
ఎన్నికల వేళ ఓటర్లలో చైతన్యం పెంచేందుకు రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లా యంత్రాంగం విన్నూత్న ఆలోచన చేసింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లలో ఓటింగ్‌పై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా సరికొత్త వైకుంఠపాళిని తయారు చేసి ప్రదర్శిస్తోంది. దాదాపు 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ మెగా వైకుంఠపాళి సాంప్రదాయక వైకుంఠపాళిలాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో పాముల ఉండే స్థానాలను ఓటర్ల నియమావళి ఉల్లంఘనలు, ఓటు అమ్ముకోవడం, కులపిచ్చితో ఓటేయడం, మందు, డబ్బుకు లొంగి ఓట్లు వేయడం తదితర తప్పులు సూచిస్తుంటాయి.
సమయానికి ఓటర్ లిస్టులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఓటు వేయడం, తోటివారిలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని రేకెత్తించడం, ఓటింగ్ వేళ దివ్యాంగులకు, పెద్దలకు సాయం చేయడం తదితరాలు నిచ్చెనల స్థానంలో ఉంటాయి. గతంలో జల సంరక్షణ కోసం ఇదే తరహాలో వైకుంఠపాళిని వినియోగించామని బర్మార్ జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆ సమయంలో తమ ప్రయత్నం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందని తెలిపింది. దీంతో ఈ సారి ఓటర్లను జాగృతపరిచేందుకు వైకుంఠపాళిని వినియోగించుకోవాలని భావించినట్లు జిల్లా కలెక్టర్ శివప్రసాద్ మదన్ నకాటే చెప్పారు. ఈ దఫా కూడా తమ యత్నానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమ యత్నానికి బర్మార్ నగరంలో మంచి స్పందన వచ్చిందని, త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని ప్రదర్శించే యత్నాలు చేస్తామని తెలిపారు.
ఓటేయాలంటూ భయపెట్టే బందిపోట్లు!
ఓటేయకపోయారా? మీ సంగతిచూస్తాం అనే బందిపోటు ముఠా ఒకటి రాజస్తాన్‌లోని ధోల్‌పూర్ ప్రాంతంలో ఉండేది. 2013 ఎన్నికలకు ముందు వరకు కూడా ఈ ముఠా ప్రభావం ఎక్కువగానే ఉండేది. బందిపోట్లు ఓటేయమని భయపెట్టడం వినడానికి వింతగానే ఉండొచ్చు. ఇంతలా బెదిరిస్తున్నారంటే ఇందులో తిరకాసు ఏదైనా ఉండొచ్చనే అనుమానం రావట్లేదా? అగ్గదీ! అక్కడే అసలు సంగతుంది. ఈ బ్యాచ్ అంతా.. తాము చెప్పిన అభ్యర్థికే ఓటేయాలని బెదిరిస్తుంది. వేయకపోతే తర్వాత మీ సంగతి తేలుస్తామని హెచ్చరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎవరు గెలవాలో వీళ్లే నిర్ణయిస్తారు. ఈ ప్రాంతంలోని బారీ నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో ఈ బందిపోటు ముఠా ప్రభావం ఉందని.. వీరందరినీ అరెస్టు చేస్తే గానీ ఎన్నికలు సరిగ్గా జరగవని అక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ పోలీసులను కోరుతున్నారు. గతంతో పోలిస్తే వీరి ప్రభావం కాస్తంత తగ్గినట్లు కనిపిస్తున్నా పూర్తిగా బెడద పోయినట్లు కాదంటున్నారు. ఈ బృందంలోని జగన్ గుర్జార్ అనే బందిపోటు భార్య 2017 ఉప ఎన్నికల్లో ధోల్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేవలం 112 సీట్లు మాత్రమే సంపాదించారు.
తొలిసారి రంగంలోకి మహిళా సీఆర్పీఎఫ్
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల కోసం తొలిసారిగా మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు పనిచేయబోతున్నారు. భోపాల్, ఉజ్జయిని, ఇండోర్ ప్రాంతాల్లో వీరికి విధులు అప్పగించారు. ‘ఇప్పటివరకు వారికిచ్చిన విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. అందుకే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా వీరికి బాధ్యతలు అప్పగించాం’ అని సీఆర్పీఎఫ్ ఐజీ పీకే పాండే వెల్లడించారు. పోలీసుల నుంచి డీఎస్పీ స్థాయి వరకు వివిధ హోదాల్లో 90 మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. అవసరమైతే మరింత మందిని మోహరిస్తామని పాండే తెలిపారు. 1986–87లో తొలిసారిగా సీఆర్పీఎఫ్‌లోకి మహిళలకు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి వీరు పురుషులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్నారు. మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దక్షిణ బస్తర్ ప్రాంతంలోనూ 240 మంది మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు డ్యూటీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment