అంగుళిమాల పరివర్తన
పురానీతి - మే 21న బుద్ధ పూర్ణిమ
అంగుళిమాల పేరు వింటే పిల్లల నుంచి పెద్దల వరకు, పిట్టల నుంచి పులుల వరకు అందరికీ భయమే. సగం ప్రాణం పోవడానికి అతడి నవ్వు వింటే చాలు! అరణ్యమార్గంలో ప్రయాణించే వారిని చంపి చేతివేళ్లను మాలగా ధరించేవాడు. అందుకే అతణ్ని ‘అంగుళిమాల’ అని పిలిచేవాళ్లు. ఈ అంగుళిమాల అసలు పేరు అహింసకుడు. మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి. మరి ఇలాంటి అహింసకుడు పేరుకు తగ్గట్లుగా జీవించకుండా, నరహంతకుడిగా ఎలా మారాడు?
అసలు ఏం జరిగిందంటే...
అహింసకుడి ప్రతిభాపాటవాలు తోటి విద్యార్థులకు అసూయ కలిగించేవి. దీంతో అతడి మీద లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసేవారు. ‘‘నేను ఎవరి దగ్గర చదువు నేర్చుకోవాల్సిన పనిలేదు. గురువులే నా దగ్గర చదువు నేర్చుకోవాలి’’ అని అహింసకుడు విర్రవీగుతున్నాడని ప్రచారం చేశారు తోటి విద్యార్థులు. ఒకటి కాదు రెండు కాదు... ఇలాంటి అబద్ధాలను ఎన్నో సృష్టించి గురువుకు చెప్పేవారు.
ఈ ప్రచారం పుణ్యమా అని అహింసకుడు అంటే ‘అహంకారి’ అనే ముద్ర గురువు దృష్టిలో పడింది.
వందసార్లు చెప్పిన అబద్ధం నిజం అవుతుంది అన్నట్లుగా తోటి విద్యార్థులు అహింసకుడి మీద చేసిన చెడు ప్రచారం నిజమైపోయింది.
అహింసకుడి మీద తన కోపాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటాడు గురువు.
పెద్దలు చెప్పిన మాటను అహింసకుడు జవదాటడు అనే విషయం ఆ గురువుకు తెలుసు. ఒకరోజు అహింసకుడిని పిలిచి ‘‘గురుదక్షిణగా నాకు ఏమిస్తున్నావు?’’ అని అడుగుతాడు.
‘‘మీరు కోరుకున్నది ఆరునూరైనా సరే తెచ్చి ఇస్తాను’’ అంటాడు అహింసకుడు.
‘‘మనుషుల వెయ్యివేళ్లు నాకు కావాలి’’ అని కోరతాడు గురువు.
అదెంత అసాధ్యమైన పనో గురు, శిష్యుల్లో ఇద్దరికీ తెలుసు.
అయినా సరే, గురువు చెప్పిన మాటను కాదనకుండా ‘అలాగే తెస్తాను’ అని బయలుదేరుతాడు అహింసకుడు.
గురువుకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం అడవిలో దారి కాచి బాటసారులను చంపి వేళ్లు తీయడమే పనిగా పెట్టుకున్నాడు అహింసకుడు. ఈ వేళ్లను ఎక్కడ భద్రపరచాలో తెలియక తన మెడలోనే వాటిని మాలగా ధరిస్తాడు. దీంతో అహింసకుడి పేరు కాస్త ‘అంగుళిమాల’గా స్థిరపడింది.
ఒకసారి గౌతమ బుద్ధుడు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ‘‘ఈ అడవిలో అంగుళిమాల అనే ప్రమాదకరమైన బందిపోటు ఉన్నాడు. వాడి కంట పడితే చాలా ప్రమాదం’’ అని హెచ్చరిస్తారు శిష్యులు.
‘‘అయితే తప్పనిసరిగా ఈ అడవిలో నుంచే వెళ్లాలి’’ అంటాడు బుద్ధుడు.
‘‘ఎందుకు?’’ అని ఆందోళనగా అడుగుతారు శిష్యులు.
‘‘అతడు కోరుకున్నది జరుగుతుందో, నేను కోరుకున్నది జరుగుతుందో ఎవరు చెప్పగలరు?’’ అంటూ ఆ అడవి దారిలో నడవడం ప్రారంభిస్తాడు బుద్ధుడు.
ఇంకొక్క వేలు దొరికితే తన లక్ష్యం పూర్తయిపోతుంది. ఇంకా ఎవరు దొరుకుతారా అని ఆశగా ఎదురుచూస్తున్న అంగుళిమాలకు బుద్ధుడు కనిపిస్తాడు. అంగుళిమాల ఆనందం కట్టలు తెచ్చుకుంటుంది. కత్తి పట్టుకుని పరుగెత్తుకుంటూ బుద్ధుడి దగ్గరికి వస్తాడు.
బుద్ధుడి కళ్లలో ఎలాంటి భయమూ లేదు. ఎప్పటిలాగే ఆ కళ్లలో చల్లని వెన్నెల.
ఏదో చేయాలనుకొని వచ్చిన అంగుళిమాల ఏమీ చేయలేకపోతాడు.
బుద్ధుడి కళ్లు ‘మంచి దృష్టి’ గురించి చెబుతున్నాయి.
శిరస్సు ‘మంచి సంకల్పం’ గురించి చెబుతుంది.
పెదాలు ‘మంచి మాట’ గురించి చెబుతున్నాయి. ఆ భగవానుడి చుట్టూ ఉన్న దివ్యమైన వెలుగు...మంచి పని, మంచి జీవనవిధానం, మంచి ప్రయత్నం, మంచి మనస్సు, మంచి సమాధి నిష్ఠ గురించి చెబుతున్నాయి. అష్టాంగమార్గాన్ని అవగతం చేస్తున్నాయి.
చెడు చేయాలని వచ్చిన వ్యక్తి తనలోని చెడును కూకటివేళ్లతో సహా పెకలించుకున్న సమయం అది.
అణువణువూ ప్రమాదకరమైన చీకటిగా మారిన మనస్సులో వెలుగురేఖలు ఉదయించిన సమయం అది.
ఏడుస్తూ బుద్ధుడి కాళ్ల మీద పడ్డాడు.
ఆనాటి నుంచి బుద్ధభగవానుడి ప్రియశిష్యుడిగా అంగుళిమాల చరితార్థుడయ్యాడు.