బాహుబలిలోని మాహిష్మతి రాజ్యం నిజంగా ఉందా? | Is mahishmati a real kingdom? | Sakshi
Sakshi News home page

బాహుబలిలోని మాహిష్మతి రాజ్యం నిజంగా ఉందా?

Published Sat, Apr 15 2017 3:01 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

బాహుబలిలోని మాహిష్మతి రాజ్యం నిజంగా ఉందా? - Sakshi

బాహుబలిలోని మాహిష్మతి రాజ్యం నిజంగా ఉందా?

న్యూఢిల్లీ: విశేషా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా రెండు జాతీయ అవార్డులను అందుకున్న బహు భాషా చిత్రం 'బాహుబలి' అందరు అనుకున్నట్లు పూర్తి కల్పితమేమి కాదు. బాహుబలి చిత్రంలో పేర్కొన్న 'మాహిష్మతి' రాజ్యం నిజంగా ఉండేదని చరిత్రకు సంబంధించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మాహిష్మతి మధ్య భారత్‌లోని, అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉండేదట. వింధ్య పర్వతాలకు రెండు వైపుల విస్తరించిన అవంతి రాజ్యంలో ఉత్తారాదినున్న భాగం ఉజ్జయిని నగరాన్ని రాజధాని చేసుకోగా, దక్షిణాది అవంతి రాజ్యానికి మాహిష్మతి రాజధానిగా ఉండేదట.

అప్పట్లో సామాజిక రాజకీయ కేంద్రంగా విరాజిల్లిన మాహిష్మతి నగరం ప్రస్థావన పలు చరిత్ర పుటల్లోనే కాకుండా ఇతిహాస కథల్లోనూ ఉంది. అంతకుముందు మధ్య, పశ్చిమ భారతాన్ని పాలించిన 'హయ్‌హాయాస్‌' అనే ఐదు తెగల సమాఖ్య కూడా మాహిష్మతి నగరాన్ని కేంద్రంగా చేసుకొని పాలించారన్న వాదన కూడా ఉంది. వీటిలో కొన్ని అంశాల ప్రస్తావన పీకే భట్టాచార్య రాసిన 'హిస్టారికల్‌ జియాగ్రఫీ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ ఫ్రమ్‌ ఎర్లీ రికార్డ్స్‌' అనే పుస్తకంలో ఉంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలో పేర్కొన్న కార్తవీర్యార్జునుడు, అంటే మాహిష్మతిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రాజు హయ్‌హాయా అయ్యే అవకాశాలు ఉన్నాయని రచయిత భట్టాచార్య పేర్కొన్నారు.


సంస్కతంలో రాసిన 'హరివంశ' సాహిత్యంలో కూడా మాహిష్మతి రాజ్య ప్రస్థావన ఉంది. మాహిష్మతి అనే రాజు దీన్ని ఏర్పాటు చేసినందున ఆయన పేరే నగరానికి వచ్చిందని, మాహిష్మతి రాజు,  యదు నుంచి వచ్చిన సహజాన(రుగ్వేదంలో పేర్కొన్న ఆర్యుల్లో ఒక వర్గం వారిని యదు వంశీకులని, యదు ప్రాంతీయులని వ్యవహరిస్తారు) రాజులకు వారసుడని హరివంశ పుస్తకం తెలియజేస్తోంది. మాహిష్మతి రాజు కాకుండా యదు వారసుల్లోనే ఒకరైన 'ముకుకుండ' మాహిష్మతిని ఏర్పాటు చేశారనే మరో వాదన కూడా ఉంది.

'రఘువంశ' పుస్తకంలో కూడా మాహిష్మతి నగరం ప్రస్తావన ఉంది. మాహిష్మతి ప్రాంతాన్ని 'అనుపమ' అని కూడా వ్యవహరించే వారని రఘువంశ పుస్తకం తెలియజేస్తోంది. హరివంశ, రఘువంశ పుస్తకాల్లో పేర్కొన్న ప్రకారం మాహిష్మతి నగరం నర్మదా నది పక్కన కాకుండా రేవా నది పక్కన ఎత్తైన కొండ ప్రాంతంలో ఓ ద్వీపంగా ఉన్నట్లు, శివునికి పవిత్ర స్థలమైన మంధాత గ్రామం దానికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మంధాత గ్రామంలో ఇప్పటికీ ఓంకార నాథ ఆలయం ఉంది.  


మాహిష్మతి నగర ప్రస్థావన మహాభారతంలో కూడా ఉంది. పాండవులు రాజ్యాధికారానికి రాక ముందు నీల అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించారట. ఆయన కూతురు అగ్ని దేవుడు ప్రేమిస్తాడట. అగ్ని దేవుడిని ముందుగా దండించాలనుకున్న రాజు ఆ తర్వాత అగ్ని దేవుడి శక్తి సామర్థ్యాలు తెలిసి తన రాజ్యానికి రక్షకుడిగా ఉండాల్సిందిగా కోరుతాడట. పాండవ రాజు యుధిష్టరుడు మాహిష్మతి రాజ్యంపై దండయాత్రకు వస్తాడట. కురుక్షేత్రం యుద్ధం సందర్భంగా నీల రాజుకు అగ్ని దేవుడు రథ సారథిగా వ్యవహరిస్తాడట. మాహిష్మతి గురించి 'విష్ణు పురాణం'లో కూడా ఈ ప్రస్థావన ఉంది. కార్య వీర్యార్జునుడు మాహిష్మతిని పాలిస్తున్నప్పుడు రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఆయన చేతిలో ఓడిపోతారని అందులో ఉన్నది.

చరిత్ర, ఇతిహాస పుస్తకాల్లో ఉన్న ప్రస్తావన ప్రకారం ఎత్తైన వింధ్య పర్వత ప్రాంతాల్లో, నది ఒడ్డున మాహిష్మతి రాజ్యం ఉన్నట్లు, అది అడవులు, జలపాతాలతో నిండి అందాలకు నెలవైనట్లు తెలుస్తోంది. మాహిష్మతి రాజ్యం కోసం పలు యుద్ధాలు జరిగినట్లు, ఆ రాజ్యాన్ని గిరిజనులు కూడా పాలించినట్లు స్పష్టమవుతోంది. చరిత్రకు సంబంధించిన ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని విజయేంద్ర ప్రసాద్‌ 'బాహుబలి'కి కథ అల్లారా? లేదా ఎప్పుడో చదివి ఇప్పుడు లీలా మాత్రంగా గుర్తున్న అంశాల చుట్టూ కథ అల్లుకుంటు వచ్చారా? అన్నది ఆయనకే తెలియాలి. చారిత్రక అంశాలను పరిగణలోకి తీసుకొని కథ రాసి ఉన్నట్లయితే ఏదో రోజు రాజమౌళి నిర్మించిన 'మాహిష్మతి రాజ్యం' ఆనవాళ్లు పురావస్తు తవ్వకాల్లో బయట పడొచ్చేమో?.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement