Puraniti
-
చాపల్యం తెచ్చిన చేటు
ఆమె ఒక రాకుమార్తె. పేరు పృథ. తండ్రి పేరు కుంతిభోజుడు కాబట్టి ఆమెను కుంతి అన్నారు సన్నిహితులు. దాంతో లోకానికి అదే పేరుతో పరిచయమైంది ఆమె. ఒకరోజు కుంతిభోజుడి ఆస్థానానికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ సమయంలో కుంతిభోజుడు రాజకార్యాలలో తల మునకలుగా ఉండటం వల్ల తన కుమార్తెను ఆయన సేవకు నియోగించాడు. దుర్వాస మహర్షి కుంతిభోజుడి అతిథిగా ఉన్నంతకాలం రాకుమార్తె కుంతి స్వయంగా ఆయనకు అవసరమైన సకల సదుపాయాలూ సమకూరుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉంది. రాకుమార్తె వినయ విధేయతలకు దుర్వాసుడు అమితంగా ఆనందించాడు. తాను వెళ్లేటప్పుడు అడక్కుండానే ఆమెకు ఓ వరం ఇచ్చాడు. అది మహా మహిమాన్వితమైన పుత్ర ప్రదాన మంత్రమని, ఆ మంత్రాన్ని మననం చేస్తూ ఏ దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రత్యక్షమై ఆ మంత్రాన్ని ఆవాహన చేసిన స్త్రీ గర్భంలో తన అంశని ప్రవేశపెడతాడని చెప్పి, ఆశీర్వదించి వెళ్లిపోయాడు. తానొక కన్య. తాను చేసిన సేవ పరమ కోపిష్టిగా పేరొందిన దుర్వాస మహర్షికి. ఆయనను మెప్పించడమే చాలా కష్టమని ఆయన కోపానికి జడిసి ఎవరూ ఆయన జోలికి వెళ్లరు. అటువంటిది తన ను ఆ మహర్షి మెచ్చుకోవడమేగాక వరమిచ్చాడని ఆమెకు అమితానందం కలిగింది. అంతలో ఆమెకు ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. మహర్షి చెప్పిన మంత్రం నిజంగా అంతటి మహిమగలదేనా? ఆ మంత్రానికి దేవతలు దిగి వస్తారా... అని. అంతే! యవ్వన చాపల్యం వల్ల ముందు వెనకలు ఆలోచించకుండా తన మందిరంలోనికి వెళ్లి, తలుపులు వేసుకుని మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండగా గవాక్షం గుండా సూర్యకిరణాలు కనిపించాయి. తలెత్తి చూసేసరికి సూర్యబింబం అందంగా కనిపించింది. అంతే! సూర్యుడు తనకు ప్రత్యక్షం కావాలని కోరుకుంది. తక్షణం సూర్యుడు మానవ రూపంలో ఆమె ముందుకు వచ్చి నిలుచున్నాడు. తన రూపురేఖలు చూస్తూ అప్రతిభురాలై నిలుచుండి పోయిన కుంతితో ‘‘రాకుమారీ! నీవు కోరిన విధంగా నీకు నా అంశతో కూడిన కుమారుని ప్రసాదిస్తున్నాను’’అన్నాడు. తాను కన్యనని, తనకు ఇప్పుడు కుమారుడు పుడితే లోకంలో అపవాదు వస్తుందని, కనుక వచ్చిన దారినే వెళ్లిపొమ్మంటూ చేతులు జోడించింది కుంతి. తాను ఆ మంత్రానికి వశుడినని, తాను వచ్చి, ఊరికే వెళ్లడానికి వీలు లేదనీ, అయినా ఆమెకు వచ్చిన ముప్పు లేదని, ఆమె కన్యత్వం ఏమీ చెడదని వరమిచ్చాడు. తన కిరణాల ద్వారా తన అంశను ఆమెలో ప్రవేశ పెట్టి, ఆమె అలా చూస్తూ ఉండగానే అంతర్థానమైపోయాడు. వెంటనే కుంతి గర్భం దాల్చడం, దివ్యతేజస్సుతో కూడిన కుమారునికి జన్మనివ్వడం, లోకనిందకు వెరచి ఆ కుమారుని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టడం, ఆ పెట్టె కాస్తా పిల్లలు లేక బాధపడుతున్న సూతుడికి దొరకడం, అతను ఆ పిల్లవాడికి కర్ణుడని పేరు పెట్టి పెంచుకోవడం, ఆ తర్వాత జరిగిందేమిటో అందరికీ తెలిసిందే. దుర్వాసుడు ఆమెకు అనాలోచితంగా వరమివ్వడం, ఆ వర ప్రభావాన్ని ఆమె పరీక్షించాలనుకోవడం, సూర్యుడు ప్రత్యక్షం కావడం, కన్య అని తెలిసినా ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించడం... ఇవన్నీ చాలా చిత్రంగా తోస్తున్నాయి కదూ... అయితే, అదే జరక్కపోతే మహాభారతంలో కర్ణుడు ఎలా ఉద్భవించేవాడు? ఆ తర్వాత కథంతా ఎలా జరిగేది? అదంతా లోకకల్యాణానికే జరిగిందనుకోవాలి మనం. మనం ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, అవతలి వారి అర్హత, అవసరం ఏమిటో తెలుసుకోకుండా మన వద్ద ఉన్నది కదా అని ఏది పడితే అది అయాచితంగా ఇచ్చెయ్యడం తప్పు... దీనినంతటినీ మనం నేటికాలంలో పిల్లలు అడక్కుండానే సమకూరుస్తున్న సదుపాయాలతో పోల్చుకోవచ్చు. అది అత్యాధునిక హంగులున్న చరవాణి కావచ్చు. ఖరీదైన వాహనం కావచ్చు... వాటి ఫలితాలు, పర్యవసనాలు మనం చూస్తూనే ఉన్నాం కదా... – డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రీరామ పట్టాభిషేకం
పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకుని రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల వెంట నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని ‘ఇంతకుముందు మేము నలుగురం, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురం అన్నదమ్ములం సుగ్రీవా’ అన్నాడు. పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రలు ఆ వానర కాంతలందరికీ తలస్నానం చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ‘కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో‘ అని ఆజ్ఞాపించాడు. అప్పుడా పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ‘మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్లావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను.‘అన్నాడు. భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. రాముడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత అందమైన పట్టు వస్త్రాలను ధరించి, మంచి అంగరాగాలను పూసుకొని, దివ్యాభరణాలు ధరించి బయటకి వచ్చాడు. కౌసల్యాదేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. సుగ్రీవుడితో సహా వానరులందరూ అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తు్తన్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనకాల వేదపండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నెపిల్లలు, ఆ తరువాత సువాసినులు చేత మంగళద్రవ్యాలతో వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. వానరాలు తీసుకొచ్చిన ఆ జలాలని రాముడి మీద పోసి కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు. ధర్మాత్ముడైన రాముడి పాలనలో ప్రజలకు దొంగల భయం, శత్రు భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండిపోయి ఉండేవి. అందరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్లు గడిచినా ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాను. – డి.వి.ఆర్. భాస్కర్ -
వ్యాసుడి పలుకులు
కురుక్షేత్రంలో తన కుమారులందరూ మృతిచెందారన్న వార్త తెలిసిన ధృతరాష్ట్రుడు తీవ్రమైన దుఃఖంతో మూర్ఛిల్లాడు. పరిచారికలు అతడి ముఖం మీద నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. మూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడు వ్యాసుడికి నమస్కరించి ‘మహామునీ! నా దుర్గతి చూశావా! కుమారులంతా మరణించారు. బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయాయి. అయినా నా ప్రాణాలు నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి‘ అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు ‘కుమారా! సకల శాస్త్రాలూ తెలిసిన వాడివి. చనిపోయిన కుమారులకోసం దుఃఖించటం సమంజసం కాదు. పుట్టినవాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికీ శాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా! అసలు నీ కుమారులకూ పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా! జూదక్రీడా సమయాన విదురుడు నీకు అనేక విధాల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే. నీ మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను. ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు, నారదాది మహామునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి ‘దేవతలారా! నాకు రోజురోజుకు భారం పెరిగి పోతోంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి‘ అని అడిగింది. అప్పుడు విష్ణువు ‘భూదేవీ! నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. వారిలో జ్యేష్ఠుడైన దుర్యోధనుడు మహాబలిష్టుడు, కోపిష్టి. పరుల ఉన్నతిని సహించ లేని వాడూ అవుతాడు. అతడు అందరితోనూ వైరం పెట్టుకుంటాడు. దుర్యోధనుడి కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి తోడుగా అతడి మేనమామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి పోతారు. అప్పుడు నీ భారం తగ్గ కలదు‘ అని పలికాడు. ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడనుండి వెళ్ళిపోయింది. విష్ణువు ఆదేశానుసారం కలిపురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్బుద్ధి పుట్టి పాండవుల రాజ్యాన్ని అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక కీడు తలపెట్టాడు. ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం. దీనిని ఎవరూ తప్పించలేరు కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించనవసరం లేదు. నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చెయ్యి. ప్రశాంతతను పొందు‘ అని పలికాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడితో ‘మహానుభావా! అమృతతుల్యమైన నీ మాటల వల్ల నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను ఇక పాండవులను నా కుమారుల వలె ఆదరిస్తాను‘ అని పలికాడు. ఆ మాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
స్థితప్రజ్ఞారాముడు
రామ రావణ యుద్ధం ముగిసింది. లోక కంటకుడైన రావణుడు హతం అయినందుకు సంతోషంతో దేవతలందరూ విచ్చేశారు. వారితోపాటు అక్కడికి వచ్చిన దేవేంద్రుడు ‘రామా! మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృథా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో‘ అన్నాడు. రాముడన్నాడు ‘నాకోసమని ఎన్నో వానరాలు, భల్లూకాలు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్నిటికి చేతులు, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, మరికొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనానికి చేరాయి. మీరు నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనానికి వెళ్ళిన వానరాలన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళీ జవసత్వంతో పైకిలేవాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు లభించాలి, సమృద్ధిగా తేనె ఉండాలి, తాగడానికి మంచి నీరు ఉండాలి’ అన్నాడు. ఇంద్రుడు ‘తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను’ అన్నాడు. వెంటనే యుద్ధభూమిలో పడి ఉన్న వారు పునరుత్తేజంతో లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళిన వానరులందరూ సంతోషంతో తిరిగి వచ్చేశారు. అందరూ తమ కుటుంబ సభ్యులను కలుసుకుని వేడుకలు చేసుకున్నారు. మరునాడు ఉదయం రాముడు విభీషణుని పిలిచి ‘నేను ఇక్కడినుంచి తొందరగా అయోధ్య చేరుకోవడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు చేయగలవా?’ అన్నాడు. ‘‘రామచంద్రా! మన దగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు’’ అంటూ విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక అక్కడున్న వాళ్ళందరూ ‘రామా! మిమ్మల్ని విడిచిపెట్టి మేముండలేము, మేము మీతో అయోధ్యకి వస్తాము. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది’ అన్నారు. రాముడు సరే అనేసరికి వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతలో సుగ్రీవుడు ‘రామా! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము’ అన్నాడు. అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి వెంటనే రమ్మన్నాడు. వాళ్ళు మానవకాంతలుగా కామరూపాలని పొంది, పట్టుబట్టలు, ఆభరణాలు ధరించి, పుష్పక విమానానికి ప్రదక్షిణం చే సి, లోపలికి ఎక్కి ‘సీతమ్మ ఎక్కడ?’ అని అడిగారు. ‘ఆవిడే సీతమ్మ’ అని చూపిస్తే వెళ్ళి ఆమెకి నమస్కరించారు. సీతమ్మ వాళ్లను సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది. ‘‘సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి ఆశ్రమం. అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు’’ అని రాముడు వివరిస్తున్నాడు. ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భరద్వాజుడిని సందర్శించి, ఆయన ఆనతి మేరకు అక్కడ విశ్రాంతి తీసుకుని, ఆతిథ్యం స్వీకరించి అక్కడినుంచి వెళ్లేటప్పుడు రాముడు హనుమని పిలిచి ‘హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిబేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు స్నేహితుడు. అతడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా’ అన్నాడు. ఆ తరువాతి కథ అప్రస్తుతం. ఇక్కడ గ్రహించవలసింది రాముడు కనబరచిన స్థితప్రజ్ఞతను, సూక్ష్మగ్రాహిత్వాన్నీ... – డి.వి.ఆర్. భాస్కర్ -
సాగర మథనం...
దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించి, అమృతాన్ని సాధించటానికి తయారయ్యారు. రాక్షసులకూ అమరత్వం సిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది? అయితే అలా కాకుండా చేసే బాధ్యత విష్ణుమూర్తిదే కాబట్టి అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి, క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారందరూ. అంతవరకూ బాగానే ఉంది కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది మామూలు వారికి శక్యం కాని పని కదా... శ్రీ మహావిష్ణువు తానే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. సాగర మథనం ప్రారంభమైంది. క్షీరసాగర మథనం సమయంలో, రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ, తమ భుజబలం అంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మేమేమీ తక్కువేమీ లేదని బలంగా లాగారు. మథనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం విషాన్ని కక్కింది. హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది. ఆ విషాగ్ని కీలలకు రాక్షసులు కొందరు మలమలమాడి మసి అయ్యారు. హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది. అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు హాలాహలాన్ని ఉండలా చేసి దానిని నేరేడుపండులా గుటుక్కున మింగబోయాడు. పార్వతీదేవి అది ఆయన ఉదరంలోకి చేరకుండా పరమేశ్వరుడి గొంతును మెల్లగా అదిమింది. అలా శివపార్వతులు హాలాహలాన్ని గొంతులోనే ఉంచి లోకాల్ని రక్షించారు. శివుడావిధంగా గరళ కంఠుడనిపించుకున్నాడు. శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా చల్లని చంద్రుణ్ణి తలపై ధరించి, చంద్రశేఖరుడయ్యాడు. ప్రస్తుతానికి విషగండం తప్పింది అని ఊపిరి పీల్చుకునేంతలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. మందరపర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం దాల్చి సముద్రంలోకి ఒరిగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ పైకి తెచ్చాడు. మహాకూర్మమై పర్వతం అటూ ఇటూ బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో తొక్కిపెట్టి ఉంచాడు. అదే సమయంలో దేవతలతో కలిసి సముద్ర మథనం చేశాడు. ఇలా బహురూపాలతో విష్ణువు కనిపించాడు. ఇక ఇప్పుడు సాగర మథనం సక్రమంగా సాగింది. క్షీరసాగరం నుంచి చంద్రుడు, లక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతమనే తెల్లటి ఏనుగు, ఉచ్ఛైశ్రవమనే తెల్లటి గుర్రం, సుర అనే మత్తూ, ఉత్తేజమూ కల్గించే పానీయమూ ఇంకా ఎన్నెన్నో ఉద్భవించాయి. సురను దేవతలు స్వీకరించి సురులు అనిపించుకున్నారు. చిట్టచివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆయుర్వేదానికి మూల విరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో, అమృత కలశాన్నీ, అనేక ఓషధులనూ ధరించి, పద్మాసనంపై కూర్చొని, సముద్రం నుంచి వచ్చాడు. లక్ష్మీదేవి శ్రీవత్సకౌస్తుభ మణులతో కూడిన వైజయంతిమాలను వేసి విష్ణువును వరించింది. విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు. ఇలా ఎన్నెన్నో విశేషాలు, దైవసహాయాలు జరిగాక అమృతం సిద్ధించింది. దేవదానవుల లక్ష్యసాధన నెరవేరింది. అందుకే ఏదైనా శ్రమదమాదులతో కూడిన కార్యసాధనకు ‘సాగర మథనం’ అనే మాట పర్యాయపదంగా నిలిచింది. బృహత్తర కార్యక్రమాన్ని ఏదైనా తలపెట్టినప్పుడు దానికి ఆటంకం కలిగించే అనేక విఘ్నాలు సంభవించవచ్చు. అయినా సరే, ఓర్పుగా నేర్పుగా ఆ పనిని, మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అప్పుడే లక్ష్యసాధన జరుగుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
రాజు సమక్షంలో ఇలా నడుచుకోవాలి
మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు, షరతు మేరకు పన్నెండేళ్లపాటు అరణ్యవాసం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇక సంవత్సరకాలం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే మాటలు కాదు, ఎవరి కంటా పడకుండా బతకాలి. అందుకోసం వారు మత్స్యదేశాధిపతి విరాటరాజు కొలువులో చేరాలనుకున్నారు. ధర్మరాజు కంకుభట్టు పేరుతో జూదమాడి రాజును సంతోషపెట్టేవాడిగానూ, భీముడు వలలుడనే పేరుతో వంటవానిగానూ, అర్జునుడు నపుంసకుడిగా ఉంటూ అంతఃపుర స్త్రీలకు సంగీతం, లలిత కళలు నేర్పుతూ, చక్కటి కథలు చెబుతూ బృహన్నల అనే పేరుతోనూ, నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాలను రక్షిస్తూ, అశ్వపాలకుడిగానూ, సహదేవుడు తంత్రీపాలుడి పేరుతో గోపాలకుడిగానూ, ద్రౌపది సైరంధ్రి పేరుతో రాణివాసపు స్త్రీలకు జడలు వేసి, పూలు మడిచే పనిలో ఉంటూ, రాణిగారి ప్రధాన పరిచారికగానూ ఉండాలనుకుంటారు. ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుడిని పిలిచి, తమ అభిప్రాయాన్ని చెబుతాడు. అప్పుడు ధౌమ్యుడు ‘‘రాజా, మీరు రాజాస్థానంలో ఉండబోతు న్నారు. మీకు తెలియనిదేమీ లేదు. అయినా, మీ మేలుకోరి నేను మీకు కొన్ని సూత్రాలను చెబుతాను. జాగ్రత్తగా వినండి. రాజులను పూర్తిగా నమ్మరాదు. రాజుగారి వాహనమో, మంచమో, ఏనుగో, ఆసనమో అధిరోహింపరాదు. ఏ ఆసనంలో కూర్చుంటే దుష్టులు సందేహపడతారో అక్కడ కూర్చోరాదు. రాజు అడగనిదే దేనినీ చెప్పరాదు. రాజస్త్రీలతో మైత్రి, పరిహాసం చేయరాదు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోరాదు. రాజు సమ్మతించిన పనులు మాత్రమే చేయాలి. హితాన్నైనా, ప్రియంగానే తెలపాలి. రాజుకు ఇష్టంలేని వాటిని ఆచరించరాదు. రాజుగారి అహితులతో మాట్లాడరాదు. రాజుగారికి కుడివైపో, ఎడమవైపో మాత్రమే కూర్చోవాలి. రాజు సమక్షంలో ఆవులించడం, ఉమ్మివేయడం, గట్టిగా నవ్వడం పనికిరాదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడూ రాజును, వారి పుత్రాదులను పొగుడుతూ ఉండాలి. సత్యాన్నే పలకాలి. ఎప్పుడూ చురుకుగా ఉండాలి. రాజుగారిచ్చిన రథమో, వస్త్రాలో, అలంకారమో ప్రతిరోజూ ధరించాలి. అప్పుడే రాజుకు ప్రీతిపాత్రమైన వారిగా ఉంటారు. ఇలా నడుచుకుని ఒక సంవత్సర కాలం పాటు గడిపి మీ దేశం వెళ్లి సుఖంగా జీవించండి’’ అని చెప్పి ఆశీర్వదించాడు. ధౌమ్యుడు ధర్మరాజుకు చెప్పిన ఈ నీతి సూత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయాలే. ఇప్పుడు రాజులు ఉండకపోవచ్చు, ఉన్నతాధికారులు కూడా మనకు రాజులే కదా! – డి.వి.ఆర్. భాస్కర్ -
మహిషుని అహాన్ని అణచిన అమ్మ
పురానీతి పూర్వం మాహిష్మతి అనే గంధర్వకాంత ఇంద్రుడి శాపవశాన మహిషి అనే రాక్షసిగా జన్మించింది. ఆమె రంభుడు అనే రాక్షసుని వివాహమాడింది. వారికి మహిషుడనే కుమారుడు పుట్టాడు. పుట్టుకతోనే వాడు అమిత బలవంతుడయ్యాడు. అనతికాలంలోనే రాక్షస లక్షణాలను అలవరచుకున్నాడు. తన బలాన్ని మరింతగా పెంచుకోవాలనుకుని, బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. బ్రహ్మ అందుకు అంగీకరించకపోవడంతో స్త్రీలంటే అతి చులకన భావం గల మహిషుడు శరీర నిర్మాణరీత్యా బలహీనంగా ఉండే స్త్రీ తనను ఏమీ చేయలేదనే ధీమాతో, స్త్రీ చేత తప్ప తాను ఎవరిచేతిలోనూ చావకుండా ఉండే వరం కోరుకున్నాడు.ఆ వరమదంతో దేవతలను, మునులను, మానవులను వాడు పెట్టే హింసకు అంతులేకుండా పోయింది. దేవతలు, మునులు కలిసి వాడి బారి నుంచి తమను రక్షించమని వైకుంఠనాథుడిని వేడుకున్నారు. అందుకు విష్ణువు చిరునవ్వు నవ్వి, పురుషులమైన మనమెవ్వరమూ వాడిని సంహరించలేము. తానూ, తన సైన్యమూ కూడా ఆడవారి చేతిలో తప్ప మరణించనటువంటి వరం పొందాడు అంటూ సాలోచనగా చూశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చూపులు కలవడంతో వారి దృక్కుల నుండి ఒక కాంతిపుంజం జనించింది. ఆ కాంతిపుంజం వైపు పార్వతి, లక్ష్మి, సరస్వతి చూశారు. వారి చూపుల నుంచి కూడా ఒక కాంతిపుంజం వెలువడింది. ఏమి జరుగుతోందా అన్న కుతూహలంతో దేవతలందరూ కలసి ఆ కాంతిపుంజాలవైపు చూడగా, వారి వారి ఆకారాలకు, తేజస్సుకు తగ్గట్టు లెక్కలేనన్ని వెలుగు కిరణాలు వెలువడి అన్నీ కలిసి ఒకటిగా మారాయి. ఆ విధంగా సకల దేవతల తేజోపుంజాలూ కలసి వాటినుంచి అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించింది. ఆమెకు దేవతలంతా కలసి సమస్త సంపదలనూ, ఆయుధాలనూ ఇచ్చారు. అమ్మ ఆ ఆయుధాలను ధరించి, సర్వశక్తులతో, తేజస్సుతో కూడి, మదగర్వితుడైన ఆ రాక్షసుని మీదికి దండయాత్రకు వెళ్ళింది. ఆమెను చూసిన మహిషుడు ‘ఓ సుందరీ, ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు? ఎంత అందంగా ఉన్నావు?’ అనడిగాడు. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అంటుంది అమ్మ. ఆమె మాటలకు వికటంగా నవ్విన మహిషుడు ‘‘ఇంత అందంగా, సుకుమారంగా ఉన్న నీతో యుద్ధం చేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు. నన్ను పెళ్లి చే సుకుని నా అంతఃపుర కాంతగా ఉండు’’ అన్నాడు అహంకారంతో. అందుకు అమ్మవారు సమ్మతించకపోవడంతో ఒక అబలవైన నీతో యుద్ధం చేయడానికి నేనెందుకు, నా అనుచరుడున్నాడు చాలు’’ అంటూ భండాసురుడిని పంపాడు. అమ్మవారు తాను కూడా తొమ్మిదేళ్ల బాలికగా రూపు మార్చుకుని, శ్యామలాదేవిని సైన్యాధిపతిగా చేసుకుని భండాసురుని అవలీలగా చేధించింది. ఆ త ర్వాత చండిగా, చాముండిగా చండాసురుని, ముండాసురుని సంహరించింది. నెత్తురు చుక్క నేల రాలితే వేలాదిమంది రాక్షసులను పుట్టించే లక్షణం గల రక్తబీజుడనే రాక్షసుని కాళికగా మారి, వాడి నెత్తురు నేలరాలకుండా రుధిర పానం చేసింది. ఆ విధంగా తొమ్మిదిరోజులపాటు ఆ రాక్షసుడు పంపిన అనుచర గణాలనందరినీ దునుమాడడంతో, విధిలేక తానే వచ్చాడు మహిషుడు. అప్పుడు అమ్మ, సింహవాహనారూఢియై, వీరవిహారం చేసి దున్నపోతు రూపంలో ఉన్న ఆ రాక్షసుని నేలమీద పడవేసి, కాళ్లతో మట్టగించి చంపేసింది. ఆడది అబల, ఆమె తననేమీ చేయలేదన్న మహిషుని అహాన్ని ఆ విధంగా ఆదిపరాశక్తిగా మారి, అణ చి వేసింది అమ్మ దుర్గమ్మ. -
ధర్మజుని గర్వభంగం
పురానీతి ధర్మరాజు అశ్వమేథ యాగం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, వస్తుదానాలు చేశాడు. యాగం చేసిన రుత్విక్కులకు, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చాడు. ధర్మరాజు దానగుణానికి అందరూ అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. అది చూసి ధర్మజునిలో కొద్దిగా అహంకారం పొడసూపింది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం మూడువంతుల వరకు బంగారు రంగులో మెరుస్తోంది. అది సభాసదులను, ధర్మరాజును చూసి పకనకా నవ్వింది. అందరూ ఆశ్చర్యంగా, కోపంగా ‘‘ఎవరు నువ్వు? ఎలా వచ్చావిక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు?’’ అని అడిగారు. ‘‘నేనెవరినో, ఎందుకు వచ్చానో తర్వాత చెబుతాను. మీరంతా ధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే, రారాజైన ధర్మరాజు చేసిన యాగం కానీ, దానధర్మాలు కానీ నిరుపేద బ్రాహ్మణుడైన సక్రుప్రస్థుడు చేసిన దానికన్నా గొప్పవి కావు కాబట్టి నవ్వొచ్చింది’’ అంది. ‘‘ఇంతకీ ఎవరా సక్రుప్రస్థుడు?’’ అనడిగాడు ధర్మరాజు అసూయగా. అప్పుడా ముంగిస ఇలా చెప్పింది. ‘‘కురుక్షేత్రంలో సక్రుప్రస్థుడనే పేద బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక చిన్న పూరిపాక నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే నా బిలం ఉంది. ఆయన వెదురుబియ్యాన్ని ఏరుకొస్తే, దానినే పిండి చేసుకుని అందరూ జీవించేవారు. ఉన్నదానిలోనే ఆయన అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. దాంతో ఆయనకు వెదురుబియ్యమే కాదు, ఎక్కడా భిక్ష కూడా దొరకడం లేదు. ఆకలి బాధకు అందరూ ప్రాణాలు కళ్లల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ధర్మదేవతకు ఆయనను పరీక్షించాలని బుద్ధిపుట్టి వారి ఇంటికి బాటసారి వేషంలో అతిథిగా వచ్చాడు. అప్పటికే మూడురోజుల నుంచి పస్తులున్న ఆ కుటుంబం తలా పిడికెడు పేలపిండిని తినడానికి కూర్చున్నారు. ఇంతలో అతిథి రావడంతో ఇంటి యజమాని అతణ్ణి సాదరంగా ఆహ్వానించి, కాళ్లకు నీళ్లిచ్చి, విస్తరి వేసి తన వాటా పేలపిండిని సమర్పించాడు. అతిథికి ఆకలి తీరినట్టు కనిపించలేదు. దాంతో సక్రుప్రస్థుని భార్య తన వాటా ఇచ్చింది. అది తిన్నాక కూడా, అతిథి కళ్లల్లో ఆకలి తీరిన జాడలు కనిపించలేదు. కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చాడు. ఊహు.. ఆకలి తీరనే లేదు. కోడలు తన పేలపిండిని తెచ్చి వడ్డించింది. అప్పుడా అతిథి తృప్తిగా తేన్చాడు. ఒకపక్క ఆకలితో ప్రాణాలు కడగట్టిపోతున్నా సరే, అతిథినే దేవుడిగా ఎంచిన ఇంటి యజమాని, అతని ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించాడు. అతని బాటలోనే అతని భార్య, కొడుకు, కోడలు కూడా నడిచారు. వారి త్యాగానికి మెచ్చిన ధర్మదేవత తన నిజరూపంతో వారికి సాక్షాత్కారమిచ్చాడు. వారికోసం బ్రహ్మలోకం నుంచి విమానం వచ్చింది. ఆ నలుగురినీ వెంటబెట్టుకుని ధర్మదేవత సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన నేను సక్రుప్రస్థుడు అతిథికి అర్ఘ్యమిచ్చిన నీటిలో పొర్లాడాను. ఆ నీటితో తడిసినంత మేరా నా శరీర భాగాలు బంగారు రంగులోకి మారిపోయాయి. మిగతావి కూడా సువర్ణమయం అవుతాయేమోనన్న ఆశతో నేను ఎన్నో యజ్ఞశాలలకు వెళ్లి, వారు యజ్ఞం చేసిన ప్రదేశంలో పొర్లాడుతున్నాను కానీ, నా శరీరం బురదమయం, బూడిద మయం అవుతున్నదేగానీ, సువర్ణరూపు సంతరించుకోనేలేదు. ఇంతలో ధర్మరాజు గురించి విని, ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకూ అతడు దానం చేసిన గోవులు తరలి వెళ్లగా ఏర్పడిన మడుగులో పొర్లాడి వచ్చాను కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది అతన్నే అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం చూసి నాకు నవ్వు వచ్చింది. ధర్మరాజు చేసిన దాన ధర్మాలేవీ భక్తితో చేసినవి కాదు. అహంకారంతో కూడుకున్నవి. అసలు అదంతా అతని కష్టార్జితం అయితేనే కదా... దాని ఫలితం అతనికి దక్కేది’’ అంటూ మరోమారు ఫక్కున నవ్వింది. ధర్మరాజుకు తల తీసేసినట్లయింది. అసంకల్పితంగా కృష్ణునివైపు చూశాడు. శ్రీకృష్ణుడు చిద్విలాసంగా చూస్తూ, జగన్మోహనంగా నవ్వాడు. ధర్మరాజుకు తన తప్పు తెలిసి వచ్చింది. - డి.వి.ఆర్ -
తొందరపాటు
పురానీతి కశ్యపప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ అత్యంత పొడవుగా, బలమైన దేహం కలిగిన వెయ్యిమంది పుత్రులను, తేజోవంతమైన శరీరంతో అత్యంత చురుకయిన ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంటారు. దాంతో కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కొంతకాలానికి కద్రువకు ఆదిశేషుడు, కర్కోటకుడు, వాసుకి మొదలైన పొడవాటి శరీరం గల వెయ్యిసర్పాలు పుడతాయి. వినత కు మాత్రం ఇంకా పుట్టరు. దాంతో తొందరపడి ఒక అండాన్ని పగులకొడుతుంది. ఆ అండం నుంచి కాళ్లులేకుండా, మొండెం మాత్రమే ఉన్న తేజోరూపుడు పుడతాడు. అతడు పుడుతూనే ‘‘నువ్వు సవతిని చూసి కుళ్లుపడి, గుడ్డును పగలగొట్టి నా అవిటి జన్మకు కారకురాలైనావు కాబట్టి నీ సవతికే దాసీగా ఉంటావు’’ అని శపిస్తాడు. తన తప్పిదానికి కుమిలిపోతున్న తల్లితో బాధపడకు. ‘‘కనీసం రెండో అండాన్నైనా జాగ్రత్తగా ఉంచు. అందులోనుంచి జన్మించినవాడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు’’ అని చెప్పి, సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి సారథిగా వెళ్లిపోతాడు. అతడే మాతలి. సూర్యుని రథసారథి. అయితే తొడలు లేవు కాబట్టి అనూరుడుగానే సుపరిచితుడయ్యాడు. ఇది ఇట్లా ఉండగా వినత, కద్రువలు ఒక రోజు సముద్రతీరానికి విహారానికి వెళ్తారు. వారికి అక్కడ ఇంద్రుని రథాన్ని లాగే ఉచ్ఛైశ్రవం అనే గుర్రం కనిపిస్తుంది. దాన్ని చూపిస్తూ కద్రువ వినతతో ‘‘చూడు, ఆ గుర్రం ఎంతో తెల్లగా ఉంది కానీ, దాని తోక మాత్రం నల్లగా ఉంది’’ అంటుంది. ఆపాదమస్తకం గుర్రం తెల్లగా ఉండటాన్ని చూసిన వినత ‘‘లేదక్కా, గుర్రం తోక కూడా పాలలా తెల్లగానే ఉంది కదా’’ అంటుంది. ఆ విషయంలో ఇద్దరి మధ్యా వాదులాట జరుగుతుంది. ఆ పూట ఇక చీకటి పడింది కాబట్టి, మరునాడు వచ్చి, ఆ గుర్రాన్ని చూసి, దాని తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను. నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని పందెం వేస్తుంది కద్రువ. అందుకు అంగీకరిస్తుంది వినత. ఆ రాత్రి కద్రువ తన కుమారులను పిలిచి, మీలో ఎవరైనా వెళ్లి ఉచ్ఛైశ్రవం తోకకు చుట్టుకుని, దానిని నల్లగా కనిపించేట్లు చేయండి అని అడుగుతుంది. అందుకు కర్కోటకుడనే నాగు తప్ప మిగిలిన ఎవరూ అంగీకరించరు. దాంతో కోపగించిన కద్రువ తల్లిమాట వినలేదు కాబట్టి మీరందరూ పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చస్తారని శపిస్తుంది. కర్కోటకుడు వెళ్లి గుర్రం తోకను చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాడు. పందెం ప్రకారం వినత కద్రువకు దాస్యం చేస్తుంటుంది. కొంతకాలానికి రెండవ అండం పగిలి, అందులోనుంచి అత్యంత పరాక్రమవంతుడైన గరుడుడు పుడతాడు. అతణ్ణి చూసిన కద్రువ ‘‘నువ్వు నాకు దాసీవి కాబట్టి నీకుమారుడు కూడా మాకు దాసుడే’’ అవుతావు అని చెప్పి, అతని చేత చాకిరీ చేయించుకుంటుంది. కద్రువ కుమారులైన సర్పాలను తన వీపుమీద ఎక్కించుకుని రోజూ వినువీధికి వ్యాహ్యాళికి తీసుకెళ్లడం గరుత్మంతుడి విధుల్లో ఒకటి. ఓ రోజున అలా గరుడుడు సూర్యమండలం దాకా వెళ్లడంతో సర్పాలన్నీ నల్లగా మాడిపోతాయి. దాంతో కోపించిన పెద్దమ్మ గరుత్మంతుణ్ణి తిడుతుంది. మనస్తాపానికి గురైన గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు తల్లీకొడుకులు బాగా ఆలోచించుకుని అసాధ్యమైన కార్యం కాబట్టి దేవలోకం నుంచి అమృతం తెచ్చిపెట్టమని అడుగుతారు. గరుత్మంతుడు ఎట్లాగో కష్టపడి అమృతాన్ని తీసుకొచ్చి తల్లిని దాస్య విముక్తురాలిని చేసి, తానూ దాస్యం నుంచి బయటపడతాడు. అయితే అమృతం తాగితే నాగులకు అమరత్వం సిద్ధిస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ అమృతాన్ని వాటికి దక్కకుండా చేయడం వేరే కథ. గరుత్మంతుడి వేగానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి అతణ్ణి తన వాహనంగా స్వీకరిస్తాడు. వినత కుమారుడు కాబట్టి అతడే వైనతేయుడుగా కూడా ప్రఖ్యాతి చెందుతాడు. ఇక్కడ మనం గ్రహించలసినదేమంటే మత్సరం అంటే కుళ్లుబోతుతనం, తొందరపాటు తనం వల్లే కదా, వినత, ఆమె కుమారుడు అంత కష్టపడవలసి వచ్చింది! అందుకే ఆ రెండు అవలక్షణాలనూ వదిలిపెట్టాలని చెబుతారు పెద్దలు. - డి.వి.ఆర్. -
కర్ణుడి క్షుద్బాధ
పురానీతి కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటిముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్తా బంగారు ద్రవంగా మారి, తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారీ అంతే అయింది. ఈలోగా విపరీత మైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి, చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప జేయడంతో వెంటనే పండు కొరికాడు. పండు కాస్తా పంటికింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి, దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం, వెండి, ధనం రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది’’ అని అశరీరవాణి పలికింది. అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మడు తనను ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది మహారాజా! ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు కూడా! అయితే అపార ధనవంతుడను, అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే, వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికీ తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి, సేవకులతో సంచీడు బంగారు నాణేలను తెప్పించి, అతని వీపుమీద పెట్టించడంతో, ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలబడటం, తాను తిరస్కారంగా చూసి, భటుల చేత గెంటించడం గుర్తుకొచ్చింది. బంగారం వెండి ధనం వజ్రవైఢూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడనే పేరొచ్చింది... అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ, ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు... బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలు పర చగలడు? కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు. సూర్యుని వద్దకెళ్లి జరిగిన విషయమంతా వివరించి పరిపరివిధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కలసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. అదేమంటే, సశరీరంగా భూలోకానికెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి, అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న కాలానికే మహాలయ పక్షమని పేరు. ఎప్పుడైతే అన్నసమారాధనతో అందరి కడుపులూ నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి, దప్పిక ఆయనను ఎన్నడూ బాధించలేదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ డబ్బు, బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అన్నం పెట్టి, ఆకలి తీర్చినవారిని అన్నదాతా సుఖీభవ అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది, పితృలోకంలో ఉన్నవారికి ఆత్మశాంతి కలుగుతుంది. - డి.వి.ఆర్. -
దుర్యోధనుడి గర్వభంగం
పురానీతి మాయాజూదంలో ఓటమి పాలైన పాండవులు వనవాసంలో నిరుపేదల్లా గడపసాగారు. హస్తినాపురంలో దుర్యోధనాది కౌరవులు అష్టైశ్వర్యాలతో తులతూగసాగారు. అడవులలో ఉన్న పాండవులను మరింత అవమానించాలని తలచాడు దుర్యోధనుడు. శకుని, కర్ణ, దుశ్శాసనులు అతడి ఆలోచనకు వంత పాడారు. వనవాసంలో ఉన్న పాండవుల వద్ద ఐశ్వర్య బలప్రదర్శన చేసి వారిని చిన్నబుచ్చాలని దుష్టచతుష్టయం నిశ్చయించుకున్నారు. వనవాసంలో పాండవులు ఆవాసం ఏర్పరచుకున్న ద్వైతవనంలో కౌరవుల గోవులు ఉండేవి. అందువల్ల పథకం ప్రకారం క్రూరమృగాల వల్ల గోవుల ప్రాణాలకు హాని కలుగుతోందని ధృతరాష్ట్రుడి ఎదుట కొందరు గోపాలకుల చేత సభలో చెప్పించారు. ఆ నెపంతో గోరక్షణ కోసం ద్వైతవనానికి వెళ్లేందుకు దృతరాష్ట్రుడి అనుమతి పొందారు. దుష్టచతుష్టయం సమస్త పరివారంతో, రాజ వైభవ లాంఛనాలతో అట్టహాసంగా ఘోషయాత్రకు బయలుదేరారు. ద్వైతవనానికి చేరువలో కమలాలతో నిండిన ఒక సుందర సరోవరం ఒడ్డున గుడారాలు నిర్మించుకుని విడిది చేశారు. అక్కడకు చేరువలోనే పాండవుల పర్ణశాల ఉంది. అద్భుతమైన సరోవర సౌందర్యానికి ముగ్ధులైన కౌరవులు అందులోకి దిగి యథేచ్ఛగా జలక్రీడలు ప్రారంభించారు. ఇంతలో కొందరు గంధర్వులు అక్కడకు పరుగు పరుగున చేరుకున్నారు. ‘ఇది మా ప్రభువు చిత్రసేనుడు నిర్మించుకున్న సరోవరం. ఇందులో అన్యులకు ప్రవేశం నిషిద్ధం. తక్షణమే ఇక్కడి నుంచి తొలగిపొండి’ అని హెచ్చరించారు. గంధర్వుల మాటలకు దుర్యోధనాది కౌరవులు వికటాట్టహాసాలు చేస్తూ ‘సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చినా మేము ఇక్కడి నుంచి తొలగిపోయే ప్రసక్తే లేదు’ అని పలికి వారిని గెంటివేశారు. చేసేది లేక వారు తమ లోకానికి చేరుకుని జరిగినదంతా తమ ప్రభువైన చిత్రసేనుడికి విన్నవించారు. ఆగ్రహంతో రగిలిపోయిన చిత్రసేనుడు సేనలను తోడ్కొని వెళ్లి కౌరవులను ముట్టడించాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కౌరవ సేనలు గంధర్వులతో యుద్ధానికి తలపడ్డాయి. గంధర్వుల ధాటికి తాళలేని కౌరవ సేనలు ద్వైతవనంలోని పాండవుల పర్ణశాల వైపుగా పరుగులు ప్రారంభించాయి. గంధర్వుల దాడిలో కర్ణుడు క్షణాల్లోనే విరథుడై, నిరాయుధుడిగా మిగిలాడు. దుర్యోధనుడికి, అతడి సోదరులకు కూడా అదే గతి పట్టింది. చిత్రసేనుడు వారందరినీ బంధించి తీసుకుపోసాగాడు. ఈలోగా పారిపోయిన కౌరవ సైనికులు ధర్మరాజు వద్దకు చేరుకుని దుర్యోధనాదులు గంధర్వుల చేతికి బందీలుగా చిక్కారని, వారిని విడిపించాలని మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న భీముడు వారి మాటలు విని... ‘అన్నయ్యా! కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. మనకు భారం తగ్గింది’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు... ‘భీమసేనా! నువ్విలా అనరాదు. శరణార్థులైన వారు ఎలాంటి వారైనా వారిని కాపాడటమే ఉత్తమ వీరుల లక్షణం. పైగా, కౌరవులు మనకు స్వయానా దాయాదులు. వారికి సాయపడటం మన ధర్మం’ అని పలికాడు. అందువల్ల గంధర్వులను వారించి, కౌరవులను విడిపించమని భీమార్జునులను పురమాయించాడు. కౌరవులను విడిచిపెట్టమని అర్జునుడు నచ్చచెప్పగా గంధర్వులు వినిపించుకోకుండా, పాండు సోదరులపై ఆయుధాలు సంధించారు. ఇక అర్జునుడు గాండీవానికి పనిచెప్పాడు. తన శర పరంపరతో గంధర్వులను నిరాయుధులుగా చేశాడు. తన సేనలు చిక్కుల్లో పడ్డాయని తెలుసుకున్న చిత్రసేనుడు అక్కడకు వచ్చాడు. అతడు అర్జునుడికి అదివరకే మిత్రుడు. అర్జునుడిని చూడటమే తడవుగా యుద్ధాన్ని విరమించుకోమని తన సేనలను ఆదేశించాడు. అర్జునుడి మాటపై కౌరవులను విడిచిపెట్టాడు. సోదరులతో కలసి ద్వైతవనానికి తిరిగి వచ్చిన కౌరవులను ధర్మరాజు సాదరంగా ఆహ్వానించాడు. జరిగిన దానికి బాధపడవద్దని, అనవసరంగా ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడవద్దని దుర్యోధనుడికి హితవు చెప్పి సాగనంపాడు. -
సుందోపసుందులు
పురానీతి పూర్వం హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే కొడుకులు ఉండేవారు. వారిద్దరికీ ముల్లోకాలనూ జయించాలనే కోరిక ఉండేది. అంతటి ఘనకార్యం ఘోర తపస్సుతో తప్ప సాధ్యం కాదని తలచి, అన్నదమ్ములిద్దరూ ఒక కీకారణ్యానికి చేరుకుని తపస్సు ప్రారంభించారు. మండు వేసవిలో పంచాగ్నుల మధ్య నిలిచి, వణికించే శీతకాలంలో జలాశయాల్లో మునిగి ఏళ్ల తరబడి ఘోర తపస్సు సాగించారు. వారి తపస్సు తీవ్రతకు ప్రకృతి గతి తప్పింది. ముల్లోకాలలో సంక్షోభాలు తలెత్తాయి. ఆ పరిస్థితికి దేవతలు సైతం బెంబేలెత్తిపోయారు. వారి తపస్సును విరమించేలా చేయాలంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దేవతల గోడు విన్న బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. కామరూపం, కామగమనం వంటి సకల మాయావిద్యలను అనుగ్రహించాలని, తమకు ఇతరుల వల్ల మరణం రాకుండా ఉండేలా వరమివ్వాలని, అమరత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అమరత్వం తప్ప వారు కోరుకున్న మిగిలిన వరాలన్నింటినీ ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. అసలే రాక్షసులు, ఆపై బ్రహ్మదేవుడి వరాలు కూడా పొందినవారు. ఇక ఆగుతారా..? వరగర్వంతో నానా అకృత్యాలూ ప్రారంభించారు. మునులు తలపెట్టిన యజ్ఞయాగాలకు భంగం కలిగించసాగారు. కామరూప విద్యతో క్రూరమృగాల రూపం ధరించి, ఊళ్లపై పడి అమాయక ప్రజలను పీడించసాగారు. వారి దాష్టీకాలకు లోకమంతా హాహాకారాలు మిన్నుముట్టసాగాయి. సుందోపసుందులను ఎలా నియంత్రించాలో అర్థంకాక మునులందరూ బ్రహ్మదేవుడి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు. ‘దేవా! నీవిచ్చిన వరాల ప్రభావంతోనే సుందోపసుందులు చెలరేగిపోతున్నారు. లోకులను నానా రకాలుగా పీడిస్తున్నారు. వారి పీడ విరగడయ్యే పరిష్కారం నువ్వే చూడాలి’ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ‘వారికి నేను అన్ని వరాలూ ఇచ్చానే గాని, అమరత్వాన్ని ప్రసాదించలేదు. నేనిచ్చిన వరం వల్ల ఇతరుల చేతుల్లో వారి మరణం అసంభవం. వారిలో వారికే కలహం వచ్చి, పరస్పర యుద్ధానికి దిగితే తప్ప వారి పీడ విరగడ కావడం సాధ్యం కాదు’ అన్నాడు బ్రహ్మదేవుడు. అయితే, కలహించుకోవడానికి సుందోపసుందులు పరస్పర శత్రువులేమీ కాదు. ఒకరిపై మరొకరికి అనురాగం గల అన్నదమ్ములు. వాళ్ల మధ్య కలహం పుట్టించడం ఎలా అన్నదే సమస్య. దీనికి ఏం చేయాలో తోచని బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరినీ సమావేశపరచాడు. తానిచ్చిన వరాల వల్ల గర్వాంధులైన సుందోపసుందులు ముల్లోకాలనూ ఎలా పీడిస్తున్నదీ వివరించాడు. వారి పీడ విరగడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు. అప్పుడు విశ్వకర్మ ముందుకు వచ్చి ‘అన్నదమ్ముల మధ్య కలహం పుట్టించడానికి ఆడది చాలు. నేను సృష్టించిన అప్సరస తిలోత్తమ ఆ పనిని అవలీలగా సాధించగలదు’ అని పలికాడు. విశ్వకర్మ మాటలతో బ్రహ్మదేవుడికి కాస్త ధైర్యం వచ్చింది. ఇంద్రసభలో ఉన్న తిలోత్తమకు కబురు పంపాడు. బ్రహ్మదేవుడి వర్తమానం అందడంతో జగదేక సుందరి అయిన తిలోత్తమ బ్రహ్మ సమక్షానికి వచ్చి నిలుచుంది. ‘నీ అందచందాలతో లోకాలను పీడిస్తున్న సుందోపసుందులను ఆకర్షించు. చాకచక్యంగా వాళ్లిద్దరి మధ్య కలహం పుట్టించు’ అని ఆదేశించాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తిలోత్తమ భూలోకానికి చేరుకుంది. సుందోపసుందులకు కనిపించేలా వారు తరచూ సంచరించే వనంలో విహరించసాగింది. వన విహారానికి వచ్చిన సుందోపసుందులిద్దరూ ఒకేసారి ఆమెను చూశారు. ఆమె అందానికి వారి మతులు పోయాయి. ‘ప్రాణేశ్వరీ’ అంటూ సుందుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ‘హృదయేశ్వరీ’ అంటూ ఉపసుందుడు ఆమె మరో చేతిని పట్టుకున్నాడు. ఆమె నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు. వారి వాదన ఎటూ తేలని స్థితిలో తిలోత్తమ చిరునవ్వులు చిందిస్తూ... ‘మీ ఇద్దరికీ నేనొకత్తెనే ఎలా భార్య కాగలను? మీరిద్దరిలో ఎవరు వీరులో వారిని నేను తప్పక పెళ్లాడతాను’ అని పలికింది. ఎలాగైనా తిలోత్తమను దక్కించుకోవాలనే పట్టుదలతో సుందోపసుందులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ఇద్దరూ సమాన బలవంతులే. భీకరంగా పోరాడుకున్నారు. సింహనాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు కలబడి ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చివరకు ఇద్దరూ మరణించారు. -
విశ్వామిత్రుడి భంగపాటు
పురానీతి గాధి కొడుకైన విశ్వామిత్రుడు తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని తన బలసంపదతో అపారంగా విస్తరించాడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. దాంతో బలగర్వం పెరిగి, క్షాత్రబలాన్ని మించినది లేదనే భ్రమలో బతికేవాడు. రోజూ సభలో కొలువుదీరి వందిమాగధుల స్తోత్రపాఠాలు వింటూ పొద్దుపుచ్చేవాడు. ఇలా ఉండగా, విశ్వామిత్రుడికి ఒకనాడు వేటకు వెళ్లాలనే సరదా పుట్టింది. విశ్వామిత్రుడు, అతడి పరివారం ఆయుధాలు ధరించి వేట కోసం అరణ్యమార్గం పట్టారు. కీకారణ్యానికి చేరుకుని, పొద్దంతా వేట సాగించారు. పొద్దుగూకే వేళకు బాగా అలసట చెందారు. ఇక వేట చాలించి, ఆహారాన్వేషణలో పడ్డారు. కొంత దూరం ముందుకు వెళ్లగా, కొందరు ముని బాలకులు కట్టెలు, దర్భగడ్డి ఏరుకుంటూ కనిపించారు. అక్కడకు కనుచూపు మేరలోనే ఒక ఆశ్రమం కనిపించింది. విశ్వామిత్రుడు ఆ మునిబాలకుల దగ్గరకు వెళ్లి ‘అదిగో! అక్కడ కనిపిస్తున్న ఆశ్రమం ఎవరిది?’ అని అడిగాడు. ‘మహారాజా! అది మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమం. మేము ఆయన శిష్యులమే’ అని బదులిచ్చారు. శిష్యుల ద్వారా విశ్వామిత్రుడి రాక గురించి సమాచారం తెలుసుకున్న వశిష్ఠుడు వెంటనే విశ్వామిత్రుడికి ఎదురేగి, స్వాగతం పలికాడు. అర్ఘ్య పాద్యాదులిచ్చి సత్కరించాడు. వశిష్ఠుడి వద్ద నందిని అనే హోమధేనువు ఉండేది. కామధేనువులాంటి ఆ హోమధేనువు కోరినవన్నీ ఇచ్చేది. వేటలో అలసి సొలసిన విశ్వామిత్రుడికి, అతడి పరివారానికి హోమధేనువు మహిమతో పంచభక్ష్య పరమాన్నాలు తృప్తిగా వడ్డించాడు. నందిని మహిమను చూశాక విశ్వామిత్రుడికి వశిష్ఠుడి వైభోగంపై కన్ను కుట్టింది. కోరినదల్లా ఇచ్చే ఇలాంటి ధేనువు తన వద్ద ఉండాలే తప్ప ముక్కుమూసుకుని అడవుల్లో తపస్సు చేసుకునే వశిష్ఠుడి వంటి ముని వద్ద కాదని అనుకున్నాడు. నయాన అయినా భయాన అయినా వశిష్ఠుడి నుంచి నందినిని ఎలాగైనా దక్కించుకోవాలని కూడా అనుకున్నాడు. భోజనాదికాలు ముగిశాక విశ్వామిత్రుడు, అతడి పరివారం విశ్రమించారు. విశ్వామిత్రుడికి మాత్రం వశిష్ఠుడి హోమధేనువును ఎలా దక్కించుకోవాలా అనే ధ్యాసతో కునుకు పట్టలేదు. ఉదయాన్నే నిద్రలేచి, స్నాన సంధ్యలు ముగించుకున్న తర్వాత విశ్వామిత్రుడి పరివారం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. వీడ్కోలు పలకడానికి వచ్చిన వశిష్ఠుడిని నందినిని తనకు ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు. ‘మునివర్యా! అడవులలో తపస్సు చేసుకునే మీకు సంపదలనిచ్చే హోమధేనువు దేనికి? పాల కోసమే అయితే వేరేదైనా ధేనువును పెంచుకోవచ్చు కదా! దీనిని నాకు అప్పగిస్తే, దీని బదులు పాలిచ్చే లక్ష గోవులను నీకు ఇస్తా’ అని పలికాడు. ‘రాజా! దీని బదులు లక్ష గోవులు దేనికి? వాటిని నేనెలా మేపగలను? అయినా, ఇది పవిత్రమైన హోమధేనువు. దీనిని ఇతరులకు ఇవ్వతగదు’ అని వశిష్ఠుడు బదులిచ్చాడు. వశిష్ఠుడి సమాధానంతో విశ్వామిత్రుడికి చర్రున కోపం వచ్చింది. ‘మునివర్యా! నయాన ఇవ్వకుంటే, బలవంతంగానైనా నీ ధేనువును తీసుకుపోగలను. నువ్వు నన్నేమీ చేయలేవు’ అన్నాడు. నందినిని వెంట తీసుకు రమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు దానిని పట్టి తేవడానికి వెళ్లారు. ఉన్న చోటు నుంచి కదలడానికి నందిని మొరాయించింది. భటులు బలప్రయోగం చేశారు. ఆర్తనాదాలు చేస్తూ అది వశిష్ఠుడి వద్దకు వచ్చింది. ‘మునివర్యా! నన్ను ఈ దుర్మార్గులకు ఎందుకు ఇచ్చేస్తున్నావు?’ అని దీనంగా అడిగింది. వశిష్ఠుడు బదులు పలకలేదు. వశిష్ఠుడు తనను వారికి ఇవ్వలేదని నందినికి అర్థమైంది. విశ్వామిత్రుడి భటులు మళ్లీ దానిని బలవంతంగా లాక్కుపోవడానికి ప్రయత్నించారు. ఈసారి నందిని నిస్సహాయంగా ఆక్రందనలు చేయలేదు. క్రోధావేశంతో తోక ఝాడించి, కొమ్ములు ఝుళిపించింది. నందిని శరీరం నుంచి వేలాదిగా సాయుధ సైనికులు పుట్టుకొచ్చారు. ఒక్కుమ్మడిగా దాడి చేసి విశ్వామిత్రుడి సైనికులను తరిమి తరిమి కొట్టారు. క్షాత్రబలమే గొప్పదనే భ్రమలో ఉన్న విశ్వామిత్రుడికి కళ్లు తెరుచుకున్నాయి. తపోబలమే క్షాత్రబలం కంటే గొప్పదని గ్రహించాడు. తపోసాధనకు ఉపక్రమించాడు. -
అంగారపర్ణుడి గర్వభంగం
పురానీతి అంగారపర్ణుడు అనే గంధర్వుడు కుబేరుడి స్నేహితుడు. కుబేరుడంతటి వాడు తనకు స్నేహితుడైనందున గర్వం తలకెక్కించుకున్నాడు. ఎంతటి వారినైనా లెక్కచేయకుండా విచ్చలవిడిగా సంచరించేవాడు. పైగా స్త్రీలోలుడు. అర్ధరాత్రి వేళలో తన భార్యతో, అంతఃపుర కాంతలతో గంగానది వద్దకు వచ్చి జలక్రీడలతో వినోదం పొందేవాడు. అంగారపర్ణుడు జలక్రీడలాడే సమయంలో అటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ఒకవేళ కర్మకాలి వచ్చినా, అతడి చేతిలో చచ్చి పరలోకగతులయ్యేవారు. అంగారపర్ణుడు ఇలా స్వైరవిహారం చేస్తున్న కాలంలో పాండవులు ఏకచక్రపురంలో ఉండేవారు. బకాసురుడిని భీముడు వధించాక ఇక ఏకచక్రపురంలో ఉండి చేసేదేమీ లేదని వారు భావించారు. ఈలోగా ద్రుపద మహారాజు ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించాడు. స్వయంవరానికి వెళ్లాలని పాండవులు ఉవ్విళ్లూర డంతో కుంతీదేవి అందుకు సమ్మతించింది. పాంచాల రాజ్యంలో సురక్షితంగా ఉండవచ్చని కూడా ఆమె తలపోసింది. ఒకనాడు పాండవులు ఏకచక్రపురాన్ని వీడి పాంచాల రాజ్యానికి కాలినడకన బయలుదేరారు. ఒకనాటి రాత్రి పాండవులు గంగానది సమీపానికి చేరుకున్నారు. గంగాతీరంలోని సోమశ్రవ తీర్థంలో స్నానమాచరించి, గంగను పూజించాలని వారు సంకల్పించారు. అదే మార్గంలో అర్జునుడు ముందు నడవగా మిగిలిన వారు అతడిని అనుసరిస్తూ నడక సాగించారు. వారు నది ఒడ్డుకు చేరుకునే సమయానికి అంగారపర్ణుడు తన అంతఃపురకాంతలతో నదిలో జలక్రీడలు ఆడుతూ కేళీవినోదంలో మునిగి ఉన్నాడు. అపరిచితుల పదఘట్టనలు వినిపించడంతో చిరాకుపడి ఒడ్డుకు వచ్చి, అర్జునుడిని అడ్డగించాడు. అకస్మాత్తుగా గంధర్వుడు ప్రత్యక్షం కావడంతో అర్జునుడితో పాటు, అతడి వెనుకగా వస్తున్న మిగిలిన పాండవులు, కుంతీదేవి తటాలున నిలిచిపోయారు. ‘ఓరీ నరుడా! సంధ్యవేళలు, అర్ధరాత్రి సమయాలు యక్షగంధర్వ దానవులు స్వేచ్ఛగా సంచరించే సమయాలు. ఎంతటి బలవంతులైన రాజులైనా నరులు ఈ సమయాల్లో ఈ ప్రాంతాల్లో సంచరించరు. అర్ధరాత్రివేళ నేను సంచరించే ప్రాంతంలోకి ఎందుకు అడుగుపెట్టారు? నేనెవరినో తెలియదా? నా పేరెప్పుడూ వినలేదా? నేను అంగారపర్ణుడిని. కుబేరుడి అనుంగు మిత్రుడిని... ఇప్పటికైనా మించినది లేదు. వెనుదిరిగి ప్రాణాలు దక్కించుకోండి’ అంటూ గద్దించాడు. అర్జునుడు వాని పలుకులు విని నవ్వుతూ ‘సంధ్యా సమయాలు, అర్ధరాత్రి వేళల్లో సంచరించడానికి అశక్తులు, అర్భకులు భయపడతారు. మాకు అలాంటి భయాలేవీ లేవు. నువ్వు కుబేరుడి మిత్రుడివి కావచ్చు గాక. ఇది పవిత్ర గంగానది. ఈ నదిలో స్నానమాచరించే హక్కు, పూజలు చేసుకునే హక్కు అందరికీ సమానమే. ఇది నీ సొత్తు కాదు’ అని బదులిచ్చాడు. అర్జునుడి ప్రత్యుత్తరంతో అంగారపర్ణుడు మండిపడ్డాడు. ‘నన్నే ధిక్కరిస్తావా..? ఎంత ధైర్యం..?’ అంటూ అస్త్రాలను ఎక్కుపెట్టాడు. అర్జునుడు ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన గాండీవాన్ని సంధించాడు. ఇద్దరికీ హోరాహోరీ పోరు జరిగింది. చివరకు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడంతో అంగారపర్ణుడు సొమ్మసిల్లి నేలకూలాడు. అర్జునుడు అతడిని పట్టి తెచ్చి ధర్మరాజు కాళ్ల ముందు పడేశాడు. ఈలోగా అంగారపర్ణుడి పట్టమహిషి కుంభీనన విలపిస్తూ కుంతీదేవి కాళ్లపై పడి తనకు పతిభిక్ష పెట్టాలంటూ వేడుకుంది. కుంతి ఆమెకు అభయమిచ్చింది. ఈలోగా అంగారపర్ణుడు స్పృహలోకి వచ్చాడు. కుంభీననకు తల్లి అభయమివ్వడంతో ధర్మరాజు ఆమె కోరికను మన్నించి, అంగారపర్ణుడిని ఆమెకు అప్పగించాడు. ‘కుబేరుడంతటి వాడు నా స్నేహితుడనే గర్వం తలకెక్కి మిమ్మల్ని అడ్డుకున్నాను. మీ శౌర్యప్రతాపాలను తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించండి’ అంటూ అంగారపర్ణుడు వేడుకున్నాడు. ’బలగర్వంతో ఎవరినీ కించపరచకు. ఎవరినీ హింసించకు. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తుకాదు’ అంటూ ధర్మరాజు అతడికి హితబోధ చేసి, విడిచిపెట్టాడు. -
దంబోద్భవుడికి గుణపాఠం
పురానీతి ఒకానొక కాలంలో దంబోద్భవుడనే రాజు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే గర్విష్టి. పైగా భుజబల పరాక్రమ సంపన్నుడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. రోజూ అతడు సభకు వచ్చి, సింహాసనంపై కూర్చోగానే వందిమాగధులు, భట్రాజులు అతడిని కీర్తిస్తూ స్తోత్రాలు పఠించేవారు. బల సంపదలో అతడికి సాటివచ్చే వారు ముల్లోకాలలోనూ లేరని పొగిడేవారు. దంబోద్భవుడు చిరునవ్వులు చిందిస్తూ, మీసం మెలితిప్పుతూ ఆ పొగడ్తలను వీనుల విందుగా ఆలకించేవాడు. రోజూ పొగడ్తలను విని విని లోకంలో తనను మించిన వారే లేరనే భ్రమలో బతకసాగాడు. ‘ఈ భూలోకంలో నన్ను మించిన వీరుడెవరైనా ఉన్నాడా? ధనుర్విద్యలోనే కాదు, ఖడ్గ గదా యుద్ధాలలో నన్ను జయించగల వాడెవడైనా ఉన్నాడా? కనీసం మల్లయుద్ధంలో నన్ను మట్టికరిపించే ధైర్యం ఎవరికి ఉంది?’ అంటూ సభాసదులను ప్రశ్నించేవాడు. ‘భూలోకంలోనే కాదు ప్రభూ! ముల్లోకాలలోనూ మిమ్మల్ని జయించగల వీరులెవ్వరూ లేరు’ అని వందిమాగధులు ముక్తకంఠంతో బదులిచ్చేవారు. మిగిలిన వారు మౌనంగానే తలలు పంకించేవారు. వందిమాగధుల పలుకులు వింటూ భుజాలు ఎగరేస్తూ పకపకా వికటాట్టహాసం చేసేవాడు దంబోద్భవుడు. అతడి సభలో ఇదంతా అనుదినం జరిగే తతంగమే. రోజూ పొగడ్తలు మాత్రమే వింటూ ఉండటంతో దంబోద్భవుడు మితిమీరిన గర్వంతో విర్రవీగసాగాడు. ఇలా ఉండగా, ఒకనాడు పొరుగు రాజ్యానికి చెందిన విప్రులు యాత్రలకు వెళుతూ దంబోద్భవుని సభకు వచ్చారు. దంబోద్భవుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు. ‘విప్రులారా! మీరు దూర ప్రాంతం నుంచి వచ్చారు. యాత్రలు చేస్తూ ఉన్నారు. నన్ను మించిన వీరుడు ఎవరైనా మీకు తారసపడ్డాడా?’అని ప్రశ్నించాడు. ‘రాజా! నీవు మహావీరుడివే! సందేహం లేదు. రాజులలో నిన్ను మించిన వారు లేనేలేరు. అయితే, గంధమాధన పర్వతం మీద నర నారాయణులనే ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలో ఎవరూ లేరని విన్నాం’ అని చెప్పారు ఆ విప్రులు. ఆ మాట వినడంతోనే తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టాడు దంబోద్భవుడు. ‘నన్ను మించిన వీరులా..? వారిని జయించగలవారు ముల్లోకాలలోనే లేరా..? ఆ సంగతి ఇప్పుడే తేల్చుకుంటాను’ అంటూ సేనలను యుద్ధానికి సిద్ధం చేసి గంధమాధన పర్వతం వైపు బయలుదేరాడు. గంధమాధన పర్వతం మీద ప్రశాంత వాతావరణంతో ఉన్న వనంలో ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటున్న నర నారాయణులు కనిపించారు. యుద్ధానికి రమ్మంటూ దంబోద్భవుడు వారిని తొడగొట్టి మరీ ఆహ్వానించాడు. ఆశ్రమానికి వచ్చిన దంబోద్భవునికి నర నారాయణులు అతిథి మర్యాదలు చేయబోగా, అతడు వాటన్నింటినీ తిరస్కరించాడు. ‘ఈ మర్యాదలన్నీ అనవసరం. నాకు యుద్ధం కావాలి... నేను మీతో యుద్ధం కోసమే వచ్చాను’ అంటూ వికటాట్టహాసం చేశాడు. ‘లౌకిక కార్యకలాపాలకు దూరంగా తపస్సు చేసుకునే మునులం మేము. మాతో యుద్ధం చేయాలనే కోరిక నీకు ఎలా కలిగింది రాజా! యుద్ధం ఆలోచనను విరమించుకుని, చక్కగా నీ రాజ్యానికి పోయి ప్రజల ఆలనా పాలనా చూసుకో’ అని నచ్చచెప్పారు నర నారాయణులు. వారి మాటలు రుచించని దంబోద్భవుడు దాడి చేయమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. తానూ కత్తి ఝుళిపించాడు. నర నారాయణుల్లో నరుడు ఇక లాభం లేదనుకుని ఒక దర్భపుల్లను తీసుకుని, దానిని మంత్రించి సైన్యం మీదకు సంధించాడు. దర్భపుల్ల ధాటికి సైన్యం చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తుత్తినియలయ్యాయి. వాళ్ల అవయవాలు తెగాయి. భయభ్రాంతులైన సైనికులు పలాయనం చిత్తగించసాగారు. ఈ దృశ్యం చూడటంతో దంబోద్భవుడికి ధైర్యం దిగజారింది. తన తప్పు తెలిసివచ్చింది. తనను మన్నించాలంటూ నర నారాయణుల కాళ్ల మీద పడ్డాడు. ‘రాజా! బల పరాక్రమాలను దుర్జన శిక్షణకు, సజ్జన రక్షణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప వాటి కారణంగా గర్వం తలకెక్కించుకుని ఇతరులను పీడించరాదు’ అంటూ హితబోధ చేసి దంబోద్భవుడిని సాగనంపారు నర నారాయణులు. -
జాబాలి జ్ఞానోదయం
పురానీతి పూర్వం జాబాలి అనే మహాముని ఉండేవాడు. నిష్ఠగా తపస్సు చేసుకునేవాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా తపస్సు సాగిస్తుండటంతో, జడలు కట్టిన ఆయన తలపై పిచుకల జంట గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకుని, పిల్లాపాపలతో నిశ్చింతగా ఉండసాగాయి. భూతదయా సంపన్నుడైన జాబాలి వాటిని తరిమివేయకుండా, అలాగే తలపై ఉండనిచ్చాడు. తలపై గూడు పెట్టుకున్న పక్షులను తాను అలా ఉండనిచ్చినందునే అవి హాయిగా ఉండగలుగుతున్నాయని, లోకంలో తన కంటే దయాళువు ఇంకెవరుంటారని భావించసాగాడు జాబాలి. జపతపాదుల కంటే తన తలపై గూడు పెట్టుకున్న పక్షుల గురించే ఎక్కువగా ఆలోచించసాగాడు. తాను గనుక వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉన్నానంటూ గర్వించసాగాడు. రోజు రోజుకూ జపతపాలపై అతడి శ్రద్ధ క్షీణించి, గర్వం పెరగసాగింది. జాబాలి గర్వానికి సమాధానంగా ఒక రోజు అశరీరవాణి ... ‘నాయనా! జాబాలి.. లోకంలో నువ్వొక్కడివే ధర్మపరాయణుడివని, దయాళువని నీకు నువ్వే అనుకోవడం సరికాదు. తులాధారుడనే వర్తకుడు నీ కంటే ఎక్కువ ధర్మపరుడు. అయితే, అతడు నీలా ఎన్నడూ గర్వించలేదు’ అని పలికింది. అశరీరవాణి పలుకులతో జాబాలికి అసూయ మొదలైంది. ‘ఎవరా తులాధారుడు..? నిత్యం జపతపాలు సాగించే నా కంటే ఘనత గలవాడా ఆ వర్తకుడు?’ అనే ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. తులాధారుడిని ఎలాగైనా చూసి తీరాలని, తనను మించిన ఘనత అతడిలో ఏముందో తెలుసుకోవాలని బయలుదేరాడు. తులాధారుడు ఉంటున్న గ్రామానికి వెళ్లాడు. తులాధారుడి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముంగిట ఏర్పాటు చేసుకున్న అంగడిలోనే వర్తకం చేసుకుంటూ బేరసారాల్లో తలమునకలైన తులాధారుడు కనిపించాడు. అతడిని చూసిన జాబాలి ‘ఈ మామూలు వర్తకుడు నా కంటే గొప్పవాడెలా అవుతాడు’ అని ఆలోచించసాగాడు. ఈలోగా బేరసారాలు ముగించుకున్న తులాధారుడు తన ముంగిట నిలుచున్న జాబాలిని గమనించాడు. ‘మహర్షీ! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. పిచుకలు తలపై గూడు పెట్టుకుని, పిల్లలతో కాపురం ఉంటున్నా, తపస్సు కొనసాగించిన దయాసాగరులు మీరు. మీ పాదధూళితో నా నివాసం పావనమైంది. దయచేయండి’ అంటూ ఆహ్వానించి, ఉచిత మర్యాదలు చేశాడు. తులాధారుడి మాటలకు జాబాలి నివ్వెరపోయాడు. ‘నా సంగతంతా నీకెలా తెలిసింది?’ అని ప్రశ్నించాడు. ‘మహర్షీ! నాకు దేనిమీదా మమకారం లేదు. ఎవరిమీదా రాగద్వేషాలు లేవు. ధర్మబద్ధంగా జీవించడం మాత్రమే తెలుసు. నా మనస్సు తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది. అందుకే మీ ఘనతను తెలుసుకోగలిగాను’ అని బదులిచ్చాడు తులాధారుడు. ‘అయితే, నేను ధర్మమార్గంలో జీవించడం లేదంటావా? నేను సాగిస్తున్న జపతపాదులు ధర్మం కాదంటావా?’ కాస్త కోపంగా ప్రశ్నించాడు జాబాలి. ‘మునివరేణ్యా! మీకు తెలియనిదేముంది? అహంకారంతో చేసిన తపస్సును, ప్రతిఫలాపేక్షతో చేసిన యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్య తృప్తికి మించిన యజ్ఞం లేదు. దానివల్ల దేవతలతో పాటు మనమూ తృప్తి పొందుతాము’ అన్నాడు తులాధారుడు. ‘అయితే, నీ వర్తకం మానుకోవేం? నీది ధనాశ కాదా?’ అక్కసుగా అడిగాడు జాబాలి. ‘కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తగదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంతే’ అని బదులిచ్చాడు తులాధారుడు. కావాలంటే ఇన్నాళ్లూ మీ తలపై ఆశ్రయం పొందిన పిచుకలను అడగండి అని అన్నాడు. వాటిని పిలిచాడు జాబాలి. వెంటనే అతడి తలపై ఉన్న పక్షులు రివ్వున పెకైగిరి ఆకాశమార్గాన నిలిచాయి. ‘మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞ మేరకు నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం వల్ల నీ తపస్సు నశించింది. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది’ అని చెప్పి అంతర్ధానమైపోయాయి. వాటి పలుకులతో జాబాలికి జ్ఞానోదయమైంది. ‘అనవసరంగా నీపై మత్సరం పెంచుకున్నాను. క్షమించు’ అని చెప్పి తులాధారుడి వద్ద సెలవు తీసుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి బయలుదేరాడు. -
హనుమంతుడి పరిపూర్ణ సంగీతం
పురానీతి దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి. ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు. ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. ‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు. అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు. ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు. ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు. హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు. హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. ‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు. ‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది. ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు. నీతి: అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం -
క్రోధానికి విరుగుడు శాంతమే!
పురానీతి ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు. కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు. అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది. రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు. రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి. కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు. ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. ‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’ అని అడిగారు. ‘వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు. బలరాముడు, సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు. ‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు. నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు. -
దుర్వాసుడి గర్వభంగం
పురానీతి విష్ణుభక్తుడైన అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవాడు. ఒకసారి వ్రత నియమం ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు. మర్నాడు ద్వాదశి రోజు వ్రతాన్ని ముగించుకునేందుకు ఉదయాన్నే శుచిగా నదీ స్నానం ఆచరించి, మధువనానికి వెళ్లి అక్కడ నారాయణుడిని అర్చించుకున్నాడు. బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణదానాలు చేశాడు. తర్వాత తన నివాసానికి చేరుకుని భార్యా సమేతుడై ఉపవాస విరమణకు ఉపక్రమించాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చాడు. అంబరీషుడు ఆయనకు ఎదురేగి లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంలో కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు. ‘మహర్షీ! వ్రతాన్ని ముగించే తరుణాన నా ఇంటిని పావనం చేశారు. మీ రాకతో ధన్యుడినయ్యాను. నా ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించండి’ అని అభ్యర్థించాడు. దుర్వాసుడు సరేనన్నాడు. ముందుగా నదికి వెళ్లి సంధ్యా వందనం కావించుకుని వస్తానన్నాడు. నదికి బయలుదేరిన దుర్వాసుడు ద్వాదశి ఘడియలు ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంకా రాలేదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ద్వాదశి ఘడియలు ముగిసేలోగానే ఉపవాస విరమణ చేయాలి. లేకపోతే వ్రతం నిష్ఫలమవుతుంది. పైగా పాపం కూడా. అలాగని అతిథికి భోజనం పెట్టక ముందే తినడం భావ్యం కాదు. ధర్మసంకటంలో పడ్డాడు అంబరీషుడు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో చెప్పాలని పురోహితులను సలహా అడిగాడు. తులసితీర్థం పుచ్చుకుంటే వ్రతాన్ని ముగించినట్లే అవుతుందని, అందువల్ల తులసితీర్థం పుచ్చుకుని, దుర్వాసుడు వచ్చేంత వరకు భోజనానికి నిరీక్షించమని సలహా ఇచ్చారు. వారి సలహాపై తులసితీర్థం పుచ్చుకున్నాడు అంబరీషుడు. అప్పుడే నది నుంచి వచ్చాడు దుర్వాసుడు. తన రాకకు ముందే తులసితీర్థం పుచ్చుకుని అంబరీషుడు వ్రతాన్ని ముగించుకున్నాడని తెలుసుకుని మండిపడ్డాడు. ‘రాజా! నీవు అధికార ధన మదాంధుడవై అతిథిగా వచ్చిన నన్ను అవమానించావు. నా కోపం ఎలాంటిదో నీకు తెలియదు. ఇప్పుడే నీకు గుణపాఠం చెబుతా’ అంటూ తన జడల నుంచి ఒక వెంట్రుకను తెంచి, అంబరీషుడి వైపు విసిరాడు. ఆ వెంట్రుకలోంచి కృత్యుడనే బ్రహ్మరాక్షసుడు ఆవిర్భవించి, అంబరీషుడిని చంపడానికి దూసుకు రాసాగాడు. అంబరీషుడు ఏ మాత్రం చలించకుండా ధ్యానమగ్నుడై నిలుచున్నాడు. కృత్యుడు అతడి వద్దకు సమీపించగానే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన సుదర్శనచక్రం ఆ రాక్షసుడిని మట్టుపెట్టింది. అంతటితో ఆగకుండా దుర్వాసుడి వెంటపడింది. సుదర్శనచక్రం నుంచి తప్పించుకోవడానికి దుర్వాసుడు ముల్లోకాలకూ పరుగులు తీశాడు. చివరకు శివుడి సలహాపై నేరుగా వైకుంఠానికి చేరుకుని, విష్ణువు పాదాలపై పడ్డాడు. ‘నీ చక్రం బారి నుంచి నన్ను నీవే కాపాడాలి’ అంటూ వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ ‘దుర్వాసా! నేను భక్తపరాధీనుడిని. ఇందులో నేను చేసేదేమీ లేదు. వెళ్లి అంబరీషుడినే శరణు కోరుకో. అతడు నిన్ను క్షమిస్తే నా చక్రం నిన్ను వదిలేస్తుంది’ అన్నాడు. విష్ణువు మాటలతో గర్వం తొలగిన దుర్వాసుడు పరుగు పరుగున అంబరీషుడి వద్దకు వెళ్లాడు. ‘రాజా! భక్తాగ్రేసరుడివైన నీపై తపోగర్వంతో అనవసరంగా ఆగ్రహించాను. క్షమించు’ అని వేడుకున్నాడు. అంబరీషుడు భక్తితో నమస్కరించి సుదర్శనాన్ని వారించడంతో అది తిరిగి విష్ణువును చేరుకుంది. నీతి: ఎంతటి తపోధనులకైనా గర్వం తగదు. గర్వం తలకెక్కితే ఏదో ఒకనాడు భంగపాటు తప్పదు. -
సమయోచితంగా...
పురానీతి వానరరాజు సుగ్రీవుడు, ఆయన మంత్రి హనుమంతుడు. ఇద్దరూ ఋష్యమూక పర్వతం మీద అటూ ఇటూ నడుస్తూ ఏదో విషయం మీద సంభాషించుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడి దృష్టి దూరంగా నడిచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పడింది. చూడటానికి సాధువుల్లా ఉన్నా, ఎంతో బలిష్టంగా, భుజాన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారి చేతులలో ఉన్న ఖడ్గాలు సూర్యకాంతి పడ్డప్పుడల్లా తళుక్కుమని వజ్రాల్లా మెరుస్తున్నాయి. వారిని చూసి సుగ్రీవుడు భయంతో బిగుసుకుని పోయాడు. మాటలలో తడబాటు, నడకలో తత్తరపాటు మొదలైంది. అది గమనించిన హనుమ, ‘రాజా! నీ భయానికి కారణం నాకు అర్థమైంది. ఆ వ్యక్తులను చూసే కదా నువ్వు కలవరపడుతున్నావు. నీవు అనుకుంటున్నట్టుగా వాలి ఇటు రాలేడు. ఒకవేళ మూర్ఖత్వంతో వస్తే మతంగ మహర్షి శాపం వల్ల తల వక్కలై మరణిస్తాడు. ఆ విషయం వాలికీ తెలుసు. నీకూ తెలుసు. రాజైనవాడు అవతలి వారి నడక, అవయవాల కదలికను బట్టి, మాటతీరును బట్టి, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులో ఏ భావం దాగి ఉందో కనిపెట్టి, అందుకు అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగలడు. అటువంటి సమర్థత నీకుంది. అయినా కూడా నువ్వు భయపడుతున్నావంటే, నీ అన్నగారైన వాలి శక్తిసామర్థ్యాల గురించి నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండటమే కారణం అనుకుంటున్నాను. అయినా, వారెవరో. ఎందుకు వస్తున్నారో కనుక్కొని వస్తాను. మంత్రిగా అది నా కర్తవ్యం. అంతవరకూ నువ్వు స్థిమితంగా ఉండు’’ అంటూ సుగ్రీవుడి భుజం తట్టాడు హనుమ. కపిశ్రేష్ఠుడైన హనుమ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది సుగ్రీవుడికి. వెంటనే హనుమ తన మనసులో ఇలా అనుకున్నాడు. వారసలే కొత్తవ్యక్తులు. తానేమో వానరుడు. వారేమో నరులు. తనను చూస్తే, వారు సరిగ్గా సమాధానం ఇస్తారో ఇవ్వరో అనే ఉద్దేశంతో వృద్ధబ్రాహ్మణ వేషం ధరించి, వారివద్దకు వెళ్లాడు. నమస్కరించి, ‘‘అయ్యా! మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడటానికి బ్రాహ్మణుల్లా ఉన్నారు. కానీ, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. బలిష్టంగా ఉన్నారు. మీ నడకను బట్టి, వేషభాషలను బట్టి మీరు ఈ ప్రాంతానికి కొత్తవారని అర్థమవుతోంది. మీరు ఏ పని మీద వచ్చారో తెలిస్తే, నేను మీకు సాయపడగలను’’ అని ఎంతో వినయంగా అన్నాడు. హనుమకు ప్రతినమస్కారం చేశాడు రాముడు. తామెవరో, ఏ పని మీద వచ్చారో క్లుప్తంగా తెలియజేశాడు. తన సోదరుడైన లక్ష్మణుని పరిచయం చేశాడు. వారి మాటలకు ఎంతో ఆనందపడ్డాడు హనుమ. ‘‘మా రాజు సుగ్రీవుడు. ఎంతో బలమైనవాడు. అయితే అంతకన్నా బలశాలి, అన్నగారు అయిన వాలితో విరోధం. వాలికి ఎవరూ ఎదురు నిలిచి పోరాడలేరు. ఎందుకంటే తన ఎదురుగా నిలిచిన వారి బలాన్ని గ్రహించే శక్తి కలిగిన అన్నగారంటే అమిత భయం. అందుకే ఆయన కంట పడకుండా ఈ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. మీరు వచ్చిన కార్యం నెరవేరాలంటే మీరు సుగ్రీవుడితో స్నేహం చెయ్యండి. ఆయనకు అపారమైన వాన రగణం అనుచరులుగా ఉన్నారు. వారి సహకారంతో సీతాన్వేషణ మీకు సులువవుతుంది. అలాగే వాలిని ఎదిరించి పోరాడాలంటే మీవంటి అమిత పరాక్రమశాలురు స్నేహితులుగా ఉండటం సుగ్రీవుడికి కూడా అవసరమే. మీరు నాతో రండి’’ అంటూ ముందుకు దారి తీశాడు. సమయోచిత వేషధారణ, సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కూడా బోధిస్తూ ఉంటారు. అలాంటి సమయోచిత వేషధారణ, సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో పెద్ద వాగ్విశారదుడని పేరు తెచ్చుకున్న రాముడంతటివాడు అతను మాట్లాడిన నాలుగు మాటలకే ఎంతో ముచ్చటపడి, ‘‘చూశావా లక్ష్మణా! హనుమ ఎలా మాట్లాడాడో, ఆయన మాట లు విన్నావా? ఇలా మాట్లాడేవాడు మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే- వేదాలన్నీ క్షుణ్ణంగా ఔపోసన పట్టినట్లు కనిపిస్తోంది. వ్యాకరణం ఈయనకు కొట్టిన పిండి వంటిదనిపిస్తోంది. ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసనుకుంటా. అందుకే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు. లలాటమూ కదలడం లేదు. వాక్యం లోపలి నుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్లు లేదు. గట్టిగానూ లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలాగే పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు’’ అని అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు హనుమ ఆనాటి గొప్ప కమ్యూనికేటర్ అని. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ, మాటలను హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. -
గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు
పురానీతి ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే గజదొంగ ఉండేవాడు. ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకుని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకుని జీవించేవాడు. అడవి దారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి, వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవి దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళుతుండగా, రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు దస్కం ఏమేమి ఉన్నాయో బయటకు తీయమని గద్దించాడు. నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రం బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి... ‘ఎందుకిలా దారికాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను.’ అని బదులిచ్చాడు. ‘నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?’ అడిగాడు నారద మహాముని. ‘నేను, నా భార్య, నా కొడుకు... ఇంకా వయసుమళ్లిన నా తల్లిదండ్రులు... వాళ్లందరి బాగోగులు నేనే చూసుకోవాలి’ బదులిచ్చాడు రత్నాకరుడు. ‘వాళ్లందరి బాగోగులు చూసుకోవడం కచ్చితంగా నీ బాధ్యతే! అయితే, అందుకోసం అమాయకులను చంపి దోచుకోవడం పాపం కదా! ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో’ అన్నాడు నారద మహాముని. ‘సరే... నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను’ అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే, తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి, ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు. ‘నిన్ను పెళ్లి చేసుకున్నాక... నిన్ను బాగా చూసుకోవడానికి దారిదోపిడీలు చేస్తున్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తున్నాను. ఈ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా..?’ అని భార్యను అడిగాడు. ‘నన్ను పోషించడం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే’ తేల్చి చెప్పింది భార్య. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు... ‘వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను కదా..! నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా?’ అని అడిగాడు. ‘నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్లిన దశలో కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాప పుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి గానీ, మేమెలా అనుభవిస్తాం’ అన్నారు. చివరిగా కొడుకును అడిగాడు. ‘నిన్ను పెంచి పెద్దచేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా?’ ససేమిరా అనేశాడు కొడుకు. ‘నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాప పుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే’ అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తుడిని చేశాడు. ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బతకమని సెలవిస్తాడు నారద మహాముని. ఇక అప్పటి నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి. -
అంగుళిమాల పరివర్తన
పురానీతి - మే 21న బుద్ధ పూర్ణిమ అంగుళిమాల పేరు వింటే పిల్లల నుంచి పెద్దల వరకు, పిట్టల నుంచి పులుల వరకు అందరికీ భయమే. సగం ప్రాణం పోవడానికి అతడి నవ్వు వింటే చాలు! అరణ్యమార్గంలో ప్రయాణించే వారిని చంపి చేతివేళ్లను మాలగా ధరించేవాడు. అందుకే అతణ్ని ‘అంగుళిమాల’ అని పిలిచేవాళ్లు. ఈ అంగుళిమాల అసలు పేరు అహింసకుడు. మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి. మరి ఇలాంటి అహింసకుడు పేరుకు తగ్గట్లుగా జీవించకుండా, నరహంతకుడిగా ఎలా మారాడు? అసలు ఏం జరిగిందంటే... అహింసకుడి ప్రతిభాపాటవాలు తోటి విద్యార్థులకు అసూయ కలిగించేవి. దీంతో అతడి మీద లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసేవారు. ‘‘నేను ఎవరి దగ్గర చదువు నేర్చుకోవాల్సిన పనిలేదు. గురువులే నా దగ్గర చదువు నేర్చుకోవాలి’’ అని అహింసకుడు విర్రవీగుతున్నాడని ప్రచారం చేశారు తోటి విద్యార్థులు. ఒకటి కాదు రెండు కాదు... ఇలాంటి అబద్ధాలను ఎన్నో సృష్టించి గురువుకు చెప్పేవారు. ఈ ప్రచారం పుణ్యమా అని అహింసకుడు అంటే ‘అహంకారి’ అనే ముద్ర గురువు దృష్టిలో పడింది. వందసార్లు చెప్పిన అబద్ధం నిజం అవుతుంది అన్నట్లుగా తోటి విద్యార్థులు అహింసకుడి మీద చేసిన చెడు ప్రచారం నిజమైపోయింది. అహింసకుడి మీద తన కోపాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటాడు గురువు. పెద్దలు చెప్పిన మాటను అహింసకుడు జవదాటడు అనే విషయం ఆ గురువుకు తెలుసు. ఒకరోజు అహింసకుడిని పిలిచి ‘‘గురుదక్షిణగా నాకు ఏమిస్తున్నావు?’’ అని అడుగుతాడు. ‘‘మీరు కోరుకున్నది ఆరునూరైనా సరే తెచ్చి ఇస్తాను’’ అంటాడు అహింసకుడు. ‘‘మనుషుల వెయ్యివేళ్లు నాకు కావాలి’’ అని కోరతాడు గురువు. అదెంత అసాధ్యమైన పనో గురు, శిష్యుల్లో ఇద్దరికీ తెలుసు. అయినా సరే, గురువు చెప్పిన మాటను కాదనకుండా ‘అలాగే తెస్తాను’ అని బయలుదేరుతాడు అహింసకుడు. గురువుకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం అడవిలో దారి కాచి బాటసారులను చంపి వేళ్లు తీయడమే పనిగా పెట్టుకున్నాడు అహింసకుడు. ఈ వేళ్లను ఎక్కడ భద్రపరచాలో తెలియక తన మెడలోనే వాటిని మాలగా ధరిస్తాడు. దీంతో అహింసకుడి పేరు కాస్త ‘అంగుళిమాల’గా స్థిరపడింది. ఒకసారి గౌతమ బుద్ధుడు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ‘‘ఈ అడవిలో అంగుళిమాల అనే ప్రమాదకరమైన బందిపోటు ఉన్నాడు. వాడి కంట పడితే చాలా ప్రమాదం’’ అని హెచ్చరిస్తారు శిష్యులు. ‘‘అయితే తప్పనిసరిగా ఈ అడవిలో నుంచే వెళ్లాలి’’ అంటాడు బుద్ధుడు. ‘‘ఎందుకు?’’ అని ఆందోళనగా అడుగుతారు శిష్యులు. ‘‘అతడు కోరుకున్నది జరుగుతుందో, నేను కోరుకున్నది జరుగుతుందో ఎవరు చెప్పగలరు?’’ అంటూ ఆ అడవి దారిలో నడవడం ప్రారంభిస్తాడు బుద్ధుడు. ఇంకొక్క వేలు దొరికితే తన లక్ష్యం పూర్తయిపోతుంది. ఇంకా ఎవరు దొరుకుతారా అని ఆశగా ఎదురుచూస్తున్న అంగుళిమాలకు బుద్ధుడు కనిపిస్తాడు. అంగుళిమాల ఆనందం కట్టలు తెచ్చుకుంటుంది. కత్తి పట్టుకుని పరుగెత్తుకుంటూ బుద్ధుడి దగ్గరికి వస్తాడు. బుద్ధుడి కళ్లలో ఎలాంటి భయమూ లేదు. ఎప్పటిలాగే ఆ కళ్లలో చల్లని వెన్నెల. ఏదో చేయాలనుకొని వచ్చిన అంగుళిమాల ఏమీ చేయలేకపోతాడు. బుద్ధుడి కళ్లు ‘మంచి దృష్టి’ గురించి చెబుతున్నాయి. శిరస్సు ‘మంచి సంకల్పం’ గురించి చెబుతుంది. పెదాలు ‘మంచి మాట’ గురించి చెబుతున్నాయి. ఆ భగవానుడి చుట్టూ ఉన్న దివ్యమైన వెలుగు...మంచి పని, మంచి జీవనవిధానం, మంచి ప్రయత్నం, మంచి మనస్సు, మంచి సమాధి నిష్ఠ గురించి చెబుతున్నాయి. అష్టాంగమార్గాన్ని అవగతం చేస్తున్నాయి. చెడు చేయాలని వచ్చిన వ్యక్తి తనలోని చెడును కూకటివేళ్లతో సహా పెకలించుకున్న సమయం అది. అణువణువూ ప్రమాదకరమైన చీకటిగా మారిన మనస్సులో వెలుగురేఖలు ఉదయించిన సమయం అది. ఏడుస్తూ బుద్ధుడి కాళ్ల మీద పడ్డాడు. ఆనాటి నుంచి బుద్ధభగవానుడి ప్రియశిష్యుడిగా అంగుళిమాల చరితార్థుడయ్యాడు. -
నారదుడి గర్వభంగం
పురానీతి బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాల్లో అందరూ ఆయనను గౌరవించేవారు. దాంతో లోకంలో తనను మించిన విష్ణుభక్తుడు ఎవరూ లేరనే గర్వం మొదలైంది నారదుడిలో. అయితే, ఆ మాటను సాక్షాత్తూ విష్ణువు నోటనే చెప్పించాలనుకున్నాడు నారదుడు. అనుకున్నదే తడవుగా వైకుంఠానికి వెళ్లాడు. శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును దర్శించుకుని, యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు. మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అరమోడ్పు కన్నులతో పరవశుడై ఆస్వాదించాడు. సంకీర్తనానంతరం నారదుడిని కుశల ప్రశ్నలు వేశాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘దేవా! నాదో చిన్న సందేహం. మీరే దానిని తీర్చాలి’ అంటూ వినయంగా అర్థించాడు. ‘ఏమా సందేహం? సంకోచించకుండా అడుగు’ అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ. ‘ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యులో మీ నోటనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను దేవా!’ అన్నాడు నారదుడు. ‘ఇదేమంత పెద్ద సందేహం... అదిగో! భూలోకంలో అటు చూడు... అక్కడ కనిపిస్తున్న పొలంలో పని చేసుకుంటున్నాడో రైతు..’ అన్నాడు. ‘చూశాను ప్రభూ!’ అన్నాడు నారదుడు. ‘అందరి కంటే అతడే నా భక్తుల్లో అగ్రగణ్యుడు’ అన్నాడు విష్ణువు. హతాశుడయ్యాడు నారదుడు. తన పేరే చెబుతాడనుకుంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగుచేసుకునే రైతు... రోజుకు నాలుగైదుసార్లు కంటే నారాయణుడిని తలచుకోని సామాన్యుడు.. తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకు మనసెలా వచ్చిందని మథనపడసాగాడు. నారదుడి అంతర్మథనాన్ని గ్రహించిన విష్ణువు... ‘నారదా! నువ్వే అతడి వద్దకు వెళ్లు. అతడి భక్తి ఏపాటిదో నీకే తెలుస్తుంది’ అన్నాడు. ఇదేదో తేల్చుకోవాలనుకున్నాడు నారదుడు. ‘సరే’ అంటూ భూలోకానికి వెళ్లాడు. నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట సాక్షాత్తూ నారద మహర్షి ప్రత్యక్షమవడంతో ఆ రైతు పరమానందభరితుడయ్యాడు. ‘అయ్యా! మహా విష్ణువు ఎలా ఉన్నారు? వైకుంఠంలో ఆయన క్షేమమేనా..? అభాగ్యుడిని, ఎప్పుడో తప్ప ఆయనను తలచుకునే తీరికే ఉండదు నాకు. మీ దర్శనంతో సాక్షాత్తూ విష్ణువునే చూసినంత ఆనందం కలుగుతోంది’ అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు. నారదుడు తిరిగి బయలుదేరే ముందు... ‘అయ్యా! చిన్న కోరిక’ అన్నాడు ఆ రైతు. ఏంటో చెప్పమన్నట్లుగా చూశాడు నారదుడు. ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు రైతు. ‘అయ్యా! నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్లి విష్ణుదేవులకు నివేదించండి’ అన్నాడు. ‘అదెంత పని’ అంటూ నారదుడు పాలకుండ తీసుకుని వైకుంఠానికి బయలుదేరాడు. అయితే, పాలెక్కడ తొణికిపోతాయోననే భయంతో జాగ్రత్తగా కుండను పొదివి పట్టుకున్నాడు. మొత్తానికి ఎలాగోలా వైకుంఠానికి చేరుకుని విష్ణువును దర్శించుకున్నాడు. రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు. ‘దేవా! ఆ రైతుకు ఎప్పుడో తప్ప నిన్ను తలచుకునే తీరిక ఉండదట. రోజుకు ఏ నాలుగైదుసార్లో తలచుకుంటాడట’ అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా. ‘ఈ పాలకుండను తెస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలచుకున్నావు?’... ప్రశ్నించాడు విష్ణువు. ‘ఒక్కసారి కూడా తలచుకోలేదు. నా దృష్టి మొత్తం పాలకుండపైనే ఉంది. పాలెక్కడ తొణికిపోతాయోననే ఆందోళనే నా మనసంతా నిండిపోయింది’ అని తలదించుకుని బదులిచ్చాడు నారదుడు. ‘రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మరచిపోకుండా రోజుకు కనీసం నాలుగైదుసార్లు అయినా తలచుకుంటున్నాడు కదా ఆ రైతు?’ అన్నాడు విష్ణువు. ఆ మాటలతో నారదుడి గర్వం నశించింది. ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడో అర్థమైంది. నీతి: ఎంతటి వాడికైనా గర్వం తగదు. గర్వంతో ప్రవర్తిస్తే భంగపడటమూ తప్పదు. -
శిబిచక్రవర్తి దాతృత్వం
పురానీతి విశ్వవిఖ్యాతి పొందిన మహాదాతలలో శిబిచక్రవర్తి పేరును ముందుగా చెప్పుకోవాలి. ధర్మనిరతిలోను, దానగుణంలోను శిబిచక్రవర్తి పేరు ప్రఖ్యాతులు దేవలోకం వరకు వ్యాపించాయి. అయితే, శిబిచక్రవర్తి నిజంగానే ధర్మనిరతి గలవాడా? దానగుణ సంపన్నుడా? ఇదేదో తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు యమధర్మరాజు. ఈ విషయంలో అతడికి తోడుగా ఉండటానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు. ఈ సంగతి తెలియని శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజప్రాసాదం మేడ మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన చెంత వాలింది. ఈలోగా దానిని తరుముతూ ఒక గద్ద వచ్చింది. అనుకోని పరిణామానికి నివ్వెరపోయాడు శిబిచక్రవర్తి. ప్రాణభయంతో వణుకుతున్న పావురం ‘రాజా! నన్ను నీవే కాపాడాలి’ అంటూ మొరపెట్టుకుంది. ‘తప్పక కాపాడతాను. నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది’ అని భరోసా ఇచ్చాడు. పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద ఊరుకోలేదు. ‘రాజా! నేను ఆకలితో అలమటిస్తున్నాను. ఆ పావురం నా సహజ ఆహారం. దానిని వదిలేస్తే నా ఆకలి తీర్చుకుంటాను’ అని అడిగింది. ‘రక్షణ కల్పిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. దానిని వదల్లేను. నీ ఆకలి తీర్చుకోవడానికి మరేది అడిగినా ఇస్తాను. పావురాన్ని వదిలేయి’ అని బదులిచ్చాడు శిబిచక్రవర్తి. ‘రెండు షరతులకు అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను’ అని చెప్పింది గద్ద. సరేనన్నాడు శిబిచక్రవర్తి. షరతులేమిటో చెప్పమన్నాడు. ‘పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచే కోసి ఇవ్వాలి. మాంసం ఇస్తున్నప్పుడు నువ్వు కంటతడి పెట్టరాదు’ అంది గద్ద. షరతులకు అంగీకరించాడు శిబిచక్రవర్తి. వెంటనే ఒక తక్కెడను, తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు కత్తిని తెప్పించాడు. గుప్పెడు మాంసం కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు. తన కుడితొడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కెడలోని ఒకవైపు పళ్లెంలో వేశాడు. మరోవైపు పళ్లెంలో పావురాన్ని నిలిపాడు. పావురమే బరువు తూగింది. మరికొంత మాంసాన్ని తీసి వేశాడు. అయినా పావురమే బరువు తూగింది. శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసమంతా తక్కెడలో వేసేశాడు. అయినా పావురమే బరువు తూగింది. ఇదేదో మాయలా ఉందనుకున్నాడు. అయితే, ఏదైనా కానీ తాను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉండాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిబిచక్రవర్తి ఎడమకంట ఒక కన్నీటి బిందువు ఉబికింది. దానిని చూడగానే గద్ద... ‘రాజా! నీవేదో అయిష్టంగా నీ మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు. అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు. నీ అండలోని పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేసి పోతా. నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా చేస్తా’ అంది. ‘పక్షిరాజా! నువ్వు పొరబడుతున్నావు. నీ ఆకలితీర్చే అదృష్టం నా శరీరంలోని కుడిభాగానికి దక్కినందుకు ఎడమభాగం ఆనందంతో పులకిస్తోంది. అందుకే నా ఎడమకన్ను ఆనందబాష్పాన్ని చిందిస్తోంది. నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమభాగం కూడా సిద్ధంగా ఉంది. చూడు! ఎడమభాగంలోని మాంసాన్ని కూడా వేసేస్తాను’ అంటూ మళ్లీ కత్తికి పనిచెప్పబోయాడు. శిబిచక్రవర్తి ధర్మనిరతికి, దానగుణానికి సంతోషించిన దేవతలు పూలవాన కురిపించారు. అతడి శరీరానికి పూర్వరూపం ఇచ్చారు. గద్దరూపంలో ఉన్న యమధర్మరాజు. పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. ‘ఇదంతా నీ ధర్మనిరతిని పరీక్షించేందుకు ఆడిన నాటకం’ అని చెప్పి అంతర్ధానమయ్యారు. నీతి: ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట తప్పకపోవడమే ధర్మం.