Buddha Bhagavan
-
‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన సాంచి(మధ్యప్రదేశ్)లో 71వ మహాబోధి మహోత్సవం ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఉత్సవంలో భగవాన్ గౌతమ బుద్ధుని సన్నిహిత శిష్యుల అస్థికలను అనుచరుల దర్శనం కోసం అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 7 గంటలకు అస్థికల కలశ యాత్రను మహాబోధి సొసైటీ కార్యాలయం నుంచి చెతీస్గిరి వరకూ నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం ఆ కలశాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీలంక, వియత్నాం, థాయ్లాండ్, జపాన్తో సహా పలు దేశాల బౌద్ధ అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీలంక మహాబోధి సొసైటీ చీఫ్ వంగల్ ఉపాథిస్ నాయక్ థెరో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి సాంచి చేరుకున్నారు. ఊరేగింపు సందర్భంగా సాంచిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెల్లవారుజామున కళాకారులు ఢోలక్, వేణువుల శ్రావ్యమైన రాగాలకు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సాంచి వీధుల్లో నడిచారు. ఈ ఊరేగింపు సాంచి స్థూపం వద్దనున్న చెటియగిరి విహార్కు చేరుకుంది. అక్కడ బుద్ధ భగవానుని శిష్యులైన అర్హంత్ సారిపుత్ర, అర్హంత్ మహామొగ్గలన్ల అస్థికలను నేలమాళిగలో నుండి బయటకు తీసి పూజలు నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం వాటిని ప్రత్యేక స్థలంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, అనుచరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు.. -
మార్గమే నాది.. నడవాల్సింది మీరే!
కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకుని శాక్యగణాన్ని పాలించే రాజు శుద్ధోధనుడు. ఇతని అర్ధాంగి మహామాయ లేదా మాయాదేవి. చాలాకాలం పాటు వీళ్ళకు సంతు లేదు. చివరికి మాయాదేవి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. పురిటికి పుట్టింటికి బయలుదేరింది. కానీ దారిలోనే లుంబినీ వనంలో ఆమె ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పున్నమి. మిట్ట మధ్యాహ్నం సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థునిగా భౌతిక జననమే గానీ బుద్ధునిగా జన్మదినం కాదు. సిద్ధార్థుడు ఒక వ్యక్తి. రాకుమారుడు. ఆయనకు నా అనే వాళ్లు ఉంటారు. ‘నావి’ అనేవి ఉంటాయి. నా భార్య నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి నా సోదరుడు, నా బంధువులు, నా మిత్రుడు, నా రాజ్యం నా సంపద... ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఉన్నంత వరకూ సిద్ధార్థుడు ఒక వ్యక్తే. ఒక రాకుమారుడో, రాజో, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక భర్త. సంసార బంధాల మధ్యే ఉంటాడు. కాబట్టి అతని పనులన్నీ ఆ బంధాల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ బంధనాల నుండి బైటకు వచ్చేశాడు సిద్ధార్థుడు. తన 29వ ఏట అన్నింటినీ త్యజించి బైటకు వచ్చాడు. ఇక ఆ రోజు నుండి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. బుద్ధత్వం పొందాలనుకున్నాడు. ఆ అన్వేషణ సాధన ఆరేళ్లు సాగింది. ఆరేళ్ళ తర్వాత బుద్ధగయలో నిరంజనా నదీ తీరంలో బోధివృక్షం రావిచెట్టు క్రింద ధ్యాన సాధన చేశాడు. భవచక్రాన్నుండి బైట పడ్డాడు. పరిపూర్ణ ప్రజ్ఞ సాధించాడు. దుఃఖానికి కారణమైన ఈ భవ చక్రాన్నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. అదే జ్ఞానోదయం బుద్ధత్వం, బుద్ధునిగా జననం ఇది సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిన (పుట్టినరోజు) ఆరోజు కూడా విశాఖ పున్నమే! అలా సిద్ధార్థుడు బుద్ధునిగా జన్మించడానికి ఆరేళ్ళు ధర్మగర్భంలో ఉన్నాడు. భౌతికంగా శారీరకంగా .... బుద్ధునిగా తొలి ఏడు. ఇలా... సిద్ధార్థుడు పుట్టిందీ, బుద్ధత్వం పొంది సంబుద్ధుడయ్యిందీ వైశాఖ పున్నమి రోజే. బుద్ధత్వం పొందాక అతనికి ఎలాంటి భవ బంధాలు ఉండవు. తల్లీ, తండ్రీ, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేవారు ఉండరు. ‘నా’ అనేది పూర్తిగా నశిస్తుంది. ‘నాది’ ‘నా వారు’ అనే బంధాలు నశిస్తాయి. జనాలందరూ బుద్ధునికి సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వ్యక్తి నశించి వ్యక్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, మోహం అనేవి బుద్ధత్వంలో అదృశ్యమైపోతాయి. ఆ సంబుద్ధుడు జ్ఞాననేత్రం అవుతాడు. ధర్మనేత్రం అవుతాడు. అందరిలో తనుండడు. తనలోనే అందర్నీ ఇముడ్చుకుంటాడు. తన దుఃఖాన్ని అందరికీ పంచడు. అందరి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. దాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తాడు. అదే బుద్ధత్వం అంటే. తన దుఃఖాన్ని తాను తీర్చుకోవడం కాదు. అందరి దుఃఖాన్ని తీర్చడం. అంటే అందరికీ దుఃఖ నివారణ చెప్పడం. ఆ మార్గంలో ఎదుటివారు తమ దుఃఖాన్ని తామే తీర్చుకోవాలి. బుద్ధుడు అలా మార్గదాత మాత్రమే! బుద్ధుని జీవితంలో మరో విశేషం ఏమంటే... బుద్ధుడు తన 80వ ఏట కుసీనగర్లో మహాపరి నిర్వాణం పొందింది కూడా వైశాఖ పున్నమి రోజునే! ఆయన నోటి నుండి వెలువడిన ఆఖరి మాటలు– ‘‘మీకు మీరే దీపం కండి. మార్గమే నాది. ఆ మార్గంలో నడవాల్సింది మీరే’’ అనేది బుద్ధుని అంతిమ సందేశం. ఇలా పుట్టుక, బుద్ధత్వం పొందడం, మహాపరి నిర్వాణం... ఈ మూడూ వైశాఖ పున్నమి రోజే. కాబట్టి బౌద్ధులు ఈ పున్నమి రోజును ‘బుద్ధ జయంతి’ అని అనకుండా ‘బుద్ధ పున్నమి’ గానే పిలుచుకుంటారు. జరుపుకుంటారు. – బొర్రా గోవర్ధన్ -
రూపకాయంగా కాదు...ధర్మకాయంగా చూడాలి!
బౌద్ధకేంద్రమైన శ్రావస్తిలో పుట్టి పెరిగిన సుభద్రకు పెళ్లయింది. అత్తవారిల్లయిన రమణక నగరానికి ఆమె తొలిసారి వచ్చింది. అది బుద్ధభగవానుల గురించి ఏమాత్రం తెలియని ఊరని కొద్దిరోజుల్లోనే ఆమె గ్రహించింది. శ్రావస్తిలో తరచు బుద్ధుని దర్శిస్తూ ఆయన బోధనలు వినడానికి అలవాటు పడిన సుభద్రకు అక్కడ ఉండటం కష్టమనిపించింది. ఒకరోజు ఆమె మిద్దెమీదికెళ్లి, శ్రావస్తి దిక్కుగా చూస్తూ, ‘‘భగవాన్! ఇక్కడ మీ గొంతు వినపడటం లేదు. మీరు కనపడటం లేదు. మీకు, మీ భిక్షుక సంఘానికి ఏ లోటూ రాకుండా నేను చూసుకుంటాను. నా గోడు విని సత్వరం మీరు రమణక నగరం రావాలి. ప్రాణం పోయినా సరే, మీకు ఆతిథ్యం ఇచ్చికానీ నేను భుజించను’’అని ప్రార్థించింది. విచిత్రంగా బుద్ధుడు భిక్షుక సంఘంతో ఆ నగరంలోకి ప్రవేశించి, నేరుగా ఆమె ఇంటికే భిక్షకు వచ్చాడు. మహదానందంతో వారికి ఆతిథ్యమిచ్చి, తన మనసులోని బాధను ఆయనకు చెప్పుకుంది సుభద్ర. అప్పుడు బుద్ధుడు ‘‘అమ్మా! సుభద్రా! నన్ను రూపకాయంగా చూడటం కాదు, ధర్మకాయంగా చూడు. రూపకాయం కొన్నాళ్లకు శిథిలమై అంతరించిపోతుంది. ధర్మకాయం శాశ్వతంగా ఉంటుంది.. ఈ సత్యాన్ని సదా గుర్తుంచుకో! నిజానికి మనం ఎక్కడున్నా సర్దుకుపోవడం నేర్చుకోవాలిన. భూమాతనే చూడు! ఒకచోట సమతలంగా; వేరొక చోట ఎత్తుపల్లాలుగా, ఇంకొక చోట కంటకమయంగా ఉంటుంది. భూమి ఎలా ఉన్నా, జత చెప్పులుంటే చక్కగా నడిచి పోవచ్చు. అలాగే జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించడానికి కుశల చిత్తం ముఖ్యం! చింతను దూరం చేసేది కుశల చిత్తమే! నీవు ఎల్లప్పుడూ కుశల చిత్తంతో ఉంటే శ్రావస్తి అయినా రమణక నగరమైనా ఒకేలా కనిపిస్తాయి’’అన్నాడు సుభద్రను వాత్సల్యదృష్టితో చూస్తూ! బుద్ధభగవానుల అమృతవాక్కులతో సుభద్ర మనసులోని బాధ తొలగిపోయింది. – చోడిశెట్టి శ్రీనివాసరావు