మహిషుని అహాన్ని అణచిన అమ్మ
పురానీతి
పూర్వం మాహిష్మతి అనే గంధర్వకాంత ఇంద్రుడి శాపవశాన మహిషి అనే రాక్షసిగా జన్మించింది. ఆమె రంభుడు అనే రాక్షసుని వివాహమాడింది. వారికి మహిషుడనే కుమారుడు పుట్టాడు. పుట్టుకతోనే వాడు అమిత బలవంతుడయ్యాడు. అనతికాలంలోనే రాక్షస లక్షణాలను అలవరచుకున్నాడు. తన బలాన్ని మరింతగా పెంచుకోవాలనుకుని, బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు.
బ్రహ్మ అందుకు అంగీకరించకపోవడంతో స్త్రీలంటే అతి చులకన భావం గల మహిషుడు శరీర నిర్మాణరీత్యా బలహీనంగా ఉండే స్త్రీ తనను ఏమీ చేయలేదనే ధీమాతో, స్త్రీ చేత తప్ప తాను ఎవరిచేతిలోనూ చావకుండా ఉండే వరం కోరుకున్నాడు.ఆ వరమదంతో దేవతలను, మునులను, మానవులను వాడు పెట్టే హింసకు అంతులేకుండా పోయింది. దేవతలు, మునులు కలిసి వాడి బారి నుంచి తమను రక్షించమని వైకుంఠనాథుడిని వేడుకున్నారు.
అందుకు విష్ణువు చిరునవ్వు నవ్వి, పురుషులమైన మనమెవ్వరమూ వాడిని సంహరించలేము. తానూ, తన సైన్యమూ కూడా ఆడవారి చేతిలో తప్ప మరణించనటువంటి వరం పొందాడు అంటూ సాలోచనగా చూశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చూపులు కలవడంతో వారి దృక్కుల నుండి ఒక కాంతిపుంజం జనించింది. ఆ కాంతిపుంజం వైపు పార్వతి, లక్ష్మి, సరస్వతి చూశారు. వారి చూపుల నుంచి కూడా ఒక కాంతిపుంజం వెలువడింది.
ఏమి జరుగుతోందా అన్న కుతూహలంతో దేవతలందరూ కలసి ఆ కాంతిపుంజాలవైపు చూడగా, వారి వారి ఆకారాలకు, తేజస్సుకు తగ్గట్టు లెక్కలేనన్ని వెలుగు కిరణాలు వెలువడి అన్నీ కలిసి ఒకటిగా మారాయి. ఆ విధంగా సకల దేవతల తేజోపుంజాలూ కలసి వాటినుంచి అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించింది. ఆమెకు దేవతలంతా కలసి సమస్త సంపదలనూ, ఆయుధాలనూ ఇచ్చారు. అమ్మ ఆ ఆయుధాలను ధరించి, సర్వశక్తులతో, తేజస్సుతో కూడి, మదగర్వితుడైన ఆ రాక్షసుని మీదికి దండయాత్రకు వెళ్ళింది.
ఆమెను చూసిన మహిషుడు ‘ఓ సుందరీ, ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు? ఎంత అందంగా ఉన్నావు?’ అనడిగాడు. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అంటుంది అమ్మ. ఆమె మాటలకు వికటంగా నవ్విన మహిషుడు ‘‘ఇంత అందంగా, సుకుమారంగా ఉన్న నీతో యుద్ధం చేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు. నన్ను పెళ్లి చే సుకుని నా అంతఃపుర కాంతగా ఉండు’’ అన్నాడు అహంకారంతో. అందుకు అమ్మవారు సమ్మతించకపోవడంతో ఒక అబలవైన నీతో యుద్ధం చేయడానికి నేనెందుకు, నా అనుచరుడున్నాడు చాలు’’ అంటూ భండాసురుడిని పంపాడు.
అమ్మవారు తాను కూడా తొమ్మిదేళ్ల బాలికగా రూపు మార్చుకుని, శ్యామలాదేవిని సైన్యాధిపతిగా చేసుకుని భండాసురుని అవలీలగా చేధించింది. ఆ త ర్వాత చండిగా, చాముండిగా చండాసురుని, ముండాసురుని సంహరించింది. నెత్తురు చుక్క నేల రాలితే వేలాదిమంది రాక్షసులను పుట్టించే లక్షణం గల రక్తబీజుడనే రాక్షసుని కాళికగా మారి, వాడి నెత్తురు నేలరాలకుండా రుధిర పానం చేసింది. ఆ విధంగా తొమ్మిదిరోజులపాటు ఆ రాక్షసుడు పంపిన అనుచర గణాలనందరినీ దునుమాడడంతో, విధిలేక తానే వచ్చాడు మహిషుడు. అప్పుడు అమ్మ, సింహవాహనారూఢియై, వీరవిహారం చేసి దున్నపోతు రూపంలో ఉన్న ఆ రాక్షసుని నేలమీద పడవేసి, కాళ్లతో మట్టగించి చంపేసింది. ఆడది అబల, ఆమె తననేమీ చేయలేదన్న మహిషుని అహాన్ని ఆ విధంగా ఆదిపరాశక్తిగా మారి, అణ చి వేసింది అమ్మ దుర్గమ్మ.