mahishmati
-
మాహిష్మతిలో దుర్గమ్మ
-
మాహిష్మతిలో దుర్గమ్మ
సాక్షి, కోల్‌కతా : బాహుబలి ఫీవర్ ఇంకా భారతీయులను వదలడం లేదు. తాజాగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలో బాహుబలిలోని మాహిష్మతి నగర నమూనాలో మండపాన్ని నిర్మించి అందులో దుర్గమ్మను ప్రతిష్టించి భక్తులు ఆరాధిస్తున్నారు. కలకత్తా కాళిగా కొలువైన అమ్మవారిని బెంగాలీలు నవరాత్రుల్లో భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. అందులో భాగంగా విభిన్న రకాల కళాకృతులతో కూడిన మండపాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాక ప్రతి ఏడాది నవరాత్రుల సందర్భగా అద్భుతైన కళాఖండాలతో మండపాలను రూపొందించేవారి మధ్య పోటీలను సైతం అక్కడివారు నిర్వహిస్తారు. ఈ పోటీలో భాగంగా.. శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ వారు.. మాహిష్మతి నగరాన్ని (బాహుబలి చిత్రంలో ఎలా చూపారో అలా) రూపొందించి అమ్మవారిని అందులో ప్రతిష్టించారు. బాహుబలి సెట్టింగ్‌లో ఏర్పాటు చేసిన దుర్గమ్మను చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సెట్టింగ్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చిందని.. ఇక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. -
బాహుబలిలోని మాహిష్మతి రాజ్యం నిజంగా ఉందా?
న్యూఢిల్లీ: విశేషా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా రెండు జాతీయ అవార్డులను అందుకున్న బహు భాషా చిత్రం 'బాహుబలి' అందరు అనుకున్నట్లు పూర్తి కల్పితమేమి కాదు. బాహుబలి చిత్రంలో పేర్కొన్న 'మాహిష్మతి' రాజ్యం నిజంగా ఉండేదని చరిత్రకు సంబంధించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మాహిష్మతి మధ్య భారత్‌లోని, అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండేదట. వింధ్య పర్వతాలకు రెండు వైపుల విస్తరించిన అవంతి రాజ్యంలో ఉత్తారాదినున్న భాగం ఉజ్జయిని నగరాన్ని రాజధాని చేసుకోగా, దక్షిణాది అవంతి రాజ్యానికి మాహిష్మతి రాజధానిగా ఉండేదట. అప్పట్లో సామాజిక రాజకీయ కేంద్రంగా విరాజిల్లిన మాహిష్మతి నగరం ప్రస్థావన పలు చరిత్ర పుటల్లోనే కాకుండా ఇతిహాస కథల్లోనూ ఉంది. అంతకుముందు మధ్య, పశ్చిమ భారతాన్ని పాలించిన 'హయ్హాయాస్' అనే ఐదు తెగల సమాఖ్య కూడా మాహిష్మతి నగరాన్ని కేంద్రంగా చేసుకొని పాలించారన్న వాదన కూడా ఉంది. వీటిలో కొన్ని అంశాల ప్రస్తావన పీకే భట్టాచార్య రాసిన 'హిస్టారికల్ జియాగ్రఫీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ ఎర్లీ రికార్డ్స్' అనే పుస్తకంలో ఉంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలో పేర్కొన్న కార్తవీర్యార్జునుడు, అంటే మాహిష్మతిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రాజు హయ్‌హాయా అయ్యే అవకాశాలు ఉన్నాయని రచయిత భట్టాచార్య పేర్కొన్నారు. సంస్కతంలో రాసిన 'హరివంశ' సాహిత్యంలో కూడా మాహిష్మతి రాజ్య ప్రస్థావన ఉంది. మాహిష్మతి అనే రాజు దీన్ని ఏర్పాటు చేసినందున ఆయన పేరే నగరానికి వచ్చిందని, మాహిష్మతి రాజు, యదు నుంచి వచ్చిన సహజాన(రుగ్వేదంలో పేర్కొన్న ఆర్యుల్లో ఒక వర్గం వారిని యదు వంశీకులని, యదు ప్రాంతీయులని వ్యవహరిస్తారు) రాజులకు వారసుడని హరివంశ పుస్తకం తెలియజేస్తోంది. మాహిష్మతి రాజు కాకుండా యదు వారసుల్లోనే ఒకరైన 'ముకుకుండ' మాహిష్మతిని ఏర్పాటు చేశారనే మరో వాదన కూడా ఉంది. 'రఘువంశ' పుస్తకంలో కూడా మాహిష్మతి నగరం ప్రస్తావన ఉంది. మాహిష్మతి ప్రాంతాన్ని 'అనుపమ' అని కూడా వ్యవహరించే వారని రఘువంశ పుస్తకం తెలియజేస్తోంది. హరివంశ, రఘువంశ పుస్తకాల్లో పేర్కొన్న ప్రకారం మాహిష్మతి నగరం నర్మదా నది పక్కన కాకుండా రేవా నది పక్కన ఎత్తైన కొండ ప్రాంతంలో ఓ ద్వీపంగా ఉన్నట్లు, శివునికి పవిత్ర స్థలమైన మంధాత గ్రామం దానికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మంధాత గ్రామంలో ఇప్పటికీ ఓంకార నాథ ఆలయం ఉంది. మాహిష్మతి నగర ప్రస్థావన మహాభారతంలో కూడా ఉంది. పాండవులు రాజ్యాధికారానికి రాక ముందు నీల అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించారట. ఆయన కూతురు అగ్ని దేవుడు ప్రేమిస్తాడట. అగ్ని దేవుడిని ముందుగా దండించాలనుకున్న రాజు ఆ తర్వాత అగ్ని దేవుడి శక్తి సామర్థ్యాలు తెలిసి తన రాజ్యానికి రక్షకుడిగా ఉండాల్సిందిగా కోరుతాడట. పాండవ రాజు యుధిష్టరుడు మాహిష్మతి రాజ్యంపై దండయాత్రకు వస్తాడట. కురుక్షేత్రం యుద్ధం సందర్భంగా నీల రాజుకు అగ్ని దేవుడు రథ సారథిగా వ్యవహరిస్తాడట. మాహిష్మతి గురించి 'విష్ణు పురాణం'లో కూడా ఈ ప్రస్థావన ఉంది. కార్య వీర్యార్జునుడు మాహిష్మతిని పాలిస్తున్నప్పుడు రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఆయన చేతిలో ఓడిపోతారని అందులో ఉన్నది. చరిత్ర, ఇతిహాస పుస్తకాల్లో ఉన్న ప్రస్తావన ప్రకారం ఎత్తైన వింధ్య పర్వత ప్రాంతాల్లో, నది ఒడ్డున మాహిష్మతి రాజ్యం ఉన్నట్లు, అది అడవులు, జలపాతాలతో నిండి అందాలకు నెలవైనట్లు తెలుస్తోంది. మాహిష్మతి రాజ్యం కోసం పలు యుద్ధాలు జరిగినట్లు, ఆ రాజ్యాన్ని గిరిజనులు కూడా పాలించినట్లు స్పష్టమవుతోంది. చరిత్రకు సంబంధించిన ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి'కి కథ అల్లారా? లేదా ఎప్పుడో చదివి ఇప్పుడు లీలా మాత్రంగా గుర్తున్న అంశాల చుట్టూ కథ అల్లుకుంటు వచ్చారా? అన్నది ఆయనకే తెలియాలి. చారిత్రక అంశాలను పరిగణలోకి తీసుకొని కథ రాసి ఉన్నట్లయితే ఏదో రోజు రాజమౌళి నిర్మించిన 'మాహిష్మతి రాజ్యం' ఆనవాళ్లు పురావస్తు తవ్వకాల్లో బయట పడొచ్చేమో?. -
మహిషుని అహాన్ని అణచిన అమ్మ
పురానీతి పూర్వం మాహిష్మతి అనే గంధర్వకాంత ఇంద్రుడి శాపవశాన మహిషి అనే రాక్షసిగా జన్మించింది. ఆమె రంభుడు అనే రాక్షసుని వివాహమాడింది. వారికి మహిషుడనే కుమారుడు పుట్టాడు. పుట్టుకతోనే వాడు అమిత బలవంతుడయ్యాడు. అనతికాలంలోనే రాక్షస లక్షణాలను అలవరచుకున్నాడు. తన బలాన్ని మరింతగా పెంచుకోవాలనుకుని, బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. బ్రహ్మ అందుకు అంగీకరించకపోవడంతో స్త్రీలంటే అతి చులకన భావం గల మహిషుడు శరీర నిర్మాణరీత్యా బలహీనంగా ఉండే స్త్రీ తనను ఏమీ చేయలేదనే ధీమాతో, స్త్రీ చేత తప్ప తాను ఎవరిచేతిలోనూ చావకుండా ఉండే వరం కోరుకున్నాడు.ఆ వరమదంతో దేవతలను, మునులను, మానవులను వాడు పెట్టే హింసకు అంతులేకుండా పోయింది. దేవతలు, మునులు కలిసి వాడి బారి నుంచి తమను రక్షించమని వైకుంఠనాథుడిని వేడుకున్నారు. అందుకు విష్ణువు చిరునవ్వు నవ్వి, పురుషులమైన మనమెవ్వరమూ వాడిని సంహరించలేము. తానూ, తన సైన్యమూ కూడా ఆడవారి చేతిలో తప్ప మరణించనటువంటి వరం పొందాడు అంటూ సాలోచనగా చూశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చూపులు కలవడంతో వారి దృక్కుల నుండి ఒక కాంతిపుంజం జనించింది. ఆ కాంతిపుంజం వైపు పార్వతి, లక్ష్మి, సరస్వతి చూశారు. వారి చూపుల నుంచి కూడా ఒక కాంతిపుంజం వెలువడింది. ఏమి జరుగుతోందా అన్న కుతూహలంతో దేవతలందరూ కలసి ఆ కాంతిపుంజాలవైపు చూడగా, వారి వారి ఆకారాలకు, తేజస్సుకు తగ్గట్టు లెక్కలేనన్ని వెలుగు కిరణాలు వెలువడి అన్నీ కలిసి ఒకటిగా మారాయి. ఆ విధంగా సకల దేవతల తేజోపుంజాలూ కలసి వాటినుంచి అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించింది. ఆమెకు దేవతలంతా కలసి సమస్త సంపదలనూ, ఆయుధాలనూ ఇచ్చారు. అమ్మ ఆ ఆయుధాలను ధరించి, సర్వశక్తులతో, తేజస్సుతో కూడి, మదగర్వితుడైన ఆ రాక్షసుని మీదికి దండయాత్రకు వెళ్ళింది. ఆమెను చూసిన మహిషుడు ‘ఓ సుందరీ, ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చావు? ఎంత అందంగా ఉన్నావు?’ అనడిగాడు. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అంటుంది అమ్మ. ఆమె మాటలకు వికటంగా నవ్విన మహిషుడు ‘‘ఇంత అందంగా, సుకుమారంగా ఉన్న నీతో యుద్ధం చేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు. నన్ను పెళ్లి చే సుకుని నా అంతఃపుర కాంతగా ఉండు’’ అన్నాడు అహంకారంతో. అందుకు అమ్మవారు సమ్మతించకపోవడంతో ఒక అబలవైన నీతో యుద్ధం చేయడానికి నేనెందుకు, నా అనుచరుడున్నాడు చాలు’’ అంటూ భండాసురుడిని పంపాడు. అమ్మవారు తాను కూడా తొమ్మిదేళ్ల బాలికగా రూపు మార్చుకుని, శ్యామలాదేవిని సైన్యాధిపతిగా చేసుకుని భండాసురుని అవలీలగా చేధించింది. ఆ త ర్వాత చండిగా, చాముండిగా చండాసురుని, ముండాసురుని సంహరించింది. నెత్తురు చుక్క నేల రాలితే వేలాదిమంది రాక్షసులను పుట్టించే లక్షణం గల రక్తబీజుడనే రాక్షసుని కాళికగా మారి, వాడి నెత్తురు నేలరాలకుండా రుధిర పానం చేసింది. ఆ విధంగా తొమ్మిదిరోజులపాటు ఆ రాక్షసుడు పంపిన అనుచర గణాలనందరినీ దునుమాడడంతో, విధిలేక తానే వచ్చాడు మహిషుడు. అప్పుడు అమ్మ, సింహవాహనారూఢియై, వీరవిహారం చేసి దున్నపోతు రూపంలో ఉన్న ఆ రాక్షసుని నేలమీద పడవేసి, కాళ్లతో మట్టగించి చంపేసింది. ఆడది అబల, ఆమె తననేమీ చేయలేదన్న మహిషుని అహాన్ని ఆ విధంగా ఆదిపరాశక్తిగా మారి, అణ చి వేసింది అమ్మ దుర్గమ్మ.