బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్‌నాథ్ అన్నారు.
ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్‌కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్‌లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాథ్ పునరుద్ఘా టించారు.
సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్‌ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment