మార్గమే నాది.. నడవాల్సింది మీరే! | Special Article On Occasion Of Buddha Purnima | Sakshi
Sakshi News home page

మార్గమే నాది.. నడవాల్సింది మీరే!

Published Mon, May 16 2022 7:17 AM | Last Updated on Mon, May 16 2022 7:17 AM

Special Article On Occasion Of Buddha Purnima - Sakshi

కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకుని శాక్యగణాన్ని పాలించే రాజు శుద్ధోధనుడు. ఇతని అర్ధాంగి మహామాయ లేదా మాయాదేవి. చాలాకాలం పాటు వీళ్ళకు సంతు లేదు. చివరికి మాయాదేవి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. పురిటికి పుట్టింటికి బయలుదేరింది. కానీ దారిలోనే లుంబినీ వనంలో ఆమె ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పున్నమి. మిట్ట మధ్యాహ్నం సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థునిగా భౌతిక జననమే గానీ బుద్ధునిగా జన్మదినం కాదు. 

సిద్ధార్థుడు ఒక వ్యక్తి. రాకుమారుడు. ఆయనకు నా అనే వాళ్లు ఉంటారు. ‘నావి’ అనేవి ఉంటాయి. నా భార్య నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి నా సోదరుడు, నా బంధువులు, నా మిత్రుడు, నా రాజ్యం నా సంపద... ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఉన్నంత వరకూ సిద్ధార్థుడు ఒక వ్యక్తే. ఒక రాకుమారుడో, రాజో, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక భర్త. సంసార బంధాల మధ్యే ఉంటాడు. కాబట్టి అతని పనులన్నీ ఆ బంధాల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ బంధనాల నుండి బైటకు వచ్చేశాడు సిద్ధార్థుడు. తన 29వ ఏట అన్నింటినీ త్యజించి బైటకు వచ్చాడు.

ఇక ఆ రోజు నుండి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. బుద్ధత్వం పొందాలనుకున్నాడు. ఆ అన్వేషణ సాధన ఆరేళ్లు సాగింది. ఆరేళ్ళ తర్వాత బుద్ధగయలో నిరంజనా నదీ తీరంలో బోధివృక్షం రావిచెట్టు క్రింద ధ్యాన సాధన చేశాడు. భవచక్రాన్నుండి బైట పడ్డాడు. పరిపూర్ణ ప్రజ్ఞ సాధించాడు. దుఃఖానికి కారణమైన ఈ భవ చక్రాన్నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. అదే జ్ఞానోదయం బుద్ధత్వం, బుద్ధునిగా జననం ఇది సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిన (పుట్టినరోజు) ఆరోజు కూడా విశాఖ పున్నమే! 

అలా సిద్ధార్థుడు బుద్ధునిగా జన్మించడానికి ఆరేళ్ళు ధర్మగర్భంలో ఉన్నాడు. భౌతికంగా శారీరకంగా .... బుద్ధునిగా తొలి ఏడు. ఇలా... సిద్ధార్థుడు పుట్టిందీ, బుద్ధత్వం పొంది సంబుద్ధుడయ్యిందీ వైశాఖ పున్నమి రోజే. బుద్ధత్వం పొందాక అతనికి ఎలాంటి భవ బంధాలు ఉండవు. తల్లీ, తండ్రీ, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేవారు ఉండరు. ‘నా’ అనేది పూర్తిగా నశిస్తుంది. ‘నాది’ ‘నా వారు’ అనే బంధాలు నశిస్తాయి. జనాలందరూ బుద్ధునికి సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వ్యక్తి నశించి వ్యక్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది.

కాబట్టి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, మోహం అనేవి బుద్ధత్వంలో అదృశ్యమైపోతాయి. ఆ సంబుద్ధుడు జ్ఞాననేత్రం అవుతాడు. ధర్మనేత్రం అవుతాడు. అందరిలో తనుండడు. తనలోనే అందర్నీ ఇముడ్చుకుంటాడు. తన దుఃఖాన్ని అందరికీ పంచడు. అందరి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. దాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తాడు. అదే బుద్ధత్వం అంటే. తన దుఃఖాన్ని తాను తీర్చుకోవడం కాదు. అందరి దుఃఖాన్ని తీర్చడం. అంటే అందరికీ దుఃఖ నివారణ చెప్పడం. ఆ మార్గంలో ఎదుటివారు తమ దుఃఖాన్ని తామే తీర్చుకోవాలి. బుద్ధుడు అలా మార్గదాత మాత్రమే!

బుద్ధుని జీవితంలో మరో విశేషం ఏమంటే... బుద్ధుడు తన 80వ ఏట కుసీనగర్‌లో మహాపరి నిర్వాణం పొందింది కూడా వైశాఖ పున్నమి రోజునే! ఆయన నోటి నుండి వెలువడిన ఆఖరి మాటలు–
‘‘మీకు మీరే దీపం కండి. మార్గమే నాది. ఆ మార్గంలో నడవాల్సింది మీరే’’ అనేది బుద్ధుని అంతిమ సందేశం.  
ఇలా పుట్టుక, బుద్ధత్వం పొందడం, మహాపరి నిర్వాణం... ఈ మూడూ వైశాఖ పున్నమి రోజే. కాబట్టి బౌద్ధులు ఈ పున్నమి రోజును ‘బుద్ధ జయంతి’ అని అనకుండా ‘బుద్ధ పున్నమి’ గానే పిలుచుకుంటారు. జరుపుకుంటారు.  – బొర్రా గోవర్ధన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement