Rajasthan Elections 2018
-
ముఖాల్లో మాత్రమే విజయ దరహాసం
సాక్షి, న్యూఢిల్లీ : కుడి ఎడమల అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లతో కలిసి ఉల్లాసంగా నవ్వుతున్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దానికి ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్’ అని కూడా శీర్షిక తగిలించారు. ఫొటోలో ఉన్న ముగ్గురిలోనూ విజయ దరహాసం కనిపిస్తోంది కానీ, అది అర్ధ సత్యం మాత్రమే. మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు ముగ్గురు సీఎంలను ఎంపిక చేయడంలో రాహుల్ గాంధీ తన నిర్ణయాత్మక నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు తేలిన రోజునే మూడు రాష్ట్రాల సీఎంలను రాహుల్ గాంధీ ఖరారు చేయాల్సింది. ముఖ్యమంత్రి పదివికి పోటీపడిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లను ఒప్పించడానికి ఆయనకు ఇన్ని రోజులు పట్టడం, పార్టీమీద ఇంకా ఆయన పట్టు సాధించలేదనడానికి నిదర్శనం. ఈ రోజు గహ్లోత్, సచిన్‌లు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెల్సిందే. రాజస్థాన్‌తో పోలిస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్‌ను ఖరారు చేయడం చాలా సులువు. అయినా ఆయన పేరును ఖరారుచేయడానికి రాహుల్ గాంధీ మూడు రోజుల సమయం తీసుకున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘెల్ పేరును రాహుల్ మరింత ఆలస్యంగా ఆదివారం నాడు ప్రకటించారు. రాజస్థాన్ సీఎం పదవికీ గహ్లోత్, సచిన్ పైలట్లు పోటీ పడుతున్నారని, వారిద్దరు తమకు అనుకూలంగా కార్యకర్తలతోని ర్యాలీలు నిర్వహించారన్న విషయం రాహుల్ గాంధీకి తెల్సిందే. సీఎం పదవికి సచిన్ పైలట్ వైపు ముందునుంచి మొగ్గుచూపిన రాహుల్ గాంధీ పార్టీ పెద్దల సలహా మేరకు గహ్లోత్‌ను అంగీకరించక తప్పలేదని, సచిన్‌ను డిప్యూటీగా ఒప్పించినప్పటికీ గహ్లోత్‌ను ఒప్పించలేకపోయారన్న విషయం ఇంటా బయట తెల్సిందే. ఒకరకంగా గహ్లోత్, రాహుల్, సచిన్ పైలట్లలో ఎవరు విజయం సాధించలేదు. గహ్లోత్‌కు సీఎం పదవి దక్కినప్పటికీ డిప్యూటీగా సచిన్ వద్దన్న మాటను నిలబెట్టుకోలేకపోయారు. సచిన్‌ను సీఎంగా కోరుకున్న రాహుల్ అలా చేయలేకపోయారు. ఇక సీఎం పదవిని ఆశించిన సచిన్ డిప్యూటీగా సర్దుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్ శాసన సభ్యులు ముఖ్యమంత్రి ఎన్నికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని చేసినప్పుడు ఠక్కున సీఎం పేరును ప్రకటించి నిర్ణయాత్మక నాయకత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. ఊగిసలాట ధోరణి వల్ల పార్టీ పట్ల అంతగా పట్టులేదనే సందేహం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చినట్లు అయింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదుర్చేందుకు మూడు రోజుల సమయం తీసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. పార్టీని నడపడంలోనే నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించలేని ఓ నాయకుడు రేపు దేశానికే ఎలా నాయకత్వం వహిస్తారన్న అనుమానం ప్రజలకు కలగక మానదు. -
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్‌కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
సీఎం గహ్లోత్, డిప్యూటీ పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నేత అశోక్ గహ్లోత్(67), యువ నేత సచిన్ పైలట్(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్ గహ్లోత్‌ను, డిప్యూటీ సీఎం పదవికి పైలట్‌ను ఎంపిక చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేసి, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎడారి రాష్ట్రం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ తెరదించారు. సీనియర్ నేత అశోక్ గహ్లోత్ ముఖ్యమంత్రిగా, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయిచిందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు జైపూర్ చేరుకుని గవర్నర్ కల్యాణ్‌సింగ్‌తో భేటీ అవుతారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తేదీ ఆ తర్వాతే ఖరారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. పైలట్‌తో కలిసి రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తా’ అని గహ్లోత్ తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో గహ్లోత్‌తో కలిసి అద్భుత ఫలితాలను సాధించాం. ఇదే జోరును 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కొనసాగిస్తుంది. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేస్తాం’ అని సచిన్ పైలట్ తెలిపారు. 2013 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్..ఇటీవలి ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై పార్టీ సీనియర్ నేతలతోపాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనూ రాహుల్ భేటీ అయ్యారు. అంతిమ నిర్ణయాన్ని అధ్యక్షుడు రాహుల్‌కు వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా తీర్మానించిన తర్వాత హైకమాండ్ నిర్ణయాలను పాటించి తీరాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలిపారు. అయితే, పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. అందుకే ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అనంతరం ముగ్గురు నేతలు సంతోషాన్ని పంచుకుంటున్న ఫొటోతోపాటు ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్తాన్’ అనే కామెంట్‌ను ట్విట్టర్లో ఉంచారు. మద్దతుదారుల ఆనందోత్సాహాలు సీఎంగా అశోక్ గహ్లోత్, డెప్యూటీ సీఎంగా సచిన్ పైలట్లను అధిష్టానం ఖరారు చేయడంతో ఇద్దరు నేతల మద్దతుదారులు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గహ్లోత్ మద్దతుదారులు జైపూర్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయనే సీఎం అవుతారని ఆసక్తిగా ఉన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎంగా ఎంపికైన ప్రకటన వెలువడగానే స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. డోళ్ల చప్పుళ్లతో నృత్యాలు చేశారు. సచిన్ పైలట్ మద్దతుదారులు కూడా సందడి చేశారు. పీసీసీ కార్యాలయం మద్దతుదారులతో నిండిపోయింది. ఇద్దరు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింధియా తిరస్కారం.. సచిన్ అంగీకారం మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని దాదాపు మూడు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సీనియర్లు, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాలుపంచుకున్నారు. సింధియా, పైలట్లలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్, ప్రియాంక గట్టిగా వాదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిద్వారా కాంగ్రెస్‌లో యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయం చాటి చెప్పాలని వారు వాదించారని వెల్లడించాయి. అంతిమంగా వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్‌ను మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరస్కరించగా రాజ స్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సీఎం పీఠానికి అర్హత సాధించేందుకే పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 1988లో రాజీవ్ హయాంలో శివ్ చరణ్ మాథుర్ సీఎంగా ఉండగా గహ్లోత్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్ కట్టప్ప.. గహ్లోత్! రాజస్తాన్ కాబోయే సీఎం గహ్లోత్ కాంగ్రెస్‌కు ‘కట్టప్ప’ వంటివారు. మూడు తరాలుగా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా వ్యవహరించడమే గహ్లోత్‌కు సీఎం పదవి దక్కేందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గహ్లోత్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించింది ఇందిరా గాంధీ. రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు దోహదపడింది సంజయ్ గాంధీ. ఆయనను రాజస్తాన్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాలకు పంపింది రాజీవ్ గాంధీ. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న గహ్లోత్ ఇప్పుడు రాహుల్ గాంధీకి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ చంద్రగుప్తుడయితే గహ్లోత్ చాణక్యుడు. గాంధీ కుటుంబం మరుగున పడ్డ సమయంలో ప్రభుత్వ, పార్టీ పగ్గాలు చేపట్టిన పివీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారితో కూడా గహ్లోత్ సత్సంబంధాలు నెరపారు. ఆయన అనుసరిస్తున్న గాంధేయవాదం, ఆడంబరాలకు పోకుండా ఉండటం, నిజాయితీ, హుందాతనం ఇవన్నీ గహ్లోత్‌ను ఉత్తమ నేతగా తీర్చిదిద్దాయి. ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడిగా పేరొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రాని నేపథ్యంలో అనుభవజ్ఞుడు, రాజకీయ నిర్వహణ దక్షుడు అయిన గహ్లోత్ అవసరం రాష్ట్రానికి, పార్టీకి ఎంతైనా ఉందని అధిష్టానం భావించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుంచి మెజారిటీ సంఖ్యలో ఎంపీలను పంపాలంటే గహ్లోత్ వంటి రాజనీతిజ్ఞుడు సీఎం పీఠంపై ఉండాలని అధిష్టానం భావించింది. లోక్‌సభ ఎన్నికల వరకు గహ్లోత్‌ను తనతోనే ఉంచుకోవాలని రాహుల్ అనుకున్నారు. ‘పైలట్’కు కోపైలట్ బాధ్యతలు జైపూర్/న్యూఢిల్లీ: డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ యువనేత విమానాల్ని సైతం నడపగలడు. అంతే చాకచక్యంతో 2013లో ఘోర పరాజయం పాలైన పార్టీని 2018లో విజయతీరాలకు నడిపించారు. కానీ, శుక్రవారం నాటి పరిణామాలతో ఆయన కోపైలట్ బాధ్యతలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే సచిన్ పైలట్(41)!. దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కొడుకైన సచిన్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి నియోజకవర్గం దౌసా నుంచి 2004లో ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. 1995లో అమెరికాలో పైలట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. 2013లో రాజస్తాన్‌లో పార్టీ ఘోర పరాజయం అనంతరం..మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా తలపాగా ధరించబోనని శపథం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని బలోపేతం చేసేందుకు, జనంతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఇంగ్లిష్ వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ధాటిగా మాట్లాడగలిగే సచిన్.. గ్రామీణ ప్రజలతోనూ అంతే సులువుగా మమేకమై పోతారనే పేరుంది. కాంగ్రెస్ విజయంతో పైలట్ మళ్లీ అందమైన ‘సాఫ’ ధరించనున్నారు. -
గహ్లోత్ ఓ పొలిటికల్ మెజీషియన్!
రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక పార్టీ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ కృషి చాలా ఉంది. రాష్ట్రంలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడిన క్లిష్ట సమయంతో తన అనుభవంతో, వ్యూహాలతో పార్టీకి జీవం పోశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ సీఎం రేసులో, యవ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పోటీ పడుతున్నారు. గహ్లోత్‌ది ఇంద్రజాలికుల కుటుంబం. చిన్నతనంలో తండ్రికి (బాబు లక్ష్మణ్ సింగ్) సహాయకుడిగా ఇంద్రజాల ప్రదర్శనల్లో పాల్గొనేవారు. రాజకీయాల్లోకి రాకుంటే మెజీషియన్ అయ్యేవాడినని గతంలో అన్నారు. రాహుల్, ప్రియాంక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సమక్షంలో వారి ముందు గహ్లోత్ ఇంద్రజాల విద్య ప్రదర్శించే వారని చెబుతుంటారు. గహ్లోత్ మాలి కులస్ధుడు. గాంధేయవాదిగా పేరొందిన గహ్లోత్ మతాచారాలను ప్రేమిస్తారు. వాటిని పాటిస్తారు. గహ్లోత్‌కు సాత్వికాహారమే ఇష్టం. సూర్యాస్తమయం నుంచి తెల్లారేదాకా ఏమీ తినరు. ఇందిర గుర్తించిన నేత ఈశాన్య భారతం శరణార్ధుల సమస్యతో సతమతమవుతున్న సమయంలో ఇందిరా గాంధీ అక్కడి శరణార్థి శిబిరాల్ని సందర్శించారు. అక్కడ వాలంటీర్‌గా పనిచేస్తున్న గహ్లోత్ మొదటి సారి కలుసుకున్నారు. అప్పటికి గహ్లోత్‌కు 20 ఏళ్లు. గహ్లోత్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిర ఆయనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇండోర్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశానికి హాజరయిన గహ్లోత్‌కు అక్కడ సంజయ్‌గాంధీతో పరిచయమయింది. త్వరలోనే గహ్లోత్ సంజయ్‌కు అత్యంత ఆప్తుడిగా మారారు. గహ్లోత్‌ను సంజయ్ ఏరికోరి మరీ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాజస్తాన్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. ఎమర్జెన్సీకాలంలో సంజయ్ బృందం చేపట్టిన మురికివాడల నిర్మూలన, కుటుంబ నియంత్రణ వంటి పలు కార్యక్రమాల్లో గహ్లోత్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాకే గహ్లోత్ ఢిల్లీలో, రాజస్తాన్‌లో ఒక వెలుగు వెలిగారు. రాజీవ్ మంత్రివర్గంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. రాజకీయంగా ఎంత ఎదిగినా స్నేహితులు, సామాన్య ప్రజలతో కలిసి మెలిసి ఉండటం గహ్లోత్‌కు అలవాటు. గహ్లోత్ తన సొంత ఊరైన జోధ్‌పూర్‌లో రోడ్డుపక్క టీ బడ్డీ దగ్గర కూర్చుని వచ్చే పోయే వారితో ముచ్చటించేవారు. రెండు సార్లు సీఎం 1998 నుంచి2003 వరకు, 2008 నుంచి 2013 వరకు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా ఉన్న గహ్లోత్ కేంద్రంలోనూ పలు కీలక పదవులు అలంకరించారు. సైన్సు, లాలో డిగ్రీలు చేసిన ఆయన ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1951, మే3న జోధ్‌పూర్‌లోని మహామందిర్‌లో జన్మించారు. ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయిన గెహ్లాట్ ప్రస్తుతం సర్దార్‌పుర నియోజకవర్గం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
తేల్చాల్సింది రాహులే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/జైపూర్: బీజేపీ నుంచి రాజస్తాన్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారుచేయడంపై కసరత్తును ముమ్మరం చేసింది. బుధవారం జైపూర్‌లో జరిగిన పార్టీ నూతన శాసనసభా పక్ష సమావేశంలో సీఎం ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొత్త సీఎంను ఎంపికచేసే బాధ్యతను పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ కల్యాణ్ సింగ్‌ను విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సీఎం పదవికి రేసులో ఉన్న సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజస్తాన్ కొత్త సీఎంపై రాహుల్ గాంధీ గురువారం నిర్ణయం తీసుకుంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే వెల్లడించారు. రాజస్తాన్ అసెంబ్లీలో ఉన్న 200 స్థానాలకు గాను 199 చోట్ల పోలింగ్ జరగ్గా, కాంగ్రెస్ 99 సీట్లు, బీజేపీ 73 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) ఒక సీటును కైవసం చేసుకోవడంతో ఆ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించింది. ఇతరులు, స్వతంత్రులు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా మంతనాలు.. ఏఐసీసీ ప్రతినిధిగా జైపూర్ వెళ్లిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం జరిగింది. గంటల తరబడి చర్చలు జరిపినా తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక చేసేదేమీ లేక సీఎం ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశం ముగిశాక వేణుగోపాల్ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎల్పీ భేటీ, ఎమ్మెల్యేల అభిప్రాయలతో కూడిన నివేదికను రాహుల్‌కు సమర్పిస్తామని అవినాశ్ పాండే తెలిపారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధేనని, కాబట్టి సీఎంను కూడా ఆయనే ఎంపిక చేయాలని రాష్ట్ర నాయకుడు పరశురాం మోర్దియా అన్నారు. ఇదిలా ఉండగా, సీఎం ఎంపిక బాధ్యతను రాహుల్‌కు కట్టబెట్టాక కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ ప్రశ్నించారు. మరోవైపు, ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత రాక ముందే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కాంగ్రెస్ నాయకుల బృందం గవర్నర్ కళ్యాణ్‌సింగ్‌ను కోరింది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయి, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమకు ఉందని తెలిపారు. ఢిల్లీకి గహ్లోత్, పైలట్ అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లలో ఒకరిని రాజస్తాన్ సీఎంగా ఎంపికచేయడం కాంగ్రెస్ కాస్త తలనొప్పిగా మారింది. ఇక వారిద్దరితోనే నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్న రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకున్నారు. గత ఐదేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడిన పైలట్‌కే సీఎం పదవి అప్పగించాలని రాహుల్ కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే గతంలో పదేళ్లు సీఎంగా పనిచేసిన అశోక్ గహ్లోత్ అంతర్గత వ్యవహారాల్ని చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఆయనైతేనే సమర్థంగా నడపగలరని భావిస్తున్నారు. పైలట్, గహ్లోత్లను ఒకేచోట కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని రాహుల్ యోచిస్తున్నారు. సీఎం పదవి కోసం వారిద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తినా లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని భావించిన రాహుల్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
సింధియా, సచిన్‌లకు షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి తమకు దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్ యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పేరును పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించి ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను ప్రతిపాదించడంతో అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటు తక్కువ రావడం, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్ల దూరంలో ఉండడం వల్ల అనుభవజ్ఞులు కావాలన్నది సీనియర్ల వాదన. ఇక రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేసి, సచిన్ పైలట్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి సచిన్ పైలట్ పేరును స్వయంగా అశోక్ గెహ్లాట్ తిరస్కరించారని తెల్సింది. పార్టీకి పూర్తి మెజారిటీ రాని ప్రస్తుత సమయంలో సంకీర్ణ రాజకీయాలు నడపాలంటే రెండు అధికారిక కేంద్రాలు ఉండరాదన్నది గెహ్లాట్ వాదన. యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లకు వయస్సు ఉన్నందున వారికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంటుందన్నది పార్టీలో సీనియర్ల వాదన. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుగా ఖరారు చేయలేదు. అలా చేస్తే ముఠాలు ఏర్పడుతాయని, ఫలితంగా పరాజయం ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్లు పార్టీలో ఆధిపత్య పోరును పక్కనపెట్టి పార్టీ విజయం కోసం చిత్తశుద్ధితో కషి చేశారు. రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తారని వారి నమ్మి ఉండవచ్చు. అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు రాహుల్ గాంధీ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత జూనియర్లతోపాటు సీనియర్లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ ఆఫీసు బేరర్లు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండేలు సచిన్‌కు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రయిన అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. ఇక కమల్‌నాథ్ వరుసగా తొమ్మదోసారి పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఆయనకే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్ రేస్‌లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర చీఫ్ భూపేశ్ భాగెల్, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి చరణ్‌దాస్ మహంత్; పార్టీ ఏకైక ఎంపీ తామ్రధ్వాజ్ సాహు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడే అయినప్పటికీ భాగెల్‌కు పదవి దక్కక పోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను రాసిన టీఎస్ సింగ్ దేవ్‌కు దక్కవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి శాసన సభ్యులు తమ నాయకుడిని అధికారికంగా ఎన్నుకుంటారు. -
విజయం వైపు నడిపిన ‘పైలెట్’
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలెట్ కుమారుడే సచిన్ పైలెట్(41). ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2004లో దౌసా నియోజకవర్గం నుంచి ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్ 1995లో అమెరికాలో ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రముఖులు.. గెలుపోటములు రాజస్తాన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే(ఝల్రాపటన్), పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్‌ను ఝల్రాపటన్ నియోజకవర్గంలో వసుంధరాపై కాంగ్రెస్ బరిలోకి దించింది. వసుంధరా చేతిలో ఆయన 34,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్ భిల్వారా స్థానం నుంచి 74వేలకు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్య నేతల్లో జోహ్రీలాల్ మీనా(రాజ్‌గఢ్–లక్ష్మణ్‌గఢ్), మదన్ ప్రజాపత్(పచ్‌పద్ర), జహీదా ఖాన్(కమన్), రామ్‌లాల్ జాట్(మండల్), ప్రశాంత్ బైర్వా(నివాయి) ఉన్నారు. అలాగే, బీజేపీ నేతల్లో సంతోష్(అనూప్‌గఢ్), కాలూరామ్(దాగ్), సామారామ్ గరైసా(పిండ్వారా–అబు), జగ్సిరామ్(రియోదార్) విజయం సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధుల్లో సందీప్ కుమార్(తిజారా), వజీబ్ అలీ(నాగర్) గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన సీపీఎం ఈసారి బల్వాన్ పునియా (భద్ర), గిరిధారీలాల్ మహియా (శ్రీ దుంగార్‌గఢ్)లను గెలిపించుకుంది. నీటి వనరుల మంత్రి రామ్ ప్రతాప్, రెవెన్యూ మంత్రి అమ్రారామ్, గోపాలన్ మంత్రి ఓతారాం దేవసి(సిరోహి), పర్యాటక శాఖ మంత్రి యూనస్‌ఖాన్ ఓటమి పాలయ్యారు. -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్‌లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్‌పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్‌పుత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్‌ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్‌కు సవాలే రాజస్తాన్‌లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
పీఠం ఎవరిది?
రాజస్తాన్ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, రాజయాల్లో కాకలు తీరిన అశోక్ గెహ్లాట్ ఒకవైపు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువనేత సచిన్ పైలెట్ మరోవైపు సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్ పార్టీని పటిష్టం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కృషి ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు మళ్లించడానికి సచిన్ పాటుపడ్డారు. రాహుల్ ఆశీస్సులు కూడా తనకే ఉండడం సచిన్‌కు కలిసొచ్చే అంశం. ఇందిర మెచ్చిన గెహ్లాట్ అశోక్ గెహ్లాట్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూడలేదు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్‌లో గెలిచిన శక్తిమంతుడైన నాయకుడు గెహ్లాట్. సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనను మించిన వారు లేరన్న పేరుంది. ఇందిరాగాంధీ మెచ్చిన గెహ్లాట్ సోనియాకు సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అనుచరగణం ఆయనకు ఎక్కువే. వారు మళ్లీ గెహ్లాట్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్లమెంట్ ఎన్నికలను కూడా సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ హిందూత్వ కార్డు, రాహుల్ ఆలయాల సందర్శన వంటి వ్యూహాలు గెహ్లాట్‌వే. అలాంటి ఉద్ధండుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెడితే లోక్‌సభ ఎన్నికల్ని కూడా సమర్థంగా నడిపిస్తారన్న అంచనాలున్నాయి. ఇక ప్రజాకర్షణ గెహ్లాట్‌కే అధికం. వివిధ సర్వేల్లో గెహ్లాట్ సీఎం కావాలని 35 శాతం మంది కోరుకుంటే, సచిన్ పైలెట్ సీఎం కావాలని 11 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్ సేవలను రాజస్తాన్‌కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టు సమచారం. -
ఎడారి రాష్ట్రం ‘హస్త’ గతం
జైపూర్: ఊహించినట్లే రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభావం చూపాయి. వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రేసులో ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సైతం తమతమ స్థానాల్లో గెలుపొందారు. ఇక సీఎం ఎవరో తేల్చాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిలిపివేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 100 కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 100, బీజేపీ 70 వరకు సీట్లు గెలుచుకున్నాయి. దీంతోపాటు బీఎస్పీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు చోట్ల ముందంజలో ఉంది. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మూడు చోట్ల మెజారిటీ దిశగా ఉంది. సీపీఎం ఒక స్థానం గెలుచుకుని, మరో చోట ముందంజలో ఉంది. దాదాపు 12 చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశా లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ మధ్య సయోధ్య ఉందని చూపుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ..స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి రెబెల్స్‌గా బరిలోకి దిగి గెలుపొందిన చాలామంది మా పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. నేడు జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకునిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు’ అని తెలిపారు. ఈ సమావేశం అనంతరం పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పైలెట్, అశోక్ గెహ్లాట్లతోపాటు ఎమ్మెల్యేలందరితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన నివేదికను అందజేస్తారు. బుధవారం సాయంత్రం జైపూర్‌లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నికతోపాటు పలు విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. గెహ్లాట్, పైలెట్ కాకుండా మరెవరైనా సీఎం రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఎమ్యెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని ఆ నివేదికను హైకమాండ్‌కు అందజేస్తాను. అంతిమ నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉంది’ అని కేసీ వేణుగోపాల్ వివరించారు. దేశమంతటా ఇదే ట్రెండ్: సచిన్ పైలెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతటా సాధిస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇది చరిత్రాత్మక దినం’ అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు సహా భావసారూప్యం కలిగిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు, బీజేపీని వదిలి వచ్చే అభ్యర్ధులను కూడా కలుపుకుని పోతాం. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు. -
రాజస్ధాన్‌లో మేజిక్ మార్క్‌కు చేరువగా కాంగ్రెస్
జైపూర్ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ఆధిక్యత నిలుపుకుంటూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్ ఫిగర్ 100 సీట్లు కాగా, కాంగ్రెస్ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ దిశగా కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సచిన్ పైలెట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై దొరికిన బ్యాలెట్
జైపూర్ : రాజస్థాన్‌లో ఎన్నికల అధికారులు బ్యాలెట్ యూనిట్లను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బరాన్ జిల్లాలో కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని షహాబాద్‌లో రోడ్డుపైనే బ్యాలెట్ యూనిట్ లభించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం మిషిన్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. రోడ్డుపై లభించిన బ్యాలెట్ యూనిట్‌ను కిషన్‌గంజ్‌లోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ సింగ్ హఠాన్మరణంతో ఆల్వార్ జిల్లా రామ్‌గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. ఓటింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. -
ఈవీఎంలు జాగ్రత్త!
న్యూఢిల్లీ: రాజస్తాన్, తెలంగాణల్లో హోరాహోరీ పోరు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఈవీఎంల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని ఈవీఎంలు స్కూల్ బస్సును ఎత్తుకెళ్తే మరికొన్ని రెండు రోజులపాటు కనిపించకుండాపోయాయి. ఇంకాకొన్ని ఓ హోటల్లో తాగుతూ కనిపించాయి. మోదీ హయాంలో ఈవీఎంలకు అతీంద్రియ శక్తులుంటాయి’అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన 48 గంటల తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంకు చేరాయన్న వార్తలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే, ఆ ఈవీఎంలు అదనంగా ఉంచినవే తప్ప పోలింగ్‌కు వాడినవి కాదని ఈసీ పేర్కొంది. స్ట్రాంగ్ రూంలలోని ఈవీఎంలకు తాము కల్పించిన మూడంచెల భద్రతపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. -
శరద్ యాదవ్ మాటలు సిగ్గుచేటు
జైపూర్: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్‌యాదవ్ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఒక అనుభవమున్న సీనియర్ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్ యాదవ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది. -
రాజస్తాన్‌లో 74% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. గత 2013 ఎన్నికల్లో 75.23% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ సింగ్ హఠాన్మరణంతో ఆల్వార్ జిల్లా రామ్‌గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4.74 కోట్ల ఓటర్ల కోసం 51, 687 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. స్వల్ప ఘటనలు మినహా రాష్ట్ర మంతటా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. సీఎం అభ్యర్ధి వసుంధర 2003 నుంచి పోటీ చేస్తున్న ఝల్రాపటన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. వసుంధర ప్రధాన ప్రత్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ తనయుడు మాన్వేంద్రసింగ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా గట్టి పోటీ నిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈయన కాషాయాన్ని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతోపాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తుండగా ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీ ఏకైక ముస్లిం అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి యూనస్ ఖాన్ బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో దౌసా, అజ్మీర్ లోక్‌సభ స్థానాల నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన పైలట్ ఈసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 25 మంది సభ్యుల బలం ఉంది. తాజా ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. మైళ్ల దూరం నడిచి... జోధ్‌పూర్: రాజస్తాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాథూర్, మండి వంటి ప్రాంతాల్లో పోలింగ్ ఓ గంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న బర్మార్, జైసల్మేర్ జిల్లాల ప్రజలు ఎడారిలో కొన్ని మైళ్ల దూరం నడిచి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలు వీరు నివసించే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉంటాయి. దూరాన్ని సైతం లెక్క చేయకుండా మారుమూల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌కు హాజరయ్యారు. ఈసారి పోలింగ్‌లో పాల్గొన్న మహిళలు సంఖ్య కూడా పెరిగింది. 101 ఏళ్ల పాలీదేవి అనే మహిళ బర్మార్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. అలాగే బుండి జిల్లా హిందోలీ ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల కుస్నీబాయ్ చేతి కర్ర సాయంతో ఓటు వేసేందుకు వచ్చారు. జోథ్‌పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బరన్ జిల్లా సుఖ్‌నాయర్ గ్రామ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. తమ గ్రామ సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడంతో నిరసన తెలుపుతూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నామని తెలిపారు. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్‌షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్‌కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్‌కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్‌కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► బాగేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్‌కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్‌కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్‌పోల్‌లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్‌జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్‌సింగ్‌తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం రమణ్‌సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్‌లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌లో నువ్వా–నేనా ఛత్తీస్‌గఢ్‌లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్‌లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్‌లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్‌లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
ఏ పార్టీది విజయమో చెప్పేది ‘మెవధ్’
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ దక్షణ మధ్య ప్రాంతమైన మెవర్ లేదా మెవధ్‌లో శుక్రవారం ఉదయం నుంచే పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతం విజయానికి రహదారి అని, ఏ పార్టీ విజయం సాధించి ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందో నిర్ణయించేది ఈ ప్రాంతం ఓటర్లేనన్నది రాజకీయ విశ్లేషకులు విశ్వాసం. ఇక్కడి ఓటర్లకు ఓ విచిత్రమైన ఆనవాయితీ ఉంది. 1998 నుంచి ఈ మెవధ్ ప్రాంతం ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు తప్ప, ఏనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన దాఖలాలే లేవు. అందుకనే 1998 నుంచి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోందని రాజకీయ పరిశీలకుల అవగాహన. మెవధ్ పరిధిలోకి రాజస్థాన్‌లోని భిల్వారా, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ఉదయ్‌పూర్ జిల్లాలు, ఝలావర్ జిల్లాలోని పిరవ తెహసిల్‌తోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. రాజస్థాన్‌లోని 200 సీట్లకుగాను రాజస్థాన్‌లోని మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఏకంగా 25 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకోగా, మరో సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అంతకుముందు ఐదేళ్ల క్రితం, అంటే 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెవద్‌లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ ప్రాంతం ఓటర్లు ఈ రోజు కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం ఆనవాయితీగా మారిందిగదా అని ఓటేస్తున్నారా లేదా నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అంటూ ఈ ప్రాంతం ఓటర్లను మీడియా కదిలించగా, తామేమి గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రావడం లేదని, ఈసారి వ్యతిరేకించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని వారన్నారు. ‘రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నిరుద్యోగం బాగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వ్యాపారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా బాగా నష్టపోయారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, డీజిల్, కరెంట్ ధరలు బాగా పెరిగిపోయాయి’ అని వారన్నారు. ‘మా నాన్నది ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి వ్యవసాయంపై పెట్టారు. కనీసం పెట్టుబడి కూడా లేదు. అందుకనే నేను పొరపాటున కూడా వ్యవసాయం జోలికి వెళ్లదల్చుకోలేదు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంది. నేను చదువుకోవాలనుకోవడానికి ఒక కారణం మోదీ ఇచ్చిన హామీనే. అయితే ఆయన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది’ చిత్తోర్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు మాన్సింగ్ తెలిపారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీజేపీ హనుమంతుడి కులం గురించి చర్చిస్తోందని బేగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బాబూ రామ్ విమర్శించారు. ‘2013 అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీకే ఓటేశాను. ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించాను. ఏం జరిగిందీ? పాలకులు కుల గోత్రాల గురించి, జాతి, మతాల గురించి, పటేల్, రాముడి విగ్రహాలు గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాలేమైనా ప్రజలకు తిండి పెడతాయా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓపియం పంటకు కొత్త లైసెన్సులూ కారణమే! గంజాయి (ఓపియం) పంటకు 2017లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైసెన్స్ నిబంధనలను మార్చిందని, ఫలితంగా ఇక్కడ ఎంతో మంది రైతులు లైసెన్సులు కోల్పోయారని, అది కూడా తమ ఆగ్రహానికి కారణమని ఓటర్లు చెబుతున్నారు. దేశంలో లైసెన్స్‌లతో ఉత్పత్తవుతున్న గంజాయితో 60 శాతం మెవధ్‌లోనే పండిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రాజ్‌పుత్‌లు కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావత్’ సినిమాను నిషేధించాల్సిందిగా తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేసినా వసుంధర రాజె ప్రభుత్వం తమకు న్యాయం చేయలేక పోయిందని, దాంతో తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని ‘మెవర్ క్షత్రియ మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కృష్ణావత్ తెలిపారు. మేవధ్ ప్రాంతంలోని 16 అసెంబ్లీ సీట్లలో ఆదివాసీలు 73 శాతం ఉన్నారు. వారంతా కూడా పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 11 సీట్లలో కొత్తగా ఆవిర్భవించిన ‘భారతీయ ట్రైబల్ పార్టీ’ పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల వల్ల పాలకపక్ష ఓట్లే చీలుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
రాజస్తాన్ లైవ్ అప్డేట్స్: రికార్డు స్థాయిలో పోలింగ్
సాయంత్రం 5 : రాజస్థాన్‌లో పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రం మొత్తంలో రికార్డు స్థాయిలో 72.7 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3.30 : రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతో ఫతేపూర్‌లోని సుభాష్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద అలజడి రేగింది. ఇరు వర్గాల వారు ఒకర్నొకరు నిందించుకుంటూ వాహనాలకు నిప్పుబెట్టారు.దీంతో 30 నిముషాలపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసులు స్పందించి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేయడంతో పోలింగ్ తిరిగి ప్రాంభమైంది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 60 శాతం పోలింగ్ జరిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 2.30 : మహిళా ఓటర్లకు తిప్పలు తప్పటం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గంటల పాటు వేచి ఉన్నప్పటికి ఓటు వేసే అవకాశం వస్తుందో రాదో అన్న అనుమానాలతో మహిళా ఓటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. దుంగర్పూర్ జిల్లా దమ్బోలాలో అధికారులు మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అందంగా పోలింగ్ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 2.00 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 49.15 శాతం ఓటింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1.30 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 5నెలల చంటిబిడ్డను ఒడిలో ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్. క్యూలైన్లో నిలుచుని ఉన్న ఓటర్లు వారిని ఆసక్తిగా చూడటం పరిపాటిగా మారింది. మధ్యాహ్నం 1 గంట వరకు 41.53 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1.00 : డీజీపీ ఒపి. గల్హోత్రా, స్పెషల్ డీజీ ఎన్ఆర్కే రెడ్డిలు పోలీస్ హెడ్ క్వాటర్స్‌లోని కంట్రోల్ రూం వద్దనుంచి ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాలలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 : జోధ్‌పూర్ రాజవంశీకులు గజ్ సింగ్ అతని భార్య.. సర్థార్‌పుర నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం: 194లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజ్మెర్ సౌత్‌లోని నాధ్‌ద్వారా, అల్వార్ అర్బన్ ప్రాంతాలలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం 12.00 : అత్యంత వయస్కురాలు 105 ఏళ్ల షాజ్హా అనే వృద్ధురాలు జైపూర్‌లోని కిషన్‌పురలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. వీల్ ఛైర్ల సదుపాయం లేకపోవటంతో పోలింగ్ బూత్ వరకు చేతులపై మోసుకుంటూ తేవాల్సివచ్చింది. కొన్ని చోట్ల వృద్ధులకు, దివ్యాంగులకు భద్రతా సిబ్బంది సహాయపడుతున్నారు. ఉదయం 11 గంటల వరకు 21.89 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 11.30 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జొతలి అనే గ్రామంలో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం ఒక ఓటరు మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జొతలి గ్రామస్తులు గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే వరకు ఓటు వెయ్యబోమని తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది. అధికారులు మాత్రం వారిని ఒప్పించి ఓటు వేయించటానికి ప్రయత్నిస్తున్నారు. యూనియన్ మినిష్టర్ అర్జున్ రామ్ మెగ్వాల్.. బికనెర్‌లోని పోలింగ్ బూత్ నెం: 172లో ఓటు హక్కును వినియోగించుకోవటానికి క్యూలైన్లో నిల్చున్నారు. ఉదయం 11.00 : రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు పూనమ్ జి. గోయల్ పోల్ బూత్‌లో సెల్ఫీ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోను ట్విటర్ ఖాతాలో ఉంచి, కాంగ్రెస్‌కు ఓటేశానంటూ చెప్పుకొచ్చారు. ఈ సంఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జలోర్ : అహోర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెం: 253, 254లలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఉదయం 10.30 : కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ జోధ్‌పూర్‌లోని బూత్ నెం:106లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం ఓటింగ్ నమోదైంది. బికనెర్ : కిసమిదెసర్లోని బూత్ నెం: 172లో ఈవీఎం సాంకేతిక సమస్యల వల్ల కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారు. ఉదయం 10.00 : కేంద్ర సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ నెం: 128లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోధ్‌పూర్ జిల్లాలో 90 ఏళ్ల వృద్ధుడు ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని సర్థార్‌పుర నియోజకవర్గంలోని బూత్ నెం: 104 వద్దకు ఓ వ్యక్తి మోసుకువచ్చాడు. ఉదయం 9 గంటల వరకు 6.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9.30 : యూనియన్ మినిష్టర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ జైపూర్‌లోని వైశాలి నగర్ బూత్ నెం: 252లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్తాన్ హోం మినిష్టర్ గులాబ్ చంద్ కటారియా ఉదయ్‌పుర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ జైపూర్‌లోని జలుపుర.. గౌర్ విప్ర్ సీనియర్ సెకండరీ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జలోర్ : అహోర్లోని పోలింగ్ బూత్ నెం: 253, 254లలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవటం కారణంగా పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం 9.00 : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్‌వార్‌లోని జల్‌రపతాన్ నియోజవర్గం బూత్ నెం:31ఎ పింక్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారామె. ఎన్నికల అధికారులు.. మహిళలు ఓటు వేయటానికి అనువుగా పింక్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తంలో దాదాపు 200 పింక్ పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. అజ్మెర్ సౌత్‌లోని బూత్ నెం:71లో పోలింగ్ ఆలస్యమైంది. పోలింగ్ అధికారులు బూత్ వద్దకు ఆలస్యంగా చేరుకోవటంతో భారీ సంఖ్యలో జనం క్యూలైన్లో నిలిచిపోయారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణతో పాటు భద్రతా సిబ్బంది ప్రతి వాహనాన్ని నిశితంగా పరీక్షిస్తున్నారు. ఉదయం 8.30 : రాజస్తాన్ హోం మినిష్టర్ గులాబ్ చంద్ కటారియా తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఉదయ్‌పూర్‌లోని శివాలయంలో పూజలు నిర్వహించారు. జైపూర్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. ఉదయం 8.00: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుసలో నిలబడ్డారు. ఉదయం 7.00: రాజస్తాన్‌లోని సర్థార్‌పుర నియోజకవర్గం బూత్ నెం:106లో మాక్‌పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 200 స్థానాలకు గాను 199 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. -
హోం మంత్రి కటారియాకు ఈసారి కష్టాలే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ప్రతిష్టాకరమైన ఉధంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియాకి మొదటి సారి ఓటమి భయం పట్టుకుంది. అదీ సొంత పార్టీ నాయకుడే కాకుండా ఇంతకాలం తన సహచరుడిగా ఉన్న దల్పత్ సురాణా నుంచే. పైగా ఆయన కూడా కటారియాలాగా జైనుడే కావడం గమనార్హం. 74 ఏళ్లు వచ్చినప్పటికీ యువతరానికి అవకాశం ఇవ్వకుండా ఆరోసారి కూడా కటారియా రంగంలోకి దిగడంతో, తాను తిరుగుబాటు అభ్యర్థిగా జనతాసేన టిక్కెట్‌పై నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని సురాణా తెలిపారు. మొదటినుంచి ఆరెస్సెస్ అండ కలిగిన కటారియాకు బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ‘నా లక్ష్యం ఒక్కటే కటారియాను ఓడించడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు’ అని సురాణా వ్యాఖ్యానించారు. కటారియా తన తల బిరుసుతనంతో పార్టీలో ఎవరినీ ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు. తాను బరిలోకి దిగకపోతే కటారియాకు ప్రత్యర్థిగా నిలబడే దమ్ము ఎవరికీ లేదని, అందుకనే మొన్నటివరకు ఆయన అనుచరిడిగా కొనసాగిన తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 44 వేల మంది జైన ఓటర్లు ఉన్నారని, వారంతా ఇదివరకు కటారియాకే మద్దతిచ్చారని, ఇప్పుడు సురాణాకు ఇస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్న బ్రాహ్మణ నాయకుడు మంగేలాల్ జోషి తెలిపారు. ఆరెస్సెస్‌లోని యువత కూడా సురాణాకే మద్దతిస్తోంది. సురాణా ఎన్నికల్లో విజయం సాధించాక తిరిగి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆ యువత భావిస్తోంది. కటారియాపై తిరుగుబాటు అభ్యర్థి సురాణా ఒక్కరే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ వీరాభిమాని, నమో విచార్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రటాలియా కూడా పోటీ చేస్తున్నారు. కటారియాను రాజ్‌పుత్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కటారియాను ఓడించే సత్తా ఎవరికి ఉంటే వారికే మేము ఓటు వేస్తాం’ అని ‘మేవర్ క్షత్రియా మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కష్ణావత్ తెలిపారు. ఇదివరకు తామంతా బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చామని, మేవర్‌లో 28 సీట్లుంటే బీజేపీ ఇద్దరు రాజ్‌పుత్‌లకు మాత్రమే సీట్లు ఇచ్చిందని, ఈ కారణంగా ఈ సారి తాము బీజేపీని ఓడించేందుకే కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. కటారియా మాత్రం అంతిమంగా విజయం తనదేనని చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక మాట్లాడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలపై ప్రజలు కోపంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ అంశాలను ప్రజలు ఇప్పుడు మరచిపోయరని అన్నారు. మరి ఉద్యోగాల హామీ గురించి ప్రస్తావించగా, పకోడీల లాంటి థియరీ నాకోటి ఉందని, దాంతోని యువతను ఆకట్టుకున్నానని ఆయన చెప్పారు. కానీ ఆయన మొహంలో అంతకుముందున్న ధీమా కనిపించడం లేదు. -
'రాజే'రికం కొనసాగేనా?
రాజస్తాన్‌లో 25 ఏళ్లుగా ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. తిరిగి అదే సంప్రదాయం పునరావృతమవుతుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న వసుంధర రాజే సర్కార్ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే అంచనాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో అప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో బాగా కలిసొచ్చింది. కేవలం మోదీ ఇమేజ్ మీదే బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సారి కూడా మోదీ అంటే ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. వసుంధరా రాజే పరిపాలనే బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో రాజే మళ్లీ సీఎం కావాలని కేవలం 24% మంది మాత్రమే కోరుకున్నారు. ఇక ఇండియాటుడే సర్వేలో 35% మంది రాజేకు జై కొట్టారు. ప్రజల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా అంతర్గతంగా ఆమెపై అసమ్మతి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే వెల్లడిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభావితం చూపే అంశాలు రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగంతో యువత తీవ్ర అసంతృప్తితో ఉండడం ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్లతో రైతన్నలు నిరసనలకు దిగుతూనే ఉన్నారు. రైతుల్లో అసంతృప్తిని గుర్తించిన రాజే ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసింది. రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ చర్యతో 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ‘వసుంధరా సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైంది. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఓడించారు. కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. నిజానికి బీజేపీ పరిపాలనలో వాస్తవంగా లబ్ధి పొందింది లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్య మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఈ సారి అమలు కాని హామీలేవీ ఇవ్వలేదు. పాజిటివ్ డెవలప్మెంట్ అన్న అంశాన్నే తీసుకొని ముందుకు వెళుతోంది. అదే పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది’ అని రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పేర్కొన్నారు. -
ఎడారిలో దుమ్మురేపేదెవరో?
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎన్నికల ఫీవర్ పెరిగిపోతోంది. ఈ రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొని ఉండడంతో పై చేయి సాధించడానికి ఎవరికి వారే వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరెంత దూకుడు ప్రదర్శించినా పోలింగ్ రోజు బూత్ స్థాయిలో మేనేజ్మెంట్ చెయ్యగలిగినవారే కింగ్‌లు. బీజేపీ ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచి వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా చైతన్య పరచడం కోసం 10 లక్షల మందికిపైగా పార్టీ కార్యకర్తలను బూత్ వర్కర్లుగా నియమించింది. 7లక్షల మందికి పైగా పార్టీ సభ్యులు పోలింగ్ రోజు బూత్ దగ్గరే ఉండి పార్టీ ఓట్లు ఎటూ జారిపోకుండా చూస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏకంగా బూత్ మేనేజ్మెంట్ కమిటీలో 13 లక్షల మందిని నియమించింది. జనం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా వీరు చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,796 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కో కేంద్రం వద్ద 27 మంది కార్యకర్తలు ఉండి పోలింగ్ క్షణం క్షణం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ రోజు కోసం రచించిన వ్యూహంలో ఏ మాత్రం తేడా రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ కార్యకర్తల్ని ముందు ఉంచి షో నడిపించనున్నారు.. ఇక బీజేపీ ఆరెస్సెస్ కేడర్ బలంపైనే ఆధారపడింది. ముఖాముఖి పోరు ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు నెలకొని ఉండడంతో రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయం ఎక్కడా బలంగా లేకపోవడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఘన్‌శ్యామ్ తివారి, హనుమాన్ బేణివాల్ ఆర్ఎల్పీ వంటి పార్టీలు తమదే విజయమంటున్నాయి. 15 నియోజకవర్గాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారిని స్వస్థలాలకు రప్పించి ఓటు వేయించడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. రాజే, గెహ్లాట్ దృష్టి బయటే! ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంపైనే దృష్టి సారించారు. పార్టీ అభ్యర్థుల తరఫున వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజే తన సొంత నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను తన కుమారుడు, పార్టీ ఎంపీ అయిన దుష్యంత్ సింగ్, కోడలు నిహారిక రాజేలకు అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపైనే దృష్టి సారించిన గెహ్లాట్ (సర్దార్‌పుర) నియోజకవర్గంలో ప్రచారాన్ని కుమారుడు వైభవ్ గెహ్లాట్, కోడలు హిమాంశి, భార్య సునీత చూసుకుంటున్నారు. ప్రచారంలో కులకలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం దగ్గర్నుంచి రామభక్త ఆంజనేయుడు కులం వరకు ఈ సారి ఎన్నికల ప్రచారంలో కలకలాన్ని రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు సీపీ జోషి, విలాస్‌రావ్ మట్టెమ్‌వార్ వంటి వారు ప్రధాని మోదీ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మోదీ తండ్రి ఎవరంటూ ప్రశ్నించడం కూడా కలకలం రేపింది. దీనికి కౌంటర్‌గా కమలనాథులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రం అంశాన్ని లేవనెత్తి ఆ పార్టీని ఇరుకున పెట్టారు. -
చాయ్‌వాలా కోర్టు మెట్లెక్కించాడు
సుమేర్పూర్/దౌసా: నాలుగు తరాలపాటు దేశాన్ని పాలించిన గాంధీల కుటుంబాన్ని నేడు ఓ చాయ్‌వాలా కోర్టు వరకు తీసుకొచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011–12 ఆర్థిక సంవత్సరంలో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీల ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అనుమతివ్వడం తెలిసిందే. పాలి, దౌసా జిల్లాల్లో మోదీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో నేను చూస్తా. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కుటుంబాన్ని కోర్టుకు తీసుకొచ్చిన టీ అమ్మే వ్యక్తి ధైర్యాన్ని చూడండి’ అని మోదీ అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైకేల్ క్రిస్టియన్‌ను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన అంశాన్నీ మోదీ ప్రస్తావించి కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. మైకేల్ నోరు తెరిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గాంధీ కుటుంబం వణికిపోతోందనీ, ఇది వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్న కుంభకోణమని మోదీ అన్నారు. ‘మైకేల్ రాజకీయ నేతలకు సేవలందించాడు. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లోని కుంభారం ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అని తప్పుగా పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంతా అయోమయంలో కూరుకుపోయిన పార్టీ అనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని కోరారు. గాంధీల కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందనీ, తమ పార్టీకి దేశమే కుటుంబమనీ, కాబట్టి మరోసారి రాజస్తాన్‌లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో ముగిసిన ప్రచారం రాజస్తాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య సాగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రానికి ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలుండగా 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 199 మంది మహిళలు, 830 మంది స్వతంత్రులు సహా మొత్తం 2,274 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆళ్వార్ జిల్లాలోని రామగఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ ముఖ్య ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మొత్తం 4.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 130 స్థానాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉండనుంది. మరో 50 సీట్లలో ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
ఈ సారి సహారియాల ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 72 మంది ఆకలితో చనిపోయారనే వార్త 2002లో జాతీయ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వారిలో 47 మంది ఒక్క రాజస్థాన్‌లోని కిషాన్‌గంజ్ సమితిలోనే చనిపోవడం గమనార్హం. వారంతా కూడా సహారియా తెగకు చెందిన వారే కావడం మరింత గమనార్హం. ఈ ఆకలి చావులకు వ్యతిరేకంగా నాడు సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పర్యావసానంగానే 2006లో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్)’, 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చాయి. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని ధిక్వాణి, రతాయి, ఖైరాయ్ గ్రామాల్లో సహారియాలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం రాజస్థాన్ రాష్ట్ర జనాభాలోనే 40 శాతం ఉన్న సహారియాలను షెడ్యూల్డ్ తెగల కింద గుర్తిస్తున్నారు. వారికి ఈ కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1985లోనే కేటాయించారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో నివసిస్తూ అటవి ఉత్పత్తులపై ఆధారపడి బతికిన సహారియాలు అడవులు ధ్వంసమవడం, పలచపడడం తదితర కారణాల వల్ల మైదాన ప్రాంతాల్లోకి వచ్చిపడ్డారు. అక్షరాస్యత ఏమాత్రంలేని వీరంతా కూలినాలి చేసుకుని బతికేవారే. చాలాకాలం వీరు భూస్వాముల వద్ద, ధనిక రైతుల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బతికారు. ఆ చాకిరి నుంచి వీరికి విముక్తి కల్పించిందీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి కనీసం వంద రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఏడాది క్రితం తాను 24 రోజులు పనిచేశానని, వాటికి కూలీ నేటి వరకు రాలేదని బరన్ జిల్లాలోని ధిక్వాని గ్రామానికి చెందిన కమలేష్ భాయ్ తెలిపారు. ఈ ఎన్నికలలోగానైనా కూలీ డబ్బులు వస్తాయని ఆశించానని, రాలేదని ఆమె చెప్పారు. డబ్బులు రాకపోతే ఆకిలితో చావడమో, వెట్టి చాకిరికి వెళ్లిపోవడమో తప్పేట్లు లేదని ఆమె వాపోయారు. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి హామీ పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, అప్పుడు తనతోపాటు ఎన్నో కుటుంబాలు భూస్వాముల వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందామని ఆమె తెలిపారు. మూడేళ్లుగానే నిధులు లేవంటూ ఆమె సతాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఆరోపణలతో మిగతా గ్రామాల ప్రజలు కూడా ఏకీభవించారు. ‘ఉపాధి హామీ పథకం మా జీవనాధారం’ అని రతాయ్ గ్రామానికి చెందిన అనితా సహారియా వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఈ పథకం ఎందుకనో సవ్యంగా అమలు జరగడం లేదని ఆమె విమర్శించారు. 2008–10 సంవత్సరాలతో పోలిస్తే వంద రోజులు పని పొందిన వారి సంఖ్య పదింటిలో ఒకటికి పడిపోయినట్లు అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ప్రజా పంపిణీ పథకం కింద తమకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆధార్‌కార్డులతో అనుసంధానించిన రేషన్ మిషన్లు తమ వేలి ముద్రలను గుర్తించక పోవడం వల్ల డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తనకు మూడంటే మూడుసార్లు మాత్రమే రేషన్ ఇచ్చారని, వేలి ముద్రలను యంత్రం గుర్తించకపోయినా డీలరు దయతలచి మూడు సార్లు ఇచ్చారని 72 ఏళ్ల హల్కీ భాయ్ తెలిపారు. రేషన్ సరుకులు అందక పేద ప్రజలు దీపావళి రోజున కూడా పస్తులున్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఆ వారంతో సెప్టెంబర్, అక్టోబర్ రేషన్ కోటాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్ పథకాలేవి తమకు అందుబాటులోకి రాలేదని కిషన్‌గంజ్ నియోజకవర్గం పరిధిలోని సహారియాలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మంత్రి ఆవాస్ కింద తమ లబ్దిదారుడికి ఒకే ఒక ఇల్లు మంజూరయిందని, మొత్తం ఇంటికి 1.40 లక్షల రూపాయలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం మొదటి విడతగా 52 వేల రూపాయలను మాత్రమే విడుదల చేశారని, దాంతో పైకప్పు నిర్మించకుండా వదిలేశారని బాధితుడు తెలిపారు. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు అన్యాయంగా ఇళ్లను మంజూరు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఇక ఉజ్వల పథకం కింద ఉచితంగా మంజూరైన గ్యాస్ కనెక్షన్‌ను మొదటి సిలిండర్ అయిపోగానే మూలన పడేశామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. సిలిండర్ రీఫిల్లింగ్‌కు వెయ్యి రూపాయలను తాము ఎక్కడి నుంచి కడతామని వారంటున్నారు. అక్కడక్కడ అధ్వాన్నంగా కట్టిన మరుగుదొడ్లు కూడా మూలన పడ్డాయని వారు ఆరోపించారు. ఈసారి ఎవరికి ఓటేస్తారని వారిని ప్రశ్నించగా, ఎప్పటిలాగా కాంగ్రెస్‌కే ఓటేస్తామని వారు చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా ప్రస్తుత ప్రభుత్వం తమను ఏనాడు పట్టించుకోలేని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున హీరాలాల్ సహారియా, బీజేపీ తరఫున హేమ్రాజ్ మీనా కుటుంబాలే మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ కిషన్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మలా సహారియా పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున లిలిత్ మీనాలు పోటీ చేస్తున్నారు. -
పదిసార్లు ‘భారత్ మాతాకీ జై’ అంటా
జైపూర్/హనుమాన్‌గఢ్: ‘భారత్ మాతాకీ జై’ అనొద్దంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను ఆదేశిస్తున్నారనీ, ఇక నుంచి ప్రతిచోటా 10 సార్లు తాను ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నినాదాన్ని పలకొద్దని చెప్పడం ద్వారా రాహుల్ భరత మాతను అవమానించారని మోదీ ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల ర్యాలీలో భారత్ మాతాకీ జై అని మోదీ అంటున్నారు. కానీ ఆయన దేశం కోసం కాకుండా కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు. ఇక నుంచి ఆయన అనిల్ అంబానీకీ జై, నీరవ్ మోదీకీ జై, మెహుల్ చోక్సీకీ జై, లలిత్ మోదీకీ జై అని నినాదాలివ్వాలి’ అని అన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ ‘కాంగ్రెస్‌కు ఓ రాజవంశీకుడు ఉన్నాడు. భారత్ మాతాకీ జై అని మోదీ అనకూడదంటూ ఆ రాజవంశీకుడు ఈ రోజు ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని నేను ధిక్కరిస్తూ ఇక నుంచి లక్షల మంది సాక్షిగా ప్రతిచోటా నేను పదిసార్లు భారత్ మాతాకీ జై అని నినదిస్తాను’ అని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు భారత్ మాతాకీ జై అని అరుస్తూ వీరమరణం పొందారనీ, కానీ రాహుల్ భరత మాతను అవమానిస్తున్నారని మోదీ ఆరోపించారు. అత్యాచారం కేసుల్లో దోషులుగా ఉన్న వారి కుటుంబీకులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందనీ, మహిళలెవరూ ఆ పార్టీకి ఓటు వేయకూడదని ఆయన కోరారు. ఎర్ర, పచ్చి మిరపకు తేడా తెలీదు.. రాహుల్‌కు ఎర్ర మిరపకాయలు, పచ్చి మిరపకాయలకు మధ్య తేడా కూడా తెలీదని మోదీ ఎద్దేవా చేశారు. ‘పచ్చి మిరప కన్నా ఎర్ర మిరపకు ధర ఎక్కువ ఉంటుందని మీరు చెబితే.. అయితే రైతులంతా ఎర్ర మిరపనే సాగు చేయాలని ఆయన అంటాడు. ‘ఈ దేశానికి తొలి ప్రధాన మంత్రి ఒక రైతు బిడ్డ అయ్యుంటే, సర్దార్ పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే ఇప్పుడు రైతులకు ఇన్ని సమస్యలు ఉండేవే కావని నేను గట్టిగా చెప్పగలను. ఒక్క కుటుంబంలోని నాలుగు తరాల వారు 70 సంవత్సరాలు చేసిన పాపాల ఫలితం ఇది. వారి తప్పులను నేను సరిచేస్తున్నాను. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, దూరదృష్టి, సిక్కుల మనోభావాలపై గౌరవం ఉండి ఉంటే నేడు కర్తార్‌పూర్ గురుద్వారా పాకిస్తాన్ అధీనంలోకి వెళ్లేది కానేకాదు. భారత్‌లోనే ఉండేది. ఇన్నాళ్లూ భారతీయ సిక్కులు గురుద్వారాను సందర్శించేందుకు ఎన్నో తిప్పలు పడేవారు. ఆ తప్పును ఇప్పుడు మేం సరిచేస్తున్నాం’ అని మోదీ చెప్పారు. -
అశోక్ గెహ్లాటా లేదా సచిన్ పైలటా?
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీకి ఏడవ తేదీన జరుగనున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ గెలుస్తుందా లేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ? అన్న విషయాన్ని స్థానిక ప్రజలెవరూ మాట్లాడుకోవడం లేదు. వారంతా తదుపరి ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అవుతారా ? అశోక్ గెహ్లాట్ అవుతారా? అని చర్చించుకుంటున్నారు. జో«ద్‌పూర్‌లో గతవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీకి సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ చేస్తున్న సేవల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా మూడుసార్లు సచిన్ పైలట్ పేరును ప్రస్తావించి, ఆ తర్వాత రెండుసార్లు గెహ్లాట్ పేరును ప్రస్తావించడంతో రాహుల్, పైలట్‌వైపు మొగ్గుచూపుతున్నారని ప్రేక్షకులు భావించారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి ఇరువురిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ మొదలయింది. జో«ద్‌పూర్ నుంచి జైపూర్ మార్గంలో చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో ప్రజలను మీడియా ప్రశ్నించగా గెహ్లాట్‌నే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాలి గ్రామంలోనైతే కొంత మంది ప్రజలు గెహ్లాట్‌ను రాజస్థాన్ గాంధీ అని పిలుస్తున్నారు. ఇక ఆజ్మీర్, దౌసా ప్రాంతాల ప్రజలు మాత్రం సచిన్ పైలట్‌నే సీఎంగా కోరుకుంటున్నారు. మహిళలు కూడా ఆయనకే ప్రా«ధాన్యతనిస్తున్నారు. పైలట్ దౌసా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. గెహ్లాట్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయనపై ఎలాంటి అవినీతి మచ్చ పడలేదు. పైగా ఆయన రాష్ట్ర అభివద్ధి కోసం చేసిన కషి, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఉచిత ఔషధాల పథకాలకు ప్రజల నుంచి ఎంతో ప్రశంసలు వచ్చాయి. ఆయన అనంతరం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజె, అధికారంలోకి రాగానే ఉచిత ఔషధాల స్కీమ్‌ను రద్దు చేశారు. కష్టాల్లో, సుఖాల్లో గెహ్లాట్ సారు తమకు అండగా నిలబడ్డారని ప్రజలు చెప్పారు. వసుంధర రాజే దర్శనభాగ్యమే ప్రజలకు కలగదని వారంటున్నారు. అయినప్పటకీ 2003, 20013 ఎన్నికల్లో గెహ్లాట్ ఓడిపోయారు. ఇదే ఆయనకు ఆఖరి అవకాశమనే ఉద్దేశంతో గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా ? అని ఓ గుంపును ప్రశ్నించగా, ఆ గుంపులోని ఓ ముసలాయన స్పందిస్తూ ‘ మా దగ్గర ముసలోలమే నిర్ణయం తీసుకొని యువతీ యువకులకు చెబుతాం, వారు కూడా మా మాట గౌరవిస్తారు’ అని చెప్పారు. రాజస్థాన్‌లో ఇప్పటికే భూస్వామ్యమే కనిపిస్తోంది. అక్కడ ఎవరైనా గ్రామీణ మహిళను పిల్లలెంత మంది అని అyì గితే బాలురు ఎంతో లెక్కగట్టి చెబుతుంది. బాలికల లేరా ? అని ప్రశ్నిస్తే ‘వో తో లడికియా హై’ అనే సమాధానం వస్తుంది. అక్కడ టీనేజీ అమ్మాయిలను అడిగినా సరే, ‘లడికియోం కే సాత్ భేద్ భావ్ హోతా హై నా’ అని చెబుతారు. సవాయ్ మధోపూర్ బస్టాండ్‌లో మధ్య వయస్కురాలిని ప్రశ్నించగా సచిన్ పైలట్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘పైలట్ యువకుడు, కష్టపడి పనిచేస్తారు. ‘శక్తికి ప్రతీక, నేడు శక్తే భక్తి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్గాలను కదిలిస్తే గెహ్లాట్, పైలట్‌లో తమకు ఎవరు ముఖ్యమంత్రయినా ఫర్వాలేదని అన్నారు. వారి వారి నియోజక వర్గాల పరిధిని వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా యువత పైలట్‌ను సీఎంగా కోరుకుంటుంటే పెద్దలు పాలనానుభవం కలిగిన గెహ్లాట్‌ను కోరుకుంటున్నారు. గెహ్లాట్, పైలట్ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని, ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవుతాయని, ప్రజల గురించి పట్టించుకోరని బీజేపీ నాయకులు రాష్ట్రంలో తెగ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోలేదు. పైగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వసుంధర రాజె అభ్యర్థిత్వాన్ని మార్చే దమ్ము మోదీ, అమిత్ షాలకు లేకపోయిందని ప్రజలు భావిస్తున్నారు. గత నెల వరకు రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని బీజేపీ మద్దతుదారులు కూడా భావించారు. బికనర్, కిసాన్‌గఢ్ ప్రాంతంలోని పది పదిహేను సీట్లలో కాంగ్రెస్ టిక్కెట్ల పంపకంలో గందరగోళం జరగడం, రెబెల్స్ రంగంలోకి దిగడం వల్ల ఆ సీట్లను కాంగ్రెస్ ఓడిపోయే ప్రమాదం ఉందని, ఆ సీట్లు తమకు సానుకూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం తుది ఘట్టంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేయడంతో వారిలో కొంత ఉత్సాహం రేకెత్తింది.