Madhya Pradesh Elections 2018
-
నేడే కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్‌నాథ్ ప్రమాణం చేశాక గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు. ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్‌నాథ్ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది. వింధ్య ప్రాంతంలో ఓటింగ్ సరళిపై విచారణ మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్‌నా«ద్ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లే దక్కాయి. -
చింద్వాడా నుంచే కమల్‌నాథ్ పోటీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని తన సొంత జిల్లా చింద్వాడాలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన నియోజకవర్గం నుంచి తాను త్వరలో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ కాబోయే సీఎం కమల్‌నాథ్ చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కమల్‌నాథ్ పోటీ చేయకపోయినప్పటికీ ఆయనను మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం సీఎం పదవిలో ఆయన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఇక చింద్వాడా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో నాలుగు ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డు స్థానాలు. దీంతో మిగిలిన మూడు స్థానాలైన చింద్వాడా, చౌరాయ్, సౌన్సర్లలో ఏదో ఓ చోటు నుంచి కమల్ చేయొచ్చు. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, ఈ మూడింటిలో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్‌కు చింద్వాడాలోనే లభించింది. కమల్ ఇల్లు, ఓటరు జాబితాలో పేరు చింద్వాడాలో ఉన్నాయి. దీంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి శాసనసభకు ఎన్నికవుతారని సమాచారం. చింద్వాడాలో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికైన దీపక్ సక్సేనా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయక తప్పని పరిస్థితి. ప్రమాణానికి రాహుల్, మమత కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులకు కూడా కమల్‌నాథ్ ఆహ్వానాలు పంపారని సమాచారం. -
నేను ఇప్పటికీ మధ్యప్రదేశ్ సీఎంనే : చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఓటమిని హుందాగా అంగీకరిస్తూ సీఎం పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా కూడా చేశారు. అయినప్పటికీ తాను మధ్య ప్రదేశ్ సీఎంనేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం మధ్య ప్రదేశ్ చీఫ్ మినిస్టర్( సీఎం) కాదని, కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని పేర్కొన్నారు. తన ట్విటర్లోని బయోడేటాలో చీప్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్‌ను తొలగించి కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చేర్చారు. ‘ మధ్యప్రదేశ్ రాష్ట్రం నా గుడి, రాష్ట్ర ప్రజలు నా దేవుళ్లు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ప్రజల కోసం తెరచే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఎలాంటి సంశయం లేకుండా నా దగ్గరకు రావోచ్చు. ఎప్పటిలాగే మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తా’ అని ట్విటర్లో చౌహాన్ పేర్కొన్నారు. मध्यप्रदेश मेरा मंदिर हैं, और यहाँ की जनता मेरी भगवान। मेरे घर के दरवाज़े आज भी प्रदेश के हर नागरिक के लिए हमेशा खुले हैं, वो बिना कोई हिचकिचाहट मेरे पास आ सकते हैं, और मैं हमेशा की तरह उनकी यथासंभव मदद करता रहूँगा। — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) December 14, 2018 తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కావడంతో ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) లతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఆ ఎమ్మెల్యేలు చాలా ప్రమాదకరం..!
భోపాల్ : హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తులు జైలులోపల శిక్ష అనుభవించాల్సింది పోయి శాసన సభ్యులుగా అవతారమెత్తుతున్నారు. అధికార బలంతో శిక్షలు తగ్గించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, అండ బలంతో దందాలు చేసేవారు మరికొందరు. తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డు చూస్తే ఇవే విషయాలు గుర్తుకువస్తున్నాయి. శాసనసభకు ఎన్నికైన 230 మంది సభ్యుల్లో 94 మంది ప్రమాదకరమైన క్రిమినల్, హత్య కేసులు ఎదుర్కొంటున్న వారే. వీరిలో 47 మందిపై మర్డర్ కేసులు, మహిళలపై అత్యాచార కేసులు ఇదివరకే రుజువైనాయి. అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్ (ఏడీబీ) అనే సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 56 మంది (49శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలగా, బీజేపీకి చెందిన 34 మంది నేర చరిత్ర ఉన్నవారే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారం (ఐపీసీ సెక్షన్ 354, మహిళలపై వేధింపులు సెక్షన్ 498ఏ) వంటి కేసులను ఎదురుక్కొంటున్నారు. అంతేగాకా అసెంబ్లీకి ఎన్నికైన 230 మందిలో 187 (81శాతం) సభ్యులపై అవినీతి అరోపణలు ఉన్నట్లు తెలింది. ఆస్తుల్లో తామేమీ తక్కువ కానట్లు 80శాతం పైగా సభ్యులు కోటికి పైగా ఆస్తులు ఉన్నవారు చట్టసభకు ఎన్నికయ్యారు. -
17న కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్‌నాథ్‌కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్‌నాథ్‌ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్‌సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్‌పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్‌లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్‌నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
‘పార్టీకి పట్టం కట్టేందుకే పాటుపడ్డా’
న్యూఢిల్లీ : పార్టీని అధికారంలోకి తేవడానికే కసితో పనిచేశానని, సీఎం పదవిని చేపట్టాలనే దాహం తనకు లేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న కమల్‌నాథ్ పేర్కొన్నారు. తాను దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మధ్యప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సీఎం ఆశావహులు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌లకు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో సింధియా క్యాంప్, దిగ్విజయ్ క్యాంప్, కమల్‌నాథ్ క్యాంప్ అంటూ ఏమీ లేవన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మోదీ, అమిత్ షా విన్నింగ్ కాంబినేషన్‌కు మధ్యప్రదేశ్‌లో చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్‌ను కలవడంపై కమల్‌నాథ్ స్పందిస్తూ గోవాలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మధ్యప్రదేశ్‌లో తమకు తగినంత మెజారిటీ ఉన్నందునే గవర్నర్‌తో భేటీ అయ్యామన్నారు. మాయావతితో తాను మాట్లాడానని, తమకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించారని, ఎస్పీ సైతం సహకరించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. వారు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్‌నాథ్ వెల్లడించారు. అవి తప్పుడు ఆరోపణలు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై ఎలాంటి అభియోగాలు లేవని, తనపై ఆరోపణలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సిక్కు వ్యతిరేక ఘర్షణలపై ఏర్పాటైన నానావతి కమిషన్ సరైన ఆధారాలు లేవంటూ కమల్‌నాథ్‌పై అభియోగాలను తోసిపుచ్చింది. కాగా సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్న కమల్‌నాథ్‌కు మధ్యప్రదేశ్ సీఎం పదవి కట్టబెట్టడాన్ని సిక్కు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఢిల్లీకి చెందిన అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా హెచ్చరించారు. -
మధ్యప్రదేశ్‌కు కమలనాథుడే
సాక్షి, ప్రతినిధి, న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడింది. ఫలితాలు విడుదలైన దాదాపు 24 గంటల అనంతరం కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్ పీఠంపై కూర్చోనున్నది ఎవరో తేలింది. తీవ్ర ఉత్కంఠ అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఊహాగానాలకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ ట్వీటర్ హ్యాండిల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథేనంటూ స్పష్టత ఇచ్చింది. దాంతో భోపాల్, తదితర మధ్యప్రదేశ్ నగరాల్లో కమల్‌నాథ్ అభిమానాలు బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందే కమల్ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియాలు భోపాల్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమల్‌నాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలవనున్నారు. మరోవైపు, రాజస్తాన్ విషయంలోనూ పార్టీ అగ్ర నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత అశోక్ గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలట్ తమ పట్టు వీడకపోవడంతో నిర్ణయం తీసుకోవడం పార్టీ చీఫ్ రాహుల్‌కి కత్తి మీద సాములా మారింది. ఈ రెండు రాష్ట్రాల సీఎం ఎంపికే ఒక కొలిక్కి రాకపోవడంతో.. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ఎంపికను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, తమ అభిమాన నేతనే సీఎంగా ప్రకటించాలంటూ పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజస్తాన్‌లో స్వల్ప హింస చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడి దాదాపు 2 రోజులు గడుస్తున్నా సీఎం ఎంపిక పూర్తి కాకపోవడంపై బీజేపీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. సీఎం పదవికి రేసు ఏదీ లేదు: సింధియా ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామనీ, సీఎం పదవి కోసం పరుగుపందెం ఏదీ జరగడం లేదని రాహుల్‌తో చర్చల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాహుల్‌తో సింధియా, కమల్‌నాథ్‌లు విడివిడిగా భేటీ అయిన అనంతరం ఇరువురితో కలిసి రాహుల్ ఫొటో తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కాలం, ఓరిమి.. ఇవే అత్యంత శక్తిమంతమైన యోధులు’ అనే ప్రఖ్యాత రచయిత లియొ టాల్‌స్టాయ్ వ్యాఖ్యను ట్వీట్‌తో జతపరిచారు. రాజస్తాన్ నిరసనల్లో హింస తమ అభిమాన నాయకుడినే సీఎంగా ప్రకటించాలంటూ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు సహా పలుచోట్ల ఆందోళనలకు దిగారు. సచిన్ మద్దతుదారులు ఢిల్లీలో రాహుల్ నివాసం బయట నినాదాలు చేశారు. రాజస్తాన్‌లో పార్టీ కార్యకర్తల నిరసనల్లో స్వల్ప హింస చెలరేగింది. దౌసా, అజ్మీర్, కరౌలీ ప్రాంతాల్లో సచిన్ పైలట్ మద్దతుదారులు రోడ్లపై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. సంయమనంతో ఉండాలని సచిన్‌తోపాటు గెహ్లోత్ కార్యకర్తలను కోరారు. రాహుల్, సోనియాలపై నమ్మకం ఉందనీ, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పైలట్ తన వర్గం వారిని కోరారు. ఛత్తీస్‌గఢ్‌పై నిర్ణయం నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక నేటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్ అగ్రనేతలు.. చత్తీస్‌గఢ్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారని సమాచారం. అయితే, రాష్ట్రంలో పార్టీ పరిశీలకుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను, రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తే రూపొందించిన తన నివేదికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందించారు. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్, ఓబీసీ నేత తామ్రధ్వజ్ సాహు, సీనియర్ నేతలు టీఎస్ సింగ్ దేవ్, చరణ్‌సింగ్ మహంత్‌లు సీఎం రేసులో ఉన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బఘేల్‌కే సీఎం పీఠం దక్కే చాన్సుంది. 1984 అల్లర్లలో పాత్రపై ఆరోపణలు మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేయడం ద్వారా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ‘గాంధీ కుటుంబం అధికారంలో ఎప్పుడొచ్చినా 1984 అల్లర్ల నిందితులను కాపాడుతుంది. ఇప్పుడు కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌కు సీఎంను చేయడం ద్వారా ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కానుక ఇస్తున్నారు’ అని మంజీందర్ అన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్ పాత్ర కూడా ఉందని అకాలీదళ్ గతం నుంచీ ఆరోపిస్తోంది. ‘సిక్కు వ్యతిరేక అల్లర్లలో అమాయకుల ప్రాణాలు తీసినవారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ సందేశమిస్తున్నారు. ఆ ఘాతకుల వెనుక తాము ఉన్నామనీ, సిక్కులను చంపినందుకు బహుమతులు ఇస్తామని ఆయన అంటున్నారు’ అని మంజీందర్ అన్నారు. గతంలో కమల్‌నాథ్‌ను పంజాబ్, హరియాణాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడూ పలువురు సిక్కులు వ్యతిరేకించడంతో ఆయనను అప్పట్లో పంజాబ్ బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ హస్తం ఉందనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు లాయర్ హెచ్ఎస్ ఫూల్కా కూడా తెలిపారు. ‘కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా అవసరమైనన్ని సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. అయితే, చట్టం ముందు ఆయన నిలబడాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు. కానీ, ఇటువంటి వ్యక్తిని మధ్యప్రదేశ్ సీఎంగా నియమించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది రాహుల్ గాంధీనే’ అని అల్లర్ల బాధితుల పక్షాన వాదిస్తున్న ఫూల్కా అన్నారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో ఢిల్లీలో సిక్కులు ఊచకోతకు గురవడం తెలిసిందే. ఉదయం నుంచి ఉత్కంఠ మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపిక కోసం చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఇందుకు గాను ఆయా రాష్ట్రాల సీఎం ఆశావహులతో పాటు, పార్టీ పరిశీలకులు, సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించారు. రాహుల్‌కు సహాయంగా ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థులుగా ఉన్న కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో.. రాజస్తాన్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లతో ఉమ్మడిగా, వేర్వేరుగా చర్చలు జరిపారు. యువ నేతలైన సింధియా, పైలట్ల వైపు రాహుల్, ప్రియాంక మొగ్గుచూపగా..అనుభవాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికల అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న సోనియా గాంధీ సీనియర్లైన కమల్ నాథ్, గహ్లోత్‌లకు మద్దతిచ్చినట్లు సమాచారం. మధ్యప్రదశ్ విషయంలో కమల్‌నాథ్‌ను సీఎంగా అంగీకరించేలా జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్, ప్రియాంకలు ఒప్పించారని, సచిన్ పైలట్ మాత్రం గహ్లోత్‌ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తీవ్రంగా నిరసించాడని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ఎంపికను ఖరారు చేసిన రాహుల్.. రాజస్తాన్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి పలు దఫాలుగా జరిగిన చర్చల్లో రాజస్తాన్‌కు కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జ్ అవినాశ్ పాండే, మధ్యప్రదేశ్ కేంద్ర పరిశీలకుడు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
నా వల్లే బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది!
సాక్షి, విశాఖపట్నం: ‘నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో(రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఐ–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. సాయంత్రం తగరపువలస జూట్‌మిల్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో ముందుకెళ్తే తప్పా! తెలంగాణ ఎన్నికల్లో నా వల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లామని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో కూడా వెళ్లడానికి వీల్లేదని అడ్డుజెప్పారు. నేను అక్కడ పని చేయడం తప్పయినట్టు.. నాకేదో రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?..’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లివ్వాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. మోదీని ఎలా బతిమిలాడానో అందరూ చూశారు.. మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని.. కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ‘సార్.. సార్..’ అంటూ ఎలా బతిమలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మెడ్‌టెక్’తో విశాఖకు విశ్వఖ్యాతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్(ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీలో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు. -
శభాష్.. శివరాజ్..!
‘గెలుపైనా.. ఓటమైనా... నేను భయపడను.కర్తవ్య నిర్వహణ పథంలో ఏది ఎదురయినా దాన్ని స్వీకరిస్తాను’ సీఎం పదవికి రాజీనామా చేసే ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలు 2018 ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్న మాటలివి. శివ మంగళ్ సింగ్ అనే కవి రాసిన కవితలోని పంక్తులివి. గత పదిహేనేళ్లుగా అనుభవిస్తున్న ముఖ్యమంత్రిత్వం చేజారిపోయిందన్న బాధ ఆయనలో కనిపించడం లేదు. తన కుర్చీని లాక్కున్న ప్రతిపక్షంపై ఆగ్రహమూ వ్యక్తం చేయ లేదు.ఓటమికి సాకులు వెతకలేదు. స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంత చిత్తంతో పదవి నుంచి హుందాగా తప్పుకున్న చౌహాన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తానే వహిస్తున్నట్టు చెప్పారు. అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. ఒక కుటుంబ సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్నదే తన కోరికన్నారు. తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కూడా కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ట్రై చేద్దాం తాజా ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఏ పార్టీకీ కూడా సంపూర్ణ మెజారిటీ రాని నేపథ్యంలో.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరుదామని బీజేపీ అధినాయకత్వం చౌహాన్‌కు సూచించింది. అయితే, ప్రజలు మనకు మెజారిటీ ఇవ్వలేదు, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కులేదు అన్ని స్పష్టంగా చెప్పడం చౌహాన్ నిజాయితీకి నిదర్శనం. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన తర్వాత ఇప్పుడు నేను హాయిగా ఉన్నానని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ‘నా రాజీనామాను గౌరవనీయ గవర్నర్‌కు అందజేశాను. ఈ ఓటమి బాధ్యత పూర్తిగా నాదే. కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ను అభినందిస్తున్నాను’ అన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఓటు వేసినందుకు ఓటర్లకు ట్విట్టర్లో కృతజ్ఞతలు కూడా చెప్పారు. ‘మీరు చూపించిన అపరిమిత ఆప్యాయత, విశ్వాసాలను, మీ దీవెనలను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన 59 ఏళ్ల చౌహాన్‌ను రాష్ట్ర ప్రజలు అభిమానంతో మామ అని పిలుచుకుంటారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతితో నిండిన ప్రస్తుత రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ అవలక్షణాలు ఏమాత్రం అంటని సచ్చీలుడు చౌహాన్. చౌహాన్‌కు అభినందనల ట్వీట్లు ప్రజల ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించారు. ప్రజాభీష్టం ఏమిటో తెలిసి ప్రశాంతంగా అధికార మార్పిడికి సిద్దపడ్డారు. -సాగరిక ఘోష్, సీనియర్ జర్నలిస్ట్ మధ్య ప్రదేశ్ ప్రజల తీర్పును గౌరవిస్తూ కర్ణాటకలోలా బేరసారాలకు దిగకుండా హుందాగా తప్పుకోవడం ద్వారా చౌహాన్‌జీ మన అత్యంత హుందాగల రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిరూపించుకున్నారు. వాజ్‌పేయి మలిచిన బీజేపీ నాయకుడాయన. -శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్నప్పుడు ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ చౌహాన్జీని ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో హుందాగా, సౌమ్యంగా మాట్లాడతారని, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు. మన్మోహన్జీ మాటలు నిజమేనని చౌహాన్ ఈ రోజు నిరూపించారు. -అల్కా లాంబ, ఢిల్లీ ఎమ్మెల్యే (ఆమ్ ఆద్మీ పార్టీ) -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఖరారు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారైనట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పక్షనేతగా కమల్‌నాథ్ పేరును ప్రతిపాదించారు. పార్టీ గెలుపుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే కారణమని సింధియా తెలిపారు. సీఎం ఎవరనే నిర్ణయాన్ని రాహుల్‌కే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న సింధియానే శాసనసభ పక్ష నేతగా కమల్‌నాథ్ పేరును ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనం కానుంది. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రకటను చేయలేదు. ఈ రోజు రాత్రికి కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో మెజారిటీ మార్కుకు రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్.. అధికారం చేజిక్కించుకోవడానికి వేగంగా పావులు కదిపింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, స్వతంత్రులతో కాంగ్రెస్ నాయకుల చర్చలు ఫలించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే సీఎం పదవి విషయంలో కొద్దిగా సందిగ్ధత నెలకొంది. సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే’
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో అధికార బీజేపీ మెజారిటీకి 7 స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ ఓటమితో మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన చౌహాన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. హోరాహోరిగా సాగిన పోరులో చాలా కొద్ది తేడాతో తాము అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తానెవరినైనా నిరాశ పరిచి ఉంటే క్షమించాలని కోరారు. గెలవడం, ఓడిపోవడం ఎన్నికల్లో భాగమేనని చౌహాన్ అన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎప్పుడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తానని వెల్లడించారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాను చూస్తు ఊరుకోనని తెలిపారు. -
గవర్నర్‌ను కలిసిన కమల్ నాధ్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో మేజిక్ ఫిగర్‌ను సాధించిన కాంగ్రెస్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ సీఎం రేస్‌లో నిలిచిన కమల్ నాథ్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కలిశారు. కమల్ నాథ్‌తో పాటు సీఎం పదవి ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల బృందంలో ఉన్నారు.తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను వారు గవర్నర్‌కు అందచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకుందని కమల్ నాథ్ గవర్నర్‌కు వివరించారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది. మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. -
మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ రాజీనామా
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మేజిక్ ఫిగర్‌కు రెండు స్దానాల దూరంలో నిలిచిన కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంగా వైదొలిగిన అనంతరం తానిప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. బీఎస్పీ మద్దతుతో పాటు స్వతంత్రుల సహకారం కూడగట్టేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. కాగా, మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది -
మధ్యప్రదేశ్‌లో హంగ్?
భోపాల్: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్‌ను ఆనందీబెన్ పటేల్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్ 85, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 113 సీట్లు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్ చేరుకున్నారు. గవర్నర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు భోపాల్: మధ్యప్రదేశ్‌లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్ ఫిగర్ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్ కీ బేటా)పే రొందిన చౌహాన్ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్) నుంచి మధ్యప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చి చౌహాన్ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. -
మందసోర్లో బీజేపీకే మొగ్గు
భోపాల్ : హిందీ బెల్ట్‌లో కీలక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీకి పరాజయం ఎదురైనా మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రైతుల ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ రైతుల సమస్యలు, అన్నదాతల ఆందోళన ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గత ఏడాది రైతుల ఆందోళన సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీసి ఆరుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. రైతుల మృతితో మందసోర్ జాతీయ పతాకశీర్షికలకు ఎక్కింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు గుప్పించింది. రైతుల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా నిలిచి వివిధ రాష్ర్టాల్లో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన మందసోర్లో ఊహించని ఫలితాలు రావడం విశేషం. మందసోర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మందసోర్, మల్హర్గర్, నీముచ్, మనస, జవాద్, జవోర స్ధానాలను బీజేపీ నిలబెట్టుకోగా, 2013లో కాంగ్రెస్ గెలుపొందిన సువర్సా స్ధానంలోనూ బీజేపీ విజయం సాధించడం గమనార్హం. -
మాయావతితో కాంగ్రెస్ మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సానుకూల ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధారణ మెజారిటీ సాధించినా, మధ్యప్రదేశ్‌లో మేజిక్ మార్క్‌కు అవసరమైన మెజారిటీ రాకుంటే ఏం చేయాలనేదానిపై కసరత్తు వేగవంతం చేసింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 116 స్ధానాలు రాకుంటే కాంగ్రెస్‌కు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతు అనివార్యమవుతుంది. ప్రస్తుతం 115 స్ధానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ మాయావతి సాయం కోరేందుకు కాంగ్రెస్ నేతలు సంసిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ మాయావతితో ఫోన్లో సంప్రదింపులు జరిపిన మీదట పార్టీ నేతలతో ఢిల్లీలో సమావేశానికి మాయావతి సిద్ధమైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాజస్ధాన్‌లోనూ మిత్రపక్షాలతో కలిసి సాగేందుకు కాంగ్రెస్ సంకేతాలు పంపింది. రాజస్ధాన్‌లో తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ సాధించినా భావసారూప్య పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చెప్పారు. -
ఓటమి బాటలో డజను ఎంపీ మంత్రులు
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినా ఉత్కంఠ పోరులో కాంగ్రెస్‌దే పైచేయి సాధించింది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ముందంజలో ఉంది. బీఎస్పీ రెండు స్ధానాల్లో, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ అవకాశాలను దెబ్బతీయగా, కాంగ్రెస్‌కు ఇదే కలిసివచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌లోని దాదాపు డజను మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి నరోత్తం మిశ్రా దాటియా స్ధానంలో 6200 ఓట్లతో ఎదురీదుతుండగా, మొరెనా నియోజకవర్గంలో మంత్రి రుస్తం సింగ్ మూడో స్ధానంలో ఉన్నారు. ఇక ఖర్గోవ్‌లో బాలక్రిష్ణ పటిదార్, గొహద్‌లో లాల్ సింగ్ ఆర్యా, షహ్పురా స్ధానం నుంచి ఓం ప్రకాష్ దుర్వే వెనుకంజలో ఉన్నారు. ఇక అంతర్ సింగ్ ఆర్య సెంద్వా స్ధానంలో వెనుకబడగా, హట్‌పిప్లియా నుంచి దీపక్ జోషి, సిల్వాని నుంచి రాంపాల్ సింగ్, బుర్హాన్‌పురాలో అర్చనా చిట్నిస్ ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ దామో స్ధానంలో, శరద్ జైన్ జబల్పూర్ నార్త్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. మరో మంత్రి జల్బన్ సింగ్ గ్వాలియర్‌లో, మాజీ ప్రదాని వాజ్‌పేయి మేనల్లుడు అనూప్ మిశ్రా బితర్వార్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. -
మధ్యప్రదేశ్‌లో మేజిక్ మార్క్ చేరుకున్న కాంగ్రెస్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు తుది రౌండ్ల వరకూ ఉత్కంఠ పెంచేలా పోటీపడుతున్నాయి. ప్రారంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య స్వల్ప ఆధిక్యంతో విజయం దోబూచులాడుతున్నా తాజాగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా, కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ఆధిక్యం సాధించింది. ఇక నాలుగు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న బీఎస్పీ, ఆరు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ, ఇతరుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది. -
10 రౌండ్ల కౌంటింగ్ పూర్తి : సమంగా నిలిచిన బీజేపీ, కాంగ్రెస్
భోపాల్ : హోరాహోరిగా సాగుతున్న మధ్యప్రదేశ్ కౌటింగ్లో అధికార బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రులు వెనకంజలో ఉండగా.. కాంగ్రెస్ కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కమల్ నాథ్ ఇంటి ఆవరణలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం 10.30 : రాష్ట్రంలో హంగ్ పరిస్థిలు వచ్చే నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఫలితాల గురించి చర్చించనున్నట్లు సమాచారం. ఫలితాల గురించి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్రమే.. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడలేదు. గెలుస్తామనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 10.50 : మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా.. 116 సీట్ల సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ 116 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.10 : మధ్యప్రదేశ్‌లో హస్తందే పై చేయి అవుతోంది. ఇప్పటికే 116 స్థానాల్లో లీడ్‌లో ఉన్న కాంగ్రెస్ మరిన్ని స్థానాల్లో ఆదిక్యంలోకి వచ్చే అవకాశలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలే సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.45 : అధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ హవా కాస్తా తగ్గగా.. కమలం కోలుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ 115 స్థానాల్లో అధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 106 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. రసవత్తరంగా సాగుతోన్న ఈ పోరులో విజేతలేవరో తేలాలంటే మరి కాస్తా సమయం పడుతోంది. మధ్యాహ్నం 12.10 : మధ్యప్రదేశ్ ఓటరు నాడి సులువుగా చిక్కడం లేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతోది. కాసేపు బీజేపీ, మరి కాసేపు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటున్నాయి. దాంతో నాయకులు కూడా ధైర్యంగా గెలుస్తామని చెప్పలేక పోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ మాజీ సీఎం బాబు లాల్ గౌర్ గెలుస్తామనుకున్నపుడు ఓడిపోవచ్చు.. కొన్ని సార్లు నిజంగానే గెలవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ 116, బీజేపీ 103 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.40 : మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. ప్రజల ఆగ్రహానికి నిదర్శమన్నారు శివసేన నాయకుడు సంజయ్ రౌత్. అయితే కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పలేమన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అభిప్రాయ పడ్డారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవియ మాత్రం గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు సమంగా మారింది. కాంగ్రెస్ 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కూడా 109 స్థానాల్లోనే లీడ్‌లో కొనసాగుతోంది. మధ్యాహ్నం 01.10 : బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తర పోరు కొనసాగుతుండటంతో.. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కీలంగా మారింది. ప్రస్తుతం బీఎస్పీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఎస్పీతో మంతనాలు జరుపుతున్నాయి. మధ్యాహ్నం 01.40 : ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ 111 స్థానాల్లో, కాంగ్రెస్ 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దానిలో భాగంగా తన పార్టీ ఎమ్మెల్యేలందరిని ఢిల్లీకి పంపించారు. 55 స్థానాల భవితవ్యం కేవలం 1000 ఓట్ల మార్జిన్ డిసైడ్ చేయనుంది. మధ్యాహ్నం 02.00 : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉత్కంటభరితంగా సాగుతోంది. 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యిసరికే.. బీజేపీ, కాంగ్రెస్ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. -
మధ్యప్రదేశ్‌లో బీజేపీ - కాంగ్రెస్ హోరాహోరి..!
భోపాల్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల తుది సమరం నేటితో ముగియనుంది. అధికారాన్ని చేజిక్కించుకునేదేవరో.. ప్రతిపక్షంలో నిలిచేదేవరో మరి కొన్ని గంటల్లో తెలనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కౌటింగ్ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ - బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాష్ట్రంలోని 50 కీలక స్థానాలు పార్టీల భవితవ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మంగళవారం ఉదయం 8. 06 నిమిషాలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. గెలుపు కోసం రాహుల్ గాంధీ తన నివాసంలో పూజలు నిర్వహించారు. దాదాపు 35 స్థానాల్లో బీజేపీ - కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. బుధ్ని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లీడ్‌లో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్ 28న పోలింగ్ జరుగగా, 2 వేలకు పైగా మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ 229 స్థానాల్లో బరిలో నిలిచింది. ఒక సీటును శరద్‌యాదవ్ నేతృత్వంలోని లోక్తాంత్రిక్ జనతాదళ్‌కు వదిలేసింది. బీఎస్పీ 227 స్థానాల్లో, ఎస్పీ 51 స్థానాల్లో, ఆప్ 208 స్థానాల్లో పోటీపడ్డాయి. 1,094 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 75.05 శాతం పోలింగ్ నమోదయింది. -
మధ్యప్రదేశ్‌లో ‘ఇతరులే’ కింగ్ మేకర్లా?
భోపాల్/దతియా: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీలు గెలుచుకునే సీట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతుండటం తెలిసిందే. అదే జరిగితే, ఈ రెండు పార్టీల్లో ఏ దానికీ, స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ఆ రాష్ట్రంలో బీఎస్పీతోపాటు పలు చిన్న పార్టీలు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పనీ, తమ పార్టీ 12 వరకు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని ఇప్పటికే బీఎస్పీ నాయకులు అంటున్నారు. ఒక్క టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ సర్వే మాత్రమే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, సీఎస్డీఎస్ సర్వే ఒక్కటే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. మిగిలిన అన్ని సర్వేల్లోనూ ఈ రెండు పార్టీలు సాధించే సీట్ల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంటుందన్నాయి. బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 15 సీట్ల వరకు వస్తాయని దాదాపు అన్ని సర్వేలూ చెప్పాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఓ దానికి పూర్తి ఆధిక్యం రాని పక్షంలో ఈ చిన్న పార్టీలే, స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. మళ్లీ మాదే అధికారం: శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలుస్తుందనీ, వరుసగా నాలుగోసారి అధికారం చేపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ‘నేను అతిపెద్ద సర్వేయర్‌ను. రోజు మొత్తం ప్రజల మధ్యే గడుపుతా. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుంది’ అని శివరాజ్ అన్నారు. ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ తమ పక్షానే నిలిచారనీ, తామే గెలవబోతున్నామన్నారు. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్‌షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్‌కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్‌కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్‌కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► బాగేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్‌కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్‌కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్‌పోల్‌లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్‌జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్‌సింగ్‌తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం రమణ్‌సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్‌లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌లో నువ్వా–నేనా ఛత్తీస్‌గఢ్‌లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్‌లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్‌లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్‌లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
బీజేపీ అధికారం కోల్పోనుందా..?!
భోపాల్ : గత మూడు పర్యాయాలుగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు మరోమారు అధికారం కట్టబెట్టడానికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు ఉన్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శుక్రవారం సాయంత్రం పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఏబీపీ-సీఎస్డీఎస్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 126 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని అంచనా. బీజేపీ 94 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోతుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ పాలనపట్ల ప్రజలకు పెద్దగా ప్రతికూలత లేనప్పటికీ సుదీర్ఘంగా అధికారంలో ఉండడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సరళి ఎలా ఉండొచ్చు అన్నది ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 116 అన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే కాంగ్రెస్‌కు 113, బీజేపీకి 111, బీఎస్పీకి 2, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లు మేజిక్ ఫిగర్‌కు కొంత దూరంలో ఉంటాయని విశ్లేషించింది. అయితే, టైమ్స్‌నౌ-సీఎన్ఎక్స్ ఇందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించింది. బీజేపీ పూర్తి ఆదిక్యంతో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని తన సర్వేలో తెలిపింది. బీజేపీకి126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు, బీఎస్పీకి 6, ఇతరులకు 9 సీట్లు వస్తాయని వెల్లడించింది. 2000 నవంబర్ 1న కేంద్రంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్‌ను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేటప్పటికి.. ఉమ్మడి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. విభజన తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోకాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడం గమనార్హం. -
పీపుల్స్ పల్స్: ఎంపీలో కాంగ్రెస్, మిజోరంలో హంగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, చత్తీస్‌గఢ్‌లో కూడా 15 ఏళ్ల బీజేపీ పాలకను తెరపడబోతోందని, అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నవంబర్‌లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడబోవడం విశేష పరిణామం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 41.6 శాతం ఓట్లతో 116 నుంచి 120 సీట్లను గెలుచుకోబోతుండగా, పాలకపక్ష బీజేపీ పార్టీ 39.3 శాతం ఓట్లతో 98–102 స్థానాలకు పరిమితం కాబోతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా) పార్టీ ఓట్ల శాతం గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 41.6 % 116-120 బీజేపీ 39.3 % 98-102 బీఎస్పీ 4.2 % 0-2 ఇతరులు 14.9 % 2-5 చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా) పార్టీ ఓట్ల శాతం గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 41. % 43-45 బీజేపీ 40 % 40-42 జేసీసీ-బీఎస్పీ 11 % 2-3 ఇతరులు 8 % 0-1 ఇక బహుజన సమాజ్ పార్టీ 4.2 శాతం ఓట్లతో 0–2 సీట్ల వరకు, ఇతరులు 14.9 శాతం ఓట్లతో రెండు నుంచి ఐదు సీట్ల వర కు కైవసం చేసుకోబోతోంది. చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా రాణించినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకే కాస్త ఆధిక్యత లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లతో 43 నుంచి 45 సీట్లు, బీజేపీకి 40 శాతం ఓట్లతో 40 నుంచి 42 సీట్లు, జేసీసీ–బీఎస్పీ 11 శాతం ఓట్లతో రెండు నుంచి మూడు సీట్లు, ఇతరులు ఎనిమిది శాతం ఓట్లతో ఒక్క సీటు సాధించే అవకాశం ఉంది. అదే మిజోరంకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మిజో నేషనల్ ఫ్రంట్‌కు 15–19 సీట్లు, పాలకపక్ష కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 19 సీట్లు, జోరమ్ పీపుల్స్ ఫ్రంట్‌కు 2–4 సీట్లు, బీజేపీకి 0–2 సీట్ల వరకు రావచ్చని సర్వేలో తేలింది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల వివరాలు (అంచనా) పార్టీ గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 14-19 ఎంఎన్ఎఫ్ 15-19 జెడ్పీఎం 2-4 బీజేపీ 0-2 మిజోరం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడు కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ల మధ్యనే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. తొలిసారిగా బీజేపీ మిజోరం ఎన్నికల్లోకి దిగడం, కొత్తగా ఏర్పడిన జోరమ్ పీపుల్స్ ఫ్రంట్‌కు కూడా పలు స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. పీపుల్స్ పల్స్ ప్రతినిధులు మిజోరంలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు సర్వే నిర్వహించగా, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 18 నుంచి 26వ తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు.మధ్యప్రదేశ్‌లోని ఆరు భిన్న ప్రాంతాల్లో ఓటర్ల మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించగా ఎక్కువ ప్రాంతాల్లో బీజేపీ నష్టపోతున్నట్లు తెల్సింది. చంబల్, గ్వాలియర్ రీజన్లో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బుందేల్‌ఖండ్, బఘేల్ఖండ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఎక్కువగా ఉంది. మహాకోశల్ ప్రాంతంలో పాలక పక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీగా ఉంది. మాల్వా రీజన్లో కాంగ్రె‹స్కు, భోపాల్ రీజన్లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోంది.