమ్మ వాళ్లను సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.
‘‘సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి ఆశ్రమం. అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు’’ అని రాముడు వివరిస్తున్నాడు.
ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భరద్వాజుడిని సందర్శించి, ఆయన ఆనతి మేరకు అక్కడ విశ్రాంతి తీసుకుని, ఆతిథ్యం స్వీకరించి అక్కడినుంచి వెళ్లేటప్పుడు రాముడు హనుమని పిలిచి ‘హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిబేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు స్నేహితుడు. అతడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా’ అన్నాడు.
ఆ తరువాతి కథ అప్రస్తుతం. ఇక్కడ గ్రహించవలసింది రాముడు కనబరచిన స్థితప్రజ్ఞతను, సూక్ష్మగ్రాహిత్వాన్నీ...
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment